కల్పన – ‘ మూస ‘ పోసిన సాహిత్య చరిత్ర ఇంకెన్నాళ్ళు?

2004లో తొలిసారిగా కల్పననీ, అఫ్సర్‌నీ ఆటా సభల్లో కలిశాను. వారితో వెంటనే మంచి స్నేహం ఏర్పడింది. ఆటావాళ్ల సావనీర్‌‌లో స్త్రీచైతన్యంమీద కల్పన రాసినవ్యాసంలో ప్రస్తావించిన అంశాలు నాదృష్టినాకట్టుకున్నాయి. అంచేత

నేను తెలుగురచయిత్రులమీద రాస్తున్న పరిశీలనాత్మకగ్రంథానికి ముందుమాట రాయమనీ కోరేను తనని. తను వెంటనే శ్రమ అనుకోకుండా ఈముందుమాట రాసి ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ఇది మంచి వ్యాసమే. ఇప్పుడు నాపుస్తకం, Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975, అన్నపేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీవారు గత సెప్టెంబరు 2009లో ప్రచురించారు. విశాలాంధ్రలో దొరుకుతుందిట. అమెరికాలో అమెజాన్.కాంలో, నాపేరు కీవర్డ్ కొట్టి చూడండి. లేదా, thulikan@yahoo.com కి ఈమెయిల్ ఇవ్వండి.

ఈపుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీవారి బుక్ స్టోరులో దొరుకుతుంది. వెల 45 రూ. 186 పేజీలు.

అన్నట్లు, తెలుగు తూలిక ఆవిర్భవించి నిన్నటికి రెండేళ్లయింది! రెండేళ్లలో ఇంతమంది ఆదరాభిమానాలు పొందగలననుకోలేదు ఆరోజున. ఏంచెప్పను, అవాక్!

కల్పన రెంటాలకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆమె అనుమతితో ఇక్కడ పెడుతున్నాను. చదివి మీ అభిప్రాయాలు నాకు గానీ కల్పనబ్లాగులో గానీ చెప్పగలరు. ఇద్దరం మంచి చర్చ ఆశిస్తున్నాం!

                       000

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర మనది. ఒక మొల్ల, మరో తిమ్మక్క అంటూ వేళ్ల మీద లెక్కించి స్త్రీల సాహిత్య చరిత్రను, వారి కృషిని ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో ఓ పార్శ్వ్యంగా మాత్రమే చూపించే ప్రయత్నం ఇన్నేళ్ళుగా సాగింది. సాహిత్యంలోనూ, సామాజిక శాస్త్రరంగాల్లోనూ, స్త్రీల భాగస్వామ్యాన్ని ఓ పాయగా మాత్రమే చూపించటానికి అలవాటు పడ్డ పురుషస్వామ్య చరిత్ర విధానం మనది. తెలుగు సంస్కృతిపై ఆధునికత ప్రభావం పడ్డప్పటి నుంచి, స్త్రీల భావ ప్రపంచం మారుతూ వచ్చింది. అది సాహిత్యంలోనూ, శాస్త్ర, సామాజిక రంగాల్లోనూ ప్రతిఫలించింది. అయితే, స్త్రీలకు సంబంధించి పురుషుల ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి చెప్పినంతగా, చుట్టూ వున్న సమాజంలో స్త్రీల మేధో భాగస్వామ్యం పెరుగుతూ వచ్చిన క్రమాన్ని , వారి ఆలోచనాస్రవంతిలో వచ్చిన మార్పుని వివరించిన ప్రయత్నాలేవీ అసలు జరగలేదు.

ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన ఈ మూస చరిత్ర రచనా విధానాన్ని ప్రశ్నించి, ప్రత్యామ్నాయ చరిత్రను రచించే క్రమం ఒకటి మొదలైంది. ఇది కేవలం ఓ నలుగురు వ్యక్తులకో, నాలుగు పుస్తకాలకో పరిమితం కావడం లేదు. స్త్రీ చైతన్య క్రమాన్ని అన్ని రంగాల నుంచి, అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నారు. తెలుగు సాహిత్య రంగంలో స్త్రీల విశేష కృషిని పాక్షిక దృష్టితో చూస్తూ ఓ దశాబ్ధానికో, ఒక నలుగురు రచయిత్రులకో పరిమితం చేస్తూ కొనసాగిన చరిత్రను తమ విస్తృత పరిశోధనలతో చర్చకు పెట్టే ప్రయత్నం మొదలైంది. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో నిడదవోలు మాలతి ఒకరు. స్వాతంత్ర్యానంతర కాలంలో తెలుగు కధా చరిత్రను గురించి ఇప్పటివరకూ రికార్డైన సాహిత్య చరిత్రను ఆమె కొత్త దృక్కోణంలో చర్చిస్తున్నారు

