విషప్పురుగు

నన్ను ముత్యాలపేట జిల్లా పరిషత్తు హైస్కూలికి బదిలీ చేశారని తెలిసినప్పుడు, నన్ను తెలిసినవాళ్లందరూ విచారించారు.

“మంత్రిగారి మేనల్లుడుగారి తోటమాలి రికమెండేషనే ఔగాక, తోటమాలికొడుకు ఈఊరే ఎందుకు కోరుకోవాలి? కోరుకున్నాడు పో. మిమ్మల్ని ముత్యాలపేటకే తోలనేల?” అంటూ రుసరుసలాడేరు మునసబుగారు.

“పోన్లేద్దురూ. మీరు నాయందున్న అభిమానంచేత ఈవిధంగా నొచ్చుకుంటున్నారు. కానీ అక్కడున్నది మాత్రం మనుషులు కాదుటండీ. కాకపోతే కాస్త ఆవేశంపాలు ఎక్కువే కావొచ్చు. నాకు మాత్రం లేదూ రోషం? నిజానికి ఏవరేజి కంటె ఎక్కువే కదండీ నాకు,” అన్నాను నవ్వుతూనే, వాళ్లు నాయందు చూపుతున్న అభిమానానికి రిచ్చవడుతూనే.

“అదేనండీ మాభయం కూడాను. మీరేమో ముక్కుకి సూటిగా పోయేకోవకి చెందుతారు. ముత్యాలపేటలో మనుషులు ముత్యాలలాంటి వాళ్లు కాదండీ. కడప నాపరాళ్లలాటి వాళ్లు. మీరు మరీ అంత నిక్కచ్చిగా ఉన్నారంటే …” ఆపైన జరిగేది తలుచుకోడానికే భయపడినట్టు ఆగిపోయేడు ఫస్టసిస్టెంటు రఘునాథరావు.

“శివాజీల వంశంలోనుంచి వచ్చినవాడివి. నువ్వు బెదిరిపోవడమే కాక నాకు కూడా పిరికితనం నూరిపోస్తావా?” అని సన్నగా అతన్ని చీవాట్లు పెట్టి, మొత్తమ్మీద వారందరిదగ్గిరా శలవడిగి పుచ్చుకుని ముత్యాలడొంక దారి పట్టాను.

బండిలో కూర్చుని వెనక్కి పోతున్న ఊరుని మసకబారిన కళ్లతో చూస్తుంటే, ఆ బంధం ఎంత గట్టిదో తెలిసినట్టయింది.

నేను ఫలానా బస్సుకొస్తున్నానని ముందే కలగన్నారేమో ముగ్గురు టీచర్లు, ఇద్దరు ఎటెండర్లు, ప్యూనుతో సహ బస్సుదగ్గరకొచ్చేశారు. పరస్పరం పోల్చుకోడానికి అరక్షణం కూడా పట్టలేదు. సీనియారిటీప్రకారం తమతమ గోత్రనామాలు నివేదించుకున్నాక, బసకి బయల్దేరేం. నా అలవాటుననుసరించి, రెండో మూడో అక్షరాల పొడిమాటలతో వాళ్లని వాగిస్తూ, నాపాటికి నేను అంచనా వేయసాగాను. నా అంచనాలకి పావుగంట కాలం సరిపోయింది. అరగంట దాటకుండా, వారికి శలవిచ్చి పంపేయడం సాధ్యమయింది.

మర్నాడు స్కూలికి వెళ్లేసరికి అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ కనిపించేరు. నేను మాటాడకుండా వారివారి క్లాసులకి పొమ్మని పంపేశాను. పదిగంటలు దాటి పది నిముషాలు అయినతరవాత ప్యూను ఎటెండెన్సు రిజిస్టరు తీసుకుని వచ్చి నాబల్లమీద పెట్టేడు. నేను అందరి సంతకాలూ సరి చూసుకుని, నా సంతకం పెట్టబోతుండగా, ఆఖరిపేరుదగ్గర సంతకం కనిపించలేదు.

“రోశయ్య రాలేదా?” అనడిగేను తలెత్తి చూస్తూ.

“నేనేనండీ రోశయ్యని” అన్నాడు రిజిస్టరు తెచ్చిన ప్యూను.

ఆలస్యంగా – అంటే అదే అప్పుడే – వచ్చేడు. తన నిజాయితీకి నిదర్శనంగా ఆలస్యం అయినసంగతి నాతో చెప్పి సంతకం పెట్టదలుచుకున్నాడు.

“ఎందుకు ఆలస్యంగా వచ్చేవు?” నేను ప్రశ్నించేను. కోరి సంజాయిషీ ఇవ్వదల్చుకున్న ముద్దాయిని ఆ మాత్రం ప్రశ్నించకపోతే ఎలా మరి?

