ఊసుపోక – రామక్కా అంటే తామరాకా అనీ ..

(ఎన్నెమ్మ కతలు 35)

రామక్కా అంటే తామరాకా అనీ అని మాఅమ్మ ఓ సామెత చెబుతూండేది. ఎవరో రామక్కా అని పిలిస్తే, ఏమిటి నాయనా, తామరాకా అడుగుతున్నావు? అందిట ఆవిడ.

ఇంతకీ మనకథ –

పాపం, ఆవిడకి కాస్త చెవుడు. అంచేత, అలా అడిగింది. అందులో హాస్యంగానీ వ్యంగ్యం కానీ లేదు. అడిగిన పెద్దమనిషి కాస్త దగ్గరకొచ్చి, ఆవిడచెవిదగ్గర నోరు పెట్టి, లేదమ్మా, నేను మిమ్మల్ని రామక్కా అని సంబోధించేను అని మర్యాదగా చెప్పొచ్చు. లేదా, చెవిటిమేళం, నేనో మాటంటే తానోమాట. వినిపించి చావదు అని విసుక్కుంటూ విసవిసా మరోదిక్కుకి సాగిపోవచ్చు.

తామరాకా? ఆని అడిగినావిడస్థితి నాకు అర్థం అవుతుంది. వినిపించకపోవడం ఒకదారీ, వినిపించుకోకపోవడం మరోదారీను. … … మరోలా అనిపించడం పూర్తిగా మరో కథ. (సౌమ్య టపా నాలుగు చెవుల ధోరణి గుర్తొస్తే మరోలా అనుకోకండి. నేను సౌమ్యటపా కాపీ కొట్టబోవడంలేదు. చేసినా మరీ ఇంత బాహాటంగా చేస్తానేమిటి, హాహాహ. అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. తను రాసిన మంచి టపాల్లో అదొకటి.)

నావిషయంలో వినిపించుకోలేకపోవడం చేతనాచేతనావస్థలో జరుగుతుంది. అంటే నాకు ఒకచెవిలో 40 శాతమే వినిపిస్తుంది. ఆపరేషను చేయించుకోమని డాక్టరమ్మ చెప్పింది కానీ నేనే నిర్లక్ష్యం చేసేను. అందులో గల సౌకర్యాలు గుర్తించి. ఎలా అంటే నా రెండోచెవి నూటికి నూరుపాళ్లూ వినిపిస్తుంది. అంటే మొత్తం 140, నాకు రెండు చెవులున్నాయి కనక 100+40=140ని. దీన్ని రెండు పెట్టి భాగిస్తే, సగటు 70 శాతం వినిపిస్తుందన్నమాట. ఈరోజుల్లో ఎవరు చెప్పిందాంట్లో మాత్రం అంతకంటె ఎక్కువ వినాల్సింది ఏం వుంటోంది కనక అని నాతర్కం.

నా నిరాపరేషను మూలంగా రెండో సౌఖ్యం ఏవిటంటే నేను పడుకున్నప్పుడు, ఫోనుకాలొస్తే. నేను కుడిపక్కకి తిరిగి పడుకుని వుంటే ఆ ఫోనుగానం నాచెవిని బడదు. అంచేత నాకు నిద్రాభంగం జరగదు. మరి ఆపరేషనుకి ఎలా తల ఒగ్గుతాను చెప్పండి..

మా టీవీ dateline అని ఓ వార్తాపత్రిక  ఉంది. అందులో ప్రతి పావుగంటకీ ఓమారు ఇందాకా చెప్పేను చూడండీ అంటూ వెనక్కి తిరిగి జరిగినకథ మరోసారి చెప్తుంటాడు ఆ గృహస్థు (host. చావా కిరణ్‌గారు చెప్పేరుట ఇలా అర్థాలు ఇవ్వమని.). ఇది నాకు మొదట్లో విసుగ్గా వుండేది, నాకామాత్రం బుద్ధి లేదనుకుంటున్నాడా? అని, కానీ త్వరలోనే ఈ పునశ్చరణ కాలం సద్వినియోగం చేసుకునే మార్గం కనిపెట్టేను.

మామ్మూలుగా పై పునశ్చరణలతోపాటు మూడు, నాలుగు నిముషాలపాటు వ్యాపారులయాడులు కూడా వుంటాయి కదా., నేను ఈ వ్యాపారప్రకటనలకీ, ఇంటివాడి పునరుక్తులకీ మధ్య ఏం చేస్తానంటే కాఫీ పెట్టుకుంటాను. గిన్నెలు కడుక్కుంటాను. మెయిలులు చూసుకుంటాను. ఇంకా గుమ్మంలోకి వెళ్లి ఉత్తరాలేమేనా వచ్చేయేమో చూసుకుంటాను. అక్కడే ఏ పొరుగువాడో కనిపిస్తే, ఓ హలో చెప్పి ఆనాటికబుర్లు కలబోసుకుంటాం ఓ రెండునిముషాలపాటు. అంతకంటె ఎక్కువ టైము నాకుంటుంది కానీ వారికి వుండదు.

