“నేను” కథ

మునిసిపల్ ఆఫీసులో నేను కొత్తగా ఉద్యోగంలో చేరినరోజులు.

నేను చేరడానికి పదిరోజులముందు చేరేట్ట సత్యం అని ఒక టైపిస్టు. వంకరటింకరగా గీసినట్టున్నకళ్లూ, తుప్పజుత్తూ, పొట్టిగా, పీలగా, గట్టిగా గాలేస్తే ఎగిరి పడతాడేమో అన్నట్టుండేవాడు.

యస్సెల్సీ అయిందనిపించుకుని టైపు నేర్చుకుని ఉద్యోగంలో చేరేడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు.

రెండురోజుల్లో నాకు అర్థమయింది. ఆ అబ్బాయికి కొంచెం నత్తి. అంచేతే మాట్లాడడు. అంచేతే పెద్ద చదువులకి పోకుండా టైపు నేర్చుకుని, మాట్లాడక్కర్లేని పనిలో స్థిరబడ్డాడు.

నాకు మరికొన్ని వివరాలు తెలిసేసరికి మరో రెణ్ణెల్లు పట్టింది. వాళ్లమ్మ పొరుగూరు మునసబుగారింట్లో పాచిపని చేస్తుందిట. మునసబుగారు ఇక్కడ ఆఫీసులో తన పలుకుబడి వినియోగించి టైపిస్టు వుద్యోగం ఇప్పించేరు.

ఆఫీసులో సత్యాన్ని సత్యనారాయణ అని పూర్తిపేరుతో ఎవరూ పిలవగా నేను వినలేదు. సత్యం అని కూడా కాదు. అయితే సత్తిగాడు లేకపోతే నత్తిగాడు అనే.

టైపు మాత్రం చాలా బాగా చేసేవాడు. కుప్పలు, కుప్పలు పైళ్లు ఇట్టే టైపు చేసి పారేసేవాడు. ఒక్క తప్పులేకుండా. సార్ ఎప్పుడయినా ఉత్తరాలు డిక్టేటు చేస్తే, ఏదో రాస్తున్నట్టు గిలికేవాడు షార్టుహేండులో. తరవాత తనభాషలో టైపు చేసేసేవాడు. నాకు అది తెలుసుకోడానికి కొంత కాలం పట్టింది. ఓరోజు అడిగేను, నిజంగా నువ్వు షార్టుహేండు తీసుకుంటున్నావా అని. అతను నవ్వి తనసీటుకి వెళ్లిపోయేడు. అదే తొలిసారి అతనిమొహమ్మీద నవ్వు చూడ్డం నేను. నాకు కూడా సంతోషంగా అనిపించింది ఆపూట.

సత్యాన్ని ఎగతాళి చేసేవాళ్లలో ముఖ్యుడు కనకరాజు. అతడు స్ఫురద్రూపి. ఒడ్డూ పొడుక్కీ తగ్గట్టు పచ్చని పసిమిరంగు శరీరచ్ఛాయా, ఎక్స్‌రే కళ్లూ, ఉంగరాలజుత్తూ -కథానాయకుడికి కావలసిన హంగులన్నీ వున్నాయి. ఆపైన కలవారి అబ్బాయిట. చదువుమీద శ్రద్ధ లేకపోవడంతో బియే అవగానే ఉద్యోగంలో పెట్టేరు వాళ్లనాన్నగారు. సరదాకో కాలక్షేపానికో వస్తున్నట్టు వేంచేసేవాడు ఆఫీసుకి.

కనకరాజు కూడా సత్యాన్ని సత్యం అని నోరారా పిలవగా నేనెప్పుడూ వినలేదు. ఎప్పడయినా సరే, ఎవరిఎదుట అయినా సరే “ఒరే సత్తిగా,” “నత్తిగా,” “పొట్టోడా,” “సోడాబుడ్డీ కళ్లోడా” … ఇలాగే వుండేవి అతని సంబోధనలన్నీ.

