ఊసుపోక టైమెప్పుడవుతుంది చెప్మా!

(ఎన్నెమ్మ కతలు 42)

చాలామంది మర్చిపోయి వుండొచ్చు లేదా తెలీకపోవచ్చు కానీ మనకి కాలమానం టైమెక్సూ రోలెక్సూ కాదు.

బారెడు పొద్దు అంటే బారాబజే కాదు. సుమారుగా పది గంటలు. చుక్కపొడిచేవేళా అసురసంధ్యవేళా ఒకటేనేమో నాకు

తెలీదు. గోధూళివేళ అంటే గోపాలురు ఆలమందలని ఇళ్లకి మళ్లించేవేళ, ఇల్లాళ్లు సంజెదీపాలు వెలిగించేవేళ ఇలా మనం దైనందిన జీవితానికీ చుట్టూ వున్న వాతావరణానికీ ముడిపెట్టి కాలం చెప్పుకుంటాం.

మీపిల్లాడికి ఎన్నో యేడు అంటే పెద్దగాలివానకి బోర్లపడ్డాడు. గోదావరివంతెన కూలేనాటికి అడుగులేస్తున్నాడు అని చెప్పుకోడం మనకే చెల్లింది.

అమెరికాలో కూడా కొన్ని అలాటి ఆనవాయితీలున్నాయి. ఉదాహరణకి మిడ్ మార్నింగంటే తొమ్మిదో, పదో, ఆఫ్టర్నూనంటే ఆఫ్టర్ నూన్ అనే. కానీ మిడ్ ఆఫ్టర్ నూన్ అంటే మధ్య ఆహ్నం అయిపోయినతరవాతే. మనకి రాత్రి చీకటి పడిపోయినా, ఇక్కడింకా ఈవెనింగనే అంటారు.

అలాగే ఫార్మర్స్ ఆల్మనక్ అని ఓ పంచాంగం వుంది. అందులో రానున్న పదహారునెలలకి వాతావరణంతో పాటు హాస్యకథలూ, గృహవైద్యాలూ, తదితర చిట్కాలూ కూడా వుంటాయి. ఇంకో సంగతి గాడిదలు చెవులు దులుపుకుంటూ ఓండ్రపెడితే వానలు కురుస్తాయని ఋజువు చేసినవాళ్లని చూసినవాళ్లు చెప్పగా విన్నవాళ్లున్నారని వినికిడి.

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కాలమానం నిజంగా కొలవగల కాలపురుషుడు ఇంకా పుట్టలేదేమోనని నాకు అనుమానం. నాకీ సదసత్సంశయం కలగడానికి ఆమధ్య నేను ఇండియా వెళ్లినప్పుడు చూసిన, లేదా నన్ను హింసలపాలు చేసిన కాలమానం.

మామూలుగా అమెరికానించి వచ్చేను కనక అయినవాళ్లూ, అవబోయేవాళ్లూ, అవాలని ఉత్సాహం వున్నవాళ్లూ పిలుస్తారు కదా ఆప్యాయంగా. మనప్రయాణంలో ఈచుట్టపుచూపులు పెద్దభాగమే కనక అలాగే వస్తాం అనే అంటాం. అక్కడినించి అసలు కథ మొదలవుతుంది.

“ఎప్పుడు మీకు వీలు?” అని మనం అడుగుతాం. ఎందుకంటే అందరికీ పనులే. అక్కడ పనిలేనివాళ్లం మనమే.

అంచేత వాళ్లకెప్పుడు వీలయితే అప్పడేం మనం తయారు.

“ఎప్పుడేనా ఫరవాలేదండీ,” అంటారు వారు.

“మాక్కూడా ఎప్పుడేనా ఫరవాలేదండీ. రేపు ఉదయం రామా?” (రామా అంటే అయ్యో రామా అని కాదు సుమా)

“అలాగే, ఉదయం పదిన్నరా, పదకొండకల్లా వచ్చేయండి. మధ్యాన్నం మాఅమ్మాయిని (లేక అబ్బాయిని) … కి తీసుకెళ్లాలి. లేదా మరేదో పనుంది.”

సరేనండీ అంటాను సందేహిస్తూనే. పదకొండు అనేసరికి నాకు కాస్త తికమకగా వుంటుంది. ఎందుకంటే, పదకొండు అంటే నిజంగా అక్కడికెళ్లేసరికి పన్నెండో, పన్నెండున్నరో అవొచ్చు. అంటే మధ్యాన్నం భోజనాలవేళ కదా. మరి వాళ్లు భోజనానికి రండి అనలేదు కదా. ఇంట్లో వంటమనిషికి వండమని చెప్పడమా, వద్దని చెప్పడమా?

