నీకోసం (కథ)

ఉధృతంగా మంచు కురుస్తుంటే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది ధరణి. ఆదివారం కనక సరిపోయింది.  లేకపోతే నానా తిప్పలూ అవును ఆఫీసు చేరడానికి. నిన్న దినకర్‌తో వచ్చిన తగువు ఇంకా పచ్చిగానే వుంది. అతనికి మాత్రం పట్టినట్టు లేదు.

రాత్రి మంచంమీద వాలినవాడు వాలినట్టే పడి నిద్ర పోతున్నాడు. తొమ్మిదయినా లేచే జాడల్లేవు.

వుండీ వుడిగీ, కువకువలాడుతూ ఆకాశంలో కొంగలు బారులు బారులుగా దక్షిణానికి తరలిపోతున్నాయి శిశిరం ప్రవేశించనున్నదహో అని ప్రకటిస్తూ. తను వాటిని ప్రతియేడూ చూస్తూనే వున్నా ఎప్పటికప్పుడు కొత్తే ఆ బారులు తీరు ముచ్చటగా.  చక్కగా సైనికులు కవాతు చేస్తున్నాట్టు వరసలు ఎలా కడతాయో! కిందకి చూస్తే, ఉడతలు హడావుడిగా చెట్టుమొదళ్లలో పుట్టల్లోకి కాయలు చేరేస్తున్నాయి. అవి ఒక్క శిశిరానికి చాలినంత మాత్రమే పోగు చేసుకుంటాయిట. వాటికున్నపాటి జ్ఞానం మనిషికి లేదేం? మనిషిని rational animal అనడం అన్యాయం అనిపిస్తోంది చూస్తుంటే. అయినా ఆమాట అన్నది మాత్రం ఎవరు కనక? మనిషే కదా! మనకి మనమే కితాబులిచ్చుకోవాలి మరి! మనం ఇలా అనుకుంటున్నాం అని తెలిస్తే ఆ కొంగలూ, ఉడతలూ నవ్వుకోవా?

ధరణికి తాను అమెరికాకి వచ్చిన తొలిరోజులు గుర్తొచ్చేయి. “నీకేం కావాలేం కావాలి? నీకు ఏమిటి ఇష్టం.? ఏమి నీ కోరిక?” అంటూ దినకర్ పదే పదే అడుగుతూ, తన ఇష్టాయిష్టాలు కనుక్కుంటూ సకలం అమరుస్తూంటే పొంగిపోయింది. కొత్త బల్లలూ, కుర్చీలూ, మంచాలూ కొన్నాడు. కిటికీలకి కొత్త కర్టెనులు అమర్చేడు.  ఊళ్లో అందరికీ “మై మిసెస్” అంటూ గొప్పలు పోతూ చూపించేడు. “అబ్భ, ఇతడికి నేనంటే ఎంత ప్రేమా” అనుకోకుండా వుండలేకపోయింది ధరణి మనసులోనే.

అతను రోజుకి పదిసార్లు చెప్తాడు ఆమె ఎంతో అందంగా వుందనీ, చీరెల్లో మెరుపుకి కళ్లు చీకట్లు కమ్ముతున్నాయనీ. “ఐ లవ్ యూ” అంటూ ఏకధాటిగా తిరుమంత్రం జపిస్తూనే వుంటాడు. ఓరోజు “నువ్వు చెప్పవేం? డు యూ లవ్ మీ?” అని కూడా అడిగాడు.

“ఏమో నాకు అలా మాటాడడం రాదు. మనం అలా మాటాడం కదా” అంది ధరణి తేలిగ్గా నవ్వేస్తూ.

ఇల్లాలు అమెరికనింట అడుగు పెడుతూనే, అతనికి పెద్ద ప్రోజెక్టు తగిలింది. అతను ఎగిరి గెంతేసి, “ఐ లవ్యూ సోఓఓఓ మచ్” అన్నాడు. “ఇదంతా నీ అదృష్టమే. నువ్వు ముందెప్పుడో బంగారుపూలు పూజ చేసుకుని పుట్టేవు. అంచేతే నాలాటి మేధావి నీకు లభించేడు.” అని కూడా అన్నాడు బోరవిరుచుకుని, ఎదనిండా గాలి పీల్చుకుని.

ధరణి అతనిమాటలకి నవ్వింది మనస్ఫూర్తిగానే.

ఆ ఘనతర ప్రోజెక్టు అంతమయింది కొంతకాలానికి. వరసగా రెండేళ్లు అంత హుషారుగానూ జరిగిపోయేయి. All good things come to an end. ప్రస్తుతం మరో మంచి ప్రోజెక్టుకోసం చూస్తున్నాడు. ఇక్కడ “మంచి” అన్నపదం గమనార్హం. నాలుగు పెద్ద ప్రోజెక్టులు అయింతరవాత, మళ్లీ చిన్న చిన్న ప్రోజెక్టులు తీసుకోడానికి అతనికి మనసొప్పలేదు. అంచేత తన మేథాసంపత్తిని సవ్యంగా ఉపయోగించుకోగల ప్రోజెక్టు అయితేనే చేపట్టడానికి నిశ్చయించుకున్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు.

ధరణి ఆలోచనలు మరోదిక్కుగా సాగుతున్నాయి. మొదట్లో ఏం అనిపించలేదు కానీ రోజులు గడుస్తున్నకొద్దీ చిన్నబెరుకు మొలకెత్తి, నింపాదిగా ననలు తొడిగి, రెమ్మలు పడి, మహావృక్షమయి ఎదుట నిలిచింది ఇప్పుడు. మొదట్లో రెండో, మూడో ప్రోజెక్టులు భర్త ఏవో కారణాలు చెప్పి దాటేసినప్పుడు అది భార్యని అంతగా బాధించలేదు. “అవున్లే, ఎవరికి మాత్రం వుండదు తమసామర్థ్యాన్ని సవాలు చేయగల ఉద్యోగం కావాలని? అలా ఆశించడంలో తప్పేం లేదు” అనుకుంది. క్రమంగా రోజులూ, వారాలూ, నెలలూ గడుస్తున్నకొద్దీ … అలా గడిచిపోతున్నకాలం రాగల అవకాశాలకి ఎదురుచుక్క కాగలదన్న వాస్తవం కళ్లముందు కదులుతూ గుండెల్ని పిండేస్తోంది. అంత మేధావి దినూకి ఆమాత్రం తెలీదా అన్న సంశయం కూడా కొరుక్కుతినేస్తోంది లోలోపల.

