తెలుగెప్పుడూ రెండోభాషే!

కిందటివారం పుస్తకం.నెట్‌లో మనకి “లేని పుస్తకాల”మీద హేలీ రాసినవ్యాసం చూసినతరవాత నాకు కొన్ని సందేహాలు కలిగేయి. ఆ వ్యాసంలో ప్రధానాంశం “ఇంగ్లీషులో వచ్చిన పుస్తకాలలాటివి తెలుగులో ఎందుకు లేవూ?” అని.

దీనికి ఉపప్రశ్నగా వి.బి. సౌమ్య “గత దశాబ్దంలో హారీ పాటర్ మూలంగా పాఠకులసంఖ్య విపరీతంగా పెరిగింది. తెలుగులో అలాటి సంఘటన జరిగిందా?” అని అడిగింది నన్ను.

ఆలోచిస్తుంటే మనం గమనించవలసిన నేపథ్యం చాలా ఉంది అనిపించింది. మౌలికంగా ఈప్రశ్నలవెనకగల మనస్తత్త్వం ఎక్కడినుంచి ఎలా వచ్చిందో మనం ఆలోచించాలి.

చదవడం అన్నది ఒక వ్యాసంగం, సాహిత్యానికి సంబంధించినది. సాహిత్యానికి ప్రయోజనం ఏమిటి? అంటే పూర్వం “రసానుభూతి” అన్నారు. రసానుభూతి వైయక్తికం. ఎవరికి వారు ఆస్వాదించి ఆనందించేది. అంతటితో అయిపోతుంది. ప్రస్తుతం “సాంఘికప్రయోజనం” అంటున్నారు. అంటే, పాఠకులని ఆలోచింపజేసి, సంఘంలో మార్పు తెచ్చేది అని.

ఎలా చూసినా, సమాజంలో మనిషికీ సాహిత్యానికీ సన్నిహితమయిన సంబంధం ఉంది అన్నది స్పష్టం. దీన్నే తిరగేసి, అటునుండి చెప్తే, ఏ సమాజంలోనైనా సాహిత్యం ఆ వాతావరణంలోనుండే పుడుతుంది. ఆ సమాజంలోవారి ఆచార వ్యవహారాలూ, నిత్యజీవితంలో వారు ఎదుర్కొనే సమస్యలూ, పరిష్కారాలూ చిత్రిస్తుంది.

ఒక జాతివారు మరొకజాతివారి కథలు చదవడం ఆజాతి సంస్కృతిగురించి తెలుసుకోడానికి, వారి జీవనసరళి అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుంది. నేను తెలుగుకథలు ఇంగ్లీషులోకి అనువదించడం మాజాతి సాంప్రదాయాలూ, విలువలూ, ఇవీ చెప్పడానికే కానీ“మీకు ఇలాటికథలు లేవు” అని చెప్పడానికి కాదు కదా.  Global understanding పెంపొందించడానికే కథలు చదవమని యూనివర్సిటీలలో కల్చరల్ స్టడీస్, డైవర్సిటీ కోర్సులు బోధిస్తున్నారు.

ఇంగ్లీషుకథలు చదివినప్పుడు జరిగేది వాళ్ల ఆవరణలోకి ప్రవేశించి వారి జీవనసరళీ, ఆలోచనావిధానం తెలుసుకుని ఆనందించడం. అలాగే తెలుగులో రాసినకథలు చదివినప్పుడు తెలుగుభాష సొగసులు ఆస్వాదించడం సమంజసం అని నాఅభిప్రాయం.

హారీ పాటర్ పది, పన్నెండేళ్ల పిల్లలకోసం రాసిన కథలు. అందులో ప్రధానరసాలు సంభ్రమం, ఆశ్చర్యం, ఉత్సుకత, ఇంకా భీభత్సం కూడానేమో. ఇలాటి రసాలు పోషించినకథలు తెలుగులో లేవా అంటే ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. అవేమిటి అని ఇప్పుడు నన్నడిగితే చెప్పలేను. మీ ఇంట్లో పెద్దలని అడిగి చూడండి.  తెలుగుగడ్డమీద పుట్టిన కథలు – రాక్షసులు, ఏడు మల్లెపూవుల ఎత్తు రాజకుమారీ, మంత్రగాళ్లూ, యంత్రతంత్రాలు .. ఇవన్నీ ఉన్న కథలు మనకి ఉన్నాయి. రెండోది, మనకి అచ్చులో లేని సాహిత్యం – జానపదసాహిత్యం, ముఖతః వినేకథలు చాలా వున్నాయి. అది సేకరించి ప్రచురించడానికి ప్రయత్నాలు 40వ దశకంలో మొదలయేయి.

సౌమ్య అడిగిన ప్రశ్నకి సమాధానం. హారీ పాటర్ ఎంతమంది చదివేరో అంతమంది చదివిన తెలుగు పుస్తకం లేదా అంటే, ఇది గణానాంకాలకి సంబంధించిన ప్రశ్న. మనం జనాభా లెక్కలు చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు చదివేవారెంతమంది? తెలుగు చదివేవారు ఎంతమంది?

తెలుగు జనాభా సుమారు పది కోట్లు అనుకుంటాను. అందులో 43 శాతం అక్షరాస్యులు. వీరిలో సగానికి పైగా కేవలం అక్షరాలు మాత్రమే వచ్చినవారు. “చదవడం” వచ్చినవాళ్లు కారు. నిజంగా చదవడం వచ్చినవాళ్లని చూడండి.

– తెలుగు మాటాడడం వచ్చు కానీ చదవడం, రాయడం రానివాళ్లు.

– తెలుగు చదవడం వచ్చు కానీ రాయడం రానివాళ్లు

– తెలుగు చదవడం వచ్చు కానీ తెలుగు పుస్తకాలంటే చెప్పుకోదగ్గ ఆసక్తి గలవాళ్లు.

– ఆ పైన తెలుగుపుస్తకాలగురించి ఇంగ్లీషులో చర్చించేవాళ్లు

ఇలా చూస్తే, నిజంగా తెలుగుపుస్తకాలు చదివి, తెలుగుభాష వైభవం ఆస్వాదించి ఆనందించగలవారి సంఖ్య ఇంగ్లీషుపుస్తకాలు చదివేవారి సంఖ్యతో పోల్చడం న్యాయంగా తోచడంలేదు నాకు. ఇది ఏనుగుగున్నని ఎలకపిల్లతో పోల్చడంలాటిదే.

ఇలా అంకెలలో కాక, ratio పరంగా ఆలోచిస్తే, మనకి పాటర్ స్థాయికి సరితూగగల పాఠకలోకం ఉధృతంగా రావడం 50వ దశకంలో జరిగింది. స్వాతంత్రం వచ్చేక, దేశ పునరుద్ధరణ, సంఘసంస్కరణ కార్యక్రమాలలో భాగంగా వయోజనవిద్య, స్త్రీవిద్య, గ్రంథాలయోద్యమం- వీటిద్వారా చదవడం ప్రోత్సహించారు మన గవర్నమెంటూ, సంఘసంస్కర్తలూను. ఆరోజుల్లోనే, అక్షరజ్ఞానం లేని ఆడవాళ్లు కష్టపడి రాయడం, చదవడం నేర్చుకుని కథలూ, వ్యాసాలూ రాసి పత్రికలకు పంపడం, పత్రికలు వారిని ప్రోత్సహిస్తూ ప్రచురించడం జరిగిందని లక్ష్మణరెడ్డి “తెలుగు జర్నలిజం” అన్న పుస్తకంలో రాసేరు. ఆయనే పత్రికలసంఖ్య 1920నించి 1930నాటికి  130 నించి 240కి పెరిగింది అని రాశారు. నాదగ్గర పూర్తి వివరాలు లేవు కానీ మరి కొన్ని అంకెలు ఇవ్వగలను. ఆంధ్ర సచిత్రవారపత్రిక 1908లో ప్రారంభించినప్పుడు 2000 కాపీలు. 1931 నాటికి 10,000 కాపీలకి పెరిగిందిట. ఆ నాటికి అది చాలా పెద్ద అంకె. బ్రిటిష్ వాళ్లు దాన్ని “the most evil influence on the Telugu country” అని కితాబు ఇచ్చేరంటే, వాళ్లకి చిరాకు కలిగించిందనే చెప్పుకోవాలి.

