ఊసుపోక – గల్పిక ముదిరితే కథ!

(ఎన్నెమ్మ కతలు 33).

నెటిజన్ రెండో ప్రశ్నకథకీ, గల్పికి తేడా ఏమిటీ అని అడిగి, మీ మాటల్లోనే చెప్పండని ఓ సుళువు చెప్పేరు. ఈ ఎన్నెమ్మకతల అసలు రహస్యం ఆయన పట్టీసినట్టున్నారు. మిగతావారికి మరోసారి మనవి చేసుకుంటున్నాను. ఇవి సాహిత్యవ్యాసాలు కావు. నేను సీరియస్‌గా రాసినవాటికే వ్యాసాలు అని పేరు పెడతాను. అందుకు భిన్నంగా

సుపోకకి రాస్తున్నవి హాస్యంగా, వ్యంగ్యంగా, తెలివితక్కువగా … రాసిన సగం సగం కల్పిత రాతలు. ఈకతల్లో నా అణాపరక బుర్రకి తట్టిన తలపులేవో కలబోసుకు రాసుకుంటాను.

మరి ఎవరైనా ఎక్కడెక్కడో చదివిన విషయాలూ, ఇంకా మరేవో గొప్ప గొప్ప మేథావుల దృక్కోణాలు ఇక్కడ వ్యాఖ్యలరూపంలో రాసేస్తే, చెప్పొద్దూ, నాకు మహ తికమక అయిపోతున్నాది. వీటిని సీరియస్‌గా తీసేసుకుని, ఆవేశపడిపోతూ వ్యాఖ్యానాలు చేసేయకండి. Fair is fair అంటే అదన్నమాట!

ఇంతకీ గల్పిక, స్కెచ్, కథ, కథానిక వీటికి ఖచ్చితంగా నేను నిర్వచనాలు ఇవ్వలేను, ఆదిని మనరాతలకి ఈ గల్పిక, స్కెచ్లాటి నామకరణాలు చేసింది కొడవటి కుటుంబరావుగారు అనుకుంటాను. ఆయన వ్యాసాల్లో ఇవి సవిస్తరంగా చర్చించారు. పోరంకి దక్షిణామూర్తిగారు కూడా మనకి కథ ఎప్పట్నించో వుందనీ, ఆఖ్యాయికా, కథా, ఖండకథా, కథానికా, పరికథా అని అయిదు రకాలు సంస్కృతగ్రంథాల్లో ప్రవచించేరనీ చెప్పేరు. (చూ. తూలిక.నెట్. Some reflections on Telugu short story). నా అల్పప్రాణానికి ఇవన్నీ academic exercises.

నాకు తోచింది ఏ రచయిత గానీ గల్పిక రాయనా, కథ రాయనా, అనుకుంటూ మొదలు పెట్టరు. ఒకరకంగా చాలా బ్లాగుల్లో వస్తున్న ఆలోచనలూ అనుభవాలూ గల్పికలూ, స్కెచ్చిలూ అనొచ్చు.

రచయిత ఏదో ఒక సంఘటనకో సన్నివేశానికో స్పందించి మొదలు పెడతారు. కలం పట్టిన శుభవేళ, కథా? కవితా? అన్న సంశయం రావచ్చు. లేదా కథా? నవలా? అన్న సంశయం కూడా రావచ్చు. వంకాయలో మెంతికారం ఎంత కూరుదాం అనుకున్నట్టుగానే ఎంత సరుకు ఇముడ్చుదాం ఈరాతలో అని రచయిత తర్కించుకున్నప్పుడు కథా? నవలా? అన్న ప్రశ్న వస్తుంది. కానీ, గల్పికా?, కథా? కథానికా? అన్న ప్రశ్న రాదు, నామటుకు నేను చిన్నకథగా నాలుగైదు పేజీల్లో అయిపోతుందనుకుంటూ మొదలెట్టి, పధ్నాలుగు పేజీలవరకూ రాసుకుంటూ పోయినవి వున్నాయి. నా ఉభయతారకంలో పెద్ద కథేం లేదు కనక స్కెచ్ అనే అనాలి.

నేను తొలిరోజుల్లో ఏవో కథలు రాసి చందమామ, బాల, బాలమిత్రలాటి పిల్లలపత్రికలకి పంపించాను. ఆతరవాత అందరూ చదువుకునే పత్రికలలో తొలిసారిగా తెలుగుస్వతంత్రకి పంపేను, ఏం తోస్తే అదీ, ఎంత రాయాలనిపిస్తే అంతే రాసి.

