నడుస్తున్న చరిత్ర

(ఈరోజు మహిళల దినోత్సవంట. 63లో రాసిన ఈకథ మనం ఎంత సావకాశంగానూ,  వేగంగానూ ముందుకు సాగుతున్నామో చెపుతుంది అనిపించి, మీతో పంచుకుంటున్నాను. :))                                                                                

“నవంబరు ఒకటో తారీఖు” అంది కేలండరు.

“ఆరు” అంది గోడనున్న గడియారం.

సాయంత్రసమయం.

నోటిదగ్గర పెట్టుకోబోతున్న పాలగ్లాసు క్రింద పెట్టేసి, కల్యాణి “అమ్మయ్య” అంటూ ఆదరా బాదరా బెల్టుజోళ్లు వేసుకోడంలో ములిగిపోయింది. పదేళ్ల తనస్కూలు చరిత్రలో ఇవాళ తను పదినిముషాలు ఆలస్యంగా వెళ్తోంది.

“అమ్మా! వెళ్తున్నా!” అని కేకేసి వెళ్తున్న కల్యాణి, “ఎక్కడికి?” అని తల్లి వంటింట్లోంచి అడగడంతో క్షణం ఆగింది. ఈసమయంలో తను రోజూ ఎక్కడికి వెళ్తుందో తల్లికి తెలీదా?

“స్కూలికి,” అంది ఒక్క అంగలో గేటుదాకా వెళ్లి.

“కల్యాణీ!”

“టైమయిపోయిందమ్మా,” అని నసుగుతూ వెనక్కి వచ్చింది. పాలు తాగడం తనకి అయిష్టం. తాగకపోతే అమ్మకి కష్టం. కల్యాణి పాలగ్లాసు తీసుకుంది.

“స్కూలికి వెళ్తున్నావు కాబోలు” అంది ఆవిడ గోరుచిక్కుడు ఈనెలు తీస్తూ. “మీమేష్టరుతో రేపట్నుంచి రానని చెప్పిరా.”

“ఆఁ?”

పాలగ్లాసు కిందపడ్డ శబ్దానికి ఆవిడ తలెత్తి కల్యాణివేపు చూసింది.

స్థబ్ధురాలయి నిల్చున్న కల్యాణి, మెల్లిగా తేరుకుని, “రేపట్నుంచి రాలేనని చెప్పనా? ఎందుకని?” అంది నీరసంగా. వండుకున్న అన్నం తిన్నదాకా నమ్మకం లేదంటే ఇదేనా?

 “ఏంలేదు. ఉట్టినే,” అంది తల్లి కిందపడ్డ పాలు తడువడానికి ఉద్యుక్తురాలవుతూ, “వెళ్లి వేగిరం రా.”

కల్యాణి గుమ్మానికి ఆనుకుని నిల్చుంది. తల్లి అన్నమాటలు అర్థం కాలేదు. తనకి ఏడేళ్లప్పుడు సరిగ్గా ఇదే రోజున మొదలు పెట్టింది. జ్వరం వచ్చినప్పుడు వెళ్లింది. వాన వచ్చినప్పుడు వెళ్లింది. అలాటిది ఇవాళ “ఉట్టినే” “రేపట్నుంచి రాలేన”ని చెప్పి వచ్చేయాలా?

“వెళ్లు అని చెప్తున్నాను. పదిహేడేళ్లొచ్చాయి. కల్యాణీ, చెప్పినట్టు చెయ్యడం నేర్చుకో,” అంది ఆవిడ బొమలు ముడిచి, మళ్లీ గోరుచిక్కుడుకాయలు ఏరడంలో మునిగి. ఆవిడకి తెలుసు కల్యాణిబాధ. కానీ తనూ, కల్యాణీ కలిసినా ఎదుర్కోలేని శక్తులు! ఆ సంగతి ప్రస్తుతం కల్యాణి గ్రహించే స్థితిలో లేదు. అందుకే ఆవిడ ఇప్పుడు కారణాలు వివరించడం, ఆపిల్లని నమ్మించ ప్రయత్నించడం చెయ్యలేదు. అందుకే చాలామంది పెద్జవాళ్లలాగ “ఒకొకప్పుడు కర్రే మంచిద”న్న సామెతగా, “వెళ్లిరమ్మ”ని శాసించింది.

