ఊసుపోక – సంతకంటె సంతోసమయ్య మాకు

(ఎన్నెమ్మకతలు 40)

బజారంటే నాకు ఈపాట గుర్తొస్తుంది.

ఓ పల్లెపడుచుని ఓ చిన్నవాడు అడుగుతాడు,

ధాన్యమయిన దంచగలవ పిల్ల నీవు అని.

ధాన్యమంటె దగ్గొస్తదయ్య మాకు

అంటూ చెప్పి, ఆపడుచుపిల్ల ఇంకా ఇలాగే తనకి చిరాకు కలిగించే మరో రెండు కూడా చెప్పేక, మరి

సంతకయిన ఎల్లగలవ పిల్ల నీవు – అని అడుగుతాడు.

సంతంటె సంతోసమయ్య మాకు – అంటుందిట ఆచిన్నది.

సంతకెళ్లడమంటే అదొక సోషల్ ఇవెంటు మరి.

పగలల్లా రెక్కలు ముక్కలు చేసుకుని, పండించిన కూరా, కాయా, అల్లిన తట్టా, బుట్టా, సకల సామగ్రి నెత్తికీ, కావిళ్లకీ ఎత్తుకుని పదిమందీ ఓచోట చేరి, మంచీ సెబ్బరా మాటాడుకుంటూ తమ వస్తువులు అమ్ముకునీ, కొనుక్కునీ, పొద్దు వాలేక ఇళ్లు చేరడం ఒక ఆహ్లాదకరమైన సామాజిక కార్యక్రమం వారికి.

ఇప్పుడు దీన్నే షాపింగు అంటున్నారు అచ్చతెలుగులో మన తెలుగుబాలురూ, బ్లాగరులూ.

ఈషాపింగుకి టైము మనచేతుల్లో లేదు. లేదు అంటే మనం అనుకున్నప్పుడు సాగేది కాదు. షాపరులు అంటే షాపులు పెట్టుకునేవాళ్లు ఎప్పుడు తెరుస్తే అపుడే మనం వెళ్లాలి. వెళ్తాం. ఏదో పండుగరోజు తెల్లవారుఝామున నాలుగుగంటలకి షాపు తెరువబడును అంటే రాత్రి రెండుగంటలకే షాపువాకిట పడిగాపులు కాచేవారున్నారంటే నమ్మండి. రెండోది షాపువారు ఏది అమ్ముతే అదే కొనుక్కుంటాం. మనకి ఏది మంచిదో కూడా వాళ్లే చెప్తారు.

ఆమధ్య ఒక ప్రకటన చూసేను “మీగది వైశాల్యం మీరు చెప్పండి. మీకు ఏ టీవీ సరిపోతుందో నేను చెప్తాను” అంటాడు ఆ ప్రకటనుడు. అది నాకు అర్థంకాదు. నాగది ఎనిమిదీ బై పదే అనుకుందాం. నాకు ముఫ్ఫైరెండంగుళాల టీవీ కావాలనుకుంటే నేను అదే కొనుక్కుంటాను కానీ “మీగదికి పదమూడంగుళాలటీవీ చాల”ని చెప్పడానికి అతడెవరు? అలా చెప్పడానికి అతడికి అధికారం వుందనుకుంటే, మరి నా స్వేచ్ఛ మాటేమిటి?

అలాగే మనం తొడుక్కునేబట్టలూను. వాళ్లే చెప్తారు మనకి ఏవి నప్పుతాయో, ఏ చొక్కా తొడుక్కుంటే మన కనుపాపరంగు మరింతగా వెల్లివిరుస్తుందో వాళ్లే చెప్పగలరు. అందుకే థోరో మహాశయుడు మనం tailor-made men అన్నాడు. ఈ రంగు మరియు స్టైలు సెన్సు నాకు పుట్టుకతోనే లోపించింది. నాచిన్నతనంలో పండుగో పుట్టినరోజులాటి వేడుకలో అయితేనే కొత్తబట్టలు. మాఅమ్మో అక్కయ్యో బజారుకెళ్లి ఏగుడ్డ వాళ్లకి నచ్చితే అది కొనేసి, పరికిణీ జాకట్టు కుట్టించుకొస్తే, అదే నా టేస్టుగా చెలామణీ అయిపోయింది.

