ఊసుపోక – ఒత్తులేవీ…

(ఎన్నెమ్మ కతలు 32)

దీపారాధనక్కాదులెండి, భాషారాధనలో ఒత్తులమాట నేను చెప్పబోయేది. తెలుగు రాతల్లో వొత్తులేవీ అని అడుగుతున్నాను.

మనకున్న గొప్ప ఆస్తి ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరాలూను. ఇంగ్లీషు చూడండి, మనకున్న అక్షరాల్లో సగం కూడా లేవు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే,

మనం తెలుగులో రాస్తున్నప్పుడు ఒత్తులూ, దీర్ఘాలూ తప్పనిసరిగా గమనించుకోవాలీ అని.

తెలుక్కి బొత్తిగా గుణింతాలు లేకుండా పోతున్నాయి. “మేఁవిలాగే మాట్టాడతాం” అంటూ నోరాడినట్టు కీళ్లాడించేస్తున్నారు కీబోర్డులమీద తెలుగు రచయితలు. అది చాలనట్టు, తెలుగు ఇంగ్లీషులో రాయడం కూడా బాగా ముదిరిపోయింది. అది చదవలేక నాప్రాణం కడగట్టిపోతోంది. అఆలు దిద్దుకున్నదినాలు తిరిగొస్తున్నాయి ఆమాటలు కూడబలుక్కు చదవలేక.

మాటవరసకి, ఓ పాఠకుడో పాఠకురాలో నాకు ఇంగ్లీషులో రాసారనుకోండి paathakulu అని. అసలు దీనికే నాలుగు రూపాంతరాలున్నాయి – pAThakulu, paaThakulu, paathakulu, patakulu – ఇలా ఎవరివీలుని బట్టి వారు రాసుకు పోతున్నారు. నేనయితే అది కూడబలుక్కుని చదవబోయి, పాటకులా, పాతకులా, పాఠకులా అన్న సందేహంతో ఆ ముక్కదగ్గరే పది క్షణాలు ఆగిపోతాను. మొదటి స్పెల్లింగే కరెక్టు అని చెప్పకండి. ఏది కరెక్టవునో ఏది కాదో అని కాదు, ఇన్నిరకాలూ ఎక్కడో అక్కడ కనిపిస్తునే వున్నాయి.

ఆమధ్య నాబ్లాగులో ఒకాయన ఇలాగే తమ అభిప్రాయం అర్థ తెలుగులో వెలిబుచ్చి, చివర et tu malati garu అని రాసేరు. చెప్పొద్దూ, కేవలం నా అజ్ఞానంచేతనే అది నాకు “థూ. మాలతి”లా అర్థమయింది! అసలు et తో మొదలయింది నాబాధ. ఇంగ్లీషులో రాస్తున్నప్పుడు, @ అనే రాయొచ్చు కదా. అది అర్థం చేసుకుని ముందుకి సాగబోతే, tu కరక్కాయలా అడ్డు పడింది. ఇదేఁవిట్రా ఈయన ఇవాళ “థూ మాలతి” అన్నాడు, రేపు మరొకావిడ “ఛీ మాలతి” అనగలదు, అదీ నాబ్లాగులోనే అనుకుని చాలా “భాధా” పడిపోయి. ఆ te malatiకి అంటకత్తిరేసేశాను. ఆతరవాత తీరిగ్గా ఆలోచించగా నాకు తోచింది, పాపం ఆయన మంచిమనసుతోనే రాసేరు, తు అన్నది నిజానికి తూ (చూశారా దీర్ఘం) అంటే తూలిక అని. (అలాగే చి. మాలతికి చిరంజీవి మాలతి అని అన్వయం చెప్పుకోవచ్చు) కానీ చెప్పేను కదా నాకు తెలుగు ఇంగ్లీషులో చదవడం రాదు. మాబళ్లో ఆభాష నేర్పలేదు.

నేను స్కూల్లో యస్సెల్సీలో సంస్కృతం తీసుకున్నాను అభిమానభాషగా. ఆక్లాసులో నేను ఒక్కదాన్నే విద్యార్థిని. మామేష్టారు సంస్కృతంలో గొప్ప పండితులు. ఆయనకి ఇంగ్లీషు రాదు. అంచేత టీకా తాత్పర్యాలు తెలుగులోనే చెప్పేవారు. ఆరోజుల్లో statewide పరీక్షలు మాత్రం ఇంగ్లీషులో జరిగేవి. అంచేత నేను చెప్పుకోడానికి – చదువుతున్నది సంస్కృతం, అర్థం చేసుకుంటున్నది తెలుగులోనూ, పరీక్షలు రాయడం ఇంగ్లీషులోనూ అన్నమాట. అలా ఏకకాలంలో మూడు భాషల్లో తల పెట్టేసేను నాప్రయత్నమేమీ లేకుండానే. ఈరోజుల్లో “మేం ఇంగ్లీషు బళ్లో చదువుకున్నాం అంచేత మాకు తెలుగు రాదు” అనేవారు ఈవిషయం గమనించాలి. అసలు ఆనాటి రచయితలు చాలామంది అనేక భాషల్లో నిష్ణాతులు. గత పాతికేళ్లలోనే వచ్చింది “ఒక భాష కంటె ఎక్కువ చదవలేం, మాటాడలేం” అన్న వాదం.

