ఊసుపోక – ప్రశ్నలూ, ఆలోచనలూ

(ఎన్నెమ్మకతలు 44) నాకథ “పెద్దతనం”మీద భావన, శ్రీలలిత వెలిబుచ్చిన అభిప్రాయాలూ, అడిగిన ప్రశ్నలు గంభీరమయినవీ, అంతకంత ఆలోచనలు రేకెత్తేంచేవీను. ఎంతంటే, నాచేత మరో (ఈ) టపా రాయించేయి.

నాకలవాటయిన ఊసుపోక శైలిలో రాస్తున్నాను కనక కాస్త హాస్యం కనిపించినా వారిద్దరూ అడిగిన ప్రశ్నలు సీరియస్‌గా ఆలోచించాల్సినవే. వారి అభిప్రాయాలు తీసుకుని నాకు తోచిన మరో నాలుగు మాటలు రాస్తున్నాను. పరిమళం వ్యాఖ్య – రచయితే కథకుడా అన్నప్రశ్నకి వేరే టపా రాయాలనుకుంటున్నాను

మొదట భావన ప్రశ్న. మార్పుకి మూలం ప్రశ్నే కదా, సుఖం, దుఃఖం, మంచీ చెడూ అంటూ తరాజు వేసుకోకుండా ఆలోచించలేమా అని. నిజమే. అసలు మనకి ఆలోచనలు వాటంతటే అవే వస్తాయి. నేచర్‌లో శూన్యం అసంభవం అయినట్టే, మెదడు కూడా శూన్యం భరించలేదు. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు వాటంతట అవే స్వాయంభువులయి వచ్చేస్తూనే వుంటాయి ఊపిరాడుతున్నంతవరకూ. ఎలాగా వస్తున్నాయి కదా అవి మంచివే చెయ్యండి అంటారు మనవాళ్లు. అందుకే మనం జపతపాలు చేసేటప్పుడు కూడా ఆలోచనలేని బుర్ర ఉండడం సాధ్యం కాదు కనకనే ఓ దైవం పేరో, లేకపోతే ఓంకారమో జపించమంటారు.

మార్పుకి నాంది ఆలోచన అన్నది నిజమే. కొమ్మనున్న ఆపిల్ కిందకే ఎందుకు పడిందని న్యూటను ఆలోచించబట్టే కదా భూమికి ఆకర్షణశక్తి వుందని మనం తెలుసుకున్నాం. ఎడిసన్ బుర్రలో బల్బు వెలగడానికి కూడా ఏదో కారణం వుందనే ఎక్కడో చదివేను అదేమిటో ఇప్పుడు జ్ఞాపకం లేదుకానీ.

రాబర్ట్ ఫ్రాస్ట్ ఓ పద్యం రాసేడు తాను తొక్కనిదారి గురించి. తాను తొక్కనిదారిలో వెళ్లివుంటే జీవితం ఎలా వుండేదో అన్న ఆలోచనమీద. జీవితం అంతా ద్వంద్వమయం. అనుక్షణం సందేహమే. అడుగడుగునా అనుమానమే. ఎటు వెళ్లడం? – ఎడమకా, కుడికా, ఏంతినడం? – అయ్యరుహోటల్లో ఇడ్లీ, సాంబారా? కాకాసాయిబుకొట్లో మసాలా కబాబా? మనషికొచ్చే ప్రశ్నలన్నీ జీవితమార్గాన్ని మార్చేసేంతటి ఘనమైన విషయాలు కాకపోవచ్చు కానీ సందేహం వస్తుందనడంలో సందేహం లేదు. మెదడు తత్త్వం అదీ.

ముందు ప్రశ్న పుట్టి తరవాత నేను పుట్టేనేమో అని అనుమానం వస్తుంది నాకే. ఎవరేనా పిలిస్తే, ఎందుకు పిలిచారూ అని కొట్టుకుంటాను. పిలవకపోతే ఎందుకు పిలవలేదూ అనుకుంటూ తపన … నాకేమైనా ఇస్తే ఎందుకిచ్చేరూ?, ఇవ్వకపోతే ఎందుకివ్వలేదూ? లేకపోతే అదే ఎందుకిచ్చేరూ?  .. చెయ్యి నొప్పెడితే ఎందుకు నొప్పేడుతోంది? నొప్పెట్టకపోతే .ఎందుకు … ఏం చెప్పను నాఅవస్థ. అంచేత, భావనగారూ, మార్పుకి ఆలోచన అవసరమే అయినా అనవసరమయిన ఆలోచనలు కూడా బోలెడు వచ్చేస్తుంటాయి తల్లో. కథలు పుట్టడానికి అదొక కారణం అనుకుంటాను నామటుకు నేను.