అసలు మామూలుగా నేను బజారుకెళ్లడమే తక్కువ. ఎందుకోగానీ నాకక్కడ ఊపిరాడదు. అంచేత ఏషాపుకేనా వెళ్తే మొదట గుమ్మంలోనే నిలబడి చుట్టూ కలియచూస్తాను సుమారుగా నాకు నచ్చే దుస్తులుగల ర్యాక్కోసం. ఆ ర్యాకు “నాదగ్గరికెవరేనా వస్తారా?” అని దిగులుగా దిక్కులు చూస్తూ కాస్త ఎడంగా ఓమూల కనిపిస్తుంది. తీరా దగ్గరికెళ్లి చూస్తే నాకు రెండు విషయాలు ఠక్కున తెలిసిపోతాయి.

ఒకటి – ఆబట్టలు నాకు నాలుగు సైజులు పెద్దవి. నాలాటివారు ముగ్గురు తేలిగ్గా ఒకబ్లౌజులో సర్దుకోవచ్చు.  రెండు – అవి ఇండియాలో తయారయినవి. ఇండియాలో మహా అయితే నూటయాభై రూపాలయలకి దొరికే బ్లౌజుకి అమెరికాలో ఇరవై డాలరులు ధారపోయడానికి నాకు మనసొప్పదు. ఒకకారణం దానిమీద వచ్చేలాభంలో వెంట్రుకవాసి మాత్రమే ఇండియాలో పనివాళ్లకి అందుతుందన్న కటికనిజం తలపుకొచ్చి. కొంతకాలంక్రితం 60 మినిట్స్ షోలో చూపించేరు. కేరళలో జీనులు కుట్టే అమ్మాయిని – చిన్నపిల్లే 14 ఏళ్లుంటాయి – అమెరికా తీసుకొచ్చి చూపించేరు ఆపిల్ల కుట్టే జీనులు అమెరికాలో ఎంతకి అమ్ముతున్నారో. ఆఅమ్మాయి ఆశ్చర్యంతో అవాక్కయిపోయింది. … ఇంతకీ, నేనూ ఒప్పుకుంటాను, ఆబ్లౌజుకోసం నేను 1000 డాలర్లు టికెట్టుమీద తగలేసి ఇండియా వెళ్తే, 997 డాలర్లు నష్టమే నాకు అని. అయితే మాత్రం 😦

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అదేపనిగా బజార్లంట తిరగడం ఒక కాలక్షేపం మాత్రమే కాదు. ఒకొకప్పుడు “అనదర్ వే నాస్తి” అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే, మామూలుగా ఒకవస్తువుధర 300 రెట్లు ధర కడతారు సరికొత్త డిజైను అన్నపేరుతో. ఆతరవాత పది శాతం తగ్గింపు అంటూ మొదలెట్టి వేలంపాటలా ఇరవై, ముఫ్పై, ఆఖరికి డెబ్భైఅయిదు శాతం కోత ప్రకటిస్తారు. అంచేత, మనంవిప్పుడు ఈ సేలులకోసం, డీలులకోసం, స్టీలులకోసం పదే పదే షాపులసందర్శనం చేసుకోవాలి, వారం వారం కొండకెళ్లినట్టే.

షాపువాడికీ, స్వామివారికీ ఎప్పుడు కటాక్షం కలుగునో మనకి అగమ్యగోచరం!

ఈ సంతచూపులకి మరోకోణం – పూర్వం గుళ్లో కనిపించేవాళ్లు మనవాళ్లు. ఇప్పుడు కనిపిస్తున్నారు మాలులలో. బజారుకంటూ బయల్దేరినతరవాత ఏరోజు ఎవరిదర్శనం అవుతుందో అన్నది బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. అంతేకాదు. అలా ఎదురయినవాళ్లందరూ మనని చూడ్డానికే అక్కడికొచ్చేరన్న భ్రమలు కూడా వద్దు.

నామటుకు నాకు ఒక చిలిపి సరదా ఏమిటంటే అల్లంతదూరంలో నన్ను చూసి చూడనట్టు నటిస్తూ ఏబట్టలర్యాకువెనక్కో తప్పుకునేవాళ్లని గమనించడం. ఒకొకప్పుడు వాళ్లు ఎటు వెళ్తున్నారో చూసి, అటే వెళ్లి వాళ్లు నన్ను చూశారా, లేదా? లేక, నన్ను తప్పించుకోడానికి చూస్తున్నారా, మరియు లేక నేనే నా కుత్సితకబుద్ధితో వాళ్లని అపార్థం చేసుకుంటున్నానా? అనుకుంటూ తీవ్రమయిన ఆలోచనలతో సతమతమవుతాను.