“లేటయిందండి” అన్నాడు రోశయ్య.

“అదేనోయ్. ఎందుకు లేటయిందీ అనడుగుతున్నాను” అన్నాను చిరాగ్గా.

“ఆలిస్సెమయిపోయిందండీ.”

నాకు చటుక్కున కోపం వచ్చింది. “చూడు, నీ అలవాట్లు ఏమిటో నాకు తెలీవు కానీ నేను మాత్రం సూటి సమాధానాలకీ, క్రమమయిన నడవడికీ అలవాటు పడినదాన్ని. వేళాకోళాలూ, వికృతచేష్టలూ సహించను. ఇంకొకసారి లేటయినా ఆలస్యమయినా శిక్ష అరరోజు కాజువల్ లీవు పోగొట్టుకుంటావు. నీప్రవర్తన తదనుగుణంగా మార్చుకోడం మంచిది,” అన్నాను రిజిస్టరు అతనిముందు పడేస్తూ.

రోశయ్య మనసులో ఏమైనా అనుకుని ఉంటే, ముఖంలో మాత్రం తెలియజేయలేదు. నిర్వికారంగా సంతకం పెట్టి, రిజిస్టరు తీసుకుని వెళ్లిపోయేడు.

అయితే అది అంతటితో ముగిసిపోలేదని నాకు అరగంటలోపునే అవగతమయింది. ఆ అరగంటలోనూ నాకు అందించబడిన సందేశాలూ, హితబోధలూ – వాటి సారాంశం నేను రోశయ్యని ఓకంట కనిపెట్టి ఉండడం మంచిదని. భవబంధాలకీ, లౌకికవ్యాపారాలకీ చిహ్నమయిన నియమాలకి వాడు కట్టుబడి ఉండడు. వాణ్ణి మీరు తిట్టినా, ఛార్జ్‌షీటు దాఖలు చేసినా, బేఖతర్‌గా తనపని తాను చేసుకుపోతూనే ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనవిషయం వాడు పాముల్ని పట్టడంలో దిట్ట. ఆచుట్టుపట్ల పది, పన్నెండు పల్లెలకీ వీడొక్కడే పాములపాలిట యముడు. పరీక్షన్మహరాజు మూలమూలల దాక్కున్న నాగసంతతిని యాగం చేసి పట్టేడు. రోశయ్య గారడీ చేసి పట్టేస్తాడు. అంతే తేడా. అంచేత వాడితో తగువుకి తలపడ్డం కొండతో ఢీకొనడమో, కొరివితో తల గోక్కొనడమోగా పరిగణింపబడుతోంది ఆప్రాంతాల్లో.

అటువంటి కాకమ్మకథలు నాకు చెప్పకండి అని సాధ్యమయినంత సౌమ్యంగా చెప్పి వాళ్లని పంపించేశాను. అయితే రోశయ్య మాత్రం రోజూ పదిదాటి ఓ రెండు నిముషాలయినా ఆలస్యంగానే కానీ సమయానికి వచ్చేవాడు కాడు. ఏమైనా అంటే, ఎనిమిదిమైళ్లదూరం నుంచి వస్తున్నాననేవాడు. పైగా, ఏరోజుకారోజే వచ్చేవరకూ వస్తాడన్న నమ్మకం లేదు. రానిపక్షంలో శలవుచీటీ అందుతుందన్న భరోసా లేదు.

నేను వాచా చెప్పగలిగినంత చెప్పి చూశాను. ఒకటి, రెండు మెమోలు కూడా ఇచ్చి చూశాను. కానీ రోశయ్య ధోరణిలో మార్పు లేదు. మనిషి కనిపిస్తే మాత్రం అదేదో సామెత చెప్పినట్టు కాలితో చెప్పినపని తలతో చేసేవాడు. నాకు అనుభవంలోకి రాకపోయినా, ఇతర అసిస్టెంట్లు మాత్రం అడపా తడపా ఏదో ఓకథ తెస్తూనే ఉన్నారు – తాము చెప్పినపని చెయ్యనన్నాడనీ, అసలు అయిపే ఉండడనీ … ఏదో ఒకటి. నెలయినా తిరక్కముందే నాకు వాడొక పెద్ద సమస్యగా తయారయేడు.

స్కూలికి రావలసిన పార్సిలొకటి అందకపోవడంతో మొదలయింది తగువు.

