హాలికులైన నేమి …

అర్థరాత్రి దాటింది. మనోరమా, ఇద్దరు పిల్లలూ పడకెక్కేసి మూడున్నరగంటలయింది.

చంద్రం కంప్యూటరుకి అంటుకుపోయి ఉద్యోగాలవేటలో వేసారి, రంగుబుడగలు షూట్ చెయ్యడం మొదలుపెట్టేడు. చుంయ్ చుంయ్ మంటూ పెనంమీద పెసరట్లలా స్క్రీనుమీద బుడగలు చితికిపోతున్నాయి.

“బుర్రతో పనిలేని ఆట ఆడుతున్నాను” చంద్రం గొణుక్కుంటున్నాడు చితికిపడుతున్న బుడగలు చూస్తూ.

“బుర్రతో పనిలేనిఆట.” బుర్రతో పనిలేని ఆటే అయినా వదలబుద్ధి పుట్టడంలేదు. అలాగని మనశ్శాంతీ లేదు. “ఈ పనికిమాలిన ఆట నేనెందుకు ఆడుతున్నాను” అనిపిస్తోంది కానీ సమాధానం తోచడంలేదు. బుర్రో చెయ్యో ప్రోగ్రాము అయిపోయినట్టు, అసంకల్పిత ప్రతీకార చర్యలాగ ఆట సాగిపోతోంది తనప్రమేయం లేకుండానే. తాను “బుర్ర అక్కర్లేని ఆట ఆడుతున్నాన”ని చెప్పుకోడం మాత్రం మానలేకుండా వున్నాడు.

నాలుగేళ్లయింది వుద్యోగంలో చేరి.

మూడునెలలయింది ఉద్యోగం పోయి.

చేరినప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదు. అప్పట్లో ఆ కంపెనీ శుక్లపక్షచంద్రునిమాడ్కి దినదినప్రవర్థమానంగా పెరిగిపోతోందని విని చేరేడు.

పింకుస్లిప్పు పుచ్చుకున్నరోజున గానీ గ్రహింపుకి రాలేదు దేశంలో ఆర్థికపరిస్థితి ఎలా వుందో. కళ్లెదుట కొండచిలువలా కనిపిస్తున్నసమస్యలు కూడా “తనదాకా వస్తే కానీ” తెలీవని ఇప్పుడే తెలిసింది.

“బోడి వుద్యోగం. అదే దొరుకుతుంది ఇది కాకపోతే దీని తాతలాటిది” అని తనకి తనే చెప్పుకోడమే కాక, మనోరమకి కూడా మాటిచ్చేడు. మొదట్లో కొన్నాళ్లు కులాసాగా గడిపేడు unearned holidays అనుకుంటూ. ఆతరవాత తనకి తెలిసినవాళ్లనీ, ఉద్యోగాల్లో వున్నవాళ్లనీ కదిపి చూసేడు.

వాళ్లు యథాశక్తి సానుభూతులు చెప్పి, ప్రస్తుతం తమకి తెలిసినవేమీ లేవనీ, తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్తాం అనీ నొక్కి చెప్పేరు. ఏదైనా అవసరమయితే ఏమాత్రమూ సంకోచించకుండా అడగమని కూడా చెప్పేరు.

చంద్రం నెట్లోనూ, పేపర్లలోనూ కనిపించిన ఉద్యోగాలన్నిటికీ అర్జీలు పెట్టుకొస్తున్నాడు. రోజులూ,  వారాలూ, దొర్లుకుపోతున్నాయి నిస్సారంగా. monster.comలో కూడా తనపేరూ, అర్హతలూ, నమోదు చేసేడు. ఎన్నిసార్లు చూసినా ఏదో కంపెనీలో బుక్క్ కీపింగ్ పని చూపిస్తోందే కానీ తన ఇంజినీరింగుచదువుకి తగిన పని కనిపించడంలేదు.  బుక్క్ కీపింగ్ చెయ్యగలనన్న నమ్మకంలేదు.

మనోరమ పిల్లలు చదువుతున్న ఎలిమెంటరీ స్కూల్లో substitute teaching చేస్తూ వుంటుంది. అంచేత చెప్పుకోదగ్గ ఆదాయం కాకపోయినా, కొంతలో కొంత నయం.