అక్కడికీ వూరుకోలేక ఓసారి అడిగేను, “కనకరాజుగారూ, ఎందుకండీ అతన్ని అలా పేర్లు పెట్టి హేళన చేస్తారు?” అని.

కనకరాజు తేలిగ్గా నవ్వేసి. “అదేంలేదు మేడం. చిన్నప్పట్నుంచీ ఎరుగున్నోళ్లం. ఒకే వూరోళ్లం. ఆడేం అనుకోడు మేడం.” అన్నాడు.

నిజమే కాబోలు అనుకున్నాను. ఎందుకంటే నాకూ వున్నారు అలాటి స్నేహితులు. అచ్చంగా అలాగే కాకపోయినా, ఒకరినొకరం మాట అనుకోడం, నవ్వేసి వూరుకోడం నాకూ అలవాటే. నా కాలేజీరోజుల్లో కమ్మవారమ్మాయ నాక్లాసుమేటు. నన్ను “నల్లబ్రాహ్మల్ని నమ్మకూడదు” అనేది తను. “కమ్మల్నీ తుమ్మల్నీ నమ్మరాదు” అనేదాన్ని నేను. అక్కడితో సరి. దాన్నెప్పుడూ మేం కులాలవారీయుధ్ధంగా తీసుకోలేదు. మాస్నేహానికి అంతరాయం కలగలేదు. ఇప్పటికీ నేను విశాఖపట్నం వస్తే నన్ను చూడ్డానికి విజయవాడనించి వస్తుంది. కనకరాజుకీ సత్యనారాయణకీ కూడా అలాటిస్నేహమేనేమో అని నేను వూరుకున్నాను.

మధ్యాహ్నం టిఫిను టైమవుతోంది. చూస్తున్న ఫైళ్లు మూసేసి, లేవబోతుంటే, సత్యం నాబల్లదగ్గరకి వచ్చేడు. ఏదో ఒకటి మాట్లాడాలి కనక, “అయిపోయిందా పని?” అన్నాను.

సత్యం తలొంచుకు నిలబడ్డాడు. ఆతరవాత ఓకాయితం నాకు అందిచ్చాడు చూడమని.

చదివేను. పది భావకవితలు చదివి వాటిలోంచి నాలుగుపాదాలు తీసుకుని ఎవరో అమ్మాయిని ఉద్దేశించి రాసినట్టున్నాడు. నాకు నవ్వొచ్చింది కానీ నవ్వలేదు. “బాగుంది” అని చెప్పి తిరిగి యిచ్చేసాను ఆ కాయితం.

కొంచెంసేపు వూరుకుని, “ఎందుకు మేడం, అందరూ నన్ను అలా మాటలంటారు?” అన్నాడు నత్తి కప్పి పుచ్చుకోడానికి అవస్థ పడుతూ.

నాకేం చెప్పాలో తోచలేదు.

మళ్లీ అతనే నెమ్మదిగా, తలొంచుకుని నేలచూపులు చూస్తూ, “నేను మాత్రం మనిషిని కానా? నేనేం అందంగా లేనా?”

ఉలికిపడి తేరి చూశాను అతనివేపు.

అదే వేరే సందర్భంలో వేరే స్థలంలో ఇంకెవరైనా కనిపించి, “మీఆఫీసులో సత్యనారాయణ అని ఓ అబ్బాయి వున్నాట్ట. ఎలా వుంటాడేమిటి చూడ్డానికి?” అని ఎవరైనా అడిగితే, తడుముకోకుండా వెంటనే, “ఘోరంగా వుంటాడు” అనేసివుండేదాన్ని. ఆతరవాత నన్ను నేను రక్షించుకోడానికి మళ్లీ “చూడ్డానికి ఘోరంగా వుంటాడు కానీ మనిషి మంచివాడు, పని బాగా చేస్తాడు కానీ ..చూడ్డానికి మాత్రం …” అంటూ నాలుగు నంగిమాటలు నసిగేదాన్నేమో.

