ఊసుపోక – తుమ్మెదా ఒకసారి …

(ఎన్నెమ్ కతలు 27)

 

ఎందుకంటే ఎవరైనా ఒక్కసారి తుమ్మినా వెంటనే ఆ జలుబుక్రిములు చుట్టుపక్కల పదడుగుల వృత్తపరిథిలో చెలరేగి సకలజనులకి కమ్ముకునేస్తాయి అని ఒక వాడుక.

నామాట నమ్మకపోతే, పదిమంది గుమి గూడినచోట ఓసారి తుమ్మి చూడండి. ఓ చిన్న టపాకాయ పేల్చినట్టే.

అక్కడ వున్న మొత్తం జనాలు ఒక్కసారిగా తుళ్లిపడి, ఒకడుగు వెనక్కి వేసి, తమ తమ సంచీల్లోంచి టిస్యూలు ఎక్కలాగి, మళ్లీ మూడడుగులు ముందుకొచ్చి, టిస్యూలు మీకు అందించి, మళ్లీ నాలుగడుగులు వెనక్కి వేసి పెడమొగాలతో నిలబడిపోతారు. పిల్లలతల్లులు గబుక్కున పిల్లలని దగ్గరికి లాక్కుని, వాళ్ల ముక్కూ నోరూ రెండు చేతుల్తోనూ మూసేసి ఆ పసిప్రాణాలని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ కాపాడేస్తారు.

జలుబూ, పడిశం, రొంపా ఎలా చెప్పినా అది కలిగించే చిరాకు ఇంతా అంతా కాదు. సాధారణంగా చర్మరోగాలగురించి ఓ జోకుంది. అవి ప్రాణాంతకాలు కావు అంచేత డాక్టర్లకి అర్థరాత్రి ఎమర్జెన్సీ కాలులుండవు అని. జలుబు కూడా అంతే.

జలుబువల్ల ప్రాణానికి ముప్పు లేకపోవచ్చు కానీ తిప్పలు ఎప్పుడంటే మన  శ్ర్సేయోభిలాషులకి జవాబులు చెప్పుకోలేక.

అలాటి దుర్భరసమయంలో ఫోను వస్తే ఇక చెప్పఖ్కర్లేదు.

ట్రింగ్… ట్రింగ్ …

ఘ్ ..ఘ్ళ్ …ళో.ఘ్.ఓ.

ఏమీ దగ్గుతున్నావు? గొంతు అదోమాదిరి వుంది.

ఘ్ఏ..వి.. ఘ.ఠ్షీ .మీ. ల్హేదూ …

జలుబు చేసిందా..

ఘ్హూమ్

ఆపైన అందుకునే సలహాలతో ఓ ఎన్.తె.రొంపిడియా తయారు చెయ్యొచ్చు.

మిరియాలచారు తాగు

పాలు కాచి చిటెకెడు పసుపు వేసి తీసుకో

శొంఠికషాయం ఠక్కున కట్టేస్తుంది.

నేను బుర్ర గోక్కుంటాను. శొంఠి … మ్ మ్ ..శొంఠి .. దీనికి ఇంగ్లీషేమిటో… అదేం జాతకమో నాది తెలీదు కానీ ఇంటర్నెట్లో నాకు కావలసిన మాటలు తప్ప అన్నీ కనిపిస్తాయి. అదేదో మర్ఫీస్ లా అనుకుంటాను.

ఆర్స్ ఆల్బ్ కి తిరుగు లేదు

అదేమిటి?

హోమియోపతి మందు. మీవూళ్లో దొరకదా?

హోమియో డాక్టరు వున్నాడని నేను చెప్పను. డాక్టరుదగ్గరికి వెళ్లి నాకు ఫలానా మందు కావాలని అడగడం నాకు భావ్యంగా తోచదు.

ఇంకా ఆఫీసులో వచ్చే సలహాలు, అభిప్రాయాలూ …

“Feed the fever, starve the cold”

రోజూ ఆరెంజి జూసు తాగితే ఏజలుబూ వచ్చేది కాదు. ఎందుకు తాగలేదు?

నాకు చిరాకేస్తుంది ఇలా అడిగేవాళ్లని చూస్తే. అయిపోయింతరవాత ఎందుకు చెయ్యలేదూ అంటే ఏం చెప్తాం. నౌ, నౌ, మేమ్,,, నౌ … ఏమి చేయవలయునో చెప్పవలెను! ఇది స్వగతం అన్నమాట. ఇంకా …

“Chicken soup is the best cure”

కళ్లు మూసుకు పడుకో.

హేఁవిటీ పనిలోకి వెళ్లలేదు జలుబు చేసిందనే? చోద్యం! ఎన్నడూ ఎరగం ఇలాటి సుకుమారాలు …

ఆఫీసుకి రాకు. వస్తే తుమ్మినా దగ్గినా టిస్యూ నోటికి అడ్డు పెట్టుకో.

మాటలు వేయేల, .. నాకు బాధ జలుబుతో కాదు, దానివెంట వచ్చే సువాక్కులూ, జనాల చిత్ర విచిత్ర కేళీ …

నాకు డాక్టరు స్నేహితులు వున్నారు, డాక్టరుభార్యస్నేహితులు అంటే డాక్టరు అయినవాడికి భార్య అయి, నాకు స్నేహితులుగా ద్విపాత్ర పోషిస్తున్నవారు వున్నారు, లేదులెండి, డాక్టరుభర్తస్నేహితులు అంటే స్త్రీ డాక్టరులకి భర్తలయి నాకు స్నేహితులు అయినవారు లేరు. ఎంచేతో మరి!

