విపర్యయం

  క్రిందనించి “కృష్ణా” అని అమ్మ మళ్లీ పిలుస్తూంది.

కృష్ణుడు కుర్చీలో కూర్చుని టేబుల్‌వేపు తదేకంగా చూస్తున్నాడు.

అప్పడే రైలు దిగి వచ్చేనేమో, స్నానం చేసి పడుకోడంతో నిద్ర ముంచుకొస్తోంది.

బలవంతంగా కళ్లు విప్పి వాడివేపు చూస్తూ అన్నాను, “అమ్మ పిలుస్తున్నట్టుంది,” అని.

“నువ్వెళ్లు కావలిస్తే” అన్నాడు వాడు విసురుగా.

“అలకా? వినిపించలేదేమో అనుకున్నాను,” అన్నాను అటు ఒత్తిగిలి మళ్లీ నిద్రకొరుగుతూ.

కృష్ణుడు క్షణకాలం వూరుకుని, “బావని చూసిరమ్మంటోంది,” అన్నాడు.

ఇంట్లో అందరికంటె చిన్నవాళ్లం అవడంవల్లా, మిగిలినవాళ్లకీ మాకూ మధ్య వయసు బేధం ఎక్కువ అవడంవల్లా మాఇద్దరిమధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం కంటె స్నేహమే ఎక్కువ.

“బావసంగతి ఇప్పుడెందుకొచ్చిందీ?” అన్నాను లేచి కూర్చుంటూ.

“inspection టైం కదా. టీ.బీ.లో దిగేట్ట,” అన్నాడు కృష్ణ.

నేను మాట్లాడలేదు.

మళ్లీ వాడే అన్నాడు, “ఇక్కడికోమారు భోజనానికని తీసుకొస్తే అక్కయ్యని తీసుకెళ్తాడేమో అడగొచ్చని అమ్మ ఆశ,” అని.

“వెళ్లడానికి నీకేం?” అన్నాను.

“ఏం అంటే ఏం చెప్పను? నాకసహ్యం. మనిషివిలువ లేకుండా ఎలాగో ఒకలాగ వాళ్లింటికి తీసుకెళ్తే చాలని బతిమాలడం అంటే నాకు ఒళ్లు మండుతుంది,” అన్నాడు ఎర్రబడ్డ మొహంతో.

నాకు అక్కయ్యపెళ్లి జ్ఞాపకం వచ్చింది. పదమూడేళ్లవుతోంది. నాకు వూరిపేరు కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు. బెంగుళూరుకి వెళ్లే పాసింజరులో వెళ్లేం. పెళ్లి గుంటూరులో అయింది. తరవాత పెళ్లికొడుకు వాళ్లవూరు వెళ్తున్నాం. మగపెళ్లివారితో ఒకావిడ వచ్చింది. చాలా అందంగా వుంది. నాకప్పుడు తొమ్మిదేళ్లు వుంటాయేమోయ ఆవిడకి నేను నచ్చేనేమో తనవెంట తిప్పుకునేది పెళ్లయినంతసేపూ. నన్ను ఆవూళ్లో ఇంకెక్కడో తిప్పేది. నేనూ ఆవిడతో వెళ్లిపోయేదాన్ని. రైలెక్కినతరవాత నాకు బాగా నిద్ర వచ్చేసింది. సగం రాత్రయిందేమో కంపార్ట్‌మెంటులో ఏదో కలవరం బయల్దేరింది. నేను ఉలిక్కిపడి లేచేను.

“ఏమయిందమ్మా?” అని అడిగితే, అమ్మ “నీకెందుకు, నోరు మూసుకుని పడుకో,” అని కసిరింది.

అక్కయ్య ఓమూల కూచుని ఏడుస్తోంది. అటూ ఇటూ పరికించి చూశాను. ఆఅందమయిన ఆవిడ ఎక్కడా కనిపించలేదు.

తెల్లగా తెల్లారింతరవాత స్టేషనులో దిగినప్పుడు నాకు పూర్తిగా అర్థమయింది. పెళ్లికొడుకు తప్పిపోయాడు. పెద్ద అల్లరయింది. అక్కయ్యని తీసుకుని మళ్లీ మావూరు వచ్చేశాం.