ఆ సంస్కృతం రోజుల్లోనే నాకు తెలిసింది భాషాసౌందర్యం, మాధుర్యం సంగతి కూడా. ఏ కావ్యమో గుర్తు లేదు కానీ, మా మేష్టారు అన్న మాట మాత్రం ఇప్పటికీ గుర్తుంది, ఆయనముఖకవళికలలో వేదన ఈరోజుకీ నామనసులో స్ఫురిస్తుంది తలుచుకుంటే.

నేను శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆయన “మందాక్రాంత వృత్తాలమ్మా, చక్కగా చదివితే బాగుంటాయి” అనేవారు తలొంచుకుని పుస్తకంలోకి చూస్తూ.

నాకేమో అలా చదవడం వచ్చేది కాదు సంగీతజ్ఞానం బొత్తిగా లేనందున. పాపం ఆయన ఎంత బాధ పడ్డారో నాలాటి “చేలా” దొరికినందుకు.  ఇప్పుడు అమెరికాలో తెలుగు పాఠాలు చెప్తుంటే  ఆయనబాధ ఇతోధికంగా అర్థమవుతోంది.

కంప్యూటరులో తెలుగు రాయడం వచ్చేక ఇప్పుడా బాధ వున్నట్టులేదు. ‘బాధ’లో ఒత్తు ‘బా’కా ‘దా’కా అని ఆలోచించి రాసేవాళ్లు తగ్గిపోతున్నారనుకుంటే నాకు చాలా బాధేస్తుంది సుమండీ. నాకు తెలీకడుగుతానూ, శ్రీకంఠం పేరుగలవాడు శ్రీకంటం అని రాసుకోగా చూశారా ఎవరైనా? బ్రహ్మానందంగారు బెమ్మానందం అని రాస్తే ఒప్పుకుంటారా? అంచేత, తెలుగు తెలుగులో రాయడమే కాక వొత్తులున్నచోట వొత్తులు పెట్టాలి అని నేను గట్టిగా ప్రతిపాదిస్తున్నాను. అంతేకాదు వేరొక చోట పెట్టరాదు అని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఉదాహరణకి అస్తి అంటే ఉంది అని అర్థం. ఆస్తి అంటే డబ్బూ, దస్కం, అస్థికలు అంటే ఎముకలు. ఆస్థికలు అన్న మాట లేదు.

సంస్కృతంలో చాలా నియమాలున్నందున అనుకుంటాను నాకు భాష రాకపోయినా, ఆ పట్టింపులు ఒంట బట్టేశాయి. స్పష్టంగా మాటాడ్డం, ఒత్తులూ పొల్లులూ పెట్టవలసినచోట పెట్టడం – నేను జాగ్రత్తగా చూసుకుంటాను.

ఇంతకీ ఇదంతా ఎందుకు మొదలు పెట్టేనంటే, నాలుగురోజులకిందట నెటిజన్ నాటపామీద ఓ మాట రాసేరు. అందులో ఆయన నా “కథామాలతీయం”లో ప్రస్తావించిన శ్చ కీ ఛ్చ కీ తేడా లాటి విషయాలు చెప్పమని అడిగేరు. ఆ దృష్టి నాకెలా వచ్చిందో ఓ ముక్క రాద్దాం అనిపించి మొదలెట్టేనన్నమాట.

నారాతలు చదువుతుంటే ఎదురుగా కూర్చుని మాటాడుతున్నట్టే వుంటుంది అంటున్నారు చాలామంది. దానికి కారణాలేమిటో తెలుసా? మనది మౌఖిక సాహిత్యం. మనం ముఖతః విని తెలుసుకునేదే ఎక్కువ. చదువురానివాళ్లు అంటూ నిజంగా లేరు మనకి. బడికెళ్లి అక్షరాలు దిద్దుకోకున్నా విశేషమయిన తెలివితేటలు చూపగలవారు మనచుట్టూ నిత్యం కనిపిస్తారు.

రాయడం వచ్చేక కూడా మనకథల్లో ఆ మౌఖిక సాహిత్యం పోకడలు పూర్తిగా నశించిపోలేదు. ఆ ఛాయలు మనకథల్లో కనిపిస్తాయి. నాకథలు ఎదురుగా వుండి చెప్తున్నట్టు వుండడానికి కారణం – రాస్తున్నప్పుడు ఆమాటలు నాతలలో ఒకటికి పదిమార్లు పలుక్కుని ఎలా వినిపిస్తున్నాయో చూసుకుంటాను. ఒకే వాక్యం మళ్లీ మళ్లీ చదువుకుని ఎలా “వినిపిస్తోందో” పరీక్షించుకుంటాను.

