అవేద్యాలు

తలొంచుకుని తండ్రి రాసిన ఖండకావ్యం తాలూకు ప్రూఫు చూస్తోంది శారద.

శారదని చూసి ఆగిపోయాడు చలపతి ఒకకాలు గుమ్మంలోనూ ఒకకాలు గుమ్మంపైనా ఉంచి – రన్నింగ్ రేస్‌లో ఛాంపియన్‌లా.

కొనకంటిలో మనిషి మెదిలినట్టయితే, “ఎవరోలే” అనుకుని, కావలిస్తే వాళ్లే పిలుస్తారు అన్నధోరణిలో దృష్టి మరల్చలేదు శారద.

చలపతి సందిగ్ధంగా ఓనిముషం నిలబడి, “మామయ్య లేరా?” అని ప్రశ్నించాడు మందరస్వరంతో.

శారద తలెత్తి, “ఓహో” అంది కొత్తగా గుర్తు పట్టినట్టు. అలా అనడంలో కాస్త తడబడుతూ, “నువ్వా?” అనేసి చప్పున “నాన్నగారు లేరు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి చాలా సేపయింది. వచ్చేస్తారు,” అంది గబగబ.

చలపతి, “పోనీలే. మళ్లీ వస్తాను” అన్నాడు వెనక్కి తిరగబోతూ.

“కూర్చోకూడదూ ఒక్క అయిదు నిముషాలు” అంది కానీ అతగాడ్ని అక్కడ అలా ఆకట్టడంలో తనఒళ్లో ఏమీ లక్షలు కురియవు. ఆమాట అతను గ్రహించేలా, “నాన్నగారు రాజమండ్రి వెళ్తున్నారు రాత్రికి. రెండు మూడు రోజులదాకా రారు,” అంది మళ్లీ.

చలపతి కూర్చోడానికే నిశ్చయించుకుని ఓమూల పడి ఉన్న పాతపత్రిక ఒకటి తిరగేయసాగాడు. కొనకళ్లలోంచి శారదరూపం లీలగా కనిపిస్తూంది. శారద అపరంజిబొమ్మ. పువ్వులాటి మనిషి.

“ఏదైనా పనిమీద వచ్చేవా?” శారద యాదృచ్ఛికంగా ప్రశ్నించింది.

కాని అందులో వింతైన కౌతుకం వ్యక్తమవుతూంది.

అప్పుడే శారదకెలా తెలిసింది? ఆమాటే అడుగుదామనుకున్నాడు, కానీ “దొంగాడా, కరవకు” అన్నట్టుంటుంది.

“ఏమీ లేదు”. ఎంత నిర్లక్ష్యంగా అందామని ప్రయత్నం చేసినా ఏదో వెలితిగానే వినిపించింది.

 “అంతేనా?” అంది శారద గుండెమీంచి బండ దింపినవతుగా.

“హేళన, హేళన,” అనుకున్నాడు చలపతి. అంతకన్న “ఆమాట చెప్పడానికి ఇంతదూరం రానక్కర్లేదు, ఇంతసేపు నిరీక్షించనక్కర్లేదు, ఇంకేమేనా పనుందా?” అనడిగితే బాగుండేది.

“మాతమ్ముడు దురదృష్టజీవి” అన్నాడు గతం అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు.

శారద పెదిమలమీద లీలగా మెరిసిననవ్వు ఆవ్యాక్యాన్ని నిరసించింది. “ఇదే నిర్థారణ?” అంది.

                                                          000

శారదకి జ్ఞానం వచ్చేసరికే తనకి తల్లి లేదని తెలుసుకుంది. మెల్లిగా ఇల్లు చూసుకుంటూ ఫోర్తుఫారంవరకూ చదివింది. ఫోర్తుఫారం చదువుతున్నరోజుల్లోనే, ఓరోజు ఇంటికి రాగానే తండ్రితో, “నేనింక స్కూలికి వెళ్లనండీ,” అంది.

ఆయనకి అర్థం కాలేదు. “ఎవరైనా ఏమేనా అంటే చెప్పు. గుండేసి కొట్టేస్తాను,” అన్నారు.

శారద మాటాడలేదు. మర్నాడు స్కూలికి వెళ్లలేదు. వారంరోజులు పోయేక, తండ్రి దశరథరామ్మూర్తిగారు “పోనీ, ప్రైవేటుగా మెట్రిక్కి కట్టు,” అన్నారు.

