మామూలు మనిషి

“రాజేశ్వరి ఏదమ్మా?”

పదిహేనేళ్లతరవాత పుట్టినగడ్డమీద కాలు పెడుతూనే, గుండెలో కొట్టుకుంటున్న మొదటి ప్రశ్న.

తలవాకిలిలో అడుగు పెడుతూనే నాకళ్లు నలుమూలలా వెతికేయి ఆ మూర్తికోసం. ఆ సంగతి ఇంట్లో అందరూ గ్రహించేరు. అందరూ గ్రహించనట్టు నటించేరు. అందుకే నాకు నేనై అడక్కుండా ఉండలేకపోయాను.

“రాజేశ్వరి ఏదమ్మా?”

అమ్మ గిరుక్కున వెనుదిరిగి వెళ్లిపోయింది. వదిన కళ్లు ఆర్ద్రాలయేయి. అన్నయ్య మౌనంగా పేపరు చదువుతున్నాడు. నాన్నగారు మాట మారుస్తూ, “ముందు స్నానం చెయ్యవోయ్. ఎప్పుడనగా తిన్న అన్నమో, మాటలకేం. తరవాత మాటాడుకోవచ్చు,” అన్నారు.

కాని, రాజేశ్వరి?

పరిగెత్తుకుంటూ వీధిలోంచి వస్తున్న పండు నన్ను చూసి, తలుపుచాటున ఆగిపోయాడు.

“రారా, లోపలికి రా. చిన్నాన్నరా. నీకు బొమ్మలు పంపలేదూ. ..” నాన్నగారు వాణ్ణి కొత్త వాతావరణంలోకి లాక్కు వచ్చేరు. నేను తువాలు తీసుకుని స్నానానికి బయలుదేరాను.

తిరిగి వచ్చేసరికి పండు నా సామానుదగ్గిర ప్రదక్షణాలు చేస్తున్నాడు.

“రాజేశ్వరి ఎక్కడుందో నీకు తెలుసురా?” అని వాడిని అడిగేను చుట్టూ ఎవరూ లేకుండా చూసి.

వాడు తెల్లమొహం వేశాడు.

అస్తవ్యస్తంగా భోజనం అయిందనిపించి మూలగదిలో మంచంమీద కళ్లు మూసుకుని పడుకున్నాను.

“చిన్నబాబు వచ్చేడటనే” అంటూ చుట్టాల పలకరింపులూ, “ఇప్పుడే నాలుగు మెతుకులు కతికి నిద్రకొరిగాడు. దగ్గిరా, దాపా?”  … నాన్నగారి విన్నవింపులూ వినిపిస్తున్నా లేవకుండా పడుకున్నాను.

వేపచెట్టునీడన, ఈ విశాలమయిన ఇంట్లో నాకేదో ఊపిరాడనట్టుగా ఉంది. నా ఒకే ఒక ప్రశ్నకు వీళ్లు ఎవరూ ఎందుకు జవాబు  చెప్పరో నాకర్థం కాలేదు. బొత్తిగా చౌకబారు శవసాహిత్యంలో సస్పెన్సులా ఉంది ఈ స్తబ్ధత. ఆ కారణంగా కన్నుల నీరు తిరిగింది. మాగన్నుగా నిద్ర పట్టింది కాబోలు, నవ్వుతూ రాజేశ్వరి “వచ్చావా?” అని అడిగినట్టయింది. తృళ్లిపడి లేచాను.

“ఇవాళ లేవవేమో అనుకున్నాను,” అంది వదిన నవ్వుతూ, ఒక ప్లేటులో పూతరేకులతోనూ, సేరుగ్లాసులో కాఫీతోనూ నిలుచుని.

“లేవొద్దు అనుకున్నాను గానీ, పూతరేకులు జ్ఞాపకం వచ్చి … ” అన్నాను, గోడవేపు తిరుగుతూ. “పూతరేకులు రాజేశ్వరే చెయ్యాలి” అని మనసులో అనుకుంటూ, నిట్టూర్చి.