సాధారణంగా స్కూలు ఉత్తరాలూ, నాఉత్తరాలూ రోశయ్యే పోస్టాఫీసునించి తెస్తాడు. పోస్ట్‌మానవుడు అనేవాడు ఒకడు కలడో లేడో, ఉంటే ఏంచేస్తున్నాడో నా ఊహకందనివిషయం.

ఓరోజు మధ్యాన్నం ఇంట్లో అతిథులున్నారని ఇంటికి వెళ్లేను. భోజనానికని వెళ్లిన రోశయ్య కూడా మళ్లీ తిరిగి రాలేదని తెలిసింది నాకు. ఆరోజునే స్కూలుకో పార్సిలు తగలడిందిట. అదెప్పుడు తెలిసిందంటే, పోస్టుమాస్టరుగారి కుమారరత్నం ఆ రిజిస్టర్డు పార్సిలుతాలూకూ రసీదుకోసం స్కూలికి వచ్చినప్పుడు. రోశయ్యచేతికి పార్సిలుతోపాటు ఆ రసీదు కూడా ఇచ్చారుట నాచేత సంతకం చేయించుకురమ్మని. క్లర్కునడిగితే రోశయ్య అసలు మధ్యాన్నం స్కూలికి రానేలేదనీ, అంచేత ఆపార్సిలూ, రసీదూ కూడా లేవనీ చెప్పేడు. వాకబు చేసి, తరవాత ఆరసీదు పంపిస్తానని ఆకుర్రాడికి చెప్పి పంపించేశాను.

రోశయ్యకి మెమో ఇవ్వమని క్లర్కుకి ఓ ఆజ్ఞ పడేసేను.

అతను వెనుదిరుగుతూ పెదవి చప్పరించేడు. “ఇలాటివి చాలా తిన్నాడు వాడు. వాడికిదో లెఖ్కలోనిది కాదు,” అన్నట్టు శిరఃకంపనం చేసేడు.

“నేను చెప్పలేదుటండీ, వాడొక irresponsible fellow,” అన్నారు తెలుగు మేష్టరు.

“మీరు ఏదయినా తీవ్రచర్య తీసుకొనకపోయినచో లాభము లేదు,” అన్నారు ఇంగ్లీషు మేష్టరు.

హెడ్డు గోతిలో పడ్డందుకు జాలిపడుతూ తలో బెడ్డా విసిరేరు.

“రానియ్యండి” అన్నాన్నేను పళ్లు నూరుతూ.

“జాగ్రత్తండోయ్. వాడు పాములపాలిటా, మనపాలిటా కూడా యముడే,” అని వాడి specialtyనీ, పొదలమాటు ప్రమాదాన్నీ పరోక్షంగా తెలివిడి చేశారు డ్రాయింగ్ మేష్టరు.

రోశయ్య మర్నాడు మధ్యాన్నం మూడుగంటలకి వచ్చేడు.

“ఏం, అందరికీ ఆరుగంటలకి తెల్లారితే నీకు మూడుగంటలకి పొడిచిందేమిటి పొద్దు?” అన్నాను కఠినంగా.

“ఇయాల్టికి గూడ లీవు రాసేతానండీ,” అన్నాడు వినయంగానే.

“నీలీవులెటరు ఒక్కటే ముఖ్యం కాదు. ఇక్కడ పని కూడా జరిగాలి కదా. నిన్నపొద్దున్నే ఎందుకు చెప్పలేదూ మధ్యాన్నం రానని?”

“పొరుగూల్ల ఆల్లు అపటికపుడు పిల్సారండీ పాంవునట్టాలని.”

నాకు చటుక్కున headmistressకి రావలసినంత కోపం వచ్చింది. పాముల్ని పట్టడమే ముఖ్యం అనుకుంటే వేరే ఉద్యోగాలు చేపట్టడం ఎందుకు? స్కూల్లో చేరినతరవాత, జీతం పుచ్చుకుంటున్నపుడు, ఇక్కడ మాత్రం పని సక్రమంగా చెయ్యఖ్ఖర్లేదా? ఊళ్లో పనులన్నీ చక్కబెట్టుకుని, తీరికసమయాల్లో స్కూలికి రావడానికి ఇదేమయినా హాబీనా?

రోశయ్య ఒక్కమాట కూడా మాటాడలేదు. చేతులు కట్టుకుని నిల్చుని విన్నాడు.

“నిన్నటి రిజిస్టర్డ్ పార్సిలేదీ?” ఆఖరికి మొదటిప్రశ్నకి వచ్చేను.

“ఈడ్నే మీబల్లమీద ఎట్టేనండీ,” అన్నాడు తొణక్కుండా.