కానీ ఈక్షణం … ఈ పర్టిక్యులర్ క్షణంలో నాకు తెలివొచ్చింది. అతని ప్రశ్నలో సత్యం బోధపడింది. ఈక్షణంలో నేను చూసిన సత్యంమొహం జన్మలో మరువలేను.

ఆక్షణంలోనే నాకు అర్థమయింది. అతన్నిగురించి నేను ఏం అనుకుంటున్నాను అన్నది కాదు ప్రధానం. అతనికి తనమీద తనకి గల అభిప్రాయమే నేను గౌరవించాలి.

నాకు తేరుకోడానికి రెండు నిముషాలు పట్టింది. “ఎందుకలా ఆనుకుంటారు మీరు? మీగురించి మీకు వున్నఅభిప్రాయం ప్రధానం కానీ ఎవరో ఏదో అంటున్నారని మీరెందుకు బాధ పడడం?” అన్నాను.

నామాటలు నాకే బోళాగా వినిపించేయి. కానీ అంతకంటే ఏం చెయ్యను? ఏం చెప్పగలను? మనకొచ్చిన చదువులూ, మనం నేర్చిన నాగరికతలూ అలాటివి.

“నమస్తే మేడమ్” అనేసి సత్యం వెనుదిరిగి వెళ్లిపోయేడు.

నాకు మాత్రం ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.

ఆతరవాత వరసగా రెండురోజులు ఆఫీసులో మిగతా గుమాస్తాలు కూడా సత్యాన్ని ఎగతాళి చెయ్యడం మొదలు పెట్టేరు.

“ఏరా నత్తిగా! ప్రేమగీతాలు రాస్తన్నవేటి? ఎవుర్రా ఆ పిల్ల?”

“జాగర్తరోయ్. పిల్ల తాలూకాళ్లు చూసేరంటే మక్కలిరగదన్నేగల్రు.”

“నత్తోడికి పిల్లనెవరిస్తార్రా ఎర్రెదవా. ఆయిగ నీబతుకేదో నివ్వు బతుకు. ఎర్రేసాలు పోమాక.”

వాళ్లమాటలు చూస్తే నాకు మహ చిరాకేస్తోంది. కనకరాజు మాటలు గుర్తొచ్చేయి. వాళ్లకీ వాళ్లకీ వున్న స్నేహాలు అలాటివిలే అని నన్ను నేను సమాధానపర్చుకోడం కూడా కష్టంగానే వుంది.

ఆరోజు సత్యం కొత్తచొక్కా, కొత్తపేంటు వేసుకు వచ్చాడు. తుప్పతల కూడా అదుపులో పెట్టడానికి ప్రయత్నించినట్టే వుంది. మనిషిలో ఎన్నడూ లేని హుషారు కనిపిస్తోంది. ఏదో విశేషం వుంది అనుకున్నాను కానీ అడగలేదు. తలొంచుకుని ముందున్న ఫైలు చూస్తున్నాను.

“ఏరా, పెళ్లికొడకా, ఎప్పుడ్రా పప్పన్నాలు?” అంటూ కనకరాజు వచ్చేడు.

నేను తలెత్తి చూశాను. సత్యం మాటాడకుండా టైపు చేసుకుపోతున్నాడు తనమానాన.

“ఒరే, నామాటిని చేస్కోనని చెప్పెయరా. చేసుకుంటివా, కనీసం మరో అవిటోన్ని పుట్టించి నాలాటోల్ల ప్రానాలు తీమాక” కనకరాజు నవ్వేడు గలగలా.

సత్యం తలెత్తి విసురుగా చూసేడు.

ఆమాట ఏసంబంధమూ లేని నాకే ఛెళ్లున తగిలింది. “కనకరాజుగారూ,” ఏదో అనబోతున్నాను. నావాక్యం పూర్తి కానేలేదు. సత్యం చేతిలో వున్న క్లిప్ బోర్డు విసిరికొట్టేడు కనకరాజుమీదికి. అది కనకరాజు నుదుటికి తగిలి నేలమీద పడింది ఠప్మని చప్పుడు చేస్తూ. కనకరాజు నుదురు చిట్లింది.

