అట్లాంటిక్కి ఆవలితీరంలో 3 (ముగింపు)

ఆగస్టు 27 ఉదయం విశాఖపట్నం చేరేం. నా తొలి తెలుగుకథలసంకలనం ప్రచురించిన పద్మా, ఆమెభర్త ప్రజ్ఞానంద్‌ ఇప్పుడు విశాఖలో వుంటున్నారు.

ఆరోజు పొద్దున్నే తనని పిలిచి, వస్తున్నానని చెప్పి, వాళ్లింటికి వెళ్లేను. “28, 29 సభలకి వస్తున్నావా?”

అని అడిగితే, “రెండు సభలూ రెండో అంతస్థులో పెట్టేరండీ, రాలేను” అంది పద్మ. పోలియోమూలంగా మెట్లు ఎక్కలేదు తను.

“అయ్యో, నాకు తెలీదు. నేనింకా మీరొస్తారేమో, ఆనంద్ ఫొటోగ్రాఫరుగా నాకు విడియో తీస్తాడనుకున్నాను,” అన్నాను నవ్వి.

“ఆఁ. తను వస్తాడు,” అంది పద్మ.

“తప్పకుండానండీ, నేనొస్తాను. ఎన్నిగంటలకో చెప్పండి,” అన్నాడు ఆనంద్.

ఆతరవాత చెప్పేడు, పద్మ వెళ్లలేని ప్రదేశాలకి తను వెళ్లి, ఫొటోలు తీసి చూపిస్తాట్ట. అనుకూలదాంపత్యం అంటే అదీ అనిపించింది ఆపూట వాళ్లిద్దరినీ చూసింతరవాత నాకు.

నరసింహరాజుగారిని కూడా పిలిచి మాటాడేను. ఆయన సభకి రావడానికి 5గంటలకి కారు పంపుతాననీ, కాళీపట్నం రామారావుగారు కూడా ఆప్రాంతంలోనే వున్నారు కనక వారిని కూడా ఆకారులోనే తీసుకొస్తాం అనీ అన్నారు. నేను రామారావుగారికి ఒక సీడీ, సాహిత్యఎకాడమీ ప్రచురించినపుస్తకం, ఇచ్చే అభిప్రాయంలో వున్నాను. నేను తూలిక.నెట్‌లో ప్రచురించే కథలూ, వ్యాసాలూ ఆదినుంచి కాపీలు ఆయనకి అందిస్తూ వస్తున్నాను కథానిలయంలో పెట్టడానికి. తొలిసారి ప్రింటులో ఇచ్చేను. రెండోసారి 2003-2005 వరకూ ఒక సీడీలో పెట్టి ఇచ్చేను. ఇప్పుడు మళ్లీ 2006-2009 వరకూ సీడి చేసి తెచ్చేను. ఇప్పుడు నాపని సుళువు అయిపోయింది. రెండూ ఆయనకి ఇక్కడే ఇచ్చేయొచ్చు అని.

DSCF0296

ప్రొపెసర్ సి.యల్.యల్. జయప్రద తన అనువాదాలక్లాసు విద్యార్థులని ఎనిమిదిమందిని సభకి తీసుకొచ్చారు. నాకు పరిచయం చేసి, యూనివర్సిటీకి రమ్మని కూడా ఆహ్వానించారు. నేను విశాఖపట్నంలో వుండేది రెండు రోజులే కనక రాలేనని చెప్పేను. దురదృష్టవశాత్తూ నేను ఆపూట అనువాదాలగురించి మాటాడడం జరగలేదు, కాలాభావంవల్ల. నరసింహరాజుగారు “రెండోరోజు సభ పూర్తిగా మీదే, మీఇష్టం వచ్చినంతసేపు మాటాడండి” అన్నారు కానీ జయప్రదగారూ, వారి విద్యార్థులూ, రెండోరోజు రాలేదు ఒక్క అబ్బాయి తప్పించి, ఆవిధంగా అనువాదకులు కానున్న యువతతో నా అనుభవాలు పంచుకునే అవకాశం పోయింది నాకు.

