ఉభయతారకం

కథలెలారాస్తారండీ అని అడిగేడు తారకం ఓరోజు.

ఏముందీ, మామూలుగానే. కాయితంమీద కలం పెట్టి అన్నాను.

అద్సరే లెండి, కాయితమ్మీద కలం పెట్టి ఎలా రాస్తారని?

నాయనా, అరబ్బీయులు కుడినించి ఎడమకుడికి రాస్తారు. చైనీయులు మీదనించి కిందకి రాస్తారు. నేను మాత్రం ఎడమనించి కుడికే రాస్తాను.

దేన్నిగురించీ అని?

దేనిమీదయినా రాయొచ్చు

ఆగోడమీద రాయొచ్చా?

ఉహూఁ. గోడమీద రాస్తే పోస్టు చెయ్యడం కష్టం. కాయితమ్మీదే రాయాలి.

పోన్లెండి, ఈ బల్లమీద రాస్తాననుకుందాం. ఎక్కడ మొదలుపెట్టమంటారు?

మొదలుదగ్గర మొదలెట్టి చివరివరకూ రాసుకుపోవడమే?

అదే, ఏమని మొదలుపెట్టడం అనీ?

నువ్వు ఏవిషయమ్మీద రాద్దాం అనుకుంటున్నావో దాన్తోనే ప్రారంభిస్తే బాగుంటుంది.

బల్లగురించి ఏముంది రాయడానికి?

బోల్డుంది. బల్ల ఏచెక్కతో చేశారో, అది ఏచెట్టునించి వచ్చిందో, ఆచెట్టు పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో చెప్పడం ఒకపద్ధతి

అది కుదరదులెండి. నాకు చెట్లూ, పుట్టలూ అర్థం చేసుకునే సహృదయత లేదు.

పోనీ, ఆబల్ల ఎక్కడ కొన్నావో, ఎంతక్కొన్నావో, ఆదుకాణంవాడు ఆ బల్ల ప్రత్యేకతగురించి చెప్పిన హరికథా అన్నీ రాసేయి.

అదేంటండి. నేను రాస్తున్నది బల్లమీదా? బల్లలవ్యాపారంమీదా?

అదేనయ్యా చెప్తున్నది. కథ అంటే అదే మరి. అడవి వుసిరికాయా, సముద్రపు ఉప్పూ ఓ కొలిక్కి తెచ్చి ముడేయడమే కథ రాయడం అంటే.

సరే, ఏదో మొదలెడతాననుకోండి. తరవాతేం చెయ్యను?

ఆదికీ అంతానికీ మధ్య ఒకటో రెండో సన్నివేశాలూ, సంఘర్షణా పెట్టు. సన్నివేశాలు పకడ్బందీ వుండాలి. సంఘర్షణ ఘనంగా వుండాలి.

“చెక్కబల్లకి సంఘర్షణ ఏమిటండీ?

బాగుంది. కథ రాస్తున్నది నువ్వా నేనా? నీకేం రాయాలనుంటే అదే రాయి. అని మళ్లీ అడక్కుండా, పాత్ర పోషణ కూడా చెయ్యాలి అన్నాను.

సరేలెండి. అదెలా అంటే మళ్లీ నువ్వా, నేనా అంటారు, అంటూ మూతి ముడుచుకు వెళ్లిపోయాడు తారకం.

నాలుగురోజులతరవాత ఓ కథ రాసుకొచ్చాడు. నిజానికి సగం రాసుకొచ్చాడు.

సగం రాసేనండీ. ఎలా ముగించాలో తెలీడం లేదు. అంటూ.

బాగుంది. కథ రాస్తూ, రాస్తూ, కలం ముడిచేస్తే అయిపోతుందేమిటి? కథకి ముగింపే ప్రాణం.

ప్రాణం పోయినప్పుడే ముగింపు అనుకున్నానండీ అన్నాడు తారకం.