రెండో కారణం, మాటల ఎంపిక కూడా. ఏం చెప్తున్నాం అన్నది కేవలం నిఘంటువులో వెతుక్కోడం మాత్రమే కాదు కదా. సందర్భం, పాత్ర, కాలం – ఇవన్నీ కూడా ఏమాట ఎక్కడ నప్పుతుందో చూడ్డానికి అవసరమే.

గొల్లపూడి శ్రీనివాస్‌గురించి తీసిన విడియో చూశాను సౌమ్య బ్లాగులో చూసి. శ్రీనివాస్ ఉదంతం హృదయవిదారకం. అతనిపేరుమీద డైరెక్టర్లకి ప్రోత్సాహిస్తూ పురస్కారం ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం. విడియో హృదయాన్ని తాకేలా చేశారు. రెండుసార్లు చూశాను. రెండోసారి చూసింతరవాత కొంత అలవాటు పడ్డాను ఆభాషకి కానీ మొదటిసారి నాకు అందులో ఇంగ్లీషు బాధ కలిగించింది. పేరుకే తెలుగు విడియో కానీ అది ఏ ఇంగ్లీషువాడు చూసినా – ఇండియనింగ్లీషు తెలిసినవాడు – తేలిగ్గా అర్థమయిపోతుందేమో అనిపించింది.

నేను విషయాన్ని పక్కదారి పట్టించేను అని కోప్పడకండి. నాకు తెలుగంటే వున్న అభిమానం మూలంగా ఇది నన్ను మాత్రమే బాధించిందేమో. నేను విడియోనీ, అక్కడ ఆవిష్కరించిన ప్రధానాంశాన్నీ కించపరచడంలేదు. అది నాఉద్దేశం కాదు. ఈ విడియో చూసేవారందరూ ఇంగ్లీషుకి అలవాటు పడ్డవారే కనక, ఈసంగతి వారికి తట్టలేదు అని కూడా అనుకుంటున్నాను.

“ఈరోజుల్లో అందరూ అలాగే మాటాడుతున్నారు, శ్రీనివాస్ కూడా అలాగే మాటాడేవాడు” అనుకోవచ్చు కానీ, సాహిత్యానికీ వాస్తవానికీ అదే తేడా. వాస్తవంలో మీరు మీ ఇంట్లోనో, స్నేహితులతోనో మాటాడుతున్నప్పుడు ఇలాగే మాటాడతారేమో. కానీ, తెలుగుకథకి కథ చెప్పడంతో పాటు మరొక ధ్యేయం, ప్రయోజనం కూడా వుంది. అది భాష. నిజానికి మేం ఇలాగే మాటాడతాం అనేవారు కూడా ఇంట్లో పెద్దలముందూ, హాస్టల్లో స్నేహితులతో మాటాడుతున్నప్పుడూ ఒకే భాష వాడరు కదా.

ఇంగ్లీషు పదాలవాడకాన్ని తెలుగు భాషాభివృద్ధి సూచకం అంటున్నారు. దానికి వుదాహరణగా బస్సు, రైలు, లైటు వాడడంలేదా అంటున్నారు. నిజమే. నేను కూడా కొన్నిపదాలు వాడతాను.

రావిశాస్త్రి ఇంగ్లీషు పదాలు వ్యంగ్యానికో హాస్యానికో వాడతారు. నేను కూడా అంతే. నా “విషప్పురుగు” కథలో ఇంగ్లీషు మేష్టరు తెలుగులోనూ, తెలుగు మేష్టరు ఇంగ్లీషులోనూ తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. అది ఆనాడు భాషతీరు మీద నావ్యాఖ్య. ఇంగ్లీషువాడు పాలించేరోజుల్లో పాలకులభాష మాటాడడం గొప్ప. అప్పట్లో భమిడిపాటి కామేశ్వరరావుగారు రాసిన “రెండో భాషగా తెలుగు”మీద కథ ఇంగ్లీషువాడి హయాంలో ఇంగ్లీషు చదువుకున్న తెలుగువాడు పెట్టిన ఇంగ్లీషుబళ్లో తెలుగు మాష్టారి స్థానం చదివితే తెలుస్తుంది నాకథలో వ్యంగ్యం.

నా రెండో కారణం – మనసంస్కృతిలో లేని అలవాట్లు మాటాడుతున్నపుడు. దానికి మంచి వుదాహరణ థాంక్స్. తెలుగు సంస్కృతిలో ఇది లేదు. “సంతోషం నాయనా”, “అమ్మకడుపు చల్లగా వెయ్యేళ్లు వర్థిల్లు తల్లీ”, “నీ ఋణం తీర్చుకోలేను” “దండాలు బాబూ” – ఇలా పలువిధాల కృతజ్ఞతలు తెలియజేసుకోడం మన సాంప్రదాయం. ఈ ధన్యవాదాలూ, కృతజ్ఞతలూ, నెనరులూ, పాశ్చాత్యసంప్రదాయంలోనివి. అంచేత నాకు ఇప్పటికీ, థాంక్సుతో సరిపెట్టేయడమే నయం అనిపిస్తుంది.