పార్సిలు తెస్తూండగా ఎవరో పిలిచేరుట పక్క పల్లెలో పాముని పట్టాలని. అంచేత, పార్సిలూ, రసీదూ నాబల్లమీద పెట్టేసి వెళ్లిపోయేట్ట. నాపర్మిషను అడగడానికి నేను లేను. ఫస్టసిస్టెంటుని ఎందుకు అడగలేదూ అంటే జవాబు లేదు.

“పోయినపార్సిలుకి ఏం సంజాయిషీ ఇచ్చుకుంటావో రాసియ్యి. లేకపోతే పై అథారిటీస్‌కి రిపోర్టిస్తాను.”

“సంజాయిసీ ఎందుకండీ. అత్తెచ్చీవరికే గదండీ నాడూటీ,” అన్నాడు వాడు.

నాకింకా కోపం వచ్చింది. “సరే, నీడ్యూటీ ఎంతవరకో తెలియజేస్తాను” అన్నాను. అప్పటికప్పుడు క్లర్కుని పిలిచి ఛార్జిషీటు తయారు చేయించేను. రోశయ్య సర్విసులో చేరిందగ్గర్నుంచీ ఎన్ని మెమోలో, ఎన్ని వార్నింగులో, ఎన్ని బ్లాక్ మార్కులో ఎత్తి చూపించేను. అంతా పకడ్బందీగా తయారయింది. ఇంగ్లీషు అసిస్టెంటునీ, తెలుగు అసిస్టంటునీ పిలిచి చూపించేను ఇంకా ఏవైనా నాకు తెలీనివి ఉన్నాయేమోనని. నేను అంత బాగా ఫ్రేం చేసిందుకు వాళ్లు మెచ్చుకున్నారు. ఈదెబ్బతో రోశయ్య దిమ్మ తిరిగి దారికొస్తాడన్నారు. “కోడెత్రాచులాటివెధవని గరికపోచలా వంచేసిన కీర్తి మీకు దక్కుతుందండీ” అన్నారు.

“నేను కీర్తికోసం కాదండీ. స్కూలుకోసం, డిసిప్లిన్‌కోసం,” అని, ఛార్జిషీటు టైపు చెయ్యమని క్లర్కుకి మళ్లీ చెప్పి, ఇంటికి బయల్దేరాను.

ఇంటికొచ్చి, వరండాలో వాలుకుర్చీలో కూర్చున్నాను కళ్లు మూసుకుని. ఎందుకో కళ్లు మండుతున్నాయి.

“అక్కా, పాం, పాం.”

నేను ఉలిక్కిపడి కళ్లు తెరిచాను. ఎదురుగా రోశయ్య. నవ్వుతూ నిలుచుని ఉన్నాడు. చేతిలో చిన్న తువాలుమూట ఉంది.

పొరిగింటికుర్రాడు హుషారుగా చూస్తున్నాడు.

“ఇట పోతంటే పాంవుని సూపియిమని అబ్బాయిగోరు అడిగేరండీ,” అంటూ రోశయ్య తువాలుమూట నేలమీదికి విసిరేడు. దబ్‌మని చప్పుడయింది. ఉండలా ముడుచుకునున్న నాగరాజు శిరసు మూరెడెత్తు గాలిలోకి లేచింది. సిసలైన జాతి సర్పం కాళీయఫణినుండీ సంతరించుకున్న పదచిహ్నలతో సహ.

ఇరునాలుకలతో లయబద్ధంగా తల ఊపుతోంది. అంతసేపు మూసిపెట్టడంచేత ఊపిరాడక ఒగరుస్తోందో, రోషంతో బుసలు కొడుతోందో నాకు సరిగ్గా తెలియలేదు. రోశయ్య తువాలుతో దాన్ని రెచ్చగొట్టేడు. అది మరో అడుగు పైకి లేచింది.

నాకు ఒళ్లు జలదరించింది.

“కోరలు చూపించు,” పొరుగింటి అబ్బాయి అడుగుతున్నాడు హుషారుగా.

“రొండు తీసీసేనండీ. ఇంకో రెండున్నయ్.” రోశయ్య దాన్ని ఒడుపుగా పట్టుకుని, నోరు పెగలదీసి చూపుతున్నాడు. ఏవి కోరలో, ఎందులో విషం ఉంటుందో …

అంతసేపూ నామనసులో మెదులుతున్నది ఒక్కటే ప్రశ్న – ఇంటికి పాముని తీసుకురావడంలో రోశయ్య ఉద్దేశ్యం?

“పుటో తీస్కుంటే బాగుంటాదండీ,” అన్నాడు రోశయ్య మళ్లీ దాన్ని నేలమీదికి వదుల్తూ.

“నేనూ, అదీ కలిశా?” అన్నాను నవ్వుతూ.