అలాటిరోజుల్లోనే, మైక్రోసాఫ్టు కంపెనీవాళ్లు పిలిచారు ఇంటర్వ్యూకి రమ్మని.

దినూ వెళ్లలేదు.

“అదేం?” అడిగింది ధరణి కళ్లు చికిలించి. మరొకరయితే ఎగిరి గెంతేద్దురు ఇంటర్వ్యూకే.

“ఆ మేనేజరు నాతో పదోక్లాసు చదివేడు. నా ఐక్యూలో సగం కూడా లేదు వాడికి. వాడికింద నేను పని చెయ్యడం ఏమిటి? అబ్సర్డ్,” అన్నాడు.

ఇంటర్వ్యూకే వెళ్లలేదు. వుద్యోగం వచ్చేసినట్టు మాటాడాతాడేం అనిపించింది తనకి కానీ అడగలేదామాట. నాలుగువారాలు పోయేక, మరో కంపెనీ పిలిచారు. దానికీ వెళ్లలేదు. ఏం అంటే, తన క్లాస్మేటు అన్నగారు సియివోట అక్కడ. మరోసారి, కొలెరెడోలో ఇంటర్వూకి వెళ్లేడు కానీ ఊరు బాగులేదన్నాడు.

అతనిధోరణి రాను రాను అయోమయం అయిపోతోంది. అసలు అతనికి ఉద్యోగం చేసేవుద్దేశం వుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఉద్యోగం పురుషలక్షణం అని నానుడి. నిజానికి ఈరోజుల్లో మగాళ్లే కాదు ఆడాళ్లు కూడా నాలుగ్గోడలమధ్యా వూరికే ఏపనీ లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోడం లేదు. వుద్యోగం కాకపోతే మరో వ్యాపకం పెట్టుకుని బైటికి వెళ్లి కాస్త పదిమందిలో తిరుగుతున్నారు. అంతేగానీ ఒంటిమీద చొక్కాలాగ తలకాయల్ని గోడని కొక్కేలకి తగిలించేసి, బేఖాతరగా కూర్చోడంలేదు. అసలు అలా ఎవరు గానీ కూర్చోగలరని ధరణి ఊహించను కూడా లేదెప్పుడూ. తనకి సాధ్యం కాలేదు. అమెరికాకి వచ్చి ఏడాది తిరక్కుండా పనిలో చేరిపోయింది. మొదట యమ్మెస్సీ చేసింది కనక పి.హెచ్.డీ చేద్దాం అనుకుంది. కానీ ముందు యమ్మెస్సీ కోర్సులు కొన్ని మళ్లీ చెయ్యమన్నారు. దాంతో, అది వదిలేసి, దగ్గర్లోనే అనీ, పార్ట్ టైం అనీ ఒక బాంకులో కస్టమర్ రెప్‌గా చేరింది. గొప్ప సంతృప్తినిచ్చే వుద్యోగం అని కాదు. తన చదువుకి తగిన పని కాదు. ఆసక్తి అసలే లేదు. కానీ .. నాలుగ్గోడలమధ్య కులాసాజైలు జీవితం గడపలేక చేరిపోయింది, “ప్చ్. ఏంచేస్తాం” అనుకుని. ఆ అమ్మాయి చురుకూ, తెలివితేటలూ గమనించి, ఆర్నెల్లు తిరక్కుండా, బాంకువాళ్లు తనని ఫుల్ టైం సూపర్వైజరు చేసేరు. ఆదాయం బాగుంది.

అలా సరిపెట్టుకోడానికి దినూ ఒప్పుకోడు. అది అతని తత్త్వంలో లేదు. ధరణి బాంకులో అవకాశంమాట చెప్పినప్పుడు అతను గట్టిగా వద్దనలేదు కానీ “నేనయితే చేరను అలాటి కొరగాని పనిలో” అన్నాడు డొంకతిరుగుడుగా. నిజానికి అతని దృష్టిలో అది పరమహీనం. బిల్ గేట్సుని చూడరాదూ? జనాలు ఈరోజు ఓహ్ తెగ మెచ్చేసుకుంటున్నారు. ఆయన కూడా ఆదిని ఏదో ఒకటి అని సరిపెట్టుకుని ఏ కూలిపనిలోనో చేరివుంటే, ఈనాడు ఈ స్థితికి రాగలిగేవాడా? అంతెందుకూ? తనకి కూడా అలాగే కలిసొచ్చి, తను బిల్ గేట్సుని తలదన్నగల ఘనకార్యాలు సాధించినప్పుడు ఈ ధరణే మెచ్చుకోదూ ఈ అణాకానీ ఉద్యోగాలన్నీ తిరగ్గొట్టినందుకు? తాను రంగంలో ప్రవేశించాలే గానీ గేట్సుని సోదిలోకి రాకుండా చేసీడా?!

ధరణికి మనసంతా గందరగోళంగా వుంది. చిరాగ్గా వుంది. అతనిబాధ తనకి అర్థం అవుతుంది. తనబాధ అతనికెందుకు అర్థం కాదు? నిజానికి అతనికి వస్తున్న అవకాశాలు మరీ అంత నాసిరకమేం కాదు. అతనిఫీల్డులోనివే, అతని అర్హతలకి తగిన వుద్యోగాలే. ఎటొచ్చీ అతనిదృష్టిలో అవి తనకున్న విజ్ఞానాన్ని సవాలు చేసే వుద్యోగాలు కావు. …

ఓరోజు ధరణి పేపరు చూస్తుంటే, ఓ ప్రకటన కనిపించింది. “ఇదుగో. ఇది చూసావా?” అంది పేపరు అతనికి అందిస్తూ, మామూలుగానే.

“ఏంటి కథ? నువ్వు నాకు ఉద్యోగాలు చూసేదాకా వచ్చింది వ్యవహారం. నేను అంత చేతకానివాణ్ణలా కనిపిస్తున్నానా నీకు?” అన్నాడు దినూ ఉరిమి చూస్తూ.

ధరణి చిన్నబుచ్చుకుంది. “నువ్వు చూసుకోలేవన్నానా? ఏదో చూస్తుంటే కనిపించింది. చెప్పేను.”

