అట్లాంటిక్కి ఆవలితీరంలో నాపరిభ్రమణం!

సెప్టెంబరు 15 సాయంత్రం – తిరిగొచ్చేశాను .. మళ్లీ నాకంచం, నామంచం, నాకూడూ, నాగూడూ  … ఆరువారాల్లో సాధించిన ఘనవిజయాలూ, నొల్లుకున్న ఆప్యాయతలూ, నవ్యనూతనంగా అల్లుకున్న ఆత్మీయతలూ …

తలుచుకుంటే ఒళ్లు ఝల్లుమంటోంది.

ఆగస్ట్ 6 నించి సెప్టెంబరు 5 వరకూ

ఆగస్టు 4వ తారీకున అమెరికాలో నాఇల్లు వదిలి ఈయాత్ర మొదలుపెట్టినప్పుడు నేనేం ఆశించేనో స్పష్టంగా చెప్పలేను. ఇలా అయితే బాగుండు అని అనుకోడం మాత్రమే లీలగా తెలుసు.

ఆగస్ట్ 6 – వుదయం హైదరాబాదులో దిగేముందు మాఅన్నయ్య హెచ్చరించేడు అక్కడ స్వైన్ ఫ్లూ ఆర్భాటం ఎక్కవగా వుండడంమూలాన ఎయిర్‌పోర్టులో ఆలస్యం కావచ్చు అని. కానీ, అదేంలేదు. నుదుటిమీద బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టు ఏదో మీటరు పెట్టి నా టెంపరేచరు చూసి పొమ్మన్నారు. గేటుదగ్గర కూర్చున్న డాక్టరు కులాసేయేనా అని ఓమారు పలకరించి పద, పద మంటూ చెయ్యూపేడు.

“ఆహా!” అని దర్జాగా సమాధానం చెప్పి, హుషారుగా ముందుకి నడిచేను. మొత్తం అంతా అరగంట కూడా పట్టలేదు. ఇంటర్నేషల్ ప్రయాణం అబ్భ ఎంత హాయి అనిపించింది. విమానంలో 18 గంటలు కూర్చున్నాను, మధ్యలో లండనులో 7గంటలు లేఒవర్ – అన్నీ మరిచిపోయేను.

మొత్తంమీద ఇల్లు చేరేక, లెక్కలేసుకుంటే, మొత్తం 33 గంటలు – ఆగుమ్మంనించి ఈగుమ్మానికి అని అర్థం అయేక మాత్రం, అయ్యో పాపం అనిపించింది.

మాఅన్నయ్య పెట్టిన మంచి ఫిల్టరుకాఫీ (ఏమాటకామాటే చెప్పుకోవాలి. మాఅన్నయ్య మంచి కాఫీ పెడతాడు. నిజానికి నేను ఇండియాలో వున్న 29 రోజుల్లో అంతమంచి కాఫీ కళ్ల చూసినరోజులు తక్కువే) – కాఫీ పుచ్చుకుని, స్నానం కానిచ్చి, ప్రభావతిగారికీ, సుజాతకీ ఫోను చేసేను వచ్చేసేనోచ్ అని.

ప్రభావతిగారింటికి ఏడోతారీకూ, సుజాతగారింటికి 9వ తేదీ వెళ్లడానికి నిర్ణయాలు చేసేసుకున్నాం.

ఆగస్టు 7 – ప్రభావతిగారింట్లో రానున్న 11వతేదీ లేఖినిసంస్థ ఆధ్వర్యంలో సాహితీసభ కార్యక్రమం చర్చించుకోడానికి అన్నమాట ఈసమావేశం.

vasahome

పోరంకి దక్షిణామూర్తిగారూ, స్వాతి శ్రీపాద, సుధామ కూడా వస్తున్నారని ఆవిడ ముందే చెప్పేరు. నేనూ మాఅన్నయ్య, సీతారామారావు, వెళ్లేం. రెండుగంటలకి అనుకున్నాం. ఉన్నది నలుగురే అయినా నలుగురం చేరేసరికి మూడు దాటి గంటసేపయింది. సుధామగారు నాగురించి మాటాడతారని చెప్పేరు ప్రభావతిగారు. నిజానికి నాగురించి ఎవరికీ తెలీదని నేను గ్రహించి చాలాకాలం అయింది.

అంచేత ఆయన్ని అడిగేను “మీకు ఏంతెలుసో చెప్తే, ఆపైన ఏంచెప్పాలో నేను చెప్పగలన”ని. ఆమాట మళ్లీ ఆయన 11వ తేదీ సభలో చెప్తారని నేననుకోలేదు!

రామలక్ష్మిగారిల్లు వారింటికి దగ్గరే అని మా అన్నయ్య చెప్పడంచేత, అంతకుముందే, ఆవిడని పిలిచి, వాళ్లింటికి కూడా వస్తానని చెప్పేను. ఆవిడ సరే రమ్మన్నారు. నేను తిరపతిలో వున్నరోజుల్లో రెండు, మూడుసార్లు వెళ్లేను మద్రాసులో వాళ్లింటికి. ఆపరిచయంమూలంగా నాకు రామలక్ష్మీ, ఆరుద్రా ప్రత్యేకించి ఆప్తులుగా అనిపిస్తారు. నాలుగ్గంటలకి వస్తానన్నాను కానీ ప్రభావతిగారింట్లోనే అయిదయిపోయింది.