అలా కాదు బాబూ. కథలో నీ సందేశం ముగింపులోనే తెలుస్తుంది. అక్కడిదాకా చదివిన పాఠకులు ముగింపు చదివి ఆహా! అదా సంగతి, నాకింతవరకూ తట్టనేలేదు, లేదా గుర్తే లేదు అనుకోవాలి.

ముగింపుకింత కథా కమామీషు వుందని నాకు తెలీదండీ. మీరు చెప్పలేదు మరి.” అన్నాడు తప్పు నామీదకే తోసేస్తూ.

నేను కూడా సహజంగానే ఆ పాపభారం నా నెత్తినేసుకుని, అయ్యో చెప్పలేదూ? మర్చిపోయేను కాబోలు. అసలు నిజానికి కథలు మొదట్లోనే మొదలెట్టక్కర్లేదు. నేను ఒకొకప్పుడు ముగింపు ముందు రాసేసి, తరవాత మొదట్నించీ రాసుకుంటూ పోతాను. అప్పుడయితే, ముగింపు ముందే సిద్ధంగా వుంటుంది కనక మరి చింత లేదు. అన్నాను.

మరి ఆమాట ముందు చెప్పలేదు కదండీ మీరు అంటూ మళ్లీ మొదటికొచ్చేడు తారకం.

సరే ఇప్పుడు చెప్పేను కదా. పో, అలా రాసుకురా అన్నాను.

అడగడం మర్చిపోయేను. శైలి మాట కూడా కాస్త ఇప్పుడే చెప్పేయండి. మళ్లీ మళ్లీ ఇన్నిసార్లు తిరగలేను.

నువ్వెలా రాస్తే అదే నీశైలి.

ఇంగ్లీషు మాటలు నాకు తొందరాగా వచ్చేస్తున్నాయి.

సరే. ఇంగ్లీషులోనే రాసేయ్ మొత్తం కథంతా. ఎలాగా నీది సగం తురకం. ఎందుకొచ్చిన తెలుగు, నరకం, అన్నాన్నేను.

ఇంగ్లీషు నాకంత బాగా రాదండీ.

అయితే, ఇంగ్లీషులో రాయకు. తెలుగులోనే రాయి.

అన్నట్టు మరొక్కమాట కూడా అడిగేస్తాను. ముద్దు ముద్దుగా చిట్టీ పొట్టీ వాక్యాలు గిలకమంటారా? పెద్ద పెద్ద సంస్కృత సమాసాలూ, దుష్టసమాసాలూ పెట్టేసి ఘనాపాఠీపండితుల్లా రాస్తే గౌరవమా?

పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు అనవసరదాంపత్యం అని ఓ కథ రాశారు. చదివేవా?

లేదండీ.

అందులో మొదటి వాక్యం చాలు కథారచన యవ్వారం తెలియడానికి.

చెప్పండి మరి ఆ ఒక్క వాక్యం.

కాయితం, కలం తీసుకో. రాసుకో.

అక్కర్లలేదండీ. నాకు గుర్తుంటుంది, చెప్పండి.

సరే. మళ్లీ చెప్పలేదనకు. అంటూ చెప్పేను ఆవాక్యం .

ఒక వాక్యం

వాక్యం పూర్తి చేసి, తారకంవేపు చూశాను. మిడతలా కళ్లు మిటకరించి చూస్తున్నాడు, గుటకలేస్తూ. ఎవరేనా చూస్తే అతడిమెదడు పని చెయ్యడం మానేసి చాలాసేపయిందని ఇట్టే గ్రహించీగల్రు.

నావల్ల కాదులెండి అలా రాయడం. వ్యాఖ్యలో విమర్శలో రాసుకుంటాను అన్నాడు తారకం దిగులుగా.

అయ్యో, అలా దిగులు పడిపోకు. కథ రాయాలనుకున్నావు కనక కథే రాయి. అదే వస్తుంది. అదేం బ్రహ్మవిద్యా ఏమన్నానా? అని కొంచెం ధైర్యం నూరిపోశాను.