కల్యాణి నించున్న స్థలంలోనించి కదలడానికి పదిహేను నిముషాలు తీసుకుంది. కదిలిన తరవాత మాత్రం స్కూలువేపు వెళ్లలేదు. ఇంటినానుకుని ఉన్న చిన్నతోటలోకి వెళ్లి బొప్పాయిచెట్టు నానుకుని నిల్చుంది.

ఆ పక్కన సూదుల్లాటి జాజిమొగ్గలు విడడానికి తయారుగా వున్నాయి. తోట సగంవరకూ కనకాంబరాలే. వాటిమధ్య ఒక నాపరాయిని బల్లలా నిలబెట్టేరు. కుడివేపు పంచలో లైటు వేస్తే ఈతోటలోకి వెల్తురు వస్తుంది. ఆ రాయిమీద కూచుని ఎన్నిమార్లో అమ్మ అడిగింది తను డాన్సు స్కూల్లో నేర్చుకున్న విషయాలు. తను ఎంతో ఉత్సాహంతో ఆ అభినయాలన్నీ చేసి చూపించేది.

కల్యాణికి ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ఆ నాపరాయిమీద పడుకుని ఏడిచింది. రోజంతా ఎండకి కాలి కాలి ఉన్న ఆరాయి వేడి ఆ పిల్లకి తెలీలేదు.

పదేళ్లకిందట మొదలు పెట్టింది. అవేళ ఆ రోడ్డుమీద అలా వెళ్లిపోతూ గజ్జెల చప్పుడు విని, లోపలికి తొంగి చూసి, “ఇక్కడ డాన్సు నేర్పిస్తారా?” అని అడిగిందిట తను. మేష్టరు నవ్వి, “ఆఁ, నేర్పిస్తాం. ఇలా రా,” అన్నారుట. ఆయన ఆమాట చెప్పి ఇప్పటికీ నవ్వుతూంటారు. ఆ అడగడం, “ఇక్కడ వంకాయలు అమ్ముతారా?” అన్నట్టుంది అని. ఆ వెంటనే తను ఇంటికొచ్చి, “నేను డాన్స్ మేష్టరితో మాట్లాడేను. పది రూపాయలు కావాలన్నారు. సరేనన్నాను,” అంది.

కల్యాణి నాట్యశిక్షణ అలా ప్రారంభమయింది. లలితకళలంటే అభిరుచి గల తల్లిదండ్రులు సరేనని వెంటనే ఒప్పుకున్నారు. అప్పట్నుంచీ నిన్న సాయంత్రంవరకూ నిర్విరామంగా వెళ్లగలిగింది. “రేపట్నుంచి ఎందుకు వెళ్లలేదో” అర్థం కాలేదు కల్యాణికి. “చెప్పినట్టు వినడం నేర్చుకోమ”ని చెప్పింది. తను ఏనాడు కాదంది అమ్మమాట?

ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయిన కల్యాణిని అమ్మ లేపి యింట్లోకి తీసుకెళ్లేవేళకి రేడియోలో ఆంగ్లంలో వార్తలు చెబుతున్నారు.

“అన్నం తిని పడుకో,” అంది తల్లి.

“నేను డ్యాన్సు క్లాసులు ఎందుకు మానేయాలి?” అంది కల్యాణి ఆవేశం అణుచుకుంటూ.

“పెద్దదానివయేవు. ఇంకా నాట్యాలూ, నాటకాలూ వేస్తే బాగుండదు. నలుగురి నోళ్లలో పడడం తప్ప. అదీ కాక మనం ట్రూపులో చేరి ఊరూరా తిరగబోవడం లేదు. అందుకే వద్దన్నాను. మనసంతృప్తికి ఇప్పటివరకూ నేర్చుకున్నది చాలు,” అంది ఆవిడ అనునయంగా.