శారద అంగీకరించలేదు. మనుచరిత్రలో నాలుగు పద్యాలూ, మహాభారతంలో నాలుగు పద్యాలూ, కందుకూరివ్యాసం ఒకటి – ఇందులో మళ్లీ రెండు పద్యాలు “అనింపార్టెంటు” – ఎందుకొచ్చిన చదువిది? – ఇదీ సూక్ష్మంగా ఆపిల్ల అభిప్రాయం. అంతకంటే ఒకక్రమంలో ఇంట్లో చదువుకోడమే మేలు. అయితే ఆ క్రమం ఏమిటి అంటే అది ఆ అమ్మాయిబుర్రలో ఎప్పటికి ఏది సరి అనిపిస్తే అదీ. శారద అడిగిన నిఘంటువూ, అమరకోశమూ ఏదడిగితే అది తెచ్చేవారు ఆయన. తనకి తోచినట్టు అర్థం చేసుకునేది. అర్థం కాకపోతే ఊరుకునేది. కొన్నాళ్లు పోయేక మళ్లీ తీసేది. ఆవిధంగా ఆంధ్రసాహిత్యంతో శారద పరిచయం వృద్ధి చేసుకుంది.

అయినా చలపతీ, అతని తమ్ముడు సుందరం దృష్టిలో శారద ఫోర్తుఫారం అయినా పాసుకాలేని మూర్ఖురాలు!

శారదకి పదిహేడేళ్లు వచ్చేక, ఓరోజున దశరథరామ్మూర్తిగారు “తాంబూలాలిచ్చి” వచ్చినట్టు చెప్పేరు. మరేమీ పైసంబంధం కాదు. చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నదే, మేనరికమే, సుందరం. ఇహ శారదని విడిగా అడగవలసిన అవుసరం ఏమిటి? ఇప్పుడు మటుకు చెప్పవలసిన అవుసరం ఉండి గాదు ఆయన చెప్పింది. ఊరికే యాదాలాపంగా చెప్పేరు. చెప్పేక శారద ఏమంటుందో ఆయన ఎదురు చూడలేదు. శారద ఏమీ అనలేదు.

మర్నాడు ఆ ఊళ్లో రెండిళ్లలోనూ ఇరవైనాలుగు గంటలు గడిచేసరికి నలభైఎనిమిది గంటలు పట్టింది. లేదా ఆరెండిళ్లవాళ్లకీ అలా అనిపించింది. ఒకటి పెళ్లికొడుకు వారిది. రెండోది పెళ్లికూతురువాళ్లది. మూడోరోజు తెల్లవారలేదు. ఇంకో గంటకు తెల్లవారుతుందనగా చలపతి వాళ్ల పక్కింటికుర్రాడు సైకిలుమీద బాణంలా దూసుకువచ్చేడు.

చలపతితండ్రి హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి కళ్లు మూశారు. విన్నవాళ్లు, “ఒకొక్కరి జన్మవిశేషం. కోడలు గృహప్రవేశం, అత్తగారి అగ్నిప్రవేశం సామెత ఉండనే వుంది కదా,” అన్నారు. ఈ మాటలు శారదపరంగా అన్నవి. “ఆ ఆస్పత్రి చల్లని ఆస్పత్రి. క్షేమంగా వెళ్లి లాభంగా వస్తారు డాక్టర్లు. జబ్బుతో లోపలికి వెళ్లిన మనిషి మటుకు తన రెండుకాళ్లమీద నడిచి పైకి రావడం చూడలేదు,” అని ఆస్పత్రిని దుమ్మెత్తి పోశారు కొందరు. మొత్తమ్మీద శారదకి కావలిసిన మామగారు ప్రపంచపు నాటకరంగంమీద తనపాత్రకి భరతవాక్యం పలికేసి ఊరుకొన్నారు. అయితే ఆయన ఎట్టి అసమయంలో చేశారు, దానివల్ల కలిగే దుష్ఫలితాలేమిటి అని ఆలోచించలేదనే చెప్పాలి.

పెళ్లిమాట మళ్లీ ఎవరూ ఎత్తలేదు. చావింట్లో పెళ్లి పనికిరాదు. కన్యాదానమైతే ఓ పక్షానికి ఆలోచించొచ్చు కానీ పరిగ్రహణం అసలే పనికిరాదు ఏడాదివరకూ.

శారద ఎట్టి దురదృష్టజీవో — పుట్టగానే తల్లి పోవడం, చదువొంట బట్టకపోవడం, తండ్రి కవిగా పైకి రాలేకపోవడం — మొదలయినవన్నీ ఈ పెళ్లి చెడడంతో పైకి వచ్చేయి. ఆ అమ్మాయి నష్టజాతకురాలు అన్నారు. ఏడాది అయేక దశరథరామ్మూర్తిగారు కబురు పెట్టినప్పుడు చలపతి కూడా ఇంచుమించు అదే భాషలో మాటాడి ఆఖరిమాటగా, “అమ్మది అదోరకం, నమ్మకాలూ అవీనూ. మనం చెప్పలేం,” అన్నాడు.

ఆయన, శారద తండ్రి, నిశ్చేష్టుడయి నిలబడిపోయారు. ఇందులో ఎవరూ నిందార్హులు కారు. ఆయన వెనుదిరిగి వెళ్లిపోతుంటే, చలపతి గేటుదాకా వచ్చి, “ఏమీ అనుకోకండి” అన్నాడు. 