ఓరోజు జగదీశ్ బజారులో కనిపించాడు. ఆయనతో చంద్రానికి అట్టే పరిచయంలేదు. వూళ్లో వున్న వందమంది భారతీయుల్లో అతనొకడని తెలుసంతే. కాస్త జంకుతూనే హలో అన్నాడు చిరునవ్వు మొహాన మెత్తుకుని.

జగదీశ్ మెకానికల్ ఇంజినీరు, వ్యవసాయపరికరాలు తయారు చేసే గ్రీన్ మెటల్ కంపెనీలో ఛీఫ్ ఇంజినీరు. అంచేత తను అతన్ని పలకరిస్తే, ఉద్యోగంకోసమేనని అతను అనుకుంటాడేమోనని చంద్రం బాధ. ఆమాట నిజమే అయినా …

జగదీశ్ కూడా సంకోచిస్తూనే తిరుగు హలో చెప్పేడు. అతని సంకోచానికి కారణం చంద్రంఆలోచనకి అటువైపుది. “వీడికి ఉద్యోగం వుంది, నాకు లేదు” అని చంద్రం చిన్నబుచ్చుకుంటాడేమోనని జగదీశ్ బాధ. ఇలా ఇద్దరికిద్దరూ సంకోచిస్తూనే, సగం సగం మొహాల్తో హలోలు చెప్పుకుని, మీరెలా వున్నారంటే మీరెలా వున్నారని అడుగుకొంటూ చిరుసంభాషణకి నాంది పలికేరు. ఆతరవాత చంద్రం ఉద్యోగంమాట రాక తప్పలేదు.

జగదీశే నెమ్మదిగా, “సారీ. మీకంపెనీలో జాబ్‌కట్సుగురించి విన్నాను” అన్నాడు.

చంద్రం ప్చ్ అన్నాడు భుజాలు కుదించి. “ఇంతదాకా రానేవచ్చింది, ఇహనెందుకు మొహమాటం” అనుకుని, “మీ కంపెనీలో ఏమైనా అవకాశాలుంటే చెప్పండి. నాకు వూరికే కూర్చోడం చాలా కష్టంగా వుంది” అన్నాడు ఆయనతో.

జగదీశ్ “అలాగే తప్పకుండాను. నేను మా ఎచ్చార్‌‌ని కనుక్కుని చెప్తాను. మీ సెల్లివ్వండి” అని నెంబరు తీసుకుని, శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయాడు.

చంద్రం ఆశలు మేస్తూ ఇల్లు చేరుకున్నాడు ఆపూటకి తిరుగుళ్ళు ముగించి.

నాలుగు రోజులయింది. జగదీశ్ కంపెనీనుండి చంద్రానికి పిలుపు వచ్చింది.

“హలో. చంద్రంతో మాటాడాలి. వున్నారా?”

“యస్యస్. నేనే. చంద్రమే మాటాడుతున్నది.”

“మీవిషయం జగదీశ్గారు చెప్పేరు. ఇంటర్వూకి సోమవారం పదిన్నరకి వీలవుతుందా? లేక రెండు గంటలకా?”

ఆలస్యం అమృతం విషమని కదా నానుడి. “పదిన్నరకి రాగలను.”

“సరే. మా హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టరుతో సోమవారం పదిన్నరకి మీ ఇంటర్వూ నిర్ణమయినది. మీకు ఎక్కడికి రావలెనో తెలుసా?”

“తెలుసు, తెలుసు. సోమవారం పదిన్నరకి మీ హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టరుని కలుసుకోడానికి వస్తాను.” అని వివరాలు వల్లెవేసి, తనకి అర్థం అయినట్టు తెలియజేసి,  సెల్లు మూసి చంద్రం నిట్టూర్చేడు.  తరవాత మనోరమతో చెప్పేడు తనకి రాబోయే వుద్యోగం సంగతి.

ఆవిడ కూడా అతని ఆనందంలో పాలు పంచుకుంది.

సోమవారం, ఫలానాకంపెనీలో ఎచ్చార్ డైరెక్టరు థాంసన్‌ని కలుసుకున్నాడు. డైరెక్టరుగారు సాదరంగా మాట్లాడేరు. కంపెనీ అంతా చూపించేరు. అతని డ్యూటీ వివరించేరు – వేరే ఇంజినీర్లు వేసిన బ్లూప్రింటులు కంప్యూటరులోంచి తీసి, ప్రింటు చేసి, నీటుగా మడత పెట్టి వర్కర్లకి ఇవ్వడం.

