కళ్లు

ఓ చల్లని సాయంవేళ గోపాలరావు షికారుగా నెమ్మదిగా ఏవేవో భావాలు కలకలుపుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. వెనకే సుమిత్ర సప్తపాదాలు తొక్కుతున్నట్టు అనుసరిస్తుండగా,

కొంగులు ముడివేసినట్టు మధ్యలో నాలుగేళ్ల జయ ముందు పోతున్నతండ్రిని వెనక్కి లాగుతూ, వెనకబడుతున్న తల్లిని ముందుకి లాగుతూ వారిమధ్య దూరాన్ని సవరిస్తోంది. మ్యునిసిపల్ స్కూలువరకూ వచ్చేసరికి సుమిత్ర తలెత్తి చూసింది.
“అదుగో, చూశారా?” అంది సుమిత్ర, జయని వెనక్కి లాగి.
గొలుసుకట్టుగా జయ గోపాలరావుని వెనక్కి లాగింది.
గోపాలరావు సుమిత్ర చూపించినవేపు చూసి, “ప్చ్” అన్నాడు మళ్లీ ముందుకి సాగుతూ.
“బాంబే … కేక్ .. పాలకోవాతో … చేసిన బాంబే .. కేక్ .. “ చిత్రమయిన రాగవరసలో అరుస్తున్న ఆ కుర్రాడిని గోపాలరావు మరొకమారు మెడతిప్పి చూడకుండా వుండలేకపోయేడు. “పుట్టుగుడ్డి కాదేమో. మంచి తెలివైనవాడిలా ఉన్నాడు. ప్రయత్నిస్తే బాగుపడొచ్చు,” అన్నాడు కళ్లస్పెషలిస్టు గోపాలరావు ఆలోచిస్తూ అడుగులేస్తూ.
అతను మొదట ప్రదర్శించిన నిర్లక్ష్యానికే ఇంకా కోపంగా ఉన్న సుమిత్ర మాటాడలేదు.
“అమ్మా! అప్పచ్చీ … “ జయ ఒకచేయి నోటిలో పెట్టుకుని రెండోచేత్తో సుమిత్ర చీరకుచ్చెళ్లు లాగుతూ రాగం తీసింది.
“ఇంటికి వెళ్లేక ఇస్తాలే,” అంది సుమిత్ర గోపాలరావువేపు చూస్తూ.
జయకి అలాటి మధ్యేమార్గాలు అంతగా రుచించలేదేమో ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు.
ఇదంతా చూసిన్నట్టు, ఆ మిఠాయివాలా మరోమారు ప్రసారం చేశాడు “బా…మ్…బే… కే…క్ …” అంటూ.
“ఇప్పుడు కాదన్నానా?” సుమిత్ర విసురుగా రోడ్డుమధ్యకి నడిచింది.
గోపాలరావు చటుక్కున ఆమెరెక్క పుచ్చుకుని వారకి లాగుతూ, “ముందు చూసుకో,” అన్నాడు.
“నాక్కళ్లున్నాయిలెండి.” అందామె రెక్క విడిపించుకుంటూ.
“కాదన్నానా?” అన్నాడు గోపాలరావు హేళనగా, “బహు సుందరమైన ఆ లోచనయుగ్మం చూసే కదూ నిన్ను పెళ్లి చేసుకున్నది.”
బామ్‌బే కేక్ వెనక వస్తూనే ఉన్నాడు. జయ గునుస్తూనే వుంది.
సుమిత్రకి బాగా కోపం వచ్చేసింది.
శాంతి సాధించే సదుద్దేశంతో, “పోనీ, అదంతగా ఏడుస్తుంటే, కొనకూడదూ ఓ ముక్క,” అన్నాడు గోపాలరావు.
“అదే నేను కొనమని ఉంటే ఆరోగ్యసూత్రాలు వల్లించేవారు” అనుకుంది సుమిత్ర మనసులోనే.
తండ్రి మాట ఆసరాగా జయ ఆ కుర్రాడిని పిలిచేసింది.