మాపాపతో షాపింగు నాకు చాలా సరదాగా వుంటుంది. మొదట్లో, అంటే దానికి నాలుగూ, అయిదూ ఏళ్లప్పడు పిల్ల నావెంట నడిచేది. తరవాత తొమ్మిదీ, పది వచ్చేసరికి నాపక్కన నడిచింది. పదకొండి దాటినతరవాత, నేను తనవెంట నడుస్తున్నాను.

ఇహ షాపులోకి వెళ్లింతరవాత ఫార్సు – బట్టలర్యాకులు చిన్న చిన్న ద్వీపాల్లా పరుచుకు వుంటాయి షాపంతా. మాఅమ్మాయిని గురించి ఓమాట చెప్పాలి. మీనరాసిలో పుట్టింది. అంటే తెలుసుకదా. చేపపిల్లలాగే క్షణమయినా నిలకడ లేదు. ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అటూ ఇటూ పారిపోయేది చిన్నప్పుడు. అందుకని, నేనే చెప్పేను, నువ్వు అలా తప్పిపోయినప్పుడు, పక్కనే వున్న కౌంటరుదగ్గరకి వెళ్లి “నేను తప్పిపోయాను అని చెప్పు” అని చెప్పేను.

అక్కడినించి, నన్ను ఏమార్చి, తప్పిపోయి. ఏకౌంటరుదగ్గరికో వెళ్లి, “మా అమ్మ తప్పిపోయింది” అంటూ ఫిర్యాదు చేసేది. వాళ్లేమో ఇంటర్కమ్మీద “మలాతీ … మీరు, ఫలానా కౌంటరుదగ్గరికి వెంటనే రావలసింది” అని చాటింపు వేసేవాళ్లు.

“నేను కాదు తప్పిపోయిందీ, తనే తప్పించుకపోయిందీ” అని వాళ్లకి చెప్పుకోవాల్సొచ్చేది నేను. అవును మరి, నేను పిల్లని చూసుకోలేదంటారు కానీ “ఇంత ముద్దొస్తున్నమొహం” ఆ పబ్లిక్ ఎనౌన్సుమెంటుకోసం అలా చేసిందంటే ఎవరు నమ్ముతారు?

ఆతరవాత, నేను “తప్పిపోయేనని ఎందుకు చెప్పేవు?” అని అడిగితే, “నువ్వే చెప్పేవు కదా నేను తప్పిపోయేనని చెప్పు అని” అనేది. ఇంకా, “నేను (అంటే తను) తప్పిపోలేదు కదా. నేను అక్కడున్నాను  కదా” అని కూడా దబాయించేది. ఆనాడే గ్రహించేను ఈకాలప్పిల్లలతో వాదించి గెలవలేం అని.

ఇంతకీ ఈనాడు మాషాపింగువేడుకలు  – ఇద్దరం పది షాపులు తిరిగితే, నాలుగుషాపుల్లో తనకి నచ్చిన డ్రెస్సులు కనిపిస్తాయి. ఒకొకషాపులో రెండో మూడో చొప్పున. అవి తీసుకుని, ఫిట్టింగురూంలో ప్రవేశించి ఒకొకటే ధరించి బయటికి వచ్చి నాకు చూపిస్తుంటే అది నాకు ఒక ప్రైవేటు ఫాషన్ షో.

“ఎలా వుంది” అని అడిగిన ప్రతిసారీ నేను చూడవలసింది డ్రెస్సు కాదు, మాపిల్లమోము.

సుమారుగా ఆమొహమూ, నాజవాబూ ఈక్రింద పట్టికలో ఇస్తున్నాను.

చికిలించినకళ్లు   –                           ఫరవాలేదు.

మొహం ముడుచుకుంటే  –             మరొకటి చూద్దాంలే.

పూర్ణబింబమువోలె ప్రకాశించినప్పుడు –        తీసేసుకో.

గొంగళిపురుగుని చూసినమొహం  –            ప్చ్, బాలే.