“మీకు ఇష్టమయితే రేపే చేరొచ్చు” అన్నాడు థాంసన్, పక్కా వ్యాపారసరళిలో.

“గంటకి ఆరు డాలర్ల ఇరవై అయిదు సెంట్లు. రోజుకి ఎనిమిది గంటలు పని.” అని కూడా చెప్పేడు.

చంద్రానికి ఛెళ్లున మొహమ్మీద కొట్టినట్టుంది తాను చెయ్యబోయే పని తలుచుకుంటే. వెంటనే నాలుగునెలలుగా తను పడుతున్న అవస్థలు మనసులో మెదిలేయి. “బుర్రతో పనిలేని పని నాకలవాటే” అని తనకి తనే, అక్కడికక్కడే నచ్చచెప్పుకుని, “సరే, రేపు వస్తాను” అని థాంసన్‌కి చెప్పి బయల్దేరేడు. కుంజరయూధంబు దోమ కుత్తుకసొచ్చినట్టు గొంతులో వెగటు. తిన్నగా ఇంటికి వెళ్లాలనిపించలేదు. దారిలో స్టార్ బక్స్‌లో ఆగి ఓ మూల కూర్చున్నాడు.

బాలరసాలసాలనవపల్లవకోమల కావ్యకన్యకని తాను అమ్ముకోడంలేదు … కానీ … ఆతల్లి పెట్టిన భిక్షే తన ఇంజినీరింగు చదువు. ఆ విద్యమూలంగానే తనకీ, మనోరమకీ, పిల్లలిద్దరికీ కూడు. తనజన్మలో అనుకోలేదు ఆవిద్య విలువ ఇంతగా పడిపోతుందని.. మనోరమకి ఏమని చెప్పడం. … రెండు గంటలసేపు ఆలోచించి, నెమ్మదిగా ఇల్లు చేరుకున్నాడు.

మనోరమ ఇంట్లోనే వుంది.

“రేపు చేరుతున్నా గ్రీన్ మెటల్‌లో” అన్నాడు మనోరమ మొహంలోకి చూడకుండా.

“నిజంగానే! పోన్లెండి. ఈరోజుల్లో ఇంత త్వరగా దొరకడం గొప్పే” అంది మనోరమ.

“అవును” అనేసి లోపలికి వెళ్లిపోయాడు చంద్రం.

ఈపనికి ఇంజినీరింగు చదవక్కర్లేదు. హైస్కూలుచదువు చాలు. ఆమాట ప్రతిక్షణం ముల్లయి తాకుతోంది చంద్రం ఎదలో. రోజూ రాత్రి రంగులబుడగలు చితగ్గొడుతున్నాడు “బుర్రలేని పని” “బుర్రలేని పని” గొణుక్కుంటూ.

రెండు మాసములఅంతమందు  రెవ్యూకి పిలిచాడు థాంసన్.

ఆసమయంలో చంద్రం తన హృదయబాధ వెళ్లబోసుకున్నాడు, “నేను ఇంజినీరుని. నాలుగేళ్లఅనుభవం వుంది నాకు. అంచేత నాకు తగిన పని ఇవ్వండి” అని.

“మీరు చేరినరోజే చెప్పేం కదా ఈ పనిలో మీ విధ్యుక్తధర్మాలు. మీరు ఇష్టపడే చేరేరు.”

“అవుననుకోండి. కానీ మీరూ గ్రహించే వుంటారు నావిద్యని మీరు అండర్‌యుటిలైజు చేసుకుంటున్నారని. గ్రోసరీస్టోరులో సంచీలో కూరలు పెట్టేవాళ్లకి గంటకి పన్నెండు డాలర్లు ఇస్తున్నారు. ఆపాటి చెయ్యనా ఇక్కడ?”

“ఎక్కడిపద్ధతులు అక్కడే. జేన్స్‌విల్లో కార్ల ఎసెంబ్లీ చూసారా మీరు? కన్వేయర్ బెల్టుమీద కారు భాగాలు ఒకొకటే వస్తూంటాయి. ఒకడు తలుపు తగిలిస్తాడు. మరొకడు మేకు తగిలిస్తాడు. రోజంతా వారిపని అదే. రోజుకి ఎనిమిదిగంటలు అలా మేకులు తగిలించడమే. వాడికి గంటకి ముప్ఫై డాలర్లు.” అన్నాడు థాంసన్. “మీరు చేయగలరా ఆపని?” అన్న ప్రశ్న ఆయన అడక్కపోయినా. చంద్రానికి వినిపించింది.