గోపాలరావు పరీక్షగా ఆ కుర్రాడిని చూశాడు. చిరుగులు పట్టి ఉంది పాంటు. ఎవరో పారేసిన తోలుబెల్టు సాయంతో నిలబెట్టినట్టుంది అది. దాన్లో కుక్కిన షర్టు అతనికి రెండు సైజులు పెద్దది, బాగా మాసిపోయి ఉంది. చేతకానివాడు వేసుకున్న ముడిలా మెళ్లో టై వదులుగా వ్రేలాడుతోంది. కుర్రాడు పచ్చగా రాజకుమారుడిలా ఉన్నాడు. మహా ఉంటే పదహారేళ్లు ఉంటాయేమో. పాత కిరసనాయిలు డబ్బాకి ఓపక్క అద్దం పెట్టించేడు. చేతిలో ఏరంగో తెలీని రుమాలూ, డబ్బాలో బూడిదరంగులో ఉన్న కోవాముక్కలూ – గోపాలరావుకి ఈ రోడ్డుపక్క బేరం మహా చికాకు వేసింది.
ఇల్లు చేరేవరకూ ఎవరూ మాటాడలేదు.
మర్నాడు సుమారు అదేసమయంలో గోపాలరావుఇంటిదగ్గర అదే కేక వినిపించడంతో పేపరు చూస్తున్న గోపాలరావూ, పక్కనే కూచుని ఎంబ్రాయిడరీ చేస్తున్న సుమిత్రా ఉలిక్కిపడి ఒకళ్లమొహం ఒకళ్లు చూసుకున్నారు.
ఏదో ఒకటి మాటాడాలి అనుకున్నట్టు, గోపాలరావు, “ఏం చేస్తున్నావు?” అన్నాడు.
“ప్చ్. దేవుడిచ్చిన రెండుకళ్లూ ఉపయోగించి ఏదైనా చేద్దాం అని ప్రయత్నిస్తున్నాను,” అంది సుమిత్ర వేసిన తప్పు కుట్లు విప్పుతూ.
ఏవంకా చుట్టం కాని ఆ అంధుడినిగూర్చి నిన్నరాత్రి అసహజవాతావరణం ఏర్పడింది ఆ ఇంట్లో. ఇంతా చేస్తే పెద్ద తగువు పెట్టుకోవలసిన అవుసరం కూడా ఏమీ లేదు. వడ్లగింజలో బియ్యపుగింజ.
గోపాలరావు తనకళ్లగురించి అన్నమాటకి నడిరోడ్డుమీద సరసమేమిటని కోపం వచ్చింది సుమిత్రకి. నడిరోడ్డుమీద ఆ దరిద్రపుముక్క కొనమని జయ అల్లరిపెట్టడం, సమిత్ర జయమనసు మార్చడానికి గట్టిగా ప్రయత్నం చెయ్యకపోడం గోపాలరావు కోపకారణాలు. ప్రస్తుతం వాటితాలూకు జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తుండగా …
“నాన్నా! కేకు” అంటూ గేటుదగ్గర ఆడుకుంటున్న జయ ఆ బాంబేకేకువాలాని వెంట బెట్టుకుని లోపలికి వచ్చింది.
“ఇంట్లో బిస్కెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడేం ఒద్దు.”
“అమ్….మ్మా ..” జయ రాగాలాపన ప్రారంభించింది.
ఆ కుర్రాడు కూడా “తీసుకోండి సార్! బిస్కెట్లకన్నా బాగుంటుంది సార్. పాలకోవాతో స్పెషల్‌గా చేసింది సార్,” అన్నాడు.
గోపాలరావు “ఎలా చేస్తారు?” అని అడిగేడు, అతనికళ్లవేపు కౌతుకంతో చూస్తూ.
కుర్రాడు హఠాత్తుగా నిగడదన్ని నిలబడి, “అది ప్రొఫెషనల్ సీక్రెట్ సార్,” అన్నాడు.
గోపాలరావు ఫక్కున నవ్వేశాడు, “గట్టివాడివేనోయ్,” అంటూ.
“నాన్నా! ..మ్..హుమ్… ఊఁ…” అంటూ అతనిచొక్కా పట్టుకు లాగసాగింది జయ.
“చూడండి సార్. బాగుంటేనే డబ్బులివ్వండి. లేకపోతే ఇవ్వొద్దు,” అంటూ ఒక ముక్క తీసి గోపాలరావుచేతిలో పెట్టబోయేడు. జయ అది లాక్కుని పారిపోయింది. అది చూసినట్టు, ఆ కుర్రాడు మరోముక్క తీసి, “తిని చూడండి, సార్,” అన్నాడు గోపాలరావువేపు చెయ్యి చాచి.
గోపాలరావు అప్రయత్నంగానే అందుకుని పరీక్షగా చూస్తూ, “మీది ఈ ఊరేనా?” అని అడిగేడు.
