ఊసుపోక – వైరాగ్యంలోంచి క్రియాశీలతలోకి

(ఎన్నెమ్మ కతలు 38)

గత మూడు టపాలు చూసి “ఈవిడకేమిటి మతిపోతున్నట్టుంది” అని మీరు అనుకుంటుండొచ్చు. అంచేత నాకష్టాలన్నీ మూట గట్టేసి, నాబతుకులో నార్మల్సీ ఏర్పరుచుకొనేడమే ఈ టపా ధ్యేయం. అంటే మీరు reading this at your own risk!

నిజమే. ఈమధ్య నాస్పిరిటు డౌనయింది. మొదటి కారణం – వాతావరణం. ఎండలు ముదురుతున్నాయి. మాయింటికి

తూర్పుపడమరలుగా పెద్ద patio డోరూ,  కిటికీలూ వుండడంచేత ఎండ కుండలతో కుమ్మరించినట్టు గదుల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది. అది చాలనట్టు ఎదురు పార్కింగ్‌లాట్‌లో మెటాలిక్ సిల్వరురంగులో ధగధగ మెరిసే కార్లమీంచి ప్రతిఫలించిన సూర్యకిరణాలు నాగదులని మరింత ధగద్ధగాయమానం చేసేస్తున్నాయి. దాంతో మాఇల్లు పెద్దింట పెళ్లిలో గాడిపొయ్యిలా మండిపోతోంది. ఆ తాపం భరించలేక, రెండు వరసలు తెరలు వేసుకున్నాను కిటికీలకీ, పేడియో అద్దాలకీ. దాంతో ఇల్లయితే చల్లబడింది గానీ, బయటి ప్రపంచం పూర్తిగా బందయిపోయింది. నాకు నేనే విధించుకున్న కఠిన కారాగారశిక్షలా, సజీవసమాధిలా వుంది నా ప్రాణానికి బతుకు.

రానున్నకాలంలో ఎప్పుడో కళ్లూ పళ్లూ పోయేక జావ కాచుకు తాగడం ఎలాగా తప్పదు, ఇప్పుడే నాకు ఇష్టమయినవన్నీ చేసుకుతినేద్దాం అంటే అదీ లేదు. వారంరోజులుగా నోరు పూసింది. కాఫీలూ, కారాలూ ఎక్కువయితే పైత్యం చేసి అలా అవుతుందిట. నాకు పైత్యం రెండర్థాలలోనూ ముదిరపోయినట్టే వుంది! నేను కారాలూ, కాఫీలూ పూర్తిగా మానేయలేదు కానీ తగ్గించేను. దాంతో తొమ్మిది దాటినా, నిద్రమత్తు వదలడంలేదు. ఏపనీ చేయడానికీ మనసు లేదు.

పోనీ, టెనిస్ చూద్దాం కాస్త చురుకు పుడుతుందేమోనని టీవీ పెడితే, మొదటి రౌండు మన పెళ్లిల్లో వధూవరులచేత ఆడించే దండాడింపులా,  టుప్పూ టుప్పూమని బంతి అటూ ఇటూ కొడుతూ ఆడుతున్నారు, ఖర్మ! ఈ ఆటలతో నాకు జీవితంపట్ల మరింత వైముఖ్యం వచ్చేట్టుంది. ఏదో కొండనాలుకకి మందు వేస్తే వున్న నాలుక వూడిపోయిందనీ .. పోనీ, అలా అని టీవీ వదిలేసి, మరో పని చేసుకుందాం అంటే అదీ కుదరదు, ఏ గొప్ప షాటు మిస్సయిపోతున్నానో అని ఒహటే ఆరాటం!

ఇప్పుడే మరోసంగతి కూడా గ్రహించేను. ఇద్దరు ఆటగాళ్లూ ఒకేరకమయిన తలకట్టు (హెడ్ బాండూ, హెయిర్ స్టైలు)తో,  ఒకేరంగు చొక్కాలు తొడుక్కుని ఆడుతుంటే, ఎవరు ఎవరో తెలీడంలేదు. అది చాలనట్టు నిన్న సఫిన్ ముందొకరంగూ వెనక ఒకరంగూ వున్న చొక్కా తొడుక్కుని ఆడుతుంటే ముగ్గురు ఆడుతున్నారేమో అనుకుని గాభరా పడిపోయేను కొంచెంసేపు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నిన్న ఆనా ఇవనోవిచ్, సారా ఇరానీల ఆట మాత్రం చూసితీరాలి, మొదటి గేము ఒక్కటే 72 నిమిషాలు ఆడారు. అదుగో, ఆలాటివే నన్ను టీవీ వదలకుండా చేస్తాయి. ఆడ్డానికి వాళ్లకంత హుషారున్నప్పుడు, కేవలం చూడ్డానికి నాకు ఆమాత్రం ఓపిక వుండక్ఖర్లేదా? అని నన్ను నేను చీవాట్లేసుకుని, అటు చూడలేకా, ఇటు వదల్లేకా, ఉత్సాహం కూడదీసుకోడానికి మరోమార్గం ఏదైనా వుందా అని వెతుక్కుంటున్నాను ప్రస్తుతం.