సరేలే, ఆవిడకీ, నాకూ కూడా ములిగిపోయే రాచకార్యాలేమీ లేవు, ఆలస్యం అయినా ఫరవాలేదు అనుకుంటూ వెళ్లేం. నాకెందుకో తోచలేదు కానీ, గుమ్మంలో అడుగెట్టగానే, కొట్టొచ్చినట్టు కనిపించింది ఆమెముఖంలో వయసుఛాయలు. ఏమిటో నేను అద్దంలో సరిగ్గా చూసుకోను కానీ నామొహంలో మాత్రం లేవూ అనుకుని కాస్త ఎడంగా, గోడవారనున్న చార్పాయీమీద కూర్చున్నాను. నాకు మాటలు ఎలా మొదలు పెట్టాలో తెలీలేదు. ఆరుద్రగారు పోయేరు. రెండోకూతురు లలిత పోయింది. అక్కగారి ఆరోగ్యం బాగులేదు. ఏం మాటాడను?

రామలక్ష్మిగారే మొదలు పెట్టారు. ఆతరవాత మరీ ఇబ్బంది అయిపోయింది. మామూలుగా మాటాడే వ్యంగ్యం, ఎత్తిపొడుపులూ వున్నా మునుపటిలా లేదు. “నేను రచయిత్రిని కాను” అంటూ మొదలుపెట్టి, ఈనాడు దేశంలో జరుగుతున్న సాహిత్యకృషివిషయంలో తన అసంతృప్తిని వెలిబుచ్చారు. నిజానికి నేనూ అలాటి అభిప్రాయాలు వెలిబుచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఎందుకో రామలక్ష్మిగారినుంచి మాత్రం అలాటివాక్యాలు వింటాననుకోలేదు.  అంటే ఆవిడ నిర్భయంగా, కటువుగా మాటాడరని కాదు. ఆ కంఠస్వరం వేరు. నేను ఎదురుచూసింది అది కాదు. పరిస్థితులప్రభావం మనస్తత్త్వాలమీద ఎంతబలంగా వుంటుందో అర్థమయింది నాకాపూట.

ఒక పావుగంట కూర్చుని, శలవు తీసుకున్నాం నేనూ మాఅన్నయ్యాను. నాకే కాదు అతనికి కూడా ఆపూట నిరుత్సాహంగా అనిపించిందనట్టుంది. “నేను బెంగుళూరు రాను” అన్నాడు ఆరాత్రి.. తరవాత వచ్చేడనుకోండి. అది వేరేవిషయం.

ఆగస్ట్ 9 – సుజాతయింట్లో బ్లాగరులసమావేశం. ఈసమావేశంకోసం నాలాగే చాలామంది ఎదురు చూశారనుకుంటాను. ఇంతవరకూ నెట్లో ఊహాచిత్రాలే కానీ నిజమోములు చూసుకోడానికి ఇదొక్కటే అవకాశం కదా. సుజాత భోజనాలు ఏర్పాటు చేసింది. కస్తూరి మురళీకృష్ణ ఫోను చేసారు తనకారులో వాళ్లింటికి తీసుకెళ్తానని. సుజాతావాళ్లిల్లు మాకు చాలాదూరం.

ఆతరవాత నాకు తెల్లమయిందనుకోండి హైదరాబాదులో ఎక్కడినుంచి ఎక్కడికెళ్లాలన్నా చాలాదూరమే. నాలుగువారాలయేక లెక్కలేసుకు చూస్తే, నేను హైదరాబాదులో వున్న 23 రోజుల్లోనూ 44 గంటలు ఆటోల్లోనూ, కారుల్లోనూ గడిచింది. ఇండియాలో వున్న 39 రోజుల్లోనూ 76 గంటలు రైళ్లలోనూ, బస్సుల్లోనూ గడిచింది.! పోతే నిద్రకి పోయింది దాదాపు 15 రోజులనుకోండి. ఇది చాలనట్టు వైయస్సార్ నాప్రయాణంసమయంలోనే తనప్రయాణం కూడా పెట్టుకుని నన్ను రవంత ఇబ్బంది పెట్టేశారు. ప్చ్.

ఇంతకీ ఈ శాఖాచంక్రమణం పక్కన పెట్టి, సుజాతగారింట్లో సమావేశం మాట – అన్నీ కొత్తమొహాలే. కొత్త అనుకుంటే కొత్త, పాత అనుకుంటే పాత. అక్కడ వున్నవాళ్లలో సుజాత, శ్రీనివాసులతో ఇదివరకు, వాళ్లు ఓక్లహోమాలో వున్నప్పుడు ఫోనుపరిచయం వుంది. వారిపాప సంకీర్తన తరవాత పుట్టిందిలెండి. మిగతావారిలో ఈమెయిలుస్నేహాలు వరూధిని, చదువరి, మహేష్, రమణి, జ్యోతి. కాగా కస్తూరి మురళీకృష్ణ, చెప్పేను కదా నాకు రైడిచ్చిన మంచివారు. ఈవరసలో శ్రీవల్లీరాధిక, మాలా కుమార్, గీతాచార్య కొంచెం ఎక్కువ కొత్త. ఈవిషయాలన్నీ నేను మళ్లీ చెప్పక్కర్లేదు కదా. రమణి బ్లాగులో రాసేరు. ఇంకా ఎవరయినా రాసేరేమో నాకు తెలీదు.

