ఎలాటి అనువాదాలు కావాలి -2

ముందుటపాలో టెన్స్ గురించి చెప్పాను. ఉదాహరణకి Escaped Parrot (Acanta Saradadevi) వర్తమానకాలంలో చెప్పినకథ.   Entangled in the Creeper Kasiratham (మాలతి) భూతకాలంలో చెప్పినకథ.

ఇంగ్లీషులో టెన్స్‌పట్టింపులు ఎక్కువ. అంచేత అనువాదాలు చేస్తున్నపుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఉపకథ అంటే ఒకకథలో వెనక జరిగిన మరోసంఘటన చెప్తున్నప్పుడు, అదీ రెండో మూడో పేజీలు సాగినప్పుడు, అనువాదకుడికి కష్టతరం అవుతుంది. Redeemer కథలో అలాటి సందర్భం వుంది. చూడండి. ఉపకథలో సంభాషణలు కూడా వుంటే, అనువాదకుడికి కుంజరయూధంబు దోమకుత్తుక సొచ్చినట్లే!.

తూలిక.నెట్‌లో అనువాదాలు సంకలనాలుగా సమకూర్చడానికి గత మూడు వారాలుగా మళ్లీ ఎడిట్ చేస్తుంటే కనిపించేయి ఈ గందరగోళాలు. వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు అనువదించిన progress or retreat (వివినమూర్తి) తీసుకోండి ఉదాహరణకి. అందులో భర్త భార్యకి వెనక జరిగిన వుదంతం చెప్తుంది. మధ్య మధ్యలో భర్త స్వగతాలున్నాయి. భార్య చెపుతున్న సన్నివేశంలో ఆవిడకీ, సహోద్యోగికీ జరిగిన సంభాషణలున్నాయి. పైగా కథంతా గంభీరంగా నడుస్తుంది. ఇలాటివి చదువుతున్నప్పుడు, ఏ ఆలోచన ఎవరిది, ఎవరు ఎప్పుడు ఏమిటి అంటున్నారులాటివి గుర్తు పెట్టుకోడం కష్టం. అంచేత, అనువాదంలో వీలయినంతవరకూ, స్పష్టం చెయ్యడం మంచిది.

నా అమెరికన్ మిత్రులు నాకు ఇచ్చిన సలహా – ఫాంట్ సైజు మార్చడం, లేదా ఇండెంట్ చెయ్యడం. నేను ఈ పద్ధతి వీలయినంతవరకూ అవలింబించినా, చాలావరకూ, ఆ ఉపకథకి ఆదిలోనూ, అంతంలోనూ మరో transition line కూడా చేరుస్తాను. పాఠకులకి మరోమారు హెచ్చరిక అన్నమాట మళ్లీ మనం మొదటికొచ్చేం అని.  ఆఉపకథ ఆద్యంతాల మూడు *** పెడతాను కూడా.

ఆపైన మరో విషయం. కథంతా భూతకాలంలో చెప్తున్నాం అనుకోండి. అప్పుడు వెనక జరిగిన కథ past perfectలో చెప్పాలి. మరి ఆకథలో అంతకు పూర్వం జరిగిన సంఘటన చెప్పినప్పుడు ఏం చేస్తాం? ఈవిషయంలో ఇంగ్లీషులో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ప్రతివాక్యానికి had అని చేరిస్తే, ముఖ్యంగా ఉపకథ పెద్దది అయినప్పుడు, చదవడానికి సుకరం కాదని వారే ఒప్పుకుని, మరో సలహా చెప్పేరు. ఉపకథలో మొదటి సంఘటనని point of referenceగా తీసుకుని కాలనిర్ణయం చెయ్యొచ్చని. ఉదాహరణకి ఉపకథ ఇలా వుందనుకోండి.

శాంత, “ నేను పదోతరగతి చదువేరోజుల్లో  ఏమయిందంటే” అంటూ మొదలెట్టింది.

***

మానాన్నగారు నాకు కొత్తవాచీ కొనిపెట్టేరు. అది పెట్టుకుని స్కూలికి వెళ్లేను. అంతకుముందురోజు మాధవి వాళ్లనాన్న కొన్న సెకెండ్ హాండ్ వాచీ నాకు చూపించింది. అంచేత నాకొత్తవాచీ తనకి చూపించాలని మహా ఆరాటపడిపోతున్నాను.

దీనికి నా అనువాదం (భూతకాలంలో)

Santa started telling her story, “You know what happened when I was studying tenth grade.”

***

My father had bought me a new watch. I wore it and went to school. The day before, Madhavi had shown me the secondhand watch her father had bought for her. Therefore, I was anxious to show my new watch to her.