ఆ తరవాత నార్లవారి సంపాదకత్వంలో ఆంధ్రప్రభవారపత్రిక 1942లో 500 కాపీలు వేస్తే, ఆసంఖ్య 72,000కి పెరిగింది 1959నాటికి. 80వ దశకంలో ఆంధ్రప్రభ 100,000, ఆంధ్రజ్యోతి 80,000 కాపీలు అమ్మకం అయేయి. 50వ దశకంలోనే ఒక్క మద్రాసునించి ప్రచురింపబడిన పుస్తకాలు 3,67,000కి పైచిలుకు అయితే అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో 2,16,000వరకూ ప్రచురింపడినాయి.

ఇక్కడ మనం చర్చించవలసిన మరోవిషయం అమ్ముడయిన కాపీలకీ చదువరులకీ మధ్య అంకెలలో గల తేడా. ఎందుకంటే మనదేశంలో ఒక ఇంటివారు ఒకపత్రిక కొంటే, ఆఇంట్లోనే చదివేవారు నలుగురుంటారు. ఆపైన ఇరుగూ, పొరుగూ కలుపుకుంటే, ఒక కాపీ కనీసం 6 లేక 8మంది అయినా చదువుతారు.

పత్రికల, ప్రచురణల ప్రాచుర్యం తగ్గుముఖం పట్టింది గత రెండు దశాబ్దాలలో. దానికి కారణాలలో మొదటిది ఇంగ్లీషుమీడియం చదువులు అని దాదాపు అందరూ అంగీకరిస్తారు. ఈ ఇం.మీ. పాఠకులు తెలుగుపుస్తకాలకంటే ఇంగ్లీషుపుస్తకాలమీద ఎక్కువ ఆదరణ చూపడం రెండోది. వాళ్లు తెలుగు చదివినా అర్థమనస్కంగానే. దానికి కారణం ఇంగ్లీషు చదివినంత వేగంగా తెలుగు చదవలేకపోవడం, ఇంగ్లీషు ఆస్వాదించినట్టు తెలుగు ఆస్వాదించలేకపోవడం జరుగుతోంది అనుకుంటున్నాను నేను. అందుచేతే వీరి చర్చలు ఇంగ్లీషులోనే సాగుతున్నాయి. వాళ్లకి ఇంగ్లీషులో అభిప్రాయాలు వెలిబుచ్చడం “comfortable”గా వుంటుంది.

రెండోకారణం అంతర్జాలం. బ్లాగులొచ్చేక, పేరుకి తెలుగుబ్లాగులే అయినా, “మాకు తెలుగుంటే ఇష్టం కనక ఈబ్లాగు మొదలు పెట్టేం” అన్నవాళ్ల బ్లాగుల్లో కూడా సగానికి సగం ఇంగ్లీషే ఉండడం నాకైతే విచారకరంగానే వుంది.

ఇంతకీ, చెప్పొచ్చేదేమిటంటే, ఇంగ్లీషు సాంప్రదాయంలోనే సాగే ఈచర్చలు మేథోపేతం (academic) అనాలి. ఎందుకంటే, నూటికి తొంభైమంది తెలుగుపుస్తకాలు చదివేవాళ్లు ఆకథల్లో మనజీవితం, మనవిలువలు, మన సంస్కృతికి స్పందించినట్టు కనిపించదు. వారు ఆపుస్తకాల్లో విషయచర్చకే ప్రాధాన్యం ఇస్తారు. భాషకి ఉదాహరణగా చూడండి, నాతరంలో అందమయిన అమ్మాయిని “కుందనపుబొమ్మలా ఉంది, చిదిమి దీపం పెట్టినట్టు” అనేవారు. ఆ తరవాత బాపూగారి ధర్మమా అని బాపూ బొమ్మ నమూనా అయింది. ఇప్పుడు బార్బీ డాల్ అంటున్నారు. ఎక్కడుంది తెలుగుదనం? ఎందుకు మనమీ భాషని తెలుగు అనడానికి కొలమానాలు ఏమిటి? ఏది తెలుగు, ఏది కాదో మీరెలా నిర్ణయిస్తారు?

నిజానికి, ఇది కూడా భావదాస్యంలాగే భాషాదాస్యం. పాశ్చాత్య సాహిత్యంమీద ఆసక్తి బ్రిటిష్‌వాళ్లు పోతూ పోతూ మనకి పెట్టిన భిక్ష. మనవాళ్లు స్వాతంత్ర్యంకోసం పోరాటం మొదలు పెట్టినప్పుడు, వాళ్లు “సరే, మీకు పాలనాయంత్రాంగం తెలియాలి గదా, ఆపధ్దతులు మేం నేర్పుతాం,” అని ఐ.ఎ.యస్. శిక్షణలు oxfordలోనూ cambridgeలోనూ ఇవ్వడం మొదలుపెట్టేరు. అలా మనకి విదేశీచదువులు మొదలయేయి. పెద్దఉద్యోగాలు అంటే ఇంగ్లీషు చదువు అని కూడా స్థిరం అయిపోయింది. ఆ తరవాత, దేశవ్యాప్తంగా ఏకభాష లేదు కనక, మొదట ఇంగ్లీషూ, తరవాత హిందీ ప్రధాన్యం సంతరించుకున్నాయి. అలా ఉద్యోగంతో ముడిపడిన ఇంగ్లీషు చదువులతోపాటు క్రమంగా ఇంగ్లీషువారు చేసే ప్రతి పనీ మనకి ప్రామాణికం అయిపోయింది. కథలెలా రాయాలి, కవిత్వం ఎలా వుండాలి, కవితలని ఆస్వాదించుట ఎట్లు? – పాశ్చాత్యులు ఎలా చెబితే అలా అనే స్థితికి వచ్చేం. బ్రిటిష్ ఇంగ్లీషు వదిలించేవేళకి, అమెరిన్ ఇంగ్లీషు ప్రామాణికం అయిపోయింది. ఇండియాలో గాల్, బ్రో, యా. మాన్ అంటూ అమెరికన్ యాస వినిపిస్తే నాకు అదోలా వుంది. మనతెలుగువాళ్లకి ఆత్మాభిమానం లేదేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది.

అమెరికాలో పద్ధెనిమిదో శతాబ్దంలో నేటివ్ అమెరికనులని standardization పేరుతో, వాళ్లని “తెల్ల” చెయ్యడానికి Bureau of Indian Affairs సంస్థ స్థాపించారు. ఈ వ్యాసాలు చూడండి వివరాలకి. వారి కార్యక్రమం ప్రస్తుతం ఆంధ్రాలో English medium schoolsలో జరుగుతున్ననాటకంలాటిదే, మాతృభాష పలికితే కఠినశిక్షలూ, గట్రాను. నేను bilingual kid (ఉభయభాషాప్రవీణ) కథ రాసినప్పుడు నాకు వచ్చిన కొన్ని ఈమెయిళ్లమూలంగా తెలిసింది నాకీ కథ. ఎటొచ్చీ, తేడా ఏమిటంటే, అమెరికాలో ఒకజాతివారు మరొకజాతిని హింసించారు. మనదేశంలో తెలుగువాళ్లే తెలుగువాళ్లని హింసించుకుంటున్నారు. ఇలాటి సందర్భంలో భమిడిపాటి కామేశ్వరరావుగారు “తెలుగువాళ్లు పెట్టిన ఇంగ్లీషుబళ్లో రెండోభాషగా” తెలుగుపాఠాలు చెప్పే పంతులుగారి దురవస్థలు కొందరికైనా గుర్తు రావచ్చు.

