రచయితా, కథకుడూ

రచయితే కథకుడా అన్న విషయంమీద రాయాలని నేను చాలాకాలంగా ఆలోచిస్తూనే వున్నాను. వెనక ఒక టపాలో మరువంగారి వ్యాఖ్యకి సమాధానంగా కూడా మళ్లీ రాస్తానని చెప్పేను. ఇదుగో అదే ఇది …

(గమనిక – రచయిత పదం రచయితకి, రచయిత్రికి ఉభయసామాన్యం.).

అసలు ఏ రచయిత అయినా ఒక ఆంశంగురించి ఎందుకు రాస్తాడు అంటే – ఒక సంఘటన అతనికి లోకరీతికి భిన్నంగా కనిపించినప్పుడు, లేదా అందరికీ తెలిసినా దాన్నిగురించి ఎవరూ గట్టిగా ఆలోచించనప్పుడు, అలా ఆలోచించవలసిన అవుసరం వుందని అతనికి అనిపించినప్పడు రాస్తాడు. ఆసంఘటన తన అనుభవం కావచ్చు, తను చూసిన అనుభవం కావచ్చు. నా “పెద్దతనం”, “జేబు” కథల్లో నా అనుభవాలు వున్నాయి. నిజానికి నాకథలన్నిటిలోనూ నాఅనుభవాలున్నాయి. అయితే కథంతా ఒక్క నాఅనుభవం మాత్రమేనా అంటే కాదు అనే చెప్తాను. ఈపాయింటుకి మళ్లీ వస్తాను.

ఒకకథ ఎవరికైనా ఎందుకు నచ్చుతుంది అంటే. ఆకథలో ఒక పాత్రో ఒక సంఘటనో వారికి పరిచయమయినవిగా తోచినప్పుడే కదా. ఆపాత్ర కానీ సంఘటన కానీ పాఠకుడికి అనుకూలంగా ఉంటే అనుకూలంగా స్పందిస్తాడు. అతడికి తెలియని సంగతులూ, తనఅభిప్రాయాలకి విరుద్ధమయినవీ అయితే, వ్యతిరేకంగా స్పందిస్తాడు. రెండు పరిస్థితుల్లోనూ జరుగుతున్నది ఒకటే. ఆపాత్రలూ, సంఘటనలూ వాస్తవమయినవిగా పాఠకుడు గ్రహించడం. నిజానికి రచయిత కూడా పాఠకుడే ఆకథ ప్రారంభదశలో. అంటే ఒక పాత్రకో సంఘటనకో (అదే అనుభవం) మొట్టమొదట స్పందించేది రచయిత. ఆతరవాత అది కథ అయి పాఠకులముందుకి వస్తుంది సర్వాభరణభూషితయయి.

కథ రచయితకీ పాఠకుడికీ ఉభయసామాన్యం. కథాంశంగా మారిన ఒక అనుభవం. ఇందుకు భిన్నంగా వుండేవి అద్భుత, భయానక, భీభత్స సై-ఫై కథలు. వాటిల్లో ఊహే ఎక్కువ కనక అవి రచయిత అనుభవంలోనివి కాదు అనిపిస్తాయి. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే, వాటిలో కూడా అంతర్గతంగా వున్న సందేశం దుష్టశిక్షణా, శిష్టరక్షణే చాలావరకూ. డిటెక్టివ్ కథలు కేవలం మేథకి సంబంధించినవి. వాటిలో ఎలా జరిగింది అన్న ప్రశ్నకే సమాధానం కానీ ఎందుకు జరిగింది అన్న ప్రశ్న లేదు.

ప్రస్తుతానికి, ఈచర్చ సాంఘికకథలకే పరిమితం.