అంటే ఇక్కడ శాంతకి వాళ్లనాన్న వాచీ కొనడం, మాధవి తనవాచీ చూపించడం, శాంత తనవాచీ చూపించడానికి తహతహలాడడం ఏవరసలో జరిగేయో, ఇంగ్లీషులో టెన్స్ ద్వారా తెలుస్తుందన్నమాట.

పోతే, ఈటపా మొదటిభాగంమీద కొత్తపాళీ వ్యాఖ్యానంలో చెప్పినట్టు సంభాషణలు కూడా కొరకరాని కొయ్యలవుతాయి ఒకొకప్పుడు. ఇది రచయితలూ, ప్రచురణకర్తలూ కూడా పట్టించుకోని విషయం. మన మౌఖిక సాహిత్య ఛాయలలో ఇది ఒకటి కావచ్చు. ఎదుట వున్న శ్రోతలకి కథ చెప్తున్నప్పుడు, (హరికథల్లాటివి) కథకుడు శ్రోతల ముఖకవళికలు గమనిస్తూ తదనుగుణంగా మార్పులూ, చేర్పులూ చేసుకోగలడు. కాగితాలమీద గిలికిపారేసే రచయితకి ఆసౌకర్యం లేదు కానీ “నాశ్రోతలు నాఎదుట లేరు” అని రచయితకి తోచదు కనక ఆవిషయం పట్టించుకోరు అనుకుంటాను.

నేను Pawning the Sacred Thread (Kolakaluri Enoch) అనువాదం చేస్తున్నప్పుడు, ఎవరు ఏమాట అంటున్నారో అర్థంకాక, రచయిత ఇనాక్‌గారిని అడిగేను. ఆయన వివరణ ఇస్తూ, “ప్రచురణకర్తలు తమసౌకర్యంకోసం  మార్పులు చేసేరు (ఫార్మాటింగ్‌లో)” అన్నారు!

అలాగే ఒకొకప్పుడు, వాక్యాలవిరుపు కూడా. అంటే ఒకే పాత్ర మాటలు రెండులైనుల్లో కనిపిస్తాయి. కొటేషన్ మార్కులండవు. ఎలా తెలుస్తుంది ఎవరు ఏమంటున్నారో?  ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం అనువాదానికి కథలు ఎంచుకుంటున్నప్పుడు, ఆకథలో ఇలాటి అవకతవకలున్నాయా? వాటితో కుస్తీ పట్టి, కథ అర్థం చేసుకుని, అనువాదం చెయ్యగలమా? మనసందేహాలు తీర్చడానికి రచయిత అందుబాటులో వున్నారా -లాటి విషయాలు చూసుకుంటే మంచిదని చెప్పడానికి.

He is I (Malladi Ramakrishna Sastry) కథలో కథకుడు రెండు పాత్రలని ప్రవేశపెడతాడు. కొంచెంసేపు ఒకపాత్ర ఉత్తమపురుషలో కథ నడిపిస్తాడు. మళ్లీ కథకుడు ప్రవేశించి. తను అంటూ ప్రథమపురుషలో చెప్పిస్తాడు. అలాగే Revisiting Childhood (Kandukuri Venkata Mahalakshmi)కథలో ప్రథమపురుషలో మొదలయి, మధ్యలో మేం అంటూ ఉత్తమపురుషలో– స్వగతంలాటిది, స్వగతం అని చెప్పకుండా – సాగుతుంది. ఇలాటివి అనువాదం చేస్తున్నప్పుడు, కథ రాయడానికి రచయితా, కథకుడూ మాత్రమే కాక, అనువాదకుడు కూడా ఒక ముఖ్యపాత్ర వహిస్తాడు. అనువాదకుడు తనసృజనాత్మకశక్తిని తప్పనిసరిగా ఉపయోగించవలసిన సమయాల్లో ఇదొకటి. ఈమార్పులమూలంగా అనువాదకుడు మూలరచయితకి అన్యాయం చేస్తున్నాడని అంటే, నేనొప్పుకోను. మూలరచయిత ఈ మార్పులని అంగీకరించకపోవచ్చు. అప్పుడు అనువాదం వుండదంతే.

ఈసందర్భంలోనే మరోవిషయం కూడా ప్రస్తావించాలి. అనువాదకులు ప్రసిద్ధమయిన కథలూ, సుప్రసుద్ధులయిన రచయితలకథలూ తీసుకుని అనువాదం చేస్తున్నప్పుడు, నేను పైన చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోవలసిన అవుసరం రెట్టింపు అవుతుంది. ఎంతమంచి కథ అయినా అనువాదం బాగుంటేనే రాణిస్తుంది. లేకపోతే, చాలామంచి కథ తీసుకుని అనువాదకుడు ఖూనీ చేసేడన్న అప్రతిష్ఠకి గురయే ప్రమాదం వుంది!