సౌమ్యే అడిగిన మరో ప్రశ్న “మన స్కూళ్లలో తెలుగు ఎలా నేర్పాలి” అన్నది. ఎలా అంటే చెప్పలేను. నేర్చుకోవాలన్న తపనా, తెలుగుమీద నిజమైన గౌరవం ముందు మనకి ఉండాలి. అది మనపిల్లలకి నేర్పాలి. స్కూల్లో ఇంగ్లీషు నేర్చుకోవచ్చు, ఇంట్లో అమ్మా, నాన్నా అనడం ఎందుకు తప్పయింది?

అయితే అందరూ ఇలాగే అని నేనడంలేదు. కొందరు ఈపరిస్థితిని మార్చే ప్రయత్నం చెయ్యడం చూస్తున్నాను. ఈనాటి యువకుటుంబాలలో పిల్లలకి తెలుగు నేర్పుతున్నారు. చదువరీ, సిరిసిరిమువ్వ వాళ్లపిల్లలు తెలుగు పుస్తకాలు చదువుతున్నారు. సుజాత వాళ్లపాప చక్కగా తెలుగు మాటాడుతుంది. శారద వాళ్లపిల్లలకి, తెలుగు, సంస్కృతం, కర్నాటసంగీతం కూడా నేర్పుతున్నారు. విదేశాలలో పెరుగుతున్న పిల్లలకి తెలుగు నేర్పడంకోసం విశ్వప్రయత్నం చేస్తున్న లలితగారు బ్లాగులలో వ్యాఖ్యలు ఇంగ్లీషులో పెట్టడం చూసినప్పుడు ఆమె ఎలాటి సందేశం ఇస్తున్నారో అనిపించింది నాకు. అమెరికాలో చాలా చాలా కొంచెమే అయినా తెలుగు మాటాడుతున్న పిల్లలని చూశాను. అంచేత, వీళ్లే భావితరం తెలుగు పాఠకులు.

మరోమాట. ఇంగ్లీషువాడు చెప్పిందే వేదం అన్న మనస్తత్త్వం వదిలించుకుంటే కూడా కొంత మెరుగుపడతాం. ఇంగ్లీషూ, తెలుగూ దేనికదే. ఇక్కడున్నట్టు అక్కడుండదు. అక్కడున్నట్టు ఇక్కడుండదు. తీపీ, కారం – ఏది తిన్నపుడు దాని రుచే అనుభవించగల మనస్తత్త్వం ప్రధానంగా మనకి లేనంతకాలం ఇలాగే వుంటాయి మన పరిస్థితులు.

ఇక్కడే మరో ఐరనీ కూడా చెప్తాను. నేను అమెరికా వచ్చేక, నాకు తెలుగువాళ్లతో పరిచయాలు తగ్గిపోయేయి. క్రమంగా తెలుగుభాష నశించిపోతోందన్న అభిప్రాయం కూడా ఏర్పడింది. అలాటి సందర్భంలో సౌమ్య తూలిక.నెట్ చూసి, ఈమెయిలిచ్చింది. తనకి ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే, నాసైటు చూడడం, నాతో పరిచయం జరిగేవి కావు. (హాహా అని ఎవరేనా నవ్వితే సరే, నవ్వండి). తనబ్లాగు లింకు ఇచ్చినతరవాతే నాకు తెలుగు బ్లాగులగురించి తెలిసింది. అంచేత, ఇంగ్లీషు కూడా చదవాలి.

అలాగే, హేలీ తనవ్యాసం రాయకపోతే, నేనింత రాయకపోదును కనక, అతనికి కూడా ధన్యవాదాలు చెప్పుకోక తప్పదు. J.

పోతే, గత రెండేళ్లలోనూ బ్లాగులగురించీ, బ్లాగరులగురించి నాఅభిప్రాయాలు అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. భైరవభట్ల కామేశ్వరరావుగారి తెలుగుపద్యం, రాకేశ్వరరావుగారి ఛందస్సు పాఠాలూ, కల్పన, అఫ్సర్, చదువరి, దార్ల వెంకటేశ్వరరావు, నూతక్కి రాఘవేంద్రరావు – ఇలాటివారి బ్లాగులు చూసినప్పుడు తెలుగు ఎక్కడికీ పోలేదు అనిపిస్తుంది. మరికొన్ని చూసినప్పుడూ, ఇంగ్లీషులో వ్యాఖ్యానాలు చూసినప్పుడూ, తెలుగుభాషేదీ అని భూతద్దాలలో వెతుక్కోవలసి వస్తోంది.

For one more perspective on this subject, please see, kalpanarentala.blogspot.com

తెలుగు రెండోభాష అన్నది ప్రధానాంశంగా నేను రాసిన రెండు కథలు

1. Bilingual kid (ఉభయభాషా ప్రవీణ) – ఈకథలో ప్రధానాంశం ఒక భాష నేర్చుకోడానికి మరొక భాష (ముఖ్యంగా తల్లిభాష) నిర్లక్ష్యం చేయడం తగదు అని.

2. Grading an LCTL student – మనసు పెట్టి కాక మొక్కుబడికోసం (గ్రేడ్) ఒక భాష నేర్చుకోడంలో అవకతవకలు.

నాసర్వర్ కష్టాలమూలంగా లింకులన్నీ ఇక్కడ ఇస్తున్నాను. భావికాలంలో వీలయితే, సరయిన చోట పెడతాను. క్షమించాలి.

హేలీ వ్యాసం – http://pustakam.net/?p=3717

Vbsowmya.wordpress.com

My editorial on Bilingualism in Andhra Pradesh. Click here

Article on American Indian Education –http://www.rethinkingschools.org/archive/13_04/review.shtml

Grading an LCTL student (story)

Bilingual kid (story)

(ఫిబ్రవరి 17, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

21 thoughts on “తెలుగెప్పుడూ రెండోభాషే!”

 1. పింగుబ్యాకు: 2010 in review « తెలుగు తూలిక
 2. చర్చ ముగిసే దశలో వ్యాఖ్య వ్రాస్తున్నానేమో ?? అయినా సరే నా రెండు ముక్కలు.

  నా ప్రకారం మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ పుస్తకాలు చదవడాన్ని మనం కాన్షియస్‌గా ప్రోత్సాహించం.
  ఇక్కడ పుస్తకాలు తరచుగా చదివే వారందరిలో సామన్యంగా కనిపించే కారణం కుటుంబ నేపథ్యం, ప్రోత్సాహించే తల్లిదండ్రులు/స్నేహితులు/దగ్గరయినవారు.
  వేరేవారు లేరని కాదు. అలాంటి వారు తక్కువని నా అభిప్రాయం.
  కాబట్టి ముందుగా చదవడం ప్రోత్సాహించే వారు పెరగాలి.

  ఇక రెండోది ప్రస్తుత జనరేషనుకి తగ్గట్టు కాంటెంపరరీ పుస్తకాలూ, నవలలూ లభ్యం కాకపోవడం.