ఉసూరుమంటూ వచ్చి తనసీటులో కూర్చున్నాడు. పక్కనున్న టేమీ జాలిగా అతనివేపు చూసింది.

“నీకు ఈపని చూపించింది ఎవరు?” అని అడిగింది.

“జగదీశ్. ఏం?”

“ఆయనకిచ్చే వందా నీకే ఇవ్వొచ్చు కదా.”

“అదేమిటి?”

“ఈచెత్తపనికి ఎవరూ రారు. వచ్చినవాళ్లు ఆర్నెల్లకంటే వుండరు. అంచేత మనలాటివాళ్లని తీసుకొచ్చి వీరికి అప్పచెప్పినవాళ్లకి వంద డాలర్లు బోనస్ ఇస్తారు. పెద్దలకయితే వందా, పిన్నలకయితే యాభై.”

చంద్రానికి బాధపడే ఓపిక లేదు. “ఓ” అనేసి వూరుకున్నాడు.

నాలుగు రోజుల తరవాత ఒకరోజు థాంసన్ కాఫీషాపులో కనిపించేడు. చంద్రం మర్యాదకి హలో అన్నాడు.

ఆయన తనపక్కన సీటు చూపించి అన్నాడు, “రండి, చందారా! నాకో ఆలోచన వచ్చింది. మీరు వింటానంటే చెప్తాను.”

“చెప్పండి.”

“నేను రిటైరవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడే కాదులెండి, మరో రెండోళ్లకో మూడేళ్లకో. అయొవాలో వంద యకరాలు మొక్కజొన్నతోట కొన్నాను. ఇప్పుడు ఎథెనాల్‌కి మంచి గిరాకీ వుందికదా. నేను ఇప్పుడప్పుడే ఆపని చేపట్టలేను. ప్రస్తుతానికి మానాన్న అక్కడ వున్నారు కానీ ఆయనకి మెషినరీ ఆపరేట్ చెయ్యడం చేతకాదు. అంచేత మీరు సాయం చేస్తానంటే చెప్పండి. మీది స్వెట్ ఎక్విటీ. లాభం ఇద్దరం పంచుకుందాం. వ్యాపారం అందుకునేవరకూ మీకు భుక్తికి లోపం లేకుండా చూస్తాను.”

ఆయన ప్లాను అర్థం చేసుకోడానికి చంద్రానికి చాలాసేపు పట్టింది. ఆయన మాత్రం మామూలుగానే లోకరీతిన వ్యవహారదక్షతతో చెప్పుకుపోతున్నారు. మూడు చుట్లు కాఫీలయేయి.

చంద్రానికి ఇంతవరకూ గ్రీన్ మెటల్‌లో జరుగుతున్న నాటకం మనసులో మెదులుతోంది. “మంచి ప్లానులాగే వుంది” అన్నాడు సందిగ్ధంగా.

“మంచి ప్లానే కానీ ఇంకా ప్రారంభదశలోనే వుంది. ఆలోచించుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. మీకు ఆసక్తి వుంటే మాట్లాడుకుందాం.” అన్నాడు బల్లమీద పది డాలర్లు పెట్టి.

చంద్రం వాలెట్ తీసేడు. “నో, నో. నేనిచ్చేశాను. మీరివ్వక్కర్లేదు.” అని థాంసన్ వారించేడు.

చంద్రం ఇంటికొచ్చి రాత్రంతా ఆలోచించేడు.  నిజంగా తనచదువుకు తగిన వుద్యోగం కాదు కానీ బుడగలు చితక్కొట్టడం కంటే మెరుగే.

పడగ్గదిలోకి వచ్చి చూస్తే, మనోరమచేతిలో పుస్తకం, కళ్లు సీలింగుమీదా వున్నాయి.

థాంసన్ సలహా చెప్పేడు.

“మీరేం అనుకుంటున్నారు?”

“ఏమో, నాకేం పాలుపోడంలేదు. ఇప్పుడు చేస్తున్న పని కంటే మెరుగే. ఏదో పల్లెలో పడుంటాం.” అని మంచంమీద వాలి, “హాలికులైననేమి … నిజదార సుతోదర పోషణార్థమై …” అన్నాడు.