కనకరాజు నోటికిరాని తిట్లు లంకించుకుని, సత్యంకాలరు పుచ్చుకుని గుంజేడు. మరో ఇద్దరు గుమాస్తాలూ, ఆఫీసు ప్యూను వచ్చి వాళ్లని విడిపించేరు.

సార్ గబగబా వచ్చేరు “ఏమయిందేమయింది?” అంటూ.

అక్కడ వున్నవారందరూ గలగలా ఎవరి వెర్షను వాళ్లు చెప్పడం మొదలెట్టేరు గోలగోలగా. మౌనంగా చూస్తూ వూరుకున్నదాన్ని నేనొక్కర్తినే.

సార్ షటప్ అని అరిచి అందరినోళ్లూ మూసి, ఎవరి సీటులోకి వారిని తోలేసి, కనకరాజూనీ, సత్యాన్ని “పదండి నారూంకి” అంటూ తనవెంట తీసుకుపోయేరు.

ఓగంట తరవాత, నన్ను పిలిచేరు. “మీ సెక్షనులో మీసమక్షంలో జరిగింది కనక మీకే సంగతి బాగా తెలియాలి. అంచేత మీరు రిపోర్టు రాసి ఇవ్వండి. తరవాత నేను వాళ్లిద్దరిమీదా తగినచర్య తీసుకుంటాను” అన్నారు.

“అంతకుముందేం జరిగిందో, వాళ్లిద్దరిమధ్యన ఏం లావాదేవీలున్నాయో నాకు తెలీవండీ” అన్నాను ఆ రంధిలో ఇరుక్కోడం ఇష్టం లేక.

“అవన్నీ మనకి అక్కర్లేదండీ. ఈపూట మీరూంలో ఏంజరిగిందో మీరు చూసింది చూసినట్టు రాసివ్వండి చాలు. తరవాత నేను చూసుకుంటాను” అన్నారాయన.

“సరేనండీ” అని చెప్పి వచ్చేశాను. సత్యం నావేపు ఒకసారి చూసి తలొంచుకుని టైపులో పడిపోయేడు. పక్కగదిలో కనకరాజు సణుగుడు ఇంకా వినిపిస్తూనే వుంది.

ఆసాయంత్రం ఇంటికొచ్చి, కాఫీ తాగి, పత్రిక పట్టుకుని కూర్చున్నాను. కనకరాజు వచ్చేడు, “నమస్తే మేడమ్” అంటూ.

“రండి, ఏం ఇలా వచ్చేరు?” అన్నాను ఎదటికుర్చీ చూపిస్తూ.

కనకరాజు అట్టే తాత్సారం చెయ్యలేదు. “మీరు రిపోర్టు రాస్తున్నారుట కదా మేడమ్,” అన్నాడు.

“ఊఁ” అన్నాను కళ్లు చిట్లించి అతనివేపు చూస్తూ.

“అదికాదు మేడమ్. నాతప్పేమిటి చెప్పండి మేడమ్. నేనేం కానిమాట అంటినా?” అన్నాడు. తన తప్పేం లేదని గట్టిగానే నమ్ముతున్నట్టు కనిపించేడు,

“మీరు అలా అతన్ని నానాపేర్లూ పెట్టి పిలవడం బావులేదండీ మరీ” అన్నాను వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా. చాలారోజులుగా ఈమాట కనకరాజుకి చెప్పాలని వుంది నాకు.

“నేనేం లేనిమాట అన్నాను మేడమ్? అవిటోన్ని అవిటోడు అంటే తప్పెట్ల అవుతాది? వున్నమాటే గద. అది సత్యమే గద” అన్నాడతను.

“ఆమాట బాధిస్తుంది కనక” అన్నాను.

“అయితే, నన్నూ అనమండి పడతాను. అంతే కానీ కొడితే ఎట్లా? చూడండి చందమామలో మచ్చమాదిరి నుదుటిమీద ఈ మచ్చ శాశ్తంగా వుండిపోతంది. అసలు కొట్టానికి ఆడికేటి అధికారం వున్నది?”

