ఉద్దేశాలు మంచివే!

ఆంధ్రదేశంలో ఒకజిల్లా ముఖ్యపట్టణంలో బస్‌స్టాండునించి కాలేజీకి వెళ్లేదారిలో సూర్యచంద్రలారీ సర్విస్ షెడ్ వుంది. సామాన్యంగా బస్టాండుకీ కాలేజీకీ మధ్య పయనించే ప్రజలు ఎంత తొందరపనిలో వున్నా ఎంత పరధ్యానంతో నడుస్తున్నా ఆ సూర్యచంద్రలారీ సర్వీసుదగ్గరికి వచ్చేసరికి ఓమారు ఉలిక్కిపడి చుట్టూ చూసి ముందుకి సాగుతారు. దానికి కారణం లేకపోలేదు.

మీదనించి లారీ వెళ్లినా దులుపుకు వెళ్లిపోయే absent minded ప్రొఫెసరునైనా నిలవేయగల ఒకచిత్రమైన ధ్వని అక్కడ సంధ్యవేళల్లో వినిపిస్తూ ఉంటుంది. ఇదీ అని స్పష్టంగా చెప్పలేం కానీ డోలూ, సన్నాయీ, బాంజో, మాండలిన్, గిటార్, పియానో ఒక్కమారుగా మోగిస్తే వచ్చే ధ్వనిని పోలివుంటుంది అది. రాక్షసులు వసంతోత్సవాలలో ఓలలాడుతున్నారో, దేవతలు సమరోత్సాహంలో తేలియాడుతున్నారో అని పథికులని అక్కజపరిచే ఆ నాదం (ఆర్తనాదం కాదు) పుట్టుపూర్వోత్తరాలు అతి సామాన్యమయినవి.

మధ్యలో మొదలుపెట్టి వెనక్కి వెళ్లడం మోడర్న్ టెక్నిక్ కనక అసలు కథ ఇప్పుడు మొదలుపెడతాను. ఆవూళ్లో కాలేజీలో ఇంగ్లీషు డిపార్ట్‌మెంటులోనూ హిస్టరీ డిపార్ట్‌మెంటులోనూ ఒక్కమారే ఖాళీలు ఏర్పడడం చూసి, గవర్నమెంటువారు ఇంగ్లీషులోనూ, హిస్టరీలోనూ డిగ్రీలు కలిగిన ఓ నవదంపతులని ఆవూరికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ అమ్మాయిపేరు లత. లతలాగే వుంటుంది కూడా. అతనిపేరు రావు. అతన్ని మాత్రం ఏవీరావు అనలేం. అతనికి చాలా వచ్చు. వాళ్లు వచ్చిన వారం పదిరోజుల్లోనే చాలా పాప్యులరు అయిపోయేరు. అంటే పొలిటికల్ ఆంగిలులో కదా. మామూలుగా లత అన్నా, రావు అన్నా “పాపం, మంచివాళ్లు” అనుకునేవారు అందరూ.

మరోవారం అయీ అవకముందే, లత మంచి హుషారుగా ఇల్లంతా సర్దడం మొదలుపెట్టింది.

“ఎలాగైనా ఇల్లాలు కదా” అనుకున్నాడు రావు, హర్షప్రఫుల్లమానసంతో. లతని ఏడిపించాలని కూడా అనిపించిందతనికి.

“ఏం? నన్నింప్రెసు చెయ్యాలని చూస్తున్నావా?” అన్నాడు.

“ఉహుఁ. మిమ్మల్ని కాదు,” అంది లత గంభీరం‌గా.

రావుకి అర్థం కాలేదు. “మరి?”

“స్వర్ణగారిని భోజనానికి పిలిచాను.”

ఒక్కనిముషంపాటు రావుకి నోట మాట రాలేదు.

“అప్పుడే మీయిద్దరికీ అంత స్నేహం అయిపోయిందేమిటి?”

“ఎంతసేపు కావాలి?” అని లత స్వరం తగ్గించి, “చాలా మంచిమనిషండీ,” అంది అతన్ని ఉడికిస్తున్నట్టు.