మనోరమకి కళ్లలో నీళ్లు తిరిగేయి.. భర్తకి కనిపించకుండా అటుతిరిగింది. తరవాత అతికష్టంమీద, గొంతు సవరించుకుని, “అంతేలెండి” అంది.

“అయినా ప్లాను ప్రారంభదశలోనే కదా వుంది. ఆలోచించుకోడానికి చాలా టైముంది” అన్నాడు చంద్రం తనని తనే నమ్మించుకోడానికి తంటాలు పడుతూ.

***

(న్యూజెర్సీ తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచిక, మే 2009, లో  ప్రచురించబడింది.

తెలుగుజ్యోతి సంపాదకవర్గం సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రితం.  – సం. మాలతి. )

(మార్చి 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

19 thoughts on “హాలికులైన నేమి …”

 1. అందుకే…..అందుకే మీరంటే ఇష్టం.కాలమాన పరిస్థితులకణుగుణం గా కధలు మలిచేస్తారు.అందుకే మీ కధల కోసం ఎదురుచూస్తూ వుంటా.

  మెచ్చుకోండి

 2. “ఓ హ్హాదా! ఆగస్ట్ బార్డోల్టి చేసాడు ఆ ప్రతిమని. అతను అమెరికను కాదు. ఫ్రెంచి మనిషి. అమెరికా యెంతో గొప్పదనుకున్న ఫ్రెంచి మనిషి. తన స్వంత తల్లిని చూసి చిత్రించాడు”
  “ఎక్కడుందండి,ఆ ప్రతిమ?” అని అన్నాను.
  “న్యూ యార్క్ బయట బెడొల్ ద్వీపం మీద వుంది. ….ఆ విగ్రహం వీపు అమెరికా వేపు చూస్తూ ఉంటుంది!” అని పక పకా నవ్వుకున్నాడు ఆ సైయ్లర్.
  “మీ దేశంలో రెక్కలాడితే డొక్కాడుతుందో లేదో నాకు తెలియదు. మా దేశంలో ఒక్కటాడినంత మాత్రాన్నే రెండొదికూడా ఆడదు. రెక్కల్తో పాటు – మెదడమ్ముకోవాలి, నవ్వే కళ్ళమ్ముకోవాలి,గుండ్రం గుడ్రం గా పెంచుకుని అవయవాలను అమ్ముకోవాలి, ప్రేమనమ్ముకోవాలి, అప్యాయాన్నమ్ముకోవాలి. ఇవ్వన్నీ మగవడిని నేనమ్ముకోవాలనుకుంటే మాత్రం కొనేవాళ్ళెవళ్ళు?…నేను కూడా ఒక యంత్రాన్ని కావాలి; యంత్రంలో బోల్టుని కావాలి! నా నాశనాన్ని నేను అమ్ముకోవాలి.”

  జీవచ్చవాలు కధలో అమెరికన్ సైయ్లర్ పాత్ర సంభాషణలు అవి. వాటిని గుర్తు చేసింది మీకధ.

  ఆకలి కి తట్టుకోలేక, రోకళ్ళు పగిలే రోహిణి ఎండల్లో, ఫుట్‌పాత్ మీద ఉన్న తుప్పుపట్టిన కొళాయిని తెరిచేటప్పుడు, చుంయ్ మని కాలిన వేళ్ళతో, ఆవిర్లు కక్కుతున్న ఎర్రని నీటితో, పెదాలు, నాలుక కాలుతున్నా, కడుపునింపుకోవడానికి నానా తంటాలూ పడుతున్న ఆ మధ్యతరగతి, మధ్య వయస్కుడు – గుర్తొస్తూన్నాడు. కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాడు. మీ కధ చదివిన తరువాత మరీను.

  గట్టిగా భుజం పట్టుకుని ఊపుతూ, “కాల్ అణా, ఇవ్వవా బన్ను కొనుక్కుంటాను” అని అడుగుతుంటే గబుక్కున లేచాను ఈ ప్రపంచంలోకి. ఇంకా ఏం వ్రాయమంటారండి?