తెలుగు కధా చరిత్రలో రచయిత్రులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నవలా రచయత్రులుగానో, లేక 80 ల తర్వాత వచ్చిన స్త్రీవాదుల గురించో వుంటుంది తప్ప అంతకు మించిన సమగ్ర చర్చ ఎప్పుడూ జరగలేదు. స్వాతంత్ర్యానికి ముందు సంఘసంస్కరణ జాతీయోధ్యమాల కాలంలో కధానికలు రాసినంత మంది రచయిత్రులు, స్వాతంత్ర్యానంతరం రాయలేదు. ముద్రణా సౌకర్యం, మహిళా చైతన్యం, విద్యా సౌకర్యాలు పెరిగి, వస్తువైవిద్యానికి ఆస్కారం కలిగిన కాలంలో మహిళా కధకుల సంఖ్య తులనాత్మకంగా చూచినప్పుడు అంతకు ముందు కన్నా తక్కువ. స్వాతత్ర్యానంతరం మహిళలు కధానికను వదిలి నవల వైపు మొగ్గడం ఇందుకు కారణమై అంటారు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (తెలుగు కధకులు-కధనరీతులు-మూడవ భాగం పేజీ 111). అయితే, అది తప్పని, అందరూ అనుకుంటున్నట్టు 1950 నుండి 1975 వరకూ రచయిత్రులు కేవలం నవలలు మాత్రమే రాయలేదని, అనేక మంచి కధలు రాసారని చెపుతూ వారు తీసుకున్న ఇతివృత్తాల్ని, వారి రచనా విధానాన్ని, శైలిని నిడదవోలు మాలతి తన పుస్తకం Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975 లో సమగ్రంగా చర్చించిన విధానం స్త్రీల సాహిత్య విమర్శలో ఓ మైలురాయి లాంటి ప్రయత్నం. స్త్రీవాదం అన్న పదం వాడకపోయినా, స్త్రీ చైతన్యం, స్త్రీ వ్యక్తిత్వ ప్రస్తావన అనేది కేవలం 80 ల నుండి మాత్రమే మొదలు కాలేదని, అది ’50 ల తరం నాటి రచయిత్రుల్లో ఎంత స్పష్టం గా ప్రకటితమైందో ‘ ఎదురు చూసిన ముహుర్తం’ (పి. సరళాదేవి) లాంటి కధల ద్వారా  ఆమె సోదాహరణంగా చెప్పినప్పుడు వెనకటి తరం రచయిత్రుల కృషి మీద మరింత గౌరవ భావం కలుగుతుంది.
గురజాడ వారి ‘ దిద్దుబాటు ‘ తొలి తెలుగు కధగా పేర్కొంటూ ఇప్పటిదాకా ప్రచారమైన తెలుగు కధా చరిత్రలో తొలితరం రచయిత్రులకున్న ప్రాధాన్యత అతి స్వల్పము. భండారు అచ్చమాంబ తొలి తెలుగు కధకురాలన్న గుర్తింపు ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కఠోర సత్యము. ప్రధానా స్రవంతి కధాసాహిత్య విమర్శల్లో, తొలితరం తెలుగు కధానికా సంకలనాల్లో గురజాడ, శ్రీపాద, మల్లాది గురించి చెప్పినంతగా ఎవరూ ఈ నాటికి కూడా భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఇల్లిందల సరస్వతీదేవి, శివరాజు సుబ్బలక్ష్మి,పి.శ్రిదేవి,ఆదిమధ్యం రమణమ్మ మొదలైన రచయిత్రుల గురించి ఎవరూ ఎక్కడా చెప్పలేదు, చర్చించలేదు.కధకు సంభందించిన చర్చలన్నింటిలోనూ, ’50ల నాటి రచయిత్రుల ప్రస్తావనలు దాదాపుగా ‘ నాంకే వాస్తే ‘ పద్ధతిలో మాత్రమే కనిపిస్తాయి. తెలుగు కధ మీద ఇప్పటివరకూ వచ్చిన అనేకానేక పుస్తకాలు, అనేకానేక వ్యాసాలు పరిశీలించినప్పుడు వారి కృషి ఓ ముగ్గురి, నలుగురి పేర్లతో ……..ఫలానా వారు కూడా రాసేవారు అంటూ ఏకవాక్యానికే పరిమితం కావడం చూడవచ్చు. వారి కధల గురించి, వాటి ఇతివృత్తాలు, శైలి మొదలైన వాటి గురించి సీరియస్ గా ఎవరూ చర్చించినట్టు మనకు ఎక్కడా దఖాలాలు లేవు. మరీ కాకుంటే మొత్తం రచయిత్రులందరి గురించి ఒక వ్యాసం వుంటుంది కానీ ప్రధాన సాహిత్య చరిత్రలో భాగంగా తొలి తరం రచయిత్రుల కృషిని సమగ్రంగా విశ్లేషిచినట్ట్లు కనిపించదు. నిస్సందేహంగా గురజాడ, మల్లాది, శ్రీపాద గొప్ప రచయతలే కానీ రచయిత్రుల కధల్ని గురించి చర్చించినప్పుడు కదా వారు కూడా దీటుగా కధలు రాయగలిగారా, లేదా అన్న సంగతి అర్ధమయ్యేది.