అలా అయ్యో, కథ మిస్సయిపోతామేమో అన్న భయం అస్సలు లేకుండా పోయింది నాకు. ఈ సాంప్రదాయం.మనక్కూడా వుండేది దానికే హరికథ అని పేరు. లేదా సోది అన్నా అనొచ్చు.

ఇవాళారేపూ (అంటే ఆజ్ కల్) కొందరు చూడండి అనేకసంగతులు గలగల చెప్పుకుంటూ పోగల్రు స్పోర్ట్సు కామెంటేటర్లలాగే. అలా మాటాడుకుంటూ పోతున్నప్పుడు బోలెడు సంగతులు దొర్లిపోతాయి. ఒక్కోసారి అసలు విషయం ఏమిటో తెలీక, మనం 300x లెన్సు పెట్టి వెతుక్కోవాలి. దానికి రెండుగంటలసేపు పడుతుంది.

నేను ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకండి గానీ అప్పుడప్పుడు విమర్శల్లోనూ, వ్యాఖ్యల్లోనూ కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అంటే అసలు విషయాన్ని వదిలేసి, ఏదో ఒక్క మాట మాత్రం పుచ్చుకుని, శాఖాచంక్రమణం చేస్తూ మరోదిక్కుకి సాగిపోడం. దీనివల్ల లాభాలూ వున్నాయి. నష్టాలూ వున్నాయి, కొత్తసరుకుని బరిలోకి ఈడ్చుకురావడం ఒక వసతి. అసలు విషయం దారి తప్పుతుంది కనక మూలరచయితకి రుచించదు మూడింట రెండొంతులు. పోతే విమర్శకులకీ వ్యాఖ్యాతలకీ గల సౌలభ్యం వారికి తెలిసినవి వారు తెలుపుకోడానికి సదవకాశం.

ఇంచుమించు మనం రాసే కథల్లోనూ అంతే జరుగుతుంది. ఏది కథలో రామక్కా అంటే తామరాకా లాగా కనిపిస్తుంది? ఏది మనం చెప్తున్నకథలో వాక్కూ, అర్థమూవలె, పార్వతీపరమేశ్వరుల్లాగా ఏకమయిపోతుంది? అన్నది కాస్త పట్టి చూసేవారికి మంచి కాలక్షేపం. దీనినే పండితులు శిల్పం అంటారు. సందర్భశుద్ధి అని కూడా అనొచ్చు. అంటే మీరు చెప్పబోయే కథలో ఆద్యంతం ప్రతివాక్యం కథలో ప్రధానాంశంవేపు ఇదుగో, ఇటు చూడు అని పిలిచినట్టుండాలన్నమాట, డేట్‌లైన్ ఇంటివాడిలాగ. ఆయనలాగ అదేపనిగా నస పెట్టమని కాదు. ఆ చెప్పడంలో సౌలభ్యం వుండాలి. ఇందాకా చెప్పేను గుర్తుందా అన్న వాక్యం మాత్రం ఏపరిస్థితుల్లోనూ పనికిరాదు. నేననేది కథ ముగించేవేళకి ఆదీ అంతమూ ఓ కొలిక్కి తెస్తాం కదా. అలాగే మధ్యనున్న భాగాలూను అని.

కథ సున్నా అనుకుంటే, ఆ సున్నామీద మీరు ఎక్కడ వేలేసినా అక్కడినుంచీ పొట్టలో చుక్కవేపు రామబాణంలా ఒక సరళరేఖ కనిపించాలన్నమాట.

మనం కథలో ఎక్కడెక్కడి సంగతులూ కలిపి చెప్పేస్తుంటాం కదా. ఆ కలిపి చెప్పడాన్నే కల్పనాచాతుర్యం అంటారు.

ప్రతిభావంతులయిన కవులు చూడగానే అసందర్భంగా వుంది అనిపించే వాక్యాలని ఒక్క తాటిమీదకి ఎలా తేగలరో భైరవభట్ల కామేశ్వరరావుగారి వ్యాసం నేనెఱిగిన విశ్వనాథ, పొద్దు.నెట్‌లో చదవండి. ఆయన ఎంత బాగా వివరించేరంటే విశ్వనాథవారి కవిత్వంలో అందాలు తెలుసుకోడానికి మనం కవులం కానక్కర్లేదు అనిపించింది. ఇంతెందుకూ? నాక్కూడా అర్థమయిపోయింది అంటే నమ్మండి.

మంచి కథ రాయడానికీ అంతే. కథలో కూడా రచయిత యొక్క భావుకత కనిపిస్తుంది.