అక్కడ వాళ్లింట్లో వరూధినీ, చదువరీ నాకు ఇచ్చినపుస్తకంలో రాసిన చక్కని పద్యం!DSCF0330

నాకయితే ఇంకా చాలామందిని కలిసివుంటే బాగుండును అనిపించింది. ఇంకా కొందరు బ్లాగరులు వేరే పనులమూలంగా రాలేకపోయారు అని సుజాత చెప్పింది. కనీసం తరవాతయినా మళ్లీ కలిస్తే బాగుండేది అనుకున్నాను కానీ జరగలేదు. అసలు కలిసినవాళ్లే నిరుత్సాహపడిపోయేరేమో కూడా :p. ఒకొకప్పుడు ఊహల్లో పుట్టిన స్వరూపాలు కళ్లముందు కనబడినప్పుడు ఒస్ ఇంతేనా అనిపించడం సహజమే కదా.

ఆగస్ట్ 10 – కేతు విశ్వనాథరెడ్డిగారు వేరే పనులమూలంగా లేఖినిసభకి రారని ప్రభావతిగారు చెప్పేరు. అంచేత, వారిని కలుసుకోడానికి మేం వారింటికి వెళ్లేం. నేను తిరపతిలో వున్నప్పుడు ఆయనతో నాకు కొంచెం పరిచయం వుంది. అంచేత ఆయన ఎంతో స్నేహపూర్వకంగా మాటాడేరు. ఈచర్చ టేపుమీద వుంది. వీలు చూసుకుని వేరే రాస్తాను.

మాప్రసంగంలో ముఖ్యవిషయాలు రెండు మాత్రం ఇక్కడ చెప్తాను. ఒకటి, నేను తూలికలో ప్రచురిస్తున్న కథలూ, వ్యాసాలూ అన్నీ సంకలనాలుగా తేవాలన్నది. అందుకు వారిసలహా అడిగి, కుప్పంలో వున్న ద్రవిడియన్ యూనివర్సిటీవారు ఏమయినా చెయ్యగలరా అని అడిగేను.

ఆయన వెంటనే, “ఆ వైస్ ఛాన్సలర్ కడప రమణయ్యగారు తప్పక సాయం చేయగలరనీ, ఆయనతో మాటాడమ”నీ సలహా ఇచ్చేరు. అంతేకాక, వారితో సత్సంబంధాలుగల మరొక వ్యక్తి రమణని ఫోనులో పిలిచి వెంటనే రమ్మని చెప్పేరు. రమణ హైదరాబాదు ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసరు. ప్రసిద్ధ రచయిత కె. సభాగారి పుత్రుడు. అంచేత, రమణని కలుసుకోడం నాకు బోనసు అన్నమాట. ఆయనని వాళ్లనాన్నగారి కథ తూలికలో ప్రచురించుకోడానికి ఇవ్వమని కోరేను. పంపిస్తానన్నారు.

రెండో విషయం విశ్వనాథరెడ్డిగారు కొన్ని పుస్తకాలు ఇచ్చేరు.  ఆయనయితే చాలా పుస్తకాలే ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు కానీ నేనే బరువులు మోయలేనని సగమే తీసుకున్నాను. అందులో ఒక పుస్తకం డా. కె. కె. రంగనాథాచార్యులుగారు తొలితెలుగుకథానిక మీద రాసింది. రెడ్డిగారు మొత్తం సాహిత్యంమీద రాసింది కూడా ఇచ్చేరు కానీ, తూలిక కథలకే పరిమితం చేసేను కనక రంగనాథాచార్యులవారి పుస్తకం నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది.

ఆగస్ట్ 11 – లేఖిని మహిళా చైతన్యసాహితీ, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగినసభ.

lekhini09

లేఖిని వ్యవస్థాపకురాలు డా. ఫ్రభావతిగారు నన్ను పరిచయం చేస్తూ, తూలికద్వారా తెలుగుసాహిత్యంలో జరుగుతున్న అనువాదకృషిని వివరించేరు. సభాధ్యక్షులు పోరంకి దక్షిణామూర్తిగారు తెలుగునించి ఇంగ్లీషులోకి చేసే అనువాదాల్లో కష్టసుఖాలు చక్కగా విశ్లేషించేరు. ఆతరవాత నేను యథాశక్తి తూలిక ఎందుకు మొదలుపెట్టేనో, ఎలా సాగుతోందో వివరించి, తూలికభవిష్యత్తుగురించి కూడా ప్రస్తావించేను.