ఆతరవాత అమ్మా, అన్నయ్యా అక్కయ్యజీవితం దిద్దడానికి ఏం ప్రయత్నాలు చేసేరో మాకు తెలీదు.

నాకూ, కృష్ణడికీ ఏదో చెయ్యాలని వుండేది. ఏం చెయ్యాలో తెలిసేది కాదు. అప్పుడే బావకి ఒక ఉత్తరం రాసేం ఇద్దరం కలిసి. అది ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది.

“అక్కయ్య చాలా బాధ పడుతోంది. మీకు ముందే పెళ్లి అయివుంటే మళ్లీ పెళ్లి చేసుకోడం చాలా తప్పు కదా. మీరు ఎందుకు ఇలా చేశారు? ఇది అన్యాయం కాదూ? చూడండి. మీనించి మాఅక్కయ్యకి కష్టాలు. మీరు ఇప్పుడు తీసుకెళ్లకపోతే పోలీసురిపోర్టు ఇస్తాం. …” -ఇలా రాశాం. అప్పటికింకా మంత్రాలకి చింతకాయలు రాలవని తెలీనివయసు. ఆ వుత్తరం బావకి అందివుంటుందనీ, బావ మనసు మార్చుకుని అక్కయ్యకోసం ముత్యాలపల్లకీ పంపిస్తాడనీ అనుకున్నాం.

రెండేళ్లు గడిచిపోయాయి. అమ్మ ఎప్పుడేనా “అతనిక్కడ వున్నాట్ట, అక్కడ వున్నాట్ట” అంటూ ఆరాలు తీసి అన్నయ్యకి అందిస్తూ వుండేది వార్తలు. దానిమీద అన్నయ్య ఏమైనా చర్య తీసుకున్నాడో లేదో మాకు తెలీదు. అక్కయ్యని మాత్రం చదువుకోమనేవాడు. అక్కయ్యకి చదువుపై అంత దృష్టి వుండేది కాదు. ఆ ఏడే మెట్రిక్ పరీక్ష వ్రాసింది కానీ ప్యాస్ కాలేదు. “పెళ్లి చూస్తే అలా అయింది. చదువు చూస్తే ఇలా వుంది. ముందు ముందు ఎలా జరుగుతుందో” అని అమ్మ ఒకటే బాధ పడడం.

అప్పుడే నేనూ కృష్ణుడూ కలిసి మరో ప్లాను వేశాం. వాడే అడిగేడు, “ ఆవిడపేరు నీకు తెలుసు కదే” అని. రమణి అని చెప్పేను.

“ఆవిడ ఎక్కడో పని చేస్తోందన్నావు?” అన్నాడు వాడు.    

అవునన్నాను. ఇద్దరం కలిసి గవర్నమెంటుకి ఉత్తరం వ్రాసి పడేశాం. “ఫలానా ఆవిడని ఫలానా ఆయన భార్య వుండగా పెళ్లి చేసుకున్నాడు” అని. ఆవిడవుద్యోగం, ఆయనవుద్యోగం పోతే ఆవిడ వెళ్లిపోతుందనీ, అప్పుడు బావ మా అక్కయ్యదగ్గరికి వచ్చేస్తాడనీ మేం నమ్మేం.

ఇప్పుడనిపిస్తోంది ఎంత childish అని. మరోమారు మాఆశలు వమ్ము అయేయి. ఇప్పుడు అంతా తల్చుకుంటే గొంతులో చేదుగా అనిపిస్తోంది. నేను గతంలోంచి తేరుకుని, కృష్ణుడిని అడిగేను, “అప్పుడు మనం ఒక ఉత్తరం రాసేం, జ్ఞాపకం వుందా?” అని.

“గవర్నమెంటుకి – అదేనా?” అన్నాడు వాడు.

ఆలోచిస్తూ, మెల్లిగా అన్నాను, “నేను రమణిని చూశాను,” అని.

అనుకున్నట్టుగానే కృష్ణుడు తృళ్లిపడ్డాడు. “ఆవిడ చచ్చిపోయిందనుకుంటోంది అమ్మ,” అన్నాడు.

నాకు అంతరాంతరాల్లో ఓమూల కలుక్కుమంది. ఆవిడబతుకు ఇంచుమించు అంతే.