తెలుగుస్వతంత్ర సంపాదకులే నా తొలిరచనలకి స్కెచ్ అనో గల్పిక అనో పేరు పెట్టేరు. ఇప్పుడు నాదగ్గర వున్న కాయితాలు తీసి చూస్తే, బొత్తిగా అరపేజీ (అసలు స్వతంత్రే అరపేజి సైజులో వుండేది అప్పట్లో) అందులో నాకథ అరపేజీ! ఆ తరవాత నేను రెండు పేజీలు రాసినప్పుడు ఆ సంపాదకులే కథానిక అని దీవించేరు!

ఇప్పుడు నెటిజన్ అడిగారు కదా అని పరిశోధన మొదలుపెట్టి, నాదగ్గరున్నవి వరసగా బల్లమీద పరిచి, పరీక్షించి చూస్తే, మొదట సైజునిబట్టి కాబోలు అనిపించింది. మళ్లీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, ఏం చెపుతున్నాం అన్నది కూడా గమనించవలసిన విషయమే అనిపించింది. ఎందుకంటే అరపేజీలో కంటే రెండుపేజీల్లో చెప్పేది ఎక్కువ వుంటుంది కదా తప్పనిసరిగా. (కాయితాలు నింపడం అని కూడా అనొచ్చు ఈ రచనావిశేషాన్ని!)

నిజానికి ఏ ఇద్దరు మాటాడుకోడం మొదలు పెట్టినా, స్కెచ్చిలూ గల్పికలూ కోకొల్లలుగా దొర్లుతాయి. అవునా, కాదా మీరే చెప్పండి. మీరు మరొకరితో మాటాడినప్పుడు ఏం మాటాడుకుంటారు? ఆరోజు జరిగిన సంగతులు, చూసిన సంగతులే కదా. కూరలో ఉప్పెక్కువయింది, బజారులో బస్సాయిగిపోయింది. ఇవాళెంచేతో ఉత్తరాలవాడింకా రాలేదు … ఇలాగే కదా వుంటాయి ఆకబుర్లు. స్కెచ్, గల్పిక అలాటివే. ఏదో ఒక చిన్నవిషయం, అంతే. వాటికి మామూలుగా విజ్ఞులు కథకి కావాలని చెప్పే తలా తోకా వుండవు. అదరగొట్టే సంఘర్షణ కూడా వుండకపోవచ్చు. ఈరోజుల్లో వచ్చే కార్డుకథలూ, కాలంకథలూ అలాటివే.

గల్పిక సాగదీస్తే కథానికో కథో అవుతుంది అనను కానీ, సాగదీసి కథ చెయ్యొచ్చు అని మాత్రం చెప్పగలను. ఉదాహరణకి ఇది చూడండి.

నేను రోజు వాక్కెళ్తానని చెప్పేను కదా. ఒకరోజు అలా వెళ్తుంటే, ఒక ఇంట్లోంచి ఒక చిన్నమ్మాయి పరుగెత్తుకుంటూ నాదగ్గరికి వచ్చింది ఓ చిన్ననోటుబుక్కూ కలం పుచ్చుకుని. అమెరికనే, తొమ్మిదో పదో వుండొచ్చు వయసు. నావేపే వస్తోంది కనక నేను ఆగేను. తను దగ్గరగా వచ్చి,నోట్ బుక్కూ, కలం అందిస్తూ, సంతకం చెయ్యమని అడిగింది. నేను చిన్నగా నవ్వి, ఏం. ఇది నీ స్కూల్ ప్రోజక్టా? అని అడిగేను. కాదు. వూరికే అంది. సరేనని, నవ్వి, నాపేరు ఆపుస్తకంలో రాసి ఇచ్చేసేను. ఇప్పటికీ నేను ఆయింటిదగ్గరికి రాగానే ఓమారు తలెత్తి చూస్తాను.

ఇది నిజంగానే జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పిన కథలో ఆ పిల్లెవరూ, ఎందుకు నా సంతకం అడిగింది, దాంతో ఏం చేస్తుంది లాటి వివరణలు లేవు. ఇది గల్పిక, స్కెచ్ కాకపోతే ఉత్త బ్లాగు!