నేను అతనివేపే చూస్తూ వుండిపోయాను కొన్నిక్షణాలపాటు. ఈమనిషితత్త్వం ఏమయివుంటుంది? కనకరాజుకి సంబంధించినంతవరకూ – లోకం సమస్తం తనచుట్టూ తిరుగుతోంది, తనకి తెలిసిందే జ్ఞానం. తనఅనుభవంలోకి వచ్చిందే వాస్తవం. తనకి కలిగిందే నొప్పి. అంతే.

కానీ ఎదటిమనిషి కూడా తనలాటివాడే అనీ, తనకిలాగే అవతలివాడికి కూడా ఓ మనసుంటుందనీ, అది నొచ్చుకోగలదనీ కనకరాజులాటి మనుషులకి తోచదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చునేమో కానీ కనకరాజుమనసు రంజింపజేయడం నాతరం కాదు..

“సరేలెండి. రేపు చూద్దాం. పన్లో వున్నాను,” అన్నాను చేతిలో పత్రిక కింద పడేస్తూ.

కనకరాజు లేస్తూ, “నామాదిరి అందగాడయితే అనుకోవచ్చును గానీ అవిటోన్ని అవిటోడు అంటే తప్పేంటి?” అంటూ మరోసారి వెకిలిగా నవ్వి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నిష్క్రమించేడు.

నాకు ఆలోచనలు ఒకంతట తెగలేదు. ఒకరిమీద చెయ్యి చేసుకోరాదు. ఈటెల్లాటి మాటలతో పోట్లు పొడిస్తే తప్పు లేదు. ఇదీ కోర్టులు చెప్పే న్యాయం. ఎదటివాడిమీద చెయ్యి చేసుకున్నవాడిదే తప్పు. వాడికే శిక్ష.

మరి నాకర్తవ్యం కూడా అదేనా? … “నేను అందంగా లేనా?” అంటూ ప్రశ్నిస్తూన్న సత్యం నామనసున మెదిలేడు. అతనిలో ఆ “నేను” … అదే అహం. అదే జీవం. అదే ప్రాణం. అదే పొద్దు పొడిచిందగ్గర్నుంచీ పొద్దుగూకేవరకూ మనిషిని నడిపించే మహాయంత్రం. అదే “అయిదురేకుల దీపకళిక”. ఎదటివారికి ఎంత హీనంగా కనిపించినా, మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడిలో ఆ“నేను” వుంటుంది నిస్సందేహంగా. వుండితీరాలి. సత్యం ఈరేడులోకాలా ఏ గణనాంకాల్లోకీ ఎక్కకపోవచ్చు కానీ తనకి తాను ఒక మనిషే1

కలం తీసుకున్నాను రిపోర్టు రాయడానికి.

***

(ఒకరు మరొకరిని ఎన్ని తప్పుడుమాటలయినా అనొచ్చు. ఫరవాలేదు. కానీ చెయ్యి చేసుకుంటే తప్పు. కోర్టుటీవీ ప్రోగ్రాంలలో చూశాను ఈ నీతి. ఆ స్ఫూర్తితో రాసిన కథ.)

(22 జూన్ 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

17 thoughts on ““నేను” కథ”

 1. “”అతనిలో ఆ “నేను” … అదే అహం. అదే జీవం. అదే ప్రాణం. అదే పొద్దు పొడిచిందగ్గర్నుంచీ పొద్దుగూకేవరకూ మనిషిని నడిపించే మహాయంత్రం. అదే “అయిదురేకుల దీపకళిక”. ఎదటివారికి ఎంత హీనంగా కనిపించినా, మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడిలో ఆ“నేను” వుంటుంది నిస్సందేహంగా. వుండితీరాలి.””
  simply superb..!!
  ఇంతకంటే ఏమీ అనలేను 🙂
  చాలా చాలా బాగుందోచ్.. 😉

  మెచ్చుకోండి

 2. @మహేష్ గారూ, మీరు కూడా ఈవిషయం స్పష్టం చేసినందుకు సంతోషం. వ్యక్తిగతదూషణలూ ఎప్పుడు ఎక్కడ జరిగినా గర్హించవలసిందే. త్వరలోనే ఇది పరిష్కారం అయి, అందరం మళ్లీ మన మామూలురచనల్లో పడతాం అని ఆశిద్దాం.