“అట్ల గాదండీ,” రోశయ్య కూడా నవ్వేడు. పాముని మళ్లీ తువాల్లో మూటగట్టుకు వెళ్లిపోయాడు వాడు.

“జాగ్రత్తండోయ్” అంటూ హెచ్చరించిన డ్రాయింగుమేష్టరు గుర్తుకొచ్చేరు నాకు.

రోశయ్య బలప్రదర్శనకోసమే తీసుకొచ్చేడా ఆపాముని? ఇదోరకం బెదిరింపా? ఏమైనా సరే, నేను నాధర్మం నెరవేర్చక తప్పదు. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించవలసిందే!

రోశయ్యమీద రాసిన ఛార్జిషీటుమీద సంతకం పెడుతుంటే ముందురోజు చూసిన సరీసృపంలా కదుల్తున్నట్టనిపించింది నాచేతిలో కలం. తగినచర్య తీసుకోవాలంటూ హెచ్చరించిన అసిస్టంట్లనందరినీ తల్చుకుంటూ, నా విధ్యుక్తధర్మం నెమరేసుకుంటూ డిస్పాచికిచ్చేశాను.

000

వేసవిశలవులకి ఊళ్లో ఉన్న సైన్సుఅసిస్టెంటుని ఇన్‌ఛార్జిగా పెట్టి మాఊరికి బయల్దేరేను. ఇరవైమైళ్లు బస్సులో వెళ్లాలి.

బస్సుప్రయాణం నాకు మహ చిరాకు. ఆమాటకొస్తే ఏ ప్రయాణమయినా అంతే. “ఎందాకా?” అంటూ అడిగి తెలుసుకునేవారకూ కుదుటబడని సహప్రయాణీకులంటే నాకు చిరాకు. “మాయమ్మ ఈడుండది. ఆడు నాతమ్ముడు, నన్ను బండెక్కించనానికొచ్చినాడు” అంటూ వాళ్లగొడవలన్నీ ఏకరువు పెట్టే జనాల్ని చూస్తే విసుగు. అందుకే కిటికీపక్కన కూర్చుని, తల కిటికీలోకి పెట్టేసి కూర్చుంటానెప్పుడూను.

ఆవేళా అలాగే కూర్చున్నాను. అయినా ముందుసీటులోంచి గాల్లో దూసుకువస్తూ వినిపించేయి మాటలు.

“బారిడు పొడుగున్నాది. సూస్తంటె గుండి గుబేలుమన్నాదనుకో …”

అటువేపు చూడకుండా ఉండలేకపోయేను. తూర్పుమనిషి ఏడాదిపిల్లాడిని ఒళ్లో వేసుకుని పాలిస్తూ చెప్తోంది, “పోయ్ని సుక్కరోరం ఉయ్యాల్లో పిల్లగాడున్నడు. ఎల ఎక్కిందొ ఉయ్యీలకి సుట్టుకునుంది. పిల్లగాని తియ్డానింకి బయ్యం. ఒదిలీనానికి బయ్యం.  అదుగ, సరీగ్గ ఉప్పడె పొరుగూరాయ్న ఆ పాములోని తీసుకొచ్చిండు. ఆమడసిక్కూడ ఒకంతాట సిక్కనేదు మాయదారి పురుగు … పానం కడగట్టిపోనాదన్‌కో”

ఆ తల్లిమాటలు వింటూ ఆలోచిస్తున్నాను. “వాడొట్టి దొంగవెధవండీ. మనని భయపెట్టడానికలా ఏదో చెప్తూనే ఉంటాడు” అన్న పొట్టిమేష్టరుమాటలు గుర్తుకొచ్చేయి. క్షణకాలం నేను ఆ ఛార్జిషీటు రాయకుండా ఉంటే బాగుండు అనిపించింది.

శలవులయేక తిరిగి వచ్చేసరికి రోశయ్య బదిలీ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. వాడినేరాలన్నిటికీ శిక్షగా వాణ్ణి జిల్లా ఆచివరికి విసిరిపారేశారు.

“బదిలీ శిక్షెలా అవుతుందండీ? ఇక్కడ పని చెయ్యనివాడు అక్కడ మాత్రం సవ్యంగా చేస్తాడా? ఉద్యోగం ఊడగొట్టి పంపాల్సింది వెధవని,” అన్నారు సైన్సుమేష్టరు తన అసంతృప్తిని వెల్లడి చేస్తూ.

“పోన్లెద్దురూ. on human grounds. నిజానికి, వాడు చేసినపనికి పరమవీరచక్ర ఇవ్వొచ్చు కదా. ఒక ప్రాణిని రక్షించేడు” అన్నాను.