కథ చెప్పడం ఒకరకంగా ఇంట్లో పెద్దలముందు మాటాడడంలాటిదే. పాఠకులు ఎవరో మీకు తెలీదు కనక కొత్తవారితోనో, పెద్దవారితోనో మాటాడుతున్నట్టే వుండాలి కథనం. నేను ఎదురుగా వుండి చెపుతున్నట్టే రాసినా, సభామర్యాదలు పాటించడం అందుకే.

ఇక్కడే మరోమాట కూడా చెప్పాలి. నిన్న మహేష్ కుమార్ టపా చూశాను. అక్కడ ఒక వ్యాఖ్య “బ్లాగులకి తెలుగు పత్రికల విలువ ఎన్నటికీ రాద”న్నది. అది నేను అంగీకరించను. ఈనాటి తెలుగుబ్లాగుల్లో కథలూ, కవితలూ, వ్యాసాలూ ఏ సాహిత్యపత్రికకీ తీసిపోని స్థాయిలో వుంటున్నాయి. రాధిక, నిషిగంధ, బుల్లోజుబాబా, స్వాతికుమారి కవితలూ, తెలుగుపద్యం బ్లాగులో తెలుగుపద్యాల విశ్లేషణా, చదువరి, తెలుగు ‘వాడి’ని బ్లాగుల్లో రాజకీయాలూ, నెటిజన్ బ్లాగులో వివిధ అంశాలూ – ఇలా విస్తృతంగా సాహిత్య కృషి జరుగుతోంది. సౌమ్య బ్లాగులో పరిచయం చేస్తున్న విశ్వసాహిత్యం అసంఖ్యాకంగా పాఠకులనాకట్టుకుని, పుస్తకం.నెట్ అన్న ప్రత్యేక సైటు పుట్టడానికి కారణమయింది. తెలుగులో కేవలం పుస్తకాలనీ, రచయితలనీ పరిచయం చేయడానికి అంకితమయిన ఏకైక సైటు ఇది. నిజానికి ప్రింటు పత్రిక ఇలాటిది లేదు. నాకు పేరు గుర్తు లేదు కానీ 20 శతాబ్దం పూర్వార్థంలో ఏదో ఒక పత్రిక వుండాలి ఇలా సాహిత్య చర్చలు చెయ్యడానికి మాత్రమే అంకితమయినది. రెంటాల కల్పన ఈమధ్య అట్టే రాయడంలేదు కానీ తన బ్లాగు కూడా మంచి సాహిత్య పత్రిక కోవకే చెందుతుంది.

ఒట్టి బ్లాగు అన్నపదం అధిగమించి, సాహిత్యాన్ని అందిస్తున్న బ్లాగులు చాలా వున్నాయి. బహుశా మనం బ్లాగు అన్న పదాన్ని వదిలేసి, ఇక్కడ సృష్టిస్తున్న సాహిత్యానికి అనుగుణంగా మరో పదం సృష్టించి వాడుకలోకి తెస్తే బాగుంటుందేమో.

ఒత్తులూ, దీర్ఘాలూ మర్చిపోకండేం!

000

(15 ఏప్రిల్ 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

29 thoughts on “ఊసుపోక – ఒత్తులేవీ…”

 1. Thanks,లలితా :). మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నందుకు. మీరన్నట్టు కొన్ని సమయాల్లో సంతోషం బాగున్నా, చాలా చోట్ల థాంక్సే థాంక్స్ కి తగుననిపిస్తుంది.

  మెచ్చుకోండి

 2. thanks కి సమానంగా, “సంతోషం నాయనా” – చాలా బాగా అనిపించింది. ఎవరైనా చెప్తారని ఎదురు చూసేదాన్ని. అప్పట్లో “నెనర్లు” అని వాడేదాన్ని. పిల్లలకి thanks కి తెలుగులోనూ ఒక పదం ఉందని చెప్పాలనిపించేది. కానీ అది తృప్తినివ్వలేదు. మీరు చెప్పినట్టు ఎన్నో రకాల వ్యక్తీకరణలున్నాయి సహాయం అందుకున్నందుకు సంతోషాన్నీ, కృతజ్ఞతనీ, అంతకు మించిన భావాలనీ, చిన్న పిల్లలు చేసిన సాయాలకి దీవెనలనీ అందించడం వంటి అలవాట్లు మన భాషకీ, సం స్కృతికీ సహజంగానే అబ్బిన సుగుణాలు. Thanks అనే ఒక మాటతో సరిపెట్టెయ్యడం వాటికి చాలదు. అందువల్ల Thanks చెప్పదల్చుకున్నపుడు తెలుగులోనూ అదే సరిపోతుందనే మీ మాటని ఒప్పుకోవాలి.