  మెచ్చుకోండి

 3. @మాలతి గారు: misleading లో మరో misleading ఏమిటంటే నేను పుస్తకం డాట్ నెట్ మీద కేసు వేయడం. నేను కేసువేస్తానన్నది కులవివక్షాపూరిత వ్యాఖ్య చేసిన వ్యక్తి మీద. పుస్తకం మీద కాదు.

  మెచ్చుకోండి

 4. సుజాతా, రమణీ, మీరు ఇద్దరూ నాపాయింటు చక్కగా పట్టుకున్నారు. అవును ఆ అహమే మంచికీ చెడుకీ కూడా ప్రాతిపదిక. థాంక్స్.

  జీడిపప్పుగారూ, మీరు వెంటనే సమాధానం సాదరంగా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం. ధన్యవాదాలు కూడా. నేను చెప్పేను కదా టపాలో వ్యంగ్యం మాట ఎలా వున్నా, శీర్షిక చాలా misleading. నేనయినా, ఎవరైనా ముందు చూసేది శీర్షికే కదా. ఏమయినా మీరు అభిమానంతోనే ఆ టపా రాసేరంటే నాతోపాటు సంతోషించేవారు చాలామంది వున్నారు.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ, మీరు http://jeedipappu.blogspot.com/2009/06/blog-post.html లో వేసిన కామెంటుకు నా స్పందన:

  మాలతి గారూ, నేను ఎప్పటినుండో అదే ఫేక్ ఐడీని వాడుతున్నాను 🙂
  ఇక పుస్తకం.నెట్ కేసు సంగతికొస్తే, పుస్తకాల అభిమానినయిన నాకు పుస్తకం.నెట్ సైటు పైన చెక్కు చెదరని గౌరవం ఉంది. మీరు గత కొద్ది రోజులు జరిగిన పరిణామాలు గమనించలేదేమో, అందుకే మీకు ఆ పోస్టులోని హాస్యం/వ్యంగ్యం అర్థం కాలేదు. అంతే కానీ నాకు పుస్తకం.నెట్ నిర్వాహకుల పైన ఎటువంటి వ్యతిరేకత లేదు. “నిజంగా మహేష్ కోర్టుకెక్కినా మీలాటివారు పుస్తకం.కే చేయూతనిస్తారనుకుంటున్నాను. ” అన్నారు. తప్పకుండా!! నేనే కాదు, బ్లాగులోకంలో చాలమంది చేయూతనిస్తారు.

  మెచ్చుకోండి

 6. అద్దంలో మన మనసుని బట్టి మన ప్రతిబింబం ఉంటుందిట, మనకి మనం బాలేదు అంటే బాలేదు, మనము బాగున్నాము అనుకొంటే అలానే కనిపిస్తామట, ఈ మధ్యే ఎవరో మిత్రులు అన్నమాట. “నేను” అనే స్వార్ధం “నేను” బాగుంటాను అని అనుకోలేకపోతే మనిషికి మనుగడ లేదు. నేను బాగోను ” అనే భావన/బాధ ఆత్మనూన్యతా భావానికి దారి తీసుతుంది సత్యం పాత్రలా. ఈ కథలో కనక రాజుది “నేను ” అన్న అహంకారం , స్వార్ధం ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టేది. ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టనంతవరకు ఈ “నేను” అన్న భావన చాలా గొప్పది.

  “(ఒకరు మరొకరిని ఎన్ని తప్పుడుమాటలయినా అనొచ్చు. ఫరవాలేదు. కానీ చెయ్యి చేసుకుంటే తప్పు. కోర్టుటీవీ ప్రోగ్రాంలలో చూశాను ఈ నీతి. ఆ స్ఫూర్తితో రాసిన కథ.)”

