ఆడమనసు

గరల్ స్కూల్ టీచరు రవణమ్మ సిగ్నల్‌ పోస్టుదగ్గర ఆగిపోయిన రైల్లో థర్డుక్లాసు కంపార్ట్‌మెంటులో లోకానికీ తనకీ మధ్యనున్న సూక్ష్మాతిసూక్ష్మమయిన సంబంధంగూర్చి ఆలోచిస్తూ కూచుంది.

కంపార్ట్‌మెంటులో పాలవాళ్లూ, పిల్లలూ, పిల్లలుగల తల్లులూ అన్నిరకాలవాళ్లూ తలో రకంగా విచారిస్తున్నారు. ఈబండీ ఎప్పుడూ ఇంతే. ఉన్న స్టేషన్లు చాలనట్టు నాలుగేసి మైళ్లకో హాల్టు పెట్టేరు. అదీ చాలనట్టు ఈసిగ్నలుపోస్టుదగ్గర ఓమారు మొక్కు తీర్చుకోందే ముందుకు కదలదీ బండీ.

బటానీలు కొనమని పిల్లలేడుస్తున్నారు. పిల్లలఏడుపు చూసి, బఠానీలవాళ్లు రెట్టించి అరుస్తున్నారు. సీటుకోసం పేచీల్లేని మగాళ్లు రైలు దిగి పచార్లు చేస్తున్నారు కులాసాగా. టికెట్ లేనివాళ్లూ, సామానులేనివాళ్లూ రైలుదిగి నడిచి వెళ్లిపోతున్నారు.

రవణమ్మ మటుకు ఇవేమీ ఆలోచించడంలేదు. కిటికీలోంచి దూరాంగా ఏరాడకొండ, కొండమీద లైటుహౌసూ, కొంచెం ఇటువైపుగా సున్నపుబట్టిల్లా గుండ్రంగా కాల్టెక్స్ ఆయిల్ రిఫైనరీ కనిపిస్తున్నాయి. మీద ఆకాశం మబ్బులు పట్టివుంది.

కంపార్టుమెంటులోకి చూసింది రవణమ్మ. ఎదురుసీటుమీద గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లని ఊరుకోబెట్టడం ఎలాగో తెలీక ఏడుపు మొహం పెట్టిన అమ్మాయి కనిపించింది. రవణమ్మ ఆర్ద్రంగా చూస్తూ వుండిపోయింది. ఆ అమ్మాయికి మహా వుంటే పదిహేను వుంటాయి. ఆపాపకి ఏడాది దాటినట్టుగానే కనిపిస్తోంది. రవణమ్మదృష్టి ఆకాశంమీదికి మళ్లింది. ఇలాటి సంఘటననేమో బసవరాజుగారు మనోహరంగా వర్ణించారు, ఆకాశమధ్యాన అటనొక్క చిరుమబ్బు …

రవణమ్మ ఉలికిపడింది. పాట పాడనా అండీ? అని అడిగి మరీ పాడేవాడు మురళి. ఇదే పాట. ఎక్కడ వున్నాడో!

రవణమ్మదృష్టి రైలు పక్కనే పచార్లు చేస్తున్న కూలిజనంమీద పడింది. మురళివాళ్లలో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఏజేబుదొంగగానో ప్రసిద్ధికెక్కినా, ఏగుంపులోనో తన్నులు తింటూ ఉన్నా విచారపడవలసిందే కానీ ఆశ్చర్యపడనక్కర్లేదు.

రవణమ్మ కళ్లలో మెదిలాడు ఆనాటి మురళి పన్నెండేళ్లవాడు, పచ్చగా రాజపుత్రుడిలా వుండేవాడు. పదేళ్లవుతోంది కాబోలు ఇదే ట్రైనులో ఆలాగే తను ప్రయాణం చేస్తోంది.

ఆరోజు ఇలా జనం లేరు. మురళీ, మరో ఇద్దరు మగవాళ్లూ, ఓ ముసలాయనా వున్నారు. ఆవేళ తను అనకాపల్లినించి వస్తోంది. ఆవేళ ఎందుకనో విపరీతంగా తలనొప్పి వచ్చింది. చిన్న చలికూడా వున్నట్టు తనకి అనుమానం. ఆవేళా ఇలాగే రైలు సిగ్నలుపోస్టుదగ్గర ఆగిపోయింది. అధికమాసంలో దుర్భిక్షంలా. తణతమీద మోచెయ్యి తగిలినట్టయి, అబ్బా అంది వేళ్లతో కణతలు నొక్కుకుంటూ.