దశరథరామ్మూర్తిగారు ఆవేళ అలా భంగపడి ఇంటికొస్తూండగా చూసిన ఒక సంస్కృతం మేష్టారు ఇందుకే కదా హిమవంతుడు పార్వతిని పరిగ్రహించమని శివుని కోరడానికి సందేహించాడు అనుకున్నారు. ఆరోజు తండ్రిని పలకరించడానికి శారద భయపడింది. ఆతరవాత వారంరోజులు ఆయన శారదమొహం చూడలేకపోయారు. ఆతరవాత పెళ్లి సంబంధాలు చూశారు.

కట్నం ఎంతిస్తారు?

ఏమీలేదు. ఆస్తి అంతా మొత్తం వెయ్యిరూపాయలు. అంతే.

పిల్ల చదువుకుందా?

లేదు. చూడ్డానికి చక్కగా ఉంటుంది. కానీ ఆడపిల్లని పెళ్లి చేసుకోడం చూడ్డానికి కాదే!

పనిపాటలు వచ్చు..

పనిపాటలు రానివాళ్లెవరు ఈరోజుల్లో?

ఎవరో ఓ పెళ్లికొడుకు వచ్చి “ఈఅమ్మాయినే కదూ అప్పుడు సుందరానికి ఇద్దామనుకున్నారు” అనేసి వెళ్లిపోయాడు.

దశరథరామ్మూర్తిగారికి ఏంచెయ్యాలో తెలీలేదు.

                                                          000

“రాజమండ్రీ ఎందుకు వెళ్తున్నారు?” అన్నాడు చలపతి మాట మార్చాలనో, ఎదుటిమనిషిని మంచి చేసుకోవాలనో.

శారద అవమానభారంతో కృంగిపోతూ, “ఏమో,” అంది. ఆ ఒక్కమాట, ఆమెవైపు ఒక్క చూపు చాలు సగటు మనిషికి సంగతేమిటో అర్థం చేసుకోడానికి.

ఆయన ఏదో సంబంధంగురించి విచారించడానికి వెళ్తున్నారు.

శారదని ఆక్షణంలో ఓదార్చాలనిపించింది.

“విచారించి మనసు పాడుచేసుకోకు, శారదా! జరిగేవి ఎలాగూ జరక్కమానవు.”

శారదకన్నులలో నీరు సుడులు తిరిగింది. తనపట్ల జరగకూడనివి జరుగుతున్నాయి. ఆక్షణంలో శారద చప్పున నోరు జారింది. “నాన్నగారు ఇంత క్షోభ పడడానికి కారణం ఉద్యోగంనించి రిటైరయినా బాధ వదిలించుకోలేకపోవడానికి కారణం మీ మూర్ఖత్వం,” అంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మాట తూలని శారద.

చలపతికి మొహమ్మీద చురక వేసినట్లయింది. అతను లేచి వెళ్లి, కూజాలో నీళ్లు గ్లాసులో పోసుకుని, మళ్లీ వచ్చి కూర్చున్నాడు.

శారద ఈచర్య కనిపెట్టిందో లేదో ఆమె హృద్గతభావాలేమిటో చెప్పడం కష్టం. ఏదో తట్టి, అక్కడ్నించి లేవబోయిందికానీ ఈలోపలే చలపతి అందుకున్నాడు.

“నీకు మీనాన్నగారిమీద ఎంత గౌరవముందో నాకు మానాన్నగారిమీద అంత గౌరవమూ ఉంది.”

ఉంటే ఆయన ఇచ్చినమాట ఎందుకు నెరవేర్చరో శారదకి అర్థం కాలేదు.  

“మూఢనమ్మకాలని నువ్వూ నేనూ ఇక్కడ కూర్చుని కొట్టిపారేయొచ్చు. హేళన చెయ్యొచ్చు. కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని త్రోసిరాజనడం – కనీసం మన ముందుతరంవారికి అంత తేలిక కాదు,” చలపతి క్షణం ఆగాడు.

శారద మాట్లాడలేదు. లేవాలని రెండోమారు చేసిన ప్రయత్నం కూడా విఫలమయింది.

చలపతి మళ్లీ అందుకున్నాడు. “పోనీ, నేను చేతకానివాణ్ణి. అసమర్థుడిని. అమ్మ నీకు పరాయిది కాదు కదా. నువ్వే నచ్చచెప్పకూడదూ?”

“ఇప్పుడే వస్తా,” చలపతి మరోమాట అనేలోపున శారద అంతర్థానమైపోయింది.  అతను మాటాడిన అవివేకపు మాట, అసందర్భపుసలహా శారదకి వెన్నులో పొడిచినట్టయింది. తనకన్నా విద్యావంతుడూ, అనుభవజ్ఞుడూ, పెద్దవాడూ అయిన చలపతి ఇటువంటి సలహా ఇవ్వగలడని తను అనుకోలేదు. ఇతడంటే తనకి ఒకానొకప్పుడు గౌరవం.