డాక్టరయితే  ఫలానా మందు వేసుకో అని వెంటనే చెప్పేసేయరు. మాల్ ప్రాక్టీసు బాధ ఒహటి కదా. నీ ప్రైమరీ ఫిజిషయనుతో మాటాడేవా? అంటారు మర్యాదగా.

లేదు. అదే పోతుంది అని వూరుకున్నాను.

పోతుందిలే. కానీ పోయేవరకూ ఎందుకు బాధ పడడం?

నాకు మందులు ఇష్టం లేదు.

ఎవరు మాత్రం మందులు పకోడీల్లా ఉవ్విళ్లూరుతూ తింటారేమిటి? హాచ్చి హాఛ్చి అంటూ ఆ తుమ్ములూ దగ్గులూ వదిలించుకోడానికి వేసుకుంటారు గానీ …

డాక్టరుభార్యస్నేహితులయితే, ఎన్నిరోజులనించీ? పొడిదగ్గా? గొంతులో గొరగొరగా వుందా? రాత్రి నిద్ర పడుతోందా, .. ఇలా అక్కడిక్కడే వేళా పాళా, ఎపాయింటుమెంటూ గట్రా అక్కర్లేకుండా, డయాగ్నోజు చేసేసి ఏదో మందు కూడా చెప్పేస్తారు.

ఇంకా ఎలర్జీనేమో అని సూచించి, ఆపైన రాగల బాధలు వర్ణిస్తారు సవిస్తరంగా, నువ్వేమో చలిగాలి అంటానే వాక్కు కూడ పోతుంటివి. ఫ్లూ సీజను గంద. ఆమాదిరి గాలి గుండెలకి తగిలితే బ్రొంకైటిసూ, న్యుమోనియా … ఎన్ని బాదలో తెల్సా అంటూ ఊరడిస్తారు.

మరీ అంత క్షుణ్ణంగా రాగల పరిణామాలు వివరిస్తుంటే, నేనేం చెయ్యగలను. సరే మందు వేసుకుంటానని చెప్పేస్తాను. మళ్లీ మర్నాడు నా డా.భా.స్నేహితురాలు నిజం డాక్టరంత ఠంచనుగానూ ఫోను చేసి మందు తింటివా? ఎట్లుంది ఈదినం? అని అడిగితే, నేను అతికష్టంమీద ఊపిరి బిగబట్టి, గొంతు సవరించుకుని, రెండు క్షణాలపాటు దగ్గు రాకుండా ఆపుకుంటూ, బాగానే వుంది. మందేసుకున్నాను అని చెప్పేస్తాను.

తమరికి తెలీందేముంది ఆపత్సమయాల్లోనూ, వారిజాక్షులందూ బొంకవచ్చు అని పెద్దలు మనకో సుళువు ఏర్పాటు చేసేరు కద.

 

(జనవరి 2009. )

నాచిన్నప్పుడు విన్నరాజేశ్వరరావు పాట, నాకెంతో ఇష్టమయిన పాట. తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూపవే అనో ఏదో ….

ఇప్పుడు నేను పాడుకోవాల్సిన పాట —

తుమ్మకే చెల్లెలా, తుమ్మకే,

తుమ్ముతూ, దగ్గుతూ వెదచల్లబోకే నీ జలుబు నలుదిక్కులా … అని.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – తుమ్మెదా ఒకసారి …”

 1. పడిశం పది రోగాల పెట్టు అని వూరకే అన్నారా . ఇంకో సామెతుంది ,జలుబు మందేస్తే (ఆ మందు కాదు ,జలుబు మందు) వారంలో పోతుంది ,వెయకపోతే ఏడు రోజులుంటుందీ అని
  అవునూ ఈ పోస్టు రాసేటప్పుడు మీరెం తుమ్మలేదు కదా ?

  మెచ్చుకోండి

 2. హ్హ ….హ్హ ….జలుబుకు మీరు చెప్పిన చిట్కాలు అధ్బుతంగా ఉన్నాయండి .ఈసారి జలుబు చేస్తే వెంటనే ఫాలో అయిపోతాను .

  మెచ్చుకోండి

 3. gaddeswarup, thanks కరెక్ట్ పేరు చెప్పినందుకు. ఇప్పుడే సరిదిద్దుతాను పైన టపాలో.
  anon. రెసీన్ లో ఎన్ని డిగ్రీలు వుందండీ.

  మెచ్చుకోండి

 4. ఆపాట నిన్న విన్నాను. ఆ పదము పాడింది రాజేస్వరరావు, బాలసరస్వతి పదాలు వేరేగా ఉంటాయి

  మెచ్చుకోండి

 5. vArijAkShulaMdu bAgAnE uMdi kAnI mIru jalubutO vivAhAniki veLLi akkaDa vaivAhikamulamdu.. boMkavaccu nadhipA ani ceppEraMTE ceppulu mIda visurutu bayaTaki geMTEstAru 😉

  ayinA mADisan lO ayidu DigrIla caliki jalubulu rAkapOtE jilEbIlostAyiTaMDI, mI cOdyaM kAkapOtE? A?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s