ముగ్ధ

(1959నాటి కథ)

సుబ్బలక్ష్మితో అచ్చనకాయలాడుతూ కూచుంటే టైమెంతయిందో నాకే తెలీదు. సబ్బలక్ష్మి వాళ్లమ్మ సంజెదీపం పెట్టడం చూసి చేతిలో రాళ్లు చెప్పున వదిలేశాను. అప్పుడు గుర్తొచ్చింది ఆకలి. రేపొస్తానని సుబ్బలక్ష్మికి చెప్పి ఇంటికి వస్తూంటే ఆలస్యమయినందుకూ, కొత్తపరికిణీ మాపుకున్నందుకూ అమ్మ ఏమంటుందోనన్న భయం జ్ఞాపకం వచ్చింది.

“అదుగో వచ్చింది” అన్నారు గుమ్మంలో నిలబడ్డ నన్ను చూపించి నాన్న. అమ్మ రేపటికూరకి కాబోలు గోరుచిక్కుడుకాయలు ఈనెలు తీస్తోంది నట్టింటిగుమ్మంలో కూచుని.

“గుంటూరులో బాబాయిదగ్గర వుండి చదువుకుంటావుటే” అంది నావేపు చూడకుండానే అమ్మ.

“నాకు మళ్లీ ట్రాన్స్‌ఫర్ అయింది. నాతోపాటు నువ్వు కూడా వూరూరా తిరిగుతుంటే చదువు ఏం సాగుతుంది? గుంటూరులో బాబాయిదగ్గిర ఉండి చదువుకో యస్సెల్సీ అయేవరకూ.” అన్నారు మంచీ చెడు వివరస్తూ.

అక్కడ బామ్మకూడా ఉందిగా. మేం కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి పోతూంటాంలే,” అంది అమ్మ.

“మీయిష్టం” అనేసి కొత్తపరికిణీ మాసినట్టు వాళ్లు పసి గట్టకముందే పక్కగదిలోకి వెళ్లిపోయా.

మర్నాడు అమ్మ పెట్టే సర్ది, జాగ్రత్త అని నాలుగుమార్లు చెప్పింది. బండి ఎక్కేవరకూ బామ్మదగ్గరకే గదా వెళుతున్నది అని సరదాగానే వున్నా. బండి ఎక్కేవేళకి చప్పున దుఃఖం – పిలిచిన పలుకు తల్లి – వచ్చేసింది. కాని ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏడవకూడదని బామ్మ చెప్పింది. పరికిణీలో మొహం దాచుకుని బండిలో కూచున్నాను. “రామలక్ష్మణుల”మెడలో గంటలు ఘల్లున మోగాయి. వెధవఉద్యోగం అనిపించింది. లేకపోతే ఏమిటి? అప్పుడు నాచిన్నప్పుడు “అమ్మ, నాన్న, బామ్మ” బాబాయి, అందరం ఎంతో చక్కా కలిసి ఉండేవాళ్లం. అప్పుడూ ఇలాగే నాన్నకి ట్రాన్స్‌ఫరయిపోయింది.

గుంటూరులో నాన్నగారు నన్ను వదిలేసి వెళ్లిపోయారు. జాగ్రత్తగా ఉండమనీ, బుద్ధిగా చదువుకోమనీ, అల్లరి చెయ్యొద్దనీ, అచ్చనగాయలు ఆడొద్దనీ – చెప్తూన్నంతసేపూ గంగడోలులా ఉపాను తల.

“బామ్మ ఉందిగా” అన్నారు ఆఖరిమాటగా.
 “ఊఁఠ అన్నాను.

నాన్నగారు వెళ్లిపోయారు.

“అట్లా నిలబడిపోయావేం? ఇక్కడ కాఫీ చప్పగా చల్లారి తగలడుతోంది” అంటూ వంటింట్లోంచి పిన్ని స్వరం ఖణేల్మంది – మా “రామలక్ష్మణుల”మెళ్లో గంటల్లా. ఏదో బెంగగా వుంది. మెల్లిగా మాటాడరాదూ అనిపించింది.

కాఫీ తాగేసి, స్నానానికని బట్టలు తీసుకుొని స్నానాలగదివేపు వెళ్లేను. అక్కడ సిమెంటుతొట్టెలో కొళాయినీళ్లు వున్నాయి – చల్లగా. మావూళ్లో వెచ్చవెచ్చగా నేనే తోడుకుని పోసుకునేదాన్ని. కొళాయినీళ్లు నాకు నచ్చలా. ఎండాకాలంలో వేడిగా వుంటాయి, చలికాలంలో చల్లగా వుంటాయి – నామొహంలా. ఈవేళకి బింబో ఏంచేస్తుంటాడో, లేగదూడతో ఆడుకుంటుంటాడో, అమ్మ ముగ్గులు పెడుతుంటే నేనూ అంటాడు ఆడపిల్లలాగ.

“ఎంతసేపు ఆ జలక్రీడలు, అక్కడ్నుంచి వచ్చేదేమైనా వుందా? అక్కడే కాపురముంటావా?” పిన్ని మళ్లీ కేకేసింది.

“వస్తున్నా బట్టలారేసుకుని వస్తా.”

“బట్టలు చాకలికి వెయ్యొచ్చుగా. బడికి వేళవుతూంది. కాస్త పాఠాలు చూకోరాదూ?”

అదేమిటో పిన్ని మాటాడుతుంటే గుండెలు దడదడలాడతాయి.

“తడిపేశాగా. ఆరేసుకుని వస్తా,” అన్నాను బుట్టలా లేస్తున్న లంగా రెండు చేతులతో నొక్కి పెడుతూ.

“ఎందుకు తడిపేవు? నన్నడిగితే చెప్పేదాన్నిగా.”

నాకు కోపం వచ్చింది. నాబట్టలు నేను ఉతుక్కుంటే తనకెందుకు? నేనేం ఇంకోళ్లబట్టలు ఉతుకుతున్నానా? నాబట్టలు ఇంకోళ్లని ఉతకమన్నానా?

“ఉతుక్కోకపోతే చాలవు. నాకు నాలుగుజతలే వున్నాయి.”

పిన్ని వెనుతిరగ్గానే బట్టలు త్వరత్వరగా ఆరేసి ఇంట్లోకి వచ్చేశాను. పిన్ని అన్నం వారుస్తోంది. మడి కట్టుకోలేదు. మరి బామ్మకెట్లా? పరుగెత్తుకుని వీధివరండాలోకి వెళ్లాను.

“బామ్మా! పిన్ని మడి కట్టుకోకుండానే వంట చేస్తూంది,” అన్నా వగరుస్తూ. ఇక్కడ అన్నీ విచిత్రంగానే వున్నాయి. ఏవేళప్పుడు చూసినా అధ్యాత్మరామాయణమో సీతారామాంజనేయమో చదువుకునే బామ్మ సినీరమ చూస్తూంది! నేను ఆశ్చర్యంతో చచ్చిపోతానేమో అనిపించింది.

“పిన్ని మడి కట్టుకోలేదు” అన్నాను తిరిగి.

“అవును. చన్నీళ్లస్నానం పిన్నికి పడదు. ఇంతకీ నీకు బడికి పోయే ఉద్దేశం లేదాయేం?” అంది బామ్మ సన్నగా నవ్వుతూ.

“ఏంటి బామ్మా! అమ్మకి పడలా? పిన్ని అమ్మకంటే చిన్నదాయేం?” బామ్మ కూడా ఇంత అన్యాయంగా ఎందుకు మాటాడుతుందో నాకు అర్థం కాలేదు.

నాక్కోపం వస్తుంటే బామ్మకి నవ్వొస్తూంది. “అమ్మతరఫున వకాల్తా పుచ్చుకుని నువ్వు పోటాడేట్టున్నావే. పో, పో. నీతెలుగుపుస్తకం తీసుకరా,” అంది. విక్రమార్కుడిసింహాసనం పాతినచోట నిలబడితే గొల్లవాడికి కూడా ధర్మబుద్ధి పుట్టిందిట. ఆబాబాయి ఇంట్లో వాళ్లందరూ ఒక్కరకంగా మాట్లాడుతున్నారు. స్కూలుకి టైము అయేవరకూ నాకిచ్చిన చిన్నగదిలో పుస్తకాలు సర్దుకుంటూ కూర్చున్నా. బైటికి రాబుద్ధి కాలేదు. అమ్మ ఏం చేస్తోందో? కొత్తబడి ఎట్లా ఉంటుందో …

“బజారుకి వెళ్లాలంటే వినరు. మళ్లీ గంట కొట్టేసరికి తయారవుతారు వంటింట్లో. ఏం తగలేసేది కంచంలో …”

పిన్ని ఇట్లా మాట్లాడుతుంటే సుడిగాలికి చెఱుకుతోట ఫెళఫెళ్ళాడినట్లుంటుంది. అదేమిటో! ఎక్కడో గయ్యాళిగంపకి మల్లే వుంది. ఆవిడచేతిలో బాబాయి ఒఠ్ఠి కీలుబొమ్మ. పిన్ని అన్నిమాటలు అంటుంటే బాబాయి  ఒక్కమాట కూడా అనడు. బామ్మ కూడా ఏమీ అనదు.

నాచిన్నప్పుడు నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు నాన్న బామ్మని ఎంతగా బతిమిలాడారు మాతో వచ్చేయమని. “పెద్దకొడుకుదగ్గర చచ్చిపోతే కాశీలో చచ్చిపోయినట్టు”ట. బామ్మ ససేమిరా రానంది. “ఈవూరు నాకు కన్నతల్లివంటిది. ఈగడ్డమీద పుట్టాను. ఈగడ్డమీదే ఒరగాలి” అంది. అసలు సంగతి అది కాదు. బామ్మకి బాబాయి అంటే ఇష్టం. లేకపోతే అమ్మ పిన్నికంటె ఎంతబాగా చేస్తుంది సేవలు.

“ఏవమ్మో సీతీ! వచ్చి ముద్ద మింగి పో. వేళవుతోంది.”

సీతాదేవీ! అనకూడదూ? సీతీట, సీతీ .. .సుబ్బీ అన్నట్టు.

కంచంవైపు చూస్తే ఏం తినాలో నాకే తెలియలేదు. దోసకాయ పప్పూ, గోంగూర పులుసూ, దబ్బకాయ ఊరగాయా – ఇందులో తినేదేమిటి నాతలకాయ. పైగా అన్నిట్లోనూ నన్ను తినేసే ఖారం. ఈవిడకి పుట్టింటివాళ్లు రెండెకరాల మిరపతోట ఇచ్చేరుట. ఈవిధంగా అందరికీ తెలియజేస్తుంది కాబోలు ఆ వైభోగం!

“తినవే. త్వరగా కానియ్. మీఅమ్మకి మల్లే కాకలు తీరినచెయ్యి కాదు. నీరుచులకి చాలవ్ కాబోలు.”

అబ్బబ్బ, ఆతిట్లు మానేస్తే కడుపునిండా తిండి పెట్టినంత ఫలం. చిన్నప్పుడు ఓకథ చదివేను. ఓపంతులుగారి భార్య పులుసుకుండ ఆయననెత్తిన పగలగొట్టి ఏగానీ తెమ్మందిట. నేను కూడా …

“ఏమిటా నవ్వులు కంచంలో చెయ్యేసుకుని? పిన్నివంట నవ్వుగా వుందేం?”

“నాకు పెరుగు పొయ్యి,” అన్నా అన్నం అంతా పక్కకి నెట్టి, మొహం మొగలిపొదలా చేసుకుంటూ.

“దానికి వేపుడుకూరలు తప్ప దిగవ్,” అంది బామ్మ, పులుసు కలుపుకుంటూ.

“వేపుడుకూరలూ, ఆవకూరలూ తిని గుంటూరులో బతికేనా? ఆఅన్నం ముందుకి తియ్. పులుసు సయిస్తుంది,” అంది పిన్ని అథార్టీ చేస్తూ.

“నాకాకల్లేదు.”

“ఏఁవొచ్చిందీ ఆకల్లేకపోవటానికి? అయినా ఇది ఎవరిపోలిక? అట్లా పండుమిరపకాయల్లే మొహం పెట్టుక్కూచుంటుంది.”

“నీపోలిక కాదులే.”

వీపు ఫెళ్లుమంది. “పెద్దా చిన్నా లేదూ? నోటికెంతొస్తే అంతా?”

“ఊరుకో అమ్మా!” అన్నాడు బాబాయి.

“పోనీలెండి. చిన్నపిల్ల దానికేం తెలుసు. అయినా నిజమే చెప్పిందికదా,” అంది పిన్ని నవ్వుతూ, తనేదో అక్కడికి మహా మంచిదయినట్టూ, బామ్మ కానట్టూ.

గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ వెళ్లి చెయ్యి కడుక్కున్నాను.

స్కూలు కూడా నచ్చలేదు. కొత్తపిల్లని కదా. ఒక్కరైనా పలకరించలేదు. వాళ్లలో వాళ్లు మొహాలు చూసుకోటమూ, నామొహం చూట్టమూను.

స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి వచ్చేశాను ఎవ్వరితోనూ మాటాడకుండా. ద్వారాన్నానుకుని నిల్చున్నా. మావూళ్లో అమ్మ, బామ్మ ఎవరున్నా బడిబట్టలు మారిస్తే కానీ ఇంట్లోకి రానివ్వరు. మరి పిన్ని ఏమంటుందో?

“అట్లా నిలబడిపోయావేం? టిఫిను చల్లారిపోతూంది. త్వరగా కాళ్లు కడుక్కుని రా.”

“మరి బట్టలు మార్చుకోవద్దూ?” నానోటితోనే చెప్పడం ఇష్టం లేకపోయినా తప్పింది కాదు.

పిన్ని మళ్లీ ఘల్లుమంది. “అయితే, అక్కడే వీధిలోనే మారుస్తావా? నాపెట్లో ధర్మవరం చీరె వుంది. రెండు చేస్తే ఓణీలు వేసుకోడానికి పనికొస్తాయి. అది మడత పెట్టుకుంటే రేపటికి పనికొస్తుంది.”

పిన్నిదంతా ఒక తంతుగా వుంది. అవ్నీ తాకితే ఇహ మళ్లా మార్చడం ఎందుకు? “మానాన్న నాకు కొత్తవి తెస్తార్లే,” అన్నాను.

“ఓయబ్బో, పౌరుషమూ …” అంది పిన్ని దీర్ఘాలు తీస్తూ.

ఇంతలో బాబాయి కూడా వచ్చేరు. ఇద్దరికీ రెండు ప్లేట్లలో పకోడీలు తెచ్చింది. జీడిపప్పు లేదు సరికదా వాటిల్లో ఉల్లిపాయలు వేసింది. బామ్మ ఎట్లా తింటుందని? “నాకివేమీ వద్దు” అన్నాను.

“ఏం?” పిన్నీ, బాబాయి ఒకేసారి ప్రశ్నించేరు.

“బామ్మ తింటే నేనూ తింటాను,” అన్నాను కాలిబొటనవ్రేలితో నేల రాస్తూ. పిన్నీ, బాబాయి – ఇద్దరూ పకపక నవ్వేరు.

“ఓయబ్బో, నీకున్న ప్రేమ నాకెందుకుంటుంది? నీకు బామ్మయితే నాకు బామ్మా?” అంది పిన్ని.

“నీకు అత్తగారు కాదా?” ఇప్పుడు చెప్పు అన్నట్టు ఎదురుప్రశ్న వేశాను.   

పిన్ని ఇంకా నవ్వుతూనే వుంది. “నా బంగారుతల్లీ, బామ్మ ఫలహారం మూడింటికే అయిపోయింది కానీ తిను.”

పెద్దవాళ్లతో మాటలేమిటి? బాబాయి చెప్పినట్టు పొద్దున సరిగా అన్నం తినలేదేమో ఆకలి మాడ్చేస్తోంది. మెదలకుండా పకోడీలన్నీ తినేసి నాగతిలోకి వెళ్లిపోయాను. నాకెంత ఆలోచించినా అర్థం కాలేదు. బామ్మ ఉల్లిపాయ పకోడీలు ఎలా తింటుంది? పిన్ని పోట్లాడి తినిపించిందేమో. అంతపనీ చేసేట్టుగానే వుంది పిన్ని వాలకం చూస్తే.

“ఏయ్, సీతా! లే. లే. ఇంకా చదువుకుంటున్నావేమో అనుకున్నా పిలిస్తే పలక్కపోతే. అట్లా నిద్ర పోకపోతే వచ్చి అడిగితే అన్నం పెట్టేదాన్నిగా. లేచి నాలుగు మెతుకులు తిని పడుకో, రా.”

మత్తుగా తూలుతున్న నన్ను చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కంచందగ్గిర కూచోబెట్టింది పిన్ని. బాబాయి అప్పటికే కంచంముందు కూచుని వున్నాడు. “అన్నం తినేసి పడుకోలేకపోయావా?” అన్నాడు నన్ను చూచి.

నేను మాట్టాడలేదు. తింటున్నంతసేపూ నిద్ర వస్తూనేవుంది. పిన్ని గోలగా ఏదో చెప్తోంది. అట్లాగే భోజనం అయిందనిపించి పక్క పరుచుకుని పడుకునేవేళకి నిద్ర తేలిపోయింది. ఇక చచ్చినా రాదు నిద్ర. అటూ ఇటూ పొర్లుతుండగానే పది గంటలు కొట్టటం వినిపించింది. పిన్ని బామ్మకి రాత్రికి పూరీలు చెయ్యలేదు. పాపం బామ్మ ఏమీ తినకుండానే పడుకుంది. రోజూ ఇంతే?!

నెమ్మదిగా లేచి వంటింటివేపు వెళ్లాను. పిన్నీ, బాబాయీ పక్కగదిలో నిద్ర పోతున్నారు. బామ్మ వరండాలో పడుకుని వుంది. సొమ్మసిల్లిపోయిందేమో.

బుడ్డిదీపం వెలిగించి, వంటింటితలుపులు చారవేశాను లైటు ఎవరికీ కనిపించకుండా. కానీ ఏడబ్బాలో గోధుమపిండి ఉందో నిప్పు చెయ్యటానికి అగ్గిపెట్టె ఎక్కడ వుందో? చప్పుడు చెయ్యకండా వెతుకుతున్నా. అన్ని సామాన్లూ దొరికేటప్పటికి నాలుగుగంటలు అయివుంటుందనిపించింది నాప్రాణానికి. గ్లాసుతో బిందెలోనుండి నీళ్లు తీస్తుంటే ఠంగుమంది. “చచ్చా”ననుకున్నా. తలుపుచాటున నక్కాను. “పాడు ఎలకలు, ఒక్కరోజు తలుపు వెయ్యటం మర్చిపోతే చాలు,” అంటూ పిన్ని బయట గొళ్లెం పెట్టేసింది. నేను వంటింట్లో ఇరుక్కున్నా.

ఇప్పుడు పూరీలు చేసినా బామ్మకి అందేదెట్లా? బామ్మకి తెలీదాయె .. పోనీ బామ్మని పిలుద్దామంటే పిన్నిగానీ లేస్తుందేమో. పిన్నికి తెలిసిందంటే నాకిక్కడే కపాలమోక్షం ఖాయం. మావూళ్లో అమ్మ హాయిగా నిద్రపోతూ ఉంటుంది కాబోలు. అటూ ఇటూ చూస్తుంటే పెరటితలుపు కనిపించింిద. ఫరవాలేదు. ఆతలుపు తీసుకుని ప్రక్కసందుగుండా వరండాలోకి పోవచ్చు.

పూరీలపిండి కిలిప ప్రక్కన పెట్టి కిరసనాయిలు కుంపట్లో పోశాను. నిప్పు అయి నూనే కాగేలోపల పూరీలు వత్తేస్తే వేయించటం నిముషం కూడా పట్టదు. కిరసనాయిలు సీసా నిండుగా వుంది కాబోలు కాస్త ఎక్కువే పడ్డట్టుంది, అయితేనేం లే, త్వరగా నిప్పు అవుతుందనుకుని అగ్గిపుల్ల గీశాను.

“అమ్మో, మంటలు నాఎత్తున”

కళ్లిప్పి చూసేటప్పటికి పిన్ని ఒడిలో వున్నాను. తనకొంగుతో విసురుతోంది. బామ్మ ఒకప్రక్కన కూర్చుని ఉంది. కానీ …  పిన్ని?

భయంగా చూస్తూ బామ్మవైపు ఒరిగాను.

“ఏం చేస్తున్నావిక్కడ? ఇందాకా ఎలుకపిల్లవి నువ్వేనా?” అంది పిన్ని నెమ్మదిగా నవ్వుతూ.

“బామ్మకి రాత్రికి నువ్వు పూరీలు చెయ్యలేదుగా. అందుకని నేను చేస్తాను అని,” అన్నాను వస్తున్న ఏజుపు ఆపుకుంటూ. చలిజ్వరం వచ్చినట్టు వణుకు వస్తోంది.

“ఇంత అమాయకప్పిల్లవయావేం?” అంది పిన్ని బుగ్గ గిల్లుతూ.

పిన్నికి కోపం ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు.

“సరేలెండి. అర్థరాత్రి అంకమ్మశివాలని. బాగుంది. పదండి. పడుకోండి. కాస్తలో ప్రమదాం తప్పింది. పద, నాదగ్గిర పడుకుందువు గానీ నువ్వు,” అని బామ్మ బాబాయినీ, పిన్నినీ పంపించేసి, నన్ను చెయ్యి పుచ్చుకుని వరండావేపు తీసుకెళ్ళింది.

బామ్మ ప్రక్కన పడుకోగానే నాకు అమ్మ జ్ఞాపకం వచ్చింది.

“మనవూరు వెళ్లిపోదాం, రా బామ్మా! మనం ఇక్కడ ఉండొద్దు. పిన్ని మంచిది కాదు.”

“ఛా, అట్లా అనొచ్చా? పిన్ని చాలా మంచిదమ్మా. నాఅలవాట్లు పిన్నికి తెలీవు. పైగా అర్భకురాలు. ఎన్నని చేస్తుంది చెప్పు? నేనూ పెద్దదాన్నయిపోయాను. అందుకని అవన్నీ వదిలేసుకున్నాను. నీకు అవన్నీ అర్థం కావు,” అంది బామ్మ నాముంగురులు సవరిస్తూ.

బామ్మ చెప్పింది అర్థం చేసుకోటానికి కొద్దిసేపు ఆలోచించాను. పున్నమిచంద్రునివెన్నెల బామ్మముఖంమీద పడుతోంది. బామ్మ సన్నగా నవ్వుతోంది.

“నువ్వు చాలా మంచిదానివి బామ్మా,” అన్నాను బామ్మవైపు తిరిగి పడుకుంటూ.

(విశ్వవీణ. నవంబరు 15, 1959).

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ముగ్ధ”

 1. @ శ్రీదేవి, మీ ఆదరాభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను.

  మెచ్చుకోండి

 2. యీ కధ చదివే సమయంలో అరవై యేళ్ళు సినిమా రీళ్ళు తిరిగినట్లు తిరిగి నా బాల్యపు రోజుల్లో నిలిచాయి .నిజ జీవిత ఘటనల చిత్రీకరణ.అప్పటి కాలపు నేపధ్యంలో అత్యధ్భుతంగా చిత్రీకరించారు. దైనిక జీవన శైలి లోని వ్యత్యాసాలు కూడా పిల్లల మనసుల్లో ఎటువంటి సంఘర్షణకులోనవుతాయో……చాల చక్కగా చిత్రీకరించారు.ఆ కాలపు పదజాలం మరికొంత ఔపోసనపట్టి వుంటే సహజత్వానికి మరీ దగ్గరగా వుండి వుండేది.

  “బజారుకి వెళ్లాలంటే వినరు. మళ్లీ గంట కొట్టేసరికి తయారవుతారు వంటింట్లో. ఏం తగలేసేది కంచంలో …”పిన్ని ఇట్లా మాట్లాడుతుంటే సుడిగాలికి చెఱుకుతోట ఫెళఫెళ్ళాడినట్లుంటుంది. అదేమిటో! ఎక్కడో గయ్యాళిగంపకి మల్లే వుంది .యిన్ని పరికరాలు కనిపెడుతున్నారు. బ్రైన్ లో నిఖ్షిప్తమైనగ్నాపకాల దొంతరలన్నీ సునాయాసంగా సిడి లోకి ప్రింటు చేసే పరికరం వుంటె ఎంత బాగుండును? అభినందనలతో …నూతక్కి

  మెచ్చుకోండి

 3. @ SSRao, మీకు నచ్చినందుకు సంతోషమండీ.
  @ పరిమళం, ఇంత పాతకాలపుకథలు అసలు ఎవరికైనా నచ్చుతాయా అనుకుంటూ పెట్టేను. మీకు అంత బాగుందంటే, నాకెంతో బాగుంది.:)
  @ మధురవాణి, అలా అయితే నాపాతకథలన్నీ మీరు మళ్లీ చదవాల్సిందే.
  అందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s