మాఅన్నయ్యకి మాత్రం ఈ mixed signals బాధగా తోచదు. చూద్దాంలే అంటాడు.

నాకు టైము సెన్స్ ఎక్కువ. నాభాషలో పది అంటే పది, పన్నెండు అంటే పన్నెండూ. అంచేత పదిగంటలకంటే. ఆరుగంటకల్లా లేచి స్నానం చేసేసి, బ్రేక్‌ఫాస్ట్ లైటుగా తిని తొమ్మిదికల్లా సిద్ధం అయిపోతాను. మాఅన్నయ్య మాత్రం వార్తాపత్రికలో సుదోకీ చూసుకుంటూ కూర్చుంటాడు.

నేను నెమ్మదిగా “తొమ్మిదిన్నరయింది” అంటాను.

అతను తలెత్తకుండా, “తొమ్మిదిన్నరా” అంటాడు.

అంటే నాదృష్టిలో తొమ్మిదిన్నరకీ పదికీ మధ్య అట్టే కాలం లేదు, తనదృష్టిలో చాలాకాలం వుందన్నమాట. ఇది తెలుగువారిళ్ల కాలమానంలో ఇది తొలిపాదం.

మరోరోజు మరొకరితో …

పదిగంటలకి మాఅన్నయ్య ఫోన్ చేస్తాడు “మేం ఊళ్లోకొచ్చేం, ఎప్పుడు కలుద్దాం.”

అవతలినుండి ఆయన, “ఓ అలాగా, రండివాళే. నేనే వస్తాను కారు తీసుకుని పావుగంటలో.”

మళ్లీ నాకు నెర్వుసు.

సరే, నేనేమో నాఅలవాటుప్రకారం హడావుడిగా స్నానం చేసేసి, మామూలుగా తినే టిఫిను తక్కువ తిని ఎదురు చూస్తూ కూర్చుంటాను. తక్కువ ఎందుకంటే అది నా అలవాటు.

సరే కారువారు వచ్చేవరకూ ఏదేనా చదువుదాం అనుకుంటాను. మరేదైనా చేద్దాం అనుకుంటాను. ఏపని చేయబోయినా కళ్లు వాచీమీదే వాలతాయి పొద్దుతిరుగుడుపువ్వులా.

పదీ, పదీ ఐయిదూ, పదీ పదీ, పదీ పదకొండూ .. పదిన్నరా ..

మాఅన్నయ్యవేపు చూస్తాను. ఆయనగారు తీరిగ్గా పేపరు చదువుకుంటూ కూర్చుంటాడు. ఆఖరికి తెగించి అడుగుతాను,

“ఏరీ ఆయన?”

“వస్తారు. … రైలెళ్లిపోతుందనా ఏమన్నానా? ”

రైలు వెళ్లిపోదు. కానీ నా టైము … ప్చ్. మ్…

మొత్తానికి పన్నెండున్నరకి తేల్తాడాయన. అప్పటికి నాకు ఆకలి వేస్తున్నట్టు అనిపించడం మొదలయి నలభైఅయిదు నిముషాలు అవుతుంది.

ఎందుకేనా మంచిదని,, మాటలమధ్య చొరవ చేసుకుని, నేను మూడు గంటలకి మరోచోటికి వెళ్లాలని చెప్తాను కారులో వెనకసీటులోంచి. నిజానికి నా అపాయింటుమెంటు (అదేలెండి కలుద్దాం అని చేసుకున్న నిర్ణయం) నాలుగ్గంటలకి కానీ నాకు అప్పటికి “టైము చెప్పువిధానం” కొంతవరకూ అర్థం అయివుంటుందిన్నమాట).

ఆయన మరేం ఫరవాలేదనీ, ఢోంట్ వరీయనీ, అన్నివిధాలా నాకు నచ్చచెప్పేస్తాడు. సింపుల్ లంచి అని కూడా మాటిచ్చేస్తాడు.

అక్కడికి వెళ్లింతరవాత, “ఇంకెవరికోసమో కూడా ఎదురు చూస్తున్నాం” అంటుంది వాళ్లావిడ, పొయ్యిమీద ఎసరు పడేసి, నెమ్మదిగా తరగడానికి కూరలూ, కత్తీ పుచ్చుకుని.