ఈసందర్బంలో నేను చెప్పినమాటలకి వచ్చిన స్పందన నన్ను దిగ్భ్రాంతురాలిని చేసింది. నాప్రసంగం టేపుమీద వుంది. సమయం దొరకగానే అక్షరగతం చేసి ప్రచురిస్తాను. అందులో ముఖ్యభాగం కొంత ఇక్కడ చెప్తాను,

నేను పోయినతరవాత, తూలిక.నెట్‌లో ప్రచురించిన అనువాదాలూ, వ్యాసాలూ ఏమవుతాయన్నది. తూలిక సైటు నేను సబ్‌స్క్రైబ్ చేసిన డొమెయిన్ కనక, నేను డబ్బు కడుతున్నంతకాలం మాత్రమే నడుస్తుంది. ఆతరవాత  అందులో వున్న కథలూ, వ్యాసాలూ అంతరించిపోతాయి. ఇంతవరకూ రెండు సంకలనాలలో 36 కథలు వచ్చేయి. ఇంకా 66 కథలూ, 10 వ్యాసాలూ వున్నాయి. అవి ఎల్లకాలం అందరికీ అందుబాటులో వుండాలంటే పుస్తకరూపంలో వుంటేనే సాధ్యం. అంచేత నేను ఎవరికథలు అనువాదాలు చేసేనో కనీసం ఆరచయితలయినా పూనుకుని, అన్ని కథలూ, వ్యాసాలూ, పుస్తకరూపంలో తీసుకువస్తే అవి కలకాలం పాఠకులకి అందుబాటులో పెట్టినవారం అవుతాం అని విన్నవించుకున్నాను.

ప్రేక్షకులలో ఒకరు “రచయితలు కానివారు కూడా సాయం చేస్తార”న్నారు. డా. ప్రభావతిగారు లేచి, లేఖిని తరఫున మరొక సంకలనం తీసుకువస్తామని వాగ్దానం చేసేరు. డా. పోరంకి దక్షిణామూర్తిగారు తాము వెయ్యిన్నూపదహార్లు విరాళం ఇస్తామనీ, ఆపుస్తకం రెండోప్రచురణకి నోచుకుంటే అప్పుడు కూడా మళ్ళీ వెయ్యిన్నూటపదహార్లు ఇస్తాననీ ప్రకటించేరు. నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయేను వారి ఔదార్యానికి. నాసాహిత్యకృషిలో ఇది ఒక కలికితురాయి.

అన్నట్టు, మనసాంప్రదాయంలో ఈ “వెయ్యిన్నూటపదహార్లు” సంఖ్య ప్రాముఖ్యం ఏమిటో, ఎలా వచ్చిందో ఎవరయినా చెప్పగలరా? ఈవివరణ ఇంగ్లీషుతూలికలో ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి మీకు తెలిస్తే చెప్పండి.

ఈసభ వివరాలు కస్తూరి మురళీకృష్ణ తనబ్లాగులో రాసేరు. ఫొటోలు కూడా వున్నాయి. చూడండి. ఈసభలో ఆయన మాట్లాడవలసిందే కానీ మిస్‌కమ్యూనికేషను మూలంగా జరగలేదు. మరొకవిషయం లేక విషాదం – ఈసభకి బ్లాగరులు కొందరయినా రాకపోతారా అనుకుని అక్కడ చాలామంది బ్లాగరులు వున్నట్టు మాటాడేను :p. తరవాత తెలిసింది నిజానికి అక్కడ వున్నది ఇద్దరు మాత్రమేనని. అయితేనేంలెండి, గంగిగోవుపాలు గంటెడయిన చాలు అనికదా సుభాషితం. పైగా రిప్రజెంటేషనుకి అది చాలు.

ఈసభ ముగిసినతరవాత సుధామ ఆంధ్రభూమిలో సం.సా.రా.లుandhrabhoomi09 శీర్షికలో రాసిన వ్యాసం కూడా చూడండి.

ఆగస్ట్ 14 – నాయని కృష్ణకుమారిగారిని చూడ్డానికి వెళ్లేం. ఆవిడ బయట సభలకీ, సమావేశాలకీ వెళ్లడంలేదు కానీ ఇంట్లో కులాసాగానే తిరుగుతున్నారు. మమ్మల్ని భోజనానికి వుండమని చాలా చెప్పేరు కానీ నాకే కుదరలేదు. ఎందుకంటే, విశాలాంధ్ర మేనేజరు ఈశ్వరరెడ్డిగారితో నాకథలు ప్రచురణవిషయం మాటాడాలని. మంచిదే అయింది కూడాను. విశాలాంధ్రలో నేను అనుకున్నదానికంటె ఎక్కువసేపే గడపవలసివచ్చింది వాళ్ల కంప్యూటరుకి నాసీడీ చదవడం రాక.

ఆగస్ట్ 15 – సౌమ్య వచ్చింది బెంగుళూరునించి, గ్రాడ్యుయేషన్‌ట 16న. ముందురోజు, 15వ తేదీ మధ్యాన్నం మాయింటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసేక, వూరికే కొంచెంసేపు నడుద్దాం అని బయల్దేరేం. దారిలో ఓపార్కు కనిపించింది. తలుపుమీద స్పష్టంగా రాసి వుంది వుదయం 6నించి 9 వరకూ, సాయంత్రం 4 నించి 8వరకూ తెరిచి వుంటుంది అని. అయినా తలుపు తెరిచి వుంది కదా అని లోపలికి జొరబడ్డాం. వెళ్లి ఓ బెంచిమీద కూర్చున్నాం. ఆతరవాత తోటమాలో ఎవరో వచ్చి గేటు తాళం వేసేసేడు. అది కూడా చూస్తూ వూరుకున్నాం. తరవాత జరిగిన తమాషాయే అసలు కథ!