“నేను చూడలేదని ఎందుకనుకున్నావు?”

“ఇప్పుడే కదా పేపరొచ్చింది. నేను ముందు తీసుకున్నాను కదా”

“అసలు నీమనసులో వున్నమాట చెప్పరాదూ? పనీ పాటూ లేకుండా కూర్చోడం నాకు సరదా అని నీ అభిప్రాయం. అవునా?”

“ఎందుకలా పెడర్థాలు తీస్తావు? నేనేం అన్నానిప్పుడు?.”

“మరేమిటో చెప్పు నీబాధ? నేను ఎదురుగా కనిపిస్తుంటే నీకు కష్టంగా వుందా. అసలు చూస్తూ వుండు. నీకిప్పుడు ఇలా వుంది కానీ తరవాత నేను హైరాంక్ జాబ్‌ తీసుకుని, బిజీ బిజీ అయిపోయినప్పుడు, ‘మావారు ఇంట్లో కనిపించనే కనిపించరు’ అంటూ బాధ పడిపోతావు. అసలు ఎందరాడాళ్లు భర్తలు ఇంట్లో వుంటే బాగుండు అంటూ ఆయాసపడిపోతున్నారో తెలుసా నీకు?”

“సరేలే. నాదే పొరపాటు. నేనింక మాటాడను.”

ధరణి లేచి పక్కగదిలోకి వెళ్లిపోయింది. మాటకి మాట తెగులు. తనే ఊరుకుంటే సరి అని ఎంత సర్ది చెప్పుకున్నా గానీ అది మనసులో ముల్లయి కెలుకుతూనే వుంది. సంసారం అన్నతరవాత మంచీ, చెడ్డా వుంటాయి. “అరమరికలు లేకుండా” అంటే మనసిచ్చి మాటాడుకోడమే కదా. మరి ప్రతిమాటకీ పెడర్థాలు తీస్తూంటే ఎలా వేగడం? నన్ను అడుగుతాడు కదా నీకేం కావాలి? అని. మరి నాకు మాత్రం అలా వుండదా?  అతనికేం కావాలన్న తపనా, అవి తీరడానికి చేతనయిన సాయం చెయ్యాలన్న కోరికా? అందులో తప్పేమిటి?

ఆలోచనలయితే సవ్యంగానే వున్నాయి కానీ అవి అతనికి ఎలా బట్వాడా చెయ్యాలో తెలీడం లేదు ఆ అమ్మాయికి. అమెరికాలో talk, talk, అంటారు కానీ చెప్పేవారికి చెప్పాలని వుంటే చాలదు. ఎదటివారికి విందాం అన్న దృష్టి కూడా వుంటేనే ఆ “టాకు” సాగేది. అది దినూతత్త్వం లేదు.

దినూ ఓ గంట తరవాత శాంతించేడు. “పాపం, ఒఠ్ఠి అమాయకురాలు, అమ్మాయికి లోకజ్ఞానం అస్సలు లేదు,” అనుకుంటూ గదిలోకి వచ్చి “సారీ” చెప్పాడు. “నీకే నాసామర్థ్యంలో నమ్మకం లేకపోతే ఎలా చెప్పు?” అన్నాడు తన బాధనంతా గొంతులో పలికిస్తూ.

“నాకు నమ్మకం లేదన్నానా?” అంది ధరణి నెమ్మదిగా.

“అసలు నాపేరే దినకర్. అంటే ఏమిటనుకున్నావు? లోకాన్ని తన దివ్యప్రభలతో చైతన్యవంతం చేసేవాడు. నా తెలివితేటలూ, సామర్థ్యమూనూ  గుర్తించినవాళ్లు, వాటి విలువ తెలుసుకున్నవాళ్లు – వాళ్లే నన్ను వెతుక్కుంటూ వస్తారు, చూస్తూ వుండు. అప్పుడు నువ్వే విచారిస్తావు, అనవసరంగా అబ్బాయిగారిని ఎంత బాధ పెట్టేనూ నాఅజ్ఞానంమూలంగా అని.” అన్నాడు నవ్వుతూ.

ధరణికి అందులో హాస్యం కనిపించలేదు. పైకి హాస్యానికి అంటున్నట్టున్నా, అతడు ఆ మాటలు మనసా నమ్మి చెబుతున్నట్టే వినిపించాయి ఆ అమ్మాయికి.

మళ్లీ దినూయే అన్నాడు, “లేదులే. నువ్వు సదుద్దేశ్యంతోనే చెప్పావని నాక్కూడా తెలుసు. నేనలా విసుక్కోడం పొరపాటే. మళ్లీ ఎప్పుడూ అననులే” అని హామీ ఇచ్చేడు. ఆ సాయంత్రం “వంట చెయ్యకు. బయట తిందాం” అన్నాడు ఓదార్పుగా. “లే, బట్టలు మార్చుకు రా. షేరటన్ హోటల్లో రిజర్వేషను చేయిస్తాను” అన్నాడు. ఆపూట భార్యకి హైక్లాసు హోటల్లో ఖరీదయిన భోజనం పెట్టించాలని మహ సరదాగా వుంది అతడికి.

ధరణి లోపలికెళ్లి తనకి ఎంతో ఇష్టమయిన డ్రెస్ వేసుకుంది – పాలనురుగలాటి తెల్లటి బ్లౌజుమీద నీలినీడల్లా లేత నీలిరంగు పూలు, దానికి తగిన లేత నీలిరంగు పాంటు. తనకి ఆ రంగులు ప్రశాంతంగా ఉంటాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది.

అందంగా అలంకరించుకుని వచ్చిన భార్యని రెండు క్షణాలు తేరి చూసి, దినూ “నైస్” అన్నాడు. ఆ అనడం నైసుగా లేదు. ఏదో మొక్కుబడికి అన్నట్టు వుంది.

“ఏం బాగులేదా?” అంది ధరణి అతనివేపు చూడకుండా.

“కెంపురంగు డ్రెస్‌లో నువ్వెంతో అందంగా వుంటావు. అది వేసుకోరాదూ?”