ఒకొకప్పుడు మనమే చాలా అసంబద్ధమయిన ప్రశ్నలు ఎదుర్కొనవలసి వస్తుంది కూడాను. నాకొచ్చే ప్రశ్నలు కూడా తిక్కగానే వుంటాయిలెండి, ఆమధ్య విమానంలో నాపక్కన కూర్చున్న ఒక కెనేడియన్, “నాకు ఇండియాగురించి ఏమీ తెలీదు. మీరు బ్రాహ్మలా?” అంది. చెప్పొద్దూ, నాకు మహ చిరాకేసింది ఏమీ తెలీనిమనిషికి కులాలగురించి ఒక్కమాటలో ఎలా చెప్పడం అని. అలాగే మాఅమ్మాయికి ఈప్రశ్న కాలేజీలో చేరింతరవాత వచ్చింది. అక్కడ ఎవరో తనని అడిగేరుట.

శ్రీలలిత ప్రశ్న ఆలోచనలమీద. మనలో వచ్చే మార్పులని మనం ఎలా ఆహ్వానిస్తాం? శారీరకంగా వచ్చే మార్పుకీ మానసికంగా వచ్చే మార్పుకీ మధ్య గల సంబంధం ఏమిటి? అని. మామూలుగా మనం అనుకోడంలో వుంది అంటాం. కొన్ని తమాషాగా కూడా వుంటాయి. అమెరికాలో బిజినెస్ 101 – మీరు డబ్బు సంపాదించాలంటే, మీకు చాలా డబ్బున్నట్టు ప్రవర్తించండి (To make money, act like you have money) అంటారు. అలా వున్నట్టు “నటించి” కొంప గుండం చేసుకున్నవాళ్లున్నారు! పిల్లల్ని పెద్దవాళ్లలా 3-పీస్ సూటుల్లో ముస్తాబు చేసి, గంభీరంగారావుల్లా ప్రవర్తించమని చంపుకుతింటారు. పెద్దవాళ్లు పార్టీలవంకన వేసే కుప్పిగంతులూ కేకలూ – ఏపిల్లవేషాలకీ దీటు రావు మరి. పెద్దవాళ్లు చిన్నవాళ్లలా కనిపించడంకోసం పడే అవస్థలకీ, చిన్నవాళ్లు పెద్దవాళ్లలా ప్రవర్తించడానికీ ఏమిటి కారణాలు అంటే చెప్పడం కష్టం కానీ అలాటి ఆలోచనలతో మంచి కాలక్షేపం కావడం మాత్రం తథ్యం.

నన్ను నేను అదేపనిగా ప్రశ్నలు వేసుకుంటూ వుంటాను. (ఒక్కోసారి నా ఈదురలవాటుతో నాస్నేహితులని కూడా ఇబ్బంది పెట్టేస్తుంటాను). నేను ప్రశ్నలేయడానికి కారణం సుఖదుఃఖాలు తరాజు వేసుకోడానికో నేను ఎంచుకున్నదారి తప్పేమోనన్న భయమో కాదు. కేవలం విషయం మరింత స్పష్టంగా తెలుసుకోడానికే. చాలావరకూ ఎదటివారి ఆలోచనో మనస్తత్త్వమో స్పష్టంగా తెలుసుకోవాలన్న కాంక్షే. అంటే కారణాలు తెలుసుకుంటే అసలు విషయం మరింతగా విశదమవుతుందనే. ఒకొకప్పుడు నాఆలోచనలు అసంబద్ధం కావచ్చు కూడా. నిజానికి ఇదే ఎక్కవసార్లు జరుగుతుంది ఖర్మ!

ఇప్పుడు కథ సంగతి చెప్తాను. నేను ఇండియానుండి వచ్చేక నన్ను ఒకరకమయిన నిరాసక్తత ఆవరించింది. ఎప్పుడూ లేని రుగ్మతలు కొన్ని మొదలయేయి. మామూలుగా నాది మంచి ఆరోగ్యమే కనక నాప్రయాణానికి ముందూ, వెనకా వున్న పరిస్థితుల్లో తేడా ఏమిటి అని ప్రశ్నించుకున్నాను. నాకు తోచింది వృద్ధాప్యం. ఆ ఆలోచన పట్టి పీడిస్తుంటే, దాన్ని వదిలించుకోడానికి కథ రాసేను. కథ రాస్తున్నప్పుడే నాకు తెలుసు అందులో నేను కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నానని. కానీ కథ కథగా చూస్తే, కనిపించేది నావయస్కులు చాలామందికి ఎదురయే ప్రశ్న వుంది. బ్లాగరులలో 99 శాతం చిన్నవాళ్లు. నాకథలో ప్రధానాంశం గ్రహించరేమోనన్న సందేహం కూడా నాకు కలిగింది. నేను ఒకొకప్పుడు నాసందేహాలకి సమాధానాలు వెతుక్కోడానికి కథ రాస్తాను. అలాగే ఇది కూడా.

