చిరుచక్రం

“డీయీవో బాబొస్తన్నాడంట”

రోజూ అయ్యగారింటికి ఆరుగంటలకి పరుగెత్తే స్కూలు ప్యూను వెంకన్న ఆరోజు అర్థరాత్రి లేచి ముస్తాబు మొదలెట్టాడు.

“బాగుండాది. సంబడం అద్దరేతిరి మద్దెలదరువని. డీయీవో అయ్నా ఆడి బాబైనా వొచ్చి నీకేటి ఒరగబెడతారు. వోరంరోజుల్నంచీ ఒక్కలా కాళ్లిరగదొక్కుకుంటున్నావ్” ఇట్నుంచి అటు వొత్తిగిలుతూ విసుక్కుంది సింవాచెలం.

“ఏటొరగబెడతారో నీకేటి తెల్సు” తలెగరేశాడు వెకన్న, పన్నెండు పైసలిచ్చి ప్రత్యేకంగా ఇస్త్రీ చేయించుకున్న చొక్కా తొడుక్కుంటూ.

వాడికళ్లముందు నాగయ్యలా వూగిపోతు తండ్రి కనిపించేడు. ఎనిమిదేళ్లకిందట తను ఉద్యోగంలో చేరేటప్పుడు ఏంచెప్పేడు, “ఒరేయ్, వెంకా, ఆళ్లకళ్లు కప్పి ఒళ్లు దాచుకుని మనఁవే మిద్దెలు లేపబోంవు. కాయకష్టం చేసుకుని గంజినీలు దాగి ఏచెట్టుకింద తొంగున్నా మనకి పరువే” అని చెప్పాడు. అందుకే స్కూలుచుట్టూ తోట పెంచేడు, అదితనపని కాకపోయినా, దానికి వాడికేం స్పెషల్ ఎలవెన్సు లేకపోయినా, హెడ్‌మాస్టరుగారిదగ్గరినుంచి “ఊఁ బాగానే వుంది” కంటె మరోముక్క రాకపోయినా.

ముందటేడు వచ్చిన స్కూళ్ల ఇన్స్‌పెక్కరుగారి భార్యకి బంగారుపువ్వుల్లా మెరిసిపోతున్న ముద్దబంతిపూలు తామరాకులో పెట్టి అందించేడు.

అవి చూస్తూ ఆవిడ, “లవ్లీ” అంది సార్‌తో. అంచూ వెంకన్నవేపు మెచ్చుకోలుగా చూసింది.

ఇన్‌స్పెక్టరుగారు హింటందుకున్నట్టు మందహాసం చేసి, “గార్డనింగంతా నువ్వేనా?” అన్నారు.

“అవునండీ సార్” అన్నాడు వెంకన్న ఉప్పొంగిపోతూ. వాడప్పుడు మొదటి పిక్చరే శతదినోత్సవం చేసుకున్న నిర్మాతలా ఫీలయేడు. ఆతోట అప్పుడు వాడికళ్లకి కోడెవయసు ఆడపిల్లలా పండుగ చేసింది.

“గుడ్. మీలాంటి యువకులంతా ఇలా కష్టపడితేనే దేశం బాగుపడేది,” అన్నారు ఆయన.

“యస్యస్. హీ ఈజ్వెరీ ఇండస్ట్రయస్ ఎండ్ సిన్సియర్” అన్నారు శర్మాజీ కూడా వీలయినంత మాత్రమే విశాలంగా నవ్వుమొహం పెట్టి.

వెంకన్న మళ్లీ బ్రహ్మానందపడిపోయేడు. ఆతరవాత అందరూ కలిసి తీయించుకున్న ఫొటోలో కూడా పడ్డాడు. ఆఫొటో చూరున వేలాడుతూ, సింవాచెలం అటు వెళ్లినప్పుడల్లా దానినెత్తిన ఒకటేస్తూ, అందుకు చీవాట్లు తింటూ ఇప్పటికీ వుంది.

అసలు స్కూల్లో ఉద్యోగం అయితే గవురంగా వుంటుందనీ, పెద్దపెద్దవాళ్లు స్కూలికి వచ్చినప్పడు చూడొచ్చనీ, మాటాడొచ్చనీ ఇక్కడ చేరేడు కాని పల్లెలో తనకి గడవక కాదు. వెంకన్న స్కూల్లో చేరి ఎనిమిదేళ్లయింది. ఓమాటు సినిమాల్లో రవుడీవేషాలేసే సూర్యనారాయణ వచ్చేడు. అతను రవుడీలా కాక చాలాబాగా మాటేడేడనీ అందరూ అనుకున్నారు. వెంకన్న కూడా అలాగే అనుకున్నాడు. మరోమారు ఎవరో మంత్రిగారొచ్చారు. ఓహ్ ..మంగళగిరి తిరణాలక్కూడా అంత జనం వుండరు.

ఆయన బిల్డింగు శంఖుస్థాపన చేస్తున్నప్పటిఫొటోలో కూడా పడ్డాడు. ఆయన కూడా వెంకన్నని మెచ్చుకున్నారు.

ఇలాటి అనుభవాలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని వున్నాయి. సింవాచెలానికి అర్థం కావు. “ఆయ్‌గా ఆకలిగినచెక్క చూసుకుంటూ ఆపల్లెలో పడుంటే పోదూ” అంటుంది. పొలంలో ఏఁవుంది. ఒక్కమారు ఏరొచ్చిందంటే గన్‌షాట్‌లా తుడిచిపెట్టుకుపోడఁవే కదా!

“మూడు సంవత్సరాలుగా ఒక్కగింజ రాల్లేదని అన్న చెప్పడంలే?”

“ఆడిమాట నమ్మకంవేంటి?” అంటుంది సింవాచెలం.

ఒకమనిషినేనా నమ్మాలి, ఒక దేవుణ్ణేనా నమ్మాలని చెప్పింది ఎవురు – జగ్గయ్య కాబోలు.

స్కూలువ్యవహారాల్లో ఇంత తకరారుందని నింవాచెలానికి తెలియనందుకు వెంకన్న సింవాచెలంమీద జాలి పడ్డాడు కూడా.

హుషారుగా ఈల వెసుకుంటూ వెళ్లిపోయిన వెంకన్నని చూసి, నవ్వుకుంటూ లేచింది సింవాచెలం కూడా పన్లోకెళ్లడానికి.

000

వెంకన్నని చూస్తూనే ఉగ్రులయిపోయారు శర్మాజీ. “స్టేషనుకెళ్లాలి రమ్మంటే ఇప్పుడా రావడం” అని “ఇంకా కాఫీ కాలేదూ” అంటూ ఇంట్లోకి ఒక విసురు విసిరి, “వెళ్లు, వెళ్లు, వెగిరం జట్కా తీసుకురా. ఆకుంటుగుఱ్ఱం కాదు. అదెంత నీ బావమర్ది మాఁవగారిదయినా దాని స్పీడు గంటకి అయిదు మైళ్లే. ఫో, ఫో. పోయి ఆవీరాసామిబండి పిల్చుకురా” అని వాడికి పురమాయిస్తూ పంచెకుచ్చెళ్లు పెట్టుకోడం పూర్తి చేసి, షక్టు తొడుక్కోసాగారు.

వెంకన్న అప్పటికే చాలాదూరం వెళ్లిపోయాడు. అంచేత ఆయన తిరిగి ఇంట్లోకి ఆజ్ఞలు ప్రసారం చెయ్యడంలో ములిగిపోయారు.

వారంరోజుల్నుంచీ ఆయన ఒఖ్కలా ఆరాటపడిపోతున్నారు. పెద్దపండుక్కి ఇల్లు కడిగించినట్టు స్కూలుబిల్డింగంతా దగ్గిరుండి కడిగించేరు. మూలమూలలా దుమ్ములు దులిపించేరు. మూలపారేసిన లాబొరేటరీ సామగ్రీతో టేబుళ్లలంకరించేరు. ఇంటింటా వాడవాడా చెదిరిపోయిన లైబ్రరీపుస్తకాలు గూళ్లు చేరేయి. గోడలకి సున్నాలేయించేరు. తోటచుట్టూ పడిపోతున్న కంచె నినబెట్టించేరు.

ఒక్కొక్క పనికోసం ఆయన రైలింజన్‌లా రంకెలెయ్యాల్సొచ్చింది. “మాసినచోటల్లా సున్నం కొట్టరా” అని ఎలమందతో చెప్తే, బకెట్‌లో సున్నం కలుపుకొచ్చి, సినిమాలో యాక్షను చేసినట్టు కుంచే తనమొహమ్మీద ఆడించి, గోడచాటున చేరేడు బీడీదమ్ము కొట్టడానికి.

“అలా కూచుంటే పనెలా అవుతుందిరా” అంటే, “ఇప్పుడే ఇలా వచ్చేనండీ” అంటాడు. వాడిచేత మళ్లీ కుంచె పట్టించి ఇటు తిరిగి చూస్తే, వెంకన్న తోటలో చేరేడు. “తోట షోకులు తరవాత చూద్దువుగానీ, ముందా బోర్డులన్నటికీ రంగులెయ్యి” అని వెంకన్నకి స్పష్టంగానే చెప్పి వున్నారాయన. వాడిని తోటలోంచి లాక్కురమ్మని పుట్టన్నని తరిమేరు. ఎంతసేపు చూసినా ఇద్దరిలో ఏఒక్కడూ వస్తున్న జాడ కనిపించలేదు. రుసరుసలాడుతూ, ఆయనే వాళ్లని వెతుక్కుంటూ బయల్దేరేరు. సౌత్వింగులో ఫస్టసిస్టెంటుగారు వాళ్లచేత బీరువాలు మోయిస్తున్నారు.

లైబ్రరీలో ఎలాగా పుస్తకాలు లేవు కదా అని బీరువాలు సైన్సులాబొరేటరీలో పెట్టి అందులో సైన్సుపరికరాలూ, నానాచెత్తా పెట్టేరు. ఇప్పుడు మళ్లీ ఎక్కడివక్కడ పెట్టిస్తున్నారు.

శర్మగారికి రావలిసినంత కోపం వచ్చింది. “అన్నిటికీ ఈవెధవలిద్దరే దొరికేరుచండీ? లాబ్‌లో ఉన్న అటెండర్లని ఉపయోగించుకోమని చెప్పేను కదా” గరళంలాటి కోపాన్ని కంఠంలో నోక్కిపట్టుకుని ప్రశ్నలాటి ఆదేశం వెళ్లగ్రక్కేరు.

“ఎక్కడున్నారండీ ఎటెండర్లు. ఒకడేమో మీపిల్లల్ని స్కూలినించి తీసుకురావడానికి వెళ్లేడు. రెండోవాడేమో అమ్మగారెందుకో రమ్మన్నారని మీయింటికెళ్లేడు,” ఫస్టసిస్టెంటుగారి స్వరంలో ఎన్నాళ్లనుంటో వున్న కక్ష తీర్చుకున్న సంతృప్తి బయల్పడింది. ప్యూన్లని తనయింటికి రానివ్వరని ఆయనకి మంట.

“హుమ్. స్కూల్నించి పిల్లల్ని తీసుకురావడం ఎంతసేపండీ. ఆయిదు నిముషాలపని చెప్తే అరగంట చేస్తారు వాళ్లు. తెందరగా రమ్మి మీరు చెప్పొచ్చుకదా. అదీ నేనే చెప్పాలా? నిజఁవేలెండి. హెడ్‌మాష్టరు కర్కోటకప్ముండాకొడుకన్నపేరు నాకు రావాలి. మీరంతా వాళ్లకి మంచివాళ్లు కావాలి.”

శర్మగారు నిష్క్రమించేరు. తాను చెప్పిందేఁవిటో, ఆయన చెప్పిందేఁవిటో, పొంతన కుదరక తికమక పడిపోయేరు ఫస్టసిస్టెంటుగారు.

ఆరేంజిమెంట్సు అయినట్టనిపించేసరికి అందరికీ ఇంచుమించు షేక్స్పియరు మొహాలు పడ్డాయి. ఎంతచేసినా ఏదోఒకటి తరుగు కనిపిస్తూనే వుంది.

000

చిన్నకూతురు తెచ్చిన కాఫీ శర్మగారు పూర్తి చేసేసరికి వీధిమలుపులో గుఱ్ఱం పగ్గం పట్టుకుని వస్తున్న రాములూ, పక్కనే వెంకనే కనిపించారు. తనదింక ఆలస్యంలేదు కనక శర్మగారు గుమ్మం దిగుతూ, “ఏఁవిరా ఇంతసేపా బండి తీసుకురావడం” అని లాంఛనంగా కసురుకుని బండెక్కి కూచున్నారు.

“వీరాసామి బండికిరుసు ఇరిగిపోయిందండీ. మీరేమో మాబండి ఒద్దన్నారుకదా. రాఁవులు దొరికేసరికి ఇంతసేపయిందండీ,” శర్మగారు విన్నా వినకపోయినా జవాబు చెప్పడం ధర్మంగా వెంకన్న సమాధానం చెప్పి బండిముందుకు వచ్చాడు.

రాములుగుఱ్ఱం కుంటిది కానీ కొత్త కావడంచేత ఇంకా రాములువాటానికది అలవాటు పడలేదు. అంచేత వాడు ఛెర్నాకోల ఛెళ్ మనిపించి, ఎగిరి కమ్మీమీద కూర్చునేసరికి అదొక రౌండు కొట్టింది. ాములు బండి దిగి, గుర్రానికి దిక్కులు సూచిస్తుండగా, అది ప్రొటెస్టు చేస్తున్నట్టు వెనక్కి నడవసాగింది.

బండిలో కూర్చున్న శర్మగారికి దాని ప్రటెస్టుకన్నా ఫ్రైటెక్కువ గలిగింది.

బంఢలోనించి ఓకాలు బయట పెట్టి, దిగలేకా కూర్చోలేకా ఇబ్బంది పడిపోతూ, గుఱ్ఱాన్నీ, వెంకన్ననీ, రాముల్నీ వుద్దేశించి, “రేయ్, రేయ్, దరిద్రుడా, ఈబండెక్కడ దొరికిందిరా. ఇదెక్కడి గుఱ్ఱంరా. గుఱ్ఱఁవేనా గాడిదా. డీయీవోగారొస్తున్నారంటే ఇలాటిగుఱ్ఱంట్రా తీసుకొస్తావు…” మొదలుగాగల ప్రశ్నలు వేస్తూ, ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆరాటపడిపోతున్నారు.

“మరేఁ పరవాలేదండీ. కొంచెం కొత్త. అంతే. కాని పంచకల్యాణి కాదుటండీ. పరుగందుకంటే ఆకాశంలో పోతుందండీ,” అంటూ రాములు ధైర్యం చెప్పుతున్నాడు.

“శర్మగారా, రాములా – ఎవర్ని సైడు చెయ్యడం అన్నసదసత్సంశయంలో పడిపోయాడు వెంకన్న.

ఆలా ముగ్గురూ అవస్థలు పడుతుండగా, స్టేషను వచ్చింది. లేక రాములూ, గుఱ్ఱమూ, శర్మగారూ. వెంకన్నా స్టేషనుకొచ్చేరు. రైలు రెండుగంటలు లేటని తెలిసినతర్వాత అందరిమనసులూ కుదుటపడ్డాయి. గుఱ్ఱంమనసు దాణామీద పడింది.

ఫ్లాస్కూ, కాఫీ కూడా సేఫ్‌గానే ఉన్నందుకు ఆనందించేరు.

000

రెండుగంటలు లేటుగా వచ్చిన రైల్లోంచి డీయీవోగారూ, వారిచిన్న సంతానం సరోజా, క్లర్కూ, జవానూ దిగేరు. డీయీవోగారిని మొదటగా ఎదుర్కొని స్వాగతం చెప్పే మహద్భాగ్యం తనకి కలిగినందుకు వెంకన్న ప్యూనులందరిలోనూ రాజులా గొప్పపడిపోయేడు.

డీయీవోగారి ప్యూను డీయీవోగారంత దర్జాగానూ – ఒకడుగు వెనకే అయినా – నడుస్తూ లగేజీ అంతా తనచేత మోయించేడు..   “అలా గెడకర్రలా చూస్తూ నిలబడతావేం, ఆసూట్‌కేసూ, బుట్టా ఆందుకో,” అని శర్మగారు వెంకన్నని కసిరి, డీయీవోగారి ప్రయాణం సుఖంగానే జరిగిందని తాను అనుకుంటున్నట్టు ఆయనకి మనవి చేస్తూ, వెయింటింగ్రూములాటి రూముకి వారిని తీసుకెళ్లారు.

డీయీవోగారూ, అమ్మాయిగారూ మొహం కడుక్కుంటుంటే వెంకన్న కాఫీ ఎవరెవరికి ఎలా సర్దడమా అన్న ఆలోచనలో పడ్డాడు.

వెంకన్న వులిలక్కి పడ్డాడు. శర్మగారు వాణ్ణి దివిటీస్థంభంతో పోల్చి, అయ్యగారికి కాఫీ ఇవ్వమని ఆదేశించేరు.

శాపగ్రస్తుడయిన గంధర్వుడిలా ఫ్సాస్కు తీసుకున్నాడు వెంకన్న. కాని కాఫీ అందరికీ చాలదని ఎలా చెప్పడమో తెలీక నిలబడిపోయాడు.

శర్మగారు మరొకసారి ఉరిమిచూశారు. వున్నవాళ్లలో నువ్వు నయం అని తీసుకొస్తే నువ్విలా చేస్తున్నావేమిటి అన్న నిష్ఠూరం వుంది చూపులో. దేవుడా ఇంత చేశావా అన్న దైన్యం వుంది ఆచూపులో. పోర్షను మర్చిపోయిన నటుల్లా వీళ్లిద్దరూ చూపులు చూసుకోవడం చూసి డీయీవోగారిక్కోపం వచ్చింది. వారి అమ్మాయిగారికి చిరాకు కలిగింది. ఫర్టసిస్టంటుగారు కలగజేసుకుని కఫ్పుల్లో పోసి డీయీవోగారికీ వారమ్మాయికీ ఇవ్వమని సౌంజ్ఞ చేశాడు. క్లర్కు వెంకన్నని పక్కకి పిలిచి “ఇక్కడెక్కడా టీ దొరకదా అని ప్రశ్నించేడు.

ఈయనకి టీ దొరికితే బాగుండును అనిపించింది వెంకన్నకి.

“దొరకదు సార్. ఈసుట్టుపక్కల నాలుగుమైళ్లలో టీదుకాణం లేదు. మనూరు పోంగానే ఫస్ట్‌క్లాసయిన టీ తెస్తానండీ” అంటూ ఒకే నిముషంలో అతగాడి విచారానికీ, ఉల్లాసానికీ కారణభూతుడయేడు.

శర్మగారూ, కొత్తగుఱ్ఱమూ ఒక్కలా అవస్థ పడిపోతూ ఢీయీవోగారినీ, వారిపరివారాన్ని వారిమకాంకి చేర్చారు. వారిమకాం స్కూల్లోనే ఏర్పాటు చేయబడింది. ఆరూము అప్పటికే మూడుసార్లు దులపడం, కడగడం, దులపడం, కడగడం, అయింది.

డీయివోగురు అప్రసన్నంగా రూమొకసారి పరికించడం గమనించిన శర్మాజీ వెంకన్నవేపు తిరిగి, “పొద్దున్నే రూము ఊడిపించలేదూ” అని కసిరినట్టు ప్రశ్నించి, లేజీబగ్గర్ అని కాంప్లిమెంటిచ్చారు.

వెంకన్న ఆసమయంలో – తాను గాజుగ్లాసులో అమర్చిన ఒంటిరెక్కమందార అందాన్ని చూసి ఆనందిస్తున్న అమ్మాయిగారిని సూసి మురిసిపోతున్నాడు. అందుచేత శర్మగారు అన్నమాటకి నొచ్చుకోకుండా, ఏదో పెద్దవారు, ఆయనబాధలు ఆయనకున్నాయి, అందుకే ఉదయంనుంచి తాను ఆయనవెంటే వున్నసంగతి మర్చిపోయేరు అనుకుని ఊరుకున్నాడు.

శర్మగారు కూడా డీయీవోగారడిగిన మరేదో ప్రశ్నకి సమాధానంకోసం తడుముకోసాగేరు.

“ఇక్కడ సిగరెట్లు దొరకవా?” ఢీయీవోగారడిగేరు. ఆయనకి నేవీకట్ కావాలి. ఇక్కడ బర్క్‌లీ తప్పిస్తే బీడీలు మాత్రమే దొరుకుతాయని ఎలా చెప్పడఁవో తెలీక, వెంకన్నకి పురమాయించేరు. “వేగిరం వెళ్లి ఒకటిన్ నేవీకట్ తీసుకురా.. ఇక్కడున్నట్టు రావాలి.”

వెంకన్న బరిలోకురికిన పుంజుకుని సైకిలెక్కేడు. కలికం వేసి చూస్తే, ఏ నాటుదొర జేబులోనో ఒకటో అరో దొరకొచ్చునేమో కాని పూర్తి టిన్ను దొరకదని వాడికి తెలుసు. కాని పుట్టించేడంటే బాబుగారెంత సంతోషిస్తారో వాడూహించేడు. మిట్టమధ్యాహ్నం అయేసరికి అర్థపేకెట్ ఒకచిన్నకొట్లో దొరికింది.

“అయిదు సిగరెట్లు తేవడానికి నీకో పట్టిందా?” శర్మగారు కళ్లెర్ర జేసినా, ఆకళ్లలో వాడికి ఎకర్రజీర కనిపించలేదు.

“ఇంటికెళ్లి కారియర్ తీసుకురా. ఇప్పటికే ఆలస్యం అయింది”

వెంకన్న మళ్లీ సైకిలెక్కి శర్మగారింటికి వెళ్లాడు. అమ్మగారు కారియర్ రెడీగానే ఉంచేరు కానీ అరిటాకుల్లేవు. ఆకులకోసం ణళ్లీ ఓగంటసేపు వాడు వేటాడవలసివచ్చింది. సంభారాలన్నీ సమకూర్చుకుని స్కూలుకి వెళ్లేసరికి అక్కడ అందరూ ఆకలితోనూ ఆపైన కోపంతోనూ కణకణలాడిపోతున్నారు.

వెంకన్న క్విక్విగ్గా టేబులుమీద అన్నీ సిద్ధం చేశాడు.

అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించేసరికి మూడయింది.

అప్పుడు శర్మగారు వెంకన్నకి ఇంటికెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చేరు. “అన్నం తినేసి అయిదు నిముషాల్లో వచ్చేయాలి.”

తిండి తినడంమాట దేవుడెరుగు ఇంటికెళ్లడానిక్కూడా ఆ అయిదు నిముషాలు చాలవని ఒక్క వెంకన్నకే తెలుసు. అంచేత వాడు బస్టాండుదగ్గర బన్ను తిని, టీ తాగి వచ్చేశాడు. అప్పటికీ పదినిముషాలు పట్టింది.

డీయీవోగారు ఆరోజుకి విశ్రాంతి తీసుకుంటారనీ, స్కూలు మర్నాడు దర్శిస్తారనీ ప్రకటించబడింది. వెంకన్న మాత్రం ఆయనక్కావలసినవి అందిస్తూ అక్కడే వున్నాడు.

డీయీవోగారమ్మాయి తోట చూడాలని సరదా పడ్డందున తోట ఇన్స్‌పెక్షను ఆసాయంత్రం చేశారు.

అమ్మాయి కావలసినన్ని పువ్వులు కోసుకుంది. డీయీవోగారు నవనవలాడుతూ ఏపుగా పెరిగిన కూరగాయనవేపు అప్రూవంగయిస్‌తో చూశారు. అందులో తమకి ఇష్టమయినవేవో చెప్పకయే చెప్పేరు. వెంకన్నవైపు తిరిగి వెరీగుడ్ అన్నారు. వారి అమ్మాయి బ్యూటిఫుల్ అంది. వెంకన్న వెగరుస్తూ నమస్కారమండీ అన్నాడు.

రాత్రి మళ్లీ హెడ్‌మాష్టరుగారింటినించి కారియర్ తెచ్చాడు. వాళ్ల భోజనాలు అయేసరికి పదిన్నర అయింది. వెంకన్నకి ఇంటికెళ్లడానికి ఇంకా పర్మిషను దొరకలేదు.

డీయీవోగారు విలాసంగా ఈజీచైరులో వాలి, సిగరెట్ వెలిగించి, అగ్గిపుల్ల వెనక్కి విసిరేరు.. అది వెళ్లి టేబులుమీద నాజూగ్గా పరుచుకున్న ప్లాస్టిక్ టేబుల్ క్లాతుమీద వాలింది. ఆటోమేటిగ్గా ఒక్కడొక డిజైను ఏర్పడింది.

శర్మగారు వెనువెంటనే ఆటేబులుక్లాతులాగే మండిపడ్డారు. అది ఆయనస్వంతం. డీయీవోగారి మెప్పుకోసం తనఇంటినుండి తెచ్చి వేశారు.

“యూ బ్లడీరాస్కెల్, నీకెన్నిమార్లు చెప్పేను ఎలర్ట్‌గా ఉండాలని. నీకు ఇలా బుద్ధిరాదు. డిస్మిస్ చేసేస్తే అప్పుడ1స్తుంది. ఎలెర్ట్‌నెస్. నిన్న చెప్పేను సార్, యాష్‌ట్రే తెచ్చిపెట్టమని. కనీసం సిగరెట్లు తెచ్చినప్పుడేనా తేవాలా?”

యాష్‌ట్రే సంగతి తనకి చెప్పలేదని వెంకన్న చెప్పలేదు.

డీయీవోగారు నిర్లిప్తంగా, “యూమస్ట్ నో హౌ టు మానేజ్ దెమ్. ఫైన్ హిమ్” అన్నారు తత్త్త్వబోధ చేస్తున్నట్టు.

శర్మగారు వెంకన్నకి అయిదురూపాయలు ఫైను వేసినట్టు తెలియజేశారు. కారణం నెగ్లిజన్సాఫ్ డ్యూటీట.

మర్నాడు డీయీవోగారు క్లాసులూ, బిల్డింగూ, లాబొరేటరీ, లైబ్రరీ తణిఖీ చేశారు. బిల్డింగంతా శుభ్రంగా వుందనీ, తోట అందంగా వుంతనీ, టీచర్లంతా మంచివాళ్లలా వున్నారనీ మెచ్చుకున్నారు. శర్మగారినీ మిగతా ఉపాధ్యాయవర్గాన్నీ కరచాలనం చేసి అభినందించారు. పిన్నలని కష్టపడి పనిచెయ్యమని ఆశీర్వదించేరు.

డీయీవోగారిని రైలెక్కించి వచ్చి, శర్మగారు “హమ్మయ్య, వెళ్లాడురా తండ్రీ. ఇంతకంటె ఇద్దరాడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యడం సుళువు” అనుకుని నిట్టూర్చారు. ఇంత కష్టపడ్డందుకు ఆయన బేడ్ రిపోర్టు రాయకుండా వుంటే అంతే చాలు అనుకున్నారు. డీయీవోగారు తనతో కరచాలనం చేస్తూ “మీకు కంగ్రాచ్యులేషన్సు చెప్పాలి” అన్నారని గర్వంగా భార్యతో చెప్పారు.

అదే సమయంలో వెంకన్నముందు సింవాచెలం పళ్లెంలో అన్నం పెట్టి, అమ్మగారింటినించి అపురూపంగా తెచ్చిన ఆవకాయముక్క వేసి, “వారంరోజుల్నించీ తిండే నేదు. ఇప్పుడైనా కాస్త తీరిగ్గా తిను,” అంది ఆప్యాయంగా.

వెంకన్న తృప్తిగా ఆవకాయముక్క కొరుకుతూ సింహాచలంతో విశేషాలు చెప్తున్నాడు, “అయ్యగారు తోట ఎంత మెచ్చుకున్నారో తెలుసా. వెరీగుడ్డన్నారు. అమ్మాయిగారు పూలు చూస్తూ బీయాటిఫుల్ అన్నారు. లౌలీ అన్నారు. హెడ్‌మాష్టరుగారు బుట్టనిండా కాయగూరలు కోయించి ఆరితో పంపించారు. ఆరికి పందిరిచిక్కుడంటే ప్రాణంట. మళ్లీ హెడ్‌మాస్టరుగారితోనూ, పంతుళ్లతోనూ షేకెండు కూడా ఇచ్చారు. మంచి బాబు ….”

వెంకన్న చెప్తూనే వున్నాడు.

సింవాచెలం ముసిముసినవ్వులు నవ్వుతూ వింటూనే వుంది.

వాడు సింవాచెలానికి చెప్పని విషయం ఒక్కటే – ముందురోజు తనకి అయిదు రూపాయలు ఫైను పడిన సంగతి!!

(ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఏప్రిల్ 2, 1971,లో ఉగాదికథలపోటీలో ప్రథమబహుమతి పొందినకథ.

కన్నడ అనువాదం: నిరుపమ. సుధ జూన్ 13, 1971లో పత్రికలో ప్రచురితం. )

(మార్చి 17, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “చిరుచక్రం”

 1. telugu4kids, మీ అభిప్రాయాలు నిజమేనండీ. ఒకొకప్పుడు, రచయితలగురించి తెలిసినవిషయాలు కూడా మనం కథని అన్వయించుకునే తీరులో కనిపిస్తాయి. ఇలాటివ్యాఖ్యలవల్ల రచయితకి కూడా లాభం. తనకథలో తను ఊహించని కొత్త కోణాలు అధికంగా దర్శించగల అవకాశం వస్తుంది కనక. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. తెలుగు4కిడ్స్ నా పూల తోట:-)
  నాకు కథ నిండా వెంకన్న సంతృప్తి కనిపించింది.
  దానికి సిద్ద్ధం చేసినవి ఈ మాటలు:
  “ఒరేయ్, వెంకా, వాళ్లకళ్ల కప్పి ఒళ్లు దాచుకుని మనఁవే మిద్దెలు లేపబోంవు. కాయకష్టం చేసుకుని గంజినీలు దాగి ఏచెట్టుకింద తొంగున్నా మనకి పరువే”.

  ఈ కథ చాలా బావుంది. చదవాలి అనిపించేలా ఉంది.
  హాస్యమూ, మాటలతో మీరు గీసిన చిత్రాలు చాలా బావున్నాయి.

  నామటుకు నాకు నా అనుభవాలు, చదివేటప్పటి మనఃస్థితీ నేను అర్థం చేసుకునే దాన్ని ప్రభావితం చేస్తాయి. రచయిత గురించి నేను ఇంతవరకూ చదివిన ఆ రచయిత రచనలూ, ఆ రచయిత గురించి నాకు తెలిసిన విషయాలు కూడా నేను గ్రహించే విషయాన్ని ప్రభావితం చేస్తాయి.

  వ్యాఖ్య రాయాలనుకుంటే ఇవన్నీ మనసులో పెట్టుకుని మరీ చదివి రాసే ప్రయత్నం చేస్తాను. కానీ, చాలా సార్లే హడావిడిగా ఒక glance తో ఏర్పడిన అభిప్రాయాన్నీ రాసేస్తుంటాను. ఇంకా చాలా సార్లు, అంతవరకూ వినిపించిన అభిప్రాయాలూ, నా అభిప్రాయాన్ని evaluate చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

  ఐతే, మనకు కావలిసినదే మనము చదువుకుంటాము అన్నది కూడా చాలా నిజం.
  రామాయణ మహాభారతాలే ఈ విషయంలో పెద్ద ఉదాహరణలు కదా.

  అదృష్టం కొద్దీ కొన్ని సార్లు మనకు ఉపయోగపడేది కూడా చదవడం తటస్థిస్తుంది. మనం చదివే తీరుని సరి చేస్తుంది.

  మెచ్చుకోండి

 3. @ కొత్తపాళీ, అవునండీ, మనం ఈవిషయం చర్చించాం. మీరు what he wants అంటున్నారు. Want అవునో కాదో చెప్పలేను కానీ నేను అనుకోడం వాళ్లు కథని మరోవిధంగా అర్థం చేసుకోడానికి కారణం, వాళ్ల అనుభవాలూ, పరిస్థితులూ, మేథోసంపత్తి (sophistication) కూడా అనుకుంటాను.

  మెచ్చుకోండి

 4. @ కొత్తపాళీ, మీ పదవిన్యాసం అద్భుతం. ధన్యవాదాలు. ఈకథ రాయడంలో నేను చిత్రించడానికి ప్రయత్నించింది- ఎంత చిన్న ఉద్యోగి అయినా తనవిధి తాను చక్కగా నిర్వర్తించేను అనుకున్నప్పటి తృప్తీ, ఆనందమూ. అమెరికాలో నాసాహిత్య సేవలాగే :p.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s