తెలుగెప్పుడూ రెండోభాషే – మీవ్యాఖ్యలకి నా జవాబు

మీరందరూ – పూర్ణమా, అబ్రకదబ్ర, రమణ, ఇండిపెండంట్, సుజాత, లలిత, భావన,  కుమార్ యన్, శ్రీవాసుకి – మీఅభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

సంగ్రహంగా, నేను చెప్పదలుకున్నది ఈనాడు మనసాహిత్యంలో ఇంగ్లీషు ఇంత విస్తారంగా కనిపించడానికి చారిత్ర్యక కారణాలు.

మూడుతరాలకి ముందే ఇది ప్రారంభం అయిందని అన్నాను. నేను గమనించింది అంతే కానీ దేశ చరిత్ర ఒక్కటే కారణం అనలేను. ఎందుకంటే, తమిళం, బెంగాలీ కూడా ఈదేశంలో భాగమే అయినా వాళ్లభాషలో మనం వాడినంత ఇంగ్లీషు కనిపించదు. అంచేత, మీకు ఎవరికైనా, ఇంకా ఏవైనా ఆలోచనలు ఉంటే చెప్పండి. నాప్రతిపాదనకి, అనుకూలంగానే కానక్కర్లేదు, ప్రతికూలంగానో, ప్రత్యామ్నాయంగానో అయినా సరే, మీ అభిప్రాయాలు చెప్పండి..

నాటపాకి వచ్చిన వ్యాఖ్యలన్నీ ఈనాటి పరిస్థితులమీదే జరిగాయి. అది మంచిదే. నిజానికి ఈవిషయంలో అంటే గత పది, పదిహేనేళ్లలో వచ్చినసాహిత్యంమీద చర్చ కల్పనరాసిన టపామీద ఉన్నాయి. చూడండి. మీకు మరిన్ని ఆలోచనలు కనిపిస్తాయి. .  

అసలు ఒక్క తెలుగుభాషమీదే కాదు. మొత్తం దేశంలో సమస్తవిషయాల్లోనూ, నిత్యజీవితవిధానం నిండా పాశ్చాత్యప్రభావం కనిపిస్తోంది. పూర్ణిమ కూడా ఈమాట ప్రస్తావించారు. ఇవాళ నేను మాఅమ్మాయిని “పద, నీకు తెలుగు సంస్కృతి చూపిస్తాను” అని మనదేశం తీసుకొస్తే కనిపించేది ఏమిటి? నాప్రశ్న ఈ పరిస్థితి ఎప్పుడు, ఎలా ఎక్కడ మొదలయింది? అని. 

@ పూర్ణిమ, నేను మీకు ముందు ఇచ్చినజవాబులు సరిగా లేవు. మరొకసారి ప్రయత్నిస్తాను. J.

నేను ఈవిషయం ఇప్పుడు కొత్తగా తలపెట్టింది కాదు., 2002 నించీ (bilingual kid కథ రాసినప్పటినుంచీ) ఆలోచిస్తూనే ఉన్నాను. తెలుగుభాషగురించి మనబ్లాగులలో చర్చ ఆరునెలలక్రితం అనుకుంటాను చూశాను. అప్పటినుండీ నేను ఇంగ్లీషులో రాసిన ఎడిటోరియల్ తెలుగులో పెట్టాలని అనుకుంటూనే ఉన్నాను.

హేలీ వ్యాసంమీద ప్రత్యేకించి నా అభ్యంతరం అనను కానీ, నాసందేహం తెలుగుసాహిత్యం ఇంగ్లీషుసాహిత్యంతో పోల్చుకోడం ఎందుకు అని. నాటపా అతనివాదన వ్యతిరేకిస్తూ కాదు. కాలగతిలో నేను చాలాకాలంగా రాయాలనుకున్న అభిప్రాయాలు పైకొచ్చేయి. అంతే. అతనిప్రసక్తి కేవలం కాకతాళీయం.

నావ్యాసంలో ప్రధానాంశం ఇప్పుడు వస్తున్నతెలుగు ఇంత ఇంగ్లీషుమయం కావడానికి వెనక గల చారిత్ర్యక కారణాలు. ఇది మూడుతరాలముందే ప్రారంభమయింది అని నా ప్రతిపాదన.