మళ్లీ వాచీతో నాకు పేచీ. అదీ నేనూ మొహమొహాలు చూసుకుంటూ కూర్చుంటాం.

1.00, 1.05, 1.10, 1.15 … 2.00

ఆగలేక, మరోసారి నెమ్మదిగా గొణుగుతాను నేను ఇంటికి వెళ్లాలని. రెండున్నర దాటేక, ఇంటావిడ తీరిగ్గా లేస్తుంది. హమ్మయ్య అనుకుని, ఆవిడ వెంటపడతాను “ఏమయినా సాయం చెయ్యనా?” అంటూ.

“ఏంలేదు. అంతా అయిపోయింది,” అంటూ పొయ్యిమీద బాణలిలో నూనె పోసి,, డబ్బాలోంచి వడియాలు తీస్తుంది తీరిగ్గా.

మరో ముప్పావుగంట. …

“మామూలుగా మీరు ఇంత ఆలస్యంగా తింటారా మధ్యాన్నాలు?” అంటాను డొంకతిరుగుడుగా.

తను వాచీవేపు ఓమారు కళ్లు తిప్పి అలవోకగా చూసి మ్.. మఊఁ… అంటుంది సందిగ్ధంగా.

నాకు మరో అనుమానం ఏమిటంటే, పొద్దున్న టిఫిను ఏ ఎనిమిదిగంటలకో తినేస్తారు కదా మధ్యాన్నం మూడుదాకా తినకుండా ఎలా వుంటారు?

అప్పటికి నాకు జ్ఞానోదయం అవుతుంది. పదంటే పన్నెండూ, పన్నెండంటే మూడూ, మూడంటే ఏడూ …

ఓసారలాగే మాఅన్నయ్య ఓపెద్ద హోటలులో మావాళ్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేడు. ఆరుగంటలని చెప్పేడు. అందరూ వచ్చేశారు కానీ మామామయ్య ఒకకూతురు మాత్రం రాలేదు. ఏడు దాటినా.

“మనం లోపలికెళ్లి కూర్చుందాం. తను వచ్చినప్పుడే వస్తుంది. హోటలువాడేం టైము దాటిపోతే లోపలికి రానివ్వడని ఏంలేదు కదా” అన్నాను.

“భోజనానికి పిలిచి మనం ముందు తినేస్తే ఏం బాగుంటుంది?” అన్నాడు మాఅన్నయ్య.

“ఈవచ్చినవాళ్లందరూ – వీళ్లందర్నీ ఇలా కూర్చోపెట్టడం మాత్రం ఏంబాగుంటుందీ?” అంటాన్నేను. ఏంచెయ్యను నాలాజిక్కు మాఅన్నయ్యకి అర్థం కాలేదు. వేరే చెప్పాలా ఆయనలాజిక్కు నాకూ అర్థం కాలేదు.

ఆఖరికి ఎనిమిదింబావుకి తేలింది మా మామకూతురు.

దారిలో ఏమయినా ప్రమాదం జరగలేదు కదా అన్నాను, నాకలవాటయిన కారణం. మామూలుగా నాకిష్టంలేని చోటికి ఇళ్లకి వెళ్లవలసినప్పుడల్లా ట్రాఫిక్కో, ఏక్సిడెంటో నన్ను ఆదుకుంటాయి.

“అదేం లేదు. రానా, వద్దా అని ఆలోచిస్తూ వుండిపోయాను,” అంది తేలిగ్గా.

చుట్టూ వున్నవారిమొహాలు చూసేను. ఒక్కరిమొహంలో కూడా రవంతైనా విసుగు కనిపించలేదు.

నేను అమెరికా వచ్చేక చేతికి వాచీ పెట్టుకోడం మానేశాను. ఎందుకంటే ఎటు చూసినా టైము కనిపిస్తుంది.

దుకాణాల్లో, క్లాసుల్లో, రోడ్డెక్కితే కారులో, కారులోంచి బయటికి చూస్తే, బాంకుల బిల్‌బోర్డుమీద టైముతో పాటు ఆక్షణంలో టెంపరేచరు కూడా అనుక్షణం కనిపిస్తూ టైమయిపోతోందని, టైమయిపోతోందని తరుముతూ వుంటాయి. కళ్లెత్తి చూడ్డం భయం. ఇందుగలదందులేదని … అమెరికాలో కనిపించని క్షణం లేదు.