మొదటిరోజు సభ మొదలవడమే ఆలస్యంగా మొదలయింది. సభకి అధ్యక్షత వహించవలసిన ఆచార్య మలయవాసినిగారు వచ్చేరు కానీ మరోచోట భాగవతంమీద ఉపన్యాసాలు ఇస్తున్నానని నన్నోమారు పలకరించి వెళ్లిపోయారు. ఆవిడస్థానాన రామకోటిగారు అధ్యక్షస్థానాన్నలంకరించేరు.

నరసింహారాజుగారి మనుమరాలు శాయిభూషణ ప్రార్థనగీతంతో పాటు మరో చక్కని కృతి కూడా పాడేక సభ ప్రారంభమయింది. నాగురించి మాఅన్నయ్యా, నాకథలమీద యం.ఫిల్. చేసిన బోనాల సుబ్బలక్ష్మి, యల్. ఆర్. స్వామీ మాటాడేరు. తరవాత రాజుగారి పుస్తకం, సామాన్యుడిసణుగుడు, ఆవిష్కరణ. ఆనాటి వక్తలు చాలామంది నాకు పరిచయంలేనివారే. వారిలో బాటా రామారావుగారు దాదాపు పుస్తకం అంతా చదివేశారు ఉపన్యాసంపేరున. సభికులు ఇంక చదవడానికేం వుందన్నట్టు మొహలు పెట్టినట్టు అనిపించింది నాకు. అధ్యక్షులవారు రామారావుగారిని కాలహరణంగురించి హెచ్చరించడానికి ప్రయత్నించేరు కానీ రామారావుగారు ఓచేత్తో వారిని విదిలించేసి తనఉపన్యాసం తాననుకున్నమేరకి కొనసాగించేరు.

DSCF0246

ఆతరవాత కాళీపట్నం రామారావుగారు మాటాడుతూ ఒకమంచి విషయం ప్రస్తావించేరు, “నేను సాధారణంగా సభలకి వెళ్లను. నేను కొంతకాలం రాయలేదు. ఆరోజుల్లోనే ఒకసారి 1961లో ‘నేనెందుకు రాస్తున్నాను’ అన్న అంశంమీద విశాఖసాహితి వారు సమావేశం పెట్టినప్పుడు వెళ్లేను. అక్కడ మాలతిగారు నన్ను అడిగారు ‘మీకథ చదివేను. చాలా బాగుంది. మీరు రాయడం మానేశారెందుకు?’ అని. ఇది ఎందుకు చెపుతున్నానంటే, ఏమాత్రం పరిచయంలేనిపాఠకులు ‘మీకథ చదివేను’ అన్నప్పుడు రచయితకి మంచి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆసంగతి నేను ఇప్పటికీ గుర్తు పెట్టుకుని రచయితలని ప్రోత్సహిస్తూ వుంటాను” అన్నారు.

నాకు ఈసంఘటన గుర్తు లేదు కానీ ఆయన చెప్పినమాట, ‘ఏమాత్రం పరిచయంలేనిపాఠకులు మనకథలగురించి ప్రస్తావించినప్పుడు రచయితకి ప్రోత్సాహంగా వుంటుంద”న్నమాట మాత్రం తెలుగుతూలిక మొదలుపెట్టినతరవాత నాకు అనుభవపూర్వకంగా స్పష్టమయింది. ఎంత పెద్దరచయితకయినా తనరచనలగురించి ఒక మంచిమాట వింటే పరమానందంగా వుంటుంది.

ఆలిండియా రేడియో డైరెక్టరు ప్రయాగ వేదవతి మాటాడుతూ, “మాలతిగారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజుల్లో మనకి 40 దాటినతరవాత యువతతో కనెక్షను పోతోంది. వాళ్లకీ మనకీ ఎక్కడా పొంతన కదరడంలేదు. ఏం చెయ్యాలి?” అని అడిగారు.

DSCF0242

రామారావుగారూ, రామకోటిగారూ, పురస్కారప్రదాత నరసింహరాజుగారు.