  నా వ్యక్తిగత అనుభవాలేమన్నా పనికొస్తాయేమో చూడండి:

  నా చిన్నప్పుడు ఎన్నో రకాల పుస్తకాలని చదివేవాణ్ణి, ఒకరకంగా ఇప్పటికంటే ఎక్కువగా.
  అందులో చందమామలు, బాలమిత్రలు, పంచతంత్రాలూ, సంక్షిప్త మహాభారతాలు, రామాయణాలూ అన్నీ ఉన్నాయి.
  ఒక రకంగా చెప్పాలంటే ఆ వయసుకి తగ్గట్టు, ఆ జనరేషనుకి తగ్గట్టూ పుస్తకాలు నాకు అందుబటులో ఉన్నాయి. చదవడం ప్రోత్సాహించే తల్లిదండ్రులూ ఉన్నారు.
  తెలుగు ఎక్కువగా చదవడానికి నాకు ప్రోత్సాహం ఆ అందుబాటుతనం.

  తరువాత కాలేజీ/ఇంజినీరింగూ వయసుకి ఎదిగే సరికి నా అభిరుచులకి తగ్గట్టు పుస్తకాలు దొరకడం అరుదయింది.
  నా అప్పటి వయసుకీ, జనరేషనుకీ తగ్గట్టు షెర్లాక్ హోంస్, సిడ్నీ షెల్డన్, వగయిరాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
  వార పత్రికలూ, దిన పత్రికలూ తప్ప కాంటెంపరరీ పుస్తకాలూ, నవలలూ తెలుగులో దొరకడమే గగనం అయిపోయింది.
  తెలుగు చదవడం తక్కువయిపోయింది.
  (ఆఫ్కోర్స్ చదువు అనే గుదిబండ కూడా మెడలో ఉందనుకోండి)

  తరువాత ఉద్యోగంలో చేరిన తరువాత నాకు “నా” అనే సమయం చిక్కడం ఆరంభమయింది.
  అప్పుడు మళ్ళీ అసలు తెలుగులో చదవాలంటే ఎలాంటి పుస్తకాలు చదవచ్చు అనే ఆసక్తి మొదలయి నెమ్మదిగా వాటికోసం వెదకడం మొదలుపెట్టాను.
  నాకు వ్యక్తిగతంగా కథలంటే ఇష్టం, ఫాంటసీ ఇష్టం, సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్స్ ఇష్టం. ఎంతసేపూ యండమూరి, షాడో వగయిరాలు తప్పితే నా జనరేషనుకి తగ్గ పుస్తకాలు దొరకడం చాలా అరుదుగానే కనిపించింది, దాదాపు అసలు దొరకలేదనే చెప్పొచ్చు.

  అసలు తెలుగు రచనా వ్యసంగం ఒకదగ్గర ఆగిపోయిందేమో అని నాకనిపిస్తుంది.
  ఇప్పటికీ చూసినా నామిని పుస్తకలూ, ఖదీర్ బాబు కథలూ వగయిరాలంతా ఒక రెండు పుస్తకాల తరువాత రొడ్డకొట్టుడులా అనిపిస్తుంది. (ఈ వ్యాఖ్య ఎవరినయినా నొప్పిస్తే క్షమించాలి)
  ఎంతసేపని అనుభవాలు, అనుభూతుల కథలే చదువుతాము ?
  ఇక ఇవి కావంటే మిగతా రచనలన్నీ ఇంతకు ముందు నా బ్లాగులో ఒకసారి వ్రాసినట్టు మూస కథలు.

  ఆసక్తి కలిగించి ప్రత్యేకం అనిపించేవి నాకెదురు పడలేదు. (ఏమో నా టేస్టు ఇక్కడ మిగతా అందరిలాగా సీరియస్ సాహిత్యం కాకపోవడం వల్లనేమో కూడానూ).
  అసలు వెరయిటీ అనేది ప్రస్తుత జనరేషనుకి తగ్గట్టుగా నాకు లభించలేదు.

  దానికి వ్రాసేవారు కరువవడమూ కారణమే. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అనే సమస్య.
  వ్రాస్తే తప్ప చదవలేమని నా లాంటి వారంటారు. ప్రోత్సాహించే వారు లేందే ఎవరు వ్రాస్తారని మిగతా వారంటారు.

  దీనికి ఇంతకు ముందెవరో చెప్పినట్టు వ్రాయడానికి మనమే ముందడుగు వేసి, ప్రోత్సాహించాలి. అలాంటి పుస్తకాలను వ్రాసే వారికి ప్రోత్సాహం అందించాలి.
  లేదా ఇలాగే నిరుత్సాహపడుతుండాలి.

  మెచ్చుకోండి

 3. మీ బ్లాగ్ చూసాను, బాగుంది. మాలతి గారంటే స్వాతి వారపత్రికలో అడగండి చెపుతా శీర్షికలో ఉన్న మాలతీచందూరు గారేనా మీరు. అన్యదా భవించక నా సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 4. అవునూ, అప్పట్లో ఎన్ ఆర్ నంది లాంటి వాళ్ళు రాసే సబ్జక్ట్స్ పై ఇప్పుడెవరూ రాయట్లేదా?

  మెచ్చుకోండి

 5. ఇక్కడ Harry Potter ప్రస్తావన పదే పదే వస్తోంది. ఆ పుస్తక చరిత్ర గురించి ఆలోచిస్టే ఈ చర్చలో చాలా ప్రశ్నలకు సమధానాలు దొరుకుతాయేమో.
  In 1995, Rowling finished her manuscript for Harry Potter and the Philosopher’s Stone on an old manual typewriter.[37] Upon the enthusiastic response of Bryony Evans, a reader who had been asked to review the book’s first three chapters, the Fulham-based Christopher Little Literary Agents agreed to represent Rowling in her quest for a publisher. The book was submitted to twelve publishing houses, all of which rejected the manuscript.[29] A year later she was finally given the green light (and a £1500 advance) by editor Barry Cunningham from Bloomsbury, a small British publishing house in London, England.[29][38] The decision to publish Rowling’s book apparently owes much to Alice Newton, the eight-year-old daughter of Bloomsbury’s chairman, who was given the first chapter to review by her father and immediately demanded the next.[39] Although Bloomsbury agreed to publish the book, Cunningham says that he advised Rowling to get a day job, since she had little chance of making money in children’s books.[40] Soon after, in 1997, Rowling received an £8000 grant from the Scottish Arts Council to enable her to continue writing.[41] The following spring, an auction was held in the United States for the rights to publish the novel, and was won by Scholastic Inc., for $105,000. Rowling has said she “nearly died” when she heard the news.[42]

  A little more background:
  “After Jessica’s birth and the separation from her husband, Rowling had left her teaching job in Portugal. In order to teach in Scotland she would need a postgraduate certificate of education (PGCE), requiring a full-time, year-long course of study. She began this course in August 1995,[33] after completing her first novel while having survived on welfare.[34] She wrote in many cafés, especially Nicolson’s Café,[35] whenever she could get Jessica to fall asleep.[12][36]…”

  I’m sure many readers or otherwise of Harry Potter might know all this already.

  సారాంశం ఏంటంటే, చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టే అటువంటి పుస్తకాలు వస్తాయనుకోవడం పూర్తిగా నిజం కాదని చెప్తుంది ఆ పుస్తకం ప్రచురణకు ముందు పడిన అవస్థలు. So called పుస్తకాల గిరాకీ ఉన్న భాష, ప్రదేశంలో కూడా అది ఇంద్రజాలంలా జరిగిపోలేదు. మాట్లాడితే అక్కడి కష్టం ఇంకో విధంగా ఉంటుంది.