ధరణికి కెంపురంగు ఇష్టంలేదు. … “మొన్న ప్రకాష్ వాళ్లింటికి వెళ్లినప్పుడు వేసుకున్నాను కదా. అసలీమధ్య ఎక్కడికి వెళ్లినా అదే వేసుకుంటున్నాను అని ఇవాళ ఇది వేసుకున్నాను. సరేలే, మార్చుకొస్తాను. ఏదయితేనేమిటి?” అంది ధరణి లోపలికి వెళ్తూ.

అంతరాంతరాల ఎక్కడో అదే మాట – “ఏదయితేనేమిటి? మార్చుకోనక్కర్లేదులే” అని అతనంటే బాగుండును అనిపించకపోలేదు కానీ … అంత సరదాగా వుంటే మరో డ్రేస్సు ‘నాకిష్టమయిన రంగు డ్రెస్సు’ కొనివ్వకూడదూ?

ఆ కెంపురంగు డ్రెస్ నెలరోజుల క్రితం, ఇలాటి తగువే వచ్చినప్పుడు “సర్‌ప్రైజు” బహుమతిగా కొన్నాడతను. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతిసారీ అదే వేసుకుంటోంది. ఇదే సంభాషణ చాలాసార్లే అయింది ఇద్దరిమధ్యా.

ధరణి లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని, దానికి నప్పిన జోళ్లేసుకుని, సంచీ పుచ్చుకు బయల్దేరింది.

“చూడు ఈ డ్రెస్‌లో ఎంత అందంగా వున్నావో. రెస్టారెంటులో జనాలు భోజనాలు మానేస్తారు నిన్ను చూస్తూ.”

“సరేలే. మాటలు నేర్చావు.”

మర్నాడు కూడా బోల్డుసార్లు ‘సారీ’లు చెబుతూనే వున్నాడు. ఆ సాయంత్రం “ఇవాళ వంట నేను చేస్తాను. వంకాయ వేపుడు నీకు ఇష్టం కదా. నేం చేస్తాను” అన్నాడు.

“నీకూ ఇష్టమే కదా. నేనే చేస్తాలే, మెంతికారం పెట్టి” అంది ధరణి లేస్తూ. నిన్న డ్రెస్సులమీద వాదన గుర్తొచ్చింది.

“రెండు రకాలుగానూ చేసుకుందాం,” అన్నాడు దినూ హుషారుగా.

వంకాయ వేపుడూ, మెంతికారం – కూర రెండురకాలుగానూ చెయ్యొచ్చు. రెండు డ్రెస్సులు ఒక్కసారే వేసుకోగలిగితే బాగుండు … అనుకుంది ధరణి మనసులోనే.

ఆమె వంట పూర్తి చేసి, అధికంగా, అతనికి ఇష్టం అని కేరట్ హల్వా కూడా చేసి, బల్లమీద వంటకాలూ, కంచాలూ పెట్టి “రా, భోంచేద్దాం” అని పిలిచింది.

“కూర ఎంతో బాగా కుదిరింది.” అని మెచ్చుకున్నాడు. “నీకు కోపం వచ్చినప్పుడు మరీ బాగుంటాయి సుమా నీ వంటలు” అంటూ మేలమాడేడు.

అతనిమాటలకి ఆమె పొంగిపోయింది. ఆమె వంటలకి అతను సంతోషించాడు. వాన వెలిసింది

***

ధరణి గుండెలు కూడదీసుకుని ఓరోజు అంది, “నీకు ఎవరికిందా పని చెయ్యడం ఇష్టంలేదు. నీఅర్హతలకి తగిన ఉద్యోగం చూపించే కంపెనీలు లేవు. వాళ్లెవరో నీ తెలివితేటలు గుర్తించడంలేదని విచారించడం ఎందుకు? నువ్వే ఓ కంపెనీ పెట్టి, ముల్లోకాలకీ నీ సామర్థ్యం వెల్లడి చేసేయొచ్చు కదా. అప్పుడయితే నువ్వు ఎవరికీ జవాబు చెప్పుకోనక్కర్లేదు సరికదా మరో నలుగురికి నువ్వే పని చూపించినవాడివి కావచ్చు,” అంది.

దినూ చటుక్కున తలెత్తేడు కోడెతాచులా. తను చేతకానివాడని ఎత్తిపొడుస్తోందా? ఇంతలు కళ్లు చేసుకుని ఆమెవైపు చూశాడు. తన భార్య తనని హేళన చేస్తున్నట్టు అనిపిస్తోంది. అతనికి ఒళ్లు భగ్గున మండింది. “షటప్” అని అరిచాడు.

ధరణి వణికిపోయింది లేతమావిచిగురులా. గుండెలు దడగడ కొట్టుకున్నాయి. అతనిలో అంత ఔద్ధత్యం ఏనాడూ చూడలేదు. అతనికి ఇంత కోపం వుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆమాటకొస్తే అసలు తన జీవితంలోనే ఎరగదు అలాటి కోపం. అమ్మా, నాన్నా తనని ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు  పుట్టి, బుద్ధెరిగి. కసురుకోడందాకా ఎందుకు, గట్టిగా మాట కూడా అన్నవాళ్లు లేరు. నాన్నకి తనంటే ప్రాణం. ఆయనని తను ఎంతో విసిగించినప్పుడు కూడా “ఇంత పట్టుపడితే ఎలా అమ్మా?” అంటూ ఎంతో నెమ్మదిగా చెప్పేవారు. సాటిపిల్లలు “మానాన్న చీరేస్తాడు, మాఅమ్మ కొడుతుంది,” అని చెప్పినప్పుడు తనకి ఆశ్చర్యంగా వుండేది. స్కూల్లో టీచర్లందరికీ తనంటే ఎంతో ఇష్టం తను చాలా తెలివైనదీ, బుద్ధిమంతురాలూనని.

ధరణి అతనివేపు కళ్లప్పగించి చూడసాగింది. కాళ్లలో రక్తం గుండెలకి ఎగదన్నింది.

దినూ భార్యకి దగ్గరగా వచ్చి, మొహంలో మొహం పెట్టి, “నాకు నీసలహాలు అక్కర్లేదు, అర్థమయిందా? మళ్లీ ఎప్పుడూ నాతో అలా మాటాడకు, నెవర్, నెవర్,” అన్నాడు కరుగ్గా.

అతను అలా మీదమీదకి వచ్చేసి మాటలంటుంటే భూమండలం గిరగిరా తిరిగింది కళ్లముందు. దుఃఖం ఉప్పెనగా ముంచుకొచ్చింది. గబుక్కున లేచి పక్కగదిలోకి వెళ్లిపోయింది.