గురజాడ ‘ దిద్దుబాటు ‘ ని, భండారు అచ్చమాంబ ‘ స్త్రీవిద్య ‘ లేదా ‘ఖన ‘ లాంటి కధల్ని పక్కన బెట్టి చూసినప్పుడు దిద్దుబాటు కంటే ఆ కధలు ఏ రకంగానూ తీసిపోవన్న నగ్నసత్యం బోధపడుతుంది. 1900 నాటికే విద్యావంతురాలైన భండారు అచ్చమాంబ రాసిన స్త్రీల చరిత్రను, ఆమె రాసిన కధల్ని ఎవ్వరూ కూడా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోనందువల్ల ఆమె కృషి విస్మృత చరిత్రగా మిగిలిపోయింది. విక్రమాదిత్యుని ఆస్థానంలోని జ్యోతిశ్శాస్త్రవేత్త మిహిరుని భార్య ఖనా కు ఎలాంటి దుర్గతి పట్టిందో చెపుతూ అచ్చమాంబ రాసిన కధ స్త్రీలు అప్పటికే సమాజం లో తమ స్థితిగతుల్ని గుర్తించారనటానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఐరోపా మహాసంగ్రామానంతర దుస్థితిని, మాంచెస్టర్ నూలు మిల్లులు వచ్చి దేశీయ పరిశ్రమలు దెబ్బతీసిన వైనాన్ని, జాతీయోద్యమ ప్రాముఖ్యాన్ని ఓ తల్లి పాత్ర ద్వారా చెప్పించిన కనుపర్తి వరలక్షమ్మ లాంటి రచయిత్రుల్ని, ‘ కుటీరలక్ష్మి ‘ (1924) లాంటి కధల్ని పట్టించుకున్న వారు తక్కువే. తొలి తరం స్త్రీల సాహిత్య కృషిని అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా పురుష నిర్మిత సాహిత్య విమర్శనా పనిముట్లతో పరామర్శిస్తూ స్త్రీలు ఇతర స్త్రీల కోసం రాసుకుంటున్న వాటిగానే చూస్తున్నరు తప్ప వారి సాహిత్యానికి ప్రధాన స్రవంతి చరిత్రలో సరైన ప్రాతినిద్యం ఇవ్వలేదన్నది నిష్టూర సత్యం.

స్వాతంత్ర్య, సంస్కరణోద్యమాలు, పత్రికల వ్యాప్తి, స్త్రీవిద్యలో భాగంగా మాత్రమే రచయిత్రుల్ని చూస్తారు తప్ప అంతకుమించి వారి సాహిత్యానికి ప్రత్యేకత ఏమి ఇచ్చినట్టు కనిపించదు. ఆనాటి స్త్రీలు తాము చదువుకొని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్న సంగతి కంటే కూడా స్త్రీలు చదువుకోవాలని, అది ‘ కుటుంబానికి ‘ చాలా ప్రయోజనకరమంటూ మగవారు ప్రోత్సహించిన దానికే చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం లభించింది. స్త్రీ విద్య, స్త్రీ అభివృధ్ధి కోసం కంటే కూడా ఇంటిని చక్కదిద్దటానికి, పిల్లల్ని బాగా పెంచడానికి మాత్రమే సంస్కరణవాదులు కోరుకున్నారు. వ్యక్తిగా ఆమె వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశంగా స్త్రీవిద్యను సంస్కరణవాదులు భావించినట్టు కనిపించదు. స్త్రీవిద్య గురించి గురజాడ కున్న ఈ పాక్షిక దృష్టిని మాలతి తన పుస్తకంలో తేటతెల్లం చేశారు.