  మెచ్చుకోండి

 6. @సుజాత:

  నా ఉద్దేశం ‘అవొద్దు’ అని కాదు. ‘అన్నీ అవేనా’ అని 🙂 అడపా దడపా భిన్నమైనవీ వస్తున్నాయి, కాదనను. ఐతే, మూస కథల ధాటికి చాలామంది పాఠకులు తెలుగు కథలంటేనే ఆమడ దూరం పారిపోయే రోజులొచ్చేశాయి. ఇక అప్పుడప్పుడూ మంచి కథలొస్తున్నాయన్న సంగతి వాళ్లకెలా తెలుస్తుంది? నూటికి నూరూ మంచివే ఉండాలనటం అత్యాశే. నూటికి ఇరవయ్యన్నా ఉంటున్నాయా? డౌటే.

  మొత్తమ్మీద, నే చెప్పదలుచుకుందిది. తెలుగు సాహిత్యానికి పాఠకాదరణ తగ్గిందంటే దానిక్కారణం పాఠకులు కారు. వాళ్లనాకట్టుకునే రకంగా రాయలేని రచయిత/త్రులు, ప్రచురణకర్తలు, మరియు వారి మార్కెటింగ్ నిపుణులు.

  మెచ్చుకోండి

 7. మాలతి గారు. చాలా మంచి చర్చ మొదలు పెట్టేరు. పూర్ణిమ, మీరు అబక్రదబ్ర గారు ఇంకా అందరు… అందరు ఒకటే మాట ను చెపుతున్నారు అనిపించింది నాకు. అందరికి తెలుగంటే అభిమానమే. ఏదో రూపాన దాన్ని వ్యక్తీకరించాలనే తపనే అనిపించింది. ఇవాళ్టి రోజున హారీ పాటర్ లా 10 మంది లో 8 మంది చేత వహవ్వ అనిపించుకోవాలంటే తెలుగు లో ఒక పుస్తకం లేదన్నారు.. నేను గమనించింది మన తెలుగు వాళ్ళలో అంత సేపు ఒక పుస్తకం మీద పెట్టాలి అంటే మాకేంటి అనే ప్రశ్న వస్తోంది. పుస్తకం చదివే టైం టీవీ చూడటం లో వినియోగిస్తున్నారు. ఇక్కడ ఎంత టీవీ చూసినా రోజు ఒక అరగంట ఐనా చిన్నతనం నుంచి పుస్తకం చదవటం (అది స్కూల్ పుస్తకం అయ్యి వుండక్కర్లేదు) అనేది చాలా వరకు దినచర్య లో భాగం అవుతుంది, మనకు అక్కడ అలా చదవ వలసి వచ్చినా ఆ పుస్తకం ఇంగ్లీష్ ఐతే ఇంగ్లీష్ డెవెలప్ అవుతుంది ఇంకా ఆ ప్రపంచం (మరి మా లాంటోళ్ళందరం అలా చదివే గా పరుగెత్తుకుని వచ్చాము) తెలుస్తుంది అనే వుద్దేశం లో వుంటున్నారు పిల్లలు తల్లి తండ్రులు కూడా. మరి పోటి ప్రపంచం లో తప్పదు కదా అంటె.. అవునేమో..
  హారి పాటర్ పుస్తకం మాత్రం ఇప్పటి తరాన్ని ఇప్పటి వారి ఆలోచనలను ప్రతిబింబింప చేస్తోందా.. ఇప్పటి వారి ఆలోచనలు ఇది వరకటి వారికంటే ఎలా తేడా…???? మనిషి కి మౌలికం గా వుండే ఆలోచనా క్రమం ఏం మారనప్పుడు ఇప్పటి తరం అంటూ ప్రత్యేకం ఏమి వుంది? నిజం గా అర్ధం కాకే అడుగుతున్నా. తెలుగు టీవీ కు పత్రిక కు ఆదరణ తగ్గలేదు అవును పుస్తకం చదివే కంటే ఒక 10 నిమిషాలు చూసి కట్టేసే టీవీ తేలిక కదా. 🙂

  మెచ్చుకోండి

 8. @HalleY, చాలా సంతోషం. మీఅక్క పట్టుదల నాకు తెలుసు కనక, మీదగ్గర్నుంచి ఇంకా వ్యాసాలు వస్తాయనీ,(ఏదో పాపం ఈవిడకి సరుకు అందించినవాడిని కాగలను అనుకుని అయినా సరే :p)మీరు చదివిన తెలుగు పుస్తకాలమీద కూడా రాస్తారని ఆశిస్తున్నాను.
  @ Independent, Ramana, అబ్రకదబ్ర, సుజాత – ధన్యవాదాలు మీరు మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు. నాకు కావలిసింది ఇదే, dialogue. ఇతర పాఠకులు కూడా మీ అభిప్రాయాలు రాయమని కోరుతున్నాను. మరోవారం చూసి, (అప్పటికి నాసర్వర్ కష్టాలు కూడా తీరతాయని అనుకుంటున్నాను)- వివరంగా మరోసారి అందరికీ జవాబులు ఇస్తాను.
  ధన్యవాదాలతో
  మాలతి

  మెచ్చుకోండి

 9. @అబ్రకదబ్ర,
  ఇప్పటికీ బంధాలూ అనుబంధాల మీద పుంఖానుపుంఖాలుగా కథలూ కాకరకాయలూ రాసి పారేసి వాటినెవరూ చదవటం లేదంటే ఎలా? తిప్పించీ మళ్లించీ అవే నేపధ్యాలు, అవే బాధామయ గాధలు, అవే నోస్టాల్జియాలు .. ఇంకెన్నాళ్లిలా? అరవైల్లో పాఠకుల ప్రపంచం చిన్నది. ఇప్పటి చదువరుల ప్రాధాన్యతలు వేరు. వీళ్లెరిగిన ప్రపంచం పెద్దది. వీళ్ల దృక్పధాలూ అంత పెద్దవే. ఎవర్ గ్రీన్ అనుకుంటూ అందరు రచయితలూ అవే అవే రాగద్వేషాలు, అనుభవాలు, అనుభూతుల గురించి రాస్తుంటే ఎన్నని చదువుతారు?……అందుకేగా మీరు తెలుగు కథను కొత్త దారి పట్టించారు?:-)))

  అయినా మీరు తెలుగు కథల్ని ఆన్ లైన్ లో తప్ప చదివే అవకాశం లేదు కాబట్టేమో కానీ, తెలుగులో మంచి కథలే వస్తున్నాయండీ! ఆ మాటకొస్తే అరవై డెబ్భైల్లో మాత్రం మంచి కథలకేం తక్కువ? ఇప్పుడే బుచ్చి బాబు “మేడ మెట్లు” చదివొస్తున్నా! ఎంత అద్భుతమైన కథ!మనకెదురైనవే కాదు, మనం వెదికి పట్టుకుని చదవాల్సిన కథలు కూడా ఉంటాయండీ!(నిజంగా చదవాలని ఆసక్తి ఉంటే వెదకటం బోరు కొట్టదు)

  కల్పనా రెంటాల గారు తన బ్లాగులో చెప్పినట్లు “మంచి కథ”అనేది దాగదు”…పంచుకునేవారుంటే!

  మెచ్చుకోండి

 10. తెలుగులో తప్పులుంటే క్షమించండి ! . నాకు ఈ ట్రాన్లిటరేషన్ స్కీములు అర్థం చేసుకోటానికి మరి కొన్ని యుగాలు కావాలో ఎమో !.

  ఆహా ! మా అక్క (అనగా సదరు వి.బి.సౌమ్య ) ఎప్పటి నుంచో పుస్తకం.నెట్లో రాయమని అడుగుతూ ఉంటీ యెందుకా అని అనుకొనే వాడిని … తెలుగు ఈ-కుటుంబం పెద్దది లాగానే ఉంది మరి ! .
  నేను ఆ టపా రాయటం వలన మీరు ఈ టపా రసారా ! . మీ ధన్యవాదాలకి నా కృతఙ్నతలు .

  మెచ్చుకోండి

 11. లోపం రాసేవాళ్లదే అంటే ఎలా? చదివేవారు లేనిదే కొత్తగా రాయాల్సిన అవసరం మాకేంటని వారు ప్రశ్నిస్తారు. అప్పుదేంటి సమాధానం ?, ఆంగ్ల చదువుల వలన తెలుగు చదవటం తగ్గిపోయింది అని ఎవరూ అనరు. తెలుగుపై నిర్లక్ష్యం వలన దూరం చేస్తున్నారు. కేవలం కేవలం డబ్బు కోసమే కాకుండా స్వీయవిముక్తి కోసం, వారు అన్వేషించిన విషయాలను గురించి రాసేవారు. 80 ల నాటికి ఇది అంతరించింది. ఆ తర్వాత వచ్చిన రచయితలు, పాఠకులు ఇద్దరూ కలిసి కొత్తగా పాతకులను, రచయితలను తయారు చేయలేని పరిస్థితిని సృష్టించారు. నిజానికి మనకు ఉన్న గొప్ప రచయితలు అని చెప్పబడ్డ చలం, గోపీచంద్, బుచ్చిబాబు, నవీన్, చండీదాస్ … ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాశారు.
  ఈ మధ్యకాలలో వహ్వా అనిపించే రచనలు రాశారా అని అడుగుతున్నారు కదా? – మరి ఈ తరం పాఠకుల ఆలోచలనలకు అనుగుణంగా రాయాల్సింది ఎవరు? అప్పటితరం వారా ? లేక ఇప్పటివారా ? ఇప్పటివారు మరి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో కొత్తగా ఎందుకు రాయటం లేదు?, ఇంతటి బిజీ వాతావరణం లో తెలుగుపై అంత ప్రేమతో రాసేవారు ఎవరు? రాయగలిగిన వస్తువు ఉన్నా, అందరిచేత చదివింపచేసే విధంగా ఎందుకు రాయలేక పోతున్నారు? చిన్నప్పటి నుంచి కాకుండా చక్కగా ఉద్యోగాలు వచ్చి ఒక్కసారి తెలుగు పుస్తకాలు చదివి రాయటం అంత సులభమా? అంటే చిన్నప్పుడు చదివిన దానిలోనే ఏదో లోపం ఉంది. మనం చదివిన వాటికి, మన రచనా ఆదర్శాలకు పొంతన కుదరటం లేదనేగా? కాబట్టి కొత్తతరం రచయితలు పుట్టుకు రావటం అనేది కల్ల. సమూలంగా మార్పులు జరిగితే తప్ప. రచయితలది ఎంత లోపముందో పాఠకులది, తల్లిదండ్రులది అంతే లోపం ఉంది. ఆ విధంగా చూస్తే ప్రతి ఒక్కరూ ఇందులో బాధ్యులు అన్నమాట.

  మెచ్చుకోండి

 12. చర్చ బాగా నడుస్తుంది. నాదీ ఓ చెయ్యి 🙂

  అంతర్జాలం కారణంగానూ, ఆంగ్ల చదువుల మూలాన్నూ తెలుగు పుస్తకాలు చదివేవాళ్లు కరువైపోయారనటం ఆడలేక మద్దెల ఓడెననటమే. తెలుగు సినిమాలకి, టీవీ కార్యక్రమాలకీ ఆంగ్ల చదువుల మూలాన మార్కెట్ కుంగి కృశించిందా? లేదు. మరి తెలుగు పుస్తకాలకి మాత్రం గిరాకీ ఎందుకు తగ్గింది? నిజానికి, చదువుకున్నవాళ్లు పెరిగిన ఈ కాలంలో తెలుగు పుస్తకాలు చదివేవాళ్లూ పెరిగి తీరాలి. పేరుకి మనవి ఆంగ్ల చదువులైనా, అక్కడ నూటికి ఎనభైమంది నేర్చుకునే ఆంగ్లం నేతిబీరలో నెయ్యి. తెలుగునాట తెలుగు రూపం మారుతుంది – నిజమే. అసలుకే మోసమైతే రాలేదు. అది చదవగలిగే వాళ్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు. జనాలు తెలుగు చదవటమే మర్చిపోతున్నారు అనేది అపోహ మాత్రమే. కావాలంటే గత ఐదేళ్లలో రెట్టింపైన తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ చూడండి.

  అంచాత చెప్పొచ్చేదేమంటే, లోపం రాతగాళ్లదే తప్ప చదివేవాళ్లది కాదు. చెత్త రాసేసి చదవమంటే ఎవరు చదువుతారు? పూర్ణిమ అడిగినట్లు, వహ్వా అనిపించే తెలుగు రాతలు ఎందర్రాశారీమధ్య కాలంలో?

  శంకరాభరణంలో దాసు అంటాడు: ‘ఎప్పుడో పడవల్లో ప్రయాణాలు చేసే రోజుల్లో కట్టిన రాగాలూ, పాడిన పాటలూ అవి. మరి ఇప్పుడో – బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయి. మన దైనందిన జీవితంలో ఎలాగైతే స్పీడొచ్చిందో, అలాగే సంగీతంలోనూ రావాలి …’

  అలాగే, తెలుగు సాహిత్యంలోనూ మార్పు రావాలి. అరవైల్లోనూ, డెబ్భైల్లోనూ రాసిన ఒరవడిలోనే ఇప్పటికీ బంధాలూ అనుబంధాల మీద పుంఖానుపుంఖాలుగా కథలూ కాకరకాయలూ రాసి పారేసి వాటినెవరూ చదవటం లేదంటే ఎలా? తిప్పించీ మళ్లించీ అవే నేపధ్యాలు, అవే బాధామయ గాధలు, అవే నోస్టాల్జియాలు .. ఇంకెన్నాళ్లిలా? అరవైల్లో పాఠకుల ప్రపంచం చిన్నది. ఇప్పటి చదువరుల ప్రాధాన్యతలు వేరు. వీళ్లెరిగిన ప్రపంచం పెద్దది. వీళ్ల దృక్పధాలూ అంత పెద్దవే. ఎవర్ గ్రీన్ అనుకుంటూ అందరు రచయితలూ అవే అవే రాగద్వేషాలు, అనుభవాలు, అనుభూతుల గురించి రాస్తుంటే ఎన్నని చదువుతారు?

  మెచ్చుకోండి

 13. “నేను ఆంగ్లేతర భాషను ప్రస్తావిస్తే “.. “నేను ఇటాలియన్ సాహిత్యం”..
  That was a brilliant point Purnima. I guess that attempt probably would help to put things in perspective. If someone can put in some work in that direction, not only that it offers a new paradigm to this discussion, but also we can bring it back from the unfortunate mindset of “English vs Telugu” or “English over Telugu”.

  Malathi garu-> My advanced apologies. Telugu is not my 2nd language. I haven’t been introduced to English teaching, until I was 17 years old. I am at my work, and someone alerted me about the discussion here. I don’t have the time to write in telugu, hence the English. By the way, I agree with some opinions in your article. But I don’t think Telugu is dying. From the place where I stand, I see that the problem is more on “reading habits of people” as opposed to English vs Telugu. I don’t know how to teach or cultivate the habbit of reading. Vast majority of my friends don’t read barring a few. They read neither English nor Telugu(I discount self-help crap here). I don’t even agree that E-Media is one of the culprits. For all we know it couldn’t put any dent in USA.