“అవునవును. అందులో ఈరోజుల్లో మంచివాళ్లు చాలా అరుదు కూడాను,” అన్నాడు రావు కించిత్ అప్రసన్నుడై. కొంచెంసేపూరుకుని, “అయితే చికెన్ .. …” అన్నాడు లతాభిముఖుడై.

“నో, నో,” అంది లత విముఖురాలై, “ఆవిడ పరమ శాఖాహారి,”

“ఏం? ఈరోజుల్లో వర్ణాంతరభోజనాలకి తప్పులేదే.”

“వర్ణాలూ, కృతులూ కాదండీ ప్రశ్న. అందరిదీ ఏక నలుపే కదా,” అంది లత విసుగ్గా. స్వర్ణ ‘సువర్ణం’ కాదు.

“పోనీ, ఏంచేస్తున్నావు?”

“వంకాయ కూర, పెరుగు వడలు, ములక్కాడ పులుసు.”

నీరసంగా కుర్చీలో కూలబడ్డ రావువంక జాలిగా చూసింది లత. వంకాయా ఓ కూరేనా అని అతడిభావం.

“ఒక్కరోజుకే కదా, సర్దుకుపోవడం నేర్చుకోవాలి” అని లత మనవి.

“నీగురించే నాబాధంతా,” అన్నాడు రావు.

“అంటే?”

“అంటే భర్తని అర్థాకలితో విస్తరిముందునించి లేపిన ఆడదానికి ఊర్థ్వలోకాలుండవంటారు పెద్దవాళ్లు.”

“ఛీ, అలాటి అవాచ్యాలు అనకండి.”

రావు నోరు మూసుకుని రేడియో, పేపరు అదేవరసలో విప్పేడు. పాపం, ఆరోజు రావుకి కంచంలో చెయ్యి నోటిదాకా వెళ్తే ఒట్టు.

“ఏఁవండీ, ఒంట్లో బాగా లేదా? అలా వున్నారేం?” అంది స్వర్ణ వివర్ణమైన అతడిమొహం చూసి.

“ఏంలేదండీ. ఏదో జ్ఞాపకం వచ్చింది. శ్రీనాథుడు గరళకంఠుడిని సవాలు చేశాట్ట విషం తాగేనని విర్ర వీగుతావు కానీ పలనాట బచ్చలిశాకం పులుసుతో జొన్నకూడు మింగు చూద్దాం అని”

లత తీక్షణంగా చూసింది రావువేపు.

రావు గబుక్కున మంచినీళ్లగ్లాసు అందుకున్నాడు.

కష్టాలెప్పుడూ మంచివాళ్లకే వస్తాయిట. కష్టాలొచ్చాయంటే మంచివాళ్లయి ఉండాలిట.

లేకపోతే రావు ఇలా అభోజనంగా ఉండను కాక ఉండనని మొండిపట్టు పట్టి ఉండేవాడు.

లత ఇలా అవమానం పాలయి ఉండేదికాదు పతిదేవునిమూలంగా.

స్వర్ణ ఆహారవ్యవహారాలదగ్గిర తనతో పొసగనివాళ్లతో స్నేహం చేసివుండేది కాదు.

అన్నిటికీ వాళ్ల మంచితనమే కారణం.

సూక్ష్మంగా ఆ ముగ్గురూ ఆ సమయంలో ఆలోచిస్తున్నవాటి సారాంశం ఇదీ.

భోజనాలు అయేకా, అవకుండానూ, అందరూ హాల్లోకి వచ్చి కూర్చుని ఆకులు నములుతుండగా, “మీకు సంగీతం వచ్చునా?” అని లత స్వర్ణని అడిగింది.

“రాదు. మరి మీకు వచ్చునా?”

“నాకూ రాదు.”

అక్కడితో ఆ సంభాషణ అయిపోవలసిందే కానీ తెలుగునవలలా, తెలుగుసినిమాలా, అయిపోయినట్టే అయిపోయి మళ్లీ తలెత్తింది.

“నేర్చుకుందామా?” అంది స్వర్ణ.

రావు బిక్కుబిక్కుమంటూ లతవేపు చూశాడు.

“తప్పకుండాను” అంది లత ఆనందోత్సాహాలు వదనంలో వెల్లివిరుస్తుండగా.

లతకి అతిథులని ఎలా ఆదరించాలో తెలుసు అనుకున్నాడు రావు స్వగతంలో.

