ఆచార్య నాయని కృష్ణకుమారిగారు – జానపదసాహిత్య విదుషీమణి.

కృష్ణకుమారిగారు జానపదసాహిత్యం,  స్త్రీలసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆద్యులలో ఒకరు. ఆమె రంగంలో ప్రవేశించేనాటికి, జానపదవాఙ్మయానికి సాహిత్యస్థాయి లేదు. ఆనాటిపండితులదృష్టిలో అది కేవలం పామరులు ఎవరికి తోచినట్టు పాడుకున్న పాటలూ, చెప్పుకున్న కథలూ మాత్రమే.

యూనివర్సిటీలలో పండితులఆదరణకి నోచుకోని ఒక సాహిత్యప్రక్రియని చేపట్టి, దానికి సాహిత్యస్థాయి కల్పించిన విదుషి కృష్ణకుమారిగారు.

Nayani Krishna Kumariఆనాటిపరిస్థితిలో జానపదవాఙ్మయ అధ్యయనాన్ని ఆమె మూడు భాగాలుగా విభజించారు. మొదటిది జానపదవాఙ్మయాన్ని సాహిత్యంగా గుర్తించనిరోజులు, రెండోదశలో జానపదుల పాటలూ కథలూ సేకరించడం జరిగింది. అంతకు పూర్వం ఖండవల్లి లక్ష్మీ రంజనంగారు జానపదసాహిత్యానికి సాహిత్యస్థాయి కల్పించారు. మూడో దశలో బిరుదురాజు రామరాజుగారితో కలిసి కృష్ణకుమారిగారు రంగంలో ప్రవేశించి జానపదవాఙ్మయానికి సాహిత్యవిలువలు ఆపాదించి, సాధికారంగా నిరూపించారు.

జానపద సాహిత్యాన్ని విశ్లేహించేవిధానంలో నూతనపద్ధతులు ప్రవేశపెట్టిన ఘనత కృష్ణకుమారిగారిదే. గణితశాస్త్ర సూత్రాలు ప్రాతిపదికగా జానపదసాహిత్యం విశ్లేషించాలని సశాస్త్రీయంగా నిరూపించి చూపించారు.

ఈసాహిత్యప్రక్రియని అధ్యయనం చేయడానికి మడతకుర్చీ అధ్యయనం (armchair research) పనికిరాదంటారు కృష్ణకుమారిగారు. ఆఫీసులోనో లైబ్రరీలోనో కూర్చుని పుస్తకాలు చదివి జానపదసాహిత్యాన్ని అవగాహన చేసుకోడం జరగదు. జనపదాలకి వెళ్లి, ఆ కథలు చెప్పేవారితోనూ, పాటలు పాడేవారితోనూ మాటాడాలి. దానికి ఎంతో ఓపిక కావాలి. జనపదులతో మాటాడుతున్నప్పుడు వారికి అర్థమయే భాషలో మాటాడాలి. వారు చెప్పింది సావధానంగా విని, నిశితంగా పరిశీలించి, ఒక అవగాహన ఏర్పరుచుకోవాలి. విశ్లేషించేవిధానంలో కొన్ని ప్రత్యేకసూత్రాలు పాటించాలి అంటారామె.

తాను స్వయంగా అనేక పల్లెలికి వెళ్లి లెక్క లేనన్ని స్త్రీలపాటలూ, కథలూ సేకరించారు. టేపురికార్డులవంటి పరికరాలు లేనిరోజుల్లో, ప్రయాణసౌకర్యాలూ అంతంత మాత్రమే అయిన ఆ రోజుల్లో ఆమె ఎంత సమాచారం సేకరించేరో చూస్తే ఆమె నిష్ఠ ఎంత పటిష్ఠమయినదో తెలుస్తుంది మనకి.

కృష్ణకుమారిగారు స్వతస్సిద్దంగా సాధుశీలి. ఆమె కవితలలో, విమర్శలలో ఆ తత్త్వాన్నే ఆహ్వానిస్తారు. అగ్నిపుత్రికి తన ముందుమాటలో తనకవిత “నాకు నేనుగా చేసే అంతరంగావిష్కారం మాత్రమే” కానీ తన కవితలో

అనల్ప కల్పనా శిల్పం లేదు

అంగార తల్పం లేదు

నాకవిత తళతళల్లో

అసలేటి బంగారపుటిసుక

మిసమిసలు లేవు

అమృతం లేదు.

… … …

అనుభవంతో పరిమళించే

ఫలసంపెంగలాంటి

అంతరంగం నిండిన నా కవితలో

లోకంమీద అసహనం లేదు

– అంటారు.

ఆమె లెక్చరరుగా పని చేస్తున్నరోజుల్లో విద్యార్థులతో కాశ్మీర్ విహారయాత్రకి వెళ్లినప్పటి అనుభూతులు “కాశ్మీర దీపకళిక”లో ఆవిష్కరించి, యాత్రారచనకి కొత్తబాట వేశారు. “అది కేవలం ఒక యాత్రాకథనం కాదు, అది ఒక వచన కావ్యం” అంటారు ప్రొఫెసర్ చేకూరి రామారావుగారు ఈ పుస్తకానికి ముందుమాటలో. ఇందులో కాశ్మీరదేశపు విశేషాలతోపాటు రచయిత్రి కవితాత్మ కూడా అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది అంటారు డా. వైదేహి శశిధర్ (లింకు ఈవ్యాసం చివరలో ఇచ్చాను.).

ఉదాహరణకి, ఈ వాక్యాలు చూడండి.

విశాలమైన మైదానంలో ఎక్కడ చూసినా కళ్ళు తనిసేంత పచ్చగా గడ్డిపరుపు చుట్టూ చూపుమేర దూరాన అన్ని శిఖరాలూ ఇంచుమించు హిమావకుంఠనంవల్ల తెల్లగా మెరుస్తున్నాయి. సూర్యకాంతి ప్రతిఫలనం వల్ల తళతళలాడే ఆ శిఖరాల్ని చూస్తుంటే అందగత్తెలంతా ఒకరిభుజాల్ని మరొకరు రాచుకుంటూ వరసగా చేరి, పడీపడీ నవ్వుతున్న భావన కలుగతోంది. మంచు లేనిచోట నల్లగా మెరిసే పర్వతశరీరం బాగా తుడిచి నునుపు చేసి నూనె దూమెరుగ్గా రాసిన ఇనుపముక్కలా ఉంది.

ప్రముఖ కవి నాయని సుబ్బారావు, హనుమాయమ్మ దంపతుల జ్యేష్ఠపుత్రిక కృష్ణకుమారిగారు. జననం గుంటూరులో 1930లో. ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు.

కృష్ణకుమారిగారు అక్షరాలా ఉగ్గుబాలతో కవిత్త్వతత్త్వం ఆకళించుకున్న కవయిత్రి. సుబ్బారావుగారు ప్రముఖసాహితీవేత్తలతో జరుపుతున్న చర్చలు వింటూ చిన్నతనంలోనే నలుగురిలో నిర్భయంగా మెలగడం, మాటాడడం నేర్చారు ఆమె.

స్కూలుచదువు నరసరావుపేట, శ్రీకాకుళం, కాలేజీచదువు గుంటూరులోనూ అయిన తరవాత తెలుగు యం.యే. చెయ్యడానికి విశాఖపట్నం వెళ్లారు 1948లో. అక్కడ ఉన్న మూడేళ్లూ ఆమె సాహిత్యాభిలాషని తీర్చి దద్దడానికి ఎంతగానో తోడ్పడినాయి.  అంతకుముందే, ఆమె బి.యే. చదువుతున్న రోజులలో ఆంధ్రులచరిత్ర క్లాసులో రాసుకున్న నోట్సు ఆధారంగా “ఆంధ్రులకథ” అన్న పుస్తకం రాసి ప్రచురించారు. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లు. ఆపుస్తకం ఆనాడు స్కూళ్లలో పాఠ్యపుస్తకంగా తీసుకుంది ఆంధ్రప్రభుత్వం.

విశాఖలో ఉన్నప్పుడు ఆమెకి అనేకమంది ప్రముఖ రచయితలతో పరిచయం అయింది. కృష్ణకుమారిగారు విశేషంగా సాహిత్యసభలలో, నాటకాలలో పాల్గొంటూ, తన సాహిత్య కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు.

కృష్ణకుమారిగారికి విశాఖపట్నంతో కలిగిన అవినాభావసంబంధం, విశాఖపట్నం అంటే ఆమె ఏర్పర్చుకున్న ఆత్మీయతా “విశాఖ, నా నెచ్చెలి” అన్న కవితలో సాక్షాత్కారమవుతాయి మనకి. విశాఖపట్నంతో ఏమాత్రమయినా పరిచయం వున్నవారిని ఆర్ద్రంగా తాకుతుంది ఈ కవిత.

ఉత్తుంగ తరంగ తాడిత

పృథు శిలా సంకులిత

సైకత తీరాన

ఈ విశాఖలో

నా అడుగుల ముద్రలు

ఎన్నెన్నో ఏళ్ల వెనుక!

నేను నడిచిన తీరరేఖల

నిస్తుల సౌందర్య కాంతులు

నిండుగా మెరిసిపోతూ

ఇప్పటికీ నాలో!

…        …        …

కర్పూర గంధస్థగిత

నిర్భర మరుద్వీచికలా

చల్లగా చుట్టుకునే

చెరపరాని స్మృతి విశాఖ

నాకూ ఈగడ్డకూ మధ్య

కాలం దించిన నీలితెరలు

భవనాలై రాజ మార్గాలై

కిటకిటలాడే

ఆశేష జనసందోహ సంభ్రమాలై

…        ….       ….

ఆత్మను పోల్చుకోనీయని

అతి చిక్కని మాయావరణంలాగా

నాకూ ఈ విశాఖకూ మధ్య

నానాటికీ పెరిగిపోయే

నాగర జీవన వైఖరి (1978)

ఇక్కడ విచారకరం ఏమిటంటే కృష్ణకుమారిగారు వర్ణించిన “నాగర జీవనవైఖరి” ఈనాడు విశాఖలో కూడా కటికనిజం.

ఈకవిత ఆమె తొలిసంకలనం, “అగ్నిపుత్రి” (1978) లో చేర్చబడింది.

ఆమె విశాఖలో “విద్యాగంధాన్ని చిక్కగా అలదుకుంటున్నవేళ”ల్లోనే, “కాలాతీతవ్యక్తులు” రచయిత్రి, డా. పి. శ్రీదేవిగారితో పరిచయం అయింది కృష్ణకుమారిగారికి. ఆతరవాత ఆమెతల్లి అస్వస్థులు కాగా, శ్రీదేవి ఆమెకి చికిత్స చేసేరట. శ్రీదేవిగారి అకాలమరణం ఆమెని బలంగా కలచివేసింది. ఆ మనోవేదనే “ఏం చెప్పను, నేస్తం” అన్న కవిత అయి ప్రభవించింది.

ఆద్యంతాలకందకుండా

ఆవేశాకావేషాల రంగులు పట్టని

అచ్ఛాత్మ స్వరూపనైన నేస్తం

ఏం చెప్పను నిన్ను గురించి

…        …        …

ఆపదల పడవలో ఎక్కి

ఆలోకపు టంచుల్ని మెట్టబోయిన అమ్మను

ఆపి మళ్లీ మామధ్య వదిలిన

మృత్యుంజవని చెప్పనా నిన్ను నేస్తం?

…        ..        …

అంటూ తననెచ్చెలిని తలుచుకుంటూ, ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ కలుస్తాం అన్న ఆశాభావం వెలిబుచ్చుతారు.

ఎప్పుడో ఒకనాడు

రెండు లోకాలు కలిసే సరిహద్దు గీత మీద

నువ్వు నవ్వుతూ నాకెదురుగా వచ్చినప్పుడు

అంతరంగంలో నువ్వంటే

నాకెంత యిష్టమో

అంతా నిజంగానే చెప్తాను నేస్తం! (1962)

తరవాత అదేపేరుతో అమె తన రెండవకవితాసంకలం 1988లో వెలువరించారు.

కృష్ణకుమారిగారు తెలుగు యం.ఏ. అయినతరవాత, మద్రాసులో ఒక ఏడాది లెక్చరరుగా పని చేసి, తరవాత హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరరుగా మొదలు పెట్టి, రీడరయి, ప్రొఫెసరయి, ఆతరవాత, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‍గా రిటైరయేరు 1999లో.

ఉస్మానియా యూనివర్సిటీలో తిక్కన కవితావైభవంమీద పి.హెచ్.డి మొదలు పెట్టేరు కానీ పూర్తి చేయ్యలేదు. ఆతరవాత, ఆమె భర్త మధునసూదనరావుగారూ, మిత్రులు అంతటి నరసింహంగారూ ప్రోత్సహించగా, తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, “జానపదగేయగాథలు” అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. (ఆమె ప్రతిపాదనలు మరింత విపులంగా నా ఇంగ్లీషువ్యాసంలో చర్చించాను.). ఆ తరవాత ఆమె తన దృష్టి అంతా జానపదసాహిత్యంమీదే కేంద్రీకరించడంతో తెలుగుసాహిత్యానికి జరిగిన మేలు అద్వితీయం.

కృష్ణకుమారిగారు స్వభావతః ఎంతో ఔచిత్యం పాటించే వ్యక్తి. చిన్నా పెద్దా అన్న వివక్షత లేకుండా ఎవరు సాహిత్యసభలకి ఆహ్వానించినా అంగీకరించి వారిని తృప్తిపరచడం ఆమెకి ఆనందం. ఒకసారి, అంతటి నరసింహంగారు, “ఇలా మీటింగులంటూ కాలం వ్యర్థపుచ్చక పుస్తకప్రచురణలకి వెచ్చించవచ్చు కదా“ అన్నారట. దానికి జవాబుగా, “పాపం, వాళ్లు ఎంతో ఉత్సాహంతో నేను ఒప్పుకుంటానన్న ఆశతో వస్తారు. వారిని తిరస్కరించడం ఏంబాగుంటుంది?“ అన్నారుట.

మార్చి 14 నాటికి ఆచార్య నాయని కృష్ణకుమారిగారు ఎనభై వసంతాలు నిండిన పండితురాలు. హైదరాబాదులో భర్త మధుసూదనరావుగారితో, చిన్నకుమారునికుటుంబంతో కాలం గడుపుతున్నారు. వారికి ఇద్దరు అబ్బాయిలూ, ఒక అమ్మాయి.

గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమరచయిత్రి బహుమతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. దేశవిదేశాలు పర్యటించారు. లెక్కలేనన్ని సభలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ అఖిలభారత ఆంధ్రరచయిత్రుల సభలు 1963లో ప్రారంభించారు. ఆరోజుల్లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారితో పాటు కార్యనిర్వాహకవర్గంలో ప్రముఖపాత్ర వహించారు కృష్ణకుమారిగారు.

అష్టైశ్వరాలంటే ఏమిటో నాకు తెలీదు కానీ పుట్టినింటా, మెట్టినింటా సకలవిధాలా సంపూర్ణసహకారం పొందుతూ, తెలుగు సాహిత్యంలో అనర్ఘమయిన కృషి చేసిన నాయని కృష్ణకుమారిగారు ధన్యజీవులు అనే నేను అనుకుంటున్నాను.

తా.క. నాయని కృష్ణకుమారి కుమార్తె అరుణతో ఈమధ్య నేను మాటాడినప్పుడు, తల్లిగారిగురించి అన్నారు ఆవిడ ఏ విషయాలు మరిచినా సాహిత్యం ప్రస్తావనకి వచ్చినప్పుడు మాత్రం ఎన్నో విషయాలు మాటాడేసేవారు ఆపకుండా అని. సాహిత్యంతో అలా మమైక్యం అయి కృషి చేసినవారు చాలా తక్కువ. జనవరి 30, 2016 తేదీన మరణించేరు. (మాలతి, జనవరి, 30, 2016)

ఆమెపై ఇంగ్లీషులో వ్యాసాలూ, అనువాదాలకి, లింకులు కింద ఇచ్చాను. చూడండి. en.wikipediaలో ఆమె ప్రచురణలవివరాలు ఉన్నాయి.

Dr. Nayani Krishnakumari: A distinguished scholar in Folklore and Women’s literature

thulika.net/nkk

Dr. Nayani Krishnakumari’s poetry: An Overview by Dr. Vaidehi Sasidhar

thulika.net/nkkpoetry

http://en.wikipedia.org/wiki/Nayani_Krishnakumari

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

18 thoughts on “ఆచార్య నాయని కృష్ణకుమారిగారు – జానపదసాహిత్య విదుషీమణి.”

 1. కృష్ణకుమారిగారూ, నమస్కారం. మీసంతకం ఇక్కడ చూడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అమెరికా వచ్చి ఉంటే చెప్పండి. మీఅమ్మాయిదగ్గర నా ఐడి ఉంది.
  శుభాభినందనలతో,
  మాలతి

  మెచ్చుకోండి

 2. అరుణా, మీకు ఈవ్యాసం తృప్తిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణకుమారిగారి సాహిత్యవ్యాసంగంతో పాటు విశిష్టమైన వ్యక్తిత్వం కూడా సంతరించుకుని, సాహిత్యం, సాహిత్యం అంటూ కుటుంబవిలువలు నిర్లక్ష్యం చెయ్యని ఉత్తమురాలు. మీ వ్యాఖ్య చూస్తుంటే మీరు కూడా మీ అమ్మగారిలాగే ఉత్తమవిలువలు సంతరించుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఏ తల్లిదండ్రులకయినా అంతకంటే కావలసిందేముంది. మీఅమ్మగారికి నా శుభాకాంక్షలు చెప్పండి ఈసారి ఆమెతో మాటాడినప్పుడు. వారిద్దరూ అమెరికా వస్తే నాకు తప్పక తెలియజేయండి.
  శుభాకాంక్షలతో,
  మాలతి

  మెచ్చుకోండి

 3. Dear Malathi garu,
  That was an excellent article on Smt. Nayani Krishna Kumari garu. These days, it is so rare to see articles about people who are so rich with literary talents. Just as Krishna Kumari Garu had good fortune and opportunity to learn from the literary giants while she was growing up, such as ‘Viswanatha Satyannarayana Garu, Krishna Sastry garu and of course the person who influenced her the most without even a simple nudge, her own father Nayani Subba Rao garu. I too had good fortune in growing up in the midst of literary talents who came to our house now and then; great writers and scholars such as Vaasireddi Seethadevi garu, Yaddanapudi Sulochanadevi garu and C. Narayana Reddy Garu. I had the very good fortune of even meeting Devulapalli Krishna Sastri Garu when I was just a little girl, which I still remember. Most importantly I grew up listening to my grand father’s “ఆశు-కవిత్వమ్” on almost everything that appeared in front of him with so much humor. Even though I did not inherit my mother’s or my Grand Father’s literary talents, one thing I did learn from them was how to be gentle yet strong, how not to be critical of anyone at first glance and enjoy this life to the fullest by following your heart.
  Thank you once again for writing this beautiful article. Reading it brought tears to my eyes with pride.

  మెచ్చుకోండి

 4. గౌరనీయులైన మాలతి గారూ,
  నమస్కారం.
  విక్రుతి నామ తెలుగు సంవత్సర
  వుగాదిశుభాకాంక్షలు
  మీకూ,
  మీ కుటుంబ సభ్యులందరికిన్నూ…..
  అచార్య నాయని క్ర్రిష్ణకుమారి గారి
  గురించిన మీ వ్యాసం యువతరానికో
  స్ఫూర్తిదాయకమైన అక్షర విన్యాసం.
  ఒకసారి మీ రచన చదవడం ప్రారంభిస్తే
  చివరికంటాచదివించుకోగల
  శక్తి దానికుంటుంది.
  మీ మిగతా రచనలు
  అవకాశాన్ని బట్టి చదువుతాను.
  నమస్సుమాంజలులు……….
  నూతక్కి రాఘవేంద్ర రావు.

  మెచ్చుకోండి

 5. @ SSRao, మీకూ, తూలిక మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు
  @ రామ్, లంకెకి ధన్యవాదాలు.
  @ సౌమ్య, నాకు జానపదసాహిత్యంగురించి అంతగా తెలీదు. కానీ నాఇంగ్లీషు వ్యాసంలో ఇంతకంటె విపులంగా ఉంది, కావలిస్తే.
  మరొకసారి తూలికపాఠకులందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. “తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, “జానపదగేయగాథలు” అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. ఆ తరవాత ఆమె తన దృష్టి అంతా జానపదసాహిత్యంమీదే కేంద్రీకరించడంతో తెలుగుసాహిత్యానికి జరిగిన మేలు అద్వితీయం.”

  ‘జానపదగేయగాథలు’ – pdf download Link : http://www.sendspace.com/file/mfix35

  మెచ్చుకోండి

 7. మంచి పరిచయం అందించారండీ.
  ఆవిడ జానపద సాహిత్యంపై చేసిన పరిశోధనల గురించి మరింత వివరంగా రాసి ఉంటే బాగుండేది. ఏ సౌకర్యాలూ లేని రోజుల్లో అంత చేశారంటే -ఎంత ఓపికో!

  మెచ్చుకోండి

 8. మాలతి గారూ !

  నూతన సంవత్సరంలో మీనుంచి మరిన్ని మంచి రచనలు, సాహిత్య విశేషాలు, పరిచయాలు కోరుకుంటూ…ఉగాది శుభాకాంక్షలతో…

  శిరాకదంబం

  మెచ్చుకోండి

 9. @ నాకథలమీదా, డియల్.ఐ. మీదా, ఈవ్యాసంమీద మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. కృష్ణకుమారిగారికి మీ శుభాకాంక్షలు అందజేస్తాను. ఆవిడ ఎంతో సంతోషిస్తారు.
  @ సౌమ్య, సరే. చదివినతరవాత నీ అభిప్రాయం చెప్పు

  మెచ్చుకోండి

 10. చాలా మంచి పరిచయం మాలతి గారు. ఆమె గురించి విన్నాను కాని ఇంత సమగ్రమైన పరిచయం చదవలేదు. కొందైనా ఇంత గా జానపద సాహిత్య సంగీతాల మీద శ్రద్ధ తీసుకుంటున్నారంటే చాలా సంతోషం. కృష్ణ కుమారి గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు.

  మెచ్చుకోండి

 11. సంక్షిప్తంగా చక్కగా రాశారు. ఈవిడ తొలికవితల్లో నాయని,విశ్వనాధల ప్రభావం కనబడుతుంది. అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఆమె అప్పటి హేమాహేమీలైన కవులతో ఎంతో సన్నిహితంగా మెలిగినవారు. విశ్వనాధను,కృష్ణశాస్త్రిని పెదనాన్నా అని పిలిచేవారట. ఆమె రచనలలో ” కాశ్మీరదీప కళిక ” చెప్పుకోదగ్గ రచన.
  అన్నట్లు,విశాఖ నగరం చాలామంది కవులనే ప్రభావితం చేసినట్లుంది ,ఆనాటి నుండి ఈ నాటి వరకూ .

  కృతజ్ఞతలతో
  వైదేహి శశిధర్

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s