తరవాత సన్మానపత్రం, జ్ఞాపిక, వెయ్యిన్నూటపదహార్లతో సత్కారం జరిగింది. తరవాత వరసగా, వేదికమీద వున్నవారికీ, ఆహూతుల్లో కొందరికీ నరసింహరాజుగారు తమ పుస్తకావిష్కణసందర్భంగా జ్ఞాపికలందించారు. అప్పటికి సభికుల్లో చాలామంది లేచి వెళ్లిపోయారు ఆలస్యమయిపోతోందని,

రాజుగారు “ఇప్పుడు మాలతిగారిస్పందన” అని ప్రకటించేరు.

నేను స్వతహాగా అట్టే మాటాడేమనిషిని కాను. అడిగినమాటకి సూటిగా జవాబు చెప్పగలనేమో, అది కూడా కొంతవరకే, కానీ మొదట ఒక అంశంమీద మాటాడమని చెప్పి, తరవాత “ఇప్పుడు కాదు, రేపు” అంటే మరి నాకు మాట తోచదు. ఆరోజు నేను అనువాదాలమీద మాటాడాలన్నారు, అందుకు మాత్రమే సిద్ధంగా వున్నాను. మరి స్పందనతో ముగించమంటే నాకు కొంచెం తికమక అయింది.

వేదవతిగారి ప్రశ్నకి మాత్రం సమాధానంగా, “ఈనాటి యువతతో కనెక్షను లేదంటే దానికి కొంతవరకూ కారణం మనమేననీ, నలభయ్యో, యోభయ్యో దాటగానే మనం ఉసూరుమంటూ, పెద్దవాళ్లం అయిపోయాం అంటూ, మాకాలంలో ఇలాకాదంటూ … మాటాడితే యువతతో కనెక్షను పొసగదు, మనం వాళ్లభాషలోనే మాటాడాలి అంటే నేను చెప్పేది పాప్ సంగీతం, మైకెల్ జాక్సన్, బ్రిటనీ స్పియర్సు మాటా కాదు. జీవితంలో మౌలికమయిన విలువలవిషయంలో సమకాలీనజీవితాన్ని దృష్టిలో పెట్టుకు మాటాడాలి, ఇందుకు వుదాహరణ నా తెలుగుతూలికద్వారా నాకు పరిచయమయి, ఆత్మీయులు అయినవారు చాలామంది వుండడమే” అని చెప్పేను. నిజానికి ఈవిషయంమీద చెప్పడానికి చాలా వుంది, బహుశా ఒక వ్యాసం రాస్తాను ఎప్పుడో.

రెండోరోజు పైన చెప్పినట్టు కేవలం నేను ఒక్కదాన్నే వక్తని కనకా, నేను ముందే సిద్ధం చేసుకున్నప్రసంగం కనకా బాగానే జరిగింది. జయప్రదగారూ, వారి విద్యార్థులూ వచ్చివుంటే ఎంతో బాగుండేది. నిజానికి ముందురోజు వేదవతిగారు అడిగినప్రశ్నకి సమాధానం కూడా ఇక్కడుంది. నేను ఈప్రసంగం ముందురోజు చేసివుంటే, ఆ భావిఅనువాదకులతో చర్చ మరింత ఫలప్రదంగా జరిగివుండేది. మరి యువతతో మనకి కనెక్షను లేకుండా పోతోందంటే కారణం మనమే అనక తప్పుతుందా? నేను సభనిర్వాహకులని తప్పుబట్టడంలేదు కానీ తెలిసీ, తెలియకా మనం ఈనాటియువతకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదు అంటున్నాను.

పోతే సభలమాట అటుంచి, నేను విశాఖపట్నంలో తప్పనిసరిగా కలుసుకోవాలి అనుకున్నవారిలో ప్రథములు ద్వివేదుల విశాలాక్షిగారు. ఆవిడ అక్కడ వున్నారని తెలుసు కానీ వివరాలు తెలీవు. నిజానికి గత ఐదారేళ్లుగా వెతుకుతున్నాను ఆవిడకథ అనువదించడానికి అనుమతికోసం. అంచేత ఇప్పుడు మళ్లీ కనిపించినవాళ్లందర్నీ ఆవిడ ఫోన్నెంబరుకోసం అడుగుతూ వస్తున్నాను. ఆఖరికి మాబంధువుల్లో ఒకాయన తనకి తెలుసునని చెప్పి ఇచ్చారు.