అదెలా అంటే

గోపాలం అనకాపల్లి బస్టాండులో కాఫీ తాగి గోల్డెన్ గేటుబ్రిడ్జివేపు నడవడం మొదలుపెట్టేడు అని రాసేననుకోండి. వెంటనే డజనుమంది పాఠకులు గాఠ్ఠిగా కోప్పడేస్తారు నామీద, ఏమిటారాతలు తెలిసీ తెలీకుండా. అనకాపల్లి ఆంధ్రాలో వుంది. గోల్డెన్‌గేటు బ్రిడ్జి అమెరికాలో వుంది. అసలు అమెరికా ఎక్కడుందో తెలుసా నీకు?…. అంటూ. అవునా?

మరి నాకు భావదారిద్ర్యం లేదు కదా. అంచేత నాకు బోల్డు ఆలోచనలు అతి తేలిగ్గా వచ్చేస్తాయి. వెంటనే నేను రాసింది రైటే అంటాను. అది ఎలా అంటే

నాకథలో రెండో వాక్యం గోపాలం వులిక్కిపడి లేచేడు అని రాసేస్తాను. అప్పుడు అది కల అని తెలిసిపోతుంది. కలలో మనం ఎక్కడినించి ఎక్కడికేనా పోవచ్చు కదా. నోఓఓ … ప్రొబ్లెము.

మరి అతనికి కలలో గోల్డెనుగేటుబ్రిడ్జే ఎందుకు కనిపించింది? మళ్లీ మన కల్పన మనని ఆదుకుంటుంది గోపాలం కొన్నాళ్లు శాన్ ఫ్రాన్సిస్కోలో వున్నాడు. అతనికి ఆ బ్రిడ్జి అంటే ఎంతో ఇష్టం. అతని కన్నకలలకీ, తీరనికోరికలకి, ఆరని మంటలకీ చిహ్నంలా నిలిచింది ఆ బ్రిడ్జి అతనిమనోవీధిలో. దానిమీద అతనికి ప్రేమా, ద్వేషం. ఇంకా ఇదీ అని చెప్పలేని ఏదో కసీ … (ఇదేం గోల, బుచ్చిబాబుకి అసమర్థ కాపీలా వుంది!) రాసుకుంటూ పోవచ్చు. అంత బలమైన అనుబంధం వుంటేనే అలా కలల్లోకి వచ్చేస్తాయి మరి.

లేదా, గోపాలం పుస్తకాలు తెగ చదువుతాడు పుస్తకప్పురుగుJ. అమెరికా అయితే వెళ్లలేదు కానీ ఎంత చదివేడంటే మీకు శాన్ ఫ్రాన్సిస్కోనించి షికాగోకి దారి కావాలంటే అతన్నడిగి తెలుసుకోవచ్చు.

మళ్లీ కథలోకి వద్దాం (హరికథ!). అనకాపల్లి వూరిపొలిమేరలో ఓ చిన్న వాగుంది. దాన్ని దాటడానికి ఆవూరిరైతులు ఓ చిన్నవంతెన వేసుకున్నారు. రోజూ బాలగోపాలురు ఆలమందల్ని పొలాలకి మళ్లించేవేళ ఆ వంతెనమీద బాలభానుని సువర్ణరేఖలు పరుచుకుని కన్నులపండగ చేస్తాయి. అదొక అద్భుతదృశ్యం..

గోపాలానికి తెల్లారగట్లే లేచి, బస్టాండులో కాఫీ తాగి, ఆవాగుపక్కన నిలబడి ఆవంతెనమీద దినకరుడు చిందించిన అందాలు ఆస్వాదించడం అలవాటు. ఆవంతెనకి అతను గోల్టెనుగేటుబ్రిడ్జి అని పేరు పెట్టుకున్నాడు. అది అతనికి జీవితంలో ప్రసాదించే ఏకైక ఆనందం… ఇలా కూడా పెంచుకుంటూ పోవచ్చు.

ఇది బాగులేదూ? సరే మరో కోణం చూదాం. చెప్పేను కదా. కథ ఓ సున్నా. మనం ఎక్కడినించేనా బయల్దేరొచ్చు. చేర్చడం మాత్రం పొట్టలో చుక్కకే.

ఓరోజు గోపాలం వంతెనదగ్గర నిలబడి ఆనందాలు అనుభవిస్తున్నాడు తనివితీరా.

కొంతసేపటికి మరొకతను వచ్చి పక్కనే నిలబడ్డాడు.

గోపాలం భారంగా, సుదీర్ఘంగా నిట్టూర్చి, ఈవంతెన ఎంతటి విషాదాన్ని నింపుకుని ఎంతటి రాజసం ఒలకబోస్తోందో చూడండి అంటాడు.

