ఊసుపోక – ఇంటర్వూ, నాతో నేను!

(ఎన్నెమ్మ కతలు 43)

 ఆమధ్య (ఈమధ్య అనేరోజులు అయిపోయేయి మరి) నేను ఇండియా వెళ్లి వచ్చేక ఇంటర్వూలు ఎందుకు చేస్తారు అని

అనుమానం వచ్చింది నాకు. ఆమీదట నేను ఇంటర్వూ చేస్తే ఎలా వుంటుందో అనిపించింది. ఈఅడవిలో ఎవర్ని ఇంటర్వూ చెయ్యనా అని దిక్కులు చూసి, దిక్కు తోచక, నాతో నేనే ఓ ఇంటర్యూ చేసేను లేదా ఇచ్చేను.  ఇది నాతో నేను, ద్విపాత్రాభినయం, కనక మరీ గందరగోళం కాకుండా 1, 2 అని ఇంటర్వూయర్‌కీ ఇంటర్వూయీకీ కొండగుర్తులు పెట్టేను.

————-

1- ఇప్పటికే చాలాఇంటర్వూల్లో “ఎక్కడ పుట్టేరు”, “ఎప్పుడు పుట్టేరు” అన్నప్రశ్నలకి జవాబులు చెప్పేశారు కనక ఎందుకు పుట్టేరో చెప్పండి.

2- మంచి ప్రశ్న. ఇంకా ఎలా పుట్టేరని అడగలేదు. అయినా మీకూ తెలుసేమో లెండి. ఇంతకీ ఎందుకు పుట్టేనని కదూ అడిగేరు. అసలేమయిందంటే, ఆదిని సృష్టికాలంలో శ్రీ మహాబ్రహ్మగారు ప్రముఖులనీ, సుముఖులనీ, సాధారుణులనీ, అసాధారుణులనీ అందరినీ పుట్టించేశాక, భూమ్మీద ఇంకా కొంచెం ఖాళీ జాగా వుండిపోయిందిట. ఆయనకి కూడా తెలుసులెండి nature abhors vacuum అని. అంచేత, ఆఖాళీ భర్తీ చేయడానికి నన్ను పుట్టించేట్ట. అదీ నేను విన్నకథ.

1- ఓహో. లోకంలో లోపాలు పూడ్చడానికి పుట్టేరన్నమాట. బాగు బాగు. మరి ఆతరవాత ఏం చేసేరు?

2- మంచిప్రశ్న, చాలాకాలం ఏం చేద్దామా అని సుదీర్ఘంగా ఆలోచించేను. ఆతరవాత ఎవ్వరూ చెయ్యనిపని చెయ్యాలనుకున్నాను.

1- ఏమిటది?

2- కథలు రాయడం.

1- కథలు అందరూ రాస్తున్నారు కదండీ. ఆంధ్రదేశంలో ప్రతి మూడోవాడూ కథకుడు, ప్రతిరెండోవాడూ విమర్శకుడూ అన్నారెవరో.

2- అవుననుకోండి. నేను రాసేవి అందరూ రాసేలాటివి కావు.

1- అని ఎవరన్నారు?

2- నేనే అనుకుంటున్నాను.

1- మీరిప్పటికి ఓ వెయ్యి కథలూ, వంద నవలలూ రాసి వుంటారా?

2- ఇదుగో అక్కడికే వస్తున్నా. ఇప్పటికి ఓ వందకథలూ  ఒక నవలా అయేయి..

1- హుమ్.  మీకథలగురించి చెప్పండి.

2- మంచిప్రశ్న. మీరు నాకథలేమైనా చదివేరా?

1- లేదులెండి. మావారిని చదవమన్నాను.

2. ఆయన్నెందుకూ?

1. నా అర్థాంగుడు కదా. ఆయనకి తెలిస్తే నాకు తెలిసినట్టే. ఇంతకీ ఇంటర్వూ మాట – మీకథల్లో మీకు నచ్చినకథలేవి, ఎందుకు నచ్చేయి చెప్పండి.

2- నాకథల్లో నాకు నచ్చినవి నేను చెప్పడం ఏమిటండీ? మీరు కదా ఇంటర్వూ చేస్తున్నది. మీరు చదివినకథల గురించి అడగండి. చెప్తాను.

1. మీరు పుస్తకాలు చదువుతారా?

2. ఎవరు మాత్రం పుస్తకాలు కాక మొహాలు చదువుతారేమిటి?

1. ఎలాటి పుస్తకాలు చదువుతారు?

2. మంచిప్రశ్న అడిగేరు. అట్టలున్న పుస్తకాలు.

1. అన్నిపుస్తకాలకీ అట్టలుంటాయి కదా.