అంతవరకూ నవ్వుతున్న వదిన కూడా ఒక వేడి నిట్టూర్పు విడిచింది. అంతలోనే నవ్వడానికి ప్రయత్నిస్తూ, “మేలుకో మహరాజ, మేలుకో, వేచియున్నారు వేలాది ప్రజలు,” అంది రాగయుక్తంగా.

లేచి కాఫీ, టిఫినూ ముగించి, పొలంవేపు బయల్దేరేను. ఆ విధంగానైనా కొంత మాట తప్పించవచ్చేమోనని. ఇంట్లో ఎవరూ వద్దనలేదు.

పాలికాపు పైడిగాడు నన్ను అల్లంత దూరాన్నే గుర్తు పట్టేడేమో కొండనందుకున్నంత సంతోషంతో పరుగెత్తుకు వచ్చేడు. “ఉండండి బాబూ! మంచి గంగాబోండాలుండయ్. కొట్టిత్తాను. సల్లగుంటయి” అంటూ కోనసీమ రుచి చూపించేడు. కిందటేడే కూతురిపెళ్లి చేసేడుట. అల్లుడు చాలా మంచివాడుట. కోడలు మాత్రం వట్టి దుర్మార్గురాలుట. కొడుక్కీ తనకీ పడకుండా చేసిందిట. ఇంట్లో సంబంధం ఎందుకు పోనివ్వాలని బావమరిది కూతుర్ని చేసుకుంటే ఏకు మేకయిందిట — ఏవేవో సంసారపు గొడవలు చెప్పుకువచ్చాడు.

అన్నీ విని ఆఖరికి అడిగేను, “అయితే రాజేశ్వరి ఏమయిందిరా?” అని.

వాడు ఒక్కమాటు నెత్తి కొట్టుకున్నాడు. “ఇంకెక్కడి రాజీశరమ్మ బాబూ? ఆ ఎదవ పొట్టనెట్టుకున్నడు గంద.”

“ఆఁ!” నేను నిర్ఘాంతపోయేను. “ఎవడు వాడు?” తేరుకుని నాకు మాత్రమే వినిపించేంత మెల్లిగా అడిగేను.

“అదేటి బాబూ, అట్టా అయిపోనారు? పదండి. ఇంటికాడ ఒగ్గీసొస్తను. .. పాపిస్టోన్ని. మంచీ సెబ్బరా సూస్కోకండ మాటాడీసినాను,” అన్నాడు.

పైడిగాడు నామాట విన్నాడో లేదో రెక్క పుచ్చుకుని ఇంటివేపు నడిపించుకు వచ్చీసేడు.

“ఏమైంది?” అని ఎవరూ అడగలేదు!

000

అప్పుడే స్కూల్నించి వచ్చి పుస్తకాలు బల్లమీద పారేసి, వంటింట్లోకి వెళ్లేను, “అమ్మా, ఆకలి,” అంటూ కేకలేస్తూ. లోపల ఎవరో కొత్తావిడ పప్పు రుబ్బుతూ కనిపించింది.

“ఉండరా, ఇంకా కాలేదు,” అంది అమ్మ.

నాకు కోపం వచ్చింది కానీ కొత్తమనిషిని చూసి ఊరుకున్నాను.

ఆవిడపేరు రాజేశ్వరి అనీ, ఆ రాత్రి ఆవిడ మాయింట్లోనే అన్నం తింది అనీ తరవాత తెలిసింది నాకు. కానీ రాత్రి ఎక్కడ పడుకుందో నాకు తెలీదు. మర్నాడు పొద్దున్న ఆవిడే కాఫీ పెట్టింది. సావిట్లో కూచున్న నేను కాఫీకోసం చూసి చూసి విసుగేసి, “ఏయ్, కాఫీ, తే” అన్నాను.

పెరట్లోకి వెళ్లబోతున్న అమ్మ వెనుదిరిగింది. కళ్లలో నిప్పులు కురిపిస్తూ, “మళ్లీ అను,” అంది.

