ఊసుపోక – ప్రసన్నవదనం లేక ఏం చూసుకుని ఆ …

(ఎన్నెమ్మకతలు 41)

ఈమధ్య  ఇండియా వెళ్లొచ్చేను కదా. దానిమీదో పెద్ద కత రాసేశాను కదా. అది చదివిన ఒకాయన ఇంగ్లీషులో ఘట్టిగా నన్ను రొకాయించి మరీ అడిగేరు, “మీరంత పాజిటివ్‌గా
రాయడం నాకెంతో హాచ్చర్యమయిపోయింది. దేశం కుక్కలపాలయిపోతోందని మీరు గమనించలేదా? ఉద్యోగాల్లేవు, డబ్బుల్లేవు, ఆప్యాయతలూ, అభిమానాలూ లేవు. అన్నదమ్ములే ఒకళ్లనొకరు దోచేసుకుంటున్నారు. మీఅమెరికాలో కొంత నయమేమో గానీ, అక్కడ కూడా …” తెలిసింది కదూ వరస.

(ముళ్లపూడివారి భాషలో) ఆఁవటాని నేను అవాక్కయిపోయేను. ఆతరవాత ఆశ్చర్యపడిపోయేను. అది కూడా అయేక తల పట్టుక్కూచున్నాను ఓ పూటన్నరసేపు. నాకు పాలు పోడం లేదు. ఊపిరాడ్డంలేదు. సరే, ఓ ఊసుపోక మొదలెడితే, నాక్కాపోతే, మనవాళ్లకయినా ఊసుపోతుందని మొదలెట్టేశాను.

ఇంతకీ, నేను ఇండియాలో వుండగా తెలుసుకున్నవి ఇంకా వున్నాయి. అందులో ముఖ్యమయినది నేనంటే సాటివారికి గల అభిప్రాయాలూ, అపోహలూను. నా కాలేజీరోజుల్లో తెలిసిన ఒకాయన మిమ్మల్ని “ముచ్చుమొహం” అనేవాళ్లమండీ అన్నాడు. ఎంచేతంటే, నన్ను మాట్లాడించడం ఎలాగో తెలీకట! హా. హా.

ఆహా, అలాగా అన్నాను. నాకు నమ్మబుద్ధి పుట్టలేదు. మొన్నీమధ్యే కదా నామొహం నారెండు సైటులనిండా పెట్టేస్తే, నవ్వుమొహం ఎంతోబాగుందనలేదా అఁదరూను? అలాగని నేను మురిసిపోతుంటే, పైన ఆయనేమో … … ఏంచూసుకుని … … “ఆ విరగబాటు” అనలేదులెండి. నాకు మాత్రం అలా అన్నట్టే వుంది.

అసలు నిజానికి నామొహానికి నేను ఎలా జవాబుదారీనవుతానో నాకు తెలీదు. నామొహమూ, కాళ్లూ, చేతులూ అన్నీ ఒకే పేకేజీలో వొచ్చేయి కదా నేను పుట్టినప్పుడు. అప్పటికి నాకు మాటలొచ్చి వుంటే, అప్పటికే నా కాలేజీమేళం నాకు ముచ్చుమొహం అని పేరు పెడతారని తెలిసివుంటే, మాఅమ్మతో చెప్పి వుండేదాన్నేమో, “నీకీ మొహం వొద్దు. మరోమొహం చూడు” అని.

అన్నట్టు మరో కత జ్ఞాపకం వస్తోంది. ఇదీ నాకాలేజీ రోజులనాటిదే. అంటే ఆరోజుల్లో నేను ఏ రీడర్స్ డైజెస్టులోనో చదివిందని అర్థం.

అబ్రహాం లింకన్ ఉద్యోగం ఇవ్వడానికి ఇంటర్యూ చేస్తున్నాట్ట. ఒకాయన సకల సల్లక్షణలక్షితుడిలాగే కనిపించేడు. ఆయన్ని తీసుకుందాం అన్నాడు పక్కనున్నాయన.