స్వాతంత్ర్యోద్యమం తర్వాత 1950-75 అతి ముఖ్యమైన కాలము. రాజకీయార్ధిక, సామాజిక రంగాల్లో వచ్చిన అనేకానేక మార్పులు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిఫలించిన కాలం అది. అలాంటి కాలాన్ని నవలాయుగంగానో, కేవలం కల్పనాసాహిత్యంగానో సాహిత్య చరిత్రకారులు నిర్ధారించి పక్కనపెట్టేశారు. ఆ కాలంలో రచయిత్రులు రాసిన అనేకానేక నవలల్లో మంచి నవలలు అనేకం వచ్చినప్పటికీ, స్త్రీ,పురుష సంబంధాలకు, కుటుంబ జీవనానికి సంబంధించి అతి ముఖ్యమైన సున్నితమైన సమస్యల్ని ఈ నవలలు చర్చించినప్పటికి పురాణం సుబ్రమణ్య శర్మ లాంటి వాళ్ళు సీనియర్ విమర్శకులు కూడా సద్విమర్శ చేయలేకపోయారు. ‘ తెలుగు కధ-సామాజిక స్పృహ ‘ అన్న అంశం మీద రాసిన వ్యాసంలో ” చాలా మంది రచయిత్రులు తమ కధల్లో స్త్రీతో ముడిపడిన మేరకు పురుషుని చిత్రించగలుగుతున్నారు కానీ పురుష ప్రపంచం గురించి వారికి బొత్తిగా ఏమి తెలియదని వారి రచనల్ని చూస్తే తెలిసిపోతుంది. మేధాశక్తి లేదు. భాషా దారిద్ర్యం అపారం. ఏమి చదవరు. ఆత్మస్తుతి,పరనింద, అహంకారం మూర్తీభవించిన నిర్జీవ ప్రతిమలు-తెలుగు నవలామణులు. వీరు ప్రారంభించిన అయోమయ శకం తెలుగు పాఠకుల స్థాయిని దిగజార్జేసి గడియారాన్ని యాభై ఏళ్ళు వెనక్కు తిప్పింది”(తెలుగు కధ విమర్శానాత్మక వ్యాస సంపుటి- అంధ్రసారస్వత సమితి ప్రచురణ, 1974)అని పురాణం బాహాటంగా, నిసిగ్గుగా అనగలిగారు. అయితే ఆ పురాణం గారే  ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులను 1976 లో అనేక సాహిత్య ప్రక్రియలకు ప్రకటించి అందులో ఫిక్షన్ కేటగిరి ని వదిలేసినప్పుడు ఆంధ్రజ్యొతి వారపత్రికలో (19 నవంబర్, 1976) రాసిన లేఖ చదివినప్పుదు ఆశ్చర్యపోతాము

ఆ లేఖ సారాంశం ఇది. ” గతంలో అకాడమి అవార్డ్ పొందిన నవలలు ఉత్తమైన రచనలు అయి వుండవచ్చు.అంతమాత్రాన ఇప్పుడు ప్రచురితమవుతున్న నవలలుకూడా వాటికి నాణ్యతా ప్రమాణాల్లో ఏమాత్రం తీసిపోవు. ఉదాహరణకి, మాదిరెడ్డి సులోచన తెలంగాణ జీవితాన్ని చిత్రించే అద్భుతమైన నవలలు రాశారు. వాటిల్లో మచ్చుకు కొన్ని తరం మారింది, పూల మనసులు, మతము-మనిషి. అలాగే యద్దనపూడి సులోచనారాణి ఆంధ్రుల అభిమాన నవలారచయిత్రి. ఆమె నవలలు జీవన తరంగాలు, బందీ, ప్రేమలేఖలు ఆమె రాసిన మంచి నవలల్లో కొన్ని. ఈ నవలల్లో ఏదో ఒకటైనా మీ అవార్డ్ ప్రమాణాలకు సరితూగుతాయి. అంతే కాకుండా డి. కామేశ్వరి, పరిమళా సోమేశ్వర్ ,ఐ.వి.యస్. అచుత్యవల్లి లాంటి ఇంకెందరో నవలా రచయిత్రులు కూడా మంచి నవలలు రాసారు. తెలుగు నవలా యుగంలో రికార్డ్ స్థాయిలో పబ్లిషర్లు 300 కొత్త నవలలు ప్రచురించారు”.
ఇక్కడ మనకు రెండు విషయాలు బోధపడతాయి. ఒకటి తెలుగు నవలా స్వర్ణ యుగంలాంటి సమయంలోనే మంచి నవలలు రాసినా కూడా ఏ మహిళా రచయిత్రి కూడా సాహిత్య అకాడమి అవార్డ్ కు అర్హురాలు కాకపోవడము. రెండొ విషయము…ఒక పత్రికా సంపాదకుడు, అగ్రశ్రేణి సాహిత్య విమర్శకుడైన పురాణం లాంటి వారు స్త్రీల సాహిత్య సృజనకు సంబందించి ఎంత నాసిరకమైన అభిప్రాయాలు కలిగివున్నారో కూడా మనకు అర్ధమవుతుంది.