సామెతలూ, జాతీయాలు – తెలుగుసామెతకి సరితూగగల ఇంగ్లీషుసామెత వాడితే పోలే అని కొందరి సూచన. నాకు అది అంతగా నచ్చదు. ఉదాహరణకి, పొరుగింటి పుల్లకూర రుచి తీసుకోండి. దానికి సరితూగగలసామెత grass is greener on the other side of the fence అనొచ్చు. కానీ నాకు నచ్చదు. ఎందుకంటే, ఇంగ్లీషు సామెత వాడితే అది మిగతాకథలో కలిసిపోతుంది. మనకి తెలుగులో అచ్చంగా అలాటి సామెత వుందని పాఠకుడికి తెలీదు. మనసామెతని ఎత్తి చూపడం జరగలేదు ఇక్కడ. నేనయితే, leafy vegetable in the neighbor’s home is always tastier అంటాను. ఇందుమూలంగా మనసామెత వేరు అని తెలుస్తుంది. Grass is greener′ అన్నది ధనికవర్గంగురించి అయితే పుల్లకూర అతిసాధారణమయిన కూర. అనువాదాలకి ఒక ప్రయోజనం సంస్కృతిగురించి తెలియజేయడం అంటే ఇదే మరి.

మామూలుగా సామెతలు యతిప్రాసలతో కూడుకుని వుంటాయి. నేను చేసిన అనువాదాల్లో ఆమోదముద్ర పొందినవి కొన్ని ఇస్తున్నాను.

కొరివితో తల గోక్కున్నట్టు. – scratching your head with a burning torch.

పుండుమీద కారం చల్లినట్టు – like spraying pepper on an open wound.

వాన రాకడ, ప్రాణ పోకడ – As unpredictable as rain and death.

గతి లేనిమనుషులు తగువుకెడితే, మతిలేనిపెద్దలు తీర్చేవారా అని – like hapless men seeking justice from brainless men.

అనువాదాలు ఎప్పుడూ మాటకి మాట, ముక్కస్య ముక్క కావు. పైఉదాహరణల్లో, తెలుగులో గోక్కొను క్రియ reflexive, ఇంగ్లీషులోscratch కి ఆ అర్థం లేదు. అలాగే. రెండో సామెతలో, పుండు అన్నమాటకి wound అంటే చాలు. కానీ, open అన్ని విశేషణం కూడా చేర్చేను visual effect కోసం.

మూడో సామెతలో పదాలన్నీ సర్వనామాలే. పైగా, ఇంగ్లీషులో “ప్రాణం” అన్నపదానికి సమానార్థకం లేదు. అంచేత మొత్తం వాక్య మార్చవలసివచ్చింది unpredictable అన్నపదం అధికం చేర్చి.

నాలుగోసామెతలో అర్థం సరిగ్గా అతికినట్టు సరిపోదు. కానీ, వాక్యనిర్మాణంలో సౌలభ్యంకోసం మార్చేను. బహుశా When hapless men take their dispute to the court, can brainless men settle it? అంటే తెలుగుసామెతకి దగ్గరగా వుంటుంది. అప్పుడయినా నూటికి నూరుపాళ్లూ కాదు. ఎందుకంటే, తెలుగువాక్యంలో “తగువుకెడితే” అన్నప్పుడు ఎక్కడికి అన్నది వాచ్యం కాలేదు. నాఅనువాదంలో to the court చేర్చకపోతే, వాక్యం సంపూర్ణం కాదు.

అంటే నాఅభిప్రాయం, ఇలా సామెతలని వీలయినంతవరకూ, మన “భాష”లో చెప్పడంమూలంగా మన ఫిలాసఫీ కూడా తెలియజేస్తాం. సాధారణఁగా ఏజాతిలోనైనా సామెతలు సంస్కృతి అర్థం చేసుకోడానికి ఒక మార్గం. జీవితంలో మౌలికమయిన ప్రమాణాలు ఏమిటి, మనఆలోచనాసరళిమీద వాతావరణప్రభావం ఎలాటిది, మనకుటుంబాల్లో ఒకరినొకరం ఎలా మన్నించుకుంటాం, ఏడిపించుకుంటాం, ఆదుకుంటాం – ఇవన్నీ కూడా కనిపిస్తాయి సామెతల్లో. కనకనే సాహిత్యంలో వాటికంత విలువ. ఇవన్నీ నిర్లక్ష్యం చేసి, ఇంగ్లీషులో దానికి సరైన సామెత వుందని, అది పెట్టేస్తే, పాఠకులు మనసంస్కృతికి సంబంధించినవిశేషాలు చాలా మిస్ అవుతారని నానమ్మకం.