“ఇప్పుడే వస్తా”నన్న శారద ఎప్పటికీ రాకపోవడంతో చలపతి వంటింటిగుమ్మంలోకి తనే వచ్చి, “మరి నే వస్తా,” అన్నాడు.

శారద విందో, వినే ఊరుకొందో తలెత్తలేదు.

చలపతి తటపటాయిస్తూ అన్నాడు, “నీకు అన్యాయం జరిగింది. ఆ విషయం నాకు తెలుసు. కాని అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది పదహారు పళ్లలో ఒక పల్లు విషం అని. నువ్వు ఏమన్నా నిన్ను క్షోభ పెట్టిన పాపం మమ్మల్ని కట్టి కుడుపక మానదు. అంతే నే చెప్పదలుచుకున్నది, వస్తా.”

శారదకి మనసులో మండింది. మొదటిమారు దెబ్బ తగిలినప్పుడు కలిగినంత బాధ రెండోమారు తగిలినప్పుడు ఉండదు.

“ఎందుకు బావా! మిమ్మల్ని మీకుటుంబాన్ని దూషించి, దుమ్మెత్తి పోసి, నేన్నొల్లుకునేది ఏముంది?” అంది నిరామయంగా.

చలపతి రెండడుగులు వేసి మళ్లీ ఆగిపోయాడు. అతనొచ్చిన పని?

“నిన్నొకటి అర్థించడానికి వచ్చాను,” అన్నాడు.

శారద మాటాడలేదు.

“అది నీవల్ల అవుతుంది,” అన్నాడు.

“”సాంప్రదాయానికి విరుద్ధమయినది కాకపోతే …” ఎంత దాచినా మాట మొన వాడకుండా వచ్చింది.

తీక్ష్ణమయిన ఎండదెబ్బ తిన్నవాడిమొహంలా అయింది చలపతిమొహం.

 “ఇలాటిమాటలు ఎన్నయినా సహిస్తాను ఒక్కగాని ఒక్క కొడుక్కోసం,”

“కిష్టుడిమాటా?”

“వాడిమాటే. మొదట్నుంచీ వాడెంత తెలివైనవాడో నీకూ తెలుసు. యూనివర్సిటీఫస్టు వస్తుందని ప్రాణాలు ధారపోసి చదివేడు మూడేళ్లూను. తీరా పరీక్షలవేళకి ఒళ్లు చెడి విత్‌డ్రా అయేడు. ఈ ఏడు నాన్నగారు పోవడంతో మతి చలించినంతపనైంది.”

శారద భావరహితమయిన మొహంతో వింటోంది.

“ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాదుకదా సెంకడ్ క్లాసుకి పధ్నాలుగు మార్కులు తక్కువొచ్చేయి. ఈసంగతి తెలియగానే వాడేం చేస్తాడో ఊహించడానికి కూడా భయంగా ఉంది,” చలపతి దీనాతిదీనంగా మొహంపెట్టి అన్నాడు ఈమాట.

శారదకి అతనిఅర్థం బోధపడింది. కానీ ఒకనాడు పొరుగింట్లో ఉండి, ఆయన అభిమానానికి పాత్రురాలయిన తను ఇప్పుడు ఆఅభిమానాన్ని ఇలా మార్కులు అడిగి ఖర్చు రాయించవచ్చునా? ఇది తగినపనేనా? నిజమే. ఈపని తనవల్ల అవుతుంది. కానీ నీచంగా లేదూ?

తరతరాలుగా వస్తున్న “సాంప్రదాయం కాదేమో కానీ నీతిదూరంగా లేదూ?”

చలపతికి ఈమారు కోపం వచ్చింది. ముక్కూ మొహం తెలీని పరాయివాడెవడో “నీకొడుకు ధీశక్తిగూర్చి మాకేం తెలుసు?” అన్నట్టుగా మాటాడుతూంది మేనత్తకూతురు. అక్కడికీ తమాయించుకుని అన్నాడు, “నేనేమీ కోరరాని కోరిక కోరడంలేదు. ఎంతోమందికి తగినవారు అని తోస్తే మార్కులు కలిపి క్లాసు ఇవ్వడం అందరికీ తెలిసినసంగతే కదా,”

“అయితే నేనెందుకు కలగజేసుకోడం?” అంది శారద – నీకొడుకు తగినవాడని తోస్తే నీకొడుక్కీ వాళ్లే ఇస్తారు అన్న భావం వ్యక్తం చేస్తూ.

చలపతి ఈసంభాషణ పూర్తయినట్టు గ్రహించాడు. “ది ఎండ్” అన్నట్టుంది ఆమెస్వరం.