ఇప్పుడు ఇంకొంచెం ఆలోచిద్దాం. ఆ అమ్మాయికి పేరు పెడదాం. సూజీ అనుకోండి. ( టైపు సుళువు కోసం). మొదట నేను రచయిత్రిని కనక నా ఆటోగ్రాఫ్ అడిగిందేమో అనుకుని కొంచెంసేపు ఆ ఆనందం అనుభవించేను. అది తెలివితక్కువ అని నాక్కూడా తెలుసులెండి. ఆ సూజీకి ఎలా తెలుస్తుంది నేను రచయిత్రిని అని, అందులోనూ తెలుగు రచయిత్రిని అని. అస్సలు లేదు ఆ ఆవకాశం, మరి నా సంతకం ఎందుకు అడిగింది? మ్. తెలీదు.

రెండో ఆలోచన అమెరికాలో సాధారణంగా పెద్దలు పిల్లలకి ఎడతెగకుండా చెప్తూంటారు కొత్తవాళ్లతో మాటాడకు, వాళ్లు పలకరిస్తే పలకకు, పిలిస్తే దగ్గరికెళ్లకు అంటూ. మరి ఈ సూజీ అంత ధైర్యంగా, తనకు తానుగా నాదగ్గరికెందుకొచ్చేసింది? ఎలా వచ్చేసింది? నా సంతకంతో ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే కల్పన మొదలు పెట్టాలి. దాంతో అది కథ అయిపోతుంది.

మూడు పైన నేను ఇది నీ స్కూలు ప్రోజెక్టా? అని అడిగేను కదా. ఎందుకంటే అమెరికాలో అయిదో క్లాసులోనే మొదలు పెడతారు రిసెర్చి. ఆస్థాయిలో ఏముంటాయి మీ వీధిలో ఎంతమంది నడుస్తున్నారో లెక్కపెట్టు, లేకపోతే వాళ్ల పేర్లు పోగుచెయ్యి అని కాక. అలా అనుకుని అడిగేనన్నమాట. ఇంతకీ ఆపిల్ల చెప్పనేలేదు. ఇవి కథలో వాతావరణం సృష్టించడానికి పనికొస్తాయి.

మళ్లీ కథకొద్దాం. పైన చెప్పిన ఉదంతం అయినతరవాత కొన్ని రోజులకి ఆ యింటిముందు ఫర్ సేల్ బోర్డు కనిపించింది (ఇది కూడా నిజంగా జరిగింది). అంటే వాళ్లు ఇల్లు మారుతున్నారన్నమాట. బహుశా నన్ను రోజూ చూస్తోందేమో, ఇల్లు మారిపోతే ఈ సీను వుండదని, ఏదో గుర్తు కావాలని నా సంతకం అడిగిందేమో అనుకున్నాను.

మరొక కోణం, మావూళ్లో భారతీయస్త్రీలు ఎక్కువే. చాలామంది బేబీసిట్ చేస్తుంటారు. ఒకవేళ సూజీ చిన్నతనంలో మనవాళ్లెవరైనా బేబీసిట్ చేసివుంటే, నాకు replacement పాత్ర అంటగడుతోందేమో. పైగా విదేశీయులందరూ ఒక్కలాగే కనిపించడం మామూలే.

ఇప్పుడు సూజీని ప్రొఫైలు చేద్దాం. సూజీ ఎలాటి పాత్ర అవడానికి అవకాశం వుంది? బెదురు లేకుండా నాదగ్గరికి వచ్చేసింది కనక భయంలేని పిల్ల అయివుండాలి. కుతూహలం వుండబట్టే నాసంతకం అడిగింది. నన్ను తమిళదాన్ని అనుకున్నవాళ్లున్నారు కానీ అమెరికన్ అని ఎవరూ అనుకోలేరు. ఇలా ఆలోచిస్తే, సూజీకి ఇతర జాతులంటే ఆసక్తి అనుకోవాలి. ఇక్కడికి సూజీ ఎలాటి వ్యక్తి అన్నసంగతి నిర్ణయమయింది.