ఆ కుర్రాడు విచారంగా మొహం పెట్టి, “కాదండీ. మాది బొబ్బిలి,” అన్నాడు.
“ఏఁవిటీ, ఆంధ్రదేశం ఆ కొసనించి ఈ కొసకి ఈ పనికోసం వచ్చేవా?” అన్నాడు గోపాలరావు ఆశ్చర్యంగా.
“ఈ పనికోసం వచ్చానా?” – కుర్రాడిమొహంలో రౌద్రం, శోకం ఉప్పెనగా ఎగిసి చప్పున చల్లారిపోయేయి. మరుక్షణంలో, “వెలమదొరల బిడ్డని” అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. ఎదలో ఏదో మూల నరాలు పట్టి బాదినట్టియింది గోపాలరావుకి. సుమిత్రకి కూడా మానుతున్న గాయమేదో రేపేం అన్న ఆలోచన గుండెల్లో గుచ్చుకుంటే ఇంగ్లీషు పద్ధతిలో క్షమాపణ చెప్పుకోడం కూడా ఎబ్బెట్టుగా అనిపించి ఇద్దరూ మౌనమే వహించేరు.
ఆ కుర్రాడు ఏ కథలబరువు కదిలించిందో అన్నట్టు కూలబడిపోయి, మెల్లిగా తనకథ చెప్పడం ప్రారంభించేడు.
ముందే చెప్పినట్టు వాళ్లది, వెలమవంశం. నలుగురాడపిల్లలు, ఆరుగురు మొగపిల్లల్లో కడగొట్టు తునక వీడు. పేరు రంగారావు. అప్పటికి ఐదేళ్ల పిల్లాడు. కొత్తగా స్కూల్లో వేశారు. నాలుగురోజులు వెళ్లాడేమో. ఐదోరోజు తోటిపిల్లలే ఇద్దరు కలిసి తనని దారి తప్పించేశారు. అంతే. తను మళ్లీ కన్నవాళ్లమొహం చూడలేదు. ఆ తీసుకురావడం తీసుకురావడం ఇప్పుడు పెంచుకుంటున్నవాళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశారు. తను ఏడ్చినా, ఆర్చినా, పారిపోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఒక రాత్రివేళ జిల్లేడుపాలు కాచి, కళ్లలో పోసి కాల్చేశారు. అడుక్కురమ్మని రోజూ పోరు పెట్టేవారు. ఒకళ్ళకి ఇవ్వవలసినచెయ్యి కానీ పుచ్చుకోవలసిన చెయ్యి కాదు తనది. ‘అమావాస్య అర్థరాత్రి పుట్టాను. చక్రవర్తినైనా కావాలి గజదొంగనైనా కావాలి కానీ బిచ్చగాణ్ణి కాను’ అన్నాట్ట వాళ్లతో. ఆ వయసులో ఆ తెలివితేటలకీ, ఆ మొండితనానికీ, వాళ్లు కొట్టినదెబ్బలకి ఓర్చుకోగలిగినందుకూ వాళ్లు ఆశ్చర్యపోవడమే తప్ప ఏం చెయ్యలేకపోయారుట. ఆఖరికి ఈ బాంబేకేక్ అమ్మకం పెట్టించేరు అతనిచేత. అప్పటికి తొమ్మిదేళ్లవయసు. అప్పట్నుంచీ ఈవ్యాపారంలోనే ఉన్నాట్ట.
సుమిత్ర కనుకొలుకుల్లో నిలిచిన కన్నీటిచుక్క రాలి చేతిలో ఎంబ్రాయిడరీ ఫ్రేంలో ఇంకిపోయింది.
గోపాలరావు “అయ్యో” అన్నాడు. మళ్లీ అతనే అడిగేడు, “మరి నిన్నెవరూ మోసం చెయ్యరూ?” అని.
ఆ కుర్రాడు గర్వంగా నవ్వేడు, “సామాన్యంగా చెయ్యరండీ. ఎవరైనా ఒకోసారి ప్రయత్నించినా ఆదగ్గిర్లో ఉన్నవాళ్లు ఎవరో ఒకరు వాడిని పట్టుకుని చితగ్గొట్టి వదిలేస్తారు. ఒకమారు అలాగైంది. ఒక్కోమారు చెల్లని డబ్బులు కూడా వచ్చేస్తుంటాయి. రెండు కళ్లూ పెట్టుకుని కూడా మోసపోయేవాళ్లు ఎంతమంది లేరు?” అన్నాడు. “వస్తానండీ, ఇక్కడే చాలా ఆలశ్యమయిపోయింది.”