నేను భయంభయంగా అమ్మవేపు చూసి, లేచి వెళ్లి నా కాఫీ నేను తీసుకుని, ఆడుకోడానికి వెళ్లిపోయేను. కానీ, ఆరోజంతా కోపంగానే ఉన్నాను.

“పోనీలేవమ్మా, పసితనం,” ఆవిడ కనికరించడం నాకు మరీ కష్టంగా ఉంది. మరునాడు మరో సంఘటన నాకూ, అన్నయ్యకూ కూడా ఆవిడంటే మరీ అసహ్యం కలగజేసింది.

నేను లెక్కలు చేసుకుందాం అని నా నోటుబుక్కు తీసి చూస్తే, అందలో ఓ పదికాగితాలు చింపేసి ఉన్నాయి. ఇంట్లో సామాన్యంగా ఎవరూ నా పుస్తకాలు తియ్యరు. అందుకే అమ్మతో ఫిర్యాదు చేశాను. అమ్మకూ అర్థం కాలేదు.

“నీ పుస్తకాలు ఎవరిక్కావాలి? నువ్వే చింపుకుని ఉంటావు. లేకపోతే స్కూల్లో ఎవరైనా చింపేరేమో,” అంది.

“అదేం కాదు. నిన్నరాత్రి కూడా చూశాను నేను, చిరిగి లేవు. ఇంట్లోనే నా పుస్తకం ఎవరో తీశారు,” అన్నను రోషంగా.

అమ్మకు విసుగేసింది. “ఫోరా, ఫో. వెధవ గోలా, నువ్వూనూ. తీస్తే మటుకు ఏం ములిగిపోయిందిప్పుడూ?” అంది

“చూడు,” అంటూ రెండోవేపు ఊడిపోయిన కాయితాలు చూపించేను.

రాజేశ్వరి నామొహంవేపు చూసి, “నాకు కావలిసి వచ్చి, నేనే చింపేను,” అంది, అదేదో తన వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే ఘనకార్యంలాగ.

నాకు పౌరుషం వచ్చింది, “ఈమారు తియ్యి,” అన్నాను.

“నీ బోడికాయితాలు నువ్వే ఉంచుకో,” అని రాజేశ్వరి ఆ కాయితాలు నామీద విసిరేయడమూ, నేను దానికి సమానమయిన సమాధానం ఇవ్వడమూ, అప్పుడే పెరట్లోంచి వస్తున్న అమ్మ నామాట విని, నా చెంప ఛెళ్లుమనిపించడమూ, నేను తూలి పడడమూ మాత్రమే నాకు తెలుసు.

ఎలా పడ్డవాణ్ణి అలాగే పడుకుని ఓపిక ఉన్నంతసేపు ఏడ్చి, నిద్రపోయేను. కళ్లు తెరిచి చూసినప్పుడు తెలిసింది ఆ మూడుగంటలసేపూ రాజేశ్వరి నాతల తన ఒళ్లో పెట్టుకుని అలాగే కూచుందని.

అమ్మ, “ఎంతసేపు అలా కూచుంటావు? వాణ్ణి అలా పక్కన పడుకోబెట్టు,” అని ఎంత చెప్పినా ఆవిడ వినలేదుట. పైగా, “నాఒడిలోకి జారిన పండు, ఎలా వదిలెయ్యను?” అందిట.

మరునాడు రాజేశ్వరి మాయింటికి రాలేదు. మూడోనాడూ రాలేదు. వరసగా వారంరోజులు రాలేదు. అప్పటికి రెండురోజులనించి అమ్మ జ్వరంతో బాధ పడుతోంది. ఒకటి రెండుమార్లు, “రాజేశ్వరి ఎక్కడుందో చూడరా,” అంది.