ముగ్గురు పిల్లలు వచ్చారు. ఇద్దరకి 4, 5 ఏళ్లుంటాయేమో. మూడోపిల్లకి మూడు వుండొచ్చు. ముగ్గురూ గేటు ఎక్కి అవతలివేపుకి వెళ్లడానికి నానా అవస్థ పడుతున్నారు. అది చూసి, నేను “సాయం చేద్దామా?” అని సౌమ్యని అడిగేను. తను సరేనంది.

తను వాళ్లని ఎత్తి గేటు అవతలికి దాటిస్తే, నేను కమ్మీల్లోంచి, వాళ్లని అందుకుని నేలమీద దింపడం మా స్ట్రేటజీ. పిల్లలు బాగా బరువుగానే వున్నారు అంది సౌమ్య వాళ్లని అవతలికి దాటించి., మొత్తంమీద అటువేపు దింపింతరవాత చూస్తే, వాళ్లు అక్కడే నిలుచుని వున్నారు. ఇంటికెళ్లండి అంటే కదల్లేదు.

“మీ ఇల్లెక్కడ?” అని అడిగేను.

ఓపిల్ల గేటు లోపల వున్న ఇల్లు చూపించింది. చచ్చాన్రా అనుకున్నాను. ఇంతలో దారే పోయే దానయ్యొకడు దగ్గరికొచ్చి చోద్యం చూస్తున్నాడు. అతన్నడిగేను పిల్లలఇల్లెక్కడ అని.

అతను తెలీదన్నట్టు తలూపేడు.

పిల్లలేమో ఎన్నిసార్లడిగినా లోపలికే చూపిస్తున్నారు, పైగా నవ్వుమొహాలేసుకుని మరీను.

సరే ఆయింటికెళ్లి అడుగుదాం అనుకుంటూ ఇద్దరం అటువేపు దారితీశాం. అక్కడ తోటపని చేస్తున్న ఒకమ్మాయి మమ్మల్ని చూసి మావేపు వచ్చింది. తనపిల్లలే అని చెప్పి, గేటుతాళం తీసింది.

బతుకు జీవుడా అనుకుంటూ మేం ఇద్దరం కూడా అదేసమయంలో ఆతోటలోంచి బయటపడ్డాం. ఆరోజుకి మేం చేసిన పిల్లలని కాపాడుట అను సంఘసేవ అదీ!

ఆగస్టు 19 – రవీంద్రభారతి‌లో సుప్రసిద్ధ రచయిత, విమర్శకులూ అయిన డా. కె.కె. రంగనాథాచార్యులుగారికి సన్మానం అని ప్రభావతిగారు చెప్పేరు. అంచేత ఆరోజు సాయంత్రం అక్కడికి వెళ్లేం. నేను ముందు హాల్లో నిలబడి వుండగా, రంగనాథాచార్యులుగారు వచ్చేరు. మొదట నేనే కనిపించేను. ఆయన యదాలాపంగానో ఆనవాయితీ ప్రకారమో దగ్గరకొచ్చి నేను రంగనాథాచార్యులు అన్నారు. నాకు ఆడబోయినతీర్థం ఎదురయినట్టు, ఎగిరి గెంతేసినంత పని చేసి, “మీతో మాటాడాలండీ,” అన్నాను. “చెప్పండి” అన్నారాయన చిరునవ్వుతో.

నేను తూలికగురించి సూక్ష్మంగా రెండుమాటలు చెప్పి, ఆయనపుస్తకం, తొలినాటి తెలుగు కథానికలు, కేతు విశ్వనాథరెడ్డిగారు ఇచ్చేరనీ, నేను చదివేననీ చెప్పబోతున్నాను. ఇంతలో సెక్రటరీవో ఎవరో వచ్చి, “టీ, బిస్కెట్లూ తీసుకోండి” అన్నారు.

నేను, “ఒక్కక్షణం వుండండి.” అన్నాను.

“ముందు టీ తీసుకోండి. తరవాత మాటాడుకోవచ్చు,” అన్నాడాయన.

సరే, ముఖ్యఅతిథిని నేను అలా నిలబెట్టేయడం బాగులేదు అని, “టీ తీసుకోండి”అన్నాను ఆయనతో.

మరో రెండు నిముషాలయింతరవాత, ఆయన మళ్లీ నాదగ్గరకొచ్చి, “ఇందాక మీరు ఏదో చెబుతున్నారు” అన్నారు.

మర్యాద అంటే ఇదీ అనిపించింది నాకు. అంత పెద్దవారు, నేనేముంది, నోబడీ అనుకోకుండా ఆయన అలా తిరిగిరావడం నాకు మహదానందాన్ని కలిగించింది.

నాకు ఆయనపుస్తకం నాకు చాలా నచ్చిందనీ, పుస్తకం అంతా అనువాదం చెయ్యలేను కానీ సూక్ష్మంగా అందులోని ముఖ్యవిషయాలు “అనుసృజించి” వారు అనుమతిస్తే తూలికలో ప్రచురిస్తాననీ చెప్పేను.

ఆయన తలూపుతూ, “అనుమతికేముందండీ. అలాగే వేసుకోండి” అన్నారు.

అంతకుముందు రెండు లేఖినిసభల్లోనూ కలిసిన పోతుకూచి సాంబశివరావుగారిని కూడా మళ్లీ ఇక్కడ రవీంద్రభారతిలో కలిశాను. ముందు రెండుసార్లు అడగలేకపోయాను కానీ ఈసారి కుదిరింది. గబగబా, “నాకు మీకథ ఒకటి కావాలి” అన్నాను. ఆయన కూడా అలాగే, తప్పకుండా ఇస్తాను అన్నారు.