2. అది కాదులెండి. నేను చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు మావీధిలోనే వున్న లైబ్రరీకి వెళ్తుండేదాన్ని. అప్పట్లో మీరడిగినప్రశ్నే ఏది చదవాలో తెలిసేది కాదు. చాలాపుస్తకాలు అట్టలు చిరిగిపోయి, కాయితాలు చిరిగిపోయి వుండేవి.  అంటే అవి చాలా పాప్యులర్ పుస్తకాలు అన్నమాట. అనుకుని నేను అలా పాప్యులర్ కాని పుస్తకాలు ఎంచుకుని తీసుకునేదాన్ని. . అంటే ఎవరికీ అక్కర్లేనివి చదువుతానన్నమాట.

1- సరే. ఇంకా ఏం చేస్తున్నారో చెప్పండి.

2- మంచిప్రశ్న. అనువాదాలు చేస్తున్నాను.

1- మీకథలేనా?

2- కాదులెండి. వేరేవాళ్ల కథలు.

1- వేరేవాళ్లవి ఎందుకు? కెరియరిజమా?

2- కెరియరిజమ్ అంటే డబ్బుతో కూడుకున్నది. ఉచితసేవ – కంచిగరుడ సేవ అనొచ్చునేమో.

1- పేరొస్తోంది కదా?

2- మంచి ప్రశ్న. కానీ నాపేరు ఎప్పుడూ ఒక్కలాగే వుందండీ. దీనిమూలంగా కొత్తగా జరిగింది. ఈ అనువాదాలతో వున్న పేరు కూడా ఊడ్చుకుపోయింది. కొండనాలుక్కి మందు వేస్తే వున్న నాలుక ఊడిపోయిందనీ.

1- ఈ అనువాదాలు ఎక్కడ వున్నాయి?

2- అలా అడగండి చెప్తాను. నావెబ్ సైటు తూలికలోవున్నాయి

1- థూనికా?

2. కాదండీ. తూలిక.

1. ఆఁ? తూనీగా?

2- కాదండీ. తూలిక.

1- స్పెల్లింగు చెప్పండి.

2- అసలు మీకు నాగురించి ఏం తెలుసో చెప్పండి. అపైన ఇంకా ఏమైనా వుంటే నేను చెప్తాను.

1- ఏమో. అందరూ ఇంటర్వూ, ఇంటర్వూ అంటుంటే నేనూ చేద్దాం అని వచ్చేను. పోనీ, మీరే చెప్పేయండి అసలు మీరు చెప్పగలిగింది ఏమైనా వుంటేనూ, చెప్పగలిగితేనూ. .

2. ఓ అలాగా. బాగుంది.

1, లాస్ట్ డాన్‌ చదివేరా?

2. చదవలేదండీ.

1- లాస్ట్ లెక్చర్ చదివేరా?

2- లేదు.

1- మైకల్ జాక్సన్‌గురించి ఏం చెప్పగలరు?

2- పాటలు పాడతాడని తెలుసండీ. రెణ్ణెల్లయినట్టుంది రంభా, ఊర్వశీ ట్రూపులో చేరిపోయాడని తెలిసింది.  

1- అమెరికన్ సినిమాలగురించి మీఅభిప్రాయం ఏమిటి?

2 – నేను సినిమాలు అట్టే చూడనండీ. ఎప్పుడో ఇరవైయేళ్లకిందట కాబోలు guess who’s coming to dinner అని ఓసినిమా చూసేను..

1. అదేదో డిటెక్టివ్ సినిమాలా వుంది. ఏమవుతుంది చివరకి డిన్నర్‌కి ఎవరొచ్చారో తెలుస్తుందా?

2. మీరు చూడలేదనుకుంటాను.

1- లేదులెండి. మీరు మామూలుగా ఇంటర్యూలో ఏం మాటాడతారో అది చెప్పేద్దురూ సరిపోతుంది.

2- నేను అమెరికన్ రచయిత్రులగురించి మాటాడదాం అనుకున్నాను.

1 – సరే మాటాడండి.

2 – టిల్లీ ఓల్సన్ అని ఒకావిడ సైలెన్స్అని ఓ పుస్తకం రాసేరు. ఆపుస్తకంలో రచయితలు రాయలేకపోకవడానికి కారణాలు వివరించేరు. నాకు నచ్చినవిషయం … .

1. .మన స్వాతంత్ర్యలక్ష్మిగారు. స్త్రీవాద రచయిత్రిగా ఒక్క పుస్తకంతో అఖండఖ్యాతినార్జించేరు. ఆవిడమీద మీ అభిప్రాయం ఏమిటి?

2. నాకు తెలీదండీ. నేను వినలేదు ఆపుస్తకంగురించి..

1. పోనీ … “ఆచంద్రకిరణి” నవల చదివేరా?

2. లేదండీ.

1. దా.పో. దానయ్యగారిపేరు  దేశదేశాలా మారుమోగుతోంది. వారిగురించి నాలుగుముక్కలు చెప్పండి.