  Gotta run..will come back

  మెచ్చుకోండి

 14. @ Lalita garu, I understand completely. Right now, I am writing this msg from a library because of the server problems at home. My sincere apologies for quoting you and hurting your feelings.
  “my effort is to teach appreciation of Telugu literature and culture rather than teaching the language itself.” – Point well-taken. I should have known this myself. Once again, sorry.
  In this article, I only tried to give more information, the background info, which helps us to push in the same direction as yours–to be aware of where we’ve come from and how this usage of English has happened. I’ve been wanting to say this for a very long time, and it felt like Haley opened the door for me. That is why this is a separate post, not a comment on his opinions.
  I know you and several other bloggers are proud of their heritage or else they wouldn’t be here.

  @ Purnima, :).

  మెచ్చుకోండి

 15. Malalthi garu,
  I am having my own technical problems and some.
  I happened to write to Sowmya today about some confusion I was having.
  Then I saw your post and the discussion.
  As it has has been happening for quite some time, there are things out of my control happening to cause a lot of misunderstanding.
  Something so unexplaianable as “vadla ginjalO biyyapu ginja”.
  So, I have been away from blogs.
  Then my passion dragged me to pustakam.
  Then again I seemed to be losing control.

  All this preface to say that, Malathi garu, I understand your point in the discussion as well as Purnima’s.
  I am a little extra sensitive to heat in such discussions where two well meaning expressions and good natured personalities conflict with each other.

  I read the story of Bilingual kid. I understand that struggle completely.
  Yes, Telugu has been like a second language to me and that is why I comment in English when I feel like like commenting quickly.
  Through Telugu4kids, my effort is to teach appreciation of Telugu literature and culture rather than teaching the language itself.
  For one reason, I’m not an expert at the language myself.
  If it’s so natural for me to use English, given my broughtup, I am concerned about the coming generations.
  I hope that’s the message I give in my comments.
  All the same I am proud of my roots and that’s what I like advocating too.

  At this point of time, this is all I can say.
  Thanks for all the appreciation and kind and encouraging words.

  మెచ్చుకోండి

 16. >> మీరు ఇంగ్లీషుకి ట్యూను అయేరు. నేను తెలుగుకి ట్యూను అయిఉన్నాను. అదనుకుంటాను అసలు బాధ.

  అయ్యుండచ్చు! మీరో కొండపై, నేనో కొండపై ఉండి మాట్లాడుకోవాలంటే కుదరదు. అరవాల్సి వస్తుంది. ఎందుకంత కష్టం చెప్పండీ. 🙂
  మన మన ఫ్రీక్వెంసీలు కలిసే అవకాశాలు కనిపిస్తే, అప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అందాక సెలవు!

  మెచ్చుకోండి

 17. @ మహేష్‌కుమార్, అరిపిరాల, ధన్యవాదాలు మీ అభిప్రాయాలకి.
  @ పూర్ణిమ, మీరు పరోక్షంగా నామాటనే ధృవపరిచారు – తెలుగు మీకు రెండోభాషే అని.
  నేను అపార్థం చేసుకున్నానని మీరంటే సరే. తెలుగులో ఇది లేదు, అది లేదు అంటూ విచారించడమే మీకు సమ్మతం. అలాగే కానీండి. నిజానికి నేను హేలీ అభిప్రాయాలని ఖండించలేదు. అలాటి అభిప్రాయాలు ఉచితం కాదు అన్నాను. రెండోది, అవి కలగడానికి వెనకగల కారణాలు, చారిత్ర్యకసత్యాలు ఎత్తి చూపేను ఇక్కడ.
  “మాలతిగారితో … విడ్డూరమే” అన్న మీవాక్యం మాత్రం న్యాయం కాదనుకుంటాను. నేను ఎవరినీ తెలిసి కించపరచలేదు. అలా జరిగి ఉంటే క్షమించండి. మీకు తెలిసినతెలుగులోనే రాయండి అని మాత్రమే అడుగుతున్నాను. అదంతా ఇంగ్లీషుమయమే అంటే నేను చెప్పేది ఏమీ లేదు.
  మీ ఇ-స్టాలులో కరపత్రం – అక్కడ అవతలిమనిషికి తెలుగు వచ్చో రాదో నాకు తెలీదు. మీరు విద్యుల్లేఖలాటి మాటలు వాడక్కర్లేదు. నిజానికి ఈవ్యాసంలో కూడా ఇంగ్లీషు మాటలు ఉన్నాయి కదా. నేను అంటున్నది చాలావరకూ తెలుగు వాడొచ్చు అని – “ఇది తెలుగుబ్లాగులగురించి” లాటివి అని. ఇది ఉదాహరణ మాత్రమే. నిజంగా అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు కదా.
  తెలుగు సాహిత్యంలో మీరు మునకలేయాలనుకుంటున్నారా అంటూ పెద్ద జాబితా అందించిన మీ నోట మాత్రం వెండిచెంచా లేదని ఎలా అనుకుంటాను, చెప్పండి 🙂
  అలాగే, ఇంగ్లీషులో వ్యాఖ్యలు కూడాను. నేను ఇంగ్లీషుమీద ఇరిటేటింగ్ టోనుతో మాటాడలేదు. మీరు ఇక్కడ ఇంత చక్కని తెలుగులో రాసేరు కదా. మరి ఇదే పని ఇతర బ్లాగులలో ఎందుకు చెయ్యలేరు? నేను తెలుగుబ్లాగులు చూడ్డం తెలుగుభాష కోసమే. ఇంగ్లీషులో కావాలంటే, ఇంగ్లీషుబ్లాగులే చూస్తాను. తెలుగు తెలీనివాళ్లకి తెలుగుగురించి ఇంగ్లీషులో చెప్పడంకోసం వేరే సైటు అందుకే పెట్టుకున్నాను. అలా మనం ఇంగ్లీషుకి ఇంగ్లీషూ, తెలుగుకి తెలుగూ ఎందుకు వాడుకోకూడదూ అనేదే నాకు అర్థం కావడంలేదు. అంతే.
  – అసలు మొక్కపై ధ్యాసే లేదు. ఎవరికి? మీకా, నాకా?
  మేం ఇంగ్లీషులోనే మాటాడతాం అని మీరంటే కాదనడానికి నేనెవరిని? :). మీరు ఇంగ్లీషుకి ట్యూను అయేరు. నేను తెలుగుకి ట్యూను అయిఉన్నాను. అదనుకుంటాను అసలు బాధ. లలితగారు చేస్తున్న పని నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. నిజానికి నేను చేయలేని పని ఆమె చేస్తున్నారు. ఆమె ఇంగ్లీషులో వ్యాఖ్యలు రాయడానికి కూడా ఒప్పుకోదగ్గ కారణాలు ఉండేవుంటాయి కూడాను. కానీ అది తెలీనివారికి ఆవ్యాఖ్య ఎలాటి సందేశాన్ని అందిస్తుందో ఎత్తి చూపడమే నా ఉద్దేశం. ఆమెని కించపరచడం నా ఉద్దేశం కాదు.
  పోనీ, మీరు మీ పుస్తకం సైటు పూర్తిగా ఇంగ్లీషులోనే నడపకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పండి. అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను.
  మరొకసారి మీఅభిప్రాయాలు వెలిబుచ్చినందుకు, థాంక్స్.