ఇంతలో మరొక పొడుగాయన లోపలికి వచ్చేరు. నాపక్కన వున్న మృణాళిని ఆయనే అంపశయ్య నవీన్ అని పరిచయం చేశారు. అలాగా అని, ఆయనవేపు తిరిగి, నాపేరూ అంటూ ప్రవర చదవబోతున్నాను.

నేను పూర్తి చెయ్యకముందే. ఆయన “తెలుసండీ. నేను మీకథలు కూడా ఒకటి, రెండు చదివేను.” అన్నారు.

నాపేరు విన్నవాళ్లని చాలామందినే చూసేను కానీ నాకథలు “చదివినవాళ్లూ”, “చదివేం అని చెప్పగలిగినవాళ్లూ” మాత్రం అరుదు. ఈలెక్కకి తెలుగుతూలిక పాఠకులు మినహాయింపు.

ఇంతకీ, ఎవరయినా నాకథ చదివేనంటే, నాకు గుండె గొంతుకలోకి తన్నుకొస్తుంది. కాళ్లలో నెత్తురు నెత్తికెక్కుతుంది ఇతోధిక స్పీడుతో. సరే, ఆరేసులోంచి తేరుకుని, “మీకథొకటి కావాలండీ తూలికలో వేసుకోడానికి,” అన్నాను నాఆచారం ప్రకారం. ఆయన కూడా సరేనన్నారు.

చూశారా మరి ఈసారి ప్రయాణం విశేషం. ఇలా అంటే అయిపోయిందనుకునేరు. లేదండీ, ఇంకా చాలా వుంది, ఇది అసలులో సగం మాత్రమే. నేను రాయడం మొదలు పెట్టినప్పుడు సూక్ష్మంగా మూడో నాలుగో పేజీల్లో పూర్తి చేస్తాననుకున్నాను కానీ అలా అయేట్టు లేదు. అంచేత, ఇది తొలిభాగం అనుకోండి. తరువాయిభాగం రెండు రోజుల్లో పెడతాను.

(ఇంకా వుంది)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

16 thoughts on “అట్లాంటిక్కి ఆవలితీరంలో నాపరిభ్రమణం!”

 1. రాధికా, అయిపోయింది. మర్చిపోతానేమోనని గబగబా రాసేశాను.
  ఉషా, మీరేమిటండీ, మరో టపా రాసేశారు. నాకు చాలా నచ్చిందంటే సరిపోయేదానికి 🙂

  మెచ్చుకోండి

 2. అప్పుడే అయిపోయిందా మీ ట్రిప్పు.రోజులు గిర్రున తిరుగుతున్నట్టు లేదూ.?సాహితీ మిత్రులందరినీ కలిసి వచ్చారన్నమాట సంతోషం. 15 న వచ్చి 18 న పెద్ద టపా రాసారంటే అర్ధమయిపోతుంది మీకు బ్లాగుతోపాటూ,బ్లాగు మిత్రులన్నా ప్రేమేనని.

  మెచ్చుకోండి

 3. మాలతి గారు, ఏమిటో మీరు తిరిగొచ్చారని వినేదాకా కాసింత చింత పడ్డాను. ఎందుకంటారా నేనంతే. నావారు పొలిమేర లోపలికి వచ్చేవరకు ఆదుర్దా. ప్రతి పంక్తి చదువుతుండగా నాకనిపించిన భావాలివి. చదివి అలిసిపోకండేం.

  > రామలక్ష్మి,కేతు విశ్వనాథరెడ్డిగారు,నాయని కృష్ణకుమారి, డా. కె.కె. రంగనాథాచార్యులుగారు, అంపశయ్య నవీన్, ప్రభావతిగారు, సుజాత, మృణాలిని, వరూధిని, చదువరి, మహేష్, రమణి, జ్యోతి, కస్తూరి మురళీకృష్ణ, శ్రీవల్లీరాధిక, మాలా కుమార్, గీతాచార్య, …

  కుళ్ళుగుమ్మడికాయ కనపడుతుంది అద్దంలో నాకు నన్ను చూసుకుంటే…

  > “వెయ్యిన్నూటపదహార్లు” సంఖ్య ప్రాముఖ్యం
  సాంప్రదాయం గురించి మీకు ఇంకా తెలియాలంటే నేనూ అడిగి చూస్తాను. రవి గారు చెప్పినట్లున్నరిప్పటికే about a source. అనుభవం ఇది – 1116 అలవాటు చొప్పున మొదట్లో $1116 కొన్ని సందర్భాల్లో ఇచ్చాం. నెమ్మదిగా పరిచయాలు పెరిగాక $558 తర్వాత $116 కి దిగాం. అరుదుగా $58 కూడా. 🙂

  > ఎవరయినా నాకథ చదివేనంటే, నాకు గుండె గొంతుకలోకి తన్నుకొస్తుంది
  నాకు మీ వ్యాఖ్య చూసుకున్నప్పుడూ అంతే [నిజంగా నిజం]