మరోమాట కూడానండీ. పక్కవీధిలో మూడంతస్థులమేడలో నివాసం ఏర్పరుచుకున్న భాగ్యలక్ష్మిగారు అస్తమానం బాధ పడిపోతూంటారండీ, కూర్చుని రాసుకోడానికి తమకి వేరే గది లేదనీ, అంచేతే తాము రాయలేకపోతున్నామనీను. మరి మేం పిల్లా, మేకా వెరసి పదకొండుమందిమి మూడుగదులవాటాలో బతుకు గడుపుకుంటున్నావండీ. నాకు కూడా వేరే గది లేదు. అదేమయినా ఆటంకం కాగలదంటారా? . అని ప్రశ్నించేడు తారకం భ్రూకుటి ముడిచి.

ఉన్నచోటే కూచునో నిల్చునో రాసుకుందూ. లేకపోతే ఏహోటల్లోనో, పార్కులోనో కూచుని రాసుకో, అన్నాను మరి సమాధానాలు చెప్పలేక. హోటల్లోనూ, పార్కులోనూ ఏకాంతం దొరకదు కదండీ అని అడగలేదు తారకం ఎంచేతో మరి.

వారంరోజులు పోయేక మళ్లీ వచ్చేడతను నాలుగు కాయితాలు పుచ్చుకుని.

ఇదుగోనండీ. కథ రాసేను. మీరు చెప్పినట్టుగా రాయడం నావల్ల కాలేదండీ. నాకు తోచినట్టు రాసేను, చూసి చెప్పండి.

చూశాను. కథ బాగానే వుంది. మంచికథే. వాళ్లింట్లో రాతబల్లతో తన అనుబంధం అ, ఆలనుండీ యమ్సెట్‌వరకూ, తనూ అక్కయ్యా ఆబల్లదగ్గర కూచుని ఆడుకున్న ఊసులూ, వేసుకున్న తగువులూ, చెప్పుకున్న రహస్యాలూ ఆర్ద్రంగా వుంది.

నేను వల్లించిన పాఠాలేం పని చేయలేదు. బతికిపోయేను. లేకుంటే ఆబోరు దక్కునా! ఎందుకా? ఎందుకంటే జగన్మోహిని బొమ్మ వేస్తున్నప్పుడు మొహానికి చంద్రుడినీ, ముక్కుకీ సంపెంగమొగ్గా, పెదిమలకి రెండు దొండపళ్లూ వేస్తే ఎలా వుంటుందంటారు? అలాగే తయారవును నాసలహాలు పాటిస్తే.

నాకిలాటి రచయితలంటేనే ఎంతో గౌరవం. బహు మర్యాదగా మీరు చెప్పండి అని సలహాలు అడగొచ్చు. నేను అలా బహు మంచి సలహాలు ఇచ్చినందుకు ఆనందం కూడా వెలిబుచ్చొచ్చు. ఆ పైన వాళ్ల మనసుకి నచ్చినట్టు, చేతిలో కలం నడిచినట్టు రాసుకుపోవాలి. మంచి కథకుల లక్షణం అదే మరి.

అలా చేస్తేనే ఉభయతారకం!

(గమనిక. కొడవటిగంటి కుటుంబరావుగారు నమూనకథ అని ఒకకథ రాసేరు. వారి కుమారుడు రోహిణీప్రసాద్ అనువాదం thulika.netలో చూడొచ్చు. అలాగే కనుపర్తి వరలక్ష్మమ్మగారు మంచి కథ ఎలా వుండాలో కథ ఎట్లా వుండాలె అన్న కథలో వివరించేరు. దీనికి కూడా అనువాదం నా thulika.netలో వుంది.