ఇండియా వచ్చినప్పుడు కూడా వాచీ పెట్టుకోడం లేదు. ఎందుకంటే అక్కడ టైమయిపోతోందన్న బాధ లేదు కనక.

హెచ్చరికలు ఇది ఏ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని రాయలేదు, నిఝ్ఝంగా, సరస్పత్తోడు. ఊసుపోక రాయడానికి మరే కథాంశమూ దొరక్క ఇది రాయడమయినది.

(18 అక్టోబరు 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

17 thoughts on “ఊసుపోక టైమెప్పుడవుతుంది చెప్మా!”

 1. రమణీ, అయ్యోయ్యో, ఎంత పొరపాటయిపోయింది. జాగ్రత్తగా అన్ని వ్యాఖ్యలూ చూసే రాసేననుకున్నాను జవాబు. నిజంగా తప్పే. క్షమించండి. ఇంతకుముందు కూడా ఇలా జరిగిందంటే మరీ గొప్పతప్పు. నాకసలే కామెంట్లు అంతంతమాత్రం. తెలిసి, తెలిసి నిర్లక్ష్యం చేస్తానా? అందులోనూ మీరు నాకు ఆప్యాయంగా ఇచ్చిన బహుమతి పక్కన పెట్టుకుని 🙂
  లేదండీ. మీరన్నట్టు సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. కానీ నాకు ఈ టైముగోల చిన్నప్పట్నుంచీ, అమెరికా వస్తానని కలలో కూడా అనుకోని రోజులనుండీ వుంది. అయితే ఇక్కడ రాసింది అన్ని ఊసుపోకల్లాగే హాస్యానికే.
  మరొకసారి క్షమాపణలతో.
  మీ మాలతి.

  మెచ్చుకోండి

 2. నా పేరు (నా కామెంట్) చూసి చూడనట్లు అనిపిస్తోంది నాకు.. అంతేనా ?? (ఇంతకు ముందు పోస్ట్‌లో కూడా ఇలాగే) మీరందరికి జవాబిచ్చి (నాకు ముందు కామెంటినవాళ్ళకి, తరువాత కామెంటినవాళ్ళకి కూడా ) నొ ప్రాబ్లంస్ జస్ట్ కంఫిర్మేషన్ అంతె.

  మెచ్చుకోండి

 3. అబ్రకదబ్ర, పోన్లెండి, ఇంతకాలం మనం అన్నీ అమెరికానించి దిగుమతి చేసుకోడమే కానీ అమెరికాకి ఏం ఇచ్చుకోలేదని బాధపడిపోతున్నాను. ఇంక అలా అనుకోను 🙂
  సుజాతా, నిజమే. నాక్కూడా టైం విషయంలో పట్టింపు పుట్టుకతోనే, ఇండియాలో వున్నప్పుడే వచ్చింది. ఇక్కడికొచ్చేక, fashionably late అంటే ఏమిటో తెలిసింది. అంతే తేడా.

  మెచ్చుకోండి

 4. ఏమోనండీ, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా, నాకు మాత్రం ఇలా టైముని ఇష్టం వచ్చినట్లు మార్చేయడం నచ్చదు. పదంటే తొమ్మిదిన్నరకో ముప్పావుకో వెళ్ళి కాసేపు వెయిటన్నా చేస్తా గానీ ఆలస్యంగా వెళ్ళను. నా టైము అలా ఎవరన్నా వృధా చేసినా నాకు నచ్చదు. పదకొండంటే ఒంటిగంటకు వచ్చే వాళ్ల యాటిట్యూడ్ ని “మీదీ ఒక టైమేనా, అసలు మేము రావడమే మీ అదృష్టం”అన్నట్లు(అనకపోయినా)అనువదించుకుంటాను.

  మీలాగే నేనూ! టైము పరిగెడుతుంటే ముళ్ళమీద కూచున్నట్లే ఉంటుంది నాకు!