అయ్యో, పొరపాటున తగిలిందండీ. గట్టిగా తగిలిందాండీ? అన్నమాటలు వి రవణమ్మ అటు చూసింది. అప్పటిదాకా తనపక్కన ఎవరున్నారో చూడనేలేదు.

దబ్బపండుఛాయలో, గుండ్రని మొహం, సన్నగా పెన్సిలుతో గీసినట్టున్న కనుబొమ్మలూ, స్థిరంలేని నల్లని కనుపాపలూ ఆడపిల్ల మొహం అనుకుంది రవణమ్మ, తనలో తను చిన్నగా నవ్వుకుంటూ.

అది కాదండీ. మీదని సంచి పడిపోయేట్టుగా వుంటే వెనక్కి తొయ్యడానికి చెయ్యి ఎత్తితే మీకు తగిలిందండి. గట్టిగా తగిలిందాండీ?

రవణమ్మ నవ్వుకుంది. లేదులే అంది. దీనాతిదీనంగా వున్న అతనిమొహం చూస్తూ. అందేకానీ నుదుటిమీద చెయ్యి తియ్యనేలేదు. దానికి సమాధానం చెప్పాలనిపించింది అబ్బాయికి. తలనొప్పిగా వుంది. వెధవరైలు ఎప్పటికి కదుల్తుందో.

నాదగ్గర అమృతాంజనం వుంది, రాయమంటారా?

వద్దు. అదే పోతుంది. అంది రవణమ్మ కించిత్తు చకితురాలై.

లేదండీ. నిజంగానే అమృతాంజనం రాసుకుంటే ఇట్టే పోతుంది. మాఅన్నయ్య కూడా ఇలాగే అంటాడు. వెంటనే నేను అమృతాంజనం రాస్తాను. అయిదునిముషాల్లో తగ్గిపోతుంది. కావలిస్తే చూడండి.

రవణమ్మకి అమృతాంజనంకంపెనీ ఏజంటుకంటే సిన్సియరుగా ప్రాపగండా ఇస్తున్న ఆ కుర్రాణ్ణి చూస్తే ఏమనాలో తెలీలేదు. అప్పుడే అడిగింది, చదువుకుంటున్నావా? అని.

ఫోర్తుఫారం చదువుతున్నాట్ట. వాళ్లమ్మ, నాన్నగారు, తమ్ముళ్లు, చెల్లెళ్లు అంతా అనకాపల్లిలో వున్నారుట.

విశాఖపట్నంలో మీరెక్కడ వుంటారండీ? అని అడిగేడు.

రవణమ్మ చెప్పింది, మునిసిపల్ గరల్సు స్కూలికి దగ్గరగానే చిన్నసందులో ఎత్తుఅరుగులమేడ. అందులో ఒకగది అద్దెకి తీసుకుని ఉంటున్నదట.

రైలు దిగేక ఆ అబ్బాయి రవణమ్మసంచీ తనే పట్టుకుని రిక్షా ఎక్కించి పంపించేడు.

ఎంత మప్పితం అనుకుంది రవణమ్మ.

అయినా మర్నాడు సాయంత్రంవేళ తలుపు తీసేసరికి ఎదురుగా నిలబడివున్న మురళిని చూసి ఆశ్చర్యపడకపోలేదు.

రా అంది రవణమ్మ లోపలికి నడుస్తూ.

మురళి చనువుగా లోపలికి నడుస్తూ, మీయిల్లు బాగుందండీ. మాయిల్లు ఇంతకన్న పెద్దదే అయినా నానాకంగాళీగా వుంటుందండీ. ఎక్కడపడితే అక్కడ బట్టలూ, బ్లేడ్లూ అవీ ..

రవణమ్మకి నవ్వొచ్చింది. మాయింట్లో ఎలా వస్తాయి బ్లేడ్లు. అంది.

మురళి నవ్వలేదు. అది కాదండీ. మాచెల్లెలుందా. అదున్నా ఇలా నీటుగా వుండదు. ఇంటినిండా బట్టలూ, కాయితాలూ, మన్నూ వుంటాయి. .. ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? ఏంకూర? మరి మీకు కొబ్బరిపచ్చడి చెయ్యడం వచ్చా?

రవణమ్మ అన్ని ప్రశ్నలకీ ఓపిగ్గా జవాబులు చెప్పింది. నువ్వు ఎలా చేస్తావు? అని అడిగింది.