  మెచ్చుకోండి

 3. బ్రహ్మానందంగారూ, నా పొరపాటే. మిమ్మల్ని పేరుతో సంబోధించడానికి కారణం మీరు ఇకమీదట వ్యాఖ్యలు రాయను అన్నందుకు అలా మానేయకండి అని చెప్పబోయాను, మన్నించండి. సాటి రచయితగా మీ అభిప్రాయాలు తప్పక తెలియజేస్తూ వుండండి.

  మొత్తంమీద కొన్ని వ్యాఖ్యలు నాటపాకి మించి మరోదారి పట్టినందున,ఆ వ్యాఖ్యలు తొలగిస్తున్నాను. కొత్తపాళీ తమ బ్లాగులో ఆయా వ్యాఖ్యాతలని ఆహ్వానించి బ్లాగులలో సాహిత్యంమీద చర్చ కొనసాగిస్తున్నందుకు నాకు సంతోషంగా వుంది. అది వేరే అంశం అని నాకు నమ్మకం కలిగింది. కొత్తపాళీగారికి కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ,

  నేను రాసిన అభిప్రాయం ఒకటికి రెండు సార్లు చదువుకున్నా నా పదజాలం అంత కర్కశంగా అనిపించిందాని ఆశ్చర్యపోయాను. నేను వాడిన పదాల్లో “దరిద్రం” అన్నదొక్కటే కాస్త కటువుగా అన్న మాట. నేనేదో రాస్తే, నాపై వ్యక్తిగతంగా రాసిన వ్యాఖ్యల్లో మీకు మృదుత్వ లోపం కనిపించలేదా అని మరోసారి ఆశ్చర్యపోయాను.

  అయినా, పెద్దవారు చెప్పారు కదా, ఇటుపై మృదువుగా ఉండడానికి ప్రయత్నిస్తాను.

  మీకు తెలియనిదేముంది?
  విమర్శ ఎంత మృదువుగా చెప్పినా ఓ పట్టాన మింగుడుపడదు. పొగడ్తలంత సులభంగా చటుక్కున మనసుకింకదు.
  మీరూ రచయిత్రులే కదా? నాకంటే మీకే ఎక్కువ అనుభవం ఉంటుందని అనుకుంటున్నాను.

  ఈ చర్చలో వచ్చిన అన్ని విషయాలపై ఉదాహరణలతో సహా చూపించగలను. మళ్ళా అలా రాయడం వలన ఒరిగేదేమీ లేదనుకొని ఊరుకున్నాను. ఈలోగా ఇక్కడితో ఈ చర్చకి “ది ఎండ్” అని బోర్డు పెట్టేసారు. అందుకనే రాయలేదు. ఒక అభిప్రాయం చెప్పి పారిపోయే మనస్తత్వం కాదు నాది.

  జవాబిచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు

  సాయి బ్రహ్మానందం

  మెచ్చుకోండి

 5. సరేనండీ. ధన్యవాదాలు. మళ్లీ చూస్తాను.
  అతుక్కున్న పదాలు – నాకు ఇప్పుడు అర్థం అయింది మీసూచన. మామూలుగా నాప్రాణం అన్నప్పుడు నా అన్నది విశేషణం కదా. విశేషణాలకీ సర్వనామాలకి మధ్య విరామం ఇవ్వడం వ్యాకరణం దృష్ట్యా సరి కాదనుకుంటాను. కానీ స్క్రీనుమీద మరీ గందరగోళంగా కనిపించినప్పుడు నేను విడదీస్తాను.

  మెచ్చుకోండి

 6. మరోసారి చూసుకోండి మాలతి గారు 🙂 హాస్యానికి రాసిన వాటిని గురించి కాదు నేనంటుంది.

  అచ్చుతప్పులు:
  >> “వొత్తూలూ, దీర్ఘాలూ తప్పనిసరిగా”, “యస్సెల్నీలో సంస్కతం తీసుకున్నాను”, etc

  అతుక్కున్న పదాలు:
  >> “నాప్రాణం”, “నాబ్లాగులో”,”ఎవరివీలుని”, “అభిమానభాషగా”, “అతనిపేరుమీద”, etc.

  మెచ్చుకోండి

 7. పూర్ణిమా, సూర్యుడు గారూ – ధన్యవాదాలు.
  అబ్రకదబ్ర,, నాటపాలో మళ్లీ చూసుకున్నానండీ. నాకు బోలెడు కనిపించలేదు. ఒకటి, రెండుచోట్ల హాస్యానికి రాసేను ప్రాచుర్యంలో వున్న స్పెల్లింగులు. ధన్యవాదాలు..

  మెచ్చుకోండి

 8. మీ విమర్శ సూటిగా, చక్కగా ఉంది కానీ మీరూ అదే విమర్శకి గురికాకుండా జాగ్రత్త పడాలి కదా 🙂 అచ్చుతప్పులో మరేవో కానీ మీ ఈ టపాలోనూ అవి బోలెడు దొర్లాయి – పంటి కింద రాళ్లలా. ముఖ్యంగా – అనవసరంగా అతుక్కు పోయిన పదాలెన్నో. గమనించగలరు.