ఇలా ఇంకేం చెయ్యగలను అనుకుంటుంటే గుర్తొచ్చింది. శిశిరం వెనకబడి, గ్రీష్మం వేంచేసింది కనక నాక్లాజెట్లో బట్టలన్నీ తదనుగుణంగా తిరగెయ్యాలని. సరే ముందు క్లాజెట్లో శీతలదుస్తులు కింద పడేసి, వేసవిదుస్తులు పెట్టెల్లోంచి తీసి మరోపక్కన పడేసి చూస్తే, రిపేరు చెయ్యాల్సినవి – గత పదేళ్లలోనూ గుండీలూ, కుట్లూ వూడిపోయినవన్నీ కనిపించేయి. సరే ఇప్పుడు రిపేరు చేద్దాం అని కుట్టుమిషను ముందుగదిలోకి తీసుకొచ్చేను. రిపేరు చెయ్యవలసిన చొక్కాలతోపాటు, కత్తిరించి పొట్టి చేద్దాం అనుకుంటున్న పాంటులు కూడా వున్నాయి. పొడుగు చెయ్యాల్సినవి కూడా వున్నాయి. ఎలా పొడుగు చెయ్యొచ్చో నాకు థియొరిటికల్గా తెలుసు కూడాను. నిజంగా పొడుగు చెయ్యబోతే అవి మరెలా తయారవుతాయో తెలీదు.

అసలు నాకు కుట్లూ, వంటలూ అంటే అట్టే సరదా లేదు. ఎవరేనా మీరేనా మాలతీ చందూర్ అని అడిగితే, నేను కాదండీ అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా వాడుకుంటాను. ఆవిడలా వంటలూ, కుట్లూ నాకెలా వస్తాయండీ అంటూ. అమెరికా వచ్చేక వంటలు కాస్త పట్టుబడ్డాయి కానీ ఆవిడలా కొలతలూ, కేలరీలూ, ఆరోగ్యసూత్రాలూ చెప్పలేను ఇప్పటికీను. ఏదో ఇంత ఉప్పూ, పసుపూ, మిరపకాయలూ, చింతపండూ – అందుబాటులో వున్నవేవో గిన్నెలోకి విసిరేసి ఉడకేసి పడేస్తానంతే.

ఇంతకీ, అలా రిపేర్లూ చెయ్యాల్సినవీ, కాలానుగుణంగానూ బట్టలన్నీ కుప్పలు కుప్పలుగా పోగు పెట్టేసేక, నాకు మరో ఆలోచన వచ్చింది. వీటిలో కొన్ని తీసిపారేస్తే నా పని తేలికవుతుంది కదా అని. ఇది కూడా నావైరాగ్యంలోనూ, స్ప్రింగు క్లీనింగులోనూ భాగమే. అప్పుడప్పుడు నేను చాలాకాలంగా వాడడమే లేదు అనిపించిన బట్టలూ, గిన్నెలూ, తప్పేలాలూ ఏరిపారేస్తూ వుంటాను. నేను తిరపతిలో వున్నప్పుడు ఒకాయన అంటూ వుండేవాడు కొండకెళ్లి గుండు కొట్టేసుకొస్తే ప్రాణం తేలిగ్గా వుంటుంది అని. సామాన్లు బయట పారేసినప్పుడు కూడా అదే ఎఫెక్టు అని నా అభిప్రాయం. రెంటిలోనూ ఆంతర్యం మమకారాలు వదిలేసుకోడమే కదా సింబాలిగ్గా గానీ, క్రియారూపంలో గానీ.

సరే టీవీ ఆన్ చేసి, కుట్టుమిషను తెచ్చి టీవీకెదురుగా కూర్చున్నాను. ఆదిలోనే హంసపాదు. సూదిలో దారం ఎక్కించడం గగనం అయింది. కళ్లు కనిపించక కాదు. మిషను నేలమీద వుండడంచేత. “నేలమీద పెట్టి ఎలా కుడతారండీ?” అనకండి. రిపేర్లే కదా. అంటే కుట్టేది తక్కువా, దానికి సిద్ధం చేసుకునేది ఎక్కువాను. ఏదో నాలుగు కుట్లు వేసేనంటే, కనీసం నాలుగుసార్లయినా తప్పు పడతాయి. అవి వూడదీయడానికి పదినిముషాలు పడుతుంది.. అలాగే బొత్తాయిలు కుట్టినప్పుడు కూడా మిషను కాళ్లదగ్గర ముద్దుకుక్కలా పెట్టుకుని, సోఫాలో కూర్చుని కుట్టుకుంటాం కదా. బొత్తాయిలు మిషనుమీద కుట్టొచ్చు అంటారు కానీ అలా మిషనుమీద కుట్టినవే వూడిపోతాయి అంత తేలిగ్గానూ. అంచేత నేను చేత్తోనే కుడతాను. మరి మిషనెందుకంటే వుందని చెప్పుకోడానికి మరియు అలంకారార్థం. ఆవిధంగా నేను నిజంగా మిషను ఆపరేటు చేసే కాలము చాలా తక్కువా, దానిచుట్టూ చేసే హడావుడి ఎక్కువా.