“మనకున్న సమస్య ఇంగ్లీషు కాదు. ఇంగ్లీషు వల్ల మనం ప్రపంచాన్ని పలకరిస్తున్నాం. మనకున్న సమస్య “మన” అనేదానిపై నిర్లిప్తత. నిరాసక్తి. మన భాష, మన భోజనం, మన ప్రదేశాలు – వీటిని జాగ్రత్తగా చూసుకోకపోవడం, అభివృద్ధి చేసుకోకపోవడం మన సమస్యలు. తెలుగు నాశనం కావటానికి ఇంగ్లీషు అవసరం లేదు. రాదు. అసలు మొక్కపై ధ్యాసే లేనప్పుడు, మరో పెద్ద చెట్టు నీడ పడుతుందని బాధ దేనికి?”

మీరు అంటున్న మనభాష, మనభోజనం -వీటన్నిటిమీద నిరాసక్తి, నిర్లిప్తత వచ్చినమాట నిజమే. కానీ నాప్రశ్న వీటికి మూలకారణం ఏమిటి అని. మీకూ నాకూ వాదనల్లో తేడా ఏమిటంటే – మీరు ఈనాటి పరిస్థితి వివరిస్తున్నారు. నేనను ఈ పరిస్థితికి  చారిత్ర్యక కారణాలు వెతుకుతున్నాను. వ్యాధికి కారణం తెలిస్తే కదా చికిత్స కనిపెట్టడం. మీరు కూడా ఆలోచించి మనభాషమీద నిరాసక్తి, నిర్లిప్తత ఎలా ఎందుకు ఎక్కడినుండి వచ్చేయో చెప్పండి. ఆతరవాత దానికి మందు ఆలోచిద్దాం.  

“ప్రస్తుతం, తెలుగులో చదవదగ్గ, చదవాల్సిన, చదివిస్తున్న పుస్తకాలు ఎన్ని? అవి ఏమిటి?”

దీనికి జవాబు నాకు తెలీదు. నేను చదివినవి చాలా తక్కువ. వాటినిండా ఇంగ్లీషుమాటలొక్కటే కాదు, మొత్తం వాతావరణం, పాత్రలూ, సన్నివేశాలూ – అన్నీ అమెరికన్ సంస్కృతిమయం. అంచేత నాకు ఆసక్తి చచ్చిపోయింది. ఆమధ్య వారాలబ్బాయిమీద ఒక ప్రముఖతెలుగు రచయిత్రి కథ రాసారు. ఆకథపేరు తెలుగులోనే వీక్లీబాయ్. ఎలా చదవాలనిపిస్తుంది ఇలాటి కథలు? ప్రాంతీయభాషల్లో వచ్చినవి నాకు అర్థం కాక చదవడంలేదు.

“మాలతిగారంతటి ఆవిడతో చర్చకి దిగింది తెల్సా, విడ్డూరం కాకపోతే!”

– ఇలా ఎవరంటారండీ? ఏమైనా నేను మాత్రం ఎప్పుడూ అలా అనుకోను. అంచేత మీ అభిప్రాయాలు మీరు తప్పక చెప్పండి.

“అసెంబ్లీ సమావేశాలప్పుడు స్పీకరే ఇంగ్లీషు తప్ప ఏం మాట్లాడ్డం లేదు, మామూలు బ్లాగు చర్చలపై మీ అభ్యంతరం నాకు కాస్త వింతగా ఉంది. హాలీ వ్యాసం కన్నా, అక్కడ ఇంగ్లీషు కమ్మెంట్స్ మిమల్ని ఎక్కువ నొప్పించినట్టున్నాయ్! “

– అసెంబ్లీదాకా ఎందుకండీ. అమెరికాలో తెలుగుసంస్కృతి నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న ఆటా, తానా సాహిత్యసభల్లో కూడా ఇంగ్లీషులోనే మాటాడుతున్నారు. బ్లాగులమాటకొస్తే, మనవి “మామూలు బ్లాగులు” అని నేను అనుకోడంలేదు. చాలామంది బ్లాగురులు “మాకు తెలుగంటే ఇష్టం కనక బ్లాగు మొదలుపెట్టేం” అంటున్నారు కదా. అంచేత ఎవరు గానీ వ్యాఖ్యలూ, వ్యాసాలు తెలుగులోనే రాస్తే తెలుగుభాషయందు నిరాసక్తత, నిర్లిప్తత తగ్గడానికి దోహదం చేసినవారవుతారు అనుకుంటున్నాను. మీరే చెప్పినట్టు “మొక్కమీద ధ్యాస లేద”న్నది మంచి ఉపమానం. కానీ అటువేపు ధ్యాస మళ్ళించడానికి మన ప్రయత్నం మనం చెయ్యొచ్చు కదా అని నాఅభిప్రాయం.