కృష్ణుడికి నాప్రయాణంసంగతి చెప్పడం మొదలుపెట్టేను. “ఆరోజు ఇక్కడినుంచి బయల్దేరినరోజు మెయిలు తప్పిపోయింది కదా. రాయపూర్ పాసింజరుకి బిలాస్‌పూర్‌కి వెంటనే కనెక్షన్ ట్రైను లేదు. రాయపూర్‌ స్టేషనులో పొద్దున్న పదిగంటలకి దిగినదాన్ని సాయంత్రం ఆరుగంటలవరకూ అందరి యోగక్షేమాలూ కనుక్కుంటూ గడిపేను. తరవాతిరైలు అందుకుని బిలాస్‌పూరు వెళ్లేసరికి  రాత్రి తొమ్మిదిన్నరయింది. చిన్నన్నయ్య పొద్దున్న రైలు చూసి వెళ్లిపోయినట్టున్నాడు. ఎక్కడా కనిపించలేదు. అసలు రైలెక్కడఁవే కొత్త. వూరు కొత్త, భాష కొత్త, టైప్ టూ, యూనిట్ త్రీ, న్యూకోలనీ అని నాదగ్గరున్న ఎడ్రెసు. దైవంమీద, పూర్వజన్మసుకృతంమీద నమ్మకం పెట్టుకుని ఓ రిక్షా ఎక్కేను. నేను స్కూల్లో నేర్చుకున్న హిందీ హై హై అనడానికి తప్ప మరెందుకూ పనికిరాలేదు. రిక్షావాడు ఓపిగ్గా ఓ రెండుగంటలసేపు వూరేగించాడు. ఎంతసేపు అడిగినా ముందులైనుకి వెళ్తే ఆఖరిలైనుకి వెళ్లండంటారు. ఆఖరిలైనుకి వెళ్తే మధ్యలైనుకి వెళ్లండంటారు. ఆఖరికి రిక్షావాడు “ఇంక నేను ఊరేగించలేను, దిగండి” అన్నాడు. అదేలే, అదే అర్థం వచ్చేట్టుగా ఛత్తీస్‌ఘడ్‌లో రిక్షా ఒకచోట ఆపేసి. అయిదు నిముషాలపాటు ఏదో ఉపన్యాసమే ఇస్తున్నాడో కాక నామెళ్లో గొలుసులే అడుగుతున్నాడో తెలీలేదు. ఇహ ఇది పని కాదని, రిక్షా స్టేషనుకి మళ్ళించేశాను.

“డౌన్ ట్రైనుకే?” అన్నాడు కృష్ణుడు. .

“మరేం చెయ్యను? వీలైతే వెయిటింగ్ రూం, లేకపోతే డౌన్ ట్రైను అనుకుంటూ నిల్చున్నాను ప్లాట్‌పారంమీద. అర్థరాత్రి నాపరిస్థితి ఎలా వుందంటే అలా వుంది. ఎవరైనా పలకరించి ‘ఏం’ అంటే ఏడ్చేయడానికి సిద్ధంగా వున్నాను.”

“వీరభారత నారీరత్నానివి కాబోలు” అన్నాడు కృష్ణుడు వెక్కిరింపుగా.

“ఇప్పుడిలా తీరిగ్గా కూర్చుని కథలా చెప్పుకుంటే బాగానే వుంది కానీ ఆక్షణంలో నా అన్నవాళ్లెవరైనా కనిపిస్తారా అని ప్రాణం కొట్టుకుపోయింది. సరిగ్గా అప్పుడే ఆవిడ కనిపించింది. నన్ను చూడగానే గబగబా నాదగ్గరకి వచ్చింది. ఎందుకొచ్చేవు?ఎలా వచ్చేవు? ఒక్కదానివీ రావడానికి ఎంత ధైర్యం?” -అంటూ ప్రశ్నలేసింది.

నేను అక్కడికి ఎందుకు వెళ్లేనో, ఎలా వెళ్లేనో చెప్పేను. మా అన్నయ్య స్టేషనుకి వస్తాడనుకున్నాను అన్నాను. మర్నాడు పొద్దున్న వెతుకుతానన్నాను.