పైగా, టెనిస్ చూస్తున్నాను కూడా కదా. ఒకొకప్పుడు, కుట్టడంలో పడి ఆట మిస్సయినా, కామెంటేటరు, Wow, she got it, drop shot, … అంటూ కేకెయ్యగానే గబుక్కున తలెత్తి చూస్తాను. వారు రీప్లే చేస్తారు నా సౌకర్యార్థం. ఇలాటప్పుడే నాకు కామెంటేటర్లు పాపం మంచివాళ్లే అనిపిస్తుంది. మంచిసేవే చేస్తున్నారు అని వాళ్లకో మానసికంగా మెచ్చుకోలు సర్టిఫికేటు ఇచ్చేయడానికి కూడా సిద్ధం నేను.

ఇలా వున్నవీ లేనివీ అక్కర్లేనివీ – ఏదో ఒ పని కల్పించుకు చేస్తుంటే, కాస్త వుత్సాహం వస్తుంది. ఇందాకా వార్తల్లో చెప్పేరు – Happiness is being male, old and Republican అని. నేను మేల్ కాదు, రిపబ్లికన్ కాదు. ఓల్డ్ అన్నది వైకల్పికం అంటే never mind. అంచేత ఆరూలు నావిషయంలో వర్తించదు అనుకున్నాను. ఆశ్యర్యం. నా ప్రాణం తెరిపిన పడింది.

(25 May 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – వైరాగ్యంలోంచి క్రియాశీలతలోకి”

 1. @ ఉషా, 🙂 రావ ఇటు నా దరికీ? – పాటలు వచ్చినవారు కనక.
  @జ్యోతి, సినిమాలు చూస్తే పోతుందంటారా, ఈరోజుల్లో వచ్చేవి .. హాహా, రెండు పెంటులు రిపేరు చేసేను. ఇంకా ఎన్ని వున్నాయో అడక్కండి
  @ మురళి, ధన్యవాదాలండీ
  @ పరిమళం, హాహా, మీరొక్కరే అనుకుంటాను మరొకరి అనుభవం చూసి నేర్చుకుంటాననేవారు 🙂
  @ సౌమ్యా, :)) thanks.

  మెచ్చుకోండి

 2. “సఫిన్ ముందొకరంగూ వెనక ఒకరంగూ వున్న చొక్కా తొడుక్కుని ఆడుతుంటే ముగ్గురు ఆడుతున్నారేమో అనుకుని గాభరా పడిపోయేను”
  – :)) and the whole post was just awesome …laughed many times.

  మెచ్చుకోండి

 3. మొత్తానికి నాకో విషయం తెలిసింది …ఎప్పుడైనా డిప్రెషన్ గా అనిపిస్తే పాత సామాన్లు బయట పారేసి రిపేర్ చెయ్యాల్సినవి బాగుచేసుకుంటే ….ఆటోమాటిక్ గా మనసు బాగైపోతుందన్న మాట ! మీ స్వీయానుభవం మాతో పంచుకోవటం వల్ల మాకూ ఎంత ఉపయోగమో చూశారా మేడం !

  మెచ్చుకోండి

 4. మీకు అంత వైరాగ్యమైతే కొన్ని లేటెస్ట్ తెలుగు సినిమాలు తెప్పించుకుని చూడండి. దెబ్బకు వెరాగ్యమంతా మాయమైపోతుంది. విషానికి విషమే విరుగుడు కదా..
  ఇంతకీ ఎన్ని బట్టలు రిపేర్ చేసారేంటి??? 🙂

  మెచ్చుకోండి

 5. confirming that i read it at my own risk and yet safe 😉 అమ్మో ఇంత ఎక్కువ స్పిరిట్ ఒక్కసారే వచ్చెస్తే ఎలాగా మాలతి గారు? నేను పుట్టాక పరులతో మాత్రమే పూరిచేయించిన పని గుండీలు, ఉక్సులు, కాజాలు కుట్టటం. సుమారుగా ఓ ఎకరం పొలం అమ్మినంత సొమ్ము దానిమీదే ఖర్చుపెట్టుంటాను. ఇక బట్టలు మూటలు మూటలు దానాలు నాకూ షరా మామూలే. ఆటలు చూడను కాని అపుడపుడు సినిమాలు చూసి [అ]శాంతి తెచ్చుకుంటాను. మా వూర్లో కూడా 70 దిగ్రీలు దాటి నాకు వెర్రెత్తిపోతుంది. వానొస్తేనో, హోజ్లో నీళ్లతొనో చల్ల బడుతూ తొతపని యదావిధి కానిస్తున్నాను. నిన్న 3 గంటలు మళ్ళు తవ్వి ఆకు కూరలు విత్తనాలు జల్లాను. సో మీ మాదిరే నేను కూడా “స్పిరిట్ ఎక్కడమ్మా నువ్వు? రావ ఇటు నా దరికీ?” అని పాటలు పాడుతున్నాను! 😉

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.