రచయిత ఓంప్రథమంగా ఒకఅంశాన్ని మొదట అతనికోణంలోనుండే చూడడం, ఆవిష్కరించడం జరుగుతుంది అని మనం ఒప్పుకోవాలి. అయితే, అది కేవలం ఒక్క తనకోణంలోంచే, ఒక్క తనఅభిప్రాయమే అయితే దానికి విశ్వజనీనత రాదు. పదిమందిచేత “నేనూ అలాగే అనుకున్నాను, నాకూ అలాగే అనిపించింది,” లేదా “నాజీవితంలోనో, నాకు ఆప్తులయినవారి జీవితంలోనో ఇలాగే జరిగింది”, అనిపించినప్పుడే విశ్వజనీనత. లేకపోతే, ఆకథకి బలం లేదు. ఇక్కడే మరోకోణం కూడా చెప్పుకోవాలి. ముందు చెప్పిన స్పందనలకి ప్రత్యామ్నాయంగా, “ఇలా ఎక్కడా జరగదు” అనే పాఠకుడు కూడా ఆకథని వాస్తవదృష్టితోనే చూస్తున్నాడు అన్నాను. అయితే, నమ్మలేకపోవడం అతని ఇష్టం. ప్రపంచంలో తనకి తెలీని మనస్తత్త్వాలు ఉంటాయి. తను ఊహించలేని సంఘటనలు ఇంతటి విశాలప్రపంచంలో జరగడానికి అవకాశం వుందని నమ్మకపోవడానికి అతనికి హక్కువుంది. లేదా రచయిత పాఠకుడిని నమ్మించడంలో విఫలుడు అయేడనుకోవచ్చు.

రచయిత కూడా మనిషే. ఎవరైనా వస్తున్నారంటే, ఇల్లు నీటుగా సర్దుతాం, మనం నీటుగా ముస్తాబవుతాం. అలాగే, రచయిత కూడా తనని తానెప్పుడూ బేషరతుగా బట్టబయలు చేసుకోడు. కథల్లో తనరూపం తొంగిచూసినప్పుడు కూడా జాగ్రత్త పడతాడు. మరోలా చెప్పాలంటే, కథకుడు రచయితయొక్క ఆల్టర్ ఈగో అనుకోవచ్చు. తన నిజస్వరూపం కంటే, తాను ఎలా వుంటే బాగుండును అనుకుంటాడో అలాటి రూపం చిత్రించడానికి ప్రయత్నిస్తాడు, తెలిసో, తెలియకో.  ఉదాహరణకి వేరే వారికథ తీసుకు చెప్తే ఏం తంటాలొస్తాయో…అంచేత నాకథే తీసుకుందాం. రచయితకి కోపం ఎక్కవ  కనక కోపంకథ రాయడం జరిగింది. అయితే, అందులో కూడా రచయిత జాగ్రత్త పడడం -పాఠకులకి సానుభూతి కలిగేలా రాయడం -కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, రచయితకి కథ చెప్పడంలో కూడా “అబ్భ ఎంత చిత్తశుద్ధి, ఎంత నిజాయితీ” అనిపించుకోవాలన్న రహస్యకోరిక కూడా వుండొచ్చు. అలాగే నేను నాకథల్లో సోగకనులతో, సొట్టబుగ్గలతో, పచ్చని పసిమిరంగులో పొడుగ్గా, హుందాగా స్త్రీలని చిత్రిస్తే నేను అందంగా, పొడుగ్గా, హుందా వున్నానని మీరు అనుకోరు కదా. గమనిక – ఇది నేను అనేక బృహద్గ్రంథాలు చదివి, తరిచి చూసి తెలుసుకొన్న ఘనతర జీవనసత్యం కాదని ముందే చెప్తున్నాను. ఇది నా నాటు సైకాలజీ పాఠం.

సరే, ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్నలు చూద్దాం.

1. మామూలుగా ఒక కథ, మంచికథ, చదవగానే పాఠకుడికి రచయిత కథలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తాడా?

2. ప్రథమ పురుషలోనో, ఉత్తమపురుషలోనో కథ చెపుతున్నప్పుడు కథనంలో తేడా వుంటుందా? రచయిత తనకకథకి ఏది అనుకూలం అని ఎంచుకోవలసివచ్చినప్పుడు, ఆఎంచుకోడానికి కారణాలు ఏమయి వుంటాయి?

3. రచయిత తనవి కాని అభిప్రాయాలు,, లేదా పరస్పర భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చినప్పుడు చిత్తశుద్ధి లేనివాడు, ఆయనకి confusion అనొచ్చా?