  మెచ్చుకోండి

 3. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి – “చాటు పద్య మణి మంజరి” లో కొంత వివరం దొరకవచ్చు. వీరి పుస్తకాలు, హైదరాబాదులో ట్రస్టు ద్వారా ఇదివరలో దొరికేవి.
  అలాగే, జి. లలిత గారి – ” చాటు పద్య కవిత్వం” లో కూడ. వీరి పుస్తకాన్ని “క్వాలిటి పబ్లికేషన్స్ “,౨౯-౨-౩౯, (29-2-39) రామమందిరం వీధి, విజయవాడ ౫౨౦ ౦౦౨ వారు ప్రచురణ. (౦866)2433261 / 9848415560

  మెచ్చుకోండి

 4. చాలా బాగుంది మాలతి గారు. నేను కొద్ది రోజుల కితమే అనుకుంటూ వున్నా నా వుద్యోగం పోతే నేను పగలకొట్టగల బుడగలు ఎక్కడ ఎక్కడ వుంటాయి అని. అదేమంటే మనని మనమే ఇంకోరకం గా కూడా వూరడించుకోవచ్చు.. అమెరికా లో డిగ్నిటి ఆఫ్ లేబర్ వుండదు.. ఏదైనా చెయ్య వచ్చు అని. ఆశలతో పరుగెత్తుకు వచ్చే మాలాంటి వాళ్ళ కథ బాగా రాసేరు.

  మెచ్చుకోండి

 5. కామేశ్వరరావుగారూ, మీకెంతయినా కృతజ్ఞురాలిని. చాలా సంతోషం అండీ కరెక్టుగా ఛందోబద్ధంగా పాదాలవిరుపుతో అందించినందుకు.
  సూర్యుడు, పరిమళం, మీకు నచ్చినందుకు సంతోషం. కరెక్టు వెర్షనుకి కామేశ్వరరావుగారు ఇచ్చిన లింకు చూడండి.
  మాలతి

  మెచ్చుకోండి

 6. మాలతి గారు, తెరెసా గారు,

  ధన్యవాదాలండి. పద్యంతోపాటుగా అర్ధంకూడా తెలిసిండి 🙂

  నమస్కారములతో,
  సూర్యుడు 🙂

  మెచ్చుకోండి

 7. తెరెసా, కందమూల ప్లస్ ఔద్దాలికుల – ఈరెండు పదాలమధ్య సంధి ఏదో వుండాలనుకుంటానండీ. మీ వివరణకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. “గహనాంతర కందమూలకౌద్దాలికులైననేమి”– మాలతిగారూ, ఈ మాట ‘ఔద్ధాలికులు’ అనుకుంటానండీ, అంటే తేనె పట్టుకునేవాళ్ళు. మట్టి పిసికే రైతులైతేనేమి,దుంపలు ,తే్నె సేకరించేవారైతేనేమీ… అని అర్థమేమో!!

  మెచ్చుకోండి

 9. నాకు గుర్తున్నంతవరకూ, ఇదండీ ఆపూర్తి పాఠం –
  బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
  గూళలకిచ్చి అప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
  హాలికులైన నేమి గహనాంతరసీమల కందమూల కౌ
  ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై!

  అతిమృదువైన మామిడి చివుళ్లవంటి సుకుమారమయిన కావ్యకన్నియని దుర్మార్గులకి అప్పగించి ఆ వచ్చిన డబ్బు తినడం కంటే, సుకవులు గుహల్లో నివసిస్తూ, పొట్ట గడుపుకోడానికీ, ఆలుబిడ్డలని పోషించటానికీ కందమూలాలు తవ్వుకునే హాలికులు అయితే తప్పేమి.
  ఇక్కడ, గూళలు, కౌద్దాలికులు అన్నమాటలకి నాకు అర్థం తెలీదు. దయచేసి ఎవరైనా చెప్పగలరు.

  మెచ్చుకోండి

 10. దయచేసి ఈ పద్యాన్ని ఇక్కడెవరైనా పూర్తిగా పెట్టగలరా?

  ధన్యవాదాలు,
  సూర్యుడు 🙂

  మెచ్చుకోండి

 11. హాలికులైననేమి, శ్రమ సౌందర్య పిపాసులు కారా
  పంట పండిస్తేనేమి, నలుగురి కడుపు నింప
  హలము పట్ట బలరాముడే కావలెనా…
  కలము పట్టిన చేత హలము పట్టలేదా పోతన

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s