ఊసుపోక – చదవనివారికి ప్రత్యేకం

(ఎన్నెమ్మ కతలు 49)

రెండువారాలుగా జొరం వచ్చినట్టు ఉంటోంది నాకు. ఆ పుస్తకాలసైటు ఇంకొన్నాళ్లు చూస్తే గుండెపోటు కూడా వస్తుందేమో!

చూస్చూసి అలసి సొలసిపోతున్నాను. అలా అలసి సొలసిపోవడం మూలాన చిన్న కోపంలాటిది కూడా వస్తున్నట్టుంది.

రొంప చేస్తే జొరం వచ్చినట్టు అనిపించదూ, అలాగే అది కూడాను. నాలాగే అంగలార్చేవారు కొందరయినా వుండకపోతారా అని ప్రారంభించేను ఈ పిచ్చాపాటీ … ఇలాటివి సాటి బాధితులతో చెప్పుకుంటే మనశ్శాంతి కదా. అంటే నేనేదో పుస్తకద్వేషిని అనుకునేరు. అదేం కాదు.


నిజానికి నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం (వుండేది). అసలందుకే నేను లైబ్రరీ సైన్సు కోర్సు చేసేను. ఆ కోర్సులో చేరేముందు అప్పటి లైబ్రేరియను అబ్బూరి రామకృష్ణారావుగారు “ఎందుకు లైబ్రరీ సైన్సు చదవాలనుకుంటున్నావు?” అని అడిగితే, “నాకు పుస్తకాలంటే ఇష్టం అండీ” అని చెప్పేను కూడాను ఎంతో వినయంగా.
అయితే ఆయన అప్పుడు నాకు చెప్పి సువాక్కు మాత్రం నేను అంతగా పట్టించుకోలేదు అప్పట్లో. ఆయన ఏమన్నారంటే, “అమ్మా, మిఠాయికొట్టువాడు మిఠాయి ఎంత తింటాడో లైబ్రేరియను పుస్తకాలు అంతే చదువుతాడు” అని.

ఆమాటలో నిజం తెలియడానికి నాకు చాలా కాలం పట్టిందనుకోండి. అది వేరే సంగతి. ఇప్పటికీ నేను “చదువుదాం,” “తరవాత చదువుతాను,” “వీలు చూసుకుని చదవాలి, చదివితీరాలి”  (సత్యనారాయణవ్రతకథలోలాగ) అనుకుంటూ పోగు చేసిన పుస్తకాలు ఫొటో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ నా కెమెరా ఫ్రేములో ఇమడలేదు ఆ పోగు. నిజానికి ఇవన్నీ చదివితీరతాను. యమ సార్ వచ్చి , “పద, పద,” అన్నా కూడా, “లేదండీ, ఈపుస్తకాలు చదవకుండా నేనెక్కడికీ రాలేను. మరో పదేళ్ల తరవాత కనిపించండి,” అంటాను.

నాలాగే ఇంకా చాలామంది ఎప్పుడో ఒకప్పుడు చదువుదాం అనుకుంటూ ఎడాపెడా పుస్తకాలు పోగేసుకుంటున్నవారు వున్నారని నాకెరికే. అంచేత అన్నమాట ఈ వ్యథాపూరిత సొద.
నామనసులో మాట ఉన్నదున్నట్టు చెప్పేస్తాను. ఆతరవాత బుధవరులు మీరే ఆలోచించి ఇందులో న్యాయాన్యాయములు విచారించుకోండి.
అసలు పుస్తకంవారు రోజుకో వ్యాసం పెడితేనే నాకు ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఇప్పుడేమో ఒక్కొక్క వ్యాసంలో ఓ చిన్నలైబ్రరీ కేటలాగు ప్రచురించేస్తుంటే ఎలా తట్టుకోడం? చిన్నలైబ్రరీ అని ఎందుకు అంటున్నానంటే మన ఆంధ్రదేశంలో ఆమాత్రం పుస్తకసంచయం లేని గ్రంథాలయాలు వున్నాయి. ఈ “చదివేసిన” జాబితాలు చూస్తుంటే, యాడాదికో పుస్తకం చాలా ని ..దా … నం … గా … చదివే నాలాటివారిగతేం కానూ అని వారు క్షణమయినా ఆగి యోచించినట్టు అగుపించదు.
ఇంతకీ నన్ను బాధిస్తున్న ప్రశ్నలు –
ఇన్ని పుస్తకాలు వీళ్లందరూ ఎలా చదువుతున్నారు?
వీళ్లకేమీ ఉద్యోగాలు లేవా?
సంసారాలు లేవా?
వీళ్లు చదవడమే కానీ రాయడం చేయడం లేదా?
అదుగో అక్కడన్నమాట నావ్యథ మొదలయింది!

వాళ్లకి అవన్నీ వున్నాయి (ఉద్యోగాలూ, సంసారాలూ లేక మరోరకం బాధ్యతలూ …)
వాళ్లు అవన్నీ చేస్తున్నారు (రాయడం, ఇంకా ఏవో ..)
అవేవీ లేనిదాన్నీ చెయ్యనిదాన్నీ నేనే!

నాచిన్నప్పుడు అంటే మరీ చిన్నతనం కాదులెండి యమ్మే అయిపోయి లైబ్రరీలో ఉద్యోగం వెలగబెడుతున్న రోజులవి. అప్పట్లో మాపక్కింట్లో మామామయ్య వుండేవారు. ఆయనపిల్లల్లో ఒక అబ్బాయి నన్ను లైబ్రరీనించి నవలలు తెమ్మని చంపుకు తినేస్తుండేవాడు. మొదట్లో బాగానే సాగింది కానీ కొన్నాళ్లయేసరికి ఆ అబ్బాయి హుషారు పట్టపగ్గాల్లేకుండా పోయింది. మరి ఆరోజుల్లోనే కదా నవలోత్పత్తి భారీపరిశ్రమ స్థాయికి చేరుకున్నది కూడాను. మావాడు సంధి కొట్టినట్టు తెగ ఆరాటపడిపోతూ రోజుకోనవల తేతెమ్మని ఒహటే పోరు పెట్టేస్తుంటే నాకు తట్టుకోడం కష్టమయిపోయింది.

ఆఖరికి ఓరోజు అడిగేను, “ఇలా రోజుకో పుస్తకం చదువుతుంటే, నీకు ఎలా జ్ఞాపకం వుంటుంది? పోనీ, ఏ పుస్తకంలో ఏంవుంది అన్నమాట అడగను. అసలు ఏపుస్తకం చదివేవు అన్నదేనా జ్ఞాపకం వుంటుందా?” అని.
ఆసమయంలో నాకు తోచలేదు కానీ నాక్కూడా తెలియాలి కదా నేనేం తెచ్చి ఇస్తున్నానో. ప్చ్. ఏంచేసానో మరి నాకిప్పుడు గుర్తు లేదు.
నాప్రశ్నకి మామామయ్యకొడుకు సమాధానం మాత్రం గుర్తుంది, “అవును. అందుకే నేను చదివిన పుస్తకానికి వెనక అట్ట చింపేసి ఇస్తాను” అని.

దాంతో నాముఖాన పొద్దు పొడిచింది. నవలల పాలిట బకాసురుడిలా మామామయ్యగారి సుపుత్రుడు ఇలా పుస్తకాలు ధ్వంసం చేస్తున్నాడని మాలైబ్రేరియను కనుక్కుంటే నాఉద్యోగానికి ఎసరు అని గ్రహించి, నా పుస్తకాలబట్వాడా రద్దు చేసేశాను విత్ ఇమిడియట్ ఎఫెక్టు. మాపెద్దన్నయ్య కూడా ఇలాటి బకాసురుడే. ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికాతో సహా కనిపించిన ప్రతి కాయితం చదివేశాను అన్నాడోసారి నాతో.

ఇలా చదవడం నేరం నన్నడిగితే. ఎంచేతంటే, ఇలా చదివేవాళ్లు ప్రచురించిన పుస్తకాలన్నీ చదివేసింతరవాత, మళ్లీ వాళ్లకోసం కొత్తగా మరిన్ని పుస్తకాలు ప్రచురించాలి కదా. ఇలా ప్రచురించడంవల్ల పర్యావరణ పరిరక్షణకి అంతరాయం కలుగుతుంది. ఎలా అంటే, చెట్లు కొట్టి కాయితాలు తయారు చేస్తారు కాకుల్ని కొట్టి గెద్దలకి వేసినట్టు. అంతే కాదు. అలా కాయితాలూ, పుస్తకాలూ తయారు చేయడానికి యంత్రాలు వాడతారు. ఆ యంత్రాలవల్ల కూడా వాతావరణం మరింత కలుషితమయిపోతుంది.
ఇలా ఆలోచించినప్పుడు మౌఖిక సాహిత్యం విలువ మరింత గొప్పదిగా భాసించింది నాకళ్ల ఎదుట. అందులో కమ్యూనిటీ స్పిరిటుంది. అంచేత పుస్తకాలు దాచేసి, మౌఖికసాహిత్య సాంప్రదాయం పునరుద్ధరించాలని ఒక ఉద్యమం మొదలు పెడితే ఎలా వుంటుందో అన్న ఆలోచన కూడా వస్తోంది ఇప్పుడు నాకు.
ఇలా సుదీర్ఘంగా ఆలోచించి, “యేటికోటి” ఉద్యమం మొదలు పెడితే నయం అన్న నిర్ణయానికొచ్చేను. అంటే ఒక యేడాదికి ఒక పుస్తకం కంటే ఎక్కువ చదవరాదు అని అన్నమాట.

అంతేకాదు అలా ఎవరైనా ఎక్కువ చదివితే, వారికి ఒక కఠినపరీక్ష పెట్టాలి. అంటే ఏపుస్తకం ఎవరు రాసేరు, లేక ఎన్ని పేజీలుంది లాటి చిన్న పరీక్ష కాదు. ఫలానా పుస్తకంలో మూడొందలముప్ఫైనాలుగో పేజీలో పెద్దాయన చిన్నకొడుకు పొరుగింటికి వెళ్లినప్పుడు గోడమీద పిల్లిబొమ్మ వుందా? ఎలకబొమ్మ వుందా? – లాటివన్నమాట. (ఇలాటిప్రశ్నలు ఏపుస్తకమో చదివితే రావు. టీవీల్లో గేంషోలు కానీ, స్లమ్ డాగ్ మిలియనీర్‌లాటి సినిమాలు గానీ చూసి నేర్చుకోవాలి.)

ఈ ప్రతివాదన మీకు నచ్చితే చెప్పండి, “యేటికోటి” లేక “చ.త.చ.ఎ.చ.తీ.సం. (చదువుతాను, తరవాత చదువుతాను, ఎప్పుడో చదివితీరాలి సంఘం)” ఒకటి మొదలు పెడదాం.
ఛట్, మాకివేవీ నచ్చలేదు, మేం “చదివేసిన” పార్టీలో చేరిపోతాం అంటే, సరే వెళ్పోండి. అపార్థం చేసుకోను..
ఇదుగో సదరు చిరునామా కూడా ఇచ్చేస్తున్నాను. పుస్తకం.నెట్

(25 జనవరి 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

20 thoughts on “ఊసుపోక – చదవనివారికి ప్రత్యేకం”

 1. @ సిరిసిరిమువ్వ, సరేనండీ అడగను. నిజానికి మీరు ఇటొచ్చీ పదిరోజులకంటే ఎక్కువే అయింది మీపనుల్లో మీరు గమనించలేదేమో గానీ 🙂

  మెచ్చుకోండి

 2. ఓ పదిరోజులు బ్లాగుల వంక చూడకపోతే మీలో మీరు ఇలా సంఘాలు పెట్టేసుకుంటారా? నాకు సభ్యత్వం వద్దు కాని చదివినవాటి గురించి వ్రాయమని మాత్రం అడగకండేం!

  మెచ్చుకోండి

 3. @ రాధిక, ఇక్కడ వ్యాఖ్య పెడితే సభ్యులు అయిపోయినట్టే లెఖ్క. ఎందుకు చదవలేకపోతున్నావో కారణాలు తెలిసినప్పుడు తెలియజేయి. మాకు కూడా పనికిరావొచ్చు.
  @ పరిమళం, అదేనండీ, ఇక్కడ మీనిశానీ కనిపిస్తే, యంత్రవతుగా చేర్చేసుకుంటున్నాం. మాకిష్టం లేదని ఎవరైనా ప్రత్యేకించి చెప్తే తప్ప 🙂 – ఇది నాలేటెస్టు రూలుగా అందరూ గ్రహించవలెను.
  – మాలతి

  మెచ్చుకోండి

 4. ఒకప్పుడు కాగితం కనపడితే చాలు కొరుక్కు తినేసి,ఇప్పుడు చదవకుండా వుండడానికి కారణాలు వెతుక్కుంటున్న నాలాంటి వాళ్ళకి సభ్యత్వం ఇస్తారా మాలతి గారు?

  మెచ్చుకోండి

 5. @ జంపాల చౌదరి, అయ్యో లేదండీ మీరు నన్ను కష్టపెట్టలేదు. అంచేత దుష్టత్వం కూడా లేదు. మీరలా రాయబట్టే కదా నేనిలా రాసి ఇంత సరదా నొల్లుకున్నాను. 🙂

  మెచ్చుకోండి

 6. @ మాలతి:
  సభ్యత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  నిన్నటి నా వ్యాఖ్యలో మొదటి వాక్యం – పుస్తకంలో లిస్టులు రాసి మిమ్మల్ని కష్టపెట్టిన దుష్టుల్లో… అని ఉండాల్సింది. తచ్చు అప్పుకు చింతిస్తున్నాను.
  నా పోస్టులకు, మీ పుస్తకాలకు ఈ నిబంధనలు వర్తించవనేది మన్లోమనకి అండర్‌స్టాండింగ్.

  మెచ్చుకోండి

 7. @ శరత్ కాలమ్, లేదులెండి. నాకు తెలుగు పేర్లే ఇష్టం. అది కూడా ఒక పరీక్షే అనుకోండి.

  @ జంపాల చౌదరి, మీసభ్యత్వం అంగీకరింపబడినది, ఇది నాపుస్తకాలకి మాత్రం వర్తంచదు అని గమనించాలి
  @ వైదేహి, నీ సంగతి తెలుసు కనక, అధ్యక్షపదవే నీది
  @ విబిసౌమ్య, పైవారివలెనే, నువ్వు చదువుతున్నవి నాకోటాకి మించినవి. అయినా నీమీద అభిమానంచేత నీ సభ్యత్వం కూడా ఆలోచించాల్సిందే.
  మీరందరూ ఇంత మంచి స్పిరిటుతో ఇది స్వీకరించినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. అక్కడ రాస్తున్నప్పుడే సిగ్గుతో రాస్తున్న అని చెప్పేసా – కనుక, నేను కూడా ఈ సంఘం లో చేరొచ్చు 🙂
  Nice post!!

  మెచ్చుకోండి

 9. అధ్యక్షా,
  మీ సంఘంలో ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉందా?
  ఇండియాలో,అమెరికాలో,వెబ్సైట్లలో ఎడతెరిపిలేకుండా కొన్నపుస్తకాలే కాక సహృదయులైన స్నేహితులు,పెద్దలు 2009 లో ఇచ్చిన పుస్తకాలు ఇంకా చదవలేదు మరి.
  ఇప్పుడల్లా చదవగలననే ఆశా లేదు.
  ఓ ఆరునెలలు వెకేషన్ తీసుకుని చదువుదామన్న బ్రిలియంట్ ఐడియా లేకపోలేదనుకోండి 🙂

  వైదేహి

  మెచ్చుకోండి

 10. పుస్తకంలో లిస్టులు రాసి మిమ్మల్ని న దుష్టుల్లో ఒక్కణ్ణి ఐనా, సహనేరస్తులు కొంతమందికూడా సభ్యత్వం అడగుతున్నారు కాబట్టీ, నాక్కూడా చ.త.చ.ఎ.చ.తీ.సం. (ముఖ్యంగా తెరపిలేకుండా వస్తున్న బ్లాగులూ, వెబ్‌సైట్ల విషయంలో) సభ్యత్వానికి అర్హతలున్నాయి కాబట్టీ, సంఘంలో చేరకపోతే కఠిన పరీక్షలకు గురిచేస్తారన్న భయం వేస్తుంది కాబట్టీ, సదరు సంఘంలో సభ్యత్వం కోరుతూ, ఇందుమూలముగా నా సభ్యత్వఫారం దఖలు చేసుకొంటున్నాను.

  మెచ్చుకోండి

 11. పుస్తకాలు చదవడానికై ఒక జాయిట్ ఏక్షను కమిటీ పెట్టకూడదూ. మీ సంఘం పేరు గుర్తుండేలా లేదు. జాక్ అని పేరు పెడితే ట్రెండుకి సరిపోయినట్లూ వుంటుంది.

  మెచ్చుకోండి

 12. మీ అందరి వ్యాఖ్యలు చదువుతుంటే పట్టలేనంత నవ్వొచ్చింది. మీచేత ఇలా రాయించడానికైనా నేను రాస్తూ వుండడానికి నిశ్చయించుకున్నాను.
  @ మధురవాణి, మిమ్మల్ని నాజట్టులో చేర్చేసుకున్నాను. 🙂
  @ శ్రీలలిత, అవునండీ, ఆబాధలు కూడా వున్నాయి. ఎంతకని ఓర్చుకోను! 🙂
  @ కల్పన, నాజట్టు అంటే ఒప్పుకోను. నువ్వు చదివినవి కూడా చాలా వున్నాయని నాకు తెలుసుకదా.:)
  @అరుణపప్పు, అదేమిటి మీరు కూడా వాళ్లలోనే కలిసిపోయి, పెద్ద జాబితా ఇచ్చేరు కదా. ఇప్పుడు ఇటొచ్చేస్తారా?
  @ భావన, ఏవూరో ఎందుకులెండి. ఆ లైబ్రేరియను ఇప్పుడు నన్ను ఫైను కట్టమంటే నేను తల తాకట్టు పెట్టుకోవాలి. మీ వ్యథలలిస్టూ, పరీక్షల్లో ప్రశ్నలూ నోట్ చేసుకుంటున్నా. శ్రీలలితకి మీసలహా కూడా బాగుంది.
  @చదువరి, ఏటిక్కోటి – అమ్మో, నేనింక కంప్యూటరు సన్యాసం పుచ్చుకోవాలి 🙂

  మెచ్చుకోండి

 13. 🙂 పుస్తకాలు చదివెయ్యడం పర్యావరణం పట్ల ఎంత ఘాతుకమో ఇంతలా మీరు విడమరచి చెప్పాక కూడా పుస్తకాలు విరివిగా చదవడమంటే అది ఘోరమైన నేరం కింద లెక్ఖే! దీన్ని అరికట్టడానికి మీరు సూచించిన చిట్కాలు మహ బాగున్నాయి. ముఖ్యంగా యేటికోటి! అయితే మనం యేటికోటి అని అంటూంటే, పుస్తకప్రియులు యేటిక్కోటి అనో పూటకోటి అనో మొదలెడతారేమో గమనిస్తూండాలి.

  మెచ్చుకోండి

 14. నేను.. నేను…. నేను కూడా మెంబర్ నవుతాను మీ సంఘం లో. మీకు కూసంత కోపమా నా కైతే కచ్చి పుడుతుంది ఇన్నేసి పుస్తకాలు చదివేసి, మళ్ళి రివ్యూ లు రాసేసి, మళ్ళీ అన్ని పుస్తకాలు గురించి చర్చలు, ఇవన్ని పైపైన చూసి,చదవటానికి ప్రయత్నిస్తున్న నా గుండెలో మంటలు రేపేసి… నన్ను ఈర్ష్యా అసుయలతో మండించేసి తరువాత నా అజ్నానికి నన్నే ఏడిపించి.. అబ్బ ఆయాసం వస్తోంది లిస్ట్ రాయాలంటే. ఆ కచ్చి పట్టలేక మీకు మల్లేనే ఆ 334 పేజ్ లో ఏమన్నారు, అనుక్షణికం లో 250 వ పేజ్ లో పలానా అబ్బాయి 450 పేజ్ లో అమ్మాయి కేమవుతుంది లాంటి పరిక్షలు పెట్టేసి హాయి గా నవ్వేసుకోవాలని ఒకటే ఇది. మీ మావయ్య గారి అబ్బాయి సూపరండి బాబు 🙂 ఏ వూరు లో ఇది ఎందుకంటే నా చిన్నప్పుడూ లైబ్రరీ నుంచి అట్టలేని పుస్తకాలు తెగ వచ్చేయి నాకు 😉
  శ్రీ లలిత నేను మీకు లానే దిగులు పడీ తరువాత ఎదురు దాడి మొదలెట్టేను ఎందుకు అలా వో వండుకుంటారు వంటికి మంచిది కాదు అన్ని వెళ్ళి కొంటారు డబ్బులు దండగ అంటూ జెలసీ ను అలా ప్రదర్శించటం మొదలెట్టే పాపం కొందరు నా మాటలు విని నిజమే అని వాళ్ళ శక్తి ని వుపయోగించటం కూడా మానేసేరు. హి హి హి 😉

  మెచ్చుకోండి

 15. పుస్తకం వాళ్లు చేస్తున్న పని ఏమీ బావులేదండీ. రాయండి అని మంచి మాటలతో చెబుతారా, ఎలాగూ మనం వినే రకం కాదని కొన్ని వాళ్లే వేసేస్తారు. దాంతో మీరన్న ఫీలింగ్సు ఎక్కువయిపోయి ఈ చిన్న హృదయం, పిచిక బుర్ర పిగిలిపోయేంత టెన్షనొస్తూంటుంది. పెద్దవాళ్లు మీరు చెబితే వింటారేమో చెప్పి చూడండి. మీరన్న ’యేటికోటి‘ వ్రతం చాలా బావుంది.

  మెచ్చుకోండి

 16. నాకొచ్చిన సందేహాలకు మరి కొన్ని మీరు యాడ్ చేసి రాసినట్లు అనిపించింది . నా వ్యధని మీ మాటల్లో చదువుకున్నాను. బాగా రాశారు. మధురవాణి మాటే నాది కూడా. నాకు కూడా తొందరగా ఆ సభ్యతమ్ ఏదో ఇవ్వండి అధ్యక్షురాలు గారు.

  మెచ్చుకోండి

 17. మాలతిగారూ, మీరు ఎంతో గౌరవంగా పుస్తకాలు ఎలా చదివేస్తున్నారన్న ఆలోచన రేపారు. నాకైతే రోజూ చేసే పని కూడా అలాగే అనిపిస్తుంది. ఎవరైనా కనిపించినప్పుడు “ఇవి వండాము, అలా షాపింగ్ చేసాము, ఈ బొమ్మలు చేసాము, ఈ సినిమా చూసాము” అని ఎన్నో పనులు చేసినట్లు చెప్పెస్తే నాకెంత దిగులేసేదో..” ఛఛ.. నేనేమీ చేతకానిదాన్నేమో.. నాకేమిటో ఇంట్లో పనే తెమలట్లేదు” అనుకునేదాన్ని. మీ టపా చదివితే అదే గుర్తొచ్చింది. నేనూ మీలాంటిదాన్నే. అందుకని నన్ను కూడా సభ్యురాలిగా చేర్చుకుంటారని ఆశిస్తూ…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s