మొదటి ప్రశ్న తీసుకుందాం. స్థూలంగా విషయం చర్చకి వచ్చినప్పుడు రచయిత వేరూ, కథకుడు వేరూ అన్నది అంగీకరించడం తేలిక. కానీ కథ చదువుతున్నపుడు మాత్రం “ఇదుగో ఇక్కడ ఆవిడే”, “అదుగో అక్కడ ఆయనే” అని పాఠకుడికి అనిపిస్తుంది. అది ఎందుకు, ఎలా జరుగుతుంది అన్నదే సందేహం.

“యజ్ఞం” కథలో సీతారాముడు కొడుకుని క్రూరంగా నరికేస్తాడు. ఆకథ చదివినతరవాత పాఠకులలో ఎంతమంది రచయితని పరమక్రూరుడు అనుకున్నారు? నాకు తెలిసినంతవరకూ రామారావుగారిని ఎవరూ అలా అనలేదు. సంఘటనగురించి మాత్రం చాలానే చర్చ వచ్చింది. అంతటి భీభత్సం అవుసరమా అని చాలామందే అడిగేరు. అంటే ఇక్కడ రచయిత వేరూ కథకుడు వేరూ అని అంగీకరించడం జరిగిందన్నమాటే కదా.

నాప్రతికథలోనూ నాఅనుభవమో, నాకు తెలిసినవారి అనుభవమో, నేను విన్న విషయమో వుంది. “పెంపకం”లో నాలుగేళ్ల కొడుకుని ఏ తండ్రి సముద్రం అంటే భయం పోగొట్టడానికి, అలలదగ్గరకి బలవంతంగా ఈడ్చుకెళ్లడం నేను నిజంగా చూసినసంఘటన 45 ఏళ్లకిందట. మిగతాదంతా కల్పితమే. “ప్రాప్తం” కథలో పనిపిల్ల మాచెట్టు సంపెంగపూలు అడగడం నిజంగా జరిగింది. మిగిలినకథ అంతా కట్టుకథే. ఇలా అన్ని కథలకీ చెప్పగలను. అయితే, మనం ఇక్కడ గమనించవలసినది – ప్రతిసారీ ఒక అనుభవం ఒకకథకి నాంది అయింది కానీ ఏ కథలోనూ ఆ ఒఖ్ఖఅనుభవమే కథ అయిపోలేదు. ఇంకా చాలా సంగతులు – ఊహించినవీ, మరోసందర్భంలో జరిగినవీ కలిసి కథ అయింది.

రచయిత వ్యక్తిగతంగా పాఠకుడికి పరిచయమయి వుంటే “నాకు తెలుసు, ఇది నిజమే” అనిపించడం సహజం. నన్ను తెలిసినవాళ్లకి చాలామందికి “పెద్దతనం”కథ చదవగానే నేనే గుర్తొచ్చాను. కానీ రజని పాత్రలో తమని తాము చూసుకున్నామని నాతో నలుగురు అన్నారు. రజని నేను కాదు కదా. అంటే నాకథలో నిజం కానివి చాలా వున్నాయి. కథగా మలచడంకోసం అలా చేసేను. అది మళ్లీ నేనే చెప్పవలసిరావడం నాదురదృష్టం.

రెండురోజులకిందట Flannery O’Conner కథలపుస్తకం చదివేను. ముందుమాటలో ఓ’కానర్ తనరచనలగురించి చెప్పినవాక్యం ఇక్కడ గమనార్హం – “నేను ఎందుకు రాస్తున్నానంటే, నాకు అర్థం కానివిషయాలు నాకు నేను స్పష్టం చేసుకోడానికి” అంటుందామె. నా “పెద్దతనం” కథ అలాటిదే. నాకు స్పష్టం కాని కొన్నివిషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం అది. పునరుక్తి దోషమే అయినా మళ్లీ చెప్తాను. ఏకథా ఎప్పుడూ నూటికి నూరుపాళ్లూ రచయిత కథే అవదు. అఖరికి ఆత్మకథల్లో కూడా వాళ్లు ఏఅంశం ఆవిష్కరించదల్చుకున్నారో దానికి తగ్గట్టుగానే సంఘటనలూ, సన్నివేశాలూ, పాత్రలూ ప్రవేశపెట్టడం జరుగుతుంది కానీ అనుక్షణం తామేం చేశారో చెప్పరు. చెప్తే అది చదవడానికి చాలా చిరాగ్గా వుంటుంది.

పదిరోజులక్రితం రెబెకా హార్డింగ్ డేవిస్ రాసిన “Life in the Iron Mills” అన్న కథ చదివేను.  ఆమె సంపన్నకుటుంబంలో పుట్టింది. స్వయంగా కూలీలతో ఎలాటి పరిచయమూ లేదు. అయినా, వారి బతుకులు ఎంత నికృష్టమయినవో హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించగలిగిందామె ఆకథలో. అలా రాయడానికి రచయితకి అంతర్దృష్టి వుండాలి అంటుంది ఆకథమీద వ్యాఖ్యానిస్తూ టిల్లీ ఓల్సన్ అన్న మరొక ప్రముఖ రచయిత్రి. (ఈకథమీద నేను రాసిన పూర్తి వ్యాసం పుస్తకం.నెట్‌లో చూడండి).

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, రచయిత రాసిన ప్రతివిషయం అతని ప్రత్యక్ష అనుభవమే కానక్కర్లేదు. కథనం పాఠకులని కదిలించేలా వుండాలి. అంటే తానొక్కడికే కాక, మరో పదిమందికి కూడా అతనికి తోచినట్టో, తద్భిన్నంగానో ఏదోరకంగా కదిలించేదిగా వుండాలి. పాఠకుడు కథాంశాన్ని తమకో, తనకి తెలిసిన మరొకరికో అన్వయించుకోగలిగితేనే అది కథగా రాణిస్తుంది. అలా కథ చెప్పగలిగినప్పుడే ఆకథకి సాఫల్యం.

ఇక్కడే రచయితా, కథకుడూ వేరు పడడం జరుగుతుంది. అంటే ఏకథగానీ రచయిత అనుభవంతోనో, అనుభూతితోనో మొదలవుతుంది. ఆతరవాత కథ మలిచేతీరులో ఇతరపాత్రలతోపాటు కథకుడిని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది.

కథకుడు కథలో ఒక పాత్ర. అతను కథలో తన ఇష్టం వచ్చినట్టు వదరవచ్చు. ఒకపాత్రని సమర్థించవచ్చు. మరోపాత్రని దూషించవచ్చు. ఏపాత్రతో కథకుడికి సానుభూతి వుంటుందన్నది రచయిత నిర్ణయిస్తాడు. కానీ రచయితకి కూడా అదే సానుభూతి వుంటుందా అంటే వుండితీరాలన్న నియమమేమీ లేదు.

అది కథని మలిచినతీరులో తెలుస్తుంది సూక్ష్మంగా పరిశీలిస్తే. అంటే ఒకకథలో రెండు కోణాలు ఆవిష్కరించవలసివచ్చినప్పుడు, రచయితకి రెండుకోణాలూ ఆవిష్కరించగల సౌలభ్యం వుంది. కథకుడికి లేదు.  అలాటి సందర్భాలలోనే, రచయితని అపార్థం చేసుకునే అవకాశం వుంది. అంటే కథలో ఒకవాక్యం తీసుకుని, ఇది రచయిత అభిప్రాయం అనడం తగదు. పాత్రలచేత పలికించిన పలుకులన్నీ రచయితపలుకులు కావు. ఆమాటలు ఆయా పాత్రలకే పరిమితం.

ఇక్కడే ప్రథమ, ఉత్తమపురుషలగురించి మాటాడాలి. రచయిత ఉత్తమపురుషలో రాయాలన్న నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడు? ఆనిర్ణయానికి కారణాలు ఏమయివుంటాయి?

నేను నాలుగో అయిదో కథలు ఉత్తమపురుషలో రాసేను. కొన్నికథల్లో కథకుడు పురుషుడు, కొన్నిట్లో స్త్రీ. సాధారణంగా కథలు ఆనాటి వాతావరణాన్ని ప్రతిఫలిస్తాయి కదా. 60వ దశకంలో రాసిన కథలు తీరుతెన్నులు చూద్దాం మొదట.

“వానరహస్తం” కథలో రెండు వాక్యాలున్నాయి. ఒకటి – “ఆకళ్లు, వాటినిండా నీళ్లు” అనుకుంటాడు ప్రధానపాత్ర ఆఫీసులో తనకింద పనిచేస్తున్న సావిత్రిగురించి. రెండోది, “కల్లూ ఒల్లూ తిప్పుకుంటూ కబుర్లు సెప్పే ఆడకూతురని ఆయమ్మనొగ్గేసి, ఆ ఆఫీసరుబాబు నాకొడుకు పొట్ట కొట్టీసినాడు” అంటుంది ఉద్యోగం పోయిన పనివాడి తల్లి. ఈరెండు వాక్యాల్లోనూ ఆఫీసరుబాబు ఆమెని ఒక గుమాస్తాగా కాక స్త్రీగా చూస్తున్నాడు అని కథకుడి వ్యాఖ్యానం. సాధారణంగా మగవాళ్లనిగురించి జనసామాన్యంలో వుండే అభిప్రాయాలు అవి. (సెక్సిస్టు అభిప్రాయాలే) ఆవాక్యాలు విన్నప్పుడు ఎలాటి స్పందన పాఠకుడిమనసులో కలుగుతుందో ఆస్పందనకోసం రచయిత వాటిని వాడుకోడం జరిగింది. ఆకారణంగానే మొత్తం కథ అంతా మగవాడు ప్రధానపాత్రగా చిత్రించడం జరిగింది. ఈకథ ఉత్తమపురుషలో రాయడంవల్ల అతని అంతర్మథనం అవిష్కరించడానికి సాధ్యం అయింది.

అలాగే, “జీవనమాధుర్యం”లో ఒకచోట “ఆడదాన్లా అంత పగేమిట్రా నీకు అంటుంది అమ్మ. మగవాడికి రాగద్వేషాలుండవు కాబోలు” అంటాడు ప్రధానపాత్ర. అంటే మగవాడికి కూడా రాద్వేషాలు వుంటాయని కథకుడి వ్యాఖ్యానం. ఇది కూడా సెక్సిస్ట్ వ్యాఖ్యానమే మరి. ఇలా వాడుకలో వున్న అభిప్రాయాలని పాత్రోచితంగా రచయిత వాడుకోడం పాత్రచిత్రణకోసమే అనాలి కానీ తన వ్యక్తిగతమయిన అభిప్రాయాలు తెలియజేయడానికి అని కాదు.

“కాశీరత్నం”కథలో ఆనాటిచదువులమీద వ్యాఖ్య పరోక్షంగా వుంది. “కాలేజీచదువులు చదువుకున్నవాడిచేత” “ఓనమాలు దిద్దనివాడు కాజాలు తినిపించేడు” అని. ఆరోజుల్లో ఆడపిల్లలకి అట్టే చదువుల్లేవు కానీ చదువుకోవాలన్న తృష్ణ వుంది. అది జరగనప్పుడు చదువుకున్నవాళ్లని హేళన చేయడం జరుగుతుంది. ఆవిషయం చెప్పడానికి, అంత చిన్నవిషయంకోసం, అంత పెద్దకథ అల్లవలసివచ్చింది! ఈకథలో కూడా నిజంగా వున్నది విశాఖపట్నంలో మాగేటునానుకుని కన్నులపండుగా ఎదిగిన కాశీరత్నంపొద ఒక్కటే. మిగతాదంతా కల్పనే.

అంటే నేననడం ఒకొకసారి రచయిత అభిప్రాయాలు అవి కాకపోయినా, జనసామాన్యంలో వాడుకలో వున్న అభిప్రాయాలని కథలకోసం వాడుకోడం జరుగుతుంది అని. అంచేత అవన్నీ రచయితవే అనడం తగదు. (ఇలా చెప్పడానికి వీలుంటుందనే నాకథలే ఎంచుకుంటున్నాను ఉదాహరణలకి.)

“విషప్పురుగు” ఉత్తమపురుషలో రాయడానికి కారణం నేను లైబ్రరీలో పని చేసేరోజుల్లో అక్కడ పనిచేసే ఒక ప్యూన్ పాములు పట్టేవాడు కావడం కావచ్చు. ఒకరిద్దరు పాములు పట్టేవాడని కొంచెం తేలిగ్గా మాట్లాడడం కావచ్చు, మామూలుగా ఆఫీసుల్లోనూ, స్కూళ్లలోనూ చాలామంది రూళ్లు పాటించరు. బాగా పని చేసేవాళ్లు కూడా సమయానికి రాకపోవడం, ఒకపని చెప్తే మరోపని చెయ్యడంలాటివి నాఅనుభవంలో చాలాసార్లు జరిగేయి. మెమోలు పట్టించుకోనివాళ్లని చాలామందినే చూసేను. ఇవి నాకు వ్యక్తిగతంగా బాధగా వుండేవి. ఒక పక్క బాగా పనిచేస్తున్నవాళ్లు మరోపక్క రూళ్లదగ్గరకొచ్చేసరికి మాత్రం వాటిని తేలిగ్గా తోసిపారేయడం – అది ఎలా చక్కబెట్టాలో తెలీక, కథ రాయబోతే ఉత్తమపురుష వచ్చిందనుకుంటాను. దానికి తోడు మానాన్నగారు హైస్కూల్ హెడ్‌మాస్టరు కనక ప్యూన్లతో “వేగడం”, బదిలీలు, ఇవన్నీ నాకు సువిదితమే. అంతే తప్ప మిగతా కథంతా కల్పితమే.

ఇప్పటివరకూ చర్చించినవిషయాలు చాలనుకుంటాను మూడో ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. రచయిత తనకథల్లో పరస్పర భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చినంతమాత్రాన నిజాయితీలేని రచయితగా ముద్ర వెయ్యడం తగని పనే నన్నడిగితే. వస్తువైవిధ్యం రచయిత ప్రతిభకి తార్కాణం. ఏ అభిప్రాయాన్ని తీసుకున్నా దాన్ని నమ్మదగ్గట్టుగా ఆవిష్కరించగలగడం అంత తేలిక కాదు. సమర్థుడూ, భావుకుడూ అయిన రచయితకి మాత్రమే అది సాధ్యం. అనేకరకాల ఇతివృత్తాలని తీసుకుని, అనేక రకాల వ్యక్తిత్వాలు సృష్టించి, వాటికి న్యాయం చేకూర్చినప్పుడే రచయిత ప్రతిభ వెల్లడి అవుతుంది.

ఇది దృష్టిలో వుంచుకుని కథ చదివినప్పుడు, ఆకథలో రచయిత వ్యక్తిత్వాన్ని “చదవడం” అప్రమత్తతతో చెయ్యాలని అర్థమవుతుంది. లేకపోతే తోకో, తొండమో చూసి ఏనుగుబొమ్మ గీయడంలాటిదే కథ చదివి రచయిత తత్త్వం తెలిసిపోయిందనుకోడం. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, వెయ్యి ముక్కలున్న జిగ్ సా పజిల్లో ఒక ముక్క తీసుకుని మొత్తం బొమ్మ అంతా ఊహించడానికి ప్రయత్నించడంలాటిదే అనిపిస్తుంది నాకు.

రచయితా కథకుడూ రెండోభాగం

(19 డిసెంబరు 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “రచయితా, కథకుడూ”

 1. @ భావనా, ” రచయత అవ్వాలంటే ఇన్నివిషయాలు తెలియాలా అనిపించాకా” – అయ్యో లేదండీ ఇదంతా ఒక academic exercise. మీరన్నట్టు ఒకొకప్పుడు కాసింత కుతూహలం కలగొచ్చు ఈకథకి ప్రేరణ ఏమిటి అని. రచయితగురించి పాఠకుడికి తెలియక్కర్లేదు. ఈమధ్య వస్తున్న కొన్ని వ్యాఖ్యలదృష్ట్యా ఇది రాసేను. ముఖ్యంగా ఒకకథలో పాత్రలని ఫలానా ఫలానా అని గుర్తు పెట్టి వ్యక్తిగతమయిన వ్యాఖ్యానాలు చేసినప్పుడు, రచయితకి పాఠకులు కథలో ప్రధానాంశాన్ని గ్రహించలేదని నిరుత్సాహం కలుగుతుంది. ఎందుకొచ్చిన సంత అని రచయిత రాయడం మానేయడం కూడా జరగొచ్చు. అదీ నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించింది.
  ఇది మీలా ఆలోచించేవారికి అనవసరం. నిజానికి నేనూ అంతే. అంచేత ఈసంగతులు వదిలేసి మీరు మామూలుగా చక్కగా రాసుకోండి. :))

  మెచ్చుకోండి

 2. మాలతి గారు. చాలా రోజుల తరువాత వచ్చి బ్లాగ్లోకం లో కి మళ్ళీ చదువుతున్నా. నా వరకు నేను చాలా సామాన్య పాఠకురాలిని. రచయత ను కాదు. రచయత అవ్వాలంటే ఇన్నివిషయాలు తెలియాలా అనిపించేక నా బ్లాగ్ లో రాయాలన్నా భయం గా వుంది. 🙂 సరే అది పక్కన పెడితే అసలు ఒక రచన చదివి రచయత నెందుకు నిర్ణయించాలి అనుకోవటం నాకు అర్ధం కాలేదు? మనకు తెలియని విషయాలను మన పరిధి లో లేని విషయాలను చెప్పేటప్పుడు ఒక్కోసారి కూసంత కుతూహలం కలుగుతుంది రచయత ఏ విలువలను ఆధారం చేసుకుని రాసేరో అని. కాని మన పరిధి లో లేని విషయాలను ఒప్పుకోవటానికి మన అప్పటి మనః పరిస్తితులను మన కోసం మనం నిర్వచించుకున్న విలువలను బట్టి కొంత, కొంత ఆ రచయత ఎంత కన్విన్సింగ్ గా చెప్పేరు అనే దానిని బట్టి వుంటుంది కదా. అసలు రచయత పర్సనల్ తో మనకు సంభధం వుంటుందా? వుండాలా?

  మెచ్చుకోండి

 3. సురేష్, ఇతర రచయితలు ఇది చదివినప్పుడు వారి అభిప్రాయాలను తెలుసుకొవాలని ఉంది. – అవునండీ నాక్కూడా తెలుసుకోవాలని వుంది. రచయితలూ, పాఠకులూ కూడా మరిన్ని అభిప్రాయాలు రాస్తే బాగుండు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. భళా మాలతి గారు,
  మీ రచన అద్భుతం రచయిత మనొ భావలు వెనుక నిగూడ రహస్యన్ని బట్టభయలు చేసారు . ఇధి మీ సూక్ష్మ పరిశీలనకి పరిణతికి నిదర్శనం. నేను చాలా రచనలు చదువుతూ ఉంటాను అప్పుడు అప్పుడు నాకు కూడ చాలా సార్లు అనిపించేది రచయితకి ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది అని ఇప్పుడు నాకు అర్థం అయ్యింది.కాని నిజానికి ఇతర రచయితులు ఇది చదివినప్పుడు వారి అభిప్రాయాలను తెలుసుకొవాలని ఉంది.

  మెచ్చుకోండి

 5. @ భావన, మీ చప్పట్లు అందుకున్నాను. మరి మీ మరోకామెంటుకోసం ఎదురుచూస్తున్నాను. 🙂
  @ కల్పనా, – ఏనుగే అయివుంటుంది అని మొదట వూహించి తర్వాత తొండం వుండే వుంటుందని తీర్మానిస్తారు. – అద్భుతం. ధన్యవాదాలు
  @ వైదేహి, మూలభావాన్ని మరోసారీ చక్కగా, సూక్ష్మంగా సమీకరించినందుకు ధన్యవాదాలు.
  @ కొత్తపాళీ, అవునండీ, పాఠకులకోసమూ, నాకోసమూను. మరి మీకథలు నాకు ఇస్తే కదా, నేను ఉపయోగించుకోగలిగేది, ఇంతవరకూ నేను చదివినవి, తుపాకీ, రాజకీయప్రేమకథా అనుకుంటా…

  మెచ్చుకోండి

 6. చాలా మంచి విశ్లేషణ మాలతిగారూ. కథా రచయితలకంటే కథా పాఠకులకి పనికొచ్చే వ్యాసం.
  కొన్నాళ్ళ క్రితం ఏదో గుంపు చర్చలో .. ఆంగ్లంలో నేరేటర్ అనే పదాణికి తెలుగులో ఏమనాలా అని బుర్రబద్దలు కొట్టుకున్నాం. మీరు పైన వాడినట్టు కథకుడు అనే వాడుక ఖాయం చేసెయ్యొచ్చు.
  మరోమాట .. ఇలాంటి విశ్లేషణలకి ముడి సరుకు అవసరమైతే మీరు నిస్సంకోచంగా నా కథలు వాడుకోవచ్చు, పనికొస్తాయనుకుంటే.

  మెచ్చుకోండి

 7. సాహిత్య ప్రక్రియ ఏదైనా,కధ కానీ,కవిత కానీ రచయిత ప్రత్యక్ష/ పరోక్ష అనుభవాలు లేదా ఆ అనుభవాలకు రచయిత తాలూకు స్పందన అని నాకనిపిస్తుంది. జీవితానుభవాలు మనందరికి ఇంచుమించుగా ఒకటే.అవి మన ప్రత్యక్ష అనుభవాలు కావచ్చు. లేదా పరోక్షంగా మన అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు.అయితే ఎవరి అనుభూతులు వారివి.ఆ జీవితానుభవాలకు స్పందించే తీరు లో ఎవరి ప్రత్యేకత వారిది. వాటిని రచయిత గొప్ప సృజనాత్మకతతో చిత్రీకరిస్తే మీరన్న “సార్వజనీనత” ఆ రచనకు
  కలుగుతుంది.అయితే కధలోని ప్రతి విషయాన్ని రచయితకు ఆపాదించలేము/ఆపాదించకూడదు కూడా.అలాగే రచయిత పూర్తిగా తెరవెనుక ఉండటం కూడా ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. ఈ విషయాలు ఏవీ ఒక కధ స్థాయిని,రచయిత నైపుణ్యాన్ని అంచనా వేసేటప్పుడు మాత్రం పరిగణనలోకి రావనే అనుకుంటున్నాను.

  మొత్తానికి నాలాంటి బద్దకస్తుల చేత కూడా ఇంత పెద్ద కామెంట్ పెట్టించారు. 🙂

  వైదేహి

  మెచ్చుకోండి

 8. అబ్బ ఎంత బాగా విశ్లేషించారు మాలతి గారు. మళ్ళోక రెండు సార్లైనా చదివి పూర్తి గా సారాంశాన్ని ఎక్కించుకుని అప్పుడూ ఇంకో కామెంట్. అందాక ఈ చప్పట్లను నా జ్నాపకాలు గా అట్టే పెట్టుకోండి. చప్పట్లోయ్ చప్పట్ళు..

  మెచ్చుకోండి

 9. “ఇది దృష్టితో పెట్టుకుని కథ చదివినప్పుడు, ఆకథలో రచయిత వ్యక్తిత్వాన్ని “చదవడం” అప్రమత్తతతో చెయ్యాలని అర్థమవుతుంది. లేకపోతే తోకో, తొండమో చూసి ఏనుగుబొమ్మ గీయడంలాటిదే కథ చదివి రచయిత తత్త్వం తెలిసిపోయిందనుకోడం.”

  హాహాహా..” తోకో, తొండమో చూసి “…అవి కూడా చూడరు కొందరైతే…బహుశా ఏనుగే అయివుంటుంది అని మొదట వూహించి తర్వాత తొండం వుండే వుంటుందని తీర్మానిస్తారు.

  ఎప్పటిలాగానే వివరం గా చెప్పారు.

  కల్పనా

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s