మురళి ఆకొబ్బరిపచ్చడి తను కొత్తగా కనిపెట్టి తయారుచేసినంత ఘనంగా చెప్తూంటే వింటూ కూర తరుక్కుంది. పదినిముషాలు కూచుని, మురళి వస్తానండి అంటూ లేచాడు.

కూర్చో. వెళ్లి ఏంచేస్తావు? అంది.

మాఅన్నయ్య తంతాడండీ. నే చెప్పలేదు ఇక్కడికి వస్తానని

రవణమ్మ తెల్లబోయింది. ఇక్కడికా? ఏంవని చెప్పడం?

ఏంవనీ చెప్పనండీ. అదికాదండీ. నిజంగా తన్నడండీ. మరి నేనిలా ఎక్కువగా వాగుతానుకదండీ. చెప్పకూడనివీ, చెప్పవలసినవీ అన్నీ వాగేస్తాననీ ఎక్కడికీ వెళ్లొద్దంటాండీ.

రవణమ్మ ఈమారు నవ్వకుండా వుండలేకపోయింది. వాగుతున్నానని తెలిసినప్పుడు నోరు కొంచెం కట్టుకోలేవూ?

వీల్లేదండీ. మర్చిపోతాను. అయినా మీరు కనక ఇలా మాటాడేశాను కానీ అందరిదగ్గిరా ఇలా మాటాడతానేంటండీ?

మంచివాడే అనుకుంది రవణమ్మ మురళి వెళ్లిపోయేక.

ఆతరవాత మురళి దాదాపు రోజూ వచ్చేవాడు. పొద్దున్నో మధ్యాన్నమో సాయంత్రమో ఏదో ఒకవేళ వచ్చేవాడు. ఒకొకప్పుడు స్కూలునించి మధ్యాన్నం లీజరువేళప్పుడు ఏఫ్రెండుసైకిలో తీసుకువచ్చి చూసి వెళ్లిపోయేవాడు. తినడానికేమైనా వుందాండీ అంటూ అన్ని గూళ్లూ డబ్బాలూ వెతికేసి ఏదైనా వుంటే తినేసి వెళ్లిపోయేవాడు.

ఒకమారు మూడు నయాపైసలుంటే ఇవ్వండి అన్నాడు.

ఎందుకూ? అంది రవణమ్మ.

అదికాదండీ. నాదగ్గర ఇరవైరెండు నయాపైసలు వున్నాయి. మరోమూడు కలిపితే పావలా అయిపోతుంది కదండీ. అన్నాడు.

మరో ముప్పావలా కలిపితే రూపాయి అవుతుందేమో అంది రవణమ్మ.

అవుతుందనుకోండి. మరి మీరు మూడు నయాపైసలయితే ఇస్తారు కానీ ముప్పావలా ఇస్తారా?

ఇవ్వను అంది రవణమ్మ పర్సులోంచి విచ్చుపావలా తీసి ఇస్తూ. మురళి అది తీసుకుని తనదగ్గిరున్న ఇరవైరెండు పైసలూ ఆవిడకిచ్చేసి వెళ్లిపోయేడు.

రవణమ్మ ఆతరవాతినించీ ఏది చేసుకున్నా మురళికి దాచి వుంచడం అలవాటయింది. ఒకమారు అలాగే పనసముక్కలు దాచి వుంచింది కానీ మూడు రోజులయినా మురళి రాలేదు. రవణమ్మకి ఆముక్కలు తినబుద్ధి పుట్టలేదు. పారేయబుద్ది పుట్టలేదు. నాలుగోనాడు మురళి వచ్చేవేళకి అవి బూజు పట్టిపోయేయి.

ఇన్నాళ్లూ రాలేదేం అంటే మా అమ్మ వచ్చిందండీ అన్నాడు.

జేబులోంచి ఓ జామపండు తీసి ఇస్తూ.

ఇదెందుకూ? అంది రవణమ్మ.

తినడానకండీ. మీరెప్పుడూ జాంపండు తినలేదాండీ? చాలా బాగుంటుందండీ. కావలిస్తే తినిచూడండి. అన్నాడు మురళి కత్తి, కత్తి అంటూ చాకుకోసం అటూ ఇటూ చూస్తూ.

మీ అమ్మగారు ఉన్నారా? అంది రవణమ్మ జాంపండు ముక్కలు కోస్తూ.

ఉండకపోతే ఎలా వస్తుంది?

అది కాదోయ్. ఇప్పుడు ఇక్కడ వున్నారా, అనకాపల్లి వెళ్లిపోయారా అనడిగితే అలాటి అర్థం తీస్తావేం? అంది రవణమ్మ కోపంగా.

అదేంటండి నేనేం కొత్తగా తీసేనేంటండీ ఆ అర్థం. పోనీ మీరు అలాగే అడక్కూడదా? అన్నాడు, శ్లేషభాష ఎరగని పసివాడిలా.

రవణమ్మ మాట్లాడలేదు.

ఏమండీ! ఓ పాట పాడనా? అడిగేడు మురళి.

వద్దులే అంది రవణమ్మ దరహాసంతో.

కాదండీ. నిజంగానే నేను పాడగలనండీ.

గ్రూపులోనా?

కాదండీ. ఒక్కడినే పాడతాను. ఎంతోమంది మెచ్చుకుంటారు కూడా.

అంతటి స్వోత్కర్ష కూడదోయ్ రవణమ్మ అంది మందలిస్తున్నట్టు.

సరేలెండి. మీకు తెలీదు. నేఁ చెప్తే వినరు. తరవాత ఎప్పుడేనా అందరూ నాపేరు చెప్పుకుంటుంటే అప్పుడు మీరే నువ్వు పాడతావని నాకెందుకు చెప్పలేదూ అని అడుగుతారు. అప్పుడు చెప్తాలెండి అనేసి వెళ్లిపోయేడు.

మరనాడు మురళి ఒక ఉత్తరం తీసుకొచ్చి రవణమ్మ చేతికిచ్చాడు వెళ్లనాండీ? అని అడుగుతూ.

అది మీరు సినిమాస్టారు కాదల్చుకున్నారా? అంటూ ఇంగ్లీషులో లేక హిందీలో ఉత్తరాలు రాయమనే ఒక బోగస్ సినీ కంపెనీది.

మీ అన్నయ్య ఏమన్నారు? అంది రవణమ్మ.

మురళి వాళ్లన్నయ్యకి చెప్పలేదన్నాడు.

రవణమ్మ ఉత్తరం మళ్లీ మురళికి ఇవ్వలేదు. ముక్కలుచేసి కుంపటిలో పడేస్తూ, ఇంకెప్పుడూ ఇలాటి వేషాలు వెయ్యకు. ఈకంపెనీలన్నీ నిన్ను నిజంగా నిన్ను నాగేశ్వరరావో, రాక్ హడ్సనో చేసేస్తాయనుకుంటున్నావు. అలా అయితే ఈపాటికి ప్రతివాడూ సినిమాస్టారే అయిపోను. అయినా మీఅన్నయ్య నిన్ను డబ్బుపెట్టి చదివిస్తూంటే నిక్షేపంలా చదువుకోక నీకిదేంబుద్ధి? అంది.

మురళి బిక్కచచ్చిపోయి. అదికాదండీ. నేను పాడతాను అన్నాడు.

రవణమ్మ మురళిని పాడమని కాని కొంచెం మెల్లిగా పాడు. మేడమీద చదువుకునే స్టూడెంట్లున్నారు. పక్కభాగంలో పసిపిల్లలున్నారు అంది.

మురళి గళం విప్పి పాట మొదలుపెట్టేక రవణమ్మ విచారించింది. మురళి నిజంగా పాటగాడే!

ఆతరవాత కూడా మురళి మామూలుగానే వస్తూ వుండేవాడు రవణమ్మఇంటికి. ఎన్నోమార్లు రవణమ్మకి మురళిమీద కోపం వచ్చింది. ఎన్నోమార్లు విసుక్కుంది. కసురుకుంది. మనిషికి అంత గ్రిట్ వుండకూడదు అనుకుంది. మురళి మటుకు మనసులో ఏమనుకున్నాడో రవణమ్మకి తెలీలేదు. కానీ పైకి మటుకు నాలుక తిరిగినట్టు వాగేవాడు. అలిగి వెళ్లిపోయేవాడు. నాకు గతిలేక మీయింటికి వచ్చేను అన్నాడు ఒకరోజు.

రవణమ్మ మనసులోనే బాధ పడింది. ఆతరవాత అతన్ని ఏమీ అనేదికాదు.

మురళి మటుకు అవిడని వూరుకోనిచ్చేవాడు కాదు. అవిడని కవ్వించి రెండుమాటలు అని నాలుగుమాటలు పడి కానీ ఊరుకునేవాడు కాదు.

రెండేళ్లు గడిచిపోయేయి. మురళి ఫిఫ్తుఫారం ఫెయిలయేడు. సరిగ్గా చదవడంలేదని వాళ్లన్నయ్య చావగొట్టేట్ట.

మురళి సాయంత్రం రవణమ్మయింటికి వెళ్లేడు, నేను వెళ్లిపోతున్నానండి.

ఎక్కడికి? మరి చదవ్వా? అని అడిగింది రవణమ్మ.

రాదండీ నాకు చదువు. ఇంటికెళ్లిపోతాను అన్నాడు మురళి.

మురళి వెళ్లిపోయిన రెండునెలలకి ఒక ఉత్తరం వచ్చింది రవణమ్మకి. పోస్టుకార్డు. రవణమ్మ నవ్వుకుంది.

My dear sisterly Ravanamma garu అన్న సంబోధన చూసి. వుత్తరంలో విశేషాలేం లేవు. తాను క్షేమం. మళ్లీ స్కూల్లో చేరాట్ట. జవాబివ్వమని తన ఎడ్రెసు ఇచ్చాడు. ఏనాడు ఎవరికీ ఉత్తరాలు రాయడం అలవాటు లేని రవణమ్మ ఆకార్డు చూసి, మురళికి ఓ కార్డు దొరికి కొత్తగా ఉత్తరం రాయడం నేర్చుకుని, ఎవరికి రాయాలో తెలీక తనకి రాశాడు అనుకుంది పారేస్తూ.

ఉత్తరం చించిపారేసినా మురళిని మర్చిపోలేదు. ఎన్నమాట్లో అనుకుంది మురళి ఏంచేస్తున్నాడో అని. ఏమగపిల్లవాడైనా కనిపిస్తే మురళి ఏమోనని చూసేది. మురళి మటుకు మళ్లీ ఏవుత్తరమూ రాయలేదు. మనిషి కనిపించలేదు.

ఈవేళ మురళీ ఏం చేస్తుంటాడో అని ఆలోచిస్తున్న రవణమ్మ పాతికేళ్ల కుర్రాడొకడు మరొక సమవుజ్జీతో సిగరెట్లు కాలుస్తూ ఇంజినువేపు వెళ్లడం చూసి, మురళీ అంది అప్రయత్నంగానే.

మురళి చటుక్కున సిగరెట్ దాచేసి, ఏంవండీ, మీరా? అన్నాడు.

నువ్వేం చేస్తున్నావు? అనడిగింది మోటుదేరిన మొహం చూస్తూ.

ఏ.యస్సంగా వున్నానండీ. కాంటాబాంజీలో వేశారు. అన్నాడు. మీరు అక్కడే వున్నారా? అనడిగేడు.

ఆఁ అంది రవణమ్మ.

ఆతరవాత ఏం మాటాడాలో ఇద్దరికీ తోచలేదు.

వస్తానండీ అన్నాడు మురళి.

ఆఁ అంది రవణమ్మ.

ఎవర్రా? అనడిగిన స్నేహితుడితో, ఇక్కడ వాల్తోరులో వుండేదిలే రవణమ్మ అనీ అన్నాడు మురళి నిర్లక్ష్యంగా సిగరెట్టు విసిరేస్తూ.

వెళ్లిపోతున్న మురళిమీంచి రవణమ్మ చూపులు బలవంతాన శూన్యంలోకి మరల్చింది. ఎన్నిమారు వేరు తన్నలేదు ఈ శిశిరశీతవాతశర్వదాశాలత ….

అప్రయత్నంగా వెలువడిన నిట్టూర్పొకటి బరువుగా కదలిన ఇంజనుకూతలో కలిసిపోయింది.

(1965-6 ప్రాంతంలో రచన పత్రికలో తొలి ప్రచురణ.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఆడమనసు”

 1. Respected Malathi Garu.
  Thanks for the quick response. I am really thrilled to see you respond. Honestly before writing that review I never expected a response, that too discussing on what I wrote. This is definitely making me to express my appreciation towards your committment. On this note, I would like to let you know that I had been reading your stories since long, and I felt happy when you came to Hyderabad and talked about your site and the way you maintain. Cudos to you.

  Coming to the point of discussion, first of all, yes, one can become an ASM by the age of 25. I beg to differ from your opinion that men are setinimental when young. I would rather say, any one who craves love (especially from mother and father) would be sentimental in the young, but the materialistic struggle they go thru (again, not in the privileged cases where they get some other conduit which provides the necessary dose of patronization) makes them change their outlook.

  I feel your story would have been more punching with the affections and human feelings, had it been established that Ravanamma her self came from similar background and shares the mindset of Murali when she met her. Then obviously she would be shocked to see one with such mind set turning totally materialistic, but she, remained in the same craving stage.

  Hope you don’t mind my amaturish analysis on your stories and again, am very glad that I am able to communicate with you.

  మెచ్చుకోండి

 2. Sri Sitaram garu,

  I am very happy to hear that you are reading my stories. Thanks for the detailed comment on this story. Let me try to respond the best I can.

  I wrote this story after learning about the two characters and the two incidents. 1. A casual encounter which develops into a friendship, and 2. how the outgrow their friendship after sometime.
  In this case, Ravanamma was a teacher and Murali was 12-years old boy, living away from home and mother. I prefer not to give any name to their friendship.
  Murali was staying with his brother, may be he was looking for a mother-figure and possibly Ramanamma enjoyed his company because he was acting like a kid. These things are hard to explain but I know they do happen. If he had not come back to see her, there would be no story :).
  In real life, we do not know how or why we feel like seeing a person for a second time, after a casual meeting.
  In the story, he was studying 4th form (9th class) when they met and two years went by before Murali left for good. At that time, he should be 12 or 13.
  Second time when Ramanamma saw him, she said పదేళ్లవుతోంది. That makes Murali about 24 or 25 old. I don’t know if one can become an ASM at 25. The fact is there is considerable lapse of time between the two incidents.

  I thought the closeness between the two characters had been established with the conversations between the two and Ramanamma’s advice to him during their first encounter. If you say that was not enough, I would have to think again.
  Probably, “throwing the post card away” was uncalled for. I could have said she put it away. Thanks for pointing that out.
  I tried to establish that men, when young, are more sentimental and later outgrow that for whatever reason.
  Once again, thanks for your comments. They certainly made me read the story again and think.
  I may add one more note. Back in the sixties, writers did not consider being vague a flaw. (e.g. what exactly is the relationship between the two characters). We were focused more on the narrative technique. To some extent, that might have affected my story telling.

  Once again, thanks and hope to hear your comments on other stories as and when you read.

  Malathi

  మెచ్చుకోండి

 3. Respected Malathi garu
  I keep reading your stories whenever my time permits. Today I got a chance to read your story “Ada Manasu”. I fail to understand what you wanted to convey in this story.
  1.. Why would Murali come to her house at all? If we take it as childish act, then he is not established as a cherished child at all
  2. The time line of the story is too short for a person to become ASM in railways and all these days, why would she remember him?
  3. To remember for no reason, there should be some affection established. What kind of affection is established between Ramanamma and Murali?
  4. From her side, if she considered him as brother, then she would not throw the card just like that. If she threw it, then she either did not care or had antoher feeling, which is never established in the story. So, we take it that she had no affection.
  5. If we meet some one whom we don’t care about, then there is no question, male or female, we don’t care what he had become. The very statement that she kept thinking about him suggests she had some feeling towards him. In which case she should have regretted for tearing the letter sent by him with address.
  6. At the end if he ignores her, that establishes his careless ness towards her, which is normal and which she too possessed towards him
  7. With all this in the story, I fail to understand what is your intention?

  Regards

  Seetharam

  మెచ్చుకోండి

 4. చివర్లో అవసరంగా ముగించేశారేమో అనిపించింది. ఇది దిష్టి చుక్క మాత్రమే,లోపం కాదు. కథ(నం) అహ్లాదకరంగా ఉంది.

  మెచ్చుకోండి

 5. ఇక్కడ ఆడమనను కన్నా, ఆ అబ్బాయి కృతఘ్నుడేమో అనిపించింది. ఆవసరకాలంలో సహాయం తీసుకుని దాన్ని తర్వాత మర్చిపోతే …

  అందరు అబ్బాయిలు / అమ్మాయిలు అలా ఉండరేమో

  మెచ్చుకోండి

 6. బావుంది సున్నితంగా. దేన్నో నిరూపించదలిచినట్టు కాకుండా. పైకి చెప్పకుండా.

  ఒకర్నొకరు పోల్చుకోవడంలో కొంచెం తటపటాయింపు చూపితే అంత బలవంతంగా డ్రమెటిక్‌గా ఉండేది కాదు చివర్లో.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s