కాని కల్యాణిని మాత్రం ఆవిడ చెప్పిన ప్రతిమాటా ములుకులై పొడిచేయి. పెద్దదయిందిట! ఇంక నాట్యాలు బాగుండవుట! ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలుట! … నలుగురూ నవ్వుతారుట! కళంటే వీళ్లకున్న అభిరుచి ఇదేనా? ఇందుకేనా తను ఇన్నాళ్లు తపస్సు చేసింది? నారు పోసి, నీరు పోసి పెంచి పెద్ద చేసిన మానుని ఇప్పుడిలా మొదలంటా నరికేసి .. ఇంకా “మన సంతృప్తి” ఎక్కడినించి వస్తుంది? పెద్దది అయినంత మాత్రాన సిగ్గు పడవలసిన ఈవిద్యలో తనకి చిన్నప్పుడు ఎందుకు అభిరుచి కలిగించేరు? “చిన్నప్పుడు బట్టల్లేకుండా తిరిగేవు. ఇప్పుడు కూడా తిరుగుతావా అలా?” అంటోంది తల్లి. అదేనా ఉపమానం? నిన్న మొన్నటివరకూ తను డాన్స్ చేస్తుందని ఇంటికొచ్చిన వాళ్లందరికీ ఎంత గర్వంగా చెప్పుకున్నారు. తన ఫొటోలన్నీ ఇంటిగోడలనిండా, రెండు ఆల్బములలోనూ లేవూ? డబ్బుకోసం గజ్జె కడతానని తానెప్పుడూ అనలేదు. అది కారణం కానే కాదు.

కల్యాణి గాలివాన రేపింది ఆరాత్రి ఇంట్లో. ఆఖరికి తల్లి కళ్లనీళ్లు పెట్టుకునేదాకా, తండ్రి ఎన్నడూ ప్రదర్శించని కోపం ప్రదర్శించేదాకా అసలు కారణం వివరించేదాకా వెళ్లింది. రేపు కల్యాణిని చూడడానికి పెళ్లివారు వస్తున్నారు.

కల్యాణి తనగదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. మంచంమీద పడుకుంది. కన్నీళ్లు రాలేదు. కణతలు పేలిపోతున్నాయి. ప్రాణం ఎందుకు పోవడం లేదో ఆ పిల్లకి అర్థం కాలేదు. … పెళ్లికొడుకు వస్తున్నాట్ట. ఎవర్ని అడిగి చేస్తున్నారు ఈ ఏర్పాట్లు? తనకి పదేళ్లు వచ్చిందగ్గర్నుంచీ తనకి తానుగా ఆలోచించుకోడం నేర్పి, తన వ్యక్తిత్వం నిలబెట్టుకునేందుకు దోహదం చేసి, ఆఖరికి తన జీవనమార్గాన్ని నిర్ణయించుకునే సమయం వచ్చేసరికి పగ్గాలు వాళ్ల చేతుల్లోకి తీసుకున్నారు! తను అనుకున్నదేమిటి?

మేష్టారు ఎన్ని మెళుకువలు చెప్పేరు .. యోగానికీ నాట్యానికీ ఉన్న సామ్యం … యోగాసనాలే రమణీయకంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించితే నాట్యమవుతుందట. నాట్యారంభంలో చేసే అభినయానికి, ఒకొక ముద్రకీ ఒకొక దేవతని ఆపాదించి, ఆ ప్రథమ ప్రదర్శన అగ్ని, వాయు, వరుణాది దేవతలని ఆహ్వానించడమని నిరూపించిన నాటి ఆయన ఉత్సుకత, నాట్యకళలో చేయవలసిన పరిశోధనగురించి చర్చించినప్పుటి ఆయన పాండిత్యప్రకర్ష, మణిపురి కథకళి నృత్యాలకీ, భరతనాట్యానికీ భేదాలనూ విప్పి చెప్పినప్పటి ఆయన పరిశీలనాదృష్టి – తనని ముగ్ధురాలిని చేస్తే. ఆ కళలోనే తన జన్మ అంతమవుతుంది అనుకుంది. “అటు వెళ్లడం చాలు, ఇహ ఇటు ప్రయాణం చెయ్యి” అంటూ వెనక్కి లాగుతున్నారు అమ్మా, నాన్నగారూను! రాజహంస కాకుల్లో బతగ్గలదా? తను సంసారంలో?! కల్యాణి ఏ తెల్లవారుఝామునో నిద్ర కొరిగింది.