2. మీకు తెలీందీ, నేను చెప్పగలిగిందీ ఏముంది? 

1. మీకు తెలుగంటే చాలా అభిమానం అంటున్నారు. మీరు ఇంగ్లీషు సైటు నడపడం, ఇంగ్లీషు పుస్తకాలు చదవడం ఏమిటండీ?

2 – తెలుగుకథకులగురించి ఇంగ్లీషువాళ్లకి చెప్పడానికి.

1. నేను ఏం అడిగినా తెలీదంటున్నారు. మరి మీరు వాళ్లకి చెప్పేదేమిటి?

2. బాగా అడిగేరు. వివరంగా చెప్పడానికి చాలా టైము పడుతుంది. తరవాత తీరిగ్గా రాసి ఇస్తాను. 

1. సరే. చివరిప్రశ్న. మీరు పోయేక, మిమ్మల్ని పాఠకులు ఎలా గుర్తు పెట్టుకుంటారంటారు – కథారచయిత్రీ, అనువాదకురాలూ, విమర్శకురాలూ, సైటు నిర్వాహకురాలూ?

2.మంచిప్రశ్న. మీరే కాస్త కనుక్కుని చెబుదురూ. ఈ ఇంటర్వూ చివర్న పాఠకులని అడగండి. ఇంతకీ ఈ ఇంటర్వూ ఎప్పుడు ఎక్కడ వేసుకుంటారు?

1- ఇదా???

2. హ్మ్.!!!

—————–

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

18 thoughts on “ఊసుపోక – ఇంటర్వూ, నాతో నేను!”

 1. @ మరువం ఉష, కనుక్కున్నానండీ. నిజానికి ఇంకా చాలా ఖాళీ వుండిపోయిందిట. అప్పుడేమో బ్లాగర్లని పుట్టించేట్ట. అందుకే వారు కూడా మున్నెన్నడూ చెయ్యని పని చేస్తున్నారుట. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. హ్హ హ్హ హ్హా.. భలే. ఆదివారం పనిచేయాల్సి వచ్చిందే అని దిగ్గుళ్ళుతూ, కాస్త విరామం తీసుకునీటుగా వచ్చాను. చదివాక అంతా మాయం. ఇంటర్వ్యూ లో ఇంకొక ప్రశ్న – ఇంకాస్త వాయిడ్ వుంటే ఇంకెవర్ని పుట్టంచేవాడో ఆ బ్రహ్మ? మీకు తెలుసా? 😉 ఏదో “ఊసుపోక” చదివాక “వూసుపోని” ప్రశ్న.

  మెచ్చుకోండి

 3. @ నిషిగంధ, ధన్యవాదాలు
  @ cbrao, మీరలా అడిగితే ఏం చెప్పను. మీరు ఆసమయంలో హైదరాబాదులో వున్నారని నాకూ తెలీలేదు. సరేలెండి, ఈసారి అమెరికాలోనే కలుస్తామేమో
  @ తెరెసా, చాలాకాలానికి మీపేరు చూసేను. ఇండియాలో వున్నట్టున్నారు. 🙂
  @ సిరిసిరిమువ్వ, అవునండీ. ఇండియానించి తిరిగొచ్చేక, తెలుగుశబ్దాలమీద మమకారం పెరిగిపోయింది
  @ విబిసౌమ్య, ఆరకాలేమిటో చెప్పకూడదా :p

  మెచ్చుకోండి

 4. ఇండియా లో మీతో మాటామంతీ జరిపినవారు మీ గురించి సరైన అవగాహన లేకుండా వేసిన ప్రశ్నలకు వెతచెందిన ఫలితంగా ఈ వ్యాసం వచ్చిందని భావించవచ్చా? మీరు సుజాతగారింట మిత్రులతో సమావేశమైన సంగతి ఏదో బ్లాగులో చదివాను. సుజాత, మీరు ఆ సమయంలో నేను భారతదేశంలోనే ఉన్న విషయం మరిచినట్లున్నారు. అమెరికా మిత్రులను అక్కడే (USA) కలవటం సులువేమో. నేను పలువురు తెలుగు బ్లాగరులను అమెరికాలో సులభంగా కలవటం జరిగింది.

  మెచ్చుకోండి

 5. @ చదువరి, అయ్యోయ్యో, మామూలు disclaimer పెట్టడం మర్చిపోయేను. ఎవర్నీ ఉద్దేశించి, కాదండీ, ఇదంతా మీకూసుపోవున్ అనే. లోకంలో లోపాలు భర్తీ చెయ్యగలసైజు నాకెక్కడుందీ ఆమాటకొస్తే ..
  @ మేథ,థాంక్స్.
  @ clipped in, థాంక్స్.
  @పరిమళం థాంక్స్.
  @ కల్పన, నీకు ఆనందమయినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.