28వ తేదీ వుదయం విశాలాక్షిగారికి ఫోను చేసేను. వాళ్లమ్మాయి ఫోను తీశారు. నేను నాపేరు చెప్పగానే ఆవిడ గుర్తించినట్టుంది, తాను విశాలాక్షిగారిఅమ్మాయినని చెప్పి, ఆవిడ స్నానం చేస్తున్నారనీ, మళ్లీ పిలవమనీ చెప్పారు. నాకు అది కాస్త ధైర్యాన్నిచ్చింది. ఎందుకంటే నాకు తెలిసినంతవరకూ, చాలామంది ఆవిడని కాంటాక్టు చెయ్యాలని ప్రయత్నించి విఫలులయినవారే!

తరవాత పిలిస్తే, ఆవిడ ఫోను తీసుకుని, “రండి, తప్పకుండా. కానీ మీరు పుస్తకాలకోసం వస్తుంటే మాత్రం నాదగ్గరేం లేవు. నేను ఇంటర్వూలు కూడా ఇవ్వడంలేదు” అన్నారు.

నాకు పుస్తకాలు అక్కరలేదనీ, ఊరికే చూడ్డానికి మాత్రమే వస్తున్నాననీ, ఆవిడ ఏం మాటాడితే అదే వింటాననీ చెప్పేను.

“తప్పకుండా రండి” అని మరోమారు చెప్పి, ఫోను పెట్టేశారావిడ.

Dwivedula-Visalakshi

29 వుదయం విశాలాక్షిగారిని చూడ్డానికి వెళ్లేం నేనూ మాఅన్నయ్యా.

ఆవిడ చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి, కూర్చోమని కుర్చీ చూపించారు. నేను దాదాపు ముప్ఫై ఏళ్లక్రితం ఆవిడని భీమ్లీలో కలిశాను. అంచేత మాకు చిరకాలపరిచయం వున్నట్టే లెక్క.

“నేను మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాను. ఎవరికీ మీ ఆచూకీ తెలీడంలేదు. ఏమిటి, అజ్ఞాతవాసం చేస్తున్నారా?” అన్నాను చిన్నగా నవ్వుతూ.

విశాలాక్షిగారు కూడా చిరునవ్వుతో “అలాగే అనుకోండి” అన్నట్టు తలూపేరు, తరవాత, “నాకు జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. ఇంటర్వూ ఎందుకు ఇవ్వనన్నానంటే, ఇంటర్వూలో విషయాలు కరెక్టుగా చెప్పాలి కదా. తప్పులు చెప్తే, మీరు అవి ప్రచురిస్తే బాగుండదు కదా,” అన్నారు.

“సరే మీరు ఇంటర్వూ ఇవ్వనన్నారు కనక, ఎప్పుడు మొదలుపెట్టేరు, ఎన్ని పుస్తకాలు రాసేరులాటి ప్రశ్నలు వెయ్యను. అవి నేనే కనుక్కోగలను. మీకు ఏం తోస్తే అదే చెప్పండి. వినేసి వెళ్లిపోతాను,” అన్నాను.

“మాఅమ్మకి ఈమధ్యసంగతులు గుర్తులేవు కానీ పాతవిషయాలు బాగా గుర్తున్నాయి” అన్నారు వారిఅమ్మాయి ఛాయ.

ఆమాట నాకు బాగా అర్థం అవుతుంది. ఎంచేతంటే నాక్కూడా కొన్నివిషయాలు మాత్రమే గుర్తుంటాయి, ఏవి అన్నది స్పష్టంగా చెప్పలేను.

తరవాత ఆమె కథ ఒకటి అనువదించి తూలికలో వేసుకోడానికి అనుమతి అడిగేను.