మన అనువాదాల్లో, కనీసం నాకు వస్తున్నవాటిలో కనిపించని మరోఅంశం పేరాగ్రాఫు విరుపులూ, విరామచిహ్నాలూ. అంచేత అవి ఎలా వుండాలో, నాకు తెలిసినంతవరకూ వివరిస్తాను. మీకెవరికైనా, ఇంతకంటే తెలిస్తే చెప్పండి.

1. Ellipses, (మూడు చుక్కలు), semicolon మితంగా వాడాలి. పేజీలో సగానికి సగం చుక్కలమయం అయితే బాగుండదు. అత్యవసరం అయితే తప్ప వాడవద్దంటున్నారు ఈనాటి పండితులు. అలాగే, semicolon కూడా వాడకం తగ్గిపోయింది. వాటిని పూర్ణవాక్యాలుగా రాస్తే నయంట. ఉదాహరణకి, రెండోవాక్యం మొదటివాక్యానికి అనుబంధం అనుకున్నప్పుడు.

సీతకి ఒళ్లుమండిపోయింది రవిమాటలు వింటుంటే. వొంటికి ఉప్పూ, కారం రాచుకున్నట్టుంది.

ఈరెండువాక్యాల్లో అనుభవం ఒక్కటే. అలాటప్పుడు semicolon ఆ సంబంధాన్ని తెలియజేస్తుంది.

Sita felt like her body was set on fire when she heard Ravi’s words; it was like smearing salt and pepper on her body.

అదే సంగతి మరోలా వుందనుకోండి కథలో.

“సీతకి ఒళ్లు మండిపోయింది రవిమాటలు వింటుంటే. వెళ్లి చెరువులో దూకాలనిపించింది ఆమంటలు చల్లారడానికి” ఇక్కడ రవిమాటలు తనలో కలిగించిన స్పందన ఒకటి. ఆతరవాత తాను తీసుకోదలచిన ఆలోచన మరొకటి. అంచేత, ఈరెండు వాక్యాలు విడివిడిగా రాస్తేనే బాగుంటుంది.

Sita felt like her body was set on fire when she heard Ravi’s words. She wanted to go and jump in the lake to put out the flames.

2. ప్రతివాక్యం తరవాత తప్పనిసరిగా full stop వుండాలి. Quotes పెడితే, అమెరికనింగ్లీషులో end quote‌కి ముందు వుంటుంది. బ్రిటిష్ ఇంగ్లీషులో తరవాత వుంటుంది. మొత్తంమీద ఎక్కడో ఒకచోట తప్పనిసరిగా full stop వుండాలి.

3. ఒకపాత్ర ఉపకథ చెప్తున్నప్పుడు, రెండు, మూడు పేరాగ్రాఫులుగా విడదీసేటట్లయితే, ప్రతి పేరాకి మొదట్లో కోట్ వుంటుంది. ఆ ఉపకథ అయిపోయినతరవాత, ఆఖరిపేరాకి మాత్రమే ముగింపు కోట్ వుంటుంది. ప్రతిపేరాకి ఫుల్ స్టాప్ అవసరం.

4. Capitals. పేరులో మొదటక్షరం, వాక్యంలో మొదటి అక్షరం తప్పిస్తే, caps వాడకండి, నాకప్పుడప్పుడు ఈమెయిల్స్ వస్తాయి మొత్తం మెయిలంతా capitalsలో. అలా రాస్తే, అమర్యాదగా భావిస్తారు ఇక్కడ. కోపంతో గట్టిగా అరుస్తున్నట్టు

ఉంటుందిట.

5. Quotationsలో వున్న వాక్యంలో మరొకరిమాటలు quotationsలో పెట్టాల్సివస్తే, single quotes (‘) వాడాలి.

6. సామెతలు italicsలో పెట్టి, ఆవిషయం కథ మొదటో. చివరో చెప్పొచ్చు,

అలాగే తెలుగుమాటలు కూడా రసం, బొబ్బట్లులాటి మాటలు ఉన్నది ఉన్నట్టు రాస్తే, italics లో పెట్టాలి. ముఖ్యంగా అన్ని మాటలూ అనువదించలేం కనక.  Pawning the Sacred Thread కథలో ఒక చోట “ఇది దారం కాదు. జంధ్యం” అని వుంది. “This is not a thread but sacred thread” అనొచ్చు. నేను “This is not just a thread but jandhyam.” అని అనువదించేను. మనకి జంధ్యం అన్నపదం వినగానే కలిగే గౌరవం తెలియజేయడానికి.