“ఉండుండు,” అంటూ గోపాలరావు తనచేతిలో పెట్టిన రెండోముక్కకి డబ్బులు తీశాడు.
రంగారావు, “వద్దు సార్. మీరు తిన్లేదు కదా,” అన్నాడు.
గోపాలరావు అతనిని నొప్పించలేక, “తిన్నాను, చాలా బాగుంది,” అన్నాడు.
రంగారావు నవ్వేడు. “లేదు సార్. మీరు తిన్లేదు. నాకు రెండు కళ్లు లేవు కానీ ఒళ్లంతా కళ్లే. లేకపోతే, ఈ వ్యాపారం ఎలా చేస్తాను ఇంతకాలం?” అన్నాడు.
అతను వెళ్లినవేపు చూస్తూ, సుమిత్ర, “అంత తెలివితేటలున్న కుర్రాడు. కళ్లుంటే నిజంగానే చక్రవర్తి అయేవాడేమో,” అంది.
అదే సమయంలో గోపాలరావు కూడా మనసులో అదే అనుకుంటున్నాడు. “ఊరికే అన్నారా శిరసి నయనం ప్రధానం అని,”అన్నాడు పైకి మాత్రం.
వారంరోజులనాడు, గోపాలరావు వేలూరు వెళ్తుంటే, సుమిత్ర మరీ మరీ చెప్పింది రంగడికి కళ్లు బాగు చేయించే ప్రయత్నం గట్టిగ చెయ్యమని.
గోపాలరావు వేలూరులో స్నేహితుడితో మాటాడి వచ్చి, రంగడిని పంపించాడు ఉత్తరం రాసిచ్చి. రంగడు వణికిపోతూ “మీఋణం ఎలా తీర్చుకుంటానో,” అన్నాడు.
గోపాలరావు, “వచ్చినకళ్లు సద్వినియోగం చేస్తే నాఋణమూ, మీఅమ్మ ఋణమూ కూడా తీరిచినవాడవు అవుతావు” అన్నాడు.
రంగడు మళ్లీ మళ్లీ సలాములు చేస్తూ వెళ్లిపోయాడు.
కళ్లు రాగానే మళ్లీ వచ్చి, “మీదయవల్ల లోకాన్ని చూడగలుగుతున్నాను,” అని కనీసధర్మంగా మాట మాత్రం చెప్పడా అనుకున్నాడు గోపాలరావు. సుమిత్రకి రంగడికోసం ఎదురు చడడం ఒక దినచర్య అయిపోయింది. లోకంలో కృతఘ్నులుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా మరీ ఇంత ఘోరకలా? అనుకున్నారిద్దరూను. అటువంటి నిరాశాపూరితవాతావరణంలోకి ఒక ఉత్తరం వచ్చింది వేలూరులో మిత్రుడిదగ్గరినుండి.
డియర్ గోపాల్,
రంగడికళ్లు ఆపరేషను బాగానే అయింది. సక్సెస్‌ఫుల్. కానీ చెప్పకుండా వెళ్లిపోయాడు నిన్నరాత్రి. బహుశా ఈపాటికి నీదగ్గిరికి వచ్చేవుంటాడు. కొంచెం మందలించు. కొత్తగా లోకంలో పడిన కుర్రాడికి ఆమాత్రం జ్ఞానోపదేశం చేయడంలో తప్పు లేదు కదూ! …
గోపాలరావుకి ఏమని జవాబివ్వాలో తోచలేదు. రంగడు ఆరోజే కాదు ఆతర్వాత పదిహేను రోజుల్లో ఏరోజూ కనిపించలేదు సరికదా తప్పించుకు తిరుగుతున్నాడేమోనన్న అనుమానం కూడా వచ్చింది. ప్రయత్నించినా రంగడి ఆచూకీ దొరకలేదు. అపాత్రదానం చేశానా అని మనసు బాధించసాగింది.
ఆ సమయంలోనే సొంతపనిమీద చిత్తూరు వెళ్లేడు. తలొంచుకుని వెళ్తున్న అతనిని ఎవరో కుడివేపు పొడిచినట్టయి. తలెత్తి చూసేటప్పటికి, … దొంగ …. దొంగ … అన్న కేకలూ ఒక ఫర్లాంగుదూరంలో గుంపు గమనించి అక్కడికి చేరుకున్నాడు.