దానికి సమాధానంగా, “అనుమతి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ నేను నారచనలన్నీ ఇక్కడ ద్వారకానగర్‌లో వున్న పబ్లిక్ లైబ్రరీకి రాసిచ్చేసేను. అంచేత నేను అనుమతి ఇస్తాననడం సబబు కాదు. మీరు ఆలైబ్రరీ ట్రస్టీలు, వరహాలచెట్టిగారినీ (ఈయన వైజాగ్ బుక్ సెంటర్ అధినేత), భమిడిపాటి రామగోపాలంగారినీ అడగండి. వాళ్లు తప్పకుండా మీకు అనుమతి ఇస్తారు” అని చెప్పారు.

ఆమె చెప్పిన ఇతరవిషయాలు నేను రికార్డు చెయ్యలేదు కనక మరొకసారి, ఆమెని సంప్రదించి, వేరే వ్యాసంగా ప్రచురిస్తాను.

కలుసుకోవాలని అనుకున్నా కలుకుకోలేకపోయాను నాతూలిక.నెట్ కి చక్కని చిత్రాలు అందించిన ఆర్లె రాంబాబుగారినీ, రావిశాస్త్రిగారు సోదరులు రాచకొండ నరసింహశర్మగారినీ, ఇంకా కొందరిని.

మరొకటి నేను గ్రహించింది నాకు అమెరికాలో పుష్కలంగా టైమున్నా చదవలేకపోను. కానీ ఇండియాలో వున్నప్పుడు కొన్ని పుస్తకాలు చదవగలిగేను. నేను అట్టే పుస్తకాలు పుచ్చుకోడానికి ఇష్టపడలేదు కానీ, నాప్రమేయంలేకుండానే నాకు చేరినపుస్తకాలు చదివేను. కానీ నన్ను ఆకట్టుకున్న కథలు మాత్రం దొరకలేదనే చెప్పాలి. ప్చ్. నేను తూలికలో ప్రచురించడానికి నాకు మనసంస్కృతిలో ప్రత్యేకతని విశదం చేసేవి, స్టీరియోటైపు అభిప్రాయాలకి భిన్నమయినవీ కావాలి. దేశంలో ఈనాడు జరుగుతున్న అన్యాయాలని ఎత్తిచూపే కథలు అన్నిపత్రికలలో వస్తూనే వున్నాయి. వాటికి భిన్నమయినకథలకోసం చూస్తున్నాను.

సింహావలోకనం – భువినుండి దివికిః

ఇంత రంగరంగవైభంగా నెలరోజులపాటు నాసాహితీయానం సాగినప్పుడు ఆనందం హద్దులు మీరి కళ్లు నెత్తికెక్కిపోయే ప్రమాదం వుంటుంది. అలా జరక్కుండా, దివినుండి భువికి దింపి, సదసత్ వివేచన కలిగించి జీవనసూత్రాలలో అతిముఖ్యమయినవి గుర్తు చెయ్యడానికి కొన్ని సందర్భాలు కావాలి. అలా జరిగినప్పుడే, మనకి బాలెన్సు కుదురుతుంది. అలాటివాటిల్లో కొన్నిజరగని లేదా అవకతవకగా జరిగిన ఇంటర్వూలు, మీడియాలవాళ్లూ.

పత్రికలలో రిపోర్టులు – రిపోర్టరులు సభలకి హాజరయి, అటూ ఇటూ తచ్చాడి, నలుదిక్కులు చూసి, వచ్చినవాళ్లలో ముగ్గురు, నలుగురిపేర్లు రాసుకుని, నాలుగు ఫొటోలు తీసుకుని, ఓ రిపోర్టు రాసి ఇచ్చేయడం ఓ పద్ధతి. ఈరిపోర్టు మనం పేపరులో చూసినప్పుడు కనుక్కోగలం. ఎలా అంటే ఆరిపోర్టులో సభకి హాజరు కానివాళ్లపేర్లు కనిపిస్తాయి. అంటే వాళ్లు వచ్చేవుంటారనుకుని రాసేసిన రిపోర్టు అది.