“సాహసం” అంది ఆవిడ. పట్టపగలే మనుషుల్ని తోటకూరకాడల్లా నరికేస్తారంది. ఆడపిల్లలు ఒంటరిగా స్టేషనులో పడుకుంటే జరిగే ఘోరాలు వివరించి తనతో వాళ్ళింటికి రమ్మంది.

ఆవిడవెనకే బయల్దేరానే గానీ నామనసంతా గందరగోళంగా వుంది. అక్కయ్యకి అన్యాయం చేసిన మనిషిసహాయం పొందుతున్నానన్న విసుగు, ఏం జరగబోతుందో అన్న భయం, మరేం చెయ్యాలన్న ప్రశ్న – హఠాత్తుగా అన్నయ్య ఎదురుపడితే … పోనీ మరెవరైనా ఎదురుపడి మీరు వెతుకుతున్న ఇల్లు ఇదీ అని చూపిస్తే .. ఆఖరికి రిక్షా బోల్తా కొట్టి ఆరాత్రికి ఆస్పత్రిలో పడ్డా బాగుణ్ణనిపించింది. కానీ ఏమీ జరగలేదు.

ఆమె ఇంటిముందు రిక్షా దిగుతూ చుట్టూ చూశాను. పరిసరాలు నాకు నచ్చలేదు. గౌరవనీయంగా కనిపించలేదు. అక్కడ ఈవిడ ఏంచేస్తోందన్న అనుమానం కలిగింది. ఆవిడ మంచిగా మాటాడుతున్నకొద్దీ నాకు అనుమానం హెచ్చసాగింది. నామొహం చూసి, “ఏం, ఒంట్లో బాగులేదా?” అంది.

అదేం కాదన్నాను. భోజనం చెయ్యనన్నాను. నాలుగ అరటిపళ్లు యిచ్చింది తినమని. బోర్నవీటా కలిపి తెచ్చింది. “ఒక్కదానివీ ఈగదిలో పడుకోగలవా? నేనూ ఇక్కడే పడుకోనా?” అని అడిగింది.

“జోల పాడలేదూ?” మళ్లీ కృష్ణ వెక్కిరించాడు.

“లేదు. కావలిస్తే బినాకా గీత్‌మాలా రికార్డు వేస్తానంది” అన్నాను. తను పక్కగదిలో పడుకుంటాననీ, కావలిస్తే పిలవమనీ చెప్పి వెళ్లిపోయింది. నాకు మాత్రం రాత్రంతా నిద్రలేదు. ఏమాత్రం కునుకు పట్టినా భయంకరమైన కలలు – ఏవేళప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో, ఈసాలెగూట్లోంచి బయట పడడం ఎలాగో …

హఠాత్తుగా తలుపు తట్టిన చప్పుడుకి ప్రాణాలు ఎగిరిపోయినంత పనయింది. కళ్లు తెరిచి చూస్తే తెల్లగా తెల్లవారిపోయింది. వణికిపోతూ వెళ్లి తలుపు తీశాను. రమణి నించుని వుంది నవ్వుతూ, “తొమ్మిదిగంటలకి ఇంటర్వ్యూ అన్నావు. ఎనిమిది అయినా లేవకపోతే ఎలా?”.

నేను ‘సారీ’, ‘థాంక్స్’ అంటూ గొణుగుతూ వెళ్లి స్నానం అన్నీ ముగించుకుని వచ్చేసరికి రమణి కాఫీ, ఫలహారం సిద్ధం చేసింది. “మీఅన్నయ్య పేరూ, ఎడ్రెసూ, ఈకుర్రాడికి ఇస్తే, నిన్ను కాలేజీదగ్గర దింపి, మీఅన్నయ్యని పిలుచుకొస్తాడు,” అంది పనికుర్రాడిని చూపించి.

నాకు నోట్లోంచి మాట రావడంలేదు. ఏఅనుబంధం ఈవిడని ఇంతగా ప్రేరేపిస్తోందో నాకర్థం కాలేదు.

ఇంటర్వ్యూ తొందరగానే అయిపోయింది.  