@ అబ్రకదబ్ర,  “అంతర్జాలం కారణంగానూ, ఆంగ్ల చదువుల మూలాన్నూ తెలుగు పుస్తకాలు చదివేవాళ్లు కరువైపోయారనటం ఆడలేక మద్దెల ఓడెననటమే. తెలుగు సినిమాలకి, టీవీ కార్యక్రమాలకీ ఆంగ్ల చదువుల మూలాన మార్కెట్ కుంగి కృశించిందా?”  

— తెలుగుసినిమాలూ, టీవీ కార్యక్రమాలూ కూడా ఇంగ్లీషు సినిమా, టీవీ నమూనాలతోనే సాగుతున్నాయి కదండి. తెలుగు దినపత్రికలు రెట్టింపయేయి అంటున్నారు. జనాలు తెలుగు చదవడం మర్చిపోలేదంటున్నారు. అది నిజమయితే సంతోషమే.

మీరు వస్తువులో కొత్తదనం లేదంటున్నారు. సుజాత ఉందంటున్నారు. దీనికి కూడా మొదటిపేరాలో జవాబు ఇచ్చాను.

@ సుజాత. మంచి పుస్తకాలు వస్తున్నాయి అంటునారు. సంతోషమే.

@ Independent, మీ వాదన నాకు సరిగ్గా అర్థం కాలేదు. కొంతవరకూ, పూర్ణిమకి ఇచ్చిన సమాధానమే మీకూను.

@ భావన, .మనిషి కి మౌలికం గా వుండే ఆలోచనాక్రమం ఏం మారనప్పుడు ఇప్పటి తరం అంటూ ప్రత్యేకం ఏమి వుంది? … పుస్తకం చదివే టైం టీవీ చూడటం లో వినియోగిస్తున్నారు

– మౌలికంగా మారినట్టే కనిపిస్తోందండి. ఎటొచ్చీ అది మనసంస్కృతిని గౌరవించేదిగా ఉందా అంటే లేదనే అనిపిస్తోంది నాకు. మొత్తం జీవనసరళిలో మార్పు వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అన్నదే నాకు తెలీడంలేదు. 

@ రమణ, “రచయితలది ఎంత లోపముందో పాఠకులది, తల్లిదండ్రులది అంతే లోపం ఉంది. ఆ విధంగా చూస్తే ప్రతి ఒక్కరూ ఇందులో బాధ్యులు అన్నమాట.”

– నేను మళ్లీ చరిత్రప్రస్తావనే తెస్తాను. మొత్తం సాహిత్యచరిత్ర చూస్తే, కొంతకాలం సాహిత్యం మహోజ్జ్వలంగా ప్రకాశించడం, మళ్లీ కొంతకాలం నీరసించిపోవడంగా కనిపిస్తోంది. బహుశా ఇప్పుడు అలాటి నీరసయుగమేమో.  కొత్తరకం రచనలు రావడానికి ముందు మనకి కొత్తరకం రచనలు వినూత్నపోకడలతో లేవన్న స్పృహ రావాలి. అది ఇప్పుడు మీఅందరిలో కలుగుతోంది కనక, ముందు ముందు అలాటి రచనలు వస్తాయేమో. వస్తాయనే ఆశిద్దాం. 

@ లలిత, మీరు అన్నది నిజమే. విదేశాలలో పిల్లలకి తెలుగు మాటాడడం నేర్పడం కష్టం కానీ కనీసం మనసంస్కృతి అంటే గౌరవం కలిగించడం గొప్పవిషయమే. మంచి పాయింటు చెప్పేరు. ఎటొచ్చీ వీళ్లు మనదేశం వెళ్తే కనిపించేది మనసంస్కృతేనా అంటే అనుమానాస్పదం. ఆసంగతే పైవ్యాఖ్యలన్నిటిలోనూ కనిపిస్తున్నది. హారీ పాటర్ ప్రచురణ వెనక కథకి ధన్యవాదాలు.