నాలుగు రోజులు పోయేక, లత రావుతో, “కాకివారి వీధిలో వెంకటశాస్త్రిగారని ఒక సంగీతం మేష్టరు ఉన్నారుట. వెళ్లి తీసుకురండి,” అంది.

“అదేమిటి?” అన్నాడు రావు కొత్తగా చూస్తూ.

“తెలీనట్టు నటించకండి. మీముందే కదా స్వర్ణా నేనూ నేర్చుకుందాం అని నిశ్చయించుకున్నది,” అంది లత.

“ఊరికే అన్నావనుకున్నాను,”

“కాదులెండి,” అంది లత కొంచెం కఠినంగా.

రావు “సరేలే” అన్నాడు.

రాత్రి లత మళ్లీ “కనుక్కున్నారా?” అంటే లేదన్నాడు. మర్నాడూ అదే జవాబిచ్చాడు. మూడోరోజు కాస్త ధైర్యం తెచ్చుకుని, “ఇప్పుడు సంగీతం నేర్చుకోకపోతే ఏం, లతా?” అన్నాడు నెమ్మదిగా. అతనికి సంగీతం అంటే కోపం లేదు కానీ ఎమెచ్యూరులని సహించలేడు. శాస్త్రీయ కచేరీలు అర్థం కావు. అంచేత అతను వినగలిగిందల్లా రేడియోలో లలితసంగీతమూ, సినిమాల్లో శాస్త్రీయ సంగీతమూను. పెళ్లిచూపులనాడే “మీఅమ్మాయి పాడదు కదా, పాట నేర్చుకుంటానని పేచీ పెట్టదు కదా” అని అడగలేదే అని విచారించవలసిన రోజొచ్చింది అతని జీవితంలో ఆఖరికి.

లత క్షణం ఊరుకుని, “సరేలెండి,” అంది. కానీ అది నాలుక చివరినించి వచ్చింది.

మర్నాడు కాలేజీలో స్వర్ణ “కనుక్కున్నారా?” అని ప్రశ్నించింది లతని.

“లేదు, ఇవాళ కనుక్కుంటానన్నారు,” అంది లత.

“నేను వీణకి వ్రాశాను” అంది స్వర్ణ, “రెండురోజుల్లో జవాబు రావచ్చు.”

లతకేం చెప్పాలో తోచలేదు.

స్వర్ణసరదా చూస్తుంటే లతకి హుషారొస్తోంది. అటు రావు తీరు చూస్తే నీరు గారిపోతోంది.

“నిజంగా నాకేం కావాలో నాకే తెలీడంలేదు,” అంటూ తనలో తను గొణుక్కుంది.

ఆరాత్రి మళ్లీ రావుదగ్గిర “ఆ విషయం” ఎత్తకుండా ఉండలేకపోయింది.

“స్వర్ణ వీణమేకరుకి ఉత్తరం రాసేరుట” అంది.

రెండురోజులు పోయేక స్వర్ణకి జవాబు వచ్చింది అని మరో బులెటిన్ తెచ్చింది. మూడోరోజు బులెటిన్ – మీణమేకరు ఆదివారం ఉళ్లో దిగుతాడు వీణతో సహా.

ఆఖరికి రావు విసుగ్గా, “నువ్వు ఈసంగీతం ఆపుతావా? నన్ను సన్యాసం పుచ్చుకోమన్నావా?” అన్నాడు.

లత భీతహరిణలోచనాలతో అతనివేపు చూడడం చూసి, “అది కాదు. నన్నేం చెయ్యమంటావు చెప్పు” అన్నాడు మందరస్థాయిలోకి దిగి.

“ఓహ్! మీరది ఒక ప్రొపొజలు అంటే ఆలోచించవచ్చు. మీరు గ్రహించారో లేదో కానీ సంగీతానికీ, సన్యాసానికీ కూడా పన్నెండేళ్లే సాధన నిర్ణయించేరు,” అంది లత కుదుటపడి.