  మెచ్చుకోండి

 5. మీరు చాలా వెనకబడి ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ పంక్చువాలిటీ అనేది ఇండియాకి మాత్రమే పరిమితమైన విశేషం కాదు. గత పది, పదిహేనేళ్లలో వెల్లువలా అమెరికా వచ్చిపడ్డ మా తరం భారతీయ యువతీ యువకుల దయతో ఆయొక్క సద్గుణం ఇప్పుడు అమెరికాలోనూ భారతీయ సభలు, సమావేశాలు, విందులు, వినోదాల సందర్భంగా విరివిగా దర్శనమిస్తుందని తెలియజేసుకోటానికి మిక్కిలి సంతోషిస్తున్నానని మనవి చేసుకుంటున్నాను 😀

  మెచ్చుకోండి

 6. @ ఉష, తెరెసా, సునీత, పరిమళమ్, కొత్తపాళీ, లలిత, చిన్ని, సౌమ్య … థాంక్స్ నాకొక్కదానికే కాదన్నమాట ఇలాటివి తట్టేది
  SRRao, వలస వెళ్లి ఆ హక్కు పోగొట్టుకున్నారు … ఏంచేస్తాంలెండి పోయినవాటిల్లో ఇదొకటి.
  Anon – మీరు మరో టపా రాసేశారు. మీబ్లాగులో పెట్టుకుంటే ఎక్కువమంది చూస్తారు కదండీ. అసలే నాబ్లాగుకి వచ్చేవారు తక్కువ. అందులో వ్యాఖ్యలు ఎంతమంది చదువుతారు కనక :p

  మెచ్చుకోండి

 7. ఈ విషయంలోనే అనుకొంట నాకు తెలిసిన ఒక భారతీయులెవరో మొన్నీమధ్యే అన్నారు.. నాకు మన భారతీయులంటే అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి no time punctuality and no functionality అని.. అందులో సముద్రానికి ఆవల ఉన్నవాళ్ళు పాటించే పద్ధతికి భారతదేశం ఎప్పుడూ అలవాటు పడదులెండి. అక్కడ అలవాటుపడి వచ్చినవాళ్ళు ఈ టైం విషయంలో మీలా సర్ధుకుపోవాల్సివస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు .

  మెచ్చుకోండి

 8. భలే చెప్పారు. మాకూ అనుభవమే.
  ఇంకోటి. అప్పుడప్పుడూ ఇక్కడికి విజిటింగుకొచ్చే తెలుగు ప్రముఖుల్తోనూ ఇటువంటి అనుభవాలే. ఎవర్నన్నా ఒక అరగంట కలుద్దామని అనుకుంటే, ఇంక ఆ రోజంతా వేరే ఏ పనీ జరగదు.

  మెచ్చుకోండి

 9. చాల చక్కగా చెప్పారు …ముఖ్యంగా సమయపాలన మీద ….నాకును టైం అంటే ఆ టైం కి జరగవలసిందే కాని ఈ సర్కారి కొలువుల్లో టైం సెన్స్ అంటే నవ్వుతారు ….మనము ఆ ప్రవహాంలో కొట్టుకుపోవాల్సిందే .

  మెచ్చుకోండి

 10. అసమయ పాలన ఆంధ్రుల జన్మహక్కండీ ! మీరు వలస వెళ్లి ఆ హక్కు పోగొట్టుకున్నారు. అప్పుడప్పుడు వచ్చి మా హక్కుని ప్రశ్నిస్తే ఎలా ? కావాలంటే మీరు కూడా ఇక్కడికి వచ్చినపుడు ఆ హక్కుని ఉపయోగించుకోండి. మాకభ్యంతరం లేదు. ఊసుపోకే అయినా మీ విసుర్లకు జత కలిపా ! అంతే !! సమయపాలన ఎప్పటికి వస్తుందో !

  మెచ్చుకోండి

 11. సరిగ్గా అంచనా కట్టారు. మావారూ మీ బాపతే, సెకను అటూ ఇటూ కాకుండా హాజరు వేయించుకుంటాడు. పెళ్ళైన కొత్తల్లో చాలా పార్టీలకి అలా టై ముకు వెళ్ళి మాముందే వాళ్ళు డెకరేషను చేస్తుంటే చూసిన సందర్భాలెన్నో? నాకే చిరాకూ సిగ్గూ వేసి ఆయన టైము ఒక గంటన్నర లేటుగా బైలుదేర దియ్యడం అలవాటు చేసాను. అప్పటికే చిందులూ, శివాళ్ళూ, గొణుగుళ్ళూ, బొత్తిగా టైము సెన్సు లేదు మీతో పాటూ నన్నూ అనుకుంటాraని ధుమధుమలు ఐనా నేనూ లైటు తీసుకున్నాను.