  రంధ్రాన్వేషణలా ఉందా? వత్తులు, పొల్లుల మీదా అచ్చుతప్పుల మీదా టపా రాయటం పులి మీద స్వారీ, కత్తి మీద సాము .. వగైరా వగైరా అని చాటి చెప్పటమే నా ఉద్దేశం. అజాగ్రత్తగా ఉంటే అభాసైపోతాం.

  మెచ్చుకోండి

 9. మొదటి వాక్యంలోనే తప్పు దొర్లింది అని అర్ధమై 🙂

  ఈ వ(ఒ)త్తులతో నాకూ ఇబ్బందిగానే ఉంటోంది 😦

  నమస్కారములతో,
  ~సూర్యుడు 🙂

  మెచ్చుకోండి

 10. మీ వ్యాసం చాలా బాగుందండి. ఈ వత్తులతో నాకూ చాలా ఇబ్బందిగానే ఉంది 😦

  అలాగే శ, స లకి, క ఖ లకి మధ్య తేడాలు తెలీక చాలా కష్టంగా ఉంటోంది 😦

  ఉదాహరణకి, ఆసక్తి – ఆశక్తి (ఇప్పుడు సరి ఐన వాడుక తెలిసిందనుకోండి :))

  అలాగే లెఖ్కలు – లెక్కలు (ఇప్పటికీ కొద్దిగా అనుమానమే)

  ఆ మధ్య ఒక చర్చలో పరుచూరి శ్రీనివాస్ గారు చెప్పారు, శాకాహారము – శాఖాహారము మధ్య తేడా.

  చదువుకుంటూ వెళ్లినప్పుడు పెద్దగా గమనించము కదా, చదివినప్పుడు బాగానే అర్ధమైపోతుంది, వ్రాసేటప్పటికి ఏది వ్రాయాలో తెలీక తికమకగా ఉంటుంది 🙂

  నమస్కారములతో,
  ~సూర్యుడు 🙂

  మెచ్చుకోండి

 11. వ్యాఖ్యలు చూసి బెదిరి వెళ్ళకుండా.. మీ టపా చదివి మంచి పని చేశాను! కొన్ని మంచి విషయాలు చెప్పారు.. థాంక్స్! 🙂

  మెచ్చుకోండి

 12. మెహెర్, మీ ఆవేశంతోనే మీరు పూర్తిగా చదవకుండా వ్యాఖ్యలు చేసేరు.
  మెహర్, మహేష్ – మీ అభిప్రాయాలు తెలియజేయడం బాగుంది కానీ, మీ చర్చలకి ఇది ప్లాట్ ఫారం చేయలేను.
  నెటిజన్, కొత్తపాళీ మీసలహాకి ధన్యవాదాలు.
  ఇంతటితో ఈ చర్చ సమాప్తం.
  నెటిజన్, పుస్తకం.నెట్ వారు తమ పాలసీ పరిథిలో మీరు సూచించిన వ్యాసాలు ఇమడవని అంటున్నారు. నాతూలికలోనే ప్రారంబిస్తాను.
  ప్రస్తుతానికి moderation పెట్టడం లేదు. ప్రచురణ అయినతరవాత డిలిట్ చెయ్యడానికి వెనుకాడను. అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఎలాటివి నేను అంగీకరిచడం లేదో అని 🙂

  మెచ్చుకోండి

 13. థాంక్స్, మేడమ్..;-)

  >>”నాబ్లాగులో ఇంత ఆవేశంతో చర్చ జరగడం ఇదే మొదలు అనుకుంటాను.”
  ఒకొక్క సారి వీరి ఆవేశాలు విపరీతమైన అర్ధాలకి తావిచ్చి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కాబట్టి దయచేసి, moderation పెట్టుకుని, నిర్దాక్షణ్యంగా అటువంటి వ్యాఖ్యలని junk చెయ్యండి. మీరు అలా చెయ్యడం వల్ల ఈ బ్లాగు ఆరోగ్యకరం గా పది కాలాల బాటు బతుకుతుంది.

  ఇంకొక విషయం:
  ఇంతకి పుస్తకం.నెట్ వారు ఫొరం ని మొదలుపెడుతున్నారా?

  మెచ్చుకోండి

 14. మాలతి గారూ,

  ఆవేశం నాకు పుట్టుకతో వచ్చిన అవకరం. మీ అనుమతి లేకుండా మీ బ్లాగులో రచ్చ చేసినందుకు క్షమించండి. సారస్వతానికి నాలో చాలా ఉన్నత స్థానం ఉంది. దాన్ని ఎవరు క్రిందకి దిగలాగజూసినా స్పందన కాస్త తీవ్రంగానే వుంటుంది. మహేష్‌ గారు ఏదో అస్తిత్వ ఉద్యమాలంటూ సంపాదకులపై దండెత్తడం చూసి, అన్నింటికన్నా పాఠకుడి అనుభూతి ముఖ్యమని చెప్పడానికి ప్రయత్నించానంతే. బ్లాగుల్లో నేనూ చాలా మంచి రచనలు చూసాను. ఉదాహరణకి మొన్ననే చదివిన స్వాతి గారి కవిత “ప్రేరణ”. అయితే ఇవన్నీ అరుదైన మినహాయింపులే. అదుపు లేక పోవడం ఈ మాధ్యమపు ముఖ్య లోపం.

