“ఋణానుబంధ రూపేణ …”

 “అయితే ఆ మిషను ఏమైంది మామయ్యా?” అన్నాను భయపడుతూ, భయపడుతూ.

ఆయన మామయ్య కాదు గానీ పెద్దవాళ్లని పేరు పెట్టి పిలవకూడదు కనక …“చంపీశావ్, నేను మర్చేపోయాను” అన్నారు మామయ్య.

ఏంచెప్పను? “అఖిలభారత కుట్టుయంత్రాల” చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఒక మహద్యంత్రాన్ని పట్టుకుని, “మర్చేపోయేను” అంటుంటే.  

తనసొమ్మ కాదు గనకనే తీసుకెళ్లి ఎవరో చచ్చిపోయిన దివాన్‌గారి జవాన్‌కి (చచ్చిపోయింది జవాను) ఎరువిచ్చి తిరిగి చూడకుండా ఊరుకోగలిగేడు!

                                                000

రెండు సంవత్సరాలక్రిందట —

తిథివార నక్షత్రాలన్నీ సమకూడిన ఒకానొక శుభసమయంలో టైలరు నాజాకెట్లు పాడుచేసి తీసుకొచ్చాడు.

“ఒకమిషను కొనేద్దాం అమ్మా” అన్నాను.

“కొనేద్దాం” అంది అమ్మ.

రెండురోజుల అనంతరం “మంగళవారం శంకరం మిషను తెస్తాడు” అని చెప్పింది.

నేను సోమవారం వెళ్లి జాకట్ పీసెస్ తెచ్చేశాను.

మంగళవారం నేను స్కూల్‌నించి వచ్చేసరికి మిషను ఇంట్లో వుంది! నాపుట్టినరోజుకేనా అంత సంభ్రమం కలగలేదు! ఆతృతగా మూత తీశాను!

కళ్లు తిరిగాయ్!

“సెకండ్ హాండా?” అన్నాను సహం చచ్చి.

 “అయితే ఏం? మిషన్ చూడు,” అన్నాడు శంకరం గంభీరంగా.

మరోమాటు చూశాను. దానికి షటిలూ, బాబినూ లేవు. హాండ్‌వీల్ వుంది కానీ దీనికి ఎటాచ్ చెయ్యాలి. కొన్ని స్క్రూస్ లూస్‌గా వున్నాయి. కొన్ని ఊడి రావడమే లేదు. మిషన్ అనిపించుకునే ఒక ఇనపడొక్కులో అంతకన్న ఉండగల లోపాలేమిటో నాకు తెలీదు.

ఎలాగైతేనేం – ఆయంత్రాన్ని బాగుచేయడానికి ఇచ్చాం. పదిరోజులవుతుంటే, అది మనది కాదనీ, ఆ మిషన్‌గలవారు ఢిల్లీ వెళ్లిపోతున్నారనీ (అక్కడ రిపేర్ చేసేవాళ్లు లేరనీ!) యమర్జంటుగా కావాలనీ మంగళవారం ఇచ్చేయమనీ ఆరిపేరర్‌కి చెప్పాం. ఆదుర్దా మరి!

“అలాగేనండీ” అన్నాడుతను వ్యాపారలక్షణంగా.

 పైన వివరించబడిన “మంగళవారం” మూడుమాట్లు గతించింది. నాజాకెట్ పీసెస్ అయితే పురుగులు కొట్టేశాయి కూడాను.

“చూడమ్మా చిట్టితల్లీ! స్కూల్నించి వచ్చేప్పుడు ఒకమాటు అడగవే, దార్లోనే కదా ఉంది” అని బతిమాలితే, చెల్లి మరీ ఎగిరింది, “నేను వెళ్లను ఆషాపుకి. ఆ రాస్కెలు మనమాట వినిపించుకోడూ! దొరగారూ, తమర్నేనండీ అని చెప్పాలి. కలకత్తానించి సామాను రావాలంటాడు.”

“కలకత్తా ఏమిటే? మాతో జర్మనీ అని చెప్పాడు.”

“ఏమో నాకేం తెలుసూ!” అంది.

పచ్చి అబద్ధం. అమ్మతో నేఁ చెప్తుంటే అది వినడం నేను చూశాను. ఏం చెయ్యను? కాలగతి లెమ్మని ఊరుకున్నాను. అప్పటికి మిషనుమీద అభిమానం మూడువంతులు చచ్చింది.

“మంచి గొడవే తగిలించేవోయ్,” అంది అమ్మ శంకరాన్నిచూడగానే.

“నేనేం చేశానండీ?” అన్నాడు తెల్లబోతూ.

“ఆ రిపేరరు చూడు ఏం చేస్తున్నాడో.”

“ఇంతా చేస్తే అది పని చేస్తుందా?” అన్నాను నేను.

“చూస్తూ వుండు. అది ఎంత మంది మిషన్ తెల్సా?”

“చాలా మంచిది. అసలు అలెగ్జాండర్‌కి పురుషోత్తముడు పంపిన ఉత్తమకానుకల్లో ఇదొకటి.”

“ఇదేమాట గుర్తుంచుకో. ఆదివారం మిషన్ తెస్తాను,” అంటూ శంకరం వెళ్లిపోయాడు. సూర్యచంద్రులు గతులు తప్పకుండా “అన్నప్రకారం” ఆదివారం మామిషను మాకిచ్చేశాడు.

భోజనాలు సగం ముగించి గబగబ మిషనుదగ్గర చేరాం అంతా. అక్కకి కత్తిరింపులు వచ్చు కనక (నాకు రావు గనకనూ) అది కత్తిరించడానికీ, నేను కుట్టడానికీ ఒప్పందం అయిపోయింది.

“నేను ఇది తిప్పుతానే” అంటూ తయారయింది ముద్దులచెల్లి.

“వీల్లేదు వెళ్లు. ఆరువేల తొమ్మిదివందలఎనభైమూడుని అయిదులక్షల అరవైమూడువేలు పెట్టి హెచ్చించి తీసుకురా” అన్నాను మందలింపుగా.

“అమ్..మ్…మ్… మా” అంటూ అది కెనడియన్ ఇంజనులా కూత పెట్టింది.

“స్…స్…స్  ముయ్యి నోరు. నడు అవతలికి. లెఖ్కలు చెయ్యకపోతే నాన్నగారితో చెప్తాను. తెలుస్తోందా?”

“అయితే నాకు రుమాళ్లు కుట్టిస్తావా?”

“నీకెందుకూ రుమాళ్లు?”

“అన్నీ మాసిపోయేయి.”

“నాన్సెన్స్. నీదగ్గర మాయడమేమిటి? రంగు మారుతుందంతే. నిప్పుల్లో వేస్తే కాలవు. నీళ్లల్లో వేస్తే నానవు నీరుమాళ్లు.”

“అం …మ్….మ్..” రెండో ప్రసారంతో అక్క బాధ పడింది.

“అబ్బబ్భ కుట్టిస్తాననకూడదా. నువ్వెళ్లు చంపకం, వూరికే చంపక. నేను కుట్తాను,” అంది.

“చూడు కుట్టినవి” అన్నాను రెండు అక్కముందు పడేస్తూ.

“రెండింట్లోనూ మూడోది బాగా వచ్చినట్టుంది”.

“అబ్బే. ఇదీ ఇక్కడ కుట్టు బాగానే వచ్చింది,” అంది క్రింద మడిచిన అంచు చూపిస్తూ.

“అవును సుమా,” అన్నాను. అక్కడ అసలు కుట్టు పడనేలేదు!

“ఆమాత్రం చేతకాదూ,” అనేసరికి నాకు అభిమానం నిజంగానే దెబ్బ తింది.

“ఊఁ. గీతలు గీసుకుని పకపక కత్తిరించేసినట్టే? ఇవతల మడత చూసుకోవాలి. బాబిన్‌లో దారం చూడాలి. లైను తప్పకుండా చూడాలి. సూది దగ్గర దారం చూస్తే నాన్‌కోఆపరేట్ చేస్తూంది. Needle and thread raceకి బాగా ప్రాక్టీసు అవుతోంది. ఎన్ని పాట్లు ఈ బొక్కిమిషనుతో. కత్తిరింపులకేముంది, మూడేళ్లపిల్ల చెయ్యగలదు కత్తెర అందిస్తే,” అన్నాను. ఎంత కొత్త పార్టులు వేసినా అది సెకెండ్ హాండే మరి!

                                                000

మూడు నెలలు గడిచిపోయేయి.

ఒకరోజు మామూలుగానే స్కూలికి వెళ్లేను. స్కూలు అయిపోగానే మామూలుగా తిరిగిరాగానే మామూలుగా కనిపించే మిషను కనిపించలేదు.

“చంద్రం వచ్చాడు. అతనికూతురు అదేదో పరీక్షకెళ్తోందిట.”

“అదేదో పరీక్షకి ఆవిడెవరో వెళ్తే మనమిషను ఎందుకు?”

“నాలుగురోజులు వాడుకొని ఇచ్చేస్తానన్నాడు,” అంది అమ్మ.

ఆవేళ (ఆవేళనించీ) మిషను అవుసరమయిన పనులెన్ని నాకు తటస్థించేయో లెఖ్కలేదు. గత రెండునెలలనుంచీ కనిపించని గలీబులూ, జాకెట్లూ, రుమాళ్లూ ఒకటేమిటి అన్నీను. అదే కాబోలు మానవనైజమంటారు.

బర్మాషెల్ కేలండరుప్రకారం ఎనిమిది నెలలు గడిచేయి కానీ మామయ్యలెక్క ననుసరించి నాలుగు రోజులు అవలేదు. (ఇటువంటి విషయాల్లో ఆయనది బ్రహ్మకల్పం అనుకుంటా!). ఆతరువాత రెండుసార్లు కనిపించాడు కానీ ఈవిషయం ఎత్తితే “రేపు పంపించేస్తాన్లేవే” అనేవాడు మొహం చిట్లించి.

ఏదో పనిమీద ఢిల్లీ వెళ్లిన శంకరం ఆరోజే వచ్చాడట. మర్నాడు మాయింటికి వచ్చాడు.

“అన్నట్టు – మిషను – ఏదీ? వర్కింగేనా?”

“వర్కింగ్ కాదు. వాక్ అవుట్ అయింది.”

“ఏమయింది?”

“మాచంద్రంమామయ్య లేడూ? ఆయనేమో కూతురు కుట్టుపరీక్షకెళ్తోందని ఇది తీసుకెళ్లి ఎవరో చచ్చిపోయిన దివాన్‌గారి జవాన్‌కి ఎరువిచ్చాడట.”

“అదేమిటి?” అన్నాడు శంకరం ఏం అర్థం కాక.

“ఏమీ లేదు. ఇక్కణ్ణుంచి తీసుకెళ్లిపోయాడు. అదీ ముఖ్యవిషయం. ఇప్పుడేమో అంతటి జవాన్‌గారికి ఎరువిచ్చి తిరిగి పుచ్చుకోవడమేమిటని గప్‌చిప్‌గా ఊరుకొన్నాడు,” అన్నాను కసిగా.

“ట్రాజెడీయే చేశారు మొత్తానికి” అన్నాడు శంకరం వెనక్కి జేరబడుతూ.

“ఏం?” అంది చంపకం.

“అది మాది కాదు. మాఅమ్మ తల్లి ఎండ్ పినతల్లికి కామన్ ప్రాపర్టీ. అదే – ఆ బాబిన్, షటిలూ అన్నీ పినతల్లిదగ్గిర ఉండిపోయేయి చిన్నఫైట్‌లో.”

నాకర్థం కాలేదు. ఫైట్ జరిగితే కేవలం షటిలూ, బాబిన్ ఊడదీసి పట్టుకుపోవడం ఏమిటి? ఆమాటే అంటే అతనికీ అర్థం కాలేదు.

“అదంతా నాకు తెలీదు . ఇంజినీరుని కనక బాగుచేసుకో అని మనకి ప్రెజెంట్ చేసేసింది. ఇంతకీ ఇప్పటి కథాభాగం ఏమిటంటే ఆవిడ అమ్మాయేమో అది కావాలంటోందిట. అక్కడ బాగుచేసుకుంటాం పంపించమని వ్రాసింది.”

“ప్రెజెంట్ చేసినది తిరిగి తీసుకోవడమేమిటి?” అన్నాను, అంతకన్నా ఏమీ చెప్పలేక.

“ప్రెజెంట్ అంటే అదే రిపేరు చెయ్యమని,” అన్నాడు నవ్వుతూ.

“అయితే ఇవాళ సాయంత్రం ఆయన వస్తారు. అడుగుతా,” అన్నాను ఏదో ఒకటి చెప్పాలి కనక.

సాయంత్రం నిజంగానే మామయ్య వచ్చారు. అర్జంట్ పనిమీద అమెరికా వెళ్లి ఇప్పుడే వస్తున్నారుట.

అడగనా వద్దా అని ఆలోచిస్తున్నాను. శంకరంకి ఏం జవాబివ్వాలని కాదు, శంకరం వాళ్లమ్మమ్మకి ఏం జవాబు చెప్పుకుంటాడనీ కాదు నాబాధ – ఎవరో నామరూపాలు తెలియనివాళ్ల యంత్రం తెచ్చి మేం బాగు చేయిస్తే, మరొకరెవరో వాడుకుంటున్నారే!  ఏమనాలి దీన్ని? పశు, పత్ని, సుతాదులలాగే మనం పోగు చేసుకునే యంత్రాలు కూడా ఋణానుబంధమేనేమో మరి.

(తెలుగు స్వతంత్ర ఆగస్టు 26, 1955).

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on ““ఋణానుబంధ రూపేణ …””

 1. చేర్చు కోవాలి పశు, పత్నీ ,సుతుల తో పాటు యంత్రాలని కూడా..ఈ కొత్త తరం లో అయితే లాప్టాప్ లు..మొబైల్స్…ఇలా ఎన్ని కొత్త ఆవిష్కరణలు అయితే ఆ లిస్ట్ అంత పొడుగు పెరుగుతుంది.బావుంది madam.. కధ.. అభినందనలు

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. >>“రెండింట్లోనూ మూడోది బాగా వచ్చినట్టుంది”.

  “అబ్బే. ఇదీ ఇక్కడ కుట్టు బాగానే వచ్చింది,” అంది క్రింద మడిచిన అంచు చూపిస్తూ.

  “అవును సుమా,” అన్నాను. అక్కడ అసలు కుట్టు పడనేలేదు!
  చాలా సరదాగా చెప్పారండీ కధ!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.