  > గేటుదగ్గర కూర్చున్న డాక్టరు కులాసేయేనా అని ఓమారు పలకరించి
  ఓసారి నాకు తగిలిన కష్టమ్స్ మాష్టారు చక చక ఓ పదిమాటలు అనేవరకు మా ఇద్దరికీ అర్థం కాలేదు ఆయన నన్ను “మలయాళీ” అనుకున్నాడని. 🙂

  > మొత్తం 33 గంటలు – ఆగుమ్మంనించి ఈగుమ్మానికి
  నాకు 40 పైచిలుకు పడుతుంది. ఒకసారి సాంకేతిక లోపం వలన ఫ్లైట్ మార్చలేదు దిగనీయ లేదు అలా 20గం. కూర్చుని లేచాక కొన్ని చోట్ల చర్మం వూడివచ్చింది 😦

  > మాఅన్నయ్య పెట్టిన మంచి ఫిల్టరుకాఫీ
  మా అమ్మమ్మ గారి వూరి పాలు చిక్కగా లేత గోధుమ రంగులో పాలకోవాకి దగ్గరగా వుంటాయి, నెలకి 4 పౌండ్స్ పెరిగిపోతాను.

  > నాకు రామలక్ష్మీ, ఆరుద్రా ప్రత్యేకించి ఆప్తులుగా అనిపిస్తారు.
  అచ్చంగా మీరు నాకు అనిపించినట్లే..

  > పరిస్థితులప్రభావం మనస్తత్త్వాలమీద ఎంతబలంగా వుంటుందో అర్థమయింది నాకాపూట.
  ప్చ్, ఎంతవారకైనా కదా…

  > హైదరాబాదులో ఎక్కడినుంచి ఎక్కడికెళ్లాలన్నా చాలాదూరమే
  rental car 80కి.మీ లేదా 8గం. లెక్కన I paid for the latter on most of the days I was there.

  > నేను పోయినతరవాత, తూలిక.నెట్‌లో ప్రచురించిన
  వాటి స్థాయి పోలిక కాక, స్వంతదారు విషయం, మరువం గురించి అదే ఆలోచన కలిగి ఓ రాత్రంతా ఏమీ పాలుపోని విధంగా గడపటం గుర్తుకొచ్చింది.

  > ముగ్గురు పిల్లలు వచ్చారు ఉదంతం

  నాకు 8 వయసపుడు మేము మా ఇంటీ దగ్గర పార్క్ గోడ సగం సిమెంట్ ఆపై ఇనప కమ్మిలు – దాని మీదనుంచి దూకి ఇవతల అమ్మమ్మ ఇల్లు అవతల మా ఇల్లు అని ఆడేవాళ్ళం. ఓ సారి అలాదూకుతూ పడిపోయాను. ఆ దెబ్బ అమ్మ చూస్తే కోప్పడతారని ఓ మూల నక్కి ఏడుస్తూ కూర్చున్నాను. నన్ను చూసి మీ వంటి ఆయనొకరు ఇంటి దారి మర్చిపోయానేమోనని బుజ్జగిస్తూ, బ్రతిమాలుతూ కూర్చున్నారు. అంటే గుర్తు. క్షేమంగా ఇంటికి చేరానని ఇప్పుడు మాత్రం చెప్పగలను 🙂

  > ఒకొకప్పుడు ఊహల్లో పుట్టిన స్వరూపాలు కళ్లముందు కనబడినప్పుడు ఒస్ ఇంతేనా అనిపించడం సహజమే కదా.
  మరైతే మనమిక కలవమా… 😉

  మిగిలినది కూడా ఎక్కువ వ్యవధి తీసుకోకుండా వ్రాసేయండి.

  మెచ్చుకోండి

 4. “వెయ్యిన్నూటపదహార్లు” గురించి అడిగారు. దీని మీద వివరమైన వ్యాసం 1960 మార్చ్, భారతి సంచికలో తిరుమల రామచంద్ర గారు వివరంగా చెప్పారు. ఈ భారతి సంచిక కొన్ని పేజీలు మాత్రమే DLI లో దొరుకుతున్నది. ఆ సంచిక ఎక్కడైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించండి. ఇదే వ్యాసం తిరిగి, “సాహితీ సుగతుని స్వగతం” అన్న పుస్తకం (తిరుమల రామచంద్ర గారి వ్యాస సంకలనం) లో ముద్రించారు.

  మెచ్చుకోండి

 5. @వి.బి.సౌమ్యా, ఓ అలాగా. సరే.
  @ సౌమ్యగారూ, మీరు మరోసౌమ్య అనుకుని తేలిగ్గా మాటాడేను. సారీ. ఇప్పుడే మళ్లీ ప్రయాణం పెట్టుకోలేనండి.
  @ చదువరి, 🙂