@మహేష్, మీకు నాసమాధానం పైన పూర్ణిమకి చెప్పిందే.

@అరిపిరాల, నేనన్నది అదేనండి. 50వ దశకంలో సుమారుగా పాఠకలోకంలో అలాటిస్పందన వచ్చిందనే. 60లలో సులోచనారాణినవలలూ, 70లలో వీరేంద్రనాథ్ నవలలూ పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించి, సంఖ్యని పెంచేయి. ఎటొచ్చీ ఇలాటివిషయాలకి కొలమానాలు ఏమిటో నాకు తెలియడంలేదు. హారీ పాటర్‌తోనో మరొకదానితోనో పోల్చడం appleతో ఆరెంజెస్ పోల్చడంలాటిది. ఏసాహిత్యం ప్రత్యేకత ఆదేశసంస్కృతితో ముడివడి ఉంటుంది కనక.

@హేలీ, మరోసారి, ధన్యవాదాలు. అవును. తెలుగు బ్లాగులోకంగురించి నాకు కూడా తెలీదు రెండేళ్లక్రితం వరకూ. ఇది విశ్వామిత్రసృష్టిలా సృష్టికి ప్రతిసృష్టి.

@KumarN. యన్. ఆర్. నంది పేరు మీకు గుర్తుండడం నాకు సంతోషంగా వుందండీ. నాకు తెలీదు మరి నైమిశారణ్యంలాటి నవలలు ఇప్పుడు వస్తున్నాయా అన్నది. వస్తే, చదవడానికి ఎంతమంది సిద్ధంగా వున్నారన్నది కూడా సందేహమే కదా. బహుశా, ఈవిషయమే అనుకుంటా అబ్రకదబ్ర, సుజాత అంటున్నది.

@శ్రీవాసుకి, కాదండీ. నాపేరు నిడదవోలు మాలతి. మీ అభినందనలకి ధన్యవాదాలు.

 (ఫిబ్రవరి 21, 2010)

.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “తెలుగెప్పుడూ రెండోభాషే – మీవ్యాఖ్యలకి నా జవాబు”

 1. @ మల్లిన నరసింహారావు, లింకుకి ధన్యవాదాలు. మీటపా చూశానండి. నావ్యాఖ్య అక్కడే పెట్టేను.
  @ భావన. మీరన్నమాట నిజమేనండీ. నాక్కూడా అదే సందేహం. ఒకప్రక్కన ఎంతో నాగరీకులం అంటూ వియత్పథంలో కళ్లూ, మరోప్రక్కన మరీ అనాగరీకంగా ప్రవర్తనా, మాటలూను. కుటుంబరావుగారి పాత్రలు మనకి ఇవాళ కనిపిస్తున్నాంటే కారణం ఒకటి ఆయన ప్రతిభే అయినా, మనస్తత్త్వాలు మారలేదనడానికి నిదర్శనం కూడాను. బాగా చెప్పేరు మీరు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. నాకేంటో పెద్ద గా మారలేదు కొన్ని విషయాలలో ఇంకా వెనక్కి వెళ్ళేరు మౌలికమైన మార్పు గురించి మాట్లాడాలంటే అనిపిస్తుంది మాలతి గారు. సాహిత్యం లో ఎప్పుడో కొడవటి గంటి గారు రాసిన పాత్రలు ఇప్పటికి మన మధ్యన కనపడుతూనే వుంటాయి ఏదో కాస్తా ఆహార వ్యవహారాలలో మార్పు అదే ఆలోచనలు ఇంక ఆ పుస్తకాలు పాతవి ఎలా అయ్యాయి అనిపిస్తుంది నాకైతే మరి.

  మెచ్చుకోండి

 3. అటువేపు ధ్యాస మళ్ళించడానికి మన ప్రయత్నం మనం చెయ్యొచ్చు కదా – ఇలా అనిపించే ఈ బ్లాగు పోస్టు చేసాను. ఓ సారి వీక్షించ గలరు.
  http://kasstuuritilakam.blogspot.com/2010/02/blog-post_21.html
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. @SRRao, నాలాంటి ప్రముఖరచయితలే అక్కర్లేదండీ. తెలుగుమీద అభిమానం ఉన్న ఈనాటి యువతరం అందరూ కాస్త శ్రమ తీసుకుని రాస్తున్నప్పుడయినా తెలుగుమాటలు రాస్తే,చదివేవారికి మరింత ఉత్సాహం వస్తుంది. ధన్యవాదాలు.
  @ బొందలపాటి, అవునండీ, తెలుగుబ్లాగులు చూసేకే నాక్కూడా నమ్మకం కలిగింది తెలుగు మరీ అంతరించిపోవడంలేదని. కానీ, ఇంకా కొంచెం ఎక్కువగా కృషి చెయ్యొచ్చు ఈతరం యువరచయితలు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ !
  ‘ ఏసాహిత్యం ప్రత్యేకత ఆదేశసంస్కృతితో ముడివడి ఉంటుంది.’ ………….. ఈ మాట నిజం. ఏ సాహిత్యానికైనా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఏ భాషకైనా తనదైన ప్రత్యేకత ఉంటుంది. మన భాషను మనం గౌరవించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి నిజమే కానీ ఇతర భాషల్నీ, సంస్కృతుల్నీ కూడా గౌరవించాలి. అప్పుడే మన భాషా సంపదను పెంచుకోవచ్చు. అలాగే సంస్కృతీ సాంప్రదాయాలు కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు చెందుతూనే ఉంటాయి. ఆ మార్పును ఆహ్వానిస్తూనే మన సంస్కృతీ విలువల్ని కాపాడడానికి ప్రయత్నం చెయ్యాలి. అందుకు మనకందుబాటులోకి వచ్చిన సాధనాలనన్నీ ఉపయోగించుకోవచ్చు. అవి మన సాంప్రదాయక సాధనాలే కానక్కరలేదు. ఉదాహరణకు సినిమా, టీవీ ఈ రెండూ మన దేశంలో కనిపెట్టబడినవి కావు. కానీ మన సంస్కృతీ సంప్రదాయాల్ని వాటి ద్వారా అందరికీ తెలియజేప్పొచ్చు. అలాగే భాషా వ్యాప్తికి కూడా పనికొచ్చే అద్భుతమైన సాధనాలు. అయితే వాటిని సక్రమ పద్ధతుల్లో ఉపయోగించినప్పుడే వాటిని సార్థకం చేసుకున్నట్లు. ముఖ్యంగా భాషా వ్యాప్తికి అవసరం లేనిచోట్ల ఇతర భాషలను ఉపయోగించకపోవడం, పిల్లలకి మన సంస్కృతీ, భాషా విలువలు అర్థమయ్యేటట్లు చెప్పడం, మాధ్యమాలలో సంస్కరణలు తీసుకురావడం, మన సంస్కృతిని తెలియజేసే అచ్చమైన తెలుగు రచనలు చెయ్యడం మొదలైనవి చెయ్యగలిగితేనే తెలుగు దేశంలో తెలుగు భాష ప్రథమ భాషగానే ఉంటుంది. దీనికి ప్రభుత్వాలతో బాటు మన కృషి కూడా అవసరమని నా భావన. మీలాంటి ప్రముఖ రచయితలూ, రచయిత్రులూ నీరసించిన సాహిత్యానికి జీవం పోస్తే బాగుంటుంది. ఏమైనా మంచి చర్చకు తెర తీసారు. అభినందనలు.

  మెచ్చుకోండి

 6. రోజూ చూసే సినిమాలూ,తెలుగు టీ వీ చానళ్ళూ నాలో తెలుగు సంస్కృతి పై కలిగించిన అసంతృప్తి తో నేను “ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ” మొదలుపెట్టాను. కానీ ఈ నవల రాసిన తరవాత నాకు ఇంటర్నెట్ లో తెలుగు బ్లాగులు పరిచయమైనాయి. తరవాత తెలుగు సాహిత్యం గురించి అంత బెంగ పడాల్సిన అవసరంలేదనిపిస్తోంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s