“అయ్యో రామ, ఆ కాకమ్మకథలన్నీ మీరు కూడా నమ్ముతారుటమ్మా!”

కొందరి అభిప్రాయాలు మార్చడానికి ప్రయత్నించడంకన్నా మనమే మౌనం వహించడం ఉత్తమం. రోశయ్యని రిలీవ్ చేశాను.

అదే రోజే మాయింట్లో పనిమనిషి మానేసింది. అప్పుడు తెలిసింది ఆమనిషీ రోశయ్యా పెళ్లి చేసుకుంటారుట. వాడు దానికోసమే ఈఊళ్లో ఉద్యోగం చేస్తున్నాట్ట. లేకపోతే రోశయ్య పాముల్ని పట్టగా వచ్చిన ఆదాయంతో వాళ్లిద్దరూ “రాజా, రాణీల్లా” బతగ్గల్రుట. వాడంటే అందరికీ భయం. “మాచెడ్డ బయ్యం. ఆల్లకాల్లే బెదరిపోతా వుంతరు”ట.

ఇంతవరకూ వాడు ఎవర్నీ ఏవిధంగానూ బాధించిన దాఖలాల్లేవు. కానీ వాళ్లల్లో ఉన్న పిరికితనం అలాంటిది. దాంతో వాళ్లు వాడిమీద కక్ష కట్టి సాధించడానికి పూనుకున్నారు.

నాకు తెలియకుండానే, నాప్రయత్నం లేకుండానే, నేను వాళ్లకి ఆయుధం అయేను.

“పోన్లెండమ్మా. ఆల్లపాపాన ఆలే పోతరు. మాకిదీ మేలే అయ్యింది. అంతదూరంవెల్పోతన్నం గందని ఉప్పుడె మువూర్తం ఎట్టీస్కున్నం.” అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ.

మర్నాడు ఇద్దరూ “వెళ్లిపోతున్నాం” అని చెప్పడానికొస్తే,  వాడు నాకంటె ఎంతో ఎత్తు ఎదిగిపోయినట్టు అనిపించింది. రోశయ్య ఒక్క ముక్కయినా అన్లేదు బదిలీగురించిగానీ ఛార్జిషీటుగురించి కానీ.

000

ఆతరవాత inspection ఉందని, దగ్గరుండి గదులన్నీ శుభ్రం చేయిస్తుంటే, సైన్సు లాబొరేటరీలో ఓమూల సగం ఎలకలు కొట్టేసిన పార్సిలొకటి కనిపించింది.

కళ్లు చించుకుని పరీక్షగా దానిమీద పోస్టుమార్కు చూస్తే అది రోశయ్య పారేసేడనుకున్నదే!

“ఆల్లకాల్లే కల్పిచ్చుకుని బెదరిపోతాఉంటార”న్న పనిమనిషి మాటలు నామనసులో మెదిలేయి.

000

(1965-66 ప్రాంతాల్లో తరుణ మాసపత్రికలో ప్రచురితం.))

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “విషప్పురుగు”

 1. చాలా సంతోషం వసుధా రాణి. చాలామంది గమనించని కథని మీరు గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది.మీలాటి పాఠకులే రచయితలకి మరింత స్ఫూర్తినిచ్చేది.

  మెచ్చుకోండి

 2. పాము కరవకుండానే విషం తలకెక్కిన మనుషులు….కక్ష గట్టి మరీ కాటువేసే నాగరీకులు….అకారణం గా పడగవిప్పే విషనాగులు….ఎంతో చక్కగా క్లిష్టమైన మానవ నైజాన్ని ఎత్తి చూపించారు….

  మెచ్చుకోండి

 3. @ telugu4kids, అవునండీ. రచయితలు పాత్రలని కథకి అనుగుణంగా తీరిచి దిద్దుతారు. పాఠకులు తమఆలోచనలు, అవగాహన పరిధులలో కథని అర్థం చేసుకుంటారు. ఇదే కథని ఒక పాములవాడో స్కూలు ప్యూనో చదివితే, అతనిని రోశయ్యపాత్రే ఎక్కువగా ఆకట్టుకోవచ్చు కదా. నేను ఈవిషయం మరొకవ్యాసంలో https://tethulika.files.wordpress.com/2008/04/pathakulu.pdf సుదీర్ఘంగా చర్చించేను.
  నేను ఇలా కథలు రాయగలగడానికి ఒకవిధంగా అదే కారణమేమో :). అంటే ఒక కథ చదివినతరవాత, అలా కాక మరోలా జరిగిఉంటే ఎలా ఉంటుంది ఆని ఆలోచించడం. ముగింపు మరోలా ఉంటే, రోశయ్య పాములవాడు కాకపోతే, … ఇలా ఎంతైనా ఆలోచించుకుంటూ పోవచ్చు కదా.