ఇలా ఓ చుట్టు ఎంపికలఘట్టం అయేక, వున్నవాటిలో నచ్చింది అనుకున్నది తీసికెళ్లి “హోల్డ్”లో పెడుతుంది.

అలా రెండో మూడో హోల్ట్ అయేక, ఏదీ తీసుకోకుండా ఇంటికొచ్చేస్తాం.

మరో పదినిముషాలయేక, “ఇప్పుడే వస్తాను” అంటూ తనొక్కర్తే వెళ్లి, ఆ ఆపి పెట్టినవాటిలో ఒకటి తీసుకొచ్చేస్తుంది.

అప్పుడే అయిపోయిందనుకోకండి మా కొనుగోలు సీను.

మర్నాడు మావూళ్లో లేకపోతే మూడురోజులతరవాత వాళ్లవూళ్లో అది మార్చేస్తుంది. అవును. సాధారణంగా తాను కొనేవస్తువులు తనవూళ్లో కూడా వుండేషాపు అయివుండేలా చూసుకోడం కూడా షాపింగులో భాగమే!

తను ఫిట్టింగురూంలో మార్చుకుంటున్నప్పుడు ఒకొకప్పుడు, నేను దిక్కులు చూస్తూ నిలబడితే, సేల్స్ బాలికలు వచ్చి “మీకు నేను సాయము చేయగలనా,” అని అడుగుతారు. ఆమధ్య ఒకసారి ఎవరో “స్పానిష్ మాటాడేఅమ్మాయిని పిలవనా?” అని కూడా అడిగింది.

“వద్దులెండి. అది మరీ కష్టం. మళ్లీ స్పానిష్‌నించి ఇంగ్లీషో తెలుగో అనువాదం చేసేవాళ్లు కావలసివస్తుంది” అని చెప్పలేక, ఓ వెర్రినవ్వు నవ్వి, “లేదు, నేను మాఅమ్మాయికోసం చూస్తున్నాను,” అన్నాను.

బజారుయాత్రలో ఇంత హాస్యం వున్నప్పుడు, మరి బజారంటే ఎవరికి సంతసం కాదు, చెప్పండి!

(30 జూన్ 2009.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “ఊసుపోక – సంతకంటె సంతోసమయ్య మాకు”

 1. మీ షాపింగ్ ప్రహసనం బాగుంది.ముఖ్యంగా ఈ రొజుల్లొ పిల్లలతొ షాపింగుకు వెళ్లడం గురించి ఎంతొవాస్తవంగా చెప్పారు.

  మెచ్చుకోండి

 2. @సుజాతా, పదహారొస్తే ఎలాగో ఏమిటో – 🙂 అప్పుడు మనకి పాఠాలే పాఠాలు. – జబ్బ పుచ్చుకు పక్కకి లాగి, mom, we need to talk అంటూ 🙂

  @మధురవాణీ, – అదే టైపు – అనుకున్నా :)) . హహ

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  భలే బావున్నాయండీ సంత కబుర్లు. తెగ నవ్వేసాను నేనయితే 🙂
  మీ అమ్మయి షాపింగు గురించి చెప్తుంటే నా సంగతే గుర్తొచ్చింది.
  నేనూ అదే టైపు. అన్నీ చూసి, చివరికి రెండు సెలెక్ట్ చేసి, ఆ రెంటిలో ఏది బాగుందోనని మళ్లీ పక్కనున్న వాళ్ళ బుర్ర తినేసి అలా ఒక రెండు మూడు గంటలయ్యాక నాకేమి వద్దసలు ఇప్పుడు అని వచ్చేస్తాను ఒకోసారి :p

  మెచ్చుకోండి

 4. కత్తిలా ఉంది పోస్టు!
  ప్రకటనుడు..అద్భుత ప్రయోగం!

  ఆమధ్య ఒకసారి ఎవరో “స్పానిష్ మాటాడేఅమ్మాయిని పిలవనా?” సూపరు!

  మాలతి గారూ సరయూ తో మరీ ఈ మధ్యే సంతకెళ్ళొచ్చినట్లున్నారు కదూ!