అన్నట్టు కథ అంటే మరోకథ గుర్తొస్తోంది. గత ఏప్రిల్‌లో “గల్పిక ముదిరితే కథ అయిందిట” అని ఒక ఊ.పో. కత రాసేను. అందులో నేను నడిచేదారిలో ఒకమ్మాయి నాసంతకం అడిగిందని రాసేను. ఆయింట్లో ఎవరున్నారో నేను ఇంతకాలం చూడలేదు. నిన్న అదే దారిలో వెళ్తుంటే ఆయింటిముందు ఒకకారు ఆగింది. అందులోంచి పక్కా భారతీయ కుటుంబం వెరసి ఆరుగురు దిగేరు. యింటివారు తలుపు తీశారు. వాళ్లూ భారతీయులే. నాకు వెంటనే మళ్లీ ఆలోచనలు … గల్పిక ముదిరితే సంబంధించినవి- ఇంతకుముందు ఆఇంట్లో వున్నవారు తమయిల్లు కొనబోయే దంపతులు భారతీయులు కనక వారికి భారతీయమొహంగల నాయందు ఆసక్తి కలిగిందా? నాసంతకం ఆచిన్నఅమ్మాయి ఆ యిల్లుకొన్నవాళ్లకి చూపించి ఈవిణ్ణి మీకు తెలుసా? అని అడిగిందా? ఈచుట్టుపట్ల మీవాళ్లు చాలామంది వున్నారు అని అదొక సేల్స్ గిమిక్‌‌గా వాడుకున్నారా? — హాహా, ఇలా వుంటాయి నాఆలోచనలు!

ఈకథ రాసేసింతరవాత, నాకు ఇప్పుడు మరో ఆలోచన వస్తోంది. నాకు ఛాలెంజి కావాలి ఎల్లవేళలా. కొన్ని వాటంతట అవే వస్తాయి. కొన్ని కోరీ వేడీ తెచ్చుకుంటాను. తెల్లారి లేస్తే పొద్దు పోయేవరకూ అదే నన్ను నడిపించే శక్తి.

ఇలా ఆలోచిస్తుంటే అసలయిన ముసలితనం అదే – ఛాలెంజి లేకపోవడం – అనిపిస్తోంది. జీవితంలో సాధించవలసినవన్నీ – చదువూ, సంసారం, పిల్లల్ని పెంచి పెద్ద చేసి లోకంమీదకి వదిలేయడం, వుద్యోగాలనించీ శలవు పుచ్చుకోడం – ఇవన్నీ అయిపోయేక, మరేపనీ లేకపోయేక కలిగే నిరీహే వృద్ధాప్యం.

ఇండియాలో నాతూలిక పొందిన ఆదరణ చూసింతరవాత “నేను చెయ్యవలసింది, చెయ్యగలిగింది చేసేశాను, ఇంకేమీ లేదు” అనిపించింది. నాకు నీరసం రావడానికి కారణం అదీ అనిపిస్తోందిప్పుడు. మరొక ప్రాజెక్టు చేబడితే కానీ నాకు శాంతి లేదు అనుకుంటున్నా ప్రస్తుతం.

అంచేత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ జ్ఞానంతో మరో నవల రాయడానికి నిశ్చయించుకున్నాను. మనరచయితల్లో చాలామందికి నవల రాయడం మంచినీళ్లప్రాయం. ఒకొకళ్లు పదీ, ముప్ఫై రాసేశారు అవలీలగా. నాకు మాత్రం అదొక క్రతువు. అంచేత మొదలు పెడుతున్నాను. హరిః ఓమ్. ఇంకా మరొక మెట్టు పైకి వెళ్లి ఛాలెంజికోసం ఇంగ్లీషులో రాయాలని కూడా అనుకుంటున్నాను. అంటే నాకు ఇంగ్లీషు రాదని కాదు కానీ ఇంగ్లీషుపుస్తకాలు చదివేవారికి ఆసక్తికరంగా వుండేలా రాయాలి కదా. అదన్నమాట సంగతి.

(30 నవంబరు 2009)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “ఊసుపోక – ప్రశ్నలూ, ఆలోచనలూ”

 1. “గద్దెస్వరూప్, మరో ఇద్దరు నాకు వత్తాసు వచ్చేశారు కనక నా ప్రయోగం సరే అనుకుంటున్నాను. ఇంతకీ ప్రశ్నలమీదా, ఆలోచనలమీదా మీ ఆలోచన ఏమిటో తెలియనేలేదు.”
  Just a doubt. since I did not remember the usage. May be it is double emphasis.

