రచయితా, కథకుడూ రెండోభాగం.

 

ముందు టపా “రచయితా, కధకుడూ” రాసినప్పుడు అది పొడిగించాలనుకోలేదు కానీ కొత్తపాళీ “నాకథలు కూడా ఉపయోగించుకోండి” అన్నతరవాత నాకు మరో ధర్మసందేహం ఎదురయింది.

 నాకథ కాకుండా వేరొకరికథ తీసుకుంటే నాఆలోచనలు ఎలా వుంటాయో అని. ఇవి పాఠకులందరికీ, రచయితలందరికీ సర్వసామాన్యం అనడం లేదు. ఇక్కడ కేవలం నాదృక్పథం  మాత్రమే వివరిస్తున్నాను.

నేను నాకథలే ఉదాహరణగా తీసుకున్నప్పుడు నేనే రచయితని కనక, నేనేం రాసేనో ఎందుకు రాసేనో, అందులో నిజానిజాలేమిటో నాకు తెలుసు. రచయిత తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించగలను. ఇంకో రచయితకథ తీసుకుని రచయితనీ, కథకుడినీ వేరువేరుగా గుర్తించడం వీలవుతుందా? వీలయితే, ఎలా చేస్తాం?

ఎక్కడో చదివేను మనిషికి మూడు కోణాలుంటాయని – ఒకటి లోకానికి కనిపించే వ్యక్తి, రెండు తనకి కనిపించే తను (తనని తాను ఎలా ఊహించుకుంటాడో అది), మూడు అతని నిజస్వరూపం. ఈమూడో కోణంలో చేతనాచేతనావస్థల్లో తాను ఒప్పుకోని అంశాలు వుంటాయంటారు పండితులు. రచయితకి మరో కోణం వుందనిపిస్తోంది నాకు. తనని ఎలా జనాలు గుర్తించాలని కోరుకుంటాడో ఆఅవతారం – కథల్లో కనిపించే నాలుగోముఖం. 

కథలవెనక, కలంవెనక, నీలితెరలవెనక దోబూచులాడుతున్న ఈ శాల్తీ గురించి, పాఠకులకి కుతూహలం కలగడం సహజం. నాకూ అంతే. మామూలుగా నేను ఏ పత్రికో, సైటో చూస్తే, రచయిత పేరు చూస్తాను. తరవాత ఏం రాసేడా అనీ ఆతరవాత శీర్షికా చూస్తాను. అది నాదృష్టిని ఆకట్టుకోగలిగితేనే చదువుతాను. 

కొత్తపాళీ అనుమతించేరు కనక ఆయనకథే “తుపాకీ” తీసుకుని చూద్దాం. హెచ్చరికః ఇక్కడ నాచర్చ కేవలం కథలో రచయితా, కథకుడూ అన్నవిషయానికే పరిమితం. “తుపాకీ” మంచి లేక గొప్పకథ అవునా కాదా అని నేను చర్చించడంలేదు.

ముందు రచయితగురించి చెప్తాను. కొత్తపాళీతో నాకు ముఖాముఖి పరిచయం లేదు కానీ ఫోనులో మాటాడుకున్నాం. ఆయన కథలు రెండు చదివేను. బ్లాగులద్వారా కొంత తెలుసుకున్నాను. అమెరికాలో వున్నారు.  “బ్లాగులందు తెలుగుబ్లాగులు వేరయా”, “ఇంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు ప్రచురించను” లాటి వాక్యాలవల్ల తెలుగంటే ఆయనకి చాలా అభిమానం అనుకుంటున్నాను. బ్లాగులోకంలో విశేషంగా ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. వర్థమానబ్లాగరులకి సలహాలు ఇస్తుంటారు. అంచేత తెలుగుకథ తీరుతెన్నులంటే ఆయనకి మంచి అవగాహన వుంది అనుకుంటున్నాను. ఆయన ఇంజినీరు అని కూడా తెలుసు. ఆయన కథ చదువుతున్నప్పుడు నాకు యాంత్రికంగానే ఈస్పృహ మనసులో మెదులుతుంది. ఇక కథ చూద్దాం. 

కథలో ప్రధానంశం ఒక చిన్నపిల్లవాడు తుపాకీ అడగడం.

“నాన్నా! నాకు తుపాకీ కావాలి” అన్నాడు కిరణ్.

ఇది చదవగానే రచయితకి చిన్న అబ్బాయి వున్నాడు కాబోలు ఆనుకున్నాను. తరవాత తెలిసింది ఆయనకి వున్నది అమ్మాయిలనీ, వాళ్ల వయసు తొమ్మిది కాదనీ. తొలి “తప్పులో కాలేసిన” క్షణం అన్నమాట.   

పోతే, ఇలాటి సన్నివేశం – పిల్లలు తుపాకీలు కావాలనడం – అమెరికాలో వున్న ఏ తెలుగు కుటుంబంలోనైనా జరగడానికి అవకాశం వుంది. కానీ రచయితకి తొమ్మిదేళ్ల అబ్బాయి లేడు కనక, ఈ అనుభవం మరొకరిది అనుకోవాలి. లేదా, నిత్యా వింటున్న, చదువుతున్న వార్తలు చూసి, ఊహించివుండొచ్చు. అలాగే తండ్రీకొడుకులమధ్య సంభాషణలు కూడా ఊహించీ, ఇతరకుటుంబాల్లో విన్నవీ అయివుండాలి. అంటే ఇక్కడ రచయిత తనకి ప్రత్యక్షంగా అనుభవం కానిదాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అతనే  కథకుడు అనుకోడానికి లేదు.

 ఈకథలో తుపాకీతోపాటు ఇతర ఉపఅంశాలు కూడా చోటు చేసుకున్నాయి. – చిన్నపిల్లలచేతుల్లో తుపాకీలవెనక వారిసంస్కృతి, పిల్లల్లో “need to fit in, జాతి, వర్ణవివక్షతలు – ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అమెరికాలో తుపాకీల గురించి భారీఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిజానికి చర్చ అనడం కంటే సంఘర్షణ అనడం న్యాయం.

తుపాకీ కథ చిన్నపిల్లవాడికోణంలోనుండి మాత్రమే రాసివుంటే, కథకుడిమనసులో సంఘర్షణకి తావు లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఫిటిన్‌కోసం తపన నిజానికి ఒక్క పిల్లలకే కాదు పెద్దలకీ వుంది. ఉద్యోగాలకోసం అమెరికా వచ్చినవారందరికీ వున్న బాధే, భర్తలవెంట వచ్చిన భార్యలు కూడా భర్త నిలదొక్కుకుని ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే. ఆ ఫిటిన్‌లో సాయపడాలి. ఇలా చూసినప్పుడు, రచయిత కథకుడిద్వారా తనని బాధిస్తున్న ప్రశ్నలు కూడా చెప్తున్నాడేమో, రచయితా, కథకుడూ ఒక్కరేనేమో అనుకోడానికి ఆస్కారం వుంది. కానీ, తొందరపడి, ఇక్కడ కథకుడు రచయితే అని గట్టిగా అనలేను. రచయిత ప్రతికథలోనూ అవే అభిప్రాయాలు వెలిబుచ్చితే, అలా అనుకోవచ్చు కానీ ఒక్కకథ తీసుకుని ఒకనిర్ణయానికి రావడం తగదు. సాధారణంగా ఒకవాదాన్ని ప్రచారం చెయ్యడానికి రాసినకథల్లో అలా జరుగుతుంది.

మరొక చర్చనీయాంశం భాష. మొదట చెప్పేను కదా కొత్తపాళీకి తెలుగంటే ఇష్టం అని ఆయనబ్లాగు చూసి అనుకున్నాను. కానీ ఈకథ చదివినప్పుడు నాకు కాస్త నిరుత్సాహం కలిగింది. ఎంచేతంటే నేను తెలుగుపలుకుకోసం ఆరాటపడతాను. నేను తెలుగుకథలు చదవడం తెలుగు నుడికారంకోసమే. తుపాకీకథలో ఇంగ్లీషుమాటలు, వాక్యాలూ కోకొల్లలు. ఇంగ్లీషు అస్సలు వాడకూడదని కాదు కానీ శైలిదృష్ట్యా ఇంగ్లీషుమాటలు వాడడానికి ఒక కారణం వుండాలి. సందర్భశుద్ధి కావాలి. ఒక వాదన “ఇప్పుడు అందరూ అలాగే మాటాడుతున్నారు” అని. నావాదన – నాకు తెలుగు నుడికారాన్ని అందించేదే తెలుగుకథ. 

నేను ఇంగ్లీషు వాడే సందర్భాలు రెండు. మొదటిది – మససంస్కృతిలో లేని ఆచారాలు ప్రస్తావించినప్పుడు- ఉదాహరణకి, థాంక్స్, వాక్కి వెళ్లడం (వ్యాహ్యాళి అనొచ్చు కానీ పలకడమూ, రాయడమూ కూడా  కష్టమే), బట్టలు వాష్ చెయ్యడం (వాషర్‌లో). రెండోది హాస్యం, వ్యంగ్యం, లేదా మరో ఎఫెక్ట్‌కోసం (ఇక్కడ ఎఫెక్ట్ అన్నమాటకి తెలుగుమాట వుంటే నాకు గుర్తు రావడంలేదు. చూసారా!. ఇలాటిమాటలు ఏకథలోనైనా కనిపిస్తాయేమోనని కూడా తెలుగుకథలు చదువుతాను.).

సరే, మళ్లీ కథకి వస్తాను. తుపాకీకథలో శంకర్ కిరణ్‌తో మాటాడినప్పుడు చాలావరకూ ఇంగ్లీషే, మాటలే కాదు పూర్తివాక్యాలే వాడతాడు. కానీ రాజ్యలక్ష్మితో మాటాడినప్పుడు తెలుగే ఎక్కువ. కొన్నిచోట్ల మంచి జాతీయాలూ, (అచ్చ తెలుగుతిట్లూ) కూడా ఉన్నాయి. అంటే పాత్రలకి తగినట్టు కథకుడు పలుకుతున్నాడు అన్నమాట. అప్పుడు మరి తప్పనిసరిగా మనం రచయిత కథకుడికి వేరే భాష ఏర్పాటు చేసేడు అనే చెప్పుకోవాలి.

చివరిమాటగా, కథకుడూ, రచయితా వేరే అయినా, ఒకొకప్పుడు విడమర్చి చెప్పలేనంతగా మమైక్యం కావచ్చు ఇద్దరూ. పాఠకుడు తనమానసికస్థితినీ, పరిస్థితులనీ, తాను ఊహించుకున్న రచయితస్వభావాన్నిబట్టీ కథలో రచయితని చూడవచ్చు. అలాటప్పుడే రచయితకి లేని అభిప్రాయాలని అంటగట్టే ప్రమాదం వుంది. అలాగే, పాఠకుడికి రచయితతో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నప్పుడు కూడా అవగాహనస్థాయిలో తేడాలుంటాయి. 

తా.క. ఈ చర్చని తుపాకీ కథారచయిత కొత్తపాళీ తనబ్లాగులో కొనసాగించారు.  ఇక్కడ చూడండి.

(30 డిసెంబరు 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

20 thoughts on “రచయితా, కథకుడూ రెండోభాగం.”

 1. @Krishna prasad, మీరు దాదాపు అన్నివిషయాల్లోనూ నా, మరియు ఇతరవ్యాఖ్యాతల ఆలోచనలు అంగీకరించారు కనక నేను అధికంగా చేర్చవలసిందేమీ లేదు ధన్యవాదాలు చెప్పడం తప్ప. నాపుస్తకాలవివరాలకి లింకు ఇస్తున్నాను. http://www.thulika.net/BOOKS/books.html
  పోతే, రచయిత కావడానికి ఏం పుస్తకాలు వున్నాయో నాకు తెలీదు. నాకు తెలిసిన మంచి పద్ధతి మీకు నచ్చినకథలు, మీరు మంచికథలు అనుకున్నవి శ్రద్ధగా చదవడం, నిశితంగా వాటిగురించి ఆలోచించడం లాభదాయకం అని. ఆకథే మీరు రాస్తే ఎలా రాస్తారో ఆలోచించుకుంటుంటే కూడా మంచి ఆలోచనలు రావచ్చు. ఈవిషయమే ప్రధానంశంగా ఈమధ్యనే కల్పన రెంటాల కథానుభవం అన్న శీర్షికతో సీరీస్ ప్రారంభించారు. (kalpanarentala.blogspot.com)చూడండి. గుడ్ లక్.

  మెచ్చుకోండి

 2. మాలతి గారు! కాస్త ఆలస్యంగానైనా మంచి చర్చలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ముందు మీ రచనలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. కొని చదువుతాను.

  ఇక నా పేరు కృష్ణ. రచయితగా స్థిరపడాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఉద్యోగం చేస్తున్నాను.

  విషయానికి వస్తున్నా! “రచయిత, కథకుడు ఒకడేనా” అని నేను ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. మీ రెండు భాగాలు చదివాక చాలా విషయాలు తెలిసాయి.

  కథకుడు.. రచయిత యొక్క “ఆల్టర్ ఈగో” అన్నారు. నిజమే చెప్పారు. నేను ఒకదగ్గర కథకుడు.. రచయితకి ఎక్సటెన్షన్ అని చదివాను. మరో దగ్గర రచయిత తన నిజ జీవితంలో చేయలేనివి కథల్లో చేస్తుంటాడు అని చదివాను. ఇది నిజమే… ముఖ్యంగా ప్రేమ కథల్లో కథకుడు చేసేవన్నీ.. రచయిత చెయ్యాలనుకున్నవే! ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫైట్స్. కథల్లో నాయకుడు ఏమైనా చేసేస్తాడు.

  రచయిత రాసేవన్నీ తన అనుభవాలే అవ్వవలసిన పని లేదు. ఎందుకంటే నేను రాసే కథలన్నీ.. వేరే కథలు చదివినప్పుడు అందులో ఏదో ఒకటి స్పూర్తినివ్వడం వలన రాయడం జరిగింది. అన్నీ కాదులెండి. కొన్ని మాత్రం అలాగే రాసాను. మహేష్ గారు చెప్పినట్లు.. రచయిత తన మేధతో అనుభవించి రాస్తాడు అన్నారు. దానికి నేను అంగీకరిస్తున్నాను. ఇంక సుజాత గారు చెప్పినట్లు.. ఒక కథని రచయిత యొక్క రచనగా మాత్రమే చూడాలి అంతే తప్ప అతని నిజస్వరూపం గురించి కాదు.

  ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకలా ఉండవు. ఇంకా చెప్పాలంటే ఒక వారం తరువాత తన అభిప్రాయం తనకే ఉండదు… అని చదివాను. అలాంటప్పుడు రచయిత వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలనుకోవడం శుద్ధదండుగ. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది రచయిత రెండు కథల్లో రెండు రకాల అభిప్రాయాలు చెప్పొచ్చు. అది అతని ఇష్టం.

  ఇక మీరు చెప్పినట్లుగా.. కథకుడే రచయిత అని తెలిసిపోయే అవకాశం ఉన్నప్పుడు మాత్రం తను జాగ్రత్త పడతాడు. ఇలాంటప్పుడు నేను నా అభిప్రాయాలన్నీ వేరే పాత్రతో చెప్పిస్తుంటాను.

  చివరగా ఒక విషయం చెప్పండి. రచయిత అవ్వాలనుకునేవారికి ఏ పుస్తకాలు చదవాలో చెప్పండి.

  మెచ్చుకోండి

 3. @సుజాత, మీరు చెప్పినప్రతివాక్యంతో నేను ఏకీభవిస్తాను.
  @మహేష్ కుమార్, మీవాదన సమర్థనీయమే. “రచయిత కథకుడిగా మారితేనే అది జరుగుతుంది” – ఇది కథకి సంబంధించినంతవరకే. కానీ రచయిత వ్యక్తిగతజీవితానికి సంబంధించదు కదా. ఏమయినా మంచి చర్చే వచ్చింది. అందుకు సంతోషం.

  మెచ్చుకోండి

 4. ఫస్ట్ పర్సన్ లో రాసే ప్రతి కథా కథకుడి స్వీయానుభవం కానక్కర్లేదు. అలాగే పాఠకులు కూడా కథలో “కథకుడినే” చూస్తారు కానీ రచయితను కాదు.

  కథను బట్టి రచయిత నిజ స్వభావాన్ని అంచనా వేయాల్సిన అవసరం పాఠకులకు అవసరం లేని విషయం! అసలు రచయిత రచనను అతని రచనగా అంగీకరించాలి కానీ ఇందులో వాళ్ల నిజస్వభావం ఉందా లేదా అని చూడాలా? సిద్ధాంతాన్నో ఇజాన్నో ప్రతిపాదిస్తూ చేసే రచనలకు ఇది వర్తిస్తుందేమో గానీ అన్ని రచనలకూ కాదనుకుంటాను.

  రచనను బట్టి రచయిత బతుకుని స్వభావాన్నీ అంచనా వేయడం కుదరని పని! అవసరం కూడా లేనిపని!

  ఉత్తమ పురుషలో రాసే కథలు నాకు నచ్చుతాయి. అందులో నేను కథకుడినే చూస్తాను తప్ప రచయితను కాదు.

  మెచ్చుకోండి

 5. @మాలతి: “సాహిత్యం ఆకాలపు సమాజాన్ని చూసే ఒక విమర్శనాత్మక కోణం” అనే నిర్వచనాన్ని నమ్మగలిగితే, కథ కల్పన అయినా రచయిత తన మేధతో అనుభవించిన స్వీయానుభవంగా గుర్తించాల్సి వస్తుంది. గాల్లోంచీ కథలు పుట్టించేవాళ్ళ సంగతి పక్కనబెడితే,సామాజిక స్పృహవున్న ఏ రచయితైనా కథకుడు కావలసిందే! రచయిత తను అనుభవించిందే స్వీయానుభవం అనుకున్ననాడు సృజన ఆగిపోతుంది. తెలిసినవి,చూసినవి,విన్నవీ,ఇతరుల జీవితాల్లో పరికించినవీ,ఆలోచించినవీ, విమర్శనాత్మకంగా బేరీజు చేసినవీ అన్నీ స్వీయానుభవాలే. అవి స్వీయమైన అనుభవాలు. అంతే!

  రచయిత వ్యక్తిత్వంతో నిమిత్తం లేకుండా ఆ కథ చదివేసమయానికి పాఠకుడిని రచయిత “ఇది నిజం” అని భ్రమింపజేయలేకపోతే కథలు తే..లి..పో..తా..యి. ఒక pretentious rambling గా మిగిలిపోతాయి. రచనకూ పాఠకుడికీ మధ్యనున్న ఆ “భ్రమ”(illusion) చాలా అవసరం. అదే రచయితను కథకుడ్ని చేస్తుంది. రచయిత కథకుడిగా మారితేనే అది జరుగుతుంది.

  మెచ్చుకోండి

 6. @ కొత్తపాళీ, మీకు నేనే థాంక్స్ చెప్పాలి. మీధర్మమా అంటూ నాబ్లాగులో చలనం కలిగింది కాస్త. పోతే మీరన్నట్టు కథ మొత్తం చర్చించవలసిందే కానీ నేనిక్కడ ఇచ్చిన సూత్రాలతో కాదు. ఎవరికి తోచిన కోణంలో వారు చర్చించడమే బాగుంటుంది. మీవ్యాసంకోసం ఎదురు చూస్తుంటాను.
  @ మహేష్, అదేనండీ నాకూ తెలియడంలేదు. కొ.కు.అంతటి మహారచయితలమాట నేను చెప్పలేను కానీ, నాలాటి చిన్నరచయితలు ఏం రాసినా, అదుగో అది మీకథే అని ఒక సాధారణీకరించినప్పుడు నాకు నచ్చడంలేదు. ఈవ్యాసానికి మూలం అదీ.
  తాజాకలం, మళ్లీ ఆలోచిస్తే మరోవిషయం తట్టింది. కొ.కు. లాగ ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి రాస్తారు కనక వారి రచనల్లో వారి వ్యక్తిత్వాలు స్పష్టంగానే తెలుస్తాయి. కొందరు మాత్రం చెప్పేదొకటీ, చేసేదొకటీ అయినప్పుడు, వాళ్లని ఎలా అంచనా వెయ్యాలో తెలీదు. నేను వాటిని చిత్తశుధ్ధి లేని రచనలు అంటాను. అలాటప్పుడు ఆమనిషితత్త్వం కనుక్కోడం, అసలు స్థిరమయిన తత్త్త్వం అంటూ వుంటే.
  @ కల్పన, నాకు కూడా అదే సమస్య. కథకి ప్రేరణ ఏమిటి అనడం వేరు, రచయిత బతుకు ఇదే అనడం వేరూ..
  ఏదో నాకు అస్సలు పరిజ్ఞానంలేని విషయం కెలికినట్టున్నాను. :0

  మెచ్చుకోండి

 7. నా కథ గురించి చర్చ లేవనెత్తినందుకు బోలెడు థాంకు్లు మా్లతి గారూ. ఈ కథలో ఉత్తమ పురుష కథనం లేదు గనక ఆ పాయింటు ప్రస్తుతానికి అప్రస్తుతం అని నా అభిప్రాయం.
  ఈ కథ జాలంలో ఎలాగూ అందుబాటులో ఉంది గనక ఆసక్తి ఉన్న వారు కథ చదివి, ఇక్కడ మాలతి గారు ప్రతిపాదించిన సూత్రాలతో అన్వయించి తమ అభిప్రాయాల్ని చెబితే చర్చ రసవత్తరంగా ఉంటుంది, రచయీగా నాకూ ఉపయోగపడుతుంది.
  కథ ఇక్కడ చదవచ్చు.
  రచయితగా ఈ కథ గురించి నా వుద్దేశాలు ఇంకో వారం పది రోజుల్లో చెబుతాను. ఈ లోపల ఇంకొంచెం చర్చ జరుగుతుందేమోనని కూడా ఆశ.

  మెచ్చుకోండి

 8. ” రచయిత స్వీయానుభవం అని భ్రమింపజెయ్యగలిగితే పాఠకుడికి మరింతగా చేరువవ్వడం మట్టుకు ఖాయం. ”

  మహేష్, అన్నీ రచయత అనుభవాలు అవవు కదా. అలాగే ఒక కథ ద్వారా రచయత నిజ స్వభావం (?) తెలుసుకోగలామా? అసలు తెలుసుకోవటం అవసరమా?

  మెచ్చుకోండి

 9. @మాలతి: “నిజస్వభావం” చాలా చిక్కు విషయం లేవనెత్తారు.
  ఉదాహరణకు మనకున్న ఉత్తమ కథకుల్లో ఒకరైన ‘కొకు’గారిని తీసుకుంటే తను రాసిన కథలన్నీ మధ్యతరగతి కథలు.సాధారణ మనుషుల కథలు. కుటుంబాల్లో,మానవసంబంధాల్లో జరిగే కథలు. కానీ వ్యాసాలు,సమీక్షలూ,లేఖలూ వామపక్షభావజాల దృక్పధాన్ని కలిగుంటాయి.చాలాసార్లు అత్యంతతీవ్రమైన పదజాలాన్ని కలిగుంటాయి. మరి ఆయన “నిజస్వభావాన్ని” ఎలా అంచనావెయ్యగలమంటారూ!?

  మెచ్చుకోండి

 10. @ మహేష్, రచయిత స్వీయానుభవం అని భ్రమింపజెయ్యగలిగితే – ఇది వేరండీ. పాఠకుడిని నమ్మించేలా రాయడం శైలికి వర్తిస్తుంది. నేను ఆలోచిస్తున్నది పాఠకులు ఎంతవరకూ రచయిత నిజస్వభావాన్ని కథనుండి గ్రహించగలరు అని.

  మెచ్చుకోండి

 11. @మాలతి: అది కథాధర్మాన్ని బట్టి ఉంటుంది. ఒక అమెరికాంధ్రుడు అక్కడి పరిస్థితులలో జరిగిన కథ రాశాడనుకుందాం. అందులో వేరేపాత్రలున్నా కొంత స్వీయానుభవాన్ని “పరిస్థితుల” రూపంలో కల్పించి రచయిత కొంత స్టాండ్ తీసుకుంటే…అప్పుడు సాధికారత సహజంగానే పెరుగుతుంది.పాఠకుడి విశ్వసనీయత హెచ్చుతుంది. అదే కథను హైదరాబాద్ లో ఉన్న రచయిత రాశాడనుకోండి, ఆ సౌలభ్యం కలగదు.

  “రచయిత ఎక్కడివాడో మనకు తెలియకపోతే!!!” అని అడక్కండి. దానికి సమాధానం నాకూ తెలీదు. రచయితను బట్టి రచనను బేరీజు చెయ్యకపోయినా,రచయిత స్వీయానుభవం అని భ్రమింపజెయ్యగలిగితే పాఠకుడికి మరింతగా చేరువవ్వడం మట్టుకు ఖాయం.

  బహుశా అందుకే ప్రధమపురుషలో చెప్పే కథలు త్వరగా పాఠకుడికి చేరువవుతాయి. అవి కథలేకాదంటే మట్టుకు ఆ విమర్శకుల ఖర్మ.ముఖ్యంగా ప్రేమకథల్లో ఎవడిదో ప్రేమ చెప్పడానికి మనప్రేమే అనిపించేలా చెప్పడానికీ చాలా తేడా వస్తుంది.
  http://parnashaala.blogspot.com/2009/06/blog-post_15.html
  http://parnashaala.blogspot.com/2008/09/blog-post_17.html

  మెచ్చుకోండి

 12. @ మహేష్, విశ్వసనీయత పెంచడంకోసం రచయిత కథకుడి అవతారం ఎత్తడం జరుగుతుందా అన్నదే ప్రశ్న. కథకు సంబంధించినంతవరకూ రచయితే కథకుడు అంటే కథలో అభిప్రాయాలన్నీ రచయితవే అనాలి కదా. అలా అయితే, భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతూ రెండు కథలు రాస్తే, ఏకథకుడు నిజంగా రచయిత? అదీ నాకు కలిగిన సందేహం.
  @ సుజాతా, కల్పనా, మీరిద్దరూ కూడబలుక్కుని నన్నిలా మొహమాట పెట్టేస్తే ఎలా :p

  మెచ్చుకోండి

 13. నేను రాస్తానని అన్నానా? అనే వుంటాను. నోరు వూరుకోదు కదా.. ఇప్పుడు నేను, సుజాత ఇద్దరం అడుగుతున్నాము కాబట్టి మా బలం ఎక్కువ..మీరే రాయాలి.మీరే రాయాలి..
  మేమేవరమో రాయవచ్చు గానీ మీ అంత శ్రధ్ధగా రాయాలి కదా…ఇంకోసారి ఆలోచించండి…

  మెచ్చుకోండి

 14. @ సుజాతా, -ఫస్ట్ పర్సన్ లో రాసినవి కథలే కాదని చాలా మంది వాదించడం గమనిస్తున్నాను – అవునా, ఆశ్చర్యమే. నిజంగానే, కల్పన నాతో ఒకసారి అంది తాను రాయాలనుకుంటున్నానని. అన్నీ నేనే రాయడంకంటే, మీరందరూ కూడా తలో చెయ్యీ వేస్తే, మరీ క్లాసురూంలో వుండదు. 🙂
  @ S.R. Rao garu, ధాంక్స్, మీకు కూడా నూతనవత్సర శుభాకాంక్షలు.

  మరియు తెలుగు తూలిక పాఠకులందరికీ శుభాకాంక్షలు

  మెచ్చుకోండి

 15. మాలతి గారూ! నిజమే చదువుతున్నంత సేపూ క్లాసు రూములో ముందు బెంచీలో కూచుని వింటున్నట్లు అనిపించింది. నేను కూడా ఉత్తమ పురుష లో కథ” అనే అంశం గురించి మీరేం చెప్తారో అని చూస్తున్నాను! ఫస్ట్ పర్సన్ లో రాసినవి కథలే కాదని చాలా మంది వాదించడం గమనిస్తున్నాను. అందుకు!

  మెచ్చుకోండి

 16. @ కల్పనారెంటాల,ఓహో, ఇది మరీ బాగుంది. ఫస్ట్ పెర్సన్ గురించి నువ్వు కదా రాస్తానన్నావు. ఇది రాస్తుంటే. నీకథ టింకూ ఇన్ టెక్సస్ గురించి నీతో వాదించడం గుర్తొచ్చింది. అంచేత, ఆవిషయంలో నీవ్యాఖ్యకోసం ఎదురు చూస్తున్నాను :p
  నువ్వే రాయవలసినవి చాలా వున్నాయి.

  మాలతి

  మెచ్చుకోండి

 17. మాలతి గారు,
  కొత్తపాళీ కథ ఆధారంగా రచయత, కథకుడు వేర్వేరు అన్న కోణాన్ని బాగా అచ్చం స్కూల్ టీచర్ లాగా వివరంగా చెప్పారు. మరి నా కథలు…అని నేను కూడా పోటీకి వస్తానని మీకు తెలుసు.. జస్ట్ కిడ్డింగ్. కాకపోతే ఫస్ట్ పెర్సన్ లో కథ రాయటం గురించి మీ నుంది వివరమైన టపా ఎదురుచూస్తున్నాను. వేలూరి గారు ఈమాట లో రాసిన ఒక వ్యాసం కూడా మీరు ఒక సారి చూస్తే నేను ఏం అడుగుతున్నానో మీకు తెలుస్తుంది..
  కల్పనారెంటాల

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s