అసలు సభకే రాకుండా, ఇంట్లోనే కూర్చుని ఈవక్త ఇలా చెప్పి వుంటారు అనుకుని, అవే చెప్పేసినట్టు రాసేయడం మరోపద్ధతి. ఆంధ్రప్రభ దినపత్రికలో లేఖినిసమావేశంమీద వచ్చిన వార్త అలాటిదే. ఆవార్తాహరుడు రాసినమాటలు నావి కావు. నేనెప్పుడూ అలా అనలేదు.

అలాగే, విశాఖపట్నంలో ఈనాడుపత్రిక విలేఖరి వచ్చి ఇంటర్వూ అడినప్పుడు సరే అన్నాను. “మీగురించి కొంచెం చెప్పండి. అసలు రిపోర్టరు రేపు వచ్చి మిమ్మల్ని ఇంటర్వూ చేస్తారు. ఈటీవీవారు కూడా అదే సమయంలో వస్తారు” అని చెప్పేడు.

వివరాలన్నీ అనవసరం కానీ మర్నాడు కూడా అతనే వచ్చి, “ఇదే ఇంటర్వూ. మీరు చెప్పదలుచుకున్నదంతా చెప్పేయండి. అసలాయన రారు. ఈటీవీవారు ఏమో తెలీదు. మీకు ఫోను చేస్తారులెండి” … ఇలా జరిగింది. వేరు చెప్పనేల? అతనిచేతిలో నోటుబుక్కు తీసుకుని, ఆరెండు కాగితాలు చింపిపారేసి, నేను ఇంటర్వూ ఇవ్వనని చెప్పాలిసింది అని నాకు తరవాత అనిపించింది. చెప్పేను కదా నాకు సద్యోస్ఫూర్తి లేదని.

ఇంకా కొందరు “మీతో మాటాడాలి, ఇంటర్వూలూ కావాలి” అన్నవారు నేనే వారిని పిలవాలని చెప్పినప్పుడు కూడా, వారిదృష్టిలో నాస్థానం ఏమిటో నాకు అవగతమయింది. ఇవన్నీ నాకు భువినుండి దివికి దిగి రాడానికి తోడ్పడ్డ అనుభవాలే.

నాసమాకాలీనులే అయినా నాకంటే అన్నివిధాలా పెద్దలూ, లబ్ధప్రతిష్ఠులూ అయిన రచయితలని చాలామందిని కలిసేను. వారందరూ నాతో సాదరంగా మాటాడేరు. సభల్లో, సమావేశాల్లో నాకృషిని ఎంతోఘనంగా కొనియాడారు. ఆక్షణంలో నాకు ఆఘమేఘాలమీద ఓలలాడుతున్నంత ఆనందం కలిగినమాట వాస్తవమే. అయినా మరోమూల ఎక్కడో, ఈసంభావనలకి నేను తగుదునా అన్న సందేహం కలక్కపోలేదు. ఎందుకంటే, పొగడ్తలు మనజాతి లక్షణం. విశాఖసభలో కాళీపట్నం రామారావుగారు చెప్పినట్టు, మనరాతలని ఎవరైనా మెచ్చుకుంటే ప్రోత్సాహంగా వుంటుందన్నమాట కూడా సత్యం. అయినా ఆ పొగడ్తల్లో అతిశయోక్తులు కూడా చాలా ఎక్కువే అన్నది కూడా అంతటి వాస్తవమూను.  అది సదా నేను మనసులో పెట్టుకుంటాను. లేకపోతే, “మనం బోలెడు సాధించేశాం” అని గొప్పలు పోయి, మరింక చెయ్యవలసిందేం లేదనుకుంటూ, వాలుకుర్చీలో దిలాసాగా వెనక్కి వాలి, క్రియాశూన్యులం అయిపోతాం. “నేను చేసింది చాలా తక్కువ. ఇంకా చెయ్యవలసింది చాలా వుంది,” అని నాకు నేను చెప్పుకుంటే తప్ప, ముందుకి సాగలేను.

ఈప్రయాణం అంతా ముగిసింతరవాత నేను గ్రహించిన నీతి అది. ఈనాటిసాహిత్యంలో నాస్థానం ఏమిటో నాకు సుస్పష్టమయింది. అందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ శలవు తీసుకుంటున్నాను.