నాలాటివారు చెప్తే, ఇదుగో, ఇలా వుంటుంది మరి 🙂 )

(8 ఏప్రిల్ 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఉభయతారకం”

 1. నెటిజన్, నాకు మాట తోచడం లేదు. ధన్యోస్మి.
  పొద్దు వారు ఇంకా రెండో మూడో భాగాలుగా వేస్తారనుకుంటాను (నావంతు రాయడం అయిపోయిందిలెండి). అవి కూడా మీరూ, అందరూ చదవడం అయినతరవాత,నేను ఇంకా ఏం రాయగలనో చూస్తాను. పొద్దు IEలో కనిపించకపోవడం నాకు రవంత కొరతగా వుంది. పుస్తకం.నెట్ లో నేను ఇలాటి వ్యాసాలు చూడలేదు. ఏమయినా చూద్దాం లెండి. మరొకసారి, మీలాటి తెలుగు సాహిత్యపిపాసువులు వెయ్యేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ,
  మాలతి
  మంచిమనసు, దొడ్డ మనసు -:) (హన్నా, మాటలు నేర్చేరు!)

  పరిమళం, ఆలస్యంగానేనా వచ్చేరు కదా. నేనెక్కడికి పోతాను కనక. ఎప్పుడొచ్చినా ఇక్కడే వుంటాను 🙂

  మెచ్చుకోండి

 2. అయ్ బాబోయ్ ఎంత ఆలశ్యం గా వచ్చానో ! అందరూ కామెంటేశాక నేనేమంటాను ? వారి మాటే నాదీనూ ..

  మెచ్చుకోండి

 3. “చమత్కారం, ఎత్తిపొడుపూ, వ్యంగ్యం – ఏ కోణం తీసుకున్నా ఎంతో ప్రతిభావంతంగా తోస్తుంది” అని కధామాలతీయం ౨ లో రా.వి శాస్త్రి గారిని గురించి మీరు అన్నారు. బహుశ అదే మీ శైలిని ప్రభావితంజేసిందేమో. పాఠకులకి కావల్సింది అదే – అది కోరుకునే వాళ్ళకే లెండి 🙂 మీ శైలి గురించండి ఇక్కడ అంటున్నది.

  మీరు అంత చక్కగా చెప్పగలుగుతారనే మిమ్మల్ని కోరుతున్నది. ఎందుకనో మన తెలుగు రచనా రంగానికి సంభందించిన వారు చాల తక్కువ మంది ఈ బ్లాగులలో కనపడతారు. అందులో పాఠకులతో పరిచయాన్ని పెంచుకున్నవారు కూడా చాల తక్కువమంది. వారిలో మీ రొక్కరు. కల్పన గారు కూడ ఎక్కువ గా కనపడటం లేదు. కాబట్టి మీ మీద భాధ్యత ఎక్కువ ఉంటుంది – అది కూడా మీరు కావలనుకుంటేనే సుమా!

  మీరూ మీ బ్లాగులు, మీ సాహిత్యం, మీ పాఠకులకే పరిమితం కావచ్చు, కాని ఒక చారిత్రక దృష్టితో చూసినప్పుడు తెలుగు బ్లాగ్‌లోకంలో మీ ఉనికి ని గురించి ప్రస్తావించుకున్నప్పుడు మీ అభిప్రాయాలు రేపటి తరానికి ఉపయోగపడతాయి.

  ఇక భాష, పదాలు, వాక్యాలు, వాటి నిర్మాణం – అర్ధాలు, శబ్దాలు – “శ్చ / చ్చ” కి తేడా ఉంది, ఉండాలి, అని తెలిసిన వారు అతి తక్కువ మంది. అందులోను చెప్పగలిగి ఉండి చెప్పలేని వారే ఎక్కువ మంది. కారణాలు ఏవైనాగాని.

  కాబట్టి ఈ విన్నపం, విన్నపమే – మరొహటి కాదు, మన్నించండి. రైమింగ్ కోసం “మంచి మనసు చేసుకుని మన్నించండి” అని అనవచ్చు గాని – మీది “దొడ్డ మనసు” అని తెలుసుకదా అందుకని అనడం లేదు..