“ప్రభుత్వాన్ని పన్నెండేళ్లు శలవు అడగనా?” (హేళనగా)

“ఇవ్వరు కాబోలు” (దిగులుగా)

“దానికేముంది? ఎక్సప్షనలు అని చెప్పుకుందాం. వ్రాస్తాను – మాఆవిడ సంగీతం నేర్చుకుంటాను అంటోంది. ఆకాలపరిమితిలో నేను సన్యాసాశ్రమం చవి చూడాలనుకుంటున్నాను అని. ఇది spiritual study కనక, స్టడీ లీవు ఇచ్చినా ఇవ్వొచ్చు,” (మళ్లీ హేళనగా)

“అయినా ఇవ్వం అంటే …” (ఇంకా దిగులుగా)

“అప్పుడేనా ఈ రికార్డు ఆపుతావా?” (కఠినంగా)

“.. … ..” (నిస్సహాయంగా)

ఇలాటి సంభాషణలు అవుతూండగానే, ఆదివారం వచ్చేసింది. దాంతోపాటు స్వర్ణ, స్వర్ణ వెనక వీణమేకరూ, ఆ మేకరుతో వీణా రావుగారింటికి వచ్చేశారు.

“బాగుందండీ?” అంది స్వర్ణ.

“బాగానే ఉంది,”అన్నాడు రావు.

లతకి వీణ చూస్తున్నకొద్దీ ముచ్చటేసింది. సన్నని దంతపునగిషీతో మెరిసిపడిపోతోంది వీణ. మేళం చేసే తీసుకు వచ్చాడు ఆ మేకరు.

“ఇక్కడ ఉంచమన్నానండీ. మీరు సాయంత్రం ఆ వీణమేష్టరుని పిలిస్తే, ఆయనకి కూడా చూపించి డబ్బిచ్చేస్తానన్నాను,” అంది స్వర్ణ.

“అలాగే చెప్తాలెండి,” అన్నాడు రావు.

వాళ్లు వెళ్లిపోయేక, రావు లతవేపు తిరిగి, “మీ చదువుకున్న ఆడవాళ్లతో గెలవడం కష్టం సుమా,” అన్నాడు.

లత వీణవేపునించి దృష్టి మరల్చకుండానే, “లేటుగా తెలుసుకున్నారు,” అంది.

“ముందే తెలుసు.”

“మరెందుకు చేసుకున్నారు?”

“నేను మొదటే చెప్పేను మాఅమ్మతో, నాకు చదువుకున్నఅమ్మాయి వద్దూ, ‘చాకలివాడొచ్చాడు పద్దు చూడండి’ అని కాలేజీకి రాకుండా ఉంటే చాలూ అని. మాఅమ్మే ‘ఈకాలపు చదువులలాగే వున్నాయీ, దానికైనా యమ్మే ఉండాలీ’ అని నిన్ను తీసుకొచ్చింది” అన్నాడు రావు.

“మీదగ్గిరే కదండీ చదువుకున్నాను.” రావు లతకి బి.యే.లో ఇంగ్లీషు చెప్పేడు. ఆసంగతి ఆ సమయంలో అతను మర్చిపోవడం అతని దురదృష్టం.

రెండు నెలలు తిరక్కుండా రావు వీణ విశ్వనాథశాస్త్రిగారికి శాస్త్రోక్తంగా పంచెలచాపూ, తాంబూలాలూ, రెండువందలరూపాయలూ సమర్పించుకుని, లతచేత “నావీణ” అనిపించాడు. లత ఆనందం చూశాక, అతను కూడా “నేనెంత దుర్మార్గుణ్ణి కాకపోతే ఆపిల్లనంత క్షోభ పెడతాను” అనుకుని, తన్ను తాను వెన్ను చరుచుకున్నాడు చేసిన సత్కార్యానికి.

కానీ రోజూ, సాయంత్రంవేళ వీణమేష్టరు వచ్చేవేళకి ఇంట్లో ఉండడం మటుకు అతనికి శక్తికి మించినపని అయింది. అదేకారణంగా అతను మార్నింగ్ వాక్ కూడా అలవాటు చేసుకున్నాడు.

“పోనీ, పాపం” అని లత కోపం తెచ్చుకోకుండా ఊరుకుంది.

రోజులు ఎప్పుడూ ఒక్కలాగే జరిగిపోతే కథలు ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరరుగా వున్న సారథి కలకత్తానించి వస్తూ దారిలో చెల్లెలిని చూసిపోదాం అని దిగేడు.