తిరిగి వచ్చేసరికి భోజనం దగ్గర్నుంచీ అన్నయ్య పూర్తి ఎడ్రెసువరకూ అన్నీ సమకూర్చి పెట్టింది. రిక్షా ఎక్కుతుంటే బొట్టు పెట్టి ఒక జాకట్టుగుడ్డ చేతిలో పెట్టింది, “ఈనాటికి నాఅనేవాళ్లు ఈయింటికి రావడం ఇదే మొదలు, … ఇదే ఆఖరు కూడానేమో,” అంటూ.

అన్నయ్య అప్పుడు చెప్తాడు తీరిగ్గా, “నయాకోలనీ వేరూ, ఇది తార్ బహార్ నయాకాలనీ,” అని.

కృష్ణుడిమొహంలోకి చూశాను. నేను చెప్పవలసింది ఇంకా వుంది.

“ఆవిడ అక్కడెందుకు వుంది?” వాడే అడిగేడు.

“అదే నాకూ బోధపడలేదు. ఇక్కడేం చేస్తున్నారు” అని అడిగితే, “ఏం, మళ్లీ కేసు పెట్టిస్తావా?” అంది నవ్వుతూ.

“వెధవపన్లు చెయ్యొచ్చు కానీ దండిస్తే తప్పు,” అన్నాడు కృష్ణుడు.

“అక్కడే మనం పొరబడ్డాం,” అన్నాను వాడిని హెచ్చరిస్తూ.

“ఏం?”

“బావ ఆవిడని పెళ్లి చేసుకోలేదు.”

“అంటే?”

“ఆరోజు ఆవిడ వెళ్లిపోయింది వేరొక వ్యక్తిదగ్గరికి. ఆవ్యక్తి ఎవరో, ఏంచేస్తున్నారో కానీ ఇప్పుడు ఆవిడదగ్గిర వున్నట్టు లేదు. పోగా, మనం అధికారులకి వ్రాసిన ఉత్తరం ఫలితంగా ఆవిడ ఉద్యోగం పోయింది.”

మేం మాఅక్కయ్య జీవితం సరిదిద్దబోయి చేసిన పని ఇలా వికటించింది.

కృష్ణుడు మాటాడలేదు. వాడికీ బాధగానే వుందని తెలుస్తూనే వుంది.

అమ్మ క్రిందగదిలోంచి మరోమారు పిలిచింది, “కృష్ణా” అంటూ.

ఈమారు కృష్ణుడు లేచి వెళ్తూ, “అమ్మకి చెప్పనా?” అన్నాడు.

“వద్దు, వద్దు. అక్కడ ఆవిడ కేరక్టరుగురించి చాలారకాల వ్యాఖ్యానాలున్నాయి. నేను అసలు ఆవిణ్ణి చూచినట్టు కూడా ఎవరితోనూ చెప్పొద్దంది వదిన,” అన్నాను.

నాకు తెలుసు నావాదనలో లోపం. ఆలా ఆవిడనిగురించిన అపవాదులుంటే, అందలో నాచెయ్యి ఎంతో కూడా నాకూ కృష్ణుడికీ మాత్రమే తెలుసు. అయినా అమ్మని ఎదుర్కొనే గుండెబలం నాకింకా రాలేదు.

ఆసాయంత్రం కృష్ణుడూ, నేనూ బావదగ్గరికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాం. అన్నయ్య ఎలాగూ అమ్మమాట ఒప్పుకోడు కనక రాయబారం ఫలిస్తే సరి, లేకపోతే ఎవరికీ తెలీదు.

పేముకుర్చీలో విలాసంగా వెనక్కి వాలి పేపరు చదువుకుంటున్న బావ మమ్మల్ని చూడగానే, “ఓ” అన్నాడు.

అది రమ్మని ఆహ్వానమో, పొమ్మని ఆర్డరో అర్థం కాలేదు మాకిద్దరికీ.

ఒక నిముషం అయింతరవాత, అక్కడున్న బెంచీ చూపించాడు. కూచోమన్నట్టు, “ఏం, ఇలా వచ్చేరు?” అని అడుగుతూ.

ఏవేవో అడుగుదాం అనుకున్న మాకు ఒక్కమాటా జ్ఞాపకం రాలేదు.

అతికష్టంమీద నేనే అన్నాను, “అమ్మ మిమ్మల్నొకమారు వచ్చి వెళ్లమంది,” అని.

“ఎందుకూ?”

మళ్లీ మాదగ్గర మాటలు కరువయ్యాయి.

“అక్కయ్య చెప్పింది,” అన్నాడు కృష్ణుడు.

“ఎందుకూ?” మళ్లీ అదే ప్రశ్న.

నాకు కోపం వచ్చింది. అయనకిది ఆటగా వున్నట్టుంది. అందుకే డైరెక్టుగా అడిగేశాను తెగించి, “అక్కయ్యని మీతో పంపించాలని అమ్మ చెప్పడానికి” అని.

“అదెలా వీలవుతుంది? నాకు పెళ్లియిపోయింది,” అన్నాడు బావ.

“ఎప్పుడు?” అని అడిగాను. ఎందుకంటే రమణిని చేసుకోలేదని నాకు స్పష్టంగా తెలుసు కదా.

బావగుండె రాయయివుండాలి. చాలా నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు, “ఎనిమిదేళ్లయింది,”అని.

మాయిద్దరికి ఏం తోచలేదు. అలా కూచునే వున్నాం. బావ కాని ఈ బావ లోపలికి వెళ్లి ఒక ఉత్తరం తెచ్చి కృష్ణుడిమీదకి విసిరేసాడు. అది పదకొండేళ్లక్రితం బావ పెళ్లిమీద పెళ్లి చేసుకున్నాడని మేం అధికారులకి రాసిన ఉత్తరం.

“ఇలాటి ఉత్తరాలు వ్రాసినా లాభం లేదు. వచ్చారు కనక అది తీసుకుని పొండి. వీటికి సంబంధించిన అధికారిచెల్లెల్నే చేసుకున్నాను. అందుచేత నువ్వు ఏం రాసినా అవి నాకే దఖలు అవుతాయి.” బావ మళ్లీ పేపరు తీసుకున్నాడు.

మేం కదల్లేదు.

మళ్లీ బావే అన్నాడు, “ఆరోజు మీరనుకున్నట్టు నేనెవర్నీ లేవదీసుకు పోలేదు. అక్కడ చిన్న స్టేషనులో టీ తాగుదాం అని దిగేను. తీరా టీ తాగేలోపల ఈరైలు బయల్దేరిపోయింది. నేను టీకి డబ్బులిచ్చి రాబోతుంటే ప్లాట్‌ఫారంకీ పాసింజరుకీ మధ్య గుడ్స్ బండి ఒకటి అడ్డొచ్చింది. ఆ రాత్రికి స్టేషన్‌లో గడిపి, మర్నాడు దొరికిన బస్సెక్కి ఇంటికి వచ్చేను. అప్పటికే మీరు మావాళ్లని నానామాటలు అనడం, వెళ్లిపోవడం కూడా అయిపోయింది. అంతే. ఆ రమణి ఎక్కడ తప్పిపోయిందో నాకు మర్నాటి మధ్యాహ్నంవరకూ తెలీదు.”

“పోనీ, ఆసంగతి మీరు ఉత్తరం వ్రాసి ఉండొచ్చు కదా!” అన్నాను.

“ఆడపిల్ల నిచ్చుకున్నవాళ్లు మీకే అంత టెంపరుంటే, అందులో సగమయినా మావాళ్లకుండదూ?అందుకే మావాళ్లు మళ్లీ మీఅక్కయ్యను తీసుకురావడానికి ఒప్పుకోలేదు.”

నాకు వొళ్లు మండిపోతూంది, “ఆడపిల్లనిచ్చుకున్నవాళ్ల స్థితి అంత హీనం కాబోలు. ఆ పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారు?” అన్నాను.

“ఆ పరిస్థితిలో మే లేం కదా!” అన్నాడు. ఎంత కఠినుడు‍!

బావ తనసమస్య సుళువుగానే పరిష్కరించుకున్నాడు. అక్కయ్యకే ఇదివిడదీయడానికి ప్రయత్నించేకొద్దీ బిగుసుకుపోయే ఉచ్చుగా తయారయింది.

“పద” అన్నాను కృష్ణుడితో.

ఇద్దరం వెనుదిరిగి వస్తూ వుంటే పరిదీనవదనయైన అక్కయ్యతోబాటు రమణి కూడా నామనసులో మెదిలింది.

(సాహితి మాసపత్రిక. జులై 1969)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “విపర్యయం”

 1. నిజమేనండి. అలాగే జరుగుతున్నాయి. కానీ నాకథలని స్త్రీవాదకథలుగా మలచడానికి ఇష్టపడను. ఇతర కారణాలు కూడా ఉంటాయని చెప్పడానికి ప్రయత్నించేను. చదివి చక్కని అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. ఆలోచనలో పడేసింది .. సిట్యుయేషనల్ ట్రాజెడీ ..మగవాడిననే అహంకారం కాస్త. కాని యాక్షన్ తీసుకొని ఉండుంటే అతగాడు కాళ్లబేరానికి వచ్చేవాడు. అతను ఆ డిపార్టుమెంటు లోనే పనిచేయడం వల్ల చెత్తబుట్ట దాఖలైంది అనిరాశారు. కాని అలా కాక పోయినా ఇలాగే జరిగేది. ఈ నాటికీ మొగవాళ్ల మీద స్వయంగా భార్యే కంప్లయింట్ చేసినా..ఎవరూ పట్టించుకోరు. అదే ఆడవాళ్ల మీద గాలివాటు కబురందినా చాలు. నేనూ చూశాను. పక్షపాతం..

  మెచ్చుకోండి

 3. చాలా బాగుందండి కధ! అరిటాకూ ముల్లూ సామెత గుర్తుకొచ్చింది. సమాచారలోపం వలన ఇద్దరు ఆడపిల్లల జీవితాలు భంగపడ్డాయి.

  మెచ్చుకోండి

 4. @ లలిత, మీరు ఇలా నాకథలు మళ్లీ చదువుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ రచయిత అయినా కోరుకునేది అదే కదా. కథగురించి మీరు రాసే వ్యాఖ్యలు నాకు స్ఫూర్తిదాయకం. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ,
  మీ కథలు ఒక్కటొక్కటే మళ్ళీ చదువుతున్నాను. నాకు మీ కథలు చదివిన తృప్తినిస్తాయి. ఎందుకు అని తెలుసుకోవడానికి మళ్ళీ వరసగా చదవడం మొదలు పెట్టాను. ఈ కథ plot గురించి ఎలా ఆలోచించి ఉంటారా అన్నది ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ పిల్లలు సమస్యని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలు ఎలా ఊహించారసలు? ఎందుకంటే నాకు నిజ జీవితంలో కొందరు పిల్లలు ఇలా ఆలోచించడం, ప్రయత్నించడం తెలుసు. పాత్రలు, వారి ఆలోచనల వ్యక్తీకరణ, మీ కథలన్నింటిలో ఒక నిండుదనం కలిగి ఉంటాయి. ఇక్కడ పిల్లలకి వ్రాయడం అనే కళని నేర్పించడంలో భాగంగా (language arts) show, not tell అని అలవాటు చేస్తారు. అలా ఆ నిండుదనం మీరు పూర్తిగా వర్ణించడం వల్లో నేరుగా చెప్పడం వల్లో కాకుండా చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి వల్ల వస్తోంది. మనసులో అనుకుని మాటలలో చెప్పలేని వాటికి చాలా సార్లు మీ దగ్గర వ్యక్తీకరణ దొరుక్తుంది.
  క్లిష్టమైన సమస్యల గురించిన కథలు కూడా మనసు బరువెక్కించడం కాకుండా దృష్టి నిలిపి ఆలోచించేలా చేస్తున్నాయి.

  మెచ్చుకోండి

 6. @ కొత్తపాళీ, మీరు అడిగేక నాక్కూడా అనుమానం వచ్చి, నిఘంటువులు వెతికేను. నాకు దొరికిన అర్ధాలు ఇవీ.
  1. విపర్యయముకి పర్యాయపదాలు బ్రౌణ్యనిఘంటువుప్రకారం తిప్పడము, అన్యధా చేయడము, విపరీతము అనిట.
  2. మరెక్కడో “ఉన్నవస్తువును గుర్తించకుండా లేనటువంటి మరో వస్తువును భావించడమే విపర్యయము” అని ఉంది.
  నేను వెనక, యాభై ఏళ్లకిందట ఆపేరు పెట్టినప్పుడు అనుకున్నదొకటి, అయిందొకటి అనుకున్నాను. తప్పంటారా?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.