DSC_0365నాఈప్రయాణం ఇంతగా సుఖప్రదమూ, జయప్రదమూ చేసిన మాఅన్నయ్య సీతారామారావు.

(సెప్టెంబరు 24, 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “అట్లాంటిక్కి ఆవలితీరంలో 3 (ముగింపు)”

 1. @పరిమళం, అవునండీ, ఒకొకప్పుడు జరగదు. ఇప్పుడు మీపరిస్థితి మెరుగు పడిందనుకుంటాను. మీరు కలుద్దాం అనుకోడమే నాకు ఆనందం.

  మెచ్చుకోండి

 2. మాలతి గారు , అట్లాంటిక్కి ఆవలి తీరంలో …..మూడు భాగాలూ చదివాను . హైదరాబాద్లో మిమ్మల్ని కలుసుకోలేకపోయిన బ్లాగర్లలో నేనూ ఉన్నా ! అది నా దురదృష్టం !ఎన్నో రోజులుగా ఎదురుచూసి చివరకు కుటుంబంలోని అనుకోని పరిణామాల వల్ల మిమ్మల్ని కలుసుకోలేక పోయాను .మీ పోస్ట్ లు చదువుతుంటే కొంత ఊరటగా అనిపించింది .మాలాంటివారికోసం మీ అనుభవాలను రాసినందుకు ధన్యవాదాలు!

  మెచ్చుకోండి

 3. @ రాధిక, థాంక్స్ మీ అభిమానానికి.
  @ మధురవాణి, మీరూ, మీలాటి అభిమానులూ అందించిన ఆదరణ అంతా ఈరూపంగా వెలుస్తోందనుకుంటున్నాను. మీఅందరికీ ఋణపడిపోతున్నాను. మరొకసారి మీకూ, నాప్రయాణవిశేషాలు ఓపిగ్గా చదివినవారందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ,
  మొన్న ఏదో పని మీద అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి కంగారులో రాసినంత వరకూ నా కామెంటుని పోస్టు చేసి వెళ్ళాను. అసలు ముఖ్యంగా చెప్పాలనుకున్న మాట మరచాను 😦
  మీ రచనలు రెండు పుస్తకాలుగా ప్రచురించబడ్డ సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా త్వరలో ‘చాతక పక్షులు’ కూడా పుస్తక రూపంలో చూడచ్చన్నమాట. అలాగే మీ ‘ఎన్నెమ్మ కతలు’…ఇవన్నీ తొందరలో అచ్చయిపోవాలని మేము కూడా ఆ పుస్తకాలు కొనుక్కోవాలని ఎదురుచూస్తాను. ఈ ప్రయాణంలో మీరెన్నో మధురస్మృతులు మూటగట్టుకుని వచ్చిన సందర్భంగా కూడా మీకివే నా అభినందనలు 🙂

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ,
  మీ ప్రయాణ విశేషాలు మూడు భాగాలూ చదివాను. మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం కుదరనందుకు చాలా బాధపడినా, ఇంత వివరంగా చక్కగా పక్కన కూర్చుని చెప్పినట్టుగా మీరు మీ అనుభవాల్నీ, అనుభూతుల్నీ అక్షరబద్ధం చేసి కాస్త సంతోషం కలిగించారు. ఇలాంటి ముఖ్యమైన ప్రయాణాలవ్వగానే అన్నీ అనుభూతుల్నీ, అనుభవాల్నీ అక్షరాల్లో పెట్టాలని చాలామంది అనుకుంటారు. కానీ, నిజంగా ప్రాక్టికల్ గా చేసి చూపించే వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. ఈ విషయంలో మీరెంతమందికో స్పూర్తిగా నిలుస్తున్నారు. ధన్యవాదాలు.
  తెలుగు సాహిత్య జ్ఞానం పెద్దగా లేకపోయినప్పటికీ మీ బ్లాగు చదువుతూ ఉండటం వాళ్ళ చాలా మంది గురించి ఒక అవగాహన వస్తున్నది. అంటే.. ఫలానా రచయితలు ఉన్నారు అని అన్నమాట. ఇలా తెలుసుకుంటే ఎప్పటికైనా మెల్లమెల్లగా పలువురు రచయితల రాతల్ని చదివే ప్లాన్ చేసుకోవచ్చు కదా 🙂
  ‘పెద్దవారికీ, యువతకీ మధ్యన ఉండే/ఉండాల్సిన సమన్వయం గురించి మీరు రాయబోయే వ్యాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ విషయంలో మీ ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది.