  సరే, వదిలేయండి. చర్చకు చోటిచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 15. మంచి చర్చ వచ్చింది. నాబ్లాగులో ఇంత ఆవేశంతో చర్చ జరగడం ఇదే మొదలు అనుకుంటాను. మీ మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు. నేను అన్ని బ్లాగులూ చదవలేదు. చదివిన కొన్నిబ్లాగులలో కొన్ని రచనలు చూసినప్పుడు అవి ఈరోజుల్లో పత్రికలలో వస్తున్న రచనలకి తీసుపోవు, బ్లాగులో రాసేరు కనక ఆమోదయోగ్యం కాదు అన్న వాదన సరయినది కాదు అని చెప్పేను.
  విడియో – మహేష్ గారూ, నా పొరపాటు చూపినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే దిద్దుకుంటాను.
  రాజకీయాలగురించి రాసినవి జర్నలిజం. సాహిత్యం అంటే మొత్తం రాతల్లో వున్నదంతా అన్న విస్తృతార్థంలో అన్నాను. తప్పయితే క్షమించగలరు.
  పుస్తకం.నెట్ బ్లాగు అనలేదు. ఒక బ్లాగులో పుస్తకాలు పరిచయం చేస్తూ వచ్చిన బ్లాగరుమూలంగా పుస్తకం.నెట్ పుట్టడానికి కారణమయింది. అన్నాను.
  మిగతా అభ్యంతరాలన్నీ నోటెడ్.

  మెచ్చుకోండి

 16. @ మాలతిగారు,

  “పుస్తకం.నెట్” బ్లాగు కాదు. నాకు తెలిసినంతవరకూ అది పాఠకులు తమ పుస్తకానుభవాల్ని పంచుకోవడానికి కలిసి ఏర్పరుచుకున్న సైటు. అయినా అది ఊడబొడుస్తున్నదేమీ కనిపించడం లేదు నాకైతే. అక్కడా పుస్తకాలపై ugly critical evaluation మాత్రమే కనిపిస్తోంది — అరుదైన సందర్భాల్ని మినహాయిస్తే.

  మెచ్చుకోండి

 17. మంచి ఆలోచనలను రేకెత్తించిన వ్యాసం.

  అక్షరదోషాలను ఏ రచయితా తప్పించుకోలేడని నా అభిప్రాయం. శ్రీశ్రీ అంతటి ఆయనే తాను కొన్ని సంస్కృత పదాలను తప్పుగా వ్రాసాననీ, అది ఆయన అజ్ఞానానికి నిదర్శనమనీ ఒప్పుకొని అలానే ఉంచేసాట్ట. అలాంటప్పుడు ఔత్సాహిక రచయితలు చేసే తప్పులు క్షమార్హమైనవే. బ్లాగులకు పత్రికలకు ఉన్నతేడా ఏమిటంటే ఇక్కడ రచయితే ఎడిటర్, పీర్ కూడా. అందువల్ల పెద్దలు “పెద్ద” మనసుచేసుకొని చెప్పాలి తప్ప వాటి వల్ల జీర్ణం కావటం లేదు అని తృణీకరించటం భావ్యమా?

  నా మట్టుకు నేను ఈ బ్లాగులోకంలోకి వచ్చాకా ఎన్నో అక్షర దోషాల్ని సవరించుకోగలిగాను. కొత్త పాళీ, భైరవభట్ల గార్లు ప్రేమగా నాబ్లాగులో ఎన్నో దోషాల్ని సవరించారు. (భంధం, శ్మశానం, శృతి వంటివి). వారికి సదా కృతజ్ఞుడనే.

  ఇక్కడి సాహిత్యం యొక్క విలువను కాలమే నిర్ణయిస్తుందనేది అక్షరసత్యం. అందులో ఏ సందేహమూ లేదు.
  ప్రింట్ మీడియాలో ఉన్నన్ని ఇజాలు, రాజకీయాలు, గుంపులు ఇక్కడ లేకపోవటం అభిలషించదగ్గ విషయం కాదా?