మర్నాడు పొద్దున్న ఎంతకీ తెరుచుకోని గదితలుపులు తల్లికి “ఇదేం అఘాయిత్యానికి తలపడలేదు కదా!” అనిపిస్తే, బాది బాది బలవంతాన తెరిపించింది ఆవిడ. కల్యాణి కళ్లూ, మొహమూ వాచి ఉండడం చూసి, “ఖర్మ” అనుకుంది ఆవిడ మనసులోనే.

కల్యాణి హాల్లో సంగీతం మేష్టర్ని చూసి, “నేను సంగీతం మానేస్తున్నానండీ, మీజీతం నాన్నగారిని అడిగి తీసుకోండి,” అంది ధృఢస్వరంతో.

 “సంగీతం ఎందుకే మానెయ్యడం?” అన్న అమ్మవేపు కల్యాణి చూడకుండా, “అది మాత్రం ఎందుకు?” అనేసి అక్కడినుండి వెళ్లిపోయింది.

లౌక్యం ఎరిగిన అమ్మ, “మీరు  వారంరోజులు పోయేక రండి,” అందే కానీ పిల్లనిగురించి ఆవిడకి అంతకన్న ఎక్కువే తెలుసు. కల్యాణి మళ్లీ ఎప్పుడూ సంగీతంమేష్టరుముందు కూర్చోలేదు.

ఆసాయంత్రం తల్లిబలవంతంమీద పెళ్లికొడుకుముందు కూర్చుందే కానీ ఆమనిషి ఎవరో అని కన్నెత్తి చూడలేదు. వాళ్లు అడిగినప్రశ్నలకి సమాధానాలు చెప్పనూ లేదు. వాళ్లు వెళ్లిపోయేక, అమ్మ నచ్చచెప్పడానికి చూస్తే, కల్యాణి ఉరిమి చూసి తనగదిలోకి వెళ్లిపోయింది.

“అన్నానికి రావే” అంటే, వచ్చి మంచంముందు కూచుని అన్నం అటూ ఇటూ కెలికేసి వెళ్లిపోయింది.

“పాలు తాగవే” అంటే “ఏం? పాలు తాగకపోతే పెళ్లి చేసుకోనన్నాడా ఆ పెళ్లికొడుకు?” అంది.

“ఇది మళ్లీ ఎప్పుడు మనుషుల్లో పడుతుందో?” అని తల్లీ, తంఢ్రీ బాధపడడం చూసి, కల్యాణి పేలవంగా నిట్టూర్చింది. బలంగా గాజుపలకని కొడితే ముక్కలు చెదిరిపోవా? ఏ ముక్కని పట్టుకుంటే ఏ ముక్క ఆగుతుంది? కల్యాణి కాలేజీకి వెళ్లడం మానేసింది.

అమ్మ, నాన్నగారు తనమనసు మళ్లించడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయేయి. “అందుకే అంటారు ఏదేనా మప్పొచ్చు కానీ తిప్పడం కష్టం” అనీ అంది అమ్మ చిరాగ్గా.

ఓ ఆర్నెల్లు పెళ్లిసంగతి ఎత్తకుండా ఊరుకున్నారు. కొన్నాళ్లు అలా అయితే, అదే సర్దుకుంటుందని.

కాని కల్యాణి మటుకు రోజుకో రభస తెస్తూనే ఉంది. ఆఖరికి ఒకరోజు అమ్మ కళ్లనీళ్ల పర్యంతమయి, “ఆనాడు అత్తగారు సాధించింది. ఇప్పుడు కూతురై సాధిస్తోంది. ఏజన్మలో శత్రుత్వమో” అంది విసుగ్గా.

ఆమాట కల్యాణికి కష్టమనిపించింది. కానీ, తనేం చెయ్యగలదు?

ఏడెనిమిది నెలలతరవాత, ఒకరోజు భోజనాలదగ్గర అమ్మ మెల్లిగా మొదలుపెట్టింది, “అతనికి డాన్సూ, సంగీతం అంటే చాలా యిష్టంట.”

కల్యాణి తలొంచుకుని భోజనం చేస్తోంది.