  మెచ్చుకోండి

 12. దీన్నే ఇండియన్ పంక్చువాలిటీ అంటారని ఎక్కడో చదివాన్లెండి.
  ‘ఇదిగో పదినిముషాల్లో వచ్చెస్తున్నానని’ ఎవరితోనో ఫోన్ లో చెప్పి పేపర్లో దూరిపోతారు మా ఇంటాయన . ఇక నేను తగులుకుంటాను …..పదినిముషాలన్నారూ….బయల్దేరండీ అని , దానికాయన కోపంగా పదినిముషాలంటే నిజంగా పదినిముషాలేనా! అని కోపంగా అరుస్తారు . మరికాదా????????????
  అడక్కుండానే ఒట్టేసారంటే …..నాకు డౌటే !

  మెచ్చుకోండి

 13. మీ అవస్థ అర్ధమైంది నాకూ అప్పుడప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి . మీరురాసిన విధానం మాత్రం నవ్వుతెప్పించిందండీ…దీపావళి శుభాకాంక్షలు !

  మెచ్చుకోండి

 14. మీరు భలేవారండీ అమ్మగారూ. మా ఇంటో, అది కూడా యునైటెడ్ స్టేట్సు ఆఫ్ అమెరికా అనే మీ, మా దేశంలో, నేను మా ఇంటావిడకి నిన్న రాత్రే ఈ రోజు పొద్దున్న చేయవలసిన పనుల గురించి ఇలా చెప్పా – “ఏవమ్మా మనం పంప్ కిన్ను పాచుకి చిన్నమ్మిని తీసుకుని వెళ్దాము, కానీ ఆ పంపు కిన్ను ప్రదేశం రెండు గంటల దూరంలో ఉన్నది కాబట్టి మనం తొమ్మిదింటికన్నా ఇంటో నుంచి బయలుదేరితే ఆ చుట్టుపక్కల ఉన్న ఆపిలు పికింగు , మిగతావి కూడా చూసుకుని గోధూళి వేళకు ఇంటికి రావొచ్చు” అని చెబితే తల ఊపి – పొద్దున్న పాటించిన సమయపాలన గురించి మీకు చెబితే “హన్నన్నా”నే – ఆ పెద్దాయన బ్రహ్మదేవుడికి ఆల్రెడీ తెలిసినా – ఈవేళ్టి మా హావిడ సమయపాలనకి హాచెర్యపోయి కాలచక్రాన్ని – చక్రాల ఊచలు అన్నీ ఊడిపోయేలా గిఱ్ఱున తిప్పి చివరకు ఆ చక్రంలోకి చూస్తూ కళ్ళ ముందు గిఱ్ఱున గుండ్రాలు తిఱిగి పడిపోయాడని వార్త వచ్చింది. నాకు మా హావిడతో ఇలాటి అనుభవాలు బోలెడు కాబట్టి , ఆ పైన అలవాటయిపోయింది కాబట్టి హాచ్చెర్యం అనిపించలా. ఇక బర్త డే (“భర్త డే” కాదండోయి – ఇక అదొక్కటీ తక్కువయ్యింది నా జీవితంలో) ప్రోగ్రాములో, కల్చరల్ ప్రోగ్రాములో ఉంటే చెప్పనక్ఖరలా. ఓలు మొత్తం కేకు ముక్కను ఇతర కుక్కలు పీక్కు తిన్నాక, కార్డుబోర్డు ముక్క కోసం వెళ్ళినట్టు, శుభం కార్డు పడి తెరలు మూసేసి జనాలు బయటికి వస్తున్నప్పుడు ఎదురు ఆహ్వానానికి వెళ్ళినట్టూ. ఇలాటి భారత(భర్త) గాధలు బోలెడు. కాబట్టి మీ పాట్లు ఓస్ ఇంతేనా నాకైతే. నేనూ మీ లాటివాడినే. అంటే ఆరింటికి లేచి ఆరున్నరకి దోసెలు తిని కూర్చునే రకమే. ! అలా నేను ఒక ఘంటం (గంటం) పుచ్చుకోవచ్చు మరి.

  మెచ్చుకోండి

 15. 🙂 బాగుందండి నాకు మాత్రం కాసేపు వూసుపోయింది. అసలే నీరసంగా వుండి లోతైన రచనలు చదవలేనని చూస్తూ, ఇక్కడికి వచ్చాను. మీ శైలి అలవాటే కానీ ఇంకేదో వుందీ మరదే నాకూ తెలియకుందీ..;)

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s