దినూ చేతిలో కాఫీకప్పు విసురుగా బల్లమీద పడేసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి, అర్థరాత్రి దాటింతరవాత ఇల్లు చేరేడు. అప్పటికి కాస్త మనసు స్థిమితపడింది. గంటన్నరసేపు “సారీ, పొరపాటయిపోయింది, సారీ, ఠెరిబ్లీ సారీ” అంటూ వదలకుండా పావుగంటసేపు విచారం వెలిబుచ్చాడు. అసలు తనకంత కోపం వుందని ఇంతవరకూ తనకే తెలీలేదన్నాడు. “మళ్లీ జన్మలో ఎప్పుడూ ఇలా జరగదు, జరగనివ్వను” అన్నాడు.

ధరణి “సరే” అంది కళ్లు తుడుచుకుని.

***

ఆఫీసులో పరధ్యానంగా వున్న ధరణిని చూసి, “ఏం, అలా వున్నావు?” అనడిగింది స్టెల్లా.

స్టెల్లా ఈమధ్యనే కొత్తగా చేరింది ఆఫీసులో. తనకి తెలీని విషయాలు ధరణిని అడిగి తెలుసుకుంటోంది. ఆవిడకి ఈతెలుగు అమ్మాయి అంటే మంచి గురి ఏర్పడిపోయింది అచిరకాలంలోనే. భారతీయ సంస్కృతి మహోన్నతమయినదని ఆవిడ వింది. అప్పుడప్పుడు మన సాంప్రదాయాలగురించి అడుగుతూ వుంటుంది తనని.

“ఏం, అలా వున్నావు?”

ధరణికి ఆమాట చల్లగా, సూటిగా మనసుకి తగిలింది. క్షణంలో ఈ స్టెల్లా ఎంతో ఆత్మీయురాలు అనిపించింది. అమ్మా, నాన్నా, అన్నా, చెల్లీ, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న నేస్తులూ – అందరూ వున్నారు కానీ వాళ్లున్నది భూగోళానికి ఆవలితీరంలో. ఇక్కడ … ఇప్పుడు .., ఈక్షణంలో “అలావున్నావేం, ఏమయింది?” అని అడిగేవాళ్లు లేరు. అలా అడగగల ఒకే ఒక మనిషికి ఆ ధ్యాస లేదు.

ధరణికి ఉప్పెనగా దుఃఖం పొంగుకొచ్చింది. తలొంచుకుని “ఏం లేదు. బాగానే వున్నాను” అంది నెమ్మదిగా.

“లంచి టయిమవుతోంది. Early lunch తీసుకుందాం, వస్తావా,” అంది స్టెల్లా.

ధరణి తన లంచిబాక్సు తీసుకుని లేచింది. ఇద్దరూ బ్రేక్‌రూంలో ఓమూల కూర్చున్నారు. ఇంకా లంచి టైం కాలేదు కనక ఎవరూ లేరు ఆ చుట్టుపట్ల.

ధరణి ముందురోజు సాయంత్రం జరిగిన తగువు నాలుగుముక్కల్లో చెప్పి, “నాకేం చెయ్యాలో తోచడంలేదు. మంచి పైలాపచ్చీసు వయసులో వున్న మనిషి, మంచి చదువూ, అర్హతలూ వున్న మనిషి, నిశ్చింతగా  నెలలతరబడి ఎలా కూర్చోగలుగుతున్నాడో, అతనితత్త్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.” అంది ధరణి ఆలోచిస్తూ.

“మీదేశంలో అలా మంచి చదువుకున్నవాళ్లు ఏం చెయ్యకుండా ఇంట్లో కూర్చోడం తప్పుగా అనుకోరా? అందులోనూ మగాళ్లు?”

“అదేం లేదు. రెండుతరాల పూర్వం మీకూ అంతే కదా. మాక్కూడా మగాళ్లు breadwinners, ఆడవాళ్లు homemakers అనే సాంప్రదాయం. ఇప్పుడిప్పుడే మారుతోంది. మా అమ్మమ్మ అయితే ఉద్యోగం పురుషలక్షణం అనీ, ఆడదానిసంపాదన కూచుని తింటావుట్రా అనీ దులిపేసి వుండేది వెనకటిరోజులయితే. మాఅమ్మ కాలం వచ్చేసరికి కొంత మారింది. మాఅమ్మ ఉద్యోగం చేస్తున్నా, ఇంటిబాధ్యతలన్నీ ఆవిడవే. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటిపనుల్లో ఓ చెయ్యేస్తున్నారు. అయితే మీలాగ ఇంకా వేరు వేరు ఎకౌంట్లు లేవు. కానీసం ఇప్పటికి లేదు, నీడబ్బూ, నాడబ్బూ అని.” అంది ధరణి. ఇలా మాటాడుతుంటే తనకే కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి!

“ఇక్కడ మగాళ్లు ఇంట్లో వున్నా ఏదో ఓ పని చూసుకుంటారు కానీ వూరికే కూర్చోరు, ఏది కానీ తమకి తాము సమకూర్చుకోవాలి కానీ వాటంతట అవే సమకూడుతాయనో, ఎవరో చేసి పెడతారనో ఎదురుచూస్తూ కూర్చోరు. ఈమధ్య stay at home dads సంఖ్య పెరుగుతోంది. అదీ పిల్లలుంటేనూ,  భార్యలకే మంచి వుద్యోగాలు అయితేనూ అలా చేస్తున్నారు. అప్పుడు కూడా ఇంట్లో వుండి చేసుకోగలపని ఏదోఒకటి  చూసుకుంటారు సాధారణంగా,” అంది స్టెల్లా రెండుతరాల పూర్వంమాట తప్పించేసి.

ధరణి కొంచెంసేపు ఊరుకుని, నెమ్మదిగా ఎటో చూస్తూ, “నేను క్షమాపణలు చెప్పుకున్నాను,” అంది.

“అతను ఏమన్నాడు?”

ధరణి అడ్డంగా తలూపింది ఏమీ లేదు అన్నట్టు.

“Damage is done.”

ధరణికి అర్థం కాలేదు. “అంటే?”