  ఇక మీ కధామాలతీయం చదివినంతసేపు ఆ యా వ్యక్తులని, ఆ ప్రాంతాలని సాక్షత్కరింపజేసారు. చాలా రోజులు పడుతుంది బయటపడటానికి, లేదండి, ఇంకా ఆ లోకం లేనే ఉన్నా..వారందరిని పరామర్శించి..

  మెచ్చుకోండి

 4. జీజిపప్పు, ఉమాశంకర్, ధన్యవాదాలు.
  సౌమ్య, 🙂 ఇవ్విధముగా నేను కూడా వినయంగా చెప్పుచున్నాను సుమతీ. మరి మాలతితో మరో పాదం రాస్తే కదా రైము తెలిసేదీ …
  నెటిజన్, మీ అభిమానానికి సంతోషంగా వుంది కానీ నాకంత పాంఢిత్యంలేదండీ. చూశారు కద ఇది కూడా నవ్వులాటగా రాసేను. అయినా మీమాట కాదనలేను. ప్రయత్నిస్తాలెండి.

  మెచ్చుకోండి

 5. @నెటిజన్
  విశాలాంధ్ర వారి ప్రచురణ అనుకుంటాను. “కధలెలా రాయాలి” అనేదానిమీద మహామహుల వ్యాసాలున్నాయక్కడ, వాటిని కూర్చినవారు శార్వరి.

  మెచ్చుకోండి

 6. మొత్తానికి, కధ ఇలా రాసుకోండంటూ, ఒక కధ వినిపించారు 🙂
  @ఉమాశంకర్: శార్వరి కధలెలా రాస్తారు? ఎక్కడ దొరికిందో? ఇంకా వారి పుస్తకాలు చదివి..బ్లాగే వారున్నారా?
  ఆ మధ్య యండమూరి – ఒక “వర్క్ షాప్” లాంటి నిర్వహించి కొంతమందిని తెలుగు సాహిత్యానికి, పాఠకులకి పరిచయం చేసారు.
  మాలతి గారు, ఒక రచయిత్రిగా చెప్పండి. మీకు ఏ ప్రక్రియ అంటే ఇష్టం? ఏ ప్రక్రియని మీరు పయత్నించి మీ దృష్టిలో విఫల మయ్యానని అనుకున్నారు?

  కధ, కధానిక, గల్పిక, స్కెచ్ గురించి మీకు తెలిసిన రెండుముక్కలు చెప్పండి. బ్లాగ్‌లోకంలో చాలా మంది వ్రాయాలన్న ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పండి. బహుశ అలాంటి ఒక టపా ఐతే పొద్దు కే కాకుండా, పుస్తకానికి కూడా మీరు ఇవ్వచ్చు.

  మెచ్చుకోండి

 7. వినదగునెవ్వరు చెప్పిన….
  కానీ ఆ తర్వాత తుది నిర్ణయం మనమే తీసుకోవాలి కదా మరి 😉
  ఇవ్విధముగా నేను కూడా వినయంగా చెప్పుచున్నాను సుమతీ (సుమతీ మాలతి రెండూ రైమింగని చూసారాండీ మీరూ?) :p

  మెచ్చుకోండి

 8. తెరెసా, ఉమాశంకర్, ధన్యవాదాలు.
  సుజాతా, ఆబోరు అంటే పరువు. విశాపట్నంలో, గుంటూరులో కూడా విన్నాను. కన్యాశుల్కంలో కూడా వుంది. థాంక్స్.

  మెచ్చుకోండి

 9. కాకతాళీయంగా నిన్ననే శార్వరి గారి సంకలనం “కథలెలా రాస్తారు” చదవటం మొదలెట్టా, ఇంతలోనే మీ పోస్టు..మీరిచ్చిన లింకులకు ధన్యవాదాలు..

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s