కొనే మనిషి

(ఈకథకి కథా కమామీషూ – ఆంధ్రప్రభలో మార్చి 1976లో అచ్చయింది.

మళ్లీ ఈమధ్యనే – “20వ శతాబ్దంలో అమెరికా తెలుగుకథానిక” అను బృహద్గ్రంథంలో ప్రచురణకి నోచుకున్న నాకథ రచయిత నిడదవోలు మాధవి అని ప్రచురించినట్టు నాకు ఈమధ్యనే తెలిసింది. వంగూరివారిదే మరోసంకలనంలో “డాలరుకో గుప్పెడు రూకలు” అను నాకథ “డాలరుకో గుప్పెడు నూకలు” అన్న మారుపేరుతో ప్రచురించబడింది. చూశారా, ఒక్క అక్షరం మారితే, అర్థం ఎలా మారిపోతుందో.. వంగూరివారు హాస్యరస ప్రియులు మరి. రానున్న సంకలనంలో నాకూ, నాకథకీ ఏంనామకరణాలు చేస్తారో వేచి చూద్దాం … 🙂

తరవాయి టపాలో డాలరుకో గుప్పెడు రూకలు ప్రచురిస్తాను to reclaim my authorship! ))

                                        000

(ఇప్పుడు అసలు కథ -)

చిన్నప్ప అక్క కామాక్షికి పెద్ద ఉత్తరం రాసేడు. అక్కనీ, కొడుకు వెంకట్రాంని అమెరికా రమ్మని. ఒట్టి కబుర్లు కాదు. వాళ్లకి టిక్కెట్లు కూడా కొని పంపించేడు. కామాక్షి ఉప్పొంగిపోయింది. తనచేతులమీదుగా పెంచి పెద్ద చేసిన చిన్ని తమ్ముడు ప్రయోజకుడై అమెరికాలో పెద్ద ఉద్యోగం సంపాదించడమే కాక పాతకాలపు అభిమానాలు అలాగే నిలబెట్టుకున్నాడు!

“అమెరికా వెళ్తున్నావటే, …”

“నిజంగా అమెరికాయే, … అబ్బో,”

“నువ్వా? అమెరికావా? … ఎందుకూ …”

ప్రశ్నలవర్షం. కామాక్షికి ఊపిరాడ్డంలేదు. ఇహ కొడుకు సంగతి సరేసరి. చుట్టాలూ, పక్కాలూ, స్నేహితులూ తెమ్మన్న వస్తువుల జాబితా హనుమంతుడితోకలా పెరిగి పోతూంది.

                                                000

చిన్నప్ప వాళ్లని తీసుకురావడానికి  ఎయిర్‌పోర్టుకి వెళ్లేడు.

“న్యూయార్క్‌లో మారాల్సి వచ్చింది. నువ్వక్కడికి వస్తావనుకున్నాను,” అంది కామాక్షి ఒకింత కించ పడుతూ.

“వద్దాం అనే అనుకున్నాను. ఆఫీసులో పనివల్ల పడలేదు. దేవికి కూడా పని. తీరలేదు. ఆఫీసులో ఊపిరాడ్డంలేదు. లేకపోతే రెండువేలు పెట్టి టిక్కెట్లు కొన్నవాణ్ణి మరో రెండువందలకి వెను దీస్తానా?” చిన్నప్ప సన్నగా నవ్వేడు, అదేమంత పెద్దవిషయం కాదనిపించేలా.

“అంతేలే” అంది కామాక్షి.

“అయినా వెంకట్రాం ఆమాత్రం చూసుకోలేడా అని కూడా లే …”

“ఎందుకు చూడలేనూ? నేనే కదా అక్కడ అన్నీ కనుక్కుని చేసింది,” అన్నాడు వెంకట్రాం చిరుకోపంతో. అతనికి తల్లిమాటలు మహా అవమానంగా తోచేయి.

సూట్‌కేసులు తీసుకున్నాక అయేక, చిన్నప్ప వెళ్లి కారు తీసుకొచ్చేడు.

సూట్‌కేసులు వెనక ట్రంకులో పడేసి, కామాక్షీ, వెంకట్రాం కారెక్కేక, మళ్లీ మాటలు మొదలు పెట్టేడు. “అయితే కాలేజీలో చేరుతున్నావన్నమాట. ఏమిటి నీ మేజరు?”

ఈ అమెరికనింగ్లీషు వెంకట్రాంకి ఇంకా కొత్త. రెండు నిముషాలాలోచించి, “ఇంకా ఏం అనుకోలేదు,” అన్నాడు తటస్థంగా.

చిన్నప్ప “ప్చ్” అని చప్పరించి, “చూశావా? ఇదే మనవాళ్లతో వచ్చిన చిక్కు. అందుకే మనం ఇంత వెనకబడి ఉన్నాం. జనం చిన్నప్పట్నుంచీ సొంత ఆలోచనలూ, అభిప్రాయాలూ ఏర్పరుచుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడు. ఉగ్గుపాలతోనే నేర్పుతారు అలాటివి. అంతెందుకూ? కాలేజీకి జీతం కట్టాలి. డబ్బివ్వమని తల్లిదండ్రులని అడిగే కుర్రాడు ఇక్కడ మచ్చుకయినా కనిపించడు, తెలుసా?”

వెంకట్రాం జీతం కట్టడానికి తల్లిని డబ్బు అడగక్కర్లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాడు.

“ఏమాటకామాటే చెప్పాలిలే. పిల్లలికి చిన్నప్పట్నుంచే అలవాటయిన ఈ స్వాతంత్ర్యంమూలంగా అభిమానాలు దూరం అయిపోతాయి కూడాను. మనలాగా ప్రేమలూ, అభిమానాలూ అంటూ తాపత్రయపడరు. నిజానికి ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోయేరు తెలుసా నేను మీకు టికెట్లు కొన్నానంటే.” చిన్నప్ప తేలిగ్గా నవ్వేడు.

కామాక్షి తమ్ముడు ఇంకా ప్రేమాభిమానాలగురించి మాటాడుతున్నందుకు ఆనందించింది.

                                                            000

దేవి ఇంట్లో లేదు వాళ్లు ఇంటికి వచ్చేసరికి. ఓ చిన్న నోటు పెట్టింది ఉప్మా ఫ్రిజ్‌లో ఉందనీ, కాఫీ ఫ్లాస్కులో ఉందనీ.

“శనివారం కూడా పనేనా” అంది కామాక్షి.

“మరేంటనుకున్నావు. ఇండియాలో అందరూ మేం ఇక్కడ ఏదో కుప్పలు తిప్పలు సంపాదించేస్తున్నాం అనుకుంటారు. కానీ దానికోసం ఎంత చాకిరీ చేస్తామో తెలీదు. అసలు మనదేశంలో చూడు తీరిగ్గా తొమ్మిదిగంటలకొస్తారు కాళ్లీడ్చుకుంటూ. పదిన్నరకి కాఫీకి పోతారు. మూడొంతులకాలం టీబ్రేకులూ, లంచిబ్రేకులే అక్కడ. మిగతా టైంలో కాళ్లు చాపుకు నిద్రపోతారు. దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది? తల్చుకుంటే నాకు కడుప్మండిపోతుందనుకో. మనకి కావలిసినంత తెలివితేటలున్నాయి. ఇక్కడ చేసేదాన్లో సగం అక్కడ చెయ్యమను. వీళ్లకంటే రెండింతలు బాగుంటాం. మనవాళ్లందరూ నేను ఇండియా వచ్చేయలేదని దెప్పుతారు. వచ్చి ఏం చేస్తాను? నావిద్య వినియోగించుకోగల ఆఫీసే లేదక్కడ …”

కామాక్షికి అయోమయంగా వుంది. “మనదేశంలో పనికొచ్చే చదువే నువ్వెందుకు చదవలేదూ?”

“ప్రతివాడూ అడిగే మరో చచ్చు ప్రశ్న ఇదీ. నిన్ననడం లేదులే. ఎంతసేపూ చదివిందే చదివి, చేసిందే చేసి, దొరికిన గంజినీళ్లతోనే సరిపెట్టుకుపోతూ ఉంటే, మనకి అభివృద్ధి ఎలా సాధ్యం? నామాటే తీసుకో. ఓ పదేళ్లపాటు ఇక్కడ పని చేసి, ఓ కోటి రూపాయలు సంపాదించి తెస్తాననుకో. అప్పుడు అక్కడ ఓ కంపెనీ మొదలుపెట్టి, మరో నలుగురిని నాలాగే తయారు చేస్తే, అదీ పురోభివృద్ధి. అవునా, కాదా”

                                                000

చిన్నప్ప వాళ్ల లగేజీ తీసుకెళ్లి మేడమీద గెస్టురూంలో పెట్టేడు.

కామాక్షీ, వెంకట్రాం కార్పెట్ మాసిపోతుందేమోనన్నట్లు నెమ్మదిగా అడుగులేస్తూ అతనివెనకే మెట్లెక్కేరు. చిన్నప్ప వాళ్లకి బాత్రూం చూపించి, కిందకి వచ్చేడు కిందకి వచ్చేడు బల్లమీద ప్లేట్లూ అవీ పెట్టడానికి.

కామాక్షీ, వెంకట్రాం త్వరగానే బట్టలు మార్చుకుని కిందకి వచ్చేరు. చిన్నప్ప వాళ్లని చూస్తూనే, మహోత్సాహంతో తనభార్య చేసిన అరేంజిమెంట్లు చెప్పాడు, “చూడు. మీమరదలు మనవంటలూ, ఆచారాలూ, బట్టలూ అంటే మహ ఇష్టపడుతుంది. మడి కట్టుకుని వంట చేస్తుంది తెలుసా. అదేలే. లేవగానే శుభ్రంగా స్నానం చేసి, బట్టలు మార్చుకుని కానీ వంటింట్లో అడుగెట్టదు. అటు చూడు. వెంకటేశ్వరుడి పటం. అదేదో ఆ పద్యాలు కూడా చదువుతుంది.  … ఏమిటదీ .. తవసుప్రభాతం అని వస్తుందీ … అదీ …ఈ ఉప్మా తనే చేసింది. రోజూ వంట చెయ్యడానికి టైముండదు. అంచేత వారానికోమారు చేసేసి, ఫ్రిజ్‌లో పెట్టేస్తుంది. అదీ ఇక్కడవాళ్ల తెలివితేటలు. టైం లాభసాటిగా వాడుకోడం వీళ్లతరవాతే ఎవరైనా …”

“అంతేలే” అంది కామాక్షి చప్పగా చల్లారిపోయిన వంటకాలు తిరిగి వెచ్చబెట్టుకోడంలో గల రుచిని తొలిసారిగా అనుభవిస్తూ.

చిన్నప్ప కొంచెం బ్లాక్ కాఫీ తనకప్పులో పోసుకున్నాడు. వాళ్లిద్దరికీ పంచదారా, పాలూ పోశాడు. వెంకట్రాం ఎలాగో సగం తాగేడు కానీ కామాక్షి ఓ చుక్క రుచి చూసి పక్కన పెట్టేసింది.

చిన్నప్ప నవ్వేడు. “బాగులేకపోతే తాగఖ్కర్లేదులే. ఇండియాలో ఫిల్టరుకాఫీలా ఉండదిక్కడ. నాక్కూడా కొన్నాళ్లు పట్టింది అలవాటు పడడానికి. మొదట్లో నాక్కూడా ప్రాణాంతకంగా ఉండేది. ఎవరేనా మంచి కాఫీ ఇస్తానంటే వాళ్లకాళ్లమీద పడడానికి కూడా సిధ్ధం అనుకో. కానీ ఒకమాట ఒప్పుకుతీరాలి. ఆరోగ్యందృష్ట్యా ఇదే మంచిది. పైత్యం చెయ్యడం, కళ్లు తిరగడంలాటివి ఉండవు. పైగా, కడుక్కోడానికి అన్ని గిన్నెలూ ఉండవు. చెప్పేను కదా పని సుళువులు వీళ్ల తరవాతే. .. అదీ నాకు నచ్చేవిషయం. సరే, మీరిద్దరూ వెళ్లి పడుకోండి,”

కామాక్షి తనప్లేటూ, కప్పూ పట్టుకు లేచింది. చిన్నప్ప గబుక్కున ఆవిడచేతిలోంచి అందుకున్నాడవి, “నువ్వేం చెయ్యక్కర్లేదులే ఇక్కడ. నేను చూస్తాను, …” చిర్నవ్వుతో అన్నాడు, “ఇక్కడ గిన్నెలు కడగడం అంటే, ఇండియాలోలాగ చీరె కుచ్చిళ్లు ఎగ్గట్టి, చింతపండూ, ఇసకా వేసి తోమడంలా కాదు కదా. … కాస్త తొలిచి డిష్ వాషర్‌లో పడేస్తే అవే క్లీనయిపోతాయి. మనవంటలకి కొంచెం కష్టం అనుకో. గిన్నెలూ మనుషులూ కూడా మసయిపోతే తప్ప పూర్తవదు మనవంట. అంత కాదు. కూరలూ, అందులూ విటమినులూ కూడా మసైపోవాలి. … పోనీ కానీ, మీరు కొంచెంసేపు పడుకోండి. నేను శామీనీ కొంచెంసేపు అలా తిప్పి తీసుకొస్తాను. రాత్రి ఒక ఫ్రెండు భోజనానికి పిలిచాడు. పాట్లక్. అంటే అందరూ తలో డిష్ తీసుకొస్తారు. .. దేవి వడలు చేస్తుంది. ..అలా చేస్తే ఆ ఇల్లాలొక్కర్తే హూనం అయిపోనక్కర్లేదు కదా.”

కామాక్షీ, వెంకట్రాం సోఫాలో పడి నిద్రపోయేరు చిన్నప్ప మాటాడుతుండగానే. చిన్నప్ప వాళ్లని లేపి పైకి పంపడమా ఊరుకోడమా అని ఓనిముషం ఆలోచించి, వాళ్లమొహాలు చూసి “పడుకోనియ్‌లే” అనుకుని ఊరుకున్నాడు.

శామీతో ఇవాళ బయటికి వెళ్లడానికి వీలుండదని చెప్పేడు. ఇంటిముందే ఆడుకోమనీ, జాగ్రత్తగా ఉండమనీ, అటూ ఇటూ పరుగెట్టకూడదనీ, బట్టలు మాపుకోకూడదనీ, ఒకగంటలో ఇంట్లోకి వచ్చేయాలనీ …

                                                000

కామాక్షీ, కొడుకూ నిద్ర లేచేసరికి అయిదయింది. మొహం కడుక్కుని, బట్టలు మార్చుకున్నారు. అప్పటికి దేవి కూడా వచ్చింది. ఆవిడ ఆకుపచ్చ చీరె కట్టుకుని, మాటింగ్ బ్లౌజు వేసుకుని, నుదుట తిలకంతో, బంగారు దుద్దులతో, చేతికి గాజులతో చూడ చక్కగా ముస్తాబయింది – అమెరికన్ డైమండ్‌లా మెరిసిపోతూ.

“అదుగో మీమరదలు” అంటూ చిన్నప్ప ఉప్పొంగిపోతూ పరిచయం చేశాడు “అచ్చు పోతపోసిన తెలుగు పడుచులా లేదూ?”

దేవీ అనబడుతున్న డెబ్బీవేపు చూసి చిన్నగా నవ్వింది కామాక్షి. వెంకట్రాం ఆవిడవేపు పట్టలేని కౌతుకంతో చూడసాగాడు.

“నమస్తే” అంది దేవి.

కామాక్షి తలూపింది మందహాసంతో.

చిన్నప్ప మహా గర్వపడిపోయేడు.

శామీ తండ్రిమాట ప్రకారం ఒకే ఒకగంటలో లోపలికి వచ్చేశాడు. వాడు పరుగెట్టలేదు. బట్టలు మాపుకోలేదు. తల చెరుపుకోలేదు.

బేబీసిటర్ వచ్చింతరవాత పిల్లాడిని అప్పగించి, పార్టీకి బయల్దేరారు. కామాక్షీ, వెంకట్రాం వెనకసీటులో కూర్చున్నారు. చిన్నప్ప కారుతలుపు తెరిచాడు దేవికి. దేవీ డ్రైవు చేసింది.

పార్టీలో జనం అంతా గొడవ గొడవగా అనిపించింది కామాక్షికీ, వెంకట్రాంకీ. ఆతిండి వాళ్లకెక్కలేదు. వెంకట్రాం ఓ ముక్క కొరికేడు కానీ కామాక్షికి అస్సలు కొరుకుడు పడలేదు, ఆఖరికి దేవి చేసినవడలు కూడా. మహా సంబరపడిపోతూ ఆవంటకాలు తింటున్న చిన్నప్పని ఆశ్చర్యంగా చూడసాగింది కామాక్షి. పూర్వం పళ్లెం విసిరి కొట్టేవాడు ఏమాత్రం తేడా వచ్చినా. ఆ చిన్నప్పేనా ఇతగాడు?

జనం క్రమంగా చిన్న చిన్న గుంపులుగా విడిపోయేరు. కొందరు పానీయాలు పుచ్చుకు నిలబడ్డారు. కొందరు కబుర్లలో పడ్డారు. మరికొందరు రెండూ చేస్తున్నారు. ఒకళ్లిద్దరు కామాక్షికీ, వెంకట్రాంకీ డ్రింకులు ఆఫర్ చేసేరు. వాళ్లిద్దరూ తమకి అలవాటు లేదని తెలియజేశారు. అసలు తాగనివారిని కొందరిని చూసి ఆశ్చర్యపడింది కామాక్షి.   

“బీరు తీసుకోవోయ్. ఫరవాలేదు. అది ఒట్టి బార్లీ నీళ్లే. ఆరోగ్యం కూడాను,” అన్నాడు చిన్నప్ప వెంకట్రాంతో మేలమాడుతూ.

“చాల్లే, నువ్వు చెడింది కాక వాణ్ణి కూడానా ..” అంది కామాక్షి చిరాగ్గా.

“నువ్వక్కడే పొరబడుతున్నావు. చుట్టూ చూడు. వీళ్లంతా చెడిపోయినవాళ్లేనా? అన్ని పానీయాల్లాగే ఇదీ ఒక పానీయం. నిజానికి ఇది ఒఠ్ఠి నీళ్లే మన ఇండియాలో బీరుతో పోలిస్తే. అఫ్ కోర్స్. ఇక్కడ తాగుబోతులు లేరనను. అది వేరే కథ. అది పోనియ్. ఇక్కడ యువతరాన్ని చూడు. వీళ్లలో చాలామంది మన వెంకట్రాం ఈడువాళ్లే. ఒకొక్కళ్లూ వాడిలాటి వాళ్లని నలుగుర్ని పట్టుకు తన్నగలరు. ఏదో ఓ పని చేసుకుని, సంపాదించుకుంటూ చదువుకుంటున్నారు. వాళ్లకేం ఇష్టమో, ఏం చదువుతారో, ఏం ఉద్యోగాలు చేస్తారో, అన్నీ వాళ్లకి వాళ్లే నిర్ణయించుకుంటారు. మనదేశంలోలా కాదు. అక్కడ తల్లి డాక్టరంటే డాక్టరూ, తండ్రి లాయరంటే లాయరూ, తాత మరేదో అంటే అదీ ..” చిన్నప్ప విసుగేసినట్టు ఆపేశాడు. గదిలో ఎవరో ఓమూలనించి అతనికి చెయ్యూపేరు. “excuse me” అంటూ అతనటు వెళ్లేడు.

ఇంటికి తిరిగి వస్తూ, చిన్నప్ప ఇందాకా సగంలో వదిలేసిన ఉపన్యాసం మళ్లీ ఎత్తుకున్నాడు, “ఆ గళ్లచొక్కా కుర్రాణ్ణి చూశావా? అతనిపేరు టిమ్. కొన్నాళ్లు గ్రీక్ చదివేడు. తరవాత బాటనీ చదివేడు. ఇప్పుడు చరిత్ర మొదలుపెట్టేడు. ఏదో ఫొటోషాపులో పని చేస్తున్నాడు. పేపర్లు అమ్ముతాడు. ఒకమాట చెప్తాను విను. కావాలంటే మన వెంకట్రాముడు కూడా ఇక్కడే ఉండి చదువుకోవచ్చు. ఏడాది తిరిగేసరికి తనచదువుకే కాక, నీకు కూడా పదో పరకో పంపగలుగుతాడు …”

కామాక్షి తృళ్లిపడింది.

వెంకట్రాముడు ఉలిక్కిపడ్డాడు.

చిన్నప్ప అదేమీ గమనించనట్టు చెప్పుకు పోసాగేడు, “అంటే వెంకట్రామనే కాదు. ఊరికే, ఉదాహరణకి చెప్పేనంతే. వాణ్ణి పంపిస్తే, నీకు ఇబ్బంది కాదూ ..అలాగని నువ్విక్కడ ఉండిపోనూ లేవు. ఈపద్ధతులకి నువ్వు తట్టుకోలేవు. ఇంత పెద్ద మార్పు.. ఈ వంటలూ, ఈతిళ్లూ, ఈ చలీ నీకీజన్మలో అలవాటవవు. ఓహ్ .. సారీ .. ఆ, ఏమిటీ మాటాడుతున్నది. అదే, స్వశక్తిమీద ఆధారపడి బతకడం. అది నాకు నిజంగా నచ్చింది ఇక్కడ. మనదేశంలో ఒక్కడిసంపాదనమీద పదిమంది పడి తింటారు. ఇక్కడ అది చెల్లదు. అంటే నేను మన సాంప్రదాయాలని తీసి పారేస్తున్నానని అనుకోకు. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా ఇదంతా నువ్వు పెట్టిన భిక్షేనన్న సంగతి మరిచిపోను. అది మనసులో పెట్టుకునే చెప్తున్నాను. నువ్వూ వెంకట్రాం కావాలంటేనే, ఇక్కడ పెట్టుకుని చదివిస్తాను. కష్టం, సుఖం అని చూడను. దేవి కూడా మనవరసే. ఇటువంటి విషయాల్లో మాఇద్దరికీ ఒక్కలాటి ఆలోచనలే. సరేలే. అదలా ఉంచు. ఇక్కడ వారి individualityగురించి. మాడైరెక్టరు ఉన్నాడు చూడు. స్వయంగా తనచేతులతో తనే గరాజి కట్టుకున్నాడు. అదేదో పనివాళ్లని పెట్టి కట్టించుకోలేక కాదు. తనచేతులతో తను కట్టుకోడంలో ఉన్న ఆనందంకోసం, తృప్తికోసం … అలాగే మరో డాక్టరు, కోటీశ్వరుడు తనఇంటికి కావలసిన ఫర్నిచరంతా తనే చేసుకున్నాడు. …”

చిన్నప్ప ఒక నిముషం ఆగేడు ఏదో ఆలోచిస్తున్నట్టు. “నిజానికి దేవీయే అంది ఒకటి రెండుసార్లు మన వెంకట్రాంని ఇక్కడ ఉంచుకుని చదివిద్దాం అని. చాకులాటి కుర్రాడని నేనే చెప్పాలే … కానీ బహుశా నీకు నచ్చదేమో. నాకు తెలుసులే అందులో కష్టం. పైగా నేను చెడింది చాలదూ, …” అన్నాడు ఎత్తిపొడుస్తున్నట్టు.        

“చాల్లే” అంది కామాక్షి. ఆవిడ నొచ్చుకుందో, మెచ్చుకుంటోందో అర్థం కాలేదతనికి.

సమాధానంగా అన్నాడు, “ఒక్కమాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడిసౌఖ్యాలు ఇక్కడివీ. అక్కడిసౌఖ్యాలు అక్కడివీ. అక్కడ రెండు రూపాయలు పారేస్తే చాకలాడు శుభ్రంగా ఉతికి, ఆరేసి, ఇస్త్రీ చేసి తీసుకొస్తాడు బట్టలు. ఇక్కడయితే మనమే తీసుకెళ్లి లాండ్రొమాట్‌లో ఇవ్వడానికి కూడా అయిదు డాలర్లు తగలేయాలి. అంచేత, ఎవరికి వారు ఆలోచించుకోవాలి తమకి ఏది ముఖ్యమో. నామటుకు నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఇండియా వచ్చేద్దాం అని. వస్తానేమో కూడా కొంతకాలం అయినతరవాత, తగినంత డబ్బూ, అనుభవమూ సంపాదించేక. అప్పుడు నేను నాకు తగిన ఓ కంపెనీ ఓపెన్ చెయ్యొచ్చు. నాలాంటివాళ్లని మరో పదిమందిని ట్రైన్ చెయ్యొచ్చు. అదీ నాప్లాన్ .. జరుగుతుందనే నా ఆశ ..”

రాను రాను ఇంగ్లీషుమాటలు వచ్చేస్తున్నాయి ఎంత జాగ్రత్తగా మాటాడినా.

ఇంతలో ఇల్లొచ్చింది. చిన్నప్ప మాటలాపి, కారాపాడు.

                                                000

ఆరాత్రి కామాక్షీ వెంకట్రాముడూ గెస్ట్ రూంలో తీవ్రంగా హోరాహోరీ వాదించుకుంటుండగా,

అదే సమయంలో మాస్టర్ బెడ్‌రూంలో చిన్నప్పకీ దేవికీ మధ్య సంభాషణ ఈవిధంగా సాగిందిః

“ఏఁవైంది?”

“కొనేసినట్టే”

“ఆవిడ కూడానా?”

“ఎందుకూ? మనం అనుకున్నది వాడొక్కడిగురించే కదా.”

“అవును. నెలకి వంద డాలర్లు కలిసొస్తాయి ఖర్చులు పోనూ.”

                                                          000

(ఈకథకి ఇంగ్లీషు అనువాదం Encounters: Selected Indian and Australian short Stories (compiled by A. Janakiram and Bruce Bennet) లో ప్రచురించబడింది)

(మార్చి 20, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “కొనే మనిషి”

 1. కథ మూడొంతుల దగ్గరికి వచ్చే సరికి మీ స్థాయికి తగిన కాదనిపించింది. ముగింపుతో ఓక్ఖ దెబ్బని దిమ్మ తిరగ్గొట్టారు! దెబ్బకి ఓ హెన్రీ కళ్ళముందు కనబడ్డాడు 🙂

  మెచ్చుకోండి

 2. రాధికా, క్షమాపణలు అంటూ కోరవలసివస్తే, నేనే చెప్పుకోవాలేమో!
  అన్నీ కాదు కానీ, గత రెండు కథలూ ముందు ప్రచురించినవే. కారణాలు చాలా ఉన్నాయి. కొందరికి పిడియఫ్ ఓపెనవలేదు. కొన్ని వేరే ఫాంట్స్‌లో ఉన్నాయి. పైగా మొదటి ఏడు ప్రచురించినకథలకి వందమంది కూడా లేరు పాఠకులు. ఇప్పుడు ఆ సంఖ్య 400-500కి పెరిగింది. చదివేవారున్నారు కదా అని నాకు కూడా కాస్త సరదాగా ఉంది. ఇలా ఎన్నో … పైగా, నేను నాకథలన్నీ ఒక క్రమపద్ధతిలో ఇ-బుక్ చెయ్యడానికి అనువుగా టైపు చేస్తున్నాను. … బహుశా ఇంకా బలమైన కారణం కొత్తకథలకి సరుకు లేక … అదే అసలు రహస్యం అనుకో. మ్. :)).

  మెచ్చుకోండి

 3. ఈ కధలన్నీ మీ బ్లాగులో ఇంతకు ముందే ప్రచురించినట్టున్నారు కదండీ.మీ బ్లాగులో పోస్ట్ చేసారా లేదా అని నేను వెతకలేదు కానీ ఎక్కడో చదివానని మాత్రం గుర్తుంది.తప్పైతే మన్నించండి.

  మెచ్చుకోండి

 4. @ SSRao, ధన్యవాదాలండీ.
  @ వాసు, సంతోషం మీకు కథ నచ్చినందుకు. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. అక్కడే నావ్యాఖ్య పెడతాను, మీకథలు చదివినతరవాత.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ !
  అద్భుతం. కథనం కొసమెరుపు దాకా ఆసక్తిగా నడిపారు. ఈ కథ అప్పట్లో చదవకుండా ఎందుకు మిస్సయ్యానా అనిపించింది. అభినందనలు.

  మెచ్చుకోండి

 6. భలే ఉంది. మొదలెట్టాకా ఇక ఆపాలనిపించలేదు. అయిపోయేసరికి అప్పుడేనా అనిపించింది. “కొనే మనిషి ” పేరు అతికినట్టు ఉంది కథకి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s