అన్నగారిని చూసి చాలాసంతోషించింది లత. సారథి వస్తూ ఓ టేపురికార్డరు తెచ్చాడు.

“వెయ్యి, చూద్దాం” అంటే, “దానికి ఏవో చిన్న రిపేర్లు చెయ్యాలి, వీల్లేదు పొమ్మ”న్నాడు.

వారంరోజులు అందరూ సరదాగా గడిపేరు.

సారథి వెళ్లేరోజుకు ముందురోజు రావుతో, “బోలెడు గొప్పలు చెప్తావు కానీ రాక రాక వచ్చిన బావమరిదిని సన్మానించడానికి ఓపార్టీయేనా పెట్టేవు కావు,” అన్నాడు.

“అయ్యో! అంతమాత్రానికే చిన్నబుచ్చుకోవాలా? మాటమాత్రం చెప్తే పార్టీలేం ఖర్మ డిన్నర్లూ, డ్యాన్సు ప్రోగ్రామూ అరేంజి చెయ్యకపోయానా? పోన్లే, రేపు నలుగుర్ని పిలిచి భోగిపళ్లు పోయిస్తానుండు,” అన్నాడు రావు సారథిని ఓదారుస్తూ.

అన్నట్టుగానే రావు నలుగుర్ని పిలిచాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ లత చెసిన స్పెషల్సు ఖర్చు చేస్తున్నారు. ఇంతలో పక్కగదిలోంచి ఉఫ్‌మని, గీమని శబ్దం వచ్చింది. “శ్రోతలారా! ఇప్పుడు మీరు వీధినాటకం వింటారు. … ..”

లత సారథివేపు తిరిగి, “ఏవో రిపేర్లు వున్నాయన్నావు?” అంది.

“అక్కర్లేదు కాబోలయితే,” అన్నాడు సారథి నవ్వి.

“ … … ఇప్పుడు లతారావుగారి కచేరి వింటారు,” అని రావుగొంతు వినిపించింది.

“లతా రావు ఏమిటి? మీరు కూడా వాయిస్తారా?” (లత గొంతు)

“సరే, లతాదేవిగారు ఇప్పుడు జంటస్వరాలు వాయిస్తారు.” (రావు)

“నేను కృతి వాయిస్తాను.” (లత)

“సరే లతాదేవిగారు ఇప్పుడు చలమేల చేసేవు అనే కృతి వాయిస్తారు.” (రావు)

“అది కృతి కాదు. వర్ణం.” (లత)

“అయ్యా! ఇంతసేపూ జరిగింది నాటకం. ఇప్పుడు శ్రీమతి లతాదేవిగారు వాయించేది వీణ.” (రావు)

ఒక్క క్షణం నిశ్శబ్దం.

“సా … పా …సా …”

“అదేమిటి?” (రావు)

“మామేష్టరు చెప్పేరు ముందు సాపాసా వాయించమని,” (లత)

“కానియ్.” (రావు)

కొన్నిక్షణాలు నిశ్శబ్దం.

మళ్ళీ టింగ్ … టింగ్ … టింగ్ … వినిస్తుంది కొంచెంసేపు.

“ఆపేశావేం?” (సారథి గొంతు)

“ఇప్పుడు వైలనిస్టు ఛాన్సు.” (లత)

“అదెక్కడ తేవడం? అనకాపల్లి నూకాలమ్మ జాతరలో మామేనల్లుడు కొన్న డప్పులబండి కావలిస్తే.” (రావు)

“అన్నయ్యా! పకోడీలలో జీడిపప్పు వెయ్యనా , ఉల్లిపాయ వెయ్యనా?” (లత)

“దిట్టంగా పచ్చి మిర్చి తగిలించు జన్మలో మరిచిపోకుండా.” (రావు)

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

“దేవునిఎదుట నాటిక వింటారు. కవికుమారుడి ఆత్మఘోష వినండి.” (రావు)