  మెచ్చుకోండి

 2. @ శ్రీలలితగారూ, నాకథలు చదువుతున్నారంటే నాకు చాలా సంతోషంగా వుంది. మొహమాటం అక్కర్లేదండీ. తప్పకుండా, మీఅభిప్రాయాలు చెప్తూవుండండి. ఏరచయితకయినా అంతకుమించిన ప్రోత్సాహం లేదు.
  @ భావన, రజనివిషయంలో మీరు చెప్పినది నిజం కావడానికి ఆస్కారం వుంది. బాధ్యతలూ, విధులూ, ధర్మాలూ -నిజమేనండీ ఇవన్నీ ఛాలెంజి కానక్కర్లేదు. నావిషయంలో అవన్నీ దాటిపోయిన పరిస్థితుల్లో వేరే ఛాలెంజి కావాలన్నాను. ఇది వైయక్తికం అనుకుంటాను. ఎవరి పరిస్థితులూ, అనుభవాలను బట్టి వారు నిర్వచించుకుంటారు.
  @ వైదేహీ శశిధర్, all in good time 🙂

  మెచ్చుకోండి

 3. మాలతి గారు so nice of you మా కోసం స్పందించి ఇంకో పోస్ట్ రాసేరు. బాగుంది అండి. ధన్య వాదాలు. హ్మ్మ్ మీరు నా వంటి వారే , కాని నేను అలా అన్నిటి గురించి ఆలోచించటం ప్రశ్న ల కంటే సందేహాలనుకుంటాను. అవును అనుక్ష్టణం ప్రశ్న అది లేక పోతే చాలెంజ్ రాదు ఆ చాలెంజ్ లేదా సాధించవలసింది లేక పోతే వృద్ధాప్యం వస్తుంది నిజమే.. కాని పిల్లలను పెంచటం వాళ్ళ చదువులు తరువాత పెళ్ళిళ్ళు హ్మ్మ్…. అవి చాలెంజ్ లా????? విధు లా ?????? ఈ విధు లను చేస్తున్నాప్పుడు కూడా చాలెంజ్ వద్దా, అంటే పిల్లలను భాద్యత గా మంచి గా పెంచటం వాళ్ళ కోసం ఆరాట డి మంచి భవిష్యత్తు ఇవ్వటం చాలెంజ్ కాదా అంటారేమో నా వరకు అవి కూడా విధులే అవి సక్రమం గ చేస్తున్నప్పుడు కూడా ఆ విధు లకు మించి చాలెంజ్ వుండాలేమో… అది లేకే నేమో మీ పెద్ద తనం కధ లో రజని సత మత మయ్యింది అని నా అభిప్రాయం ఏమంటారు?

  మెచ్చుకోండి

 4. మాలతిగారూ,
  మిమ్మల్ని మీరు చక్కగా విశ్లేషించుకున్నారు అనిపించింది. ఎందుకంటే మనస్సుకి కావలసిన పని లేకపోవడం వలన కలిగే నిరీహే వృధ్ధాప్యం అని ఎంతో బాగా నిర్వచించారు. అంతకన్న ఆనందకరమైన విషయం మీరు నవల వ్రాద్దామనుకోవడం. మీ కథలు చదివే పాఠకురాళ్ళలో నేనూ ఒకదానిని. ఎంతో మొహమాటపడుతూ మీ “పెద్దతనం” కథకి స్పందించాను. మీరు ఏమాత్రం గర్వం లేకుండా నా మాటలు విన్నారు. మీ నవల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటాను.

  మెచ్చుకోండి

 5. @ చావాకిరణ్, ఎంతమాట! మీతరవాతే! అవునుగానీ, మీరు తెలుగులో ఎందుకు రాయరూ?
  @ గద్దెస్వరూప్, మరో ఇద్దరు నాకు వత్తాసు వచ్చేశారు కనక నా ప్రయోగం సరే అనుకుంటున్నాను. ఇంతకీ ప్రశ్నలమీదా, ఆలోచనలమీదా మీ ఆలోచన ఏమిటో తెలియనేలేదు.
  @ పరిమళం, మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. ఇంకా ఎక్కడలెండి. చాలాకాలం పడుతుంది.
  @సౌమ్యా, కల్పనా, థాంక్స్.

  మెచ్చుకోండి

 6. “అసలయిన ముసలితనం అదే – ఛాలెంజి లేకపోవడం”అక్షరాలా నిజం !
  నవలమొదలౌతుందని సంబరపడేంతలో ఇంగ్లీషులో అన్నారు .ప్చ్ …మరి నాకేమో ఇంగ్లీషు రాదు .ఏమైనా మీ రాబోయేనవల చదువరుల మనసును గెలుచుకోవాలి ..ఆల్ ది బెస్ట్ మేడం !

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.