  మెచ్చుకోండి

 6. @మురళీ, రాసేస్తానండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు
  @సిరిసిరిమువ్వ, నిజమేనండీ. కొన్ని రాయడానికి మాటలు దొరకడంలేదు. అన్నట్లు చెప్పడం మరిచాను. మాఅన్నయ్య కూడా చదువరిగారి పద్యం చాలా బాగుందన్నాడు. ఇంతవరకూ మాఅన్నయ్యకి గణాలూ అవీ తెలుసని నాకు తెలీనే తెలీదు. 🙂
  @రమణీ, మీరలా అంటే ఏం చెప్పను! ధన్యవాదాలు.
  @కొత్తపాళీ, ధన్యవాదాలు.
  @బొల్లోజుబాబా, అలా అంటారా. సరే, కాళీపట్నం రామారావుగారు విశాఖ సాహితి సభలో ఏం అన్నారో తరవాత చెప్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.
  @సౌమ్యా, మళ్లీ అప్పుడే ప్రయాణంమాట తలపెట్టనా, హాహా
  @సుజాతా, నిజమే, అనుకున్నంతసేపు పట్టలేదు అనిపిస్తోంది రావడం, తిరిగి రావడం. అన్నట్టు, గంగిగోవుపాలు మొత్తం పద్యం అన్వయించుకోకండి. మొత్తం అందరూ గంగిగోవు పాలే. మీరిద్దరూ రిప్రజంటేటివ్ అన్నాను.
  మొత్తం అందరికీ మరోసారి కృతజ్ఞతలు
  @

  మెచ్చుకోండి

 7. మీరు వస్తారరొస్తారని ఎదురు చూడ్డం, రావడం, కలవడం, వెళ్ళడం అన్నీ క్షణాల్లో గడిచిపోయాయి.

  నన్నూ, మురళీ కృష్ణ గారినీ ‘గంగిగోవు పాలతో” పోలిస్తే ఇక మాకు ఆకలేస్తుందా?

  ఈ సారి ఇండియా వచ్చినపుడు మీతో సమావేశం మరింత ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను!

  రెండో భాగం కోసం చూస్తూ…!

  మెచ్చుకోండి

 8. సాహితి పేజీలో మీ ఇంటర్వ్యూ చదివాను. అద్బుతంగా ఉంది.

  మీరు ఇండియా వచ్చిన విషయం రమణగారి, మురళిగారి బ్లాగు ల ద్వారా తెలుసుకొన్నాం. మొన్న మొన్న ఇంటర్వ్యూ లో బెంగుళూరు అవార్డు గురించి అర్ధమయ్యింది. ఇప్పటి మీ ఈ పోస్టుద్వారా మీరు మీ ఇంటికి చేరుకొన్నట్లుగా వింటున్నాం.

  ఎక్కువ మంది బ్లాగరులు మీ సభకు రాకపోయినా మీ ట్రిప్ ఆద్యంతం ఫాలో అయిన నా బోటి వారు కూడా చాలా మందే ఉంటారనిపిస్తుంది. 🙂

  ధన్యవాదములతో
  బొల్లోజు బాబా

  మెచ్చుకోండి

 9. క్షేమంగా ప్రయాణాలు పూర్తి చేసుకొచ్చినందుకు సంతోషం.
  పెట్టుకున్న ప్రణాళికలు కూడా బాగానే పూర్తి అయినట్టున్నాయి, అందుకు మరీ సంతోషం.
  సాహితీ మూర్తుల్నీ బ్లాగు మిత్రుల్నీ కలుసుకోడం అంతకన్నా సంతోషం.

  Good to have you back.
  @ చదువరి, కందం మీద మంచి పట్టు సాధించారు. పద్యం బాగుంది.

  మెచ్చుకోండి

 10. థాంక్స్ మాలతిగారు. మీతో గడిపిన సమయం క్షణాలె అయినా మరిచిపోలేని సమావేశమది. అందుకే నా బ్లాగులో నిక్షిప్తం చేసాను, మరో మార్గం లేక.

  ఈ మధ్య ఎవో పనులో వత్తిడిలో.. నేను రాసిందంటు ఏమి లేదు కాని నా బ్లాగులకి అతిథులు ఎలా వస్తున్నారా అని ఆశ్చర్యపోయాను. కిటుకు మీ తూలికలో తెలిసింది దానికి మరో మారు థాంక్స్.

  “అసలు కలిసినవాళ్లే నిరుత్సాహపడిపోయేరేమో కూడా :ప్. ఒకొకప్పుడు ఊహల్లో పుట్టిన స్వరూపాలు కళ్లముందు కనబడినప్పుడు ఒస్ ఇంతేనా అనిపించడం సహజమే కదా.”

  ఇలా మటుకు నాకు జరగలేదనే చెప్పగలనండి. ఎందుకంటే “మాలతి గారు ఇలా ఉంటారు” …” సుజాత గారు అలా ఉంటారు” అని ఊహించుకోడాలు లాంటివేమి లేవు కాబట్టి. చలాకీగా అప్యాయంగా మీరు మాట్లాడిన ప్రతి మాట ఇంకా నా మనసు చెవులచుట్టూ గింగురుమంటూనే ఉంది.

  చక్కటి అనుభూతులని పంచుకొంటున్నారు. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ..

  మెచ్చుకోండి

 11. మీ గూటికి మీరు చేరారన్నమాట. నెల రోజుల కబుర్లు ఒక్క టపాతో అయిపోతాయేంటి?
  కొన్ని అనుభూతులకి మాటలు ఉండవు…..అలాంటిదే మీతో గడిపిన ఆ పూట.

  మెచ్చుకోండి

 12. ఎన్ని అనుభవాలు.. ఎన్ని అనుభూతులు… మీదైన శైలిలో వివరిస్తున్నారు.. మిగిలిన భాగాలు వీలైనంత త్వరగా రాసేయండి… మేమంతా ఎదురు చూస్తున్నాం..

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.