ఎందుకో తెలీదు కానీ మాకూ మనసులో ఒకమారు ఆవిడ కనిపిస్తే బాగుండుననే ఉంది. ఆఖరికి రాజేశ్వరిని వెతకడానికి బయల్దేరేం నేనూ అన్నయ్యా ఇద్దరమూను. మావూరి పెద్దకాపు రెడ్డెప్పగారి అరుగుమీద జీడిపప్పు తింటూ కనిపించింది. మమ్మల్ని చూసీ చూడనట్టు ఊరుకుంది. “చూడలేదేమోలే” అనుకుని, మేం దగ్గరికి వెళ్లేం. నాకు మాటాడబుద్ధి పుట్టలేదు.

అన్నయ్యే అన్నాడు, “అమ్మకి రెండురోజులనించీ జ్వరం.”

రాజేశ్వరి అలవోకగా చూసి, “అయితే?” అంది.

“నువ్వు వచ్చి మాఇంట్లో రెండురోజులు ఉండమని అమ్మ చెప్పింది,” అన్నాడు అన్నయ్య.

రాజేశ్వరి ఉగ్రురాలయింది, “ఏమిటీ? మీఅమ్మ అంతటి సామంతురాలా? నేను వచ్చి మీ అందరికీ వార్చి పెట్టాలా? కొంచెం ఒళ్లు వెచ్చబడితే మంచం దిగని మహరాజభోగమా? ఏం చూసుకుని అంత అదిరిపాటు? మీబాబు సంపాదనా? తాత హోదా? నేనేం కూలికి ఒప్పుకున్నానా? ఆమాత్రం చేసుకోలేదూ? దాసీదానికి కబురు చేసినట్టు కబురు పెడుతుందా? రావడానికి మీకెంత లేకపోయిందీ? చేసుకోమను. మరేం ఫర్వాలేదు. కళ్లు తిరిగి పడే పరిస్థితిలో నేను వండలేదూ తద్దినపువంట?”

అన్నయ్యమొహం చూస్తే నాకు భయం వేసింది. బావురుమన్నాను. అన్నయ్య నాచెయ్యి పట్టుకుని ఇంటికి ఈడ్చుకు వచ్చేశాడు.

“ఏం? కనిపించలేదా?” అమ్మ నిస్పృహగా అడిగింది. అన్నయ్య లేదన్నట్టు తల ఊపి వెళ్లిపోయేడు.

మరోగంట తరవాత, గుమ్మంలో అడుగు పెడుతున్న రాజేశ్వరిని అన్నయ్య గుమ్మంలోనే అడ్డుకున్నాడు, “ఫో ఇక్కడినించి” అన్నమాటలు అన్నయ్య పెదిమలనించి వెలువడ్డాయి. నేను భయంగా చూస్తున్నాను.

రాజేశ్వరి కుడిచేతి మునివేళ్లు అన్నయ్యగుండెలమీద ఉంచి, “తప్పుకో,” అంది.

అన్నయ్య తప్పుకున్నది ఆవిడ వాగ్ధాటికి కాక హస్తలాఘవంవల్ల అని నాక్కూడా అర్థం అయింది. జేగురించినమొహంతో వీధిలోకి వెళ్లిపోయేడు.

అప్పటినించి రాజేశ్వరి సావిట్లో ఉంటే అన్నయ్య వరండాలోనూ, రాజేశ్వరి  వరండాలో ఉంటే అన్నయ్య వంటింటిలోనూ ..

నాకు మాత్రం ఇష్టారాజ్యం భరతునిపట్నంగా ఉండేది, రాజేశ్వరి  సుముఖంగా ఉంటేనే. రాజేశ్వరిది అదో లోకం. నేను భయంగా దూరంగా తిరుగుతూంటే పిలిచి, “ఇవ్వాళ స్కూల్లో ఏంచెప్పేరు?” అని అడిగేది. నేను హరివిల్లులో ఏడు రంగులు ఎలా వస్తాయో, ఊపిరితిత్తులు ఎలా పని చేస్తాయో, భూమి గుండ్రంగా ఉందని ఎలా నిరూపించడమో వివరించేవాణ్ణి. “ఒక బంతిమీద ఒక చీమని వదిలేం అనుకో. అది అలా తిన్నగా వెళితే, మళ్లీ బయలుదేరిన చోటికే వస్తుంది కదా! అలాగే భూమి కూడా గుండ్రంగా ఉంటుంది,” అని కష్టపడి వివరించేవాడిని.