కథ పూర్తి చెయ్యడానికి కావలసిన సరంజమా ఇప్పటికి సూజీ నాసంతకం తీసుకుని దాదాపు ఎనిమిదేళ్లవుతోంది. అంటే కాలేజీలో చేరే వయసు. కథకోసమే చిన్నప్పుడు తను సేకరించిన సంతకం జాగ్రత్తగా దాచుకుంది అనుకుందాం. తనస్నేహితులకి చూపించి ఆనాటికథ చెప్తూంటుంది. (గమనిక­. ఇక్కడ సూజీ చెప్పే కథ స్కెచ్ లేక గల్పిక మాత్రమే). ఆస్నేహితులలోఒకడు భారతీయుడు లేదా భారతీయనాగరికత అధ్యయనం చేసినవాడు. అతను మాలతి అన్న పేరు ఇండియాలో చాలా ప్రాంతాల్లో పెట్టుకుంటారు. నిడదవోలు అన్న ఇంటిపేరు మాత్రం తెలుగువారికే పరిమితం. అంచేత ఆవిడ (అనగా నేను) తెలుగుమనిషి అయివుండాలి అని చెప్తాడు. అప్పటికి సూజీకి కంప్యూటరు బాగా అలవాటయిపోయి వుంటుంది. అంచేత ఈ తెలుగెక్కడ మాటాడతారూ, వీరి కథా కమామీషూ ఏమిటి అని నిజంరిసెర్చి చేస్తుంది.

ఇక్కడ మనం కథ మరో మలుపు తిప్పొచ్చు. ఎలా అంటే, ఈసరికి సూజీ యూనివర్సిటీలో చేరింది. ఇక్కడ యూనివర్సిటీలో అందరూ రెండోభాషగా ఇంగ్లీషుకానిభాష చదవాలి. అంతకుముందే తెలుగుగురించి రిసెర్చి చేసివున్న సూజీకి తెలుగు తీసుకుందాం అని సరదా పుడుతుంది. మళ్లీ కంప్యూటరెక్కి ఎవరు చెప్తున్నారు అని చూస్తుంది. ఆశ్చర్యం! తనకి సుపరిచతమయిన పేరు. పరమానందంగా సైన్ చేసేస్తుంది నాకోర్సుకి. … ఇలా రాసుకుంటూ పోవచ్చు ఓపికున్నంత దూరం.

ఇంకా సూజీ తెలుగుఅబ్బాయిని డేట్ చేస్తున్నట్టు కూడా రాస్తే గొప్ప సంఘర్షణ సృష్టించొచ్చు. కథని నవలదాకా సాగదీయవచ్చు కూడాను.

నేను మరోమాట కూడా ఇక్కడే చెప్పాలి. నాకథలు ఎదురుగా కూర్చుని చెప్తున్నట్టు వుండడానికి కారణం వాక్యాలు మళ్లీ మళ్లీ చదువుకుని చూసుకుంటాను అన్నాను ముందు టపాలో. నిజానికి ఇది నాకు బ్లాగులోకంలో ప్రవేశించినతరవాతే వచ్చింది. అంచేత ఇది బ్లాగరులు పెట్టిన భిక్షే!

కథనంలో భాషగురించి, ఒత్తులూ, గుణింతాలే కాక ఇంకా చెప్పవలసింది చాలా వుంది. అది వచ్చేవారం.

(18 ఏప్రిల్ 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “ఊసుపోక – గల్పిక ముదిరితే కథ!”

 1. మెంతికాయ అన్నది ఊరగాయి కదా, గుత్తొంకాయలో కదా కారం కూరేది…
  వంటల గురించి తెలియదంటూనే ఇంత తేడా ఎలా కనిపెట్టారో పాఠకులు. మా ఇళ్లలో ఒక సామెత ఉంది. జపం విడిచి లొట్టల్లో పడ్డారని. 🙂 ఇది నాకు అలాగే అనిపించింది. మాలతిగారు కథా రచన, అనుభవాలు చెబుతూంటే ఈ ప్రశ్నలేమిటో! అయినా ఆవిడ రాసింది నాకు సబబుగానే అనిపించింది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మెంతిపెట్టి వంకాయ (బెండకాయ వంటివి కూడా) చేస్తారు. అందులో మెంతి పొడి, ఇతర పదార్థాలను కూరుతారు. దాని గురించి ఇతర ప్రాంతాల వారికి తెలియకపోవచ్చు. మాలతిగారికి తెలిసే రాసేరేమో అనుకున్నా. మరొక సామెత కూడా చెబుతాను. అయితే సాహిత్య విలువల గురించి చర్చ, లేదంటే ఇలాంటి సిల్లీ అనుమానాలు తప్ప, చెబుతున్న వారి హృదయం, చెప్పినదానిలోని సారం గ్రహించే ప్రయత్నం చెయ్యరెందుకో. దీన్నే అండకేశ న్యాయం అంటారనుకుంటాను. మాలతిగారూ, మీరు తెలుగేమీ మర్చిపోవడం లేదు. మనుషుల మీద కాల, పరిసరాల ప్రభావం కొంత ఉంటుందని అంగీకరించాలి కదా.