“నువ్వు చెప్పిన మాట – సొంత కంపెనీ పెట్టుకోకూడదా? – అన్న సలహా అతనిఅహాన్ని ఛాలెంజి చేసే ప్రశ్న. నువ్వెన్ని క్షమాపణలు చెప్పుకున్నా, అది సూటిగా నాటే పోటు. క్షమాపణలు అంటారు కానీ నిజంగా ‘మర్చిపో’ అనగానే మర్చిపోగలమా? మర్చిపోలేం. అది మానవనైజం, మనోధర్మం. అతనంత తేలిగ్గా మర్చిపోగలడనుకోను,” అంది స్టెల్లా.

“మళ్లీ తరుచూ చెప్తాడు నేనంటే చాలా లవ్వుందని.”

“క్రియలో కూడా కనిపించాలి. నేనయితే కౌన్సిలింగుకి వెళ్దాం రమ్మంటాను..”

“అది కుదిరేది కాదు. తనకంటే మేధావి లేడు అనుకునేవాడికి మరొకరిని సలహా అడగడానికి కూడా ఆ అహమే అడ్డొస్తుంది కదా.”

“నెమ్మదిమీద అతనికే అర్థం అవుతుందిలే,” అంది స్టెల్లా ఓదార్పుగా.

ధరణి తలూపింది. ఇద్దరూ లేచారు.

ఆ సాయంత్రం పని అయింతరవాత ఇంటికి బయల్దేరింది కానీ వెళ్లాలంటే వుత్సాహంగా లేదు. దారిలో మెండోటా పక్కన కారు పోతుంటే కాస్సేపు ఆగి సేదదీర్చుకో బుద్దేసింది. నెమ్మదిగా కారు రోడ్డువారకి తీసి, దిగి, నీళ్లకి కొంచెం ఎడంగా కూర్చుంది. దూరాన నీళ్లలో తెరచాపలెత్తి పడవల్లో షికార్లు కొడుతున్నారు కొందరు. అట్టే లోతు లేనిచోట పిల్లలు ఈతలాడుతుంటే, తల్లులూ, తండ్రులూ నిలబడి, వాళ్లమీద ఓ కన్నేసి, కబుర్లు చెప్పుకుంటున్నారు.

ధరణి ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతోంది. నిన్నరాత్రి దినూ పడుకోబోతూ, “ఇదంతా ఎవరికోసం? నీకోసం కాదూ?” అన్నాడు. నాకోసమేనా? నాకు నిజంగా ఏం కావాలి? జీవితంలో నేను కోరుకుంటున్నది ఏమిటి? నిఝం నిఝంగా?

అమెరికాలో రాకుండా, దేశంలోనే వుండివుంటే, ఏమయేది? ఈసరికి ఏకాలేజీలోనో రీడరయివుండును. ఈ బొచ్చెలు కడుక్కోడం, బట్టలుతుక్కోడం లేకుండును. అవే తనకి కావలసినవి అని అనుకుందా ఎప్పుడయినా? రీడరయితే, అధికంగా ఏం వొచ్చును? సంఘంలో పేరూ, డబ్బుతో వచ్చే సౌఖ్యాలూ వచ్చును, … తరవాత?

ఇక్కడ తను పొడిచేస్తున్నది ఏమిటి?  బాంకులో చేరింది. తన బయాలజీ ఉపయోగపడకలేకపోయినా, మాస్టర్సు డిగ్రీ చూసి, తనకి ఆస్థాయి మెదడు వుందని ఇచ్చేరు. అంతకంటె తనవిద్యని సద్వియోగం చేసుకునే వుద్యోగాలు షికాగోలోనూ, మినియాపోలిస్‌లోనూ వచ్చేయి కానీ వెళ్లలేదు. దినూ వుద్యోగానికి ప్రతిబంధకం అని. భర్తొక చోటా, భార్యొక చోటా వుండి, వారాంతాల్లో మాత్రం, కలుస్తూ కాపురాలు చేసుకుంటున్న దంపతులని చూసినా తను అలా చెయ్యదలుచుకోలేదు. దినూ ఇష్టపడలేదు. తను అలా ఎక్కడిక్కడ సరిపెట్టుకుంటూ వస్తున్నది ఎందుకు? ఎవరికోసం?

ధరణి బాంకులో చేరినకొత్తలో మాటలసందర్భంలో “మీవారు ఏంచేస్తున్నారు?” అని ఎవరో అడిగేరు.

ధరణి “నథింగ్” అంది తేలిగ్గా.

“నథింగ్?”

ఆ మనిషిమొహం చూసి, వెంటనే అర్జెంటుగా వివరించవలసిన అవుసరం వున్నట్టు గుర్తించి,  “ఐ మీన్ ప్రస్తుతానికి. అతను ఇంజినీరు. చాలా మంచి ప్రోజెక్టులలో పనిచేశాడు. నెక్స్ట్  ప్రోజెక్టుకోసం చూస్తున్నాడు ఇప్పుడు.” అంది గబగబా. మనహాస్యాలు వీళ్లకి అర్థం కావు అని తెలిసింది ధరణికి అప్పుడే.

“ఓ అలాగా” అంది ఆవిడ.

“Who’s wearing pants at home?” అందావిడే మళ్లీ. ధరణికి మొదట అర్థం కాలేదు కానీ తరవాత తెలిసింది తనే భర్తగా వ్యవహరిస్తున్నట్టు అని. కోపం వచ్చి, అక్కడినుండి వెళ్లిపోయింది. ఆతరవాత “పరిస్థితి లైటెన్ చెయ్యడానికి, వూరికే అలా అన్నాన”ని అంది ఆవిడ కానీ ధరణికి మాత్రం ఆమాట మర్చిపోడం సాధ్యం కాలేదు.