రాజేశ్వరి నవ్వేసేది, “బంతిమీద చీమ బయలుదేరిన చోటికే వస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టేనా?”

నాకు కోపం వచ్చేది. “ఛీ, కంకర,” అనేవాణ్ణి. ఆమాటకు నాకు బాగా అర్థం తెలియకపోయినా, అది మా సోషల్ మాష్టారు అనేమాట. అయన చెప్పిన పాఠం ఎవరికైనా అర్థం కాకపోతే అలా విసుక్కునేవారు ఆయన. నేను చనువుగా రాజేశ్వరిదగ్గరికి వెళ్లి, “కథ చెప్పు” అంటే, “ఫో, ఫో, మరేం పని లేకపోతే సరి. నేనేం నీకు వేడుక చెలికాణ్ణా?మీ అమ్మ తెచ్చుకున్న అరణపుదాసీనా నీతో ఆడుతూ పాడుతూ కూర్చోడానికి?” అని కసిరి కొట్టేది.

అందుకే నాకు రాజేశ్వరి అంటే ఆశా, భయమూ, రెండూను.

రాజేశ్వరిని అర్థం చేసుకున్నది ఒక్క అమ్మేనేమో. అమ్మ రాజేశ్వరిని ఏమీ అనేది కాదు. ఒకరోజు అన్నయ్య మరో ప్రళయం తీసుకువచ్చేడు. తను అయిదు రూపాయలనోటు బల్లమీద పెట్టేడుట. ఒక గంట పోయినతరవాత చూస్తే అది అక్కడ లేదుట. “అమ్మా, నా అయిదు రూపాయలనోటు పోయింది,” అన్నాడుట.

“ఎలా పోయింది? ఎవరో తీసి ఉంటారు. కనుక్కో,” అందిట అమ్మ.

వదినను అడిగితే, తనకు తెలియదందిట. నేను కానీ, నాన్నగారు కానీ తియ్యడానికి అవకాశమే లేదు. మేము అప్పుడు ఇంట్లో లేము.

“ఇది రాజేశ్వరిపనే,” అన్నాడు అన్నయ్య.

అమ్మ చాలా శాంతంగా, “తీసిందేమో,” అంది.

అన్నయ్య ఉగ్రుడయిపోయేడు, “తీసిందేమో అంటావేమిటమ్మా నానుస్తూను. ఖచ్చితంగా చెబుతున్నాను రాజేశ్వరే తీసిందని. ఆ దొంగ ..”

“నోరు ముయ్యి,” అమ్మ అరిచింది. ఆ వెంటనే స్వరం తగ్గించేసి, “అలా అనవసరంగా ఎంత మాట పడితే అంత మాట ఎవర్ని పడితే వాళ్లని అనకుండా ఉండడం ఎప్పుడు నేర్చుకుంటావో కానీ నే చెబుతున్నాను, రమణా, అదేమంత మంచి పని కాదు. ఇలాటి అయిదులు ఎడంచేత్తో విసిరేసిన సామంతురాలావిడ,” అంది.

“అంతటి సామంతురాలయితే ఇలా ఇంటింటా అడుక్కుతినడం …” అమ్మ మొహం చూసో, వరండాలో రాజేశ్వరి మొహం చూసో అన్నయ్య వాక్యం పూర్తి చెయ్యనే లేదు.

“నేనే తీశాను అయిదు రూపాయలు. నీ సంపాదన చూసుకునేనా నువ్వింత పేలుతున్నావు?

నేనూ నడిసముద్రంలోనించి నడిచి వచ్చేను అరిపాదం తడి కాకుండా. అంత డబ్బు మొహం ఎరగనిదాన్ని కాను. పెద్ద ఇంట్లో పుