ఎదురు చూసిన స్వరూపం!

(1962-64 ప్రాంతాల్లో రాసినకథ.)

ఎనలిటికల్ జామెట్రీతో తలమునకలౌతున్న బదరీదగ్గరికి మెల్లిగా నరుడు నారాయణుడిదగ్గరికి వెళ్లినంత భక్తిప్రమత్తులతో చేరింది ఉమ “ఏంచేస్తున్నావురా?” అంటూ.

“మేకలు కాస్తున్నాను” అన్నాడు బదరీ తలెత్తకుండా.  వాడికి ఈచెల్లెలంటే చులకన. తనకంటె ఒకయేడే చిన్న అయినా రెండుక్లాసులు తక్కువ చదువుతోందని.  వాడు ప్రీయూనివర్సిటీకి వచ్చేశాడు, ఉమ ఇంకా ఫిఫ్తుఫారమే.  సన్నగా పొట్టిగా వున్న బదరీనాథని “అప్పుడే పీయూసీకొచ్చేశావా?” అని ఎవరైనా కళ్లెగరేసినప్పుడు వెన్ను విరిచి మరొక అంగుళం పొడుగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఉమ కూడా అలాగే సన్నగా, పొట్టిగా పరికిణీ, జాకట్లలో తిరుగుతూ అప్పుడే ఫిఫ్తుఫాంకి వచ్చేసినందుకు పెద్దలని ఆశ్చర్యపరుస్తూ వుంటుందని వాడికి తోచదు. అథవా తోచినా అంతగా పట్టించుకోడు. తను మగవాడూ, ఉమ ఆడపిల్లాను. తను ఉమకి చేయగల సాయాలున్నాయి కానీ ఉమ తనకి చేయగలసాయం ఇంతవరకూ చరిత్రలో తటస్థపడలేదు. అదీ వాడిధీమా. అందుకు తగ్గట్టు ఉమకి ఎప్పడూ అలాటి అవసరాలు తగుల్తూనే వుంటాయి.
“అది కాదురా, బదరీ,” అంది ఉమ తనవిజ్ఞాపనకి పరిచయం చదువుతూ.
“ఉఁ” అన్నాడు బదరీ సాయంత్రం ఇంటిదగ్గర కనిపించు అనే ఆఫీసరంత హుందాగా.
“టౌనుహాల్లో గురజాడ అప్పారావు వర్థంతి ఉత్సవాలు అవుతున్నాయిట.”
“నన్ను వెంటబెట్టుకుని రమ్మని నీకు ప్రత్యేకాహ్వానం వచ్చిందా?” అన్నాడు బదరీ ఉమమొహంలోకి తీక్ష్ణంగా చూస్తూ.
ఉమకి తనపని అయేట్టు కనిపించలేదు వాడిమొహం తీరు చూస్తే. అనువు చూసుకుని మిడిసిపడతాడు అనుకుంది కసిగా.
“అమ్మ నిన్ను తీసుకెళ్లమంది” అంది క్లుప్తంగా.
బదరీ మాట్లాడలేదు. అమ్మ ఎప్పుడూ ఇంతే. డవాలీబంట్రోతు పనులన్నీ నాకు చెబుతుంది అనుకున్నాడు కోపంగా.
“విశ్వప్రియ ఉపన్యాసం వుంది” అంది ఉమే మళ్లీ.
“అలా చెప్పు.”
విశ్వప్రియ రచనలంటే ఉమకి మహాయిష్టం. అవిడఫొటోలు అప్పుడప్పుడు పత్రికలలో పడ్డవి సేకరించి ఆల్బం తయారు చేసింది. ఆవిడరచనలన్నీ కత్తిరించి ఫైలు తయారు చేసింది. ఆవిడనిగురించి ఏ దినపత్రికలో ఏమాత్రం వార్త వచ్చినా ప్రత్యేకశ్రద్ధతో చదివేది. కత్తిరించి దాచేది. “విశ్వప్రియసాహిత్యప్రియ” ఉమ ఒక్కమాటలో.
“నేనీ ఛాప్టరు పూర్తి చెయ్యందే చావడానికైనా లేవను,” అన్నాడు బదరీ ఎక్స్ యాక్సిస్‌మీద గుర్తులు పెడుతూ.
“పరీక్షలో ఇలాగే చేస్తావేమిటి?”
“ఎలా?” ప్రశ్నార్థకంగా చూశాడు తలెత్తి.
“అడగనిప్రశ్నకి జవాబు చెప్పడం.”
“అడిగిందానికే చెప్పేను.”
“డొంకతిరుగుడుగా.”
బదరీకి వళ్లు మండింది. ఇంతకీ ఇది దానిపనా, నాపనా? “అవతలకి ఫో ముందు” అన్నాడు విసురుగా.
ఉమ కదల్లేదు. “మహా అయితే ఎనిమిదిగంటలవుతుందేమో మనం ఇంటికి వచ్చేసరికి. రాత్రంతా కూచుని చేసుకోకూడదేమిటి?” అంది సణుగుతున్నట్టు.
“ఇంకా చాలా చెయ్యాలే,” అన్నాడు బదరీ విసుగ్గా.
ఉమ మాటాడకుండా లేచి తన అల్మారాలోంచి ఫైలు తెచ్చుకుని టేబులుముందు కూర్చుంది. అది విశ్వప్రియఫైలు.
బదరీ కొనకళ్ల దాన్ని చూస్తూ, తలెత్తకుండానే, “ఆదుకాణం ఇక్కడ విప్పకు” అన్నాడు. వాడికి సహజంగా సారస్వతం అంటే జుగుప్స లేదు కానీ ఈచెల్లెలు చేసే ఆర్భాటం చూస్తే చిరాకు.
ఉమ విననట్టు తనపని చూసుకోసాగింది. పావుగంట గడిచేసరికి వాడు దిగొస్తాడని ఆపిల్లకి అనుభవమే!
ఉమ వయసుకి చిన్నదయినా తెలివితేటలు గలది. పది చెత్తకథల్లో ఒక మంచికథ పోల్చుకోడమే కాక ఒక మంచికథలో విశిష్టగుణాలు పోల్చుకోగలపిల్ల. విశ్వప్రియరచనల్లో నిర్దుష్టమయిన అభిప్రాయాలూ, అవి ఆమె ప్రకటించే విధానం ఆ అమ్మాయిని ఆకర్షించేయి. వాగాడంగబరం లేకుండా సున్నితమయిన అభిప్రాయాలనీ, లలిత లలితమయిన భావాలనీ సామాన్య పదజాలంతో చెప్పగల సామర్థ్యం ఆకలంలో వుంది. “అలవాట్లు” అన్నకథ తీసుకుని చదవడం మొదలుపెట్టింది. అందులో షికాగో వెళ్లినకొడుకు అక్కడే ఒక తెలుగుకన్యని పెళ్లి చేసుకుని తీసుకువస్తాడు. తల్లి ఏమీ అనదు. కానీ క్రమంగా రోజులు గడుస్తున్నకొలదీ ఏదో అవ్యక్తమయినభావం–అసంతృప్తిలాటిది తెల్లమవుతుంది ఆయింట్లో. కొడుకులో మార్పు లేదు కానీ తేడా వుంది. అది అతడు గమనించేడో లేదో కానీ తల్లిదృష్టి దాటిపోలేదు. ఆలశ్యంగా పడుకుంటున్నాడు. ఆలశ్యంగా లేస్తున్నాడు. రోజుకి ఏడెనిమిది మార్లు కాఫీ తాగుతున్నాడు. కోడలు ప్రతిదాన్లోనూ ఉప్పెక్కువ వేస్తోంది.
“భోజనాలగదిలో బల్ల వద్దు” అంటుంది తల్లి.
”ఆయనకి అలవాటయిపోయింది. కింద కూర్చుని తినలేనంటారు” అని సమాధానం ఇస్తుంది కోడలు.
తల్లి హృదయం కలుక్కుమంటుంది. “పాతికసంవత్సరాల అలవాట్లు ఒక్కసంవత్సరంలో మారిపోయాయి. ఈ ఒక్కసంవత్సరంలో వచ్చిన అలవాట్లు శాశ్వతం కాబోలు” అంటుంది తల్లి బాధ సూచించే చిరునవ్వుతో.
ఈకథ చదివినప్పుడల్లా ఉమకి కళ్లు తడి అవుతాయి. ఇందలో కథకురాలు ఎవరినీ నిందించదు. నేర్పుగా మూడు దృక్కోణాలూ చూపిస్తుంది. సంఘం వ్యక్తిని ఒరుసుకు ప్రవహించే జీవగంగ. ఆ ఒరవడిలో ప్రతివ్యక్తీ కొంత పోగొట్టుకోక తప్పదు.
“కావలిస్తే ఆరుగంటలతరవాత వస్తాను” అన్నాడు బదరీ ఆఖరికి ఆఅర్భకురాలిపై జాలితో.
“మీటింగు అయిదుగంటలకే మొదలు” అఁది ఉమ దీక్షగా కాగితాలు చూసుకుంటూ.
“సరేలే, తయారవు” అన్నాడు బదరీ ఆపన్నప్రసన్నుడై.
సరీగ్గా పదినిముషాలు తక్కువ అయిదుకి ఇద్దరూ అమ్మదగ్గర శలవు పుచ్చుకుని వీధిన పడ్డారు.
“నువ్వు రోడ్డుకి అటువేపు నడు,”అన్న అన్నగారిని ఉమ ఏమీ అన్లేదు. “ఆడపిల్లల్తో వెళ్తున్నావేమిట్రా” అని వాడిస్నేహితులు హేళన చేస్తారని వాడిభయం. “నీసాయం మండినట్టే వుంది” అని మనసులోనే విసుక్కుంది రోడ్డు అటువేపుకి దాటుతూ.
దారిపొడుగునా ఉమ “ఆవిడ” ఎలా వుంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తూనే వుంది. ఎందుకనో పెద్దదే అయివుంటుంది అనిపించింది. ముఫ్ఫై, ముప్ఫైఅయిదు వుంటాయనుకుంది. చేయెత్తు మనిషి, కలువరేకులవంటి కన్నులతో, కోటేరేసినముక్కూ, కొనదేలిన చుబుకంతో, దరహసితవదనంతో, రెండంగుళాలు జరీఅంచు, నూటయాభైనెంబరు నెమలికంఠం రంగు గుంటూరు చేనేత చీరె, దానికి తగినరంగు బ్లౌజుతో విశ్వప్రియ ఉమకన్నులముందు లీలగా మెదలింది. ఆటోగ్రాఫు తీసుకోవాలనుకుంది. కొందరు వొట్టి పేరు రాస్తారు. కొందరు అది కూడా రాయడానికి ఇష్టపడరు. మంచివాక్యాలు రాసేవాళ్లు చాలా తక్కువమంది. విశ్వప్రియని ఏదైనా మంచి ‘సందేశం’ రాయమని అడగడానికి నిశ్చయించుకుంది. అంతలోనే మరోసంగతి జ్ఞాపకం వచ్చింది. ఆవిడకథలు ఒకటి, రెండు చదివేక పట్టలేని సంతోషాన్ని తెలియజేస్తూ రెండు ఉత్తరాలు రాసింది. జవాబు రాలేదు.
“నీఉత్తరాలకి జవాబులు రాస్తూ కూచుంటే ఇహ కథలు రాసినట్టే” అన్నాడు బదరీ వెక్కిరింపుగా.
“ఏడ్చావులేవో” అని అప్పట్లో వాడిని కసిరికొట్టినా తర్వాత నిజమే అనిపించింది.
వాళ్లు టౌన్‌హాలు చేరేసరికి ఐదుంపావు అయింది. ఆడవాళ్లు కూచున్నచోట ఉమచోటు గుర్తు చూసుకుని బదరీ మగవాళ్లవేపు వెళ్లి కూర్చున్నాడు.
అదొక విశేషంగా వుంటుందని కాబోలు మీటింగు అయిదుకల్లా మొదలు పెట్టేశారు. సభాధ్యక్షుడు ప్రారంభోపన్యాసం ఇస్తున్నాడు. ఉమ ఆతృతగా అటూ ఇటూ చూసింది. స్టేజిమీద వున్న ఒకే ఒక స్త్రీకీ ఉమ ఊహించుకున్న విశ్వప్రియకీ పోలికలు లేవు. అయినా “నేనెందుకలా ఊహించుకోవాలీ?” అనుకుంది నీరసంగా. స్టేజిమీద ఆవిడ కొంచెం లావుగా వుంది. పొట్టిగా వుంది. మొహం పరిపూర్ణచంద్రబింబాన్ని పోలి వుంది. చవకరకం నైలాన్ చీరె, అదే రంగు డెకొరాన్ బ్లౌజు వేసుకుంది. … …
అధ్యక్షుడు విషయచర్చ ముగించి విశ్వప్రియని పరిచయం చెయ్యడం మొదలెట్టేడు. “శ్రీమతి విశ్వేశ్వరిగారు తెలుగుపాఠకులకి సుపరిచితులు. ఆమె గత 15 సంవత్సరాలుగా తెలుగు సాహితీక్షేత్రంలో చేసిన సేవ అపారం, అమోఘం. అనన్యసామాన్యమైన ప్రతిభావ్యుత్పత్తులు కలిగి, అవి సద్వినియోగం చేసుకోడానికి తగిన అవకాశం లభించిన చాలా తక్కువమంది రచయిత్రులలో ఈమె ఒకరు. ఈమె అనేక కావ్యఖండికలు రాసారు. కొన్నివందల కథలు రాశారు. ఎన్నో సాహిత్యసభలకి అధ్యక్షత వహించారు. సారస్వత సదస్సులలో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తిని నేను పరిచయం చేయడం అనవసరం. మీరే వినండి.”
ఉమ చుట్టూ చూసింది. ఆడియన్సు అంతా తనలాగే ఉత్కంఠతో ఉపన్యాసంకోసం ఎదురు చూస్తున్నారు. విశ్వప్రియ లేచింది. ఆపరేటరు గబగబా వచ్చి మైకు ఆమెఎత్తుకి దించాడు. విశ్వప్రియ ఉపన్యాసం ప్రారంభించింది. “నేను ఉపన్యాసం ప్రారంభం చేసేదానికి ముందుగా ఈ ఉత్సవాలు ఎరేంజి చేసి, నన్ను ఇక్కడికి ఉపన్యాసకురాలిగా ఆహ్వానించిన శ్రీరామ్మూర్తిగారికి, ఇతర కార్యకర్తలకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి నేను ఇక్కడికి వచ్చి వుండేదాన్ని కాను. దానికి చాలా కారణాలు వున్నాయి. ముఖ్యంగా శ్రీ సత్యనారాయణమూర్తిగారివంటి మహా వక్తలూ, మేధావులూ పాల్గొంటున్న ఈసభలో నేనూ ఒక ఉపన్యాసకురాలినే అంటూ స్టేజి ఎక్కడం హాస్యాస్పదమే అవుతుంది. ఈసంగతి నేను సెక్రటరీగారితో చెప్పి వున్నాను కూడా. కాని వారు నాయందుగల అభిమానముచేత నైతేనేమి, నారచనలయందు గల సద్భావంచేతనైతేనేమి, నేను రావాలని బలవంతం చేయడంచేత అంగీకరించక తప్పలేదు. వాస్తవానికి ఈపట్టణం పలువురు ప్రముఖరచయితలకి ఆలవాలం. అటువంటి ఈపట్టణంలో శ్రీగురజాడ అప్పారాయవర్థంతి ఉత్సవాలు జరప బూనుకోవడం, ఆవుత్సవాలలో పాల్గొనమని నన్ను ఆహ్వానించడం నాకొక ఆమూల్యమైన కానుకగా, అద్వితీయమయిన గౌరవంగా భావిస్తున్నాను. ఎందుచేతనంటే పది సంవత్సరాలక్రిందట నేను … “
ఉమలో కొంచెం సంచలనం కలిగింది. చుట్టూ చూసింది. శ్రోతలలో మొదట్లో వున్నంత ఉత్సాహం కనిపించలేదు. ఉపన్యాసం పక్కదారి పట్టింది. అది శ్రోతలు మాత్రమే గ్రహించారు. బదరీ ఆ అవకాశంకోసమే ఎదురు చూస్తున్నాడేమో ఉమ తనవేపు తిరగ్గానే “వెళ్లిపోదాం” అని సౌంజ్ఞ చేశాడు.
“ఉండు” అంది ఉమ కళ్లతోనే.
“ … అప్పారావుగారివంటి మహాపురుషునిగూర్చి మూడుముక్కల్లో చెప్పబోవడం రామాయణం అంతా ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అంటూ చెప్పినట్టుగానే వుంటుంది. ఆ సాహసం నాకు లేదు. పైగా శ్రీ సత్యనారాయణమూర్తిగారు ఇంతకుముందే అప్పారావుగారిగురించి హృదయాలకు హత్తుకుపోయేట్టుగా సరళమైనభాషలో చక్కగా చెప్పే వున్నారు. శ్రీ అప్పారావుగారి దృష్టిలో స్త్రీ ఒక అపూర్వశక్తి. …”
ఉమ వెనక ఎవరో జడ పట్టుకు లాగేరు. వెనక్కి తిరిగి చూసింది. వెనకనున్నావిడ తలుపువేపు చూపించింది. అక్కడ బదరీ మెడలు విరిగిపోయేలా తల విసిరేడు, “వస్తావా, రావా” అన్న అర్థంతో. ఉమ వాడిని లెక్క చేయకుండా మరొక పావుగంట అక్కడే కూచుంది. ఉపన్యాసం ఎంతసేపటికీ రబ్బరులా సాగుతోందే కానీ సరుకు కనిపించలేదు. ఆఖరికి తప్పలేదు. ఆపిల్ల ఆశలన్నీ వమ్ము అయేయి.
ఇద్దరూ రోడ్డుమీదకి వచ్చేక, “నామొహంలాగే వుంది” అన్నాడు బదరీ. “నేను ముందే చెప్పేను కదా అవన్నీ ఆవిడ రాసినవి కావని.”
“ఊఁ” అంది ఉమ. బదరీ తెల్లబోయేడు.
ఇద్దరూ ఇంటికి చేరేసరికి పావుతక్కువ ఎనిమిది అయింది. వరండాలో నాన్నగారితో మాటాడుతూ మూర్తిమామయ్య కనిపించేడు. ఆయన గుంటూరునించి వచ్చేడు.
“ఏమర్రా, జ్ఞాపకం వున్నానా? నాలుగేళ్లయినట్టుంది చూసి. అయిందా మీటింగు?” అంటూ ఆప్యాయంగా పలకరించేడు.
ఉమ ఆయన కూర్చీదగ్గరికి వెళ్లి, “నువ్వెప్పుడు వచ్చేవు?” అంది కొంచెం సిగ్గు పడుతూ.
బదరీ చిన్నగా నవ్వుతూ స్తంభంపక్కన నిల్చున్నాడు.
“పలకరింపులకేం గానీ తరవాత కావలిసినంత టైము. ముందు భోజనాలకి లేవండి,” అని వంటింట్లోంచి అమ్మ కేకేయడంతో ఉమ ఇంట్లోకి వెళ్లింది. బట్టలు మార్చుకుని కంచాలూ, పీటలూ పెట్టడానికి.
మామయ్యా, నాన్నగారూ ఏవో కబుర్లు మొదలు పెట్టడంతో బదరీ కూడా లోపలికి కదిలేడు.
“ఇంతకీ ఏమిటోయ్ మీటింగు?” అన్నాడు మామయ్య సగం భోజనం అవుతూండగా బదరీవేపు తిరిగి.
“ఏదో సాహిత్యసభ. చెప్పవే,” అన్నాడు బదరీ ఉమవేపు తిరిగి. అలాటి “ప్లాప్” సభలకి బయల్దేరంత తెలివితక్కువతనం తనకి లేదని మామయ్య గ్రహించాలని వాడి అభిలాష. వినేవాడికి ఓపిక వుండాలి గానీ ఈ “సోప్‌బాక్స్ ఆపరేటర్లు” రోజుకి ముగ్గురు తగుల్తారు కాళ్లకడ్డం పడుతూ అని వాడిఅభిప్రాయం. పక్కన నాన్నగారుండడాన్న వెలువరించలేదు కానీ.
ఉమకి అంతకన్నా నిరుత్సాహంగా వుంది. అయినా అడిగినవాడు ఫల్గుణునివంటివాడు కనక “గురజాడ అప్పారావు వర్థంత్యుత్సవాలు అవుతున్నాయి, మామయ్యా!” అంది తలొంచుకుని అన్నం కెలుకుతూ.
ఆయన అంతటితో వదిలిపెట్టలేదు. “ఇవాళ ఎవరెవరు వచ్చేరు?” అని అడిగేరు.
“సత్యనారాయణమూర్తిగారూ, విశ్వప్రియగారూ” అంది ఉమ నెమ్మదిగా. దానికి ఈవిషయం మాటాడాలని లేదు.
“సత్యనారాయణమూర్తిగారు చాలాబాగా మాట్లాడివుండాలే” అన్నాడు మూర్తి కొస వదలకుండా.
“అవును. ఆయన చాలా బాగా మాటాడతారు.”
“విశ్వప్రియగురించి అడుగు” అన్నాడు బదరీ వెక్కిరింపుగా.
“ఏం?”
“ఆవిడ బ్రహ్మాండంగా మాటాడుతుందనుకుని వెళ్లేం. అక్కడికి.” ఉమయందు ఏదో ఓమూల మొలకెత్తిన రవంత సానుభూతితో బదరీ తనవాక్యాన్ని సున్నితం చేసేడు.
“ఓ, అదా. అవునవును. ఆవిడ అంత బాగా మాటాడలేదు. ఏమంత మంచి స్పీకరు కాదావిడ.”
దాంతో బదరీ గర్వంగా ఉమవేపు చూశాడు, “నాకు తెలుసు మామయ్యా! ఆవిడపేరుతో అచ్చయేవన్నీ వాళ్ల నాన్నగారో అన్నయ్యో రాసినవి అయుంటాయి” అన్నాడు.
ఎదుటివ్యక్తిలో గొప్పతనాన్ని సహించలేని అన్నగారివేపు ఎర్రగా చూసి తలొంచుకుంది ఉమ. కాని మూర్తి ఉమవేపు మొగ్గు చూపాడు.
“అలా అనకు బదరీ. కొందరు బాగా మాటాడతారు. కొందరు బాగా వ్రాస్తారు. ప్రతి రచయితా వక్త కావాలనేముందీ?” అన్నాడాయన.
“అలా అయితే ముందుగా రాసుకుని, కంఠతా పట్టి వచ్చినా సరిపోను,” అన్నాడు బదరీ.
“అలా కంఠతా పట్టినప్పుడు కంఠతా పట్టి ఒప్పచెప్పినట్టే వుంటుంది. నాకావిడని తెలుసు. మావూరేగా. వచ్చినప్పుడు ఇద్దరం ఒక రైల్లోనే వచ్చేం. ఇక్కడికి రమ్మన్నాను కూడాను. బహుశా రేప్పొద్దున్న వస్తే రావచ్చు.”
ఉమచేతిలో అన్నం కంచంలోకి జారిపోయింది. మామయ్య పలికిన ప్రతిపలుకూ స్వాతి చినుకయి అలరించింది.
“అయితే నీకు ఆవిడతో అంత పరిచయముందా?” అనడిగింది.
“దీనికావిడంటే హీరో వర్షిప్పూ” అన్నారు నాన్నగారు నవ్వుతూ.
“అంత అంటే .. తెలుసు. నేను ఫలానా అని ఆవిడకి తెలుసు. ఆవిడ ఫలానా అని నాకు తెలుసు. ఇద్దరం ఒకే రైల్లో వచ్చేం. ఏదో మాటామంతీ వచ్చింది. మాటాడుకున్నాం.” అన్నాడు మూర్తి పరిస్థితి వివరిస్తూ.
ఉమ కొంచెంసేపు మాటాడలేదు. ఏం అడగాలో ఎలా అడగాలో తెలీలేదు ఆపిల్లకి.
“అయితే వాళ్లిల్లు మీయింటికి దగ్గరేనా?”
“ఓమోస్తరుగా దగ్గరే. మన రావు జ్ఞాపకం లేడూ. యూనివర్సిటీలో మన సహవిద్యార్థి” అన్నాడు మూర్తి నాన్నగారివేపు తిరిగి.
“అవును, తెలుసు. ఏం?”
“ఈ విశ్వప్రియ అతని అక్కకూతురే. అక్కడ విమెన్స్ వెల్‌ఫేర్ ఆఫీసరుగా వుంటోంది. గొప్ప ధైర్యసాహసాలు గలమనిషి. ఒక్కర్తే జీపు వేసుకుని ఎక్కడికేనా వెళ్లిపోగల ఆడదాన్ని నాజీవితంలో ఆవిడ్నొక్కదాన్నే చూసాను. ఆమధ్య ఓమారు ఏదో కేసులో చిక్కుకుంది కానీ బహు నేర్పుగా తప్పించుకుందిలే. కుట్టుమిషన్లు కొనమని ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పట్టుచీరెలు కొంది అంటారు. లేదు, పొలాలమ్మి చీరెలు కొనుక్కున్నానంటుందావిడ. నిజానిజాలు ఆ లీలావినోదుడికే తెలియాలి.”
మూర్తి ఆగి మంచినీళ్లు తాగాడు.
“ఏం కావాలే నీకు? అలా కూచుండిపోయేవు?” అని అమ్మ అడిగిన ప్రశ్నకి “ఏం వద్దు” అని తల అడ్డంగా తిప్పింది ఉమ.
“పెళ్లి చేసుకోలేదు. ఒక్కర్తే వుంటోంది. మద్రాసు యఫ్. ఎల్. సొసైటీలో మెంబరు అని చెప్పుకుంటారు”
“కబుర్లలో పడి నువ్వు అన్నం తినడంలేదు,” అన్నారు నాన్నగారు. పిల్లలముందు అలాటివిషయాలు మాటాడడం ఆయనకి ఇష్టం లేదు.
“లేదు, తింటున్నాను,” అన్నాడు మూర్తి.
అకస్మాత్తుగా ఉమ “నాకు తినాలని లేదు” అంటూ లేచి వెళ్లిపోయింది. ఆపిల్లమొహం తెల్లగా పాలిపోయి వుంది. అది గమనించిన మూర్తి క్షణకాలం నివ్వెరపోయేడు.
“అదెప్పుడూ అంతేలే. దానిమనసు అతి నాజూకు. ఆమధ్య ఏదో సినిమా చూసి మూడు రోజులపాటు అన్నంతినలేదు” అన్నారు నాన్నగారు కూతురితరఫున క్షమాపణలు చెప్పుకుంటూ.
మూర్తి మాటాడకుండా భోజనం ముగించాడు. తరవాత డాబామీద కూర్చుని నాన్నగారితో రష్యా, చైనా సంబంధాలచర్చ మొదలుపెట్టేడు.
గదిలో బదరీ పుస్తకాలు ముందేసుకుని కూచున్నాడు కానీ వాడికేం చదవబుద్ధి పుట్టలేదు. చెల్లెలిఓటమి వాడికి క్షణకాలం సరదా వేసినా ఆపిల్లకి అంత మొహం తిరగేలా తగలడం వాడికి కష్టం వేసింది. అంతరాంతరాల్లో ఆ అమ్మాయంటే వాడికి ఆపేక్షే మరి.
“ఇంకా తొమ్మిదేనా అవతేదూ, కొంటెంసేపు చదువుకోకూడదూ” అన్నాడు దుప్పటిలో దూరి పడుకున్న ఉమనుద్దేశించి. ఆవిధంగనైనా ఆపిల్లదృష్టి మరల్చాలని వాడిఅభిఫ్రాయం.
“నాకు నిద్రొస్తోంది” అంది ఉమ గోడవేపు తిరిగి కళ్లు గట్టిగా మూసుకుని నిద్ర తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ.
కాని ఉమకి ఆరాత్రి నిద్ర పట్టలేదు. చిన్నప్పుడు తను ఎంతో జాగ్రత్తగా దాచుకుని ఆడుకునే మట్టిబొమ్మ బదరీ బద్దలగొట్టినపుడు అది తనని చాలా బాధ పెట్టింది. మళ్లీ ఇప్పుడు అలాటి బాధే! … మూర్తిమామయ్య చెప్పింది నిజం కాదేమో! అతను ఎందుకు అబద్ధం చెప్తాడు? ఏమో, అతనికీ తెలీదేమో సరీగ్గా. తను విన్నానని చెప్పేడు కానీ చూశానని చెప్పలేదు కదా. అసలు గిట్టనివాళ్లెవరైనా పుకార్లు పుట్టించి వుండొచ్చు. ఆవిడకొచ్చిన పేరుప్రతిష్ఠలు చూసి కుళ్లుకుని అలా చేసి వుంటే ఆశ్చర్యమేం లేదు కదా. అసలు విశ్వప్రియగారు అలాటి కథ ఒకటి రాసింది కూడాను. ఉమకి లేచి ఆకథ చదవాలనిపించింది, కానీ ఇప్పుడు లేస్తే మళ్లీ బదరీ తగులుకుంటాడు. వాడితో మళ్లీ ఏదో వాదనలేసుకోవాలి … ఆనాడు ఆబదరీ తన మట్టిబొమ్మ పగలగొట్టాడు. ఈరోజు మామయ్య తన ఊహలు చెదరగొట్టాడు. ఆరాత్రి భోజనం, నిద్ర ఎగరగొట్టాడు అనుకోకుండా వుండలేకపోయింది ఆచిన్నమనసు.
మర్నాడు ఉమ లేచేసరికి ఏడు దాటింది. ఎర్రబారిన ఉమకళ్లు చూసి, “ఇదెలా బతుకుతుందో” అంటూ తనలోతను గొణుక్కుంది అమ్మ.
ఉమ మటుకు వేగిరం స్నానం అవీ ముగించేసుకుని పుస్తకాలు ముందేసుకు కూర్చుంది. ఎవరూ లేకుండా చూసి, మామయ్యతో మాటాడాలని తహతహలాడుతోంది ఆపిల్ల. అనుకున్నట్టుగానే తొమ్మిదిగంటలయేక అవకాశం దొరికింది. నాన్నగారు ఇప్పుడే వస్తానని వీధిలోకి వెళ్లేరు. బదరీ స్నేహితుడింటికి వెళ్లేడు. అమ్మ వంటింట్లో ఉంది. ఉమ మామయ్యదగ్గరికి చేరింది.
“అయితే మామయ్యా! విశ్వప్రియ ‘యప్.యల్.’ మెంబరు అన్నమాట నిజమేనా?” అంది పాలినమొహంతో. అది ఆపిల్లని రాత్రినుంచీ వేధిస్తున్న ప్రశ్న.
అనుకోని ఈప్రశ్నతో మూర్తి తొట్రుపాటు పడ్డాడు. ఆ పిల్ల యఫ్.యల్, గురించి విని వుంటుందని అతను ఊహించలేదు.
“ఏమో, అంటారు. అయినా మాటలకేముంది. పుట్టగొడుగుల్లా వాటంతట అవే పుడతాయి.”
ఆపిల్ల తృప్తి పడినట్టుగా లేదు మొహంలో.
మూర్తి చదువుతూన్న పేపరు మడిచి పక్కన పెట్టి, “ఇలా వచ్చి కూర్చో. చెప్తాను,” అన్నాడు.
ఉమ కూర్చీ దగ్గరగా లాక్కుని కూచుంది సాలోచనగా.
“నిజంగా నేను చెప్పినవన్నీ నిజఁవే అనుకో. అయితే ఏం?” అన్నాడు మూర్తి. ‘చెప్పుకో చూదాం’ ధోరణిలో, చిర్నవ్వు దాచడానికి యత్నిస్తూ.
ఉమ తెల్లబోతూ అతనివేపు చూసింది, ఆయనభావం అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ. గోముగా దగ్గరికి పిలిచి గట్టిగా ఓ మొట్టికాయ వేసినట్టుంది.
మామయ్య కొన్ని క్షణాలు ఆలోచించి నెమ్మదిగా అన్నాడు “చూడు ఉమా, ఒకమాట చెప్తాను. రచయితా కాదా అన్నప్రశ్న అలా వుంచు. అసలు మానవనైజం చాలా క్లష్టమయినది, అంత తేలిగ్గా అర్థమయే పదార్థం కాదు అని ఒప్పుకుంటావు కదా. నువ్వు విశ్వప్రియ కథలు చదివి ఆవిడమీద నీకు నువ్వే ఒక అభిప్రాయం ఏర్పర్చుకున్నావు. నీఊహాల్లో సుందరిలా ఆవిడ నీకు దర్శనమీయలేదని బాధపడడం న్యాయమేనా?.”
“ఎందుక్కాదూ? అదంతా నటనంటావా?”
“నేను అనేదల్లా రచయితలు చుట్టూ వున్న లోకంలో మనుషుల్ని చూసి పాత్రలు సృష్టిస్తారు. వాళ్లకథల్లో పాత్రలు వాళ్లే అవొచ్చు, కాకపోవచ్చు, అయితీరాలని నియమేమీ లేదు.”
“అంటే వాళ్లకి చిత్తశుధ్ధి లేదనుకోవాలా?”
“ఊఁఊమ్. అది కాదు నేనంటున్నది. మాటల్లో చెప్పడం కష్టం అనుకుంటా. ఒకొకప్పుడు రచయితలు తమని తాము చిత్రించుకుంటున్నప్పుడు కూడా ‘నేనిలా వుంటే బాగుండు’ అనుకున్నవ్యక్తిత్వాన్ని పాఠకులముందు పెడారనిపిస్తుంది నాకు. తనలోని లోపాలనీ, దురలవాట్లనీ గురించి రాసినప్పుడు కూడా కాస్త జాగ్రత్త పడతాడు. ప్రతిరచయితా తానొక మేథావీ భావుకుడూ అనే పాఠకులు గుర్తుంచుకోవాలని ఆశిస్తాడు. అంతే గానీ తనజీవితంలోని నికృష్టపు భాగం పాఠకులు గుర్తు పెట్టుకోవాలనుకోడు కదా.”
ఉమకి ఇంకా తికమకగానే వుంది. ఎంత దూరం నడిచినా పుంతలతోపుదగ్గరే తెల్లారినట్టు, ఎంత ఆలోచించినా తన దృష్టి మళ్లీ మొదటి ప్రశ్నకే వస్తోంది. రచయితలకి చిత్తశుద్ధి అనుకోవాలి. కనీసం తన మనసుకి అలాగే తోస్తోంది.
“పోనీ, మరొకటడుగుతాను చెప్పు. నీకు ఒక స్నేహితురాలుందనుకో. నిజంగా మీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఆ అమ్మాయికి దూరపుబంధువైన ఒక యువకుడితో పరిచయం ఉంది. అందరూ పెడర్థాలు తీస్తూ వ్యాఖ్యానిస్తూంటారు వాళ్ల స్నేహంగురించి. ఆఅమ్మాయి నీతో అది నిజం కాదంటుంది. అతను తనకి తమ్ముడులాటివాడంటుంది. నువ్వు నమ్ముతావు. ఒకరోజు ఆఅమ్మాయి రాయపూర్ పాసింజరులో ఎవరినో చూడ్డానికి వెళ్తున్నానని నైట్ వాచ్‌మన్‌తోనూ, ఎ.పి.సి. టాబ్లెట్సు తెచ్చుకోడానికి వెళ్తున్నానని నీతోనూ చెప్పి బయటికి వెళ్తుంది. ఆరోజు ఆతమ్ముడులాటివాడితో సెకండ్ షో సినిమాకి వెళ్లిందని ఎవరో నీకు చెప్తారు. సినిమాకి వెళ్లడం పెద్ద నేరమేమీ కాదు కానీ నీకు ఎందుకు చెప్పలేదని బాధ. అవునా కాదా. నువ్వు ఏమనుకుంటావు?”
“నేను నమ్మను.”
మూర్తి మందహాసం చేశాడు. “నిజమేనని తెలిస్తే?”
ఉమ ఆలోచించసాగింది.
మూర్తే అందుకున్నాడు, “అది నీకు యిష్టంలేదు కనక నీతో చెప్పలేదనీ, అంతకంటే ఏదురుద్దేశమూ నీస్నేహితురాలికి లేదనీ నువ్వు సమర్థింపజూస్తావు. అవునా?”
“ఊఁ.”
“అంటే ఆఅమ్మాయికి నీయందు బోలెడు గౌరవమో అలాంటిదే మరోటో ఉందనుకుని ఆనందిస్తావు. నువ్వు అలా అనుకోడానికి కారణం ఏమిటి?”
“ … ..”
“నేను చెప్పనా?”
ఉమ తలూపింది. నిజానికి ఈ పయనం ఏతీరానికో తెలియడంలేదు ఆ అమ్మాయికి.
“నీనమ్మకం. నువ్వు ఆఅమ్మాయిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నావు. అది నిజమని నమ్మేవు. అతరవాతి అభిప్రాయాలన్నీ నీ మొదటినమ్మకంలోంచి వచ్చినవే. ఇంకా వెనక్కి వెళ్లి చూస్తే, నీ మొదటిఅభిప్రాయానికి ప్రాతిపదిక అంతకుముందు పెద్దవాళ్లు నీకు చెప్పినవీ, నువ్వు విన్నవీ అయివుంటాయి. నీకెప్పుడయినా తట్టిందా రామరాజ్యం అని మనం చెప్పుకుని మురిసిపోయినట్టుగానే ఆనాటి లంకలో రావణరాజ్యం అని చెప్పుకుని పొంగిపోయేవారేమో.”
మూర్తి ఉమమొహంలోకి చూశాడు.
“నిజమే” అంది ఉమ నవ్వి.
ఆపిల్లని ఆమాత్రం నవ్వించగలిగినందుకు మూర్తిమనసు ప్రఫుల్లమయింది.
“చెప్పేను కదూ. నువ్వో అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నతరవాత – అది ఉల్లిపొరంత పల్చనిదైనా సరే – క్షణాలమీద కంచుగోడ అయిపోతుంది. దాన్నే గట్టిగా నమ్ముతావు. ఆపైన నీ ఆలోచన పరిథిని కుదించేస్తుంది. ఇహ ఆతరవాత ఎవరేం చెప్పినా వినలేవు. అర్థం చేసుకోలేవు. ఇప్పుడు చూడు. నువ్వే వున్నావు. ఈ విశ్వప్రియ అంటే నువ్వు ఎందుకంత పిచ్చనమ్మకాలు పెంచుకున్నావు? ఆవిడకథల్లో వెలువరించిన అభిప్రాయాలు నీకు నచ్చేయి కనక. ఆకథలనిబట్టి నీమనసులో నువ్వొక రూపం ఏర్పరుచుకున్నావు. ఆమె సుగుణాలరాసి. కుందనపుబొమ్మ. దేవతలు కూడా పూజించతగ్గ మేధావి. ఇది నీకు నువ్వయి కల్పించుకున్న రూపం. ఇవన్నీ ఆమెలో వుండాలని నువ్వు కోరుకుంటున్న గుణగణాలు. బహుశా ఆవిడకి కూడా అలాగే వుండాలని వుందేమో. అవే తన కథలరూపంలో ఆవిడ రాసిందేమో. నువ్వు వాటిని కథలరూపంలోనే గ్రహించి ఆనందించగలగాలి కానీ ఆవిడ అలా లేదని ఆయాసపడితే ఎలా? పూవుపరిమళం కొమ్మకి వస్తుందా?”
ఉమకి ఏదో అర్థం అయినట్టు, ఒక సత్యాన్ని గ్రహించినట్టు అనిపించింది.
“నువ్వు ఆవిడకథలు మెచ్చుకుంటున్నావంటే మీరిద్దరూ ఏకోన్ముఖులు కావడం ఒక కారణం కావచ్చు. మీయిద్దరి తత్త్వాలు ఒక్కలాటివేనేమో. ఇందాక నేను చెప్పిన స్నేహితురాలి దృక్పథం నీదృక్పథం పూర్తిగా భిన్నమయినవి.”
“నాకలాటి స్నేహితురాలు లేదు మామయ్యా!” అంది ఉమ అయోమయంగా మామయ్యవేపు చూస్తూ.
మూర్తి ఫక్కున నవ్వేడు. “అవును కదూ. మర్చేపోయేను” అంటూ పేపరు తీసుకున్నాడు.

(18 జనవరి 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఎదురు చూసిన స్వరూపం!”

 1. @ రాధిక, మనకి ఇష్టమయినవారిగురించి మనఇష్టంవచ్చినట్టు ఊహించుకున్నప్పటి ఆనందం 🙂 – నువ్వు ఒక కవిత రాయాలి ఈ అందమయినభావంతో.

  మెచ్చుకోండి

 2. చాలా బావుందండి.ఎంత కాదనుకున్నా మనం అభిమానించేవాళ్ళకి అందమైన రూపం,మంచి లక్షణాలు, లేకపోతే వాళ్ళ కధల్లో ముఖ్యపాత్రల విశేషణాలను ఊహించేసుకుంటాము కదా.

  మెచ్చుకోండి

 3. @ భావన, అవునండీ, చాలామందికి రచయితలంటే అంత అభిమానం. నేను ఎవరిని అంతగా ఆరాధించేదానినో మాత్రం చెప్పను :).
  @ కొత్తపాళీ, మీవ్యాఖ్య చూస్తుంటే నేను ఏపేరు పెట్టినా సరిపోయేదే అన్నట్టుంది అవునా?
  @ వెంకటరమణ, ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మాలతి గారు చాలా బాగుంది, నేను కూడా చిన్నప్పుడూ అలానే అనుకునే దానిని. ఒక్కో సారి చలాన్ని ఏమైనా ఎవరైనా అంటే ఇప్పటికి తెగ లాగేసుకుని ఏడ్చేసి మొహం తుడుచుకుంటూ వుంటాను. అంటే ఆయన వేరే అనుకోండీ అలా బాధ పడటానికి అర్హుడనుకోండి. అదిగో అదే అంటార.. వు వు నేను ఒప్పుకోను. 🙂

  మెచ్చుకోండి

 5. @ Ruth, You’re right. It did not come out right. I was thinking about substance, or lack thereof, in the speech. Thanks for pointing it out.
  @ Padmarpita, ధన్యవాదాలు.
  @ SSRao, ధన్యవాదాలు.
  @ మధురవాణి, “ఆలోచనలూ, అభిప్రాయాలు మాత్రం ఎప్పటికీ పాతబడే అవకాశం లేనివి అని నాకనిపించింది”. మీకలా అనిపించిందంటే నాకు చాలా సంతోషంగా వుంది. ఎంచేతనంటే, “కాలానికి నిలిచిన”కథకి అదొక లక్షణం అని నా అభిప్రాయం. చాలా చాలా ధన్యవాదాలు.
  @Sujata, ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. మాలతి గారూ,
  కథ సూపరుగా ఉందండి. ఈ కథ అంత పాత కాలంనాటిదని అనిపించలేదు. పీయూసీ, ఫారం చదువూ, జనాలు ఆసక్తిగా సాహిత్య సభలకి వెళ్ళడం.. ఈ పాయింట్లు మాత్రమే కథ ప్రస్తుత కాలానికి చెందింది కాదని చెప్తున్నాయి (నా వరకూ). కథాంశం మాత్రం చాలా వైవిధ్యమైనదిగా నాకనిపించింది. కాలం మారినా, పరిస్థితులు మారినా ఈ కథాంశం, ఆలోచనలూ, అభిప్రాయాలు మాత్రం ఎప్పటికీ పాతబడే అవకాశం లేనివి అని నాకనిపించింది. అప్పట్లో చదవలేని (పుట్టని) నాలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మీ బ్లాగులో ప్రచురించినందుకు ధన్యవాదాలు 😉

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s