  @ సీతారాం, కక్ష ఎందుకు, “నేను”కి ముత్యాలపల్లికే ఎందుకు ట్రాన్స్ ఫర్ అయింది – లాటివి చిన్నకథల్లో చర్చించడం జరగదండీ. మీ ఇతరప్రశ్నలకి telugu4kidsకి ఇచ్చినసమాధానం చూడగలరు.
  ధన్యవాదాలతో
  మాలతి

  మెచ్చుకోండి

 4. మాలతి గారు,

  మళ్ళీ వ్రాస్తే సాగదీస్తున్నాని అనుకుంటారేమో అని వ్రాయలేదు. కానీ ఇంక తప్ప లేదు.

  నాకు కథ లో థీమ్ తెలియక పోలేదు. కానీ, రోశయ్య పాత్ర తో కథ ముగియక పోయినందు వల్లనేమో, హెడ్ మిస్ట్రెస్ గారే చివరకు మనసు లో మిగిలిపోయారు. మళ్ళీ చదవమన్నారు కనక, మళ్ళీ చదివాను, ఈసారి కొత్త ప్రశ్న పుట్టింది.

  అసలు రోశయ్య మీద అక్కడి స్టాఫ్ కి ఎందుకు కక్ష?

  భవదీయుడు,

  సీతారామం

  మెచ్చుకోండి

 5. నాకూ సీతారామం గారికి ముందు వచ్చిన సందేహమే వచ్చింది.
  కానీ మీ ఈ వివరణ సంతృప్తి కలిగించింది.
  ” టీచరు తనతప్పు బాహాటంగా అంగీకరించి ఛార్జిషీటు వెనక్కి తీసుకుంటే పాఠకులఆలోచనలు ఆపాత్రమీదకి మళ్లుతాయి.”
  అంతే కాదు కథలో పాత్రలని రచయిత ఎలా మలుచుకోవచ్చో అని ఒక సూచన దొరికినట్లైంది.
  ఈ కథ, చిరుచక్రం, చదువుతున్నంత సేపూ నాకు మీరు అంత చిన్న వయసులో అంతగా వ్యక్తిత్వాలని పరిశీలించి అంతకు మించి అంత బాగా వ్యక్తపరచగలిగారు, అందునా వ్యాసం లాగా కాకుండా అందమైన కథలాగా, ఎంతో బాగా entertain చేస్తూ అన్న విషయం చాలా ఆశ్చర్యపరిచింది, ఇప్పటికీ ఆలోచింపచేస్తోంది.

  మెచ్చుకోండి

 6. @ seetaram, కథ పేరు విషప్పురుగు. స్కూల్లో అందరూ అతనే పాము అన్నట్టు చూసి బెదరిపోతారు. ( యస్.ఆర్.రావుగారి వ్యాఖ్య కూడా చూడండి.). ఆభయం హెడ్ మిస్ట్రెస్ (టీచరు కాదు)లో కూడా కలిగిస్తారు. తాను అందర్ని క్షణాలమీద అంచనా వెయ్యగలననుకున్న నిజంగా రోశయ్యని తప్పు అంచనా వేసింది. అతను సమస్య అవుతాడు. నాదృష్టిలో ప్రధానకోణం అదీ. మీకు సమస్య (రోశయ్య) కంటే సమస్యని పరిష్కరించడంలో విఫలమయిన హెడ్ మిస్ట్ర్రెస్ పాత్రే ప్రముఖంగా తోచడం ఆశ్యర్యమే. మీరు కథ మొదట్లో నేను ఆమెని పరిచయం చేసినందున అక్కడే ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టున్నారు. నిజానికి అందుకే అంటాను నేను కథ అంతా చదవడం అయినతరవాత మరొకసారి ఆలోచించుకోవాలి స్థూలంగా ఈకథ దేన్నిగురించి, రచయిత చెప్పదలుచుకున్నది ఏమిటి అని. అంటే నేను మీ అభిప్రాయం తప్పు అనడంలేదు.
  మీ కోణం మీది, మీ స్పందన మీది. మీరు అడిగేరు కదా అని ఇంత విపులంగా చర్చిస్తున్నాను.
  ఒకొక పాఠకుడిని కథ ఒకొకవిధంగా ఆకట్టుకోడం సహజమే కదా.

  మెచ్చుకోండి

 7. మాలతి గారూ,

  నమస్కారములు. నా బ్లాగ్ చూసినందుకు కృతజ్ఞతలు. ఇదే నా తొలి ప్రయత్నం. మీలాంటి పెద్దల విమర్శ మాలాంటి వారికి చాలా ముఖ్యము.