జేబుదొంగ, .. జేబు కొట్టేసి పారిపోతున్నాడు అన్నాడు ఒకాయన. గోపాలరావు జేబులో చెయ్యి పెట్టి చూసుకుని తృళ్లి పడ్డాడు. తన పర్సు!
గుంపుని కొంచెం వత్తిగించి చూశాడు. రంగడు వగరుస్తూ, “మాఅక్కకి జబ్బుగా ఉంది. డాక్టరుకోసం పరుగెత్తుతున్నాను,” అంటున్నాడు.
“ఓహో .. ఎవరేం మీ అక్క …” ఎవరికి తోచినట్టు వాళ్లు హేళన చేస్తున్నారు. కొందరు సరదా తీరక ఒకటో, రెండో తగలనిచ్చారు.
గోపాలరావు దగ్గరికి వచ్చి వాడిని పరీక్షగా చూశాడు. వాడు తనని గుర్తు పట్టలేదు. అతను గుంపువేపు తిరిగి, “చూడండి, వీడు దొంగ కాడు. ఈపర్సు నాది కాదు. వాళ్లఅక్కకి జబ్బుగా వున్నసంగతి నాకు తెలుసు. మీరంతా వెళ్లి పోండి,” అన్నాడు.
గుంపు చెదిరిపోయింది. గోపాలరావు రంగడిని అసహ్యంగా ఓ చూపు చూసి, గబగబ నడవసాగాడు. కొంతదూరం వెళ్లేసరికి రంగడు తనని అనుసరిస్తున్నాడని అర్థమయింది. గిరుక్కున వెనక్కి తిరిగి, “కొత్తగా వచ్చినకళ్లు సద్వినియోగమే చేస్తున్నావు,” అన్నాడు హేళనగా.
రంగడు దెబ్బ తిన్నట్టు మెలి తిరుగుతూ, “డాక్టరుగారూ!” అన్నాడు.
“ఛీ, ఛీ,” అన్నాడు గోపాలరావు మరేం అనడానికీ నోరు రాక.
“ఒక్కమాట నమ్మండి డాక్టరుగారూ! మీముఖం నేను చూడలేదు. కనక మిమ్మల్ని నాకు తెలీదు. కానీ లక్షమందిలో కూడా మీస్వరం గుర్తించగలను. ఇందాకా మీరు మాటాడుతున్నప్పుడే తెలిసింది. మీకంటె నాకు ఆప్తులెవరున్నారు …”
రంగడిమాటలు వినిపించుకోకుండా, గోపాలరావు విదిలించుకుని వెళ్లిపోయాడు. వికలమయిన మనసుతో ఆరాత్రే ఇంటికి వచ్చేశాడు.
“అదేఁవిటి … అలా ఉన్నారు?” అంది సుమిత్ర తలుపు తీసి, గోపాలరావుని చూసి తెల్లబోతూ.
సుమిత్ర రెండుభుజాలమీదా చేతులు వేసి ఆ విశాలమయినకళ్లలోకి చూస్తుంటే, అతనికి కడుపులో దేవినట్టయింది, “సుమిత్రా!” అన్నాడు బాధగా.
“ఏవైఁదండీ? ఏమయింది?” అంది సుమిత్ర గాభరా పడిపోతూ.
“మన రంగడు కళ్లుంటే చక్రవర్తి కాగలడనుకున్న రంగడు దొంగ అయేడు,” అన్నాడు బాధగా.
ఆమె నిశ్చేష్ట అయి నిలబడిపోయింది. కొంతసేపటికి తెప్పరిల్లి, “మీకెక్కడ కనిపించేడు?” అనడిగింది.
అతను జరిగింది వివరించేడు.
అంతా విని, సుమిత్ర, “అతడేం చెప్పేవాడో వినలేకపోయారా?” అంది.
గోపాలరావు పెదవి విరిచి సోఫాలోనే నిద్రకొరిగేడు.
000
మర్నాడు గోపాలరావు డిస్పెన్సరీకి బయ్లదేరుతుంటే, ఎవరో గోడవారగా నిలబడినట్టయి ఆగి చూశాడు. కానీ ఎవర్నీ గుర్తు పట్టలేకపోయాడు. మూడోరోజు కూడా అలాగే అయింది. వారంరోజులనాడు అఖరికి రంగడు పట్టుబడ్డాడు.
గోపాలరావు, “ఏం, ఇంటికి కూడా ఆనుపానులు చూసుకుంటున్నావా?” అన్నాడు.