లింకను “వీల్లేదు” అన్నాట్ట.

“ఏం?” అన్నాడు సహజంగానే అవతలాయన.

“ఆయనమొహం నాకు నచ్చలేదు,” అని సమాధానం.

“అదేమిటి. అతనిమొహం అలా వుంటే దానికి అతనేం చెయ్యగలడు?” మళ్లీ మొదటాయన.

“కాదు. నలభై దాటింతరవాత ఎవరిమొహాలకి వాళ్లే బాధ్యులు,” అన్నాట్ట లింకను.

తెలిసింది కదూ. అంటే నలభై దాటేసరికి చాలామంది జీవితంలో తినవలసిన ఢక్కామొక్కీలు తినడం అయిపోతుంది, ఆతరవాత వారి ఈతిబాధలూ, కోతివేషాలూ, సుఖదుఃఖాలూ, కోపతాపాలూ, కష్టనష్టాలూ … అన్నీ ఒంటబట్టేసి. వాటికి తగ్గట్టు మొహం ఏర్పడిపోతుందనీ, దానికి తగ్గట్టు మొహంలో కళలు కనిపిస్తాయి అని టిప్పణి.

లింకను పెద్దవాడు కనక పుస్తకాలకెక్కేసింది కానీ, నాకు మాత్రం నమ్మకం లేదనుకోండి. ఎందుకంటే మొహం తీరుతెన్నులు ఏరోజుకారోజు జరిగినవిశేషాలనిబట్టి కదా ఉంటుంది.

ఇంతకీ నేనెందుకు నవ్వుతానో చెప్పనేలేదు. ఈమధ్య నేను బయటికి వెళ్లడం మానేశాక, టీవీ చూడ్డం ఎక్కువయిపోయింది. అందులో ముఖ్యంగా కోర్టు టీవీ, అందులోనూ జడ్జి జూడీ అని ఓ షో… కొంతకాలం చూసేసరికి నాకు ఇదేంటి ప్రతిరోజూ ఒకగంటలో కనీసం పన్నెండుమంది–వాదులూ, ప్రతివాదులూ–ఉంటారు. స్నేహితులూ, రూమ్మేట్లూ, అమ్మా-కూతుళ్లూ, అన్నదమ్ములూ, ఇంటివాడూ-అద్దెవాడూ .. ఇలా ఒకళ్లొనొకళ్లు దోచుకునేవాళ్లూ — కనిపిస్తున్నారు. దేశంలో ఇంతమంది దొంగలూ, కుళ్లుబుద్ధివాళ్లూ, మూర్ఖులూ, బుద్ధిహీనులూ, మందబుద్ధులూ (నాకు వచ్చిన మాటలు ఇంతే) వున్నారా? అసలు దేశంలో డీసెంటు పీపులు లేనే లేరా … అని నాకు గొప్ప అనుమానం వచ్చింది. ఛాలా బాధ పడిపోయేను.

ఇంక చూడలేక, ఒరోజు గబుక్కున లేచి నామామూలు వాక్కి బయల్దేరేను. పార్కుపక్కనించి వెళ్తున్నాను.

పార్కులో పిల్లలు సాకర్ ఆడుతున్నారు. అమ్మలూ, నాన్నలూ, పిల్లలకి ఆట నేర్పుతున్నారు. నానమ్మలూ, తాతలూ, ఇంకా ఇరుగూ పొరుగూ కుర్చీల్లో కూచుని వాళ్లని హుషారు చేస్తున్నారు, పానీయాలు సేవిస్తూ.