  ఇప్పుడు, నా కామెంట్ పై మీ స్పందన కు నా ప్రతిస్పందన. దయ చేసి దీనిని అహము అని భావించకండి. కథ మొత్తము చదివిన తరువాత, రోశయ్య పాత్ర కంటే, టీచరు పాత్రే హైలైట్ అవుతోంది కదా. కనీసం టీచర్ వెళ్ళే బస్సు లోనే, రోశయ్య కూడా ఉండి ఉంటే, అక్కడ ఒకటో రెండో సంభాషణలో లేక నిశ్శబ్ద సన్నివేశాలో ఉండి ఉంటే, ఆ పాత్ర తో కథ ముగిసి ఉంటే, అప్పుడు మీరన్నట్టు, రోశయ్య పాత్ర బాగా జ్ఞాపకము ఉంటుంది అనుకొంటున్నాను.

  మెచ్చుకోండి

 8. @ సీతారామం, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీబ్లాగు చూశాను. కథని పరిశీలించి చదవడంలో మీకు గల ఆసక్తికి సంతోషం. అంచేత నేను కూడా నాఅభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తాను. కథలో ప్రధానపాత్ర రోశయ్య. పాఠకుడిదృష్టి ఆపాత్రమీదే కేంద్రీకరించి ఉంచాలని నాయత్నం. టీచరు తనతప్పు బాహాటంగా అంగీకరించి ఛార్జిషీటు వెనక్కి తీసుకుంటే పాఠకులఆలోచనలు ఆపాత్రమీదకి మళ్లుతాయి. ఇక్కడ మరోసంగతి కూడా గుర్తు పెట్టుకోవాలి. పాఠకులలో ముప్పాతిక మువ్వీసం మధ్యతరగతివారు. అంచేత వారికి టీచరుపట్ల సానుభూతి త్వరగానే వచ్చేస్తుంది. నాకు కావలసింది రోశయ్యని పాఠకులు గుర్తు పెట్టుకోవాలని.
  మీ చెప్పుల కథ బాగుంది. నాకు సాక్స్ తో అలాటది చాలాసార్లు జరిగింది. 🙂

  మెచ్చుకోండి

 9. మాలతి గారూ,

  విషప్పురుగు కథ ఎప్పటి లాగానే చాలా బావుంది. కాకపోతే, తెలిసి తప్పు చేశాను అనుకున్న టీచరు గారు ఆ చార్జ్ షీట్ వెనక్కి ఎందుకు తీసుకోలేక పోయారు? అది వదిలేస్తే, మిగతా కథ చాలా సహజము గా ఉంది. నా చిన్నప్పుడు ఎక్కడో అడివి లో ఉండే ఒక ఊరి స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ మా నాన్నగారు నాకు కొన్న లెదరు చెప్పుల జతలో ఒకటి పోయింది. మిగతా ఒకటి ఉంచుకుని ఏమి చేస్తాములే అని మేము అది పార వేసిన ఏడాదికి స్టేషన్ క్లీన్ చేయిస్తుంటే నాన్నగారికి ఆ పోయిన చెప్పు దొరికింది. మనుషులలో అసూయ కి స్థాయి భేదాలు ఉండవని చిన్నప్పుడే గట్టిగా నేర్చుకున్నాను. మీ కథ ఆ వైనాన్ని మరొక్క సారి జ్ఞాపకం చేసింది. ఈ సంగతి కథ యొక్క సహజత్వాన్నినొక్కి వక్కానించడానికి వ్రాశాను.

  పోతే ఈకథకి సంబంధించని మరొక్క విషయం, నేను నిన్నే తెలుసుకున్నది, మీరు, కవన శర్మ గారు సహాధ్యాయులని.. http://www.navyaweekly.com/ లో ఈ నెల శర్మ గారి ఇంటర్వ్యూ లో ఉంది. మీరు చదవక పోతే ఈ లింక్ చూడండి.

  మెచ్చుకోండి

 10. మాలతి గారూ !
  నిజమైన విషప్పురుగు పాము కాదు, పొరుగువాడిలోని విశేష లక్షణాలను, గొప్పదనాన్ని సహించలేక కాటు వెయ్యాలని చూసే మనిషే ! మానవ స్వభావాలను ఎంత చక్కగా ఆవిష్కరిస్తున్నారండీ ! మంచి కథలను అందిస్తున్నారు. అప్పుడు చదవలేకపోయిన మాకు ఇప్పుడు చదవగలగడం అదృష్టమే !.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s