8. బంధుత్వాలు తెలియజేసే పదాలు. ఇవి కూడా సమస్యే. వదినా, అత్తగారూలాటివి అలాగే వదిలేసినా, తోడికోడలూ, తోడల్లుడు, సవితితల్లి లాటి పదాలతో కష్టం. తోడికోడలు అంటే co-sister-in-law అన్నారు ఒకరు. తోడికోడలు వరసకి చెల్లెలలయినా, కోడలు అన్నమాటకి అర్థం daughter-in-law అని కదా.  నేను కథలో ఆమె ఎలా పిలవబడుతోందో (అక్క) అదే వాడి, బంధుత్వం footnoteలో వివరణ ఇస్తాను. ఈపిలుపులు మనసంస్కృతిలో ముఖ్యభాగం. Sis, broలాటి పదాలు వాడడానికి ముందు, మూలకథలో భాష ఎలా వుందో (వ్యావహారికం, గ్రాంథికం, శిష్టజనవ్యావహారికం) చూసుకోవాలి. అనువాదకులు గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యవిషయాల్లో ఒకటి అనువాదాల్లో కనిపిస్తున్న భాష మూలకథలో భాషకి సరితూగేలా వుండాలి. తమకి వచ్చినఇంగ్లీషు కాక, కథకి అనుగుణంగా భాష వుండాలి. ఒకొకప్పుడు ఎంతో మంచి ఇంగ్లీషు రాయగలవారు కూడా మంచి అనువాదం చెయ్యలేకపోవడం ఈకారణంగానే.

10. సాధారణంగా ఇంగ్లీషులో contractions (don’t, can’t) వ్యావహారికంలో సంభాషణల్లో మాత్రమే వాడతారు. Standard Englishలో do not, cannot అని పూర్తిగా రాయాలి.

ఇప్పటికింతే. మళ్లీ ఎప్పుడయినా ఏమయినా తోస్తే మళ్లీ రాస్తాను.

(అక్టోబరు 14, 2009.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఎలాటి అనువాదాలు కావాలి -2”

 1. కల్పన, థాంక్స్ మరియు హెచ్చరిక. ఇంగ్లీషలో కూడా నిజానికి భిన్నాభిప్రాయాలున్నాయి టెన్స్ విషయంలో. అంచేత, నేను ఇక్కడ రాసిందే వేదవాక్యంగా తీసుకోవద్దు. నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది వీలయినంతవరకూ consistentగా వుంటే, కథ అర్థం చేసుకోడం సుళువు అని మాత్రమే. ఈలింకు కొంతవరకూ వివరిస్తుంది ఈతికమకలు http://www.bellaonline.com/articles/art51567.asp

  మెచ్చుకోండి

 2. @ సిరిసిరిమువ్వ, అదేం కాదండీ. నా అనువాదాలన్నీ సంకలనంకోసం మళ్లీ ఎడిట్ చేస్తూంటే, కలిగిన తెలివి. 🙂 వ్యాఖ్యనించినందుకు థాంక్స్.
  @ నిజమేనండీ. బొందలపాటి శకుంతలాదేవిగారూ, శివరామకృష్ట గారూ బెంగాలీసాహిత్యాన్ని తెలుగువారిముంగిట పెట్టేరు. మీవ్యాఖ్యకి థాంక్స్.

  మెచ్చుకోండి

 3. చాలా బాగున్నాయండీ మీ వ్యాసాలు. మంచి విషయాలు తెలియజేశారు. సామెతలు, మనకి మాత్రమే కొన్ని మాటలు ఎలా అనువదిస్తారన్న సందేహం ఉండేది. అనువాదాల ఒక సంస్కృతి పాఠకులకు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. మంచి అనువాదకుడి వలెనే ఆ ప్రయత్నం నెరవేరుతుంది. ఉదాహరణకు శరత్ సాహిత్యం, బి.శివ రామకృష్ణ గారు అనువదించింది కొంత చదివాను. ఆయన పాత్రలకు పెట్టిన పేర్లు, వారి ఆచారాలు తెలుగు లో చదివినా నాకు బెంగాలీ వాతావరణము కనబడింది.

  మెచ్చుకోండి

 4. అమ్మో ఎంత ఓపిక మీకు….అనువాదాల మీద పెద్ద థీసిస్ వ్రాస్తున్నారుగా. మంచి ఉపయోగకరమయిన విషయాలు, అనువాదకులకు బాగా ఉపయోగపడతాయి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s