“ఏమో, నీ అదృష్టం బాగుంటే, పెళ్లయేక అతనే చెప్పించుకోకూడదూ. .. ”

కల్యాణి జువ్వలా లేచింది. “అలాంటిమాటలు నాతో ఎప్పుడూ అనకమ్మా! పద్ధెనిమిదేళ్లు పెంచిన మీకు అర్థం కాలేదు నా ఆశలేమిటో .. ఇంక … ఇంక … “ కల్యాణి మాట్లాడలేక లేచి వెళ్లి పోయింది. వెళ్లిపోతూ, గుమ్మందగ్గర నిలబడి, “ఇంక నన్నేమీ అడక్కండి. నాతో చెప్పకండి. మీయిష్టం ఎలా ఉంటే అలా చెయ్యండి,” అనేసి వెళ్లిపోతున్న కల్యాణికి “దీనికింకా చిన్నతనం ఒదల్లేదు,” అని అమ్మ అనడం వినిపించింది.

నెలరోజులనాడు కల్యాణికీ మురారికీ వైభవంగా పెళ్లి జరిపించేరు పెద్దలంతా కలిసి.

పెళ్లి అవగానే, మురారి కల్యాణిని తీసుకుని గుంటూరు వెళ్లిపోయాడు.

                                                          000

మురారికి నాటకాలూ, సంగీతం పిచ్చి ఎక్కువే. నాట్యకళాసమితుల్లోనూ, గానకళాసంఘాల్లోనూ ఎప్పుడూ ములిగి తేలుతూండేవాడు. కల్యాణి మొదట్లో ముభావంగా ఊరుకున్నా, తరవాత్తరవాత మురారి బలవంతంమీదా, అతను టిక్కెట్లు కొనేస్తూ ఉండడంవల్లా అతనితోపాటు తను కూడా నాటకాలకీ, గానసభలకీ వెళ్లడం మొదలు పెట్టింది. అయితే ఇంటిదగ్గర మాత్రం మురారికి ఆ విషయాలు చర్చించడానికి వీలుండేది కాదు. క్రమంగా ఇంట్లో “సంగీతం” అవాచ్యంగా మారి ఊరుకొంది. అదొక “టాబూ.” అసంస్కృతం.

రోజులు గడుస్తున్నకొద్దీ కల్యాణికి ఏదో వెలితిగా, చికాగ్గా ఉండసాగింది. ఏదో భరించలేని ఆవేదనగా ఉంటుంటే, ఆఖరికి ఒకరోజు ఆలిండియో రేడియో, బెజవాడ వాళ్లకి వాయిస్ టెస్ట్ ఇవ్వమని కోరుతూ ఒక ఉత్తరం వ్రాసి పడేసింది. వారంరోజులనాడు జవాబు వచ్చింది. ఆ ఉత్తరం అప్పుడే ఆఫీసునించి వస్తూన్న మురారి అందుకున్నాడు.

“ప్రభుత్వంనుంచి తమరికొచ్చే తాఖీదులేమిటో?” అన్నాడు మురారి కవరుమీదున్న సర్విస్ స్టాంపులు చూస్తూ.

“విప్పి చూస్తే సరిపోతుంది కదా,” అంది కల్యాణి కాఫీ డికాక్షను కలుపుతూ.

మురారి సావిట్లో కుర్చీలో కూర్చుని కవరు విప్పి చూశాడు. అతని కనుబొమలు ముడివడ్డాయి.

“ఏమిటిది కల్యాణీ?”

కల్యాణికీ తెలీలేదు. “ఏమిటండీ?” అంది దగ్గరికి వస్తూ.

“రేడియోవాళ్లు వాయిస్ టెస్టుకి ఈ శనివారం రమ్మని వ్రాశారు. నువ్వు వాళ్లకి వ్రాసావా?” అడిగేడు మురారి.

అప్పుడు అర్థమయింది కల్యాణికి. “ఆఁ. నేనే రాసేను. ఏం తోచడంలేదు. అందుకు,” అంది.

“ప్చ్. ఇవాళ రేడియోలో, రేపు స్టేజిమీదా, ఎల్లుండి డ్యాన్సూ .. ఇవి నాకు నచ్చవు కల్యాణీ. ఛ,” అన్నాడు  కళాభిమానీ, రసజ్ఞుడూ, విద్యావంతుడూ అయిన మురారి.

కల్యాణి తృళ్లిపడింది. మరుక్షణంలో కల్యాణి అక్కడ లేదు. ఆసాయంత్రం మురారికి కాఫీ రాలేదు.