  నా కూతురు ఆరేళ్ళ వయసులోనే నాకు చుక్కలు చూపిస్తోంది.పదహారొస్తే ఎలాగో ఏమిటో అని బెంగగా ఉందండీ ఈ పోస్టు చదివాక! పైగా “నీకేవి నచ్చాయో నువ్వు జస్ట్ చెప్పు, నాకు నచ్చిన డ్రెస్సు నేను తీసుకుంటా”అంటుంది(సలహా నువ్వు ఇవ్వు, నిర్ణయం నన్ను తీసుకోనివ్వు అని చెప్పడమనుకుంటా)

  మెచ్చుకోండి

 5. రమణి, మీక్కూడా సంతంటే సంతసం. బాగుంది.
  కొత్తపాళీ, అవుండీ ఒక్కో ఐటంకోసం ఒక్కో షాపు తిరగడం – ఎక్కేగుమ్మం, దిగేగుమ్మంతో నా వ్యాయామం సగం అయిపోతుంది. 🙂 గోరటి వెంకన్న పాట వినలేదండి, ప్చ్.
  రాధిక, మీ బడ్జెట్ మినిస్టర్లకి జోహార్, 🙂 మరి మీరు నిజంగా వాపసు చేసేరా? నాకు వాపసు చెయ్యడం మహ చిరాకు.
  పప్పు, ధన్యావాదాలు. మీసంతఅనుభవాలే నిజం సంత అనుభవాలు. చాలా బాగా చెప్పేరు.

  మెచ్చుకోండి

 6. అయితే మాలతి గారికి షాపింగు ఇష్టమన్న మాటా.బాగు బాగు.మొన్నా మధ్య లేడీసందరమూ పిల్లల్ని ఇళ్ళల్లో వదిలి ప్రశాంతం గా షాపింగు చేసుకుంటాము ఒక 500$ ఇవ్వండి అని బడ్జెట్ మినిస్టర్లకి చెపితే మరో మాట లేకుండా సరే అన్నారు.అలా ఎలా ఒప్పేసుకున్నారు అంటే మీ ఆడోళ్ళు మాటలయితే చెపుతారు కానీ ధర ఎక్కువ లో కొనాలంటే మనసొప్పదు.ఒక వేళ కొన్నా మళ్ళా ఇంటికొచ్చి చూసుకునేటప్పటి కి మనసు మారిపోతుంది.రిటర్న్ లని మళ్ళా వెళతారు మా డబ్బు మాకు వాపసు వచ్చేస్తుంది అని ధైర్యం గా చెప్పారు.ఇంతకీ వాళ్ళు తేల్చింది ఏమిటంటే ఆడవాళ్ళకి షాపింగు కి తిరగడమంటేనే ఇష్టం కొనడం కాదు అని .

  మెచ్చుకోండి

 7. భలే భలే
  ఈ కతలో కొత్త పలుకుబళ్ళు గొప్ప మజాగా ఉన్నాయి.
  ఈ మధ్యకాలంలో భారతీయ నగరాల్లోనూ మాళ్ళూ ఇతర మెగా కొట్లూ వచ్చేశాయికానీ, ఒక్కో ఐటం కోసమూ ఒక్కో షాపుకి వెళ్ళడం నాకు చాలా ఇష్టమైన విషయం.
  సంతంటే గుర్తొచ్చింది, అసమాన జానపద వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పాడాడు, సంతో మావూరి సంత .. అని, అద్భుతమైఅన్ పాట.

  మెచ్చుకోండి

 8. హ! బజారు, షాపింగ్, సంత ఎన్ని పర్యాయ పదాలో. మీ పట్టిక బాగుంది అదే చికిలించిన కళ్ళు… పాప (అదే మీరు) తప్పిపోయిన ఘట్టం బాగుంది. నేను మా పాపతో కన్నా బాబుతో సంతకెళ్ళడానికి ఇష్టపడ్తాను. ఎందుకని అలా కళ్ళూ చిట్లించేసారెంటండి బాబు.. పాప అయితే షాపంతా కొనేయమంటుంది. ఏ పట్టిక అవసరంలేకుండా బాబు అయితే ” వద్దులే అమ్మా ఇప్పుడెందుకు” అంటాడు అదీ విషయం. అప్పుడు నా మొహం పూర్ణబింబంవోలే ప్రకాశిస్తుంది. .. సంత అంటే నాకు సంతసమే అనవసరంగా వృధా చేయనప్పుడు. బాగుంది మాలతి గారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s