అలాగే కధకుడు, విమర్శకుడు కేతు విశ్వనాధరెడ్డి ఒక చోట ” రచయిత్రులు నవల జోలికి వెళ్ళినంతగా కధానిక జోలికి వెళ్ళలేదు. శ్రీదేవి, సరళాదేవి, తురగా జనకీరాణి, కళ్యాణ సుందరీ జగన్నాధ్, వాసిరెడ్డి సీతాదేవి, ఆచంట శారదాదేవి, పవని నిర్మల ప్రభావతి, నిడదవోలు మాలతి, రంగనాయకమ్మ వంటి రచయిత్రులు కూడా కధానిక శిల్పంలో సాధించిన ప్రత్యేకత వుందని చెప్పలేం. దానికి కారణం ఆధునికి చైతన్యాన్ని అలవర్చుకోవటంలో పురుషుల కంటే స్త్రీలు ఇంకా వెనుకబడి వుండటమే. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు రచయిత్రులు కధనసారళ్యంలో కూడా ప్రత్యేకంగా సాధించిందేమి లేకపోవడమే” అని వ్యాఖ్యానిస్తారు.(దృష్టి -సాహిత్య వ్యాస సంపుటి -పేజీ 73)

తెలుగు కధానికకు సంభందించి చర్చలు జరిగినప్పుడల్లా విమర్శకులు రాసే మాటలు పైన చెప్పుకున్నట్టు వుంటాయి. తెలుగు నాట సాహిత్య విమర్శ వ్యక్తుల్ని బట్టి, కాలాన్ని బట్టి రకరకాలుగా ఎలా మారుతూ వుంటుందో చెప్పటానికి ఇవి కొన్ని వుదాహరణలు మాత్రమే.

ఇలాంటి సాహిత్య విమర్శలు అలవాటైన తెలుగు సాహిత్య లోకానికి అతి ముఖ్యమైన ఓ పాతికేళ్ళ కాలంలో స్త్రీల సాహిత్య కృషిని, అప్పటి సామాజిక సందర్భానికి అన్వయిస్తూ వస్తుపరంగా, రూపపరంగా, శైలీపరంగా విశ్లేషిస్తూ నిడదవోలు మాలతి రాసిన Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975 పుస్తకం అసలైన తెలుగు సాహిత్య చరిత్రను గురించి  పరిశోధించేవారికి మరింత బాగా వుపయోగపడుతుందనటం అక్షర సత్యం.

( తెలుగు విశ్వవిద్యాలయం వారు త్వరలో ప్రచురించనున్న  నిడదవోలు మాలతి రాసిన  Quiet and Quaint: Telugu Women’s Writing, 1950-1975  పుస్తకానికి రాసిన ముందు మాట నుంచి…)

 కల్పనారెంటాల

September 27, 2004

Madison, Wisconsin

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “కల్పన – ‘ మూస ‘ పోసిన సాహిత్య చరిత్ర ఇంకెన్నాళ్ళు?”