సారథిగొంతులో “నాయిష్టం. నాయిష్టమొచ్చినట్టు రాస్తా. నాకళ్లకేది కనిపిస్తే దానిమీద రాస్తా. ధనరాసులప్రక్క దారిద్ర్యం, సుజ్ఞానపుక్షేత్రంలోనే అజ్ఞానపు బ్రహ్మజెముడు డొంకలు, ఆప్రక్కనే నిరాశ, ఆనందం ప్రక్కనే ఆక్రందనం, అడుగడుగునా విఘ్నాలు, ఆశలకు అవాంతరాలు, ఆశయాలకు ఆనకట్టలు, అవేశాలమీద చన్నీళ్లు, ఆలోచనలకి బేడీలు, ఆదర్శాలకి ఉరితాడు, ఉత్సాహానికి కంట్రోలు, ఉద్రేకాలకి రేషను, ఇహంలో నో వేకెన్సీ, పరంలో నో ఎడ్మిషన్, కళ్లకు కటకటాలు, కడుపులోకి కంకర, తలరాతలు వంకర …

టింగ్ … టింగ్ .. (వీణ)

“సరిమాపద సరిపద … పదా … పదపదా…” (రావు)

“ఎక్కడికోయ్?” (సారథి)

…. …. ….

లత వెళ్లి గుప్‌చిప్‌గా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి రావడంతో ఆ భాగోతం పరిసమాప్తమయింది.

అతిథులంతా వెళ్లిపోయేక, “నాకు తెలీకుండా నేను మాటాడినవన్నీ రికార్డు చేశారు కదూ,” అంది లత పరిదీనవదనయై.

“ఆఁ. ఏఁవైందిప్పుడు?” అన్నారు ఇద్దరూ నవ్వి.

ఆమాటకొస్తే లత వాయించిన వాయింపులు మధ్యలో చెరిపేసి, రావు వాయించేడని లతకి తెలీదు కనక అడగలేదు.

మర్నాడంతా లత ముభావంగా వుంది. దానికి కారణం ఆ సాయంత్రం లత రావుని “నిజంగా నా వాయింపు అంత ఘోరంగా ఉందాండీ?” అని అడిగేవరకూ తెలీలేదు.

రావుకి జాలేసింది. నిజం చెప్పేద్దాం అనుకున్నాడు. కాని నిజం చెప్తే తననుకున్న కార్యం సాఫల్యం కాదని జ్ఞాపకం వచ్చింది.

“అబ్బే, మరీ అంత ఇదిగా కాదనుకో. నువ్వింకా ఎమెచ్యూరువి కదా. అందుచేత …”

అన్నాడు దేశవాళీ తటస్థ విధానాన్నవలంబిస్తూ.

“అవునవును. ప్రాక్టీసు చాలదు. ఇంకా బాగా ప్రాక్టీసు చెయ్యాలి,” అంది లత.

పాపం! రావు అవాక్ అయిపోయినసంగతి లత గమనించనేలేదు.

ఆనాటినుండీ లత, స్వర్ణల ప్రాక్టీసు ద్విగుణీకృతోత్సాహంతో సాగుతోంది.

ఆనాటినుండీ ఆ రెండు వీణల కలకలలే ఆరోడ్డున వినిపించే గరగరలు.

కావలిస్తే కాలేజీరోడ్డుమీద సాయంసమయంలో షికారుగా వెళ్లి చూడండి సూర్యచంద్ర లారీ సర్వీసు షెడ్స్ ఇప్పటికీ కనిపిస్తూనే వుంటాయి!!

(ఆంధ్రసచిత్రవార పత్రిక. జూన్ 19, 1964)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఉద్దేశాలు మంచివే!”

 1. @ మధురవాణి, సంతోషం. పథికులు అంటే దారిన పోయేవాళ్లు (పథం దారి), అక్కజపడు అంటే ఆశ్చర్యపడడం. ఈరోజుల్లో ఇంగ్లీషులాగే ఆరోజుల్లో సంస్కృతం … నాకిప్పుడు అర్థం అవుతోంది నాపాతకథలు తీసిచూసుకుంటే నాసంస్కృతం చదువు ప్రభావం.
  @ కల్పన, 🙂 పూర్తిగా చదవక్కర్లేదు. కొన్నికథలు కొంచెం చదివితే తెలిసిపోతాయి. నేను కూడా పూర్తిగా చదవనికథలు ఉన్నాయి. నిర్మొహమాటంగా నీ స్పందన చెప్పినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మాలతి గారు,
  కథ చదవటం మొదలుపెట్టి కొంత చదివేసరికి విసుగు అనిపించింది.పూర్తి చేయలేదు. ఇంత మంది బాగుంది అంటున్నారు కాబట్టి కథను పూర్తిగా చదివే ప్రయత్నం మరో సారి చేస్తాను.
  కల్పన