ఆతరవాత కూడా ఎవరో ఒకరు అదే ప్రశ్న వెయ్యడం, మొహాలు విచిత్రంగా పెట్టడం … ఒకటి, రెండుసార్లు వాళ్లవరస అదీ అని వూరుకున్నా, రాను రాను చిరాకు ఎక్కువవుతోంది. నిజమే మరి, బాగా చదువుకున్నవాడూ, మంచి తెలివితేటలున్నవాడూ తెల్లారి లేస్తూనే హడావుడిగా ఆఫీసుకి టైమయిపోతూందని పరిగెట్టాలి, పదిమందిలో దర్జాగా “ఇవాళ మా ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా” అంటూ గొప్పలు పోవాలి కానీ, తీరిగ్గా ఎనిమిది గంటలకి లేచి … ఏ భార్యకి మాత్రం ఆ దినచర్య  ఆనందదాయకం? ఊళ్లోవాళ్లకి అనుమానాలు వస్తే ఆశ్చర్యమేముంది? “ఏదో లోపం వుండి వుండాలి, లేకపోతే ఇంతకాలం ఉద్యోగం దొరక్కపోవడమేమిటి?” “Personality issues ఏమో” “నిజంగా అంత తెలివితేటలుంటే ఈపాటికి ఏదో ఓ వుద్యోగం రాకపోనా?”  … ఇలా వాళ్లు ఊహాగానాలు చేస్తుంటే వినడం కష్టంగా వుందని అతనికి ఎలా చెప్పడం?

ఇక్కడ అమెరికన్ భర్త భార్యకి అనుక్షణం గుర్తు చేస్తుంటాడు తాను ఆవిడని ఎంతగా ప్రేమిస్తున్నాడో, అడపా తడపా పువ్వులో నగలో తెచ్చిచ్చి “ఆవిడ తనకి గుర్తుందని” ఆవిడకి అతను గుర్తు చేస్తుంటాడు. ఆవిడ వంట చేస్తే ఆయన గిన్నెలు కడుగుతాడు. ఆవిడ సర్వు చేస్తే, ఆయన గిన్నెలూ, కంచాలూ తీసి బల్ల తుడుస్తాడు. ఆవిడ డ్రైవు చేస్తే, ఆయన సామాన్లు ఇంట్లోకి మోసుకొస్తాడు. ఎవరేనా శనివారం రండి అంటే, భార్యనడక్కుండా సరే అనడు భర్త. ఫోనులో ఎవరేనా పిలిస్తే, మెసేజీ తీసుకుని “నాకు తెలీదు, ఆయనకి చెప్తాను” అంటుంది భార్య. ఎవరి స్నేహాలూ, సంబంధాలూ వారివే. అందులోనే ఎవరి మర్యాదలు వారు కాపాడుకుంటారు అనుక్షణం .

దినూ కూడా చేస్తాడు. బాధ ఎక్కడంటే అతనకి తోచినట్టు చేస్తాడు. అతను చేసేపని తనకి నచ్చదు. అతను కడిగిన గిన్నెలు తను మళ్లీ కడుక్కోవాలి. అతను అమర్చిన డిష్‌వాషరు తను మళ్లీ అమర్చుకోవాలి. “సబ్బెక్కడుంది? ఏ సెట్టింగులో పెట్టమంటావు?” అంటూ అతను అడిగే ప్రశ్నలకి జవాబులిచ్చుకోడం కన్నా తనే చేసుకోడం తేలికనిపిస్తుంది. “అతని ఎక్స్‌పర్టీస్ వేరు. అతనిరంగంలోనే అతని సామర్థ్యం” అని సర్ది చెప్పుకుంటుంది. అదే తను కోరుకున్నది. అందుకే అతనికి కావలిసినట్టు తను నడుచుకుంటూ వస్తున్నది అతని ఆనందమే తన ఆనందం అనే కదూ!

***

అదే సమయంలో ఇంటిదగ్గర ఆఫీసురూంగా అమర్చిన రెండో పడగ్గదిలో కంప్యూటరుముందు కూర్చుని ఆలోచనల్లో పడిపోయాడు దినూ. అతనికి ధరణి ఇంకా ఇంటికి రాలేదన్నమాట తోచలేదు. ఆవిడ తనని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందో అంతుబట్టక గింజుకుంటున్నాడతను.

తనకి మాత్రం తెలీదూ అత్తింటివారు ‘పెళ్లాన్ని పోషించుకోలేని అసమర్థుడనీ, ఆడదాని సంపాదన తింటున్నడని అంటున్నార’ని. నిజానికి తాను ‘ఉద్యోగం చెయ్యను’ అనడంలేదు. తనకి తగిన ఉద్యోగంకోసం చూస్తున్నాడంతే. అలా చూడ్డం తప్పా? తనరంగంలో తాను రాణిస్తే ఆవిడకి మాత్రం గొప్ప కాదూ? తను నిదానిస్తే, కాస్త ఓపిక పడితే, తన జ్ఞానసంపదకి తగిన అవకాశం వస్తే, మంచి ఆదాయం వుంటుంది. ఎవరికోసం? ఆవిడకీ, పుట్టబోయే పిల్లలకే కదా! ఏదోఒకటి అని ఏ అణాకానీ ఉద్యోగమో చెయ్యడానికి ఇప్పుడు సిద్ధమయితే, తన మేథాసంపత్తి నిరుపయోగమయిపోదూ? ఏ పనికిమాలిన పనికో తలపడితే, తన ఔన్నత్యం ఎలా ఋజువవుతుంది? ఉద్యోగం వుంటే చాలని కొరగాని పనికి సిద్ధపడితే తరవాత పుట్టగతులుంటాయా? అందులోనూ ఈదేశంలో ఇలాటి విషయాల్లో పట్టింపులు మరీ ఎక్కువ. ఎక్కళ్లేని అర్థాలూ తీస్తారు మనం చేసే ప్రతి పనికీను. ‘నువ్వు నిజంగా అంత మేధావివి అయితే ఈ పనికెందుకు ఒప్పుకున్నావూ?’ అంటారు? ‘నీకు తగనిపని ఇంతకాలం ఎలా చేస్తున్నావు’ అంటారు? ‘నీకు నిజంగా సామర్థ్యం వుంటే, ఆకంపెనీలోనే ఈపాటికి నీకు డైరెక్టరు పదవి రాకపోనా?’ అంటారు. ఇవన్నీ ధరణికి తెలీవు. అసలు తెలుసుకునే ఆలోచన వున్నట్టు కూడా లేదు.