పక్కనున్నాయన, అవును. అది నాకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఆ వంతెనమీదే నేనూ సుసీ కలుసుకునేవాళ్లం. అక్కడే మేం బాసలు చేసుకున్నాం. ఆవంతెనమీదే నాకు సుసీ చెప్పింది మాపెళ్లి జరగదని. అదుగో ఆ మూడో స్తంభంపక్కనుండే వాగులోకి దూకి మాప్రేమని అజరామరం చేసింది, అంటాడు.

గోపాలం కోపానలంతో పేట్రేగిపోతూ, హాట్, హూట్, అది నాకథ. నువ్వు చెప్పడానికి నీకు హక్కుల్లేవు, నిన్ను లోకం క్షమించదు, అంటూ కోపంతో వూగిపోతూ, తూలి వాగులో పడతాడు. ఇది రాస్తుంటే నాకు నవ్వొస్తోంది. (లోకంలో ప్రేమికులు క్షమించాలి). పోనీ, ఇంకొంచెం పెంచుదాం. పక్కనున్నాయన (వాగులో కాదండీ, గోపాలం దూకకముందు అతనిపక్కన ఉన్నవాడు అని) కూడా ఎంతో హృదయబాధతో, అయ్యో, నాకు తెలీనేలేదు, ఈవంతెన దురాగతాలు అని, తాను కూడా వాగులోకి దూకి …

మరి ఇద్దర్నీ ఒడ్డుకి చేర్చి భూలోకసుఖాలు అనుభవించమందామా? స్వర్గసుఖాలు అనుభవించమని పైకి పంపేద్దామా? నాకేం తోచడం లేదు. మీఇష్టం. నీటముంచినా పాలముంచినా మీదే భారం.

ఇది కూడా కథలెలా రాయాలిలో భాగంలాగే తయారయింది అనుకోకుండా. చెప్పొచ్చేమాట ఏమిటంటే ఇందులో మీకు తెలియని విషయాలేమీ లేవు. వేరు వేరు సంగతులని లాక్కొచ్చి ఓరాటకి కట్టేయడమే శిల్పం అంటే. రామక్కా అంటే తామరాకా అని అడిగితే తప్పు లేదు. ఆ రామక్కకీ తామరాకుకీ పరస్పరానుబంధం పెట్టేస్తే మీకథ తయారయిపోయింది అన్నమాటే!

అన్నట్టు మరోమాట. పైకథ అవకతవగ్గా వుంది, గోపాలం ప్రేమకత మొదట్లో చెప్పలేదుకదా అని అడక్కండి. ఇది కేవలం అవుట్లైనే. అసలు కథ రాసినప్పడు అలా విడి విడిగా వున్న నూలుపోగుల్ని జతకూర్చి ముళ్లు పెట్టుకుంటూ రావడమే కథ రాయడం అంటే మరీ.

(30 ఏప్రిల్ 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – రామక్కా అంటే తామరాకా అనీ ..”

 1. “కథ సున్నా అనుకుంటే, ఆ సున్నామీద మీరు ఎక్కడ వేలేసినా అక్కడినుంచీ పొట్టలో చుక్కవేపు రామబాణంలా ఒక సరళరేఖ కనిపించాలన్నమాట. ”
  – :)) బాగుంది. Hmm… గోపాలం ప్రేమ కథ కూడానూ…

  మెచ్చుకోండి

 2. బాగుందండి. ఇది కథలకే కాదు, ఏ వ్రాతకైనా వర్తిస్తుంది. నాకు ఏదైనా విషయం మీద వ్రాయాలంటే సరిగ్గా ఇలాంటి ఇబ్బందే. ఆలోచనలు కలగాపులగమై, ఫ్లో గంగలో కలిసిపోతుంది (అలా జరిగినా ఫ్లో ఉండాలికదా అంటారా :)) 😦

  నా తలా తోకా లేని వ్రాతలకి కంగారుపడి మా వాళ్లు, నువ్వొకసారి, ఈ http://www.cs.vu.nl/~jms/doc/elos.pdf పుస్తకం ఒకసారి చదవాలయ్యా అన్నారు. పుస్తకాలు చదివి వ్రాసేయ గలిగితే ఇంకేముంది, అందుకే నేనింకా ఇలానే ఉన్నా 🙂

  ఇంగ్లీషువాడన్నట్టు, క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే ఇదే ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కువ వ్రాసినట్టనిపిస్తే క్షమించి వదిలేయండి.

  నమస్కారములతో,
  ~సూర్యుడు 🙂

  మెచ్చుకోండి

 3. చాలా బావుంది. నా బ్లాగులో కామెంటు కి చాలా థాంక్స్. ఏదో ఒక రోజుకి మీ లాగా చక్కని కధలు రాసేయాలని నా కల ! నేనూ ఉలిక్కిపడి లేచేస్తూ ఉంటాను !

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.