  మెచ్చుకోండి

 18. మాలతి గారు, సౌమ్య అడిగిన ప్రశ్నలో అంతరార్థం పూర్ణిమ చెప్పినట్లు – తెలుగు సాహిత్యంలో పదిమంది చేత అభినందించబడి, మరో పది మంది కొత్త చదువరులని చేర్చి, మరో పది భాషల్లో అనువాదమై – స్థూలంగా తెలుగు సాహిత్యం స్థాయిని ప్రకటించే రచనలు అరుదైపోయాయి అని అనుకుంటాను. ఈ విషయంలో చేతన్ భగత్ రచనలు మరో వుదాహరణ. హారీ పోటర్ లాంటి కథలు మన దగ్గర బోలెడు వుండచ్చు కానీ హారీ పోటర్ లాంటి పుస్తకం లేకపోవడమే విచారకరం.

  మెచ్చుకోండి

 19. మీరు హాలీ వ్యాసంలోని పాయింట్‍ను గానీ, సౌమ్య ప్ర్రశ్నలో పాయింట్ గానీ సరిగ్గా పట్టుకోలేదని నాకనిపిస్తుంది.

  హాలీ చదివింది ఆంగ్ల సాహిత్యం కాబట్టి, ఆ ఉదాహరణలు ఇచ్చారు. నేను ఇటాలియన్ సాహిత్యం చదివి ఆ ఉదాహరణలు ఇచ్చాననుకోండి.. అప్పుడు మీరు తెలుగుకి ఆంగ్లం చేస్తున్న ద్రోహం గురించి చెప్పే అవకాశం ఏది? హాలీ వ్యాసంలో నాకర్థమయ్యింది ఏంటంటే, తనకి వచ్చిన రెండు బాషల్లోని సాహిత్యాన్ని పోల్చి చూసుకొని, ఒకటి మరీ వెనుకబడి ఉంది అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. నేను ఆంగ్లేతర భాషను ప్రస్తావిస్తే మీరు ఇక్కడ చేసిన వాదన ఎంత వరకూ నిలుస్తుందంటారు?

  రెండు భాషలకి పోలిక పెట్టకూడదన్నారు. సరే! వేరే భాషలొద్దు. యాభై, ఎనభైలలోని తెలుగుతో కూడా పోలిక వద్దు. ప్రస్తుతం, తెలుగులో చదవదగ్గ, చదవాల్సిన, చదివిస్తున్న పుస్తకాలు ఎన్ని? అవి ఏమిటి?

  ఇహ సౌమ్య ప్రశ్న: ఇందులో కూడా నేను అర్థం చేసుకున్నది వేరే. హారీ పాటర్ని ఓ వంద మిలియన్ల మంది చదివుంటే, వంద మిలియన్లచే చదవబడ్డ తెలుగు పుస్తకం ఏదీ? అని కాదేమో! తెలుగంటే మక్కువ, తెలుగు సాహిత్యం పై ఆసక్తి, తెలుగు అంశాలపై ఇంగ్లీషులో చర్చించుకోనివారూ అంతా కలిపి ఓ పదిమంది మాత్రమే ఉంటారనుకుందాం. ఆ పదిమందిలో ఎనిమిదితోనైనా “వాహ్.. వాహ్” కొట్టించిన పుస్తకం ఏదీ? ఇంకో నలుగుర్ని కొత్తగా పుస్తక పఠనపై ఆసక్తి కలిగించిన పుస్తకం ఏదీ? – ఇదీ ప్రశ్న. సౌమ్య ప్రశ్న ఇది కాకపోతే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి.

  బ్లాగుల్లో నేను గమనించిన మరో విషయమేమిటంటే.. born with silver spoon తరహాలో, నోట్లో తెలుగనే గరిటితో పుట్టి, తెలుగులో మునిగిలేస్తూ, తెలుగుని ఆసాంతం సొంతం చేసేసుకొని ఉన్నవారూ, ఇంగ్లీషుపై ఒక లాంటి ఇరిటేటింగ్ టోన్‍తో మాట్లాడ్డం. ఎందుకో నాకర్థం కాదు. కారణాలు ఎలాంటివైనా ఇంగ్లీషుని మన జీవితాల్లో నుండి మైనస్ చేయ్యడం వీలుకాని పని. తెలుగు, ఇంగ్లిషు co-exist అవ్వక తప్పదని నా అభిప్రాయం. At least to let Telugu transit to its glorious best.

  ఇంకో విషయం. హైద్ బుక్ ఫేర్‍లో ఈ-తెలుగు స్టాల్‍లో ఓ పూట నేను కరపత్రాలు పంచిపెట్టాను. ఒకాయన వచ్చారు, నేను కరపత్రం ఇచ్చి, నాకు తెల్సినంతలో ఈ-తెలుగు గురించి చెప్పి పంపాను. ఆయన అటు పోగానే “ఈ-తెలుగు గురించి ఇంగ్లీషులో చెప్తావేంటి?” అంది సౌమ్య నాతో. “తెలుగువైపుకి జనాలని మరల్చాలంటే ఇంగ్లీషు బా పనికొస్తుంద”ని అన్నా నేను. అంటే తెలుగుపై ఎందుకనో కాస్త విముఖత ఉన్నవారికో, లేక తెలుగుతో పరిచయం తప్పిపోయిన వారికో ఉన్నపలాన “అంతర్జాలం”, “విద్యుత్-లేఖ” అంటే కళ్ళు తిరుగుతాయి. బహుశా, లలితగారు కూడా ఇంగ్లీషు అందుకే వాడతారేమో! అయినా, అసెంబ్లీ సమావేశాలప్పుడు స్పీకరే ఇంగ్లీషు తప్ప ఏం మాట్లాడ్డం లేదు, మామూలు బ్లాగు చర్చలపై మీ అభ్యంతరం నాకు కాస్త వింతగా ఉంది. హాలీ వ్యాసం కన్నా, అక్కడ ఇంగ్లీషు కమ్మెంట్స్ మిమల్ని ఎక్కువ నొప్పించినట్టున్నాయ్!

  మనకున్న సమస్య ఇంగ్లీషు కాదు. ఇంగ్లీషు వల్ల మనం ప్రపంచాన్ని పలకరిస్తున్నాం. మనకున్న సమస్య “మన” అనేదానిపై నిర్లిప్తత. నిరాసక్తి. మన భాష, మన భోజనం, మన ప్రదేశాలు – వీటిని జాగ్రత్తగా చూసుకోకపోవడం, అభివృద్ధి చేసుకోకపోవడం మన సమస్యలు. తెలుగు నాశనం కావటానికి ఇంగ్లీషు అవసరం లేదు. రాదు. అసలు మొక్కపై ధ్యాసే లేనప్పుడు, మరో పెద్ద చెట్టు నీడ పడుతుందని బాధ దేనికి?

  ఇప్పుడు నా వ్యాఖ్యలో చాలా అచ్చుతప్పులుండచ్చు. అందులో చాలా వరకూ “ఇది సరైన స్పెల్లింగ్” అని తెలీకపోవడం వల్ల కూడా అయ్యుండచ్చు. “తెలుగులో ఫలానా పదం ఎలా రాయాలో తెలీని పిల్ల, మాలతిగారంతటి ఆవిడతో చర్చకి దిగింది తెల్సా, విడ్డూరం కాకపోతే!” అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని నాకు తెల్సు. అసలు విషయాన్ని వదలేసి, దొరికిన పుల్లల్లా పట్టుకొని పక్కదారి పట్టుకుపోయే వాళ్ళకి నా నుండి ఎలాంటి సమాధానం రాదని గమనించగలరు.

  ధన్యవాదాలు!
  పూర్ణిమ

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశముపై తెలుగులో చర్చకి అనువైన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడును.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s