  మెచ్చుకోండి

 3. హ్హ హ్హ హ్హా.. భలే అయింది చివరికి రావు గారికి పాపం 😀
  కథ భలేగా ఉంది సింపుల్ గా.. వెరైటీగా 🙂
  మీ కథల టైటిల్సు చాలా వైవిధ్యంగా ఉంటున్నాయనిపిస్తోంది 🙂
  ‘పథికులని అక్కజపరిచే’ అంటే ఏంటండీ మాలతి గారూ.? నాకివి కొత్త పదాలు.

  మెచ్చుకోండి

 4. @ లలిత, జంధ్యాలకి ప్రేరణ :)) ఏమో, ఈసారి ఆయన కనిపించినప్పుడు అడగాలి. –ఎక్కడికక్కడ వాతావరణాన్ని తేలిక పరుచుకుంటూ పోవటం మీ ఇష్టైల్ అని నాకనిపించింది. — అవునండీ, అల్పాక్షరం, అనల్పార్థం అనో ఏదో ఒక సూక్తి ఉంది. మరీ గోరుముద్దలు తినిపించినట్టు సాగదీసి రాయడం మంచికథ లక్షణం కాదనే నా అభిప్రాయం. నేను అలా రాసిన సందర్భాలు ఉండొచ్చు కానీ నేను మెచ్చేలక్షణం మాత్రం కాదు. ఇక్కడ చిన్నమాటలతోనే హాస్యం వస్తుందనుకున్నాను. ఆరోజుల్లో రేడియో నాటికలు వినేదాన్ని కనక ఆలా రాయొచ్చని తోచిందేమో. లేదండీ, మీరు అతిగా వాగడం, క్షమించడం – ఏమీ లేదు. మీరు ఇలాటివి అడిగినప్పుడు నాకు కూడా మరోసారి ఆలోచించుకోడానికి అవకాశం ఉంటోంది. మీకు నేనెంతో మీరు నాకూ అంతే. అంచేత మొహమాటపడకుండా రాస్తూండండి.
  @ బొందలపాటి, ధన్యవాదాలు.
  @ రవి, ధన్యవాదాలు.
  @ పైన లలిత కూడా ఏదో సినిమాలో అంటున్నారు. బాగుంది. –ఎవరు తీసుకున్న గోతిలో – నాకు తోచనేలేదు. బాగా చెప్పారు. :)). ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. జంధ్యాల సినిమా కంటే మీ కధే ముందు పుట్టింది కనుకా , జంధ్యాల సినిమాల్లో శ్రీ లక్ష్మి కేరెక్టర్ కి మీ లత ప్రేరణ అయివుంటుంది కదండీ .
  బ్రెకెట్ లో ( రావు) ( లత) ఎందుకలా ?
  ఇంకాస్త పైకెళితే……( హేళనగా ) ( దిగులుగా ) …….అన్నాడు దిగులుగా ! అంటే వాక్యం పెద్దదవుతుందనా లేక ఇదో ప్రయోగమా ? ( ఏం లేదండీ ఏకలవ్యుడి మార్గంలో కధలు రాయటం నేర్చుకుంటున్నాను. మీ సమాధానం నాకు ఉపయోగపడుతుంది ) ఎక్కడికక్కడ వాతావరణాన్ని తేలిక పరుచుకుంటూ పోవటం మీ ఇష్టైల్ అని నాకనిపించింది. మాలతి గారూ …అతిగా వాగేసినట్టున్నాను . తప్పయితే క్షమించండి.

  మెచ్చుకోండి

 6. హ హ హ … పాపం రావు గారు. ఎవరు తీసుకున్న గోతి లో వాళ్ళే పడటమంటే ఇదే కదా. ఏదో సినిమాలో బ్రహ్మానందం శ్రీలక్ష్మి దెబ్బకు రాజేంద్ర ప్రసాడ్ చంద్ర మోహన్ ల పాట్లు గుర్తొచ్చాయి. బాగుంది మాలతి గారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s