  మెచ్చుకోండి

 6. బావున్నాయండి మీ ప్రయాణ విశేషాలు.వున్నన్నాళ్ళూ భూచక్రం లా తిరుగుతూనేవున్నారన్న మాట.చివరి ఫొటో లో మీ నవ్వు చాలా బాగుంది.అందరినీ కలిసానన్నా తృప్తి,ఆనందం కనిపిస్తున్నాయి.

  మెచ్చుకోండి

 7. @ చావా కిరణ్, బొల్లోజుబాబా, సునీత, రమణ- ధన్యవాదాలు
  @ మరువం ఉష, 🙂 ధన్యవాదాలు.
  @ కొత్తపాళీ, బ్లాగులో ఎప్పుడేనా పెట్టొచ్చు, పచ్చగా వున్నప్పుడే రాసిపెట్టుకోవాలి. లేకపోతే ఇంప్రెషన్సు మారిపోతాయి.
  @ రమణి, 🙂 సరే, అలా అనుకుని సంతోషిస్తాను. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. పూస గుచ్చినట్లు మీ ప్రయాణాన్ని, మీ అనుభూతులని చాలా చక్కగా వివరించి మాతో పంచుకొన్నారు మాలతి గారు. ఈ మూడు భాగాలు చదువుతుంటే మీతో పాటు మమ్మల్ని కూడా అన్నిచోట్లకి తీసుకెళ్ళినంతటి అనుభూతి కలిగింది.

  “సదసత్ వివేచన కలిగించి జీవనసూత్రాలలో అతిముఖ్యమయినవి గుర్తు చెయ్యడానికి కొన్ని సందర్భాలు కావాలి. అలా జరిగినప్పుడే, మనకి బాలెన్సు కుదురుతుంది. అలాటివాటిల్లో కొన్ని ఇంటర్వూలు, మీడియాలవాళ్లూ.”

  మీడియా వాళ్ళు ఏమిలేనిదాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తారు కాని ఇలా చక్కటి సాహితీ ప్రతిభ గల వారిని పరిచయం చేయడమంటే వెనక్కి తగ్గుతారు.

  మెచ్చుకోండి

 9. మీ ప్రయాణ విశేషాలు బాగున్నాయి. రచయిత/రచయిత్రు ల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. చాలా చాల ఎంజాయ్ చేశానండీ! మీ అనుభవాలే నా అనుభవాలన్నంతగా ఎంజాయ్ చేశాను. మొన్న జూన్‌లో విశాఖపట్నం వెళ్ళినప్పుడు నామనసు మహా ఉర్రూతలూగింది, ఆ అనుభవాలన్నీ బ్లాగులో రికార్డు చేసుకోవాలనీ. తీరా అక్కడున్నంతసేపూ అనుభవాల్ని సంపాయించుకోవడంలో క్షణం తీరికలేక గడిపాను. తీరా వెనక్కి వచ్చాక, ఏదో ఆ పనీ ఈ పనీ అని ఆ ఆలోచన అలా వెనకబడిపోయింది .. ప్చ్.
  మీరు మాత్రం మా గొప్పగా రాశారు. చక్కగా బొమ్మల్తో సహా!

  మెచ్చుకోండి

 11. చాలా బాగా మీ ప్రయాణాన్ని వివరించారు. మీ సీరియల్ ఐపోయాకా కొద్ది రోజులు కూడల్లో వెదికాను ఇంకా కొత్తగా ఏమన్నా రాసారా? అని . బాగుంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s