తన సామర్థ్యానికీ, మేథోసంపదకీ తగిన, తన అసమాన ఐక్యూని ఋజువు చేసుకోగల అవకాశం వస్తే తాను వెంటనే అందిపుచ్చేసుకోడా? ‘నీభర్తకి నోబెల్ బహుమానం అందుకోగల మేథ గలదని నువ్వు నీస్నేహితులతో సగర్వంగా చెప్పుకు తిరగగల దినము అచిరకాలంలోనే రాగలద’ని ఆ అమ్మాయి తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు తను ఆవిడతో చెప్పడూ, ‘భామామణీ, చూసేవా, ఇదంతా నీకోసం’ అనీ. తనముందు ఒప్పుకోకపోవచ్చు కానీ ఆవిడకి మాత్రం మనసులో లేదూ? ‘ఫలానా బహుమతులు గెల్చుకున్న మేథావి, కీర్తిప్రతిష్ఠలు గడించుకున్న మగవాడు నానాథుడు,” అంటూ తన స్నేహితులతోనూ, పుట్టింటివారితోనూ గర్వంగా చెప్పుకోవాలని?

***

ఏడు దాటింది ధరణి ఇంటికి వచ్చేసరికి, “ఆలస్యం అయింది. ఆఫీసులో పని ఎక్కువగా వుంది. కాఫీ తాగేవా?”  అనడిగింది చెప్పులు గుమ్మందగ్గర వదిలి, వంటింటివేపు నడుస్తూ.

దినూ లివింగ్రూంలో కూర్చుని ఏదో చదువుతున్నాడు. “లేదు,” అన్నాడు.

ధరణి లోపలికి వెళ్లి కాఫీ పెట్టి, రెండుకప్పుల్లో తెచ్చింది, తనకో కప్పూ, అతనికో కప్పూ.  “నేను రావడం ఆలస్యం అవుతుందని ఫోను చేసేను కదా. నువ్వు తాగేయవలసింది” అంది.

“నువ్వొచ్చేక ఇద్దరం కలిసే తాగొచ్చని.”

పేపరులో వుద్యోగంగురించి చెప్పిననాడు అతను విసుక్కున్నతరవాత ఆమె జాగ్రత్తగా తూచి తూచి మాటాడుతోంది. ఏంమాటంటే ఏం గొడవలొస్తాయో అన్నట్టు. అతను మరీ ముడుచుకుపోతున్నాడు రోజురోజుకీ.

ఆఫీసులో స్టెల్లా మాటల్లో వాస్తవం అర్థమవుతోంది. తను ఏదో చెయ్యాలి. మాటలు కాదు క్రియలో కనిపించాలి. మీద వాన పడితే కింద తడి కనిపించాలి. అతనికి ఎలా చెప్పడమో మాత్రం తెలీడంలేదు.

“ఇదంతా నీకోసమే!” అంటాడు దినకర్.

“నాకోసంలా లేదు. నాకలా అనిపించడంలేదు. నువ్వు నీకోసం, నూటికి నూరు పాళ్లూ నీకోసమే, నీ అహాన్ని నిలబెట్టుకోడం కోసమే ఇలా ప్రవర్తిస్తున్నావు. వచ్చిన ఉద్యోగాలన్నీ తిరగ్గొడుతున్నావు. నాకోసం అయితే నామాట విను, మాటల్లో కాదు,  క్రియలో చూపించు” – అని చెప్పాలనుంది కానీ భర్తకి ఆమాట ఎలా చెప్పాలో తెలీడంలేదు.

ఆరాత్రి ఇద్దరూ మళ్లీ అవే ఆలోచనల్లో పడిపోయారు. ఎవరు ఎవరికోసం ఏమేం త్యాగాలు చేస్తున్నారు. ఎవరికి వారు చిట్టా ఆవర్జాలు బేరీజు వేసుకుంటున్నారు కానీ ఏ ఒక్కరి లెక్కల్లోనూ అంకెలు టాలీ కావడంలేదు!.

(17 ఏప్రిల్ 2009)

(పొద్దు.నెట్ లో తొలి ప్రచురణ.)

***

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “నీకోసం (కథ)”

 1. మోహనరాజ్, థాంక్స్
  పరిమళం. అమెరికా, ఇండియా అని కాదండీ. ఇలాటి జనాలు ఎక్కడయినా వుంటారు. వ్యక్తివికాసం పాఠాలు మరీ ఎక్కువయితే, వచ్చే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏమో అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 2. @sujata, బాగా చెప్పేరు. థాంక్స్
  ప్రభాకర్ మందార, నిజమేనండీ. ఇలాటివిషయాల్లో ఎంత చెప్పినా ఇంకా వుంటుంది. క్రియాశీలత వుండాలి మనిషికి అని చెప్పడమే ఈకథలో ప్రధానాంశం.
  chavera, I understand what you mean. Yes. You are right about these times being tough.. The point in this story is the lack of action on the part of the main character and the excuses he makes. I certainly wish all those who are looking for jobs good luck.. Thanks.

  మెచ్చుకోండి

 3. ఏకబిగిన ఎంతో ఆసక్తిగా చదివాను.
  కథ చాలా బావుంది.
  అమెరికాలో ఈతరం ఎన్ ఆర్ ఐ కాపురాల తీరుతెన్నులను చక్కగా పరిచయం చేసారు.
  అయితే ముగింపు దగ్గరికి వచ్చే సరికి మాత్రం అసంతృప్తి ని మిగిల్చారు . సమస్యను మధ్యలో వదిలేసారు.
  ఇప్పుడు ధరణీ దినకర్లను ఎలా పట్టుకోవాలో, వాళ్ళ సంసారం లో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి బలహీనపడి ప్రశాంతత చోటు చేసుకున్న వైనాని ఎలా తెలుసుకోవాలో తెలీడం లేదు.
  ధరణి, దినకర్ పేర్లు పాత్రలకు తగినట్టు … స్త్రీ పురుష స్వభావలకు ప్రతీకలుగా ఎంత బాగున్నాయో.

  మెచ్చుకోండి

 4. చాలా బావుంది. జీవిత ప్రయాణం లో ఇలాంటి పెద్ద కంఫ్యూషన్ లు సాధారణం అయిపోయాయి. అహం ప్రధాన కారణం. దీనికి ప్రేమ అనే షుగర్ కోటింగ్ చాలడం లేదు.

  మెచ్చుకోండి

 5. కనుపర్తి వరలక్షమ్మ గారి గురించిన లింక్ ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తే “400 Bad Request” అని మెసేజ్ వస్తోంది. ఇది బ్లాగ్ లోని సాంకేతిక సమస్య. నాకు తెలిసినంతవరకు నా కంప్యూటర్లో ఎలాంటి ప్రోబ్లం లేదు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s