  మెచ్చుకోండి

 2. శిరీషాశ్రీ, గల్పిక అన్న పదం కుటుంబరావుగారే సృష్టించేరండీ. తరవాత గ తోనే స్థిరమయిపోయింది. మీకు ఈవ్యాసాలు నచ్చినందుకు సంతోషం.
  అరుణ రాసిన వ్యాఖ్య నా అభిప్రాయాలని చక్కగా స్పష్టం చేసింది. నేను తెలుగు మర్చిపోతున్నాననుకున్నాను కానీ, అరుణ చెప్పినట్టు మెంతికారం అన్నమాట నాకు విదితమే. గుత్తొంకాయ అనే రాయవలసింది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. సుజాతా, నీదే ఆలస్యం మరి. రాసెయ్ అర్జెంటుగా.
  నెటిజన్, ఖాదిర్ బాబు కథ చదువుతాను. ధన్యవాదాలు లింకుకి.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు,
  ఈ పాఠం చదివాక అర్జెంటుగా ఒక కథ రాయాలనిపిస్తోంది. కుటుంబరావు గారి గల్పికలు చదివినపుడు నేను కూడా “కథ కంటే బాగుందిగా! దీనికి గల్పిక అని పేరెందుకు పెట్టారా” అనుకునేదాన్ని!

  మెచ్చుకోండి

 5. అరుణా, నేను రాసుకుంటూ అన్నమాటకి బదులు అల్లుకుంటూ అనాల్సింది. కథ కనీసం అవుట్ లైను ముందు మనసులో వూహించుకుంటాను. కాగితంమీద కలంపెట్టి రాసేరోజుల్లో కథ పూర్తిగా వూహించుకునే రాసేవాళ్లం. ఇప్పుడు కంప్యూటరు సౌఖ్యంమూలంగా మార్పులూ చేర్పులూ చెయ్యడానికి వీలు. రాత్రిపూట కారు డ్రైవింగు కన్నా ముందు మనసులో రూపించుకోడమే సుళువు నాకు. మీకు నచ్చినందుకు సంతోషం.
  నెటిజన్, మీరు పెద్దలపుస్తకాలన్నీ చదివేసి, నన్ను మళ్లీ అడుగుతారేమీ అనుకున్నాను 2 నెంబరు వ్యాఖ్య చూసి. మళ్లీ 4 నెం. చూసి, ఓహో అనుకున్నాను. మీ అభిమానానికి సంతోషం. స్పందన విషయం కూడా త్వరలోనే ప్రస్తావిస్తాను.
  కొత్తపాళీ, మీదృష్టికి కూడా ఆనినందుకు నాకు ఉత్సాహం ఇనుమడించింది. ధన్యవాదాలండీ.

  మెచ్చుకోండి

 6. మీరు మంచి రచయిత్రే కాదు, మంచి ఉపాధ్యాయిని అని కూడా నిరూపించారు. సోదాహరణమైన మీ వివరణ చాలా ముచ్చటగానూ, విషయాన్ని స్పష్టంగా తెలియ చెప్పేది గానూ ఉంది.

  మెచ్చుకోండి

 7. మాలతిగారూ, ఇంత వరకూ నాది ఏకలవ్యశిష్యరికమే. నిన్న ఇల్లు తుడుస్తూ మధ్యలో కూలబడి నిజానికీ ఫెమినిజానికీ మధ్య చదవడం మొదలెట్టేను. ఈ టపాలో కథ ఎలా ముందుకు నడపాలో బ్లాగు ముఖత చెబుతున్నందుకు సంతోషం. నా పాలిట ఇదొక పాఠం. ధేంక్యూ. పేరు గుర్తులేదుగానీ, ఒక డాక్టరు రచయిత కూడా ఆ మధ్య హిందూలో ఇలాగే చెప్పేడు. రచన రెండు రకాలట. ఒకటి ముందే కథంతా ఆలోచించుకుని రాయడం, రెండు, రాత్రిపూట కారు డ్రయివింగులా కనిపించినంత మేరా నడుపుకొంటూ వెళితే గమ్యం వచ్చేసినట్టు, కథ తోచినంత మేరా రాస్తూ పోతే అదే పూర్తయిపోతుంది అని. మిగతా పాఠానికి వారం ఆగుతా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s