 1. మాలతిగారికి, నమస్కారములు.
  ఈ వ్యాసం చదివాక ఈ పుస్తకం తప్పకుండా చదవాలని అనిపిస్తోంది. తప్పకుండా చదువుతాను. చాలా విషయాలు గమనించాక ఒక స్త్రీగా ఒక్క మాట చెప్పాలని అనిపిస్తోంది. అసలు ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిగురించే చెప్పాలి, ఆ పని బాగా చేసారో లేదో చెప్పాలి. కాని చాలామంది ఆ చేసిన పనిని రంగుటద్దాలతో చూస్తారు. అంటే ముందునుండీ వారికి ఈ పని వీరు చేయలేరు అనే చులకనభావం మనసులో నాటుకుని ఉంటుంది. మరీ సూటిగా చెప్పాలంటే “పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు”.(biased) వాళ్ళకి ముందునుండే ఒకలాంటి భావం ఏమిటంటే వెనకాల ఎవరో మగవారి ప్రొత్సాహం ఉంటే తప్ప స్త్రీలు ఏ పనీ వారంతట వారు బాగా చేయలేరు అని. ఒక్కొక్కసారి అదే మగవారి వల్ల ఎంతమంది స్త్రీలలో ఉన్న ప్రతిభ అణగారిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. మనం ఇక్కడ స్త్రీవాదం గురించి కాకుండా రచనల గురించి, రచయిత్రుల గురించి మాట్లాడుకోవలసి వస్తే ఆడవారు ఆలోచించినంత విశాలమైన మనసుతో మగవారు ఆలోచించలేరు. మనసు స్పందిస్తేనేకదా మాట వాక్యమయ్యేది.
  ఏది ఏమైనా ఈ వ్యాసం చదివాక ఈ పుస్తకం తప్పకుండా చదవాలనిపిస్తోంది. చదివాక నాకు ఏమనిపించిందో వ్రాస్తాను.
  అభివందనములతో,
  శ్రీలలిత.

  మెచ్చుకోండి

 2. @ సౌమ్య, మరి చదివేక మళ్లీ చెప్పండి. ఇంకా వ్యాఖ్యలు వస్తాయేమోనని ఎదురు చూస్తూ జవాబులు రాయలేదు. 🙂
  @ వైదేహి శశిధర్, థాంక్స్.
  @ ఉష, నిజమేనండీ. రచయిత్రి అంటే హాస్యపూరితపదం – బాగా చెప్పేరు. పాఠకుల్లో వివక్షత మాట కూడా నిజమే. కల్పనా, నేనూ కూడా విమర్శకులు కూడా పాఠకులే ఒకవిధంగా అనుకునే, ఆప్రశ్నలు లేవదీశాం. మంచి చర్చ వస్తుందనుకున్నాం కానీ రాలేదు, ప్చ్.

  మెచ్చుకోండి

 3. >> తెలుగు తూలిక ఆవిర్భవించి నిన్నటికి రెండేళ్లయింది!

  అభినందనలండి. ఇంకా మరిన్ని ఏళ్ళిలాగే సాగాలి.

  వ్యాసం ఆగి ఆగి ఆకళింపు చేసుకుంటూ చదివాను. చాలా వివరంగా వ్రాసారా ముందు మాట. “తెలుగు సాహిత్య లోకానికి అతి ముఖ్యమైన ఓ పాతికేళ్ళ కాలంలో స్త్రీల సాహిత్య కృషిని” మీ మాటల్లో చదవగలగటం మాకు వచ్చిన సదవకాశం. ఇక్కడ ఎలా సంపాదించగలను? మా అమ్మగారు దినపత్రిక, వార పత్రికలు చక్కగా చదివి ఎవరికైనా చెప్పాలని ప్రయత్నించేవారు. కానీ మిగిలినవారిలో అనాసక్తి గురించి ఇప్పుడాలోచిస్తే రచయిత్రులే కాదు, పాఠకుల్లోను వివక్ష వుండేదేమో! నిజానికి ఈ సమస్య నాకూ వుంది. కొన్ని అంశాలు వారికే పరిమితం అన్నట్లుండే అనుభవం మిగులుతుంది. కొందరికైతే రచయిత్రి అన్నది ఒక హాస్యపూరిత పదం. చదువుకున్నవారా/కాదా అన్నది కాదు స్త్రీ అన్నదానికి ముడిపడినదది. ఆ కాలంలో ఆయా రచయిత్రులు ఎన్ని వివాదాలు, విమర్శలు, వివక్షలకు గురయ్యారో కదా?

  మెచ్చుకోండి

 4. చాలా బాగుందండీ ఈ వ్యాసం… చాలా విషయాలు తెలిసాయి.
  ఇప్పుడు ఏమనిపిస్తోంది అంటే -ఇంత చెప్పాక కూడా నేనీ పుస్తకం ఎలాగో సంపాదించి చదవలేదంటే – ఇక చరిత్రపై నాకేమాత్రం గౌరవం లేదన్నట్లే 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.