  చట్టానికి కళ్ళు లేవు కదా అందుకనే నేమో..

  కథ మటుకు చాలా బాగుంది మాలతి గారు.

  మెచ్చుకోండి

 7. అతనిలో ఆ “నేను” … అదే అహం. అదే జీవం. అదే ప్రాణం. అదే పొద్దు పొడిచిందగ్గర్నుంచీ పొద్దుగూకేవరకూ మనిషిని నడిపించే మహాయంత్రం. అదే “అయిదురేకుల దీపకళిక”. ….
  .అదే సమస్త సమస్యలకూ మూలం కూడా మాలతి గారూ! భలే ఉంది కథ

  మెచ్చుకోండి

 8. సుజాత, ఫణిబాబుగారూ, జీడిపప్పు, మేథ, హను, పరమళం, కొత్తపాళీ – మీకు అందరికీ ఈకథ బాగున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. టైము తీసుకుని మీఅభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.
  భానుప్రకాశ్, రిపోర్టు ఏం రాసినా, జరిగేది సారుగారు తీసుకునే చర్య ఇలా వుంటుందనుకుంటానండీ – కనకరాజు పరపతి వున్నవాడు. కాలక్షేపానికి ఉద్యోగంలో చేరినవాడు. అంటే అతన్ని ఏమీ అనలేరు. సత్యం అంటే ఎంతోకొంత సానుభూతి వుండేవుండాలి. పైసంఘటనతోనైనా. అంచేత అతన్ని కూడా ఏం అనాలనిపించదు. అంచేత ఇద్దరికీ మొదటివార్నింగు, ఇంకమీద జాగ్రత్తగా వుండండి అని ఓమెమో ఇచ్చి ముగించేస్తారు.
  ఆలోచనలు రేకెత్తించేది అని మీరు అన్నతరవాత, ఈమధ్య వస్తున్నవ్యాఖ్యలు కొన్ని చూసినతరవాత, నాకు అనిపిస్తోంది – ఇదే సంఘర్షణ – మానసిక హింస -భార్యాభర్తలమధ్య చూపితే, మన పాఠకులు ఎలా స్పందించి వుండేవారా అని.
  శారీరకహింసకంటే మానసికహింసకి ఎంచేత తక్కువ విలువ? ఋజువు చెయ్యడం కష్టం కనకనా?
  ఆలోచించి చెప్పండి.

  మెచ్చుకోండి

 9. పూజ్యులైన మాలతి గారికి,

  మీ కథలు మనసుని హత్తుకొని, ఆలొచింప చేసే విధముగా చాలా బాగుంటాయి.
  ఇంక ఈ కథ విషయానికొస్తే, మీ కథ చాలా బాగుందండి. మీ మిగతా కథలలాగే, ముగింపుని పాటకులకే వదిలేసారు.

  ఒకరిమీద చెయ్యి చేసుకోరాదు. ఈటెల్లాటి మాటలతో పోట్లు పొడిస్తే తప్పు లేదు. ఇదీ కోర్టులు చెప్పే న్యాయం. ఎదటివాడిమీద చెయ్యి చేసుకున్నవాడిదే తప్పు. వాడికే శిక్ష.

  మనస్సాక్షి అన్న కోర్టులో న్యాయం ఒక్కొక్కరికి ఒక విధముగా ఉంటుంది.

  నా మనస్సాక్షి కోర్టులో కనకరాజు చేసింది ముమ్మాటికీ తప్పే. అలాగే సత్యం చేసింది కూడా తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఎవరు ఏ తప్పు చేసినా ముందు హెచ్చరించాలి, ఆ తరువాతే ఏదైనా.

  మీ రిపోర్టులో ఏ న్యాయం ఇచ్చారో తెలుపగలరు.

  ధన్యవాదాలతో,
  మీ భాను ప్రకాశ్

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s