  సాధారణంగా రచనల్లో వచ్చే అక్షరదోషాలను గూర్చి మంచి వ్యాసమో, లేక వ్యాసపరంపరో మీ బోటి పెద్దలు వ్రాయాలి. దానివల్ల ఔత్సాహికులకు ఎంతో ఉపయోగకరంగానూ, మంచి రిఫరెన్స్ గానూ ఉంటుంది. దీనిపై విజ్ఞులైన మాలతి గారు, కొత్తపాళీగారు , భైరవభట్లగారు, సాయి గారు ఆలోచించవలసిన విషయం.
  అలాంటి తప్పులు ఎవరైనా బ్లాగుల్లో చేసినట్లయితే ఆ వ్యాసాన్ని లింక్ ఇచ్చి చదువుకోమంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

  ఈనాడు పత్రికవారు, వారి విలేఖరులకు ఇలాంటి దోషాలపై, కొత్తపదప్రయోగాలపై, (అంటే ఏ ఏ పదాలకు బదులు ఏ ఏ తెలుగు పదాలను ఉపయోగించాలి అనే అంశాలపై) చానాళ్ల క్రితం ఒక పుస్తకం సర్కులేట్ చేసినట్లు గుర్తు. ఆ తరువాత ప్రయత్నించినా అది లభించలేదు.
  pl. somebody do something constructively like malathi garu,

  thankyou sir
  pl. excuse my tone of expression.

  bollojubaba

  మెచ్చుకోండి

 18. @మాలతి గారు: మీ టపా చదివిన తరువాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వీడియో చూశాను. గొల్లపూడి పాత్ర వేసింది నటుడు నాజర్. ఇక ఆ వీడియోలో ఇంగ్లీషు ఉపయోగం అంటారా, ఆ పాత్రలు/మనుషులు ఎగువమధ్యతరగతి వాళ్ళు, ఉండేది మద్రాసు/చెన్నై , చదివింది ఇంగ్లీషు మీడియం చదువులు కాబట్టి ఇంగ్లీషు,తమిళం,తెలుగు కలగలిపి మాట్లాడటం నాకైతే “సహజంగా” అనిపించింది.

  మెచ్చుకోండి

 19. ఇందు మూలంగా తెలియచేయందేమనగా,
  ఇంగ్లీషులో మేము పొడిచేసి వ్రాయటానికీ, స్పెల్లింగ్ మిస్టేకులు లేకుండా ఆంగ్లంలో వ్రాయటానికీ మా తెలివి తెటలు కన్నా, సాంకేతిక సహాయమే ముఖ్యమైన కారణమని మదీయ భావన. అలాగే తెలుగులోకి కూడా స్పెల్లింగ్ చెక్కర్లు వచ్చినప్పుడు మెజార్టీవారు చక్కగా వ్రాస్తారు.

  బాధ , బాద, భాద — ఎలా పలికే వాళ్లు అలా వ్రాయవచ్చు అను బూదపాటి వారు అన్నట్టు గుర్తు.

  మెచ్చుకోండి

 20. కిరణ్, , శ్రీ,, పద్యలేఖినీ, – ధన్యవాదాలు.
  ఉమాశంకర్, – అచ్చుతప్పుల నుంచి , సాహిత్యవిలువలవరకూ అన్నిటినీ వడపోసి అచ్చేసి – నిజంగా అంటారా. పోన్లెండి సాహిత్య పత్రికలు అనక, ప్రాచుర్యంలో వున్న పత్రికలు అంటాను. అసలు బాధ కొత్తగా వస్తున్న యువతరాన్ని అంత త్వరగా అంగీకరించలేకపోవడం. ఇది కూడా మన సాంస్కృతిక లక్షణమే.
  కొత్తపాళీ – గురువుల ఆశిస్సులు అందరికీ లభించేయన్నమాట. సంతోషం. 🙂
  అరుణ, సంచారి, – మీఇద్దరి వ్యాఖ్యల మధ్య నేను హంతకురాలినేనా కావాలి, హత నేనా కావాలి 🙂

  మెచ్చుకోండి

 21. టపా అద్భుతం. తిరుగులేదు. ప్రత్యక్షర సత్యం. చివర్లో కత్తి ఒరలో చెయ్యిపెట్టారు, గీసుకుపోతుందేమో అని భయం వేస్తున్నది. 🙂 జాగ్రత్తండోయ్, ముందే పెద్ద యుద్ధానికి రెడీ అవండి.

  మెచ్చుకోండి

 22. ఈ టపా చదివిన వ్రత ఫల మేమనగా, చదివినవారందరూ జీవితాంతమూ బాధ, గాఢం ఇత్యాది పదాల్ని స్పెల్లింగు తప్పులు లేకుండా రాసుకుందురు గాక!

  మెచ్చుకోండి

 23. మాలతి గారూ,
  ఒత్తులూ, ధీర్ఘాలతో మొదలెట్టి, కథలెలా రాయాలో కూడా చూచాయగా చెప్పేసారు.. చాలా బావుంది. తెలుగు రాస్తున్నప్పుడు ఏదైనా పదం దగ్గర ఆగిపోతే, అది సాధారణ పదం అయినప్పుడు, ఎంత సిగ్గేస్తుందో? నా భాషనెక్కడో వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాననిపిస్తుంది.

  పత్రికలు అంటే అచ్చుతప్పుల నుంచి , సాహిత్యవిలువలవరకూ అన్నిటినీ వడపోసి అచ్చేసి అందిస్తారు కాబట్టి అలా అనిపించొచ్చు. అదే బ్లాగుల్లో అయితే వెతుక్కోవాలి, అన్నీ ఒక్కచోట ఉండవు. అదీతేడా అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s