ఏమాత్రమో మిగిలిన చివరి తల్లివేరు కూడా ఆ ఛీత్కారంతో మాడిపోయింది.

ఆతరవాత వారం, పదిరోజులనాడు మురారి హడావుడిగా వచ్చి, “వంట వేగిరం కానియ్. ఏకా దండయ్యపంతులు హాల్లో గోటువాద్య కచేరీ ఉంది. టికెట్లు తీసుకున్నాను,” అని చెప్పాడు.

“నేనివాళ రాలేను. మీరు వెళ్లి రండి,” అంది కల్యాణి శాంతంగా.

“ఏం?”

“తలనొప్పిగా వుంది.”

“మాత్ర వేసుకుంటే అదే పోతుంది. ఇతను గోటువాద్యం చాలా బాగా వాయిస్తాడని అందరూ చెప్పుకుంటారు, పద,” అన్నాడు మురారి.

కాని కల్యాణి మటుకు రాలేనని ఖచ్చితంగా చెప్పింది. ఆ స్వరంలో నిశ్చయాన్ని చూసి మురారి మాట్లాడకుండా వెళ్లిపోయాడు.

ఆ తరవాత రెండు, మూడు మార్లు కూడా కల్యాణి అలాగే చెయ్యడంతో మురారికి ఏదో అనుమానం వచ్చింది.

“ఏం? ఈమధ్య నువ్వు అసలు వేటికీ రావడంలేదు.” అన్నాడు.

కల్యాణి మటుకు అది సాధారణమే అన్నట్లు, “ఏం లేదు. రావాలని ఉండడంలేదు,” అంది.

“తీరిపోయిందేమిటి సరదా?” అని మందహాసం చేశాడు మురారి.

“ఆఁ, మీసాంగత్యంలో,” మెరుపులా జవాబు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది కల్యాణి.

“నేనేం చేశాను? లోకాన్ని, మనుషుల్నీ అర్థం చేసుకోడం నేర్చుకోవాలి తను,” అనుకున్నాడు మురారి నేరం ఒప్పుకోలేని మనస్తత్త్వంతో.

                                                                   000

“సుపుత్రుడు ఉత్తరం రాసాడు,” అన్నాడు మురారికొడుకు హరి రాసిన ఉత్తరం కల్యాణిమీదకి విసిరి.

“ఏం రాసాడు?” అంది కల్యాణి ఉత్తరం తీసుకుంటూ.

“లక్ష్మీ సమానురాలయిన అమ్మకి,

    నేనిచ్చిన టెలిగ్రాం అందిందనుకుంటాను. పాప ముమ్మూర్తులా నీ పోలికే. ఇంకా నెలైనా కాలేదు. అప్పుడే కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ ఎలా ఆడుతోందా తెలుసా? జానకి ఏమో నీలాగే ఉంటుందనీ, నీపేరే పెడతాననీ అంటోంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివిట. పాప కూడా నీ అంత అదృష్టవంతురాలు అవాలిట. మరి నువ్వెప్పుడొస్తావు చూడడానికి? జానకి పాపకి డాన్సు నేర్పిస్తానంటోంది.

                                                                                      ఇట్లు

                                                                                      హరి

కల్యాణి కళ్లు మూసుకుంది. పాప తన పోలికట! ఎలా ఎక్కడినించి వస్తాయి ఈ పోలికలు? తనని తన నాయనమ్మ పోలిక అనేవారు. మళ్లీ తన మనుమరాలు తనని పోలింది? ఇలా ఒకళ్ల నీడలు మరొకళ్లమీద ఎందుకు పడతాయి? ఇలా తాతమూకుడు తరతరాలా ఎందుకు వస్తుంది? తన అదృష్టం?  ఏ విషయంలో తను అనుకున్నది అనుకున్నట్టు జరిగిందని? తను సాధించిందేమిటి? తనని పోలిందట. డాన్సు నేర్పిస్తారుట! ఈవయసునుండీ పెంచుకున్న ఆశలు …

“మనవరాల్ని తలుచుకుని మురిసిపోవడమేనా? నాకు కాఫీలాంటిది ఇవ్వడం ఏమైనా వుందా?” అని మురారి నవ్వడంతో కల్యాణి కళ్లు తెరిచి ఈలోకంలో పడింది.

కాఫీ పెట్టి తెస్తున్న కల్యాణికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఔను, నిజమే. నాయనమ్మకి తనపాటి విద్య లేదు. ఆవిడకంటె తను మెరుగే. తను సాధించలేనిది ఈపాప సాధించదని ఎందుకు అనుకోవాలీ?

“దానికి ‘విజయభారతి’ అని పేరు పెట్టమని రాయండి. మీకు శలవు దొరగ్గానే చూడ్డానికి వెళ్దాం” అంది కల్యాణి దరహాసవదనంతో.

చాలాకాలానికి కల్యాణిమొహంమీద వెలిగిన చిర్నవ్వుని ఆశ్యర్యంగా చూశాడు మురారి.

(ఆంధ్రసచిత్రవారపత్రిక. సెప్టెంబరు 8, 1963)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “నడుస్తున్న చరిత్ర”

 1. మీ స్పందనకి ధన్యవాదాలు. ఒక చిన్న మనవి. తెలుగు ఇంగ్లీషులిపిలో నాకు బాగుండదు. ఇంగ్లీషులో రాయడమే నయం. మళ్లీ తీరిగ్గా చదివేను మీరు ఇంగ్లీషులిపిలో రాసిన తెలుగు వాక్యాలు, మీరు నడుస్తున్న చరిత్రగురించి రాసినట్టు ఇప్పుడే గమనించేను. ఏం చేస్తాం అంటే ఇలా కథగా చదివినప్పుడు వందమందిలో ఒకరైనా ఆలోచించుకుంటారేమోనని. అంతే.

  మెచ్చుకోండి

 2. anything is encoraged as long as it can get success,fame and money..that is the reality now! pillalakaina sare ..ade modati prasna tandrula nunchi..nerchukuni emchestaru..nerchukodame cheyyadam ani ardham kani rati hrudayaalaki em cheppali..

  మెచ్చుకోండి

 3. బాగుందండీ ౧౯౬౩ కథ !

  ౨౦౧౬ మధ్య అర్ధ శతాబ్ది రెండు తరాలు మారిన వేళ !

  మారుతున్న వేళ !

  తరముల అంతర ముల నం
  దు రమణి మారెను జిలేబి దూరా లెన్నో
  చరవాణి వోలె చట్టున
  చురుకమ్మా లతికవోలె చుక్కల కెగిరెన్ !

  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. నాక్కూడా అలా అవుతోందండి. చదివేనని మరిచిపోవడం. పోతే, ఇప్పుడు ఆడపిల్ల మెట్టినిల్లు కన్నా ఎంచుకున్న ఉద్యోగం కొన్ని నిర్ణయాలు చేస్తున్నట్టు లేదూ? 🙂

  మెచ్చుకోండి

 5. ఇది ఇంతకు మునుపే మీరు ప్రచురించారు, నేను చదివాను అని గమనించుకోలేదు. మొత్తం మళ్ళే చదివేశాను. వ్యాఖ్య రాద్దామని వస్తే ఆరేళ్ళ కిందటి వ్యాఖ్య వెక్కిరించింది. తమాషా ఏంటంటే సరిగ్గా అవే మాటలు మళ్ళీ అనుకున్నా, వ్యాఖ్య రాద్దామని 🙂

  మెచ్చుకోండి

 6. @ కొత్తపాళీ, నిజమేనండీ ఆశావహంగానే ముగించేను. యాభైఏళ్లకి ముందు కనక కావచ్చు. :). మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 7. So very true.
  ఇప్పటికీ, ఆడపిల్ల ఎంత సమర్ధురాలైనా, ఆమె సామర్ధ్యం వినియోగపడుతుందా, అడవి కాచిన వెన్నెలవుతుందా అన్నది ఆమె మెట్టినిల్లే నిర్ణయిస్తున్నది.
  అందులోనూ తరానికి తరానికి మార్పు ఉంది. ఈ ఆశావహమైన ముగింపు ఇచ్చి కథకి మరింత అందం తెచ్చారు.

  మెచ్చుకోండి

 8. మాలతి గారు,
  కధ బాగుందండి.. సమస్య ను తేలిక గా చిన్న పదాలలో కూర్చి ఎంత బాగా చెప్పేరు అండి. నాకు చాలా నచ్చింది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s