సుమిత్ర లోపల్నుంచి వస్తూ, “రంగా,” అంది ఆశ్చర్యంగా.
అంతవరకూ వెర్రివాడిలా చూస్తూ నిలబడిపోయిన రంగడు, “అమ్మా!” అంటూ అరుగుమీద కూలబడి మోకాళ్లలో మొహం దాచుకుని బావురుమన్నాడు.
“అదేఁవిటి? లే, లే,” అన్నాడు గోపాలరావు విసుక్కుంటూ.
సుమిత్ర ఆర్ద్రంగా చూస్తూ, అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది.
“డాక్టరుగారూ!” రంగడు మలినమయిన ముఖాన్ని పైకెత్తేడు.
ఆమొహం చూసి గోపాలరావు మళ్లీ కసరలేకపోయాడు.
సుమిత్ర గబగబ లోపలికి వెళ్లి, స్టీలుగ్లాసులో కాఫీ తీసుకొచ్చి, “ఇంద, తీసుకో,” అంది రంగడిముందు పెట్టి.
రంగడు రుద్ధకంఠంతో, “డాక్టరుగారూ, మీరు నమ్మరు. ఎవరూ నమ్మలేరు. కానీ చెప్పకుండా ఉండలేను. అందుకే వచ్చేను.” షర్ట్ కొనలతో కళ్లు తుడుచుకుని మళ్లీ మొదలు పెట్టేడు, “మాది దొరలవంశం అని ముందే చెప్పేను. నాకు దొంగతనాలూ, దండుకు తినడాలూ అలవాటు లేదు. చేతా కాలేదు. చిన్నతనంలో కూడా ఎదురుగా ఎంత ఇష్టమయిన మిఠాయి అయినా ఇస్తే తప్ప తీసుకుని ఎరగను. అలాటిది ఇప్పుడు ఈ కళ్లు వచ్చిన దగ్గిరినుంచీ … ఏమిటో ..” రంగడు ఆగేడు దుఃఖంతో గొంతుక పూడుకుపోగా.
గోపాలరావు పేపరు తీసుకుని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు.
సుమిత్ర నీరసం ఆవహించినట్టయి అక్కడున్న కుర్చీలో కూలబడింది.
రంగడు గోపాలరావు చేతిలోని పేపరులోకి చూస్తూ, “చెప్పండి డాక్టరుగారూ, మీకు తెలిసే ఉంటుంది. నేనెందుకిలా అయిపోయాను? ఇదివరకు ఎప్పుడూ ఇలాగ లేదు. మొదట ఆస్పత్రిలో కళ్లు రాగానే ప్రక్క బెడ్డుమీద పేషెంటుదగ్గర ఒక చిన్న అమ్మాయిని చూశాను. ఆఅమ్మాయి చేతికి గాజులున్నాయి. నాకు వాటిమీద లాలస కలిగిందనుకుంటాను, కళ్లు తిప్పుకోలేకపోయాను. అక్కడినుంచీ చూసిన ప్రతివస్తువూ ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న కోరిక, చంపుకోలేకుండా ఉన్నాను. మనసంతా అల్లకల్లోలంగా తయారయింది. అది భరించలేకే ఆస్పత్రిలో చెప్పకుండా వచ్చేసాను. పిచ్చిగా తిరుగుతున్నాను. దానికి తోడు నేను రోడ్డుమీదకి రాగానే ఒకళ్లిద్దరు నన్ను అనుమానంగా చూస్తూ దూరదూరంగా జరగడం మొదలుపెట్టేరు, ‘ఆ చూపులు చూడు, దొంగవెధవలా వున్నాడు’ అన్నమాటలు చాలా చోట్ల వినిపించేయి. … నా ‘చూపులు’ ఎందుకు అలా ఉన్నాయి, డాక్టరుగారూ?”
బొంగురుగొంతుతో రంగడు వేసిన ప్రశ్న గోపాలరావుగుండెల్లో సూటిగా గుచ్చుకుంది.
“చెప్పండి, డాక్టరుగారూ, మీకు తెలుసు. నేనెందుకిలా అయిపోతున్నాను?”
“రంగా!” గోపాలరావు పిలుపుకి అక్కడున్న ఇద్దరూ తృళ్లిపడి, అతనిమొహంలోకి చూశారు.
అతనిమొహం పాలిపోయి ఉంది. యాంత్రికంగా ఎక్కడో చూస్తూ మాట్లాడేడు, “రంగా, ఇన్ని రోజులూ నువ్వు ప్రపంచం చూడలేకపోవడంచేత ఇప్పుడు అదంతా స్వంతం చేసుకోవాలన్నది ఒకరకం సైకలాజికల్ రియాక్షన్ కావచ్చు. నువ్వు స్వతహాగా బుద్ధిమంతుడివి. మరో వారంరోజులపాటు నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించు. తరవాత మళ్లీ చెక్ చేయిస్తాను.”
“నిజమేనా?” అన్నాడు రంగడు నమ్మలేనట్టు.
అవునన్నట్టు గోపాలరావు తలూపి, లేచి లోపలికి వెళ్లిపోయాడు.
రంగడు తలొంచుకుని, సుమిత్రతో “వస్తానమ్మా,” అనేసి వెళ్లిపోయాడు.
సుమిత్ర చాలాసేపు అలా కూర్చుని ఉండిపోయింది. “వీడు ఎలాగైనా బాగుపడితే బాగుండు,” అని మౌనంగా ప్రార్థిస్తోందామె.
ఆరాత్రి గోపాలరావు పిచ్చిగా పరుపుమీద దొర్లుతూ, “తప్పంతా నాది సుమిత్రా,” అన్నాడు.
సింఘాల్ చిత్రంలోలా ఎటు చూసినా రంగడికళ్లు అతనివేపే చూస్తున్నట్టు అనిపిస్తోంది.
“ఏం?” అంది సుమిత్ర.
“ఆ కళ్లు ఒక దొంగవి. అతడు చచ్చిపోతూ, పశ్చాత్తాపంతో తన కళ్లు ఐ బాంక్‌కి దానం చేసి పోయాడు.”
సుమిత్ర తెల్లబోయింది. “తెలిసి, తెలిసి మీరు …” అంది కఠినంగా.
“లేదు, లేదు. నేను ఈ ఫలితాన్ని ఊహించలేదు,” అన్నాడు గోపాలరావు నెత్తి కొట్టుకుంటూ.
“వారంరోజులనాడు వాడు మళ్లీ వస్తే ఏం చేస్తారు?”
గోపాలరావు తెలీదన్నట్టు తలా, చేతులూ ఎగరేశాడు.
వాళ్లు వారం రోజులవరకూ ఎదురు చూడక్కరలేకపోయింది. నాలుగోనాడు పేపర్లో తాటికాయలంత అక్షరాలతో మద్రాసులో ఒక పెద్ద బాంకులో చోరీ అయినట్టు వార్త వచ్చింది. వివరాలలో ‘రంగారావు అనే కుర్రవాడు స్వయంగా పోలీసు స్టేషనుకి వచ్చి, లొంగిపోవడమే కాక, ముఠా వివరాలన్నీ ఇచ్చి, తాను శిక్ష పూర్తిగా అనుభవిస్తానని పట్టు పడుతున్నాడ’నీ కూడా ఉంది.
గోపాలరావు దీర్ఘంగా నిట్టూర్చి, “నిజంగా నువ్వు దొరబిడ్డవేనోయ్” అన్నాడు.
సుమిత్ర కనుకొలుకుల్లోంచి జారిన కన్నీటిచుక్క చీరెమడతల్లో ఇంకిపోయింది.
దూరాన ఒక తల్లి హృదయం కలుక్కుమంది.

000

(జయశ్రీ. జూన్ 1967)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “కళ్లు”

 1. కళ్లుకథకి నేపథ్యం. నాకాలేజీరోజుల్లో విశాఖపట్నం అనకాపల్లిమధ్య రైల్లో రోజూ ఒక గుడ్డి అబ్బాయి బాంబేకేక్ అంటూ కోవాబిళ్లలు అమ్మడం నిజంగానే చూశాను. ఆతరవాత విజయనగరంలో వున్నప్పుడు వెలమవారి అభిజాత్యం చూశాను. కళ్లు transplant చేస్తే, మనస్తత్త్వాలు మారతాయన్నది నాఊహ మాత్రమే. కథ మనిష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు అనడానికి నిదర్శనం అనుకోండి. కానీ దాదాపు పదేళ్లక్రితం ఒకరోజూ టీవీలో వార్త విన్నాను – ఇలా కళ్లమార్పిడితో మనస్తత్త్వాలు మారవచ్చునని ఒక స్టడీలో నిరూపించారు అని. పోతే,
  లలితా, మీరు నాకథలగురించి వెలిబుచ్చిన అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరు రచయిత్రిని అపార్థం చేసుకున్నారని నేను అనుకోను. నావ్యాసంలో చెప్పినవి స్థూలంగా నాకు కలిగిన అభిప్రాయాలే కానీ అవి నూటికి నూరుపాళ్లూ సత్యం కానక్కరలేదు కదా. generalizations వేరూ, విడివిడిగా ఒకొకపాఠకునిలో కలిగే స్పందన వేరూ కావచ్చు కదా.
  ముగింపుగురించి మీరు చెప్పినదానికి ఇది సూటి సమాధానం కాదు కానీ, నాకు చెప్పాలనిపించిన విషయాలు ఇవీ – ఆ అబ్బాయి వెలమలగౌరవం నిలబెట్టేడు. దూరాన ఓతల్లి హృదయం కలుక్కుమంది అన్నది కూడా సైంటిక్ఫిక్ ఫాక్ట్ కాకపోవచ్చు కానీ అలాటి అనుభూతి లేదా స్పందన ఉంటుందని సాధారణంగా అందరం నమ్మేదే కదా. మనసంస్కృతిలో తల్లిపేగు అంటాం -:)

  మెచ్చుకోండి

 2. కళ్ళు కథ చదివినప్పుడు నాకు ముగింపు అసహజంగా అనిపించింది, రచయిత మీద నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం దృష్ట్యా.
  కానీ మాలతి గారూ, మీరు విషప్పురుగు మీద వ్యాఖ్యలో ఇచ్చిన లంకె చూశాక మీరు రచయితగా ఇంకొంచెం బాగా అర్థమయ్యారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కథను నేను ఒక కథ లాగా తీసుకోగలుగుతున్నాను, రచయిత అభిప్రాయంగా కాకుండా.
  “కథకుల, పాఠకుల మధ్య గల అవినాభావ సంబంధం” అన్న ఆ వ్యాసంలో మీరు రాసిన విషయాలు బావున్నాయి, స్పష్టంగా ఉన్నాయి కూడా.

  కథను కథలాగా చదవగలిగేలా రాయాలి, అలాంటి కథలు నాకు తెలియవు, తెలుగులో, అనుకుంటుండగా కొన్నేళ్ళ క్రితం మీ కథలు చదవడం తటస్థించింది. తర్వాత ఇంకో ఒకరిద్దరు రచయితలవి కూడా అలాంటి కథలు తగిలాయి. కానీ మీ కథలు చాలా సులభంగా నాకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం ఒక సృజనాత్మక వ్యక్తీకరణ? (creative expression) కనిపిస్తుంది, మిగిలిన అంశాలకంటే ఎక్కువగా. చాలా కథలు ఆసాంతం చదివేలా ఉంటాయి. ఐనా, వరసగా చదువుతున్నప్పుడు అంతర్గతంగా ఒక సందేశం ఉండడానికి అలవాటు పడిపోయాను.
  కళ్ళు కథ ఆ విధంగా నన్ను కొంచెం అయోమయంలో పడేసింది.

  కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్య కోసం మళ్ళీ కొంచెం పరీక్షగా చదివి ఆలోచిస్తే, ముగింపులో నేననుకున్న రచయిత్రే కనిపించారు. నేనే పాఠకురాలిగా మధ్యలో నాకు అసహజంగా అనిపించిన అంశం దగ్గిరే ఆగిపోయననుకుంటా.

  మెచ్చుకోండి

 3. రామ్, కథమీద మీ అభిప్రాయంకోసం ఎదురు చూస్తున్నాను.
  శ్రీవాసుకి, మీకు అలా అనిపించింది అంటే కథ సాఫల్యం అయినట్టే. ధన్యవాదాలు.
  స్ఫురిత, నేను ఆకథ రాసినప్పుడు, కేవలం కథకోసం కల్పించాను అనుకుంటాను. కానీ, కొంతకాలం క్రితం అమెరికాలో న్యూస్ వచ్చింది, అలాటిది సంభవమేనని ఇక్కడ సైంటిస్టులు అంటున్నారని. మీవ్యాఖ్యానానికి కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 4. కథ బాగుంది గానీ, దొంగ కళ్ళు పెదితే దొంగ బుధ్ధులు వస్తాయి అన్న logic మాత్రం నాకు అర్థం కాలేదు మాలతి గారూ…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశముపై తెలుగులో చర్చకి అనువైన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడును.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s