ఒక్కక్షణం ఆగేను. ఆతరవాతిక్షణం కూడా అక్కడే నించున్నాను, ఆతరవాతిక్షణం, ఆతరవాతి క్షణం … అలా చాలా క్షణాలు (పావుగంటకి సరిపోతాయనుకుంటాను) చూస్తూ నిలుచున్నాను. కోర్టుటీవీలోలాటి మనుషులు కాదు అక్కడ వున్నది. హమ్మయ్య, ఇంకా మామూలు మనుషులున్నారు. లోకమంతా కుళ్లుమనుషులూ, దగాకోర్లే కాదు. లోకం ఇప్పుడప్పుడే నాశనం అయిపోదు అనుకుని సంతోషించేను. రోజూ ఆటే వెళ్తున్నా, ఈవిషయం నాకెందుకు తట్టలేదంటే, కోర్టు టీవీలు అంత సీరియస్గా చూడకపోవుటచేత. అంటే మనం పాజిటివుగా ఆలోచించడానికి కొన్ని నెగిటివు అనుభవాలు అవస్యం.

నాకూ వున్నాయి బాధలు. అవన్నీ అదే పనిగా రోజూ ఓగంటసేపు కచేరీ పెట్టేస్తే మీరు వింటారా? వినరు. మహా అయితే వింటున్నట్టు నటింటొచ్చు అదేనా కొంతకాలంపాటే. … అవునా, కాదా మీరే చెప్పండి.

అంచేత నేను పాజిటివుగా మాటాడాలి అని నేను ధృఢముగా నమ్ముతున్నాను. నవ్వాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు నవ్వాలి కానీ ఏడుప్మొహం పెట్టనేల? దేనికదే కదా. స్వీటు తిన్నప్పుడు స్వీటు తింటాం. హాటు తిన్నప్పుడు హాటు తింటాం. స్వీటు తిన్నప్పుడు హాటు లేదనీ, హాటు తిన్నప్పుడు స్వీటు లేదనీ ఏడుస్తామా, ఛీ.

(అక్టోబరు 6, 2009.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “ఊసుపోక – ప్రసన్నవదనం లేక ఏం చూసుకుని ఆ …”

 1. మాలతి గారు ఏ వార్తా పత్రిక అయినా మాములు వెబ్ పోర్టల్ కాకుండా ఈ-పేపర్ లింక్ కోసం వెదకాలండీ సాధారణం గా వాళ్ళ హోమ్ పేజ్ లోనే ఈ లింక్ ఇస్తారు. ఉదాహరణకు ఈనాడు వారిది http://epaper.eenadu.net/login.php ముందుగా ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్య వార్తా పత్రికలు అన్నీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఏ ఉంటాయి.

  రిజిష్టర్ చేసుకున్నాక లాగిన్ అయితే పేపర్ మాములు ప్రింట్ లో కనిపించినట్లే వస్తుంది. ఎడమ వైపు పేజీలు అన్నీ Thumbnails ఉంటాయి అందులో మనకు కావాల్సిన పేజ్ క్లిక్ చేస్తే అది మెయిన్ విండోలో ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ పై మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే ఒకో వ్యాసం ఒకో లింక్ గా కనిపిస్తుంది. మీకు కావాల్సిన వ్యాసం పై క్లిక్ చేస్తే అది వేరే విండో లో పెద్దగా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన విండో లో వ్యాసం పై రైట్ క్లిక్ చేసి వచ్చిన మెను బార్ లో సేవ్ పిక్చర్ యాజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని మీకు కావాలిసిన పేరు తో jpg extension తో సేవ్ చేయండి like XYZ.jpg.

  సందేహాలుంటే మెయిల్ చేయండి. venusrikanth@gmail.com

  మెచ్చుకోండి

 2. @ విబిసౌమ్య, సుజాత, మరియు సుజాత, ధన్యవాదాలు 🙂
  @ మధురవాణీ, నాకంటే బాగా చెప్పేరు. ధన్యవాదాలు
  @ చదువరి, 🙂 తాత్త్వికుడి మాటలు నోట్ చేసుకున్నాను. ధన్యవాదాలు 🙂

  మెచ్చుకోండి

 3. “అంచేత నేను పాజిటివుగా మాటాడాలి అని నేను ధృఢముగా నమ్ముతున్నాను. నవ్వాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు నవ్వాలి కానీ ఏడుప్మొహం పెట్టనేల?”
  – ఏంటో ఒప్పుకోలేకుండా ఉన్నానండి.. నెగటివుగా ఆలోచించే అవకాశం మెండుగా ఉండగా పాజిటివుగా ఆలోచించాల్సిన అవసరమూ, హాయిగా ఏడవదగ్గ సందర్భం దొరికినపుడు నవ్వాల్సిన ఖర్మా మనకేంటండీ! 🙂 (‘చక్కగా బోల్డంత కాంప్లికేటు చేసే అవకాశం ఉండగా సులువుగా అర్థమయ్యేలా చెప్పడమెందుకూ’ అని అన్నాడటో తాత్వికుడు.)

  మెచ్చుకోండి

 4. హ్హ హ్హ హ్హ నాకెందుకో బాగా నవ్వొచ్చేస్తోందండి, మాలతి గారు. మీరెంత ఊసుపోక రాసినా ఇంత హాస్యంలోను ఎంత గూడార్థం ఉందో చెప్పకనే చెప్పారు. మొన్నామధ్య మా పాప “అమ్మా నువ్వు బాగా లావయిపోతున్నావు, నాకు తెలీదు ఒక నెలలో తగ్గిపోవాలి ” అంది అలా అందని ఒకపూట తినడం మానేశాను (ష్… తినేది నాలుగుపూట్ల అనుకొండి) అతరువాతి వారానికే “ఎంటండి అలా అయిపోయారు మొహం పీక్కుపోయింది అన్నడం మొదలెట్టారు సన్నిహితులు, హహహ .. ఏదయిన జన్మతః ఉన్నదే సహజమైన అందం… ఆనందం.

  నవ్వు ఏడుపు సహజసిద్ధంగా ఉండాలి. అంతేకాని మీరన్నట్లు స్వీటు హాటులా బాధపడకూడదు జన్మతః వచ్చిన రూపాన్ని పెన్సిలు చెక్కినట్లు చెక్కేసుకోలేము కదండి.

  మెచ్చుకోండి

 5. “అంటే మనం పాజిటివుగా ఆలోచించడానికి కొన్ని నెగిటివు అనుభవాలు అవస్యం.”
  బంగారం లాంటి మాట చెప్పారు. మీకు ఆలోచించగలిగే తెలివితేటలు, చక్కటి వివేచన ఉన్నాయి కాబట్టి ఇలా అంటున్నారు. కానీ, సమస్య ఏంటంటే, టీవీలో ఏది చూపిస్తే అది, ఎవడో ఏదో చెప్తే అదీ, గుడ్డిగా ఫాలో అయిపోతూ, అసలు తమకంటూ ఒక బుర్ర, ఒక ఆలోచన అంటూ లేనివాళ్ళే ఎక్కువమంది. పైగా ఒక చిన్న బావిలో బతుకుతూ అదే మహా సముద్రమని, మేమే పరమజ్ఞానులమని అనుకుంటూ ఉంటారు. ఇదంతా చెప్పే బదులు ఒకే మాటలో మూర్ఖత్వం అంటే సరిపోతుందేమో 🙂 కానీ, వీళ్ళలాగే మంచి ఆలోచనాపరులు, మానవతావాదులు కూడా చాలామందే ఉన్నారు. అందుకే ఇంకా బతగ్గలుగుతున్నాం అనిపిస్తుంటుంది నాకు.
  పొద్దున్నే ఒక మంచి పాజిటివ్ ఫీల్ కలిగించారు. ధన్యవాదాలు. 😉

  మెచ్చుకోండి

 6. నవ్వాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు నవ్వాలి కానీ ఏడుప్మొహం పెట్టనేల? దేనికదే కదా. స్వీటు తిన్నప్పుడు స్వీటు తింటాం. హాటు తిన్నప్పుడు హాటు తింటాం. స్వీటు తిన్నప్పుడు హాటు లేదనీ, హాటు తిన్నప్పుడు స్వీటు లేదనీ ఏడిస్తామా …. సింపుల్ లాజిక్. 😀

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.