“ఇహ వస్తానని చెప్పడం కూడా వెక్కిరించినట్టుంటుంది. ఇప్పటికి మూడుమార్లు చెప్పానామాట. నాజీవితంలో నేనెవర్నీ ఏదీ అడగలేదు నోరు విప్పి. చిన్నదానివైనా నీచేత పడ్డట్టు ఇన్ని మాటలు ఎవరిచేతా పడనూ లేదు. నువ్వుందాకా చెప్పావు కదా మిమ్మల్ని క్షొభ పెట్టేమని. అది అనుభవంలోకి రావడానికి ఇంతకన్న ఇంకేమీ ఉందనుకోను. నువ్వు మాకేమీ సాయం చెయ్యక్కర్లేదు. మనం ఇహ కక్షలు సాధించుకోడానిక్కూడా ఏమీ లేదు. అదే నయం,” అనేసి చరచర వెళ్లిపోయాడు చలపతి.

ఆవేళ శారద రాత్రివంట మొదలుపెట్టేసరికి ఏడు దాటింది. నిప్పు చేస్తూండగా దశరథరామ్మూర్తిగారు వచ్చేరు.

“మీకోసం చలపతి బావొచ్చాడు,” అని చెప్పింది.

“ఎందుకు?” అన్నారాయన. ఈమధ్య ఆయింటికీ ఈయింటికీ మధ్య రాకపోకలు తగ్గిపోయాయి.

“ఏమో” అంది కుంపట్లో చింతబొగ్గులు చిటపట్లాడుతుంటే వెనక్కి జరుగుతూ.

మర్నాడు సుందరం రోడ్డుమీద కనిపిస్తే అడిగేరు దశరథరామ్మూర్తిగారు చలపతి ఏదైనా పనిమీద వచ్చాడా అని.

సుందరానికి అర్థం కాలేదు. శారద ఎందుకు చెప్పలేదు? “ఏమీ పనిమీద వచ్చేడనుకోను,” అన్నాడు.

                                                          000

పది రోజులయింది. సుందరానికీ డిప్యూటి కలెక్టరుగారమ్మాయి జానకికీ పెళ్లి నిశ్చయమయినట్టే అందరు నిశ్చయం చేసుకున్నారు. ఆవేళ ఫెళ్లున కాస్తున్న ఎండ ఒక్కమారుగా ఉరిమింది. అరె! చినుకులు పడుతున్నట్టున్నాయే అనుకునేలోపునే వాన హోరున కురవసాగింది. జల్లు విసిరి కొడుతోంది. వస్తాదుల్లాటి మనుషులు ఎదురుగాలిలో వెనక్కి కొట్టుకుపోయేట్టున్నారు.

తండ్రి వీధిలోంచి ఇంకా రాలేదని శారద భయపడుతూ కిటికీదగ్గరకి వచ్చింది. వరండాలో వ్యక్తి ఒక్కక్షణం ఆగి, “నేను” అన్నాడు.

శారద కూడా ఓ క్షణం ఊరుకుని, “నువ్వా?” అని తలుపు తీసింది.

వజవజ వణుకుతూ లోపలికొచ్చేడు సుందరం. పూర్తిగా తడిసిపోయేడు. శారద లోపల్నుంచి తువాలూ, లుంగీ తెచ్చి ఇచ్చింది. మళ్లీ లోపలికి వెళ్లి తండ్రికోసం ఫ్లాస్కులో ఉంచిన కాఫీ గ్లాసులో పోసి తీసుకొచ్చింది.

“మామయ్య ఇంట్లో లేరా?” అనడిగాడు సుందరం, ఇంతవరకూ తామిద్దరిలోనూ ఏ ఒక్కరూ మాటాడలేదని జ్ఞప్తికి తెచ్చుకుని.

“లేరు. ఎక్కడ చిక్కుపడిపోయారో ఈవానలో. రెండురోజుల్నుంచీ ఒంట్లో బాగులేదు కూడాను,” అంది.

అదన్నమాట మొహం వాడినట్టుండడానికి కారణం అనుకున్నాడు సుందరం. మళ్లీ అతనికి ఏం మాటాడాలో తెలీలేదు.

శారదకి అక్కడ ఉంటే బాగుంటుందో లోపలికి వెళ్ళిపోతే బాగుంటుందో తెలీలేదు.

“కిష్టుడికి క్లాస్ వచ్చింది నీధర్మమా అంటూ,” అన్నాడు కృతజ్ఞతాభావం వెల్లివిరియగా.

 “నాదేముంది? విధినిర్ణయం అలా వుంది కాబోలు,” అంది శారద.

సుందరానికి హఠాత్తుగా తాను శారదపట్ల అన్యాయంగా ప్రవర్తించాననీ, అయినప్పుటికీ సాక్షాత్తూ భూదేవివలె ఓరిమిగల శారద తమని మన్నించి, పైగా ఉపకారం చేసి తన సహృదయత ప్రకటించుకుందనీ తట్టింది. ఆమాటే వెంటనే శారదతో చెప్పి, క్షమించమని వేడుకుని జారిపోబోతున్న ఈమాణిక్యాన్ని చేజిక్కించుకుంటే బాగుండు అని అనుకున్నాడు. కానీ ఆమాట చెప్పడం ఎలా?   

“మామయ్య రాజమండ్రీ వెళ్లివచ్చారు కాబోలు” అన్నాడు ప్రస్తావనగా.

“ఆఁ, వచ్చేరు,” ఒక్కమాట విరుపులో సమాధానం చెప్పేసి, లోపలికి వెళ్లిపోయింది.

సుందరం వంటించివేపు నడవడమా, వీధివేపు నడవడమా అన్నసందిగ్ధంలో కొంచెంసేపుండి, రెండడుగులు వంటింటివేపే వేసి, “నేఁ వెళ్తున్నా,” అన్నాడు.

“ఆఁ” అంది శారద సావిడివేపు ఒకడుగు వేసి.

“ఒకమాట. పొరపాటులో నిన్నేదో అనడం జరిగింది. ఆమాటలో నిజం నువ్వే ఆలోచించు,” అన్నాడు.

శారద నిరసనగా నవ్వింది ఆ పెదిమవిరుపులో ఎన్ని అర్థాలయినా చెప్పుకోవచ్చు. “ఒకమారు ఒప్పుకుంటావు కానీ ఎన్నిమార్లు ఒప్పుకుంటావు విద్యాగంధం లేని పశువుని” అని ఉండొచ్చు. “ఇంత నిలకడలేని మనిషివా?” అని కావచ్చు. ఏదైతేనేం శారద పెదిమ కదల్చకుండానే సుందరం అక్కడినుండి కదిలిపోయాడు – మంచికో చెడుకో.

                                                          000

“సుందరం ఏమిటి? డిప్యూటీ కలెక్టరుగారి అమ్మాయిని చేసుకోనంటున్నాడుట,” ఎవరో దశరథరామ్మూర్తిగారిని అడిగారు.

“ఆహా” అన్నారాయన.

“అలా ఆహాఁ అంటావేమిటోయ్ ఆకాశంలోకి చూస్తూను. మనశారదనే తప్ప ఇంకెవర్నీ చేపట్టనని శపథం పట్టేడని ఊరు గగ్గోలెత్తుతూంటేను,” అన్నాడా శ్రేయోభిలాషి.

నిజానికి జరిగినకథ ఇదీ. సుందరం ఆవేళ ఆ వానరాత్రి శారదని చూశాక తాను పొరబడ్డాననీ, ఆపొరపాటు దిద్దుకోవాలనీ రూఢి చేసుకున్నాడు. ఆపైన ఇంటికి వెళ్లగానే జానకిని చేసుకోననీ, శారదని చేసుకుంటాననీ, వివరాలు అడగవద్దనీ ఒకేవాక్యంలో చెప్పి ఊరుకున్నాడు. చలపతి కసిరి చూసినా లాభం కనిపించలేదు. పోగా చలపతి ఏమొహంతో మామయ్యగారింటికి వెళ్లడమా అని ఆలోచిస్తుండగానే ఊరివారే ఆయనదగ్గిరికి మోసేరు ఆ వార్త.

దశరథరామ్మూర్తిగారు ఆ వార్త విని ఊరుకున్నారు. తరవాత శారదతో అని చూశారు. “ఛూశావా, సుందరం చేసిన పొరపాటు దిద్దుకోవాలనుకుంటున్నాడుట,” అని.

“కలెక్టరుగారూ వాళ్లూ తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు,” అంది శారద. తండ్రికి తనఅభిప్రాయం సూటిగా చెప్పలేక. తండ్రిమొహంలోకి సూటిగా చూడలేకపోతూంది. తననుంచి ఆయన ఎటువంటి మనస్తాపానికి గురి అవుతున్నారో చూస్తూన్నా తనేమీ చేయలేదు. ఏం జన్మ అనిపిస్తోంది.

“తాంబూలాలకేమిటి? మనం ఇచ్చిన తాంబూలాలూ పుచ్చుకున్నారు, వేసుకున్నారు,” హేళనగా నవ్వేరాయన.

ఈయనకి మతి గానీ పోతూందేమో! శారద రివటాకులా కంపించింది.

“నన్నోడి తన్నోడేనా? తన్నోడి నన్నోడెనా?” అని ప్రశ్నించిన ద్రౌపది తలపుకొస్తోంది.  

“కాఫీ తీసుకొస్తానుండండి,” అంది శారద లోపలికెళ్తూ.

దశరథరామ్మూర్తిగారు, తన మనోవేదనకి కారణమైన కూతురు ఎదుటినుండి తొలగిపోగానే, తనకి అలవాటయిన భగవద్గీతాపఠనంలో ములిగిపోయేరు.

ఆయనకి మరి కాఫీ రాలేదు.

అదేరోజు మునిమాపువేళ పనిమనిషి అప్పలమ్మ కొడుకు సుందరంచేతిలో ఒ చిన్న చీటి పెట్టి వెళ్లిపోయాడు.    

“పొరపాటు దిద్దుకుంటానంటూ అదే పొరపాటు మళ్లీ చేయడం తెలివైనపని కాదని నాకు తోస్తోంది. ఇంతదాకా రావడమే పొరపాటు. జానకిని క్షమాపణ కోరుకోడం సమంజసం కదూ.”

సుందరానికి ఈచీటీ ఎవరు పంపేరో అర్థం అయింది. అతను నిర్ఘాంతపోయాడు.

                                                          000

సుందరానికీ జానకికీ అట్టహాసంగా పెళ్లి అయింది. పెళ్లికి దశరథరామ్మూర్తిగారినీ, శారదనీ రమ్మని నొక్కి నొక్కి చెప్పారు చలపతి దంపతులు.

ఊరునించి ఊరు వెళ్లడం కనక పెళ్లికి వెళ్లలేదు కానీ మగపెళ్లివారింట్లో గృహప్రవేశానికీ, సత్యనారాయణవ్రతానికీ వెళ్లి పెళ్లికొడుక్కి కట్నం చదివించి వచ్చేరు దశరథరామ్మూర్తిగారు.

ఆర్భటం హోరుగాలీ అంతా ముగిశాక, పెళ్లికొడుకు వీలు చిక్కగానే పెళ్లికూతుర్ని అడిగిన మొదటిప్రశ్న, “అయితే నీకు శారదని ఎలా తెలుసు?” అని.

దీనికి వధువు జవాబు అయోమయపుచూపులు. “శారదెవరూ?”

“తెలీదన్నమాట” అని ఆశ్చర్యపడి, ఎందుకలా అడిగానా అని విచారపడి సుందరం నాలుక్కరుచుకున్నాడు.

“అదే తెనాలిలో సర్వరుగా పని చేస్తూ చచ్చిపోయాడే నటరాజన్ అని” అనేసి, “ఇవాళ సినిమాకి వెళ్దామా?” అని అడిగాడు తరవాత ఏప్రశ్నకీ తావివ్వకుండా.

                                                000

“ఒకసారి పత్నీసమేతంగా మాయింటికి రా,” అని శారద ఎప్పుడూ సుందరాన్ని ఆహ్వానించలేదు.

“ఇదీ జరిగిన సంగతి. ఈమే శారద,” అని సుందరం ఎప్పుడూ జానకికి చెప్పలేదు.

తనచుట్టూ రోజూ కనిపిస్తున్న వందలాది ప్రజల్లో “శారద” ఎవరో, సుందరం అడిగినప్రశ్నకి కారణం ఏమిటో జానకి తెలుసుకోలేదు.

(ఆంధ్రప్రభ, ,సెప్టెంబరు 14, 1960)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “అవేద్యాలు”

 1. @ మధురవాణీ, – హాయిగా కథ చదువుకోమంటే – లేదు, నేనిలా అనుకోడంలేదు. ఎందుకంటే, మీలాటివారందరికీ మనతెలుగు మళ్లీ గుర్తుకు తేవడం నా జీవితధ్యేయాలలో ఒకటి కనక :). పోతే, అవేద్యాలు – సంస్కృతం రూట్ విద్ to know. విదులు పండితులు. .. నేను చివరలో అన్నాను కానీ నిజంగా ఏ ఒక్కరికీ కూడా ఎదటివారు ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు అన్నది కథనిండా కనిపించేలా చెయ్యాలని ప్రయత్నించేను.
  కౌతుకం అంటే curiosity.
  అమరకోశం – సంస్కృతం డిక్షనరీ. సంస్కృతం చదువు మొదలుపెట్టినప్పుడు అది కూడా ఒక textbook!
  ఇంక మీ మొదటిప్రశ్నకి నారెండో సమాధానంగా – నాకు తెలిసిన తెలుగు మీఅందరికీ చెప్పాలనే కాక, నేను మర్చిపోయింది కూడా మళ్లీ గుర్తు తెచ్చుకునే తాపత్రయం. ఎప్పుడో మాఅమ్మ కొటేషను నాకు సగం సగం గుర్తున్నది – నన్నోడి తన్నోడెనా అని ద్రౌపది అడగడం. జూదంలో ధర్మరాజు రాజ్యాలూ గట్రా ఓడిపోయినతరవాత. తననీ, తమ్ముళ్లనీ, భార్య ద్రౌపదినీ పణంగా (స్టేక్)గా పెడతాడు. ద్రౌపది ప్రశ్న – తను మరోనలుగురికి కూడా భార్య కనక తనని పణంగా పెట్టడానికి ధర్మరాజుకి అధికారం లేదని. ఆయన తననే ముందు ఓడిపోయి వుంటే, ద్రౌపదిమీద ఆయనకి అధికారం అసలే లేదు. అలా కాక ముందు ద్రౌపదినే పెట్టిఉంటే, అది కూడా న్యాయం కాదు.- ఏదో ఇలాటి లాజిక్ నాకు ఇప్పుడు బాగా గుర్తు లేదు. ఏ భైరవభట్ల కామేశ్వరరావుగారిలాటివారో చెప్పాలి.
  నా ఊసుపోక మీద మీ ఆశీస్సులకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే నాకు నాపాతకథలు చదవడమే ఒక ఎడ్యుకేషనుగా ఉఁది :))

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,
  కథ బాగుందండీ.. వెరైటీగా అనిపించింది నాకు 🙂 కథకి పెట్టిన పేరు, అది స్ఫురించేలాగా ముగించిన తీరు భలే బాగుంది 🙂
  నాకు కొన్ని పదాల/వాక్యాల అర్ధం తెలీలేదు. అందులో ఒకటి మీరు ఆల్రెడీ కల్పన గారికి చెప్పారు. ఇంకా.. ‘కౌతుకం’, అలాగే ‘అమరకోశం’ అంటే ఏంటి.?
  “నన్నోడి తన్నోడేనా? తన్నోడి నన్నోడెనా?” అని ప్రశ్నించిన ద్రౌపది – నాకు ఇది కూడా తెలీలేదు 😦
  అదేదో సామెత చెప్పినట్టు.. హాయిగా చదవమని కథ ఇస్తే, పైన ఇన్ని సందేహాలా.? అనుకుంటున్నారా 😉

  మెచ్చుకోండి

 3. @ SRRao, థాంక్స్ అండీ శారద పాత్రచిత్రణ మీదృష్టిని ఆకట్టుకున్నందుకు నాకు సంతోషంగా వుంది.
  @ పరిమళం, సంతోషం.
  @ శ్రీలలిత, అవునండీ, శారదలాటి వ్యక్తులు నిజజీవితంలో అరుదు. అసలు ఉండరేమోనని కూడా అనిపిస్తోంది. ఈవిషయం ఇంకా ఆలోచించి మళ్లీ రాస్తాను.
  @ రాఘవేంద్రరావుగారూ, నేను చెప్పబోయేకథలో గతం, ఆగతం సూచించడానికి రాసేను అనుకుంటానండీ. ఎప్పుడో 50 ఏళ్లక్రితం రాసినది కదా. మళ్లీ చూస్తాను. నాశైలిని ఇంతవరకూ చలంతో ఎవరూ పోల్చలేదండీ. మీరే మొదలు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మీ “ఆవేద్యాలు” కథలో మొదటి అంకంలో చివరి వాక్యాలలోని ” మా తమ్ముడు దురద్రుష్ట జీవి” , “యిదేనిర్ధారణ” అన్న పదాలు అక్కడి వాతావరణానానికి అనుగుణంగా యిమడలేదనిపించింది. కధా, కథా గమనం బాగుంది. కధ/నవల లో నూతన పోకడల స్రుష్టికర్త చలం కథా గమన రీతి స్ఫురించింది. చదివే అవకాశం కలిగినందుకు ధన్యుణ్ణి……నూతక్కి
  అభినందనలు.. నూతక్కి

  మెచ్చుకోండి

 5. మాలతిగారూ,
  కథ చాలా బాగుంది. శారద వక్తిత్వాన్ని బాగా చూపించారు. ఎవరైనా ఏది చేస్తే తనకు బాధ కలుగుతుందో అది మరొకరికి చెయ్యకుండా ఉండడమే ఒక గొప్ప వ్యక్తి యొక్క సంస్కారం అని పెద్దలు చెప్పగా విన్నాను. అలాగే చేసింది శారద. కాని చేసినట్టు చాటించుకోలేదు.. అది మరీ గొప్పదైన విషయం. లోకంలో అటువంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. తనకు అన్యాయం జరిగినా అదే అన్యాయం మరొకరికి జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా స్వార్ధం వదులుకుని నిర్ణయం తీసుకోవడమన్నది మామూలుగా ఆ వయసులో పిల్లలు తీసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది.

  మెచ్చుకోండి

 6. మాలతి గారూ !
  మానవ మనస్తత్వాలను అద్భుతంగా ఆవిష్కరించారు. శారద వ్యక్తిత్వ చిత్రణ బావుంది. మంచి కథ చదివించారు. దన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. @ కల్పన, అవేధ్యాలు అంటే తెలియనివి (వేద్యం, విదితం కానివి). కథలో చివరివాక్యాలలో ఎవరికి ఏం తెలీదో చెప్పేను కదా. అవన్నమాట అవేద్యాలు. …

  మెచ్చుకోండి

 8. మాలతి గారు, చదివినే కథే అయినా మళ్ళీ మళ్ళీ చదవటానికి కూడా బావుంది. కాకపోతే కథ పేరు మాత్రం అర్ధం కాలేదు. కాస్త వివరిద్దురూ….

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s