(ఎన్నెమ్మ కతలు 31)
ఒకసారి ఒక చాకులాటి కుర్రవాడు దేవుడితో, “అయ్యా, దేవుడుగారూ, దేవుడుగారూ, జలధిగంభీర, జలజనయన, మేరునగధీర, మిమ్ముల బొగడ నాతరమా” అని కొంచెంసేపు పొగిడి, తరవాత, “మీకు క్షణము యుగముతో సమానమని విన్నాను. నిజమేనా?” అని అడిగాట్ట.
అందుకు దేవుడుగారు ధీరోదాత్తచిత్తముతో, “అవున్నాయనా.” అన్నారుట.
మన చా.కు. ఇంకా సందేహం తీరక, “మరి తమరికి ఒక కానీ కోటిరూకలతో సమం అన్నారు, నిజమా?” అని అడిగాట్ట.
దేవుడుగారు నిదానంగా సమాధానంగా “అవున్నాయనా, నిజమే” అన్నారుట.
అప్పుడు మన చా. కు. “అయ్యా, దేవుడుగారూ, మీరు భక్తవత్సలురున్నూ, కరుణాసముద్రులున్నూ అని కూడా విన్నాను. నాయందు దయ వుంచి నాకు ఒక్క కానీ దయ చేయించండి” అన్నాడు ఎంతో వినయంగా.
అప్పుడు దేవుడుగారు, “అలాగే నాయనా. తప్పకుండాను. ఒక్క క్షణం ఆగు” అన్నాట్ట ఎంతో ప్రేమగా.
ఈకథ విన్నతరవాత నాకు అర్థమయింది డబ్బుకీ, కాలానికీ లంకె పురాణయుగంలో కూడా వుందనీ, అనాదినిధనుడికి కూడా లెక్కల్లో తిరకాసు బాగానే తెలుసనీ.
అమెరికాలో కాలము అనగా డబ్బు అని అర్థం చెపుతారు. ఎంచేతంటే, మీరు ఎంతకాలం ఖర్చు వెచ్చించేరో దానికి తగ్గట్టుగానే మీ ఆదాయం కూడా వుంటుంది అని. దాన్నే తిరగేసి చెప్పాలంటే, మీరు ఎదటివారి కాలం ఎంత వెచ్చించేరో దానికి తగ్గట్టే మీకు ఖర్చు కూడా వుంటుంది అని.
ఎలాగంటే, గోడకి మేకు కొట్టడానికి “పనివాడి”ని పిలిచేననుకోండి. మాఊళ్లోమాటే చెబుతున్నాను. ఆ పనివాడు రావడానికి 37న్నర డాలర్లు దారిఖర్చు. వాడింటినించీ మాఇంటికి రావడానికి ఎంతసేపు నిజకాలం అన్నది కాదు ఇక్కడ లెక్క ఎంచేతో మరి. “ఆపైన మేక్కొట్టడానికి ఎంతోసేపు పట్టకపోవచ్చు కానీ నా కనీస గంట ధర 80 డాలర్లు ఇచ్చితీరాలి”అంటాడు.
సరేనంటాను. “రెండువారాలతరవాత మంగళవారం మధ్యాన్నం ఇంట్లో వుంటారా?” అంటాడు.
“నేను బయటికి వెళ్లొచ్చు. ఖచ్చితంగా ఎన్నిగంటలకి వస్తావో చెప్తే, అప్పుడు వుంటాను” అంటాన్నేను.
“అలా చెప్పలేనండీ. మీ ఫోన్నెంబరివ్వండి. పిలుస్తాను” అంటాడు.
సరే. మంగళవారం వస్తుంది. ఆరోజు పొద్దున్న ఆ పనివాడుగారు పిలిచి “మధ్యాన్నం రెండు గంటలకి ఇంట్లో వుంటావా?” అని అడుగుతాడు. ఉంటానంటాన్నేను. ఉండకేం చేస్తాను, ఎవరికోసం? నాపనా, మరేవన్నానా.
ఇక్కడ నా కేరక్టరుగురించి కొంచెం చెప్పాలి. సాధారణంగా మధ్యాన్నం నాలుగ్గంటలకి ఎవరేనా వస్తారంటే, ఉదయం పదిగంటలనించీ నాకు నర్వుసు. మరే పనీ తోచదు. ఆరోజూ అంతే. పనివాడికోసం ఎదురుచూస్తూ మరేపనీ చేసుకోకుండా అనుక్షణం గడియారంవంక చూస్తూ కూర్చుంటాను. వంట కూడా చెయ్యను. ఏటావోసన అనిపిస్తున్నట్టు మొహం వికారంగా పెట్టి అడిగేవాళ్లని చాలామందిని చూసేను మరి. అంచేత ఆ పనివాడు వచ్చివెళ్లిన తరవాతే చేసుకుందాంలే అని రంగూ, రుచీ, వాసనా లేని నానా గడ్డీ తింటూ గడుపుతాను ఆపూటంతా.
మధ్యాన్నం రెండూ, రెండుంబావూ, రెండున్నరా .. తరవాత మూడూ అవుతుంది. అప్పుడు పిలుస్తాడు ఆ పనివాడు. తను వేరేపనిలో హెల్డప్ అయిపోయేననీ, కొంచెం ఆలస్యం అవుతుందనీ చెప్తాడు. ఇప్పటికి గంట ఆలస్యం అయింది కదా. ఈగంటకి నాకెవరిస్తారు ఖర్చులు అని అడగడం అమాయకత్వం. బుద్ధి తక్కువ. నాకాలానికి ధర లేదు.
అలాగే డాక్టర్లూ, లాయర్లూ ,,, అందరూ వారి వారి కాలానికి ధరలు కడతారు. నేను డాక్టరుదగ్గరికి వెళ్తే, నాదారిఖర్చు ఎవరూ ఇవ్వరు. అక్కడ వెయిటింగురూంలో ముప్పావుగంటా, ఎగ్జామినేషన్ రూంలో అరగంటా … ఇలా నాకాలం నీళ్లలా ఖర్చయిపోతూంటూంది. దానిమీద దమ్మిడీ ఆదాయం లేదు.
డాక్టర్లంటే నాకు సానుభూతి లేదనుకోకండి. వాళ్లు చదువుకి పాపం అరవైవేలో, అరవై లక్షలో ఎంతో అవుతుందిట. ఎంచేతా? వాళ్ల ప్రొఫెసర్లకి జీతాలూ, అవీ. ఆజీతాలు ఎందుకంటే వాళ్లు చదువుకున్నప్పుడు ఖర్చు వాళ్లకి అంతకి అంతా అవుతుందిట … ఇలా తవ్వుకుంటూ పోతే మొదట చెప్పేను చూడండి ఆ అనాదికాలంలో తేల్తాం.
నాలుగేళ్లకిందట అనుకుంటాను విస్కాన్సిన్ స్టేటువాళ్లు సిగరెట్లకంపెనీమీద కేసు పెట్టేరు. స్టేటులాయర్లు గంటకి 2700 అంటే అక్షరాలా రెండువేల ఏడువందలు చొప్పున ఛార్జీ చేసేరుట స్టేటుకి. ఎలా వేసేరీ లెక్కలు అంటే, లాయరుగారి జవాబు “ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు” అని. కాంప్లికేటెడ్ అయితే మరో పన్నెండు గంటలో, ముప్ఫై గంటలో ఖర్చు పెట్టొచ్చు కానీ, ఒఖ్క గంటకి ధర ఎలా పెరుగుతుందో నాకు అర్థం కాదు.
అసలు ధరలు ఎలా నిర్ణయిస్తారంటే నాచిన్నప్పుడు చదువుకున్నానులెండి. వస్తువులు హెచ్చుగా వుంటే ధర తక్కువా, కొనేవాళ్లు హెచ్చుగా వుంటే ధర ఎక్కువా అని. దాన్నే సప్లై ఎండ్ డిమాండ్ అంటారుట. ఇది చెప్పడం తేలికే గానీ, ఇంత భూప్రపంచకంలో ఎవరు ఏది కొంటారో ఎలా తెలుస్తుంది. ఏమిటోలెండి ఆగొడవంతా నాకు తెలీదు కానీ … నాకాలానికి మాత్రం అట్టే విలువున్నట్టులేదు. తెల్లారి లేస్తే, నాకాలం ఎంత వృథా అయిపోతోందో అడక్కండి. తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది.
అలాగే ఆమధ్యనెప్పుడో బిల్ గేట్సు వేలకీ వేలు ఇండియాలోనూ, ఆఫ్రికాలోనూ ధర్మం చేసేడంటే నాకేం గొప్పగా అనిపించలేదు. నేను మూడేళ్లకోసారి ఒక కంప్యూటరుచొప్పున పాతికేళ్లుగా బోలెడు ఖర్చు పెట్టేను. గేట్సు చేసినదానంలో నామనీ కూడా వుంది. అదంతా ఆయన సొంత సొమ్మేం కాదు. పోనీ, నువ్వింతకాలం లాయలుగా వున్నావు. అంచేత మనం పంచుకుందాం అని నాక్కొంచెం ఇస్తే సంతోషంగా వుండును నాకు. పైగా కంప్యూటరు ధరలు పడిపోతున్నాయని మరో గోల. ధరలు ఎలా పడిపోతాయి. ముందు మీద పెడితేనే కదా కింద పడడం. ప్చ్.
ఇలా తీవ్రంగా ఆలోచించగా, నాకో ఘనాపాఠీ ఆలోచన వచ్చింది. నా అభిప్రాయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికాలానికి ఒకే విలువ పెట్టాలని. గంటకి అణాపరక. అంతే. గోడకి మేక్కొట్టడానికి అణాపరక. రేడియాలజీ చదువుకోడానికి ఫీజు అణాపరక. ఆపాఠం చెప్పే ప్రొఫెసరుకి జీతం అణాపరక. అనకాపిల్లికి బస్సు టికెట్టూ అణాపరకే, ఓక్లహోమాకి ప్లేను టికెట్టూ అంతే. కాడిలక్ కారూ, మౌంటెన్ బైసికిలూ, ఏడంతస్థుల మేడా, పూరికొంపా .. ఇలా అన్నిటికీ ఒకే ధర వుంటే అదీ సమసమాజం. ఏమంటారు? మీక్కూడా నచ్చితే చెప్పండి. ఓ చట్టం తయారు చేసేయమని మన అణాపరక నాయకులకి అర్జీలు పెట్టేసుకుందాం. అన్నట్టు ఈ అర్జీ పకడ్బందీగా రాయడానికీ ఓ అణాపరక లాయరు ఎక్కడేనా దొరుకుతాడేమో కూడా చూడండి.
అణాలు చెలామణి అయినకాలంలో జన్మించనివారి సౌకర్యార్థం వివరణ – పూర్వకాలమున రూపాయికి పదహారు అణాలు, అణాకి నాలుగు కానులు. పరక అనగా సగము. అణాపరక అంటే ఒకటిన్నర అణాలు లేక ఆరు కానులు. బేడాపరక అంటే మూడణాలు. ఇతర ప్రాంతాల్లో పరక అంటే రెండు అణాలు అనీ, పధ్నాలుగు అనీ అర్థాలు వాడుకలో వున్నట్టు కనబడుతున్నది కానీ నాఅనుభవంలో అణాపరక అంటే ఆరు కానులే.
(మార్చి 2009.)
మెక్సికన్ కూడా మరీ అణాపరకకి చెయ్యరులెండి. వాళ్లూ బతకాలి కదా. ఊరికే ఆపదం నాకు నచ్చి వాడేనంతే. ప్రతీకాత్మకం. 🙂 మీ స్పందనకి దన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
భలే ఉంది మీ ” ద్రవ్యమూ-కాలమూ” పాఠం. అణాపరక ఖరీదేదో బానే ఉంది కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. అమెరకన్ పనివాడు మీకు ముఫ్ఫైఏడు డాలర్లు తీసుకున్నాడు. మెక్సికన్ అయితే మీకు అణాపరక డాలర్లలో చేస్ పెట్టేసేవాడేమో. మా ఆడపడుచు కొడుకు వుడెన్ ఫ్లోరింగంతా టెనెంట్ బాత్రూంల టేప్ లు ఒదిలేసి పారిపోతే మొత్తం నాశనమయిపోయింది. తెల్లవాడు అరవైవేలకి కోట్ ఇచ్చాడుట. ఈ అబ్బాయి ఒక హోండరస్ వాడితో పదివేలకి పూర్తిచేయించుకున్నాట్ట. లోగుట్టు పెరుమాళ్ళకెరుక!!
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
మాలతి గారూ ! భలే …మనిషికే అంత తెలివుంటే మరి సృష్టించిన ఆయనకెంతుందాలి …పనివాడి తో తంటా బావుందండీ 🙂 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
:)) బాగుందండీ
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మో, మీ తెలివి బంగారం కాను..:)
మెచ్చుకోండిమెచ్చుకోండి
మనోహర్, సూర్యుడు, ధన్యవాదాలు.
ప్రవీణ్ – చూసారా, నాకు ఈసంగతి తెలీనే తెలీదు మీరు చెప్పేవరకూ.
నెటిజన్, – మీకు అణాపరకగురించిన విజ్ఞానం వచ్చేసింది కదండీ. అంచేత చెల్లయిపోయింది. 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఇంత చక్కని కధనిచ్చి చదువుకోమన్నందుకు మీకొక అణా పరక.
మరి చదివినందుకు మా అణా పరకేది?
🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
పూర్వ కాలంలో, అంటే 1930 – 19940 రోజుల్లో బేడపరక షాపులుండేవిట 🙂
ఇప్పుడు 1 Dollar షాపుల్లా 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
భారతంలో నాయకులు అన్నీ ఉచితంగా ఇస్తుంటే ఇంకా అణా పరకెందుకండీ చోద్యం కాకపోతేనూ 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
“ఒక్క క్షణం ఆగు నాయనా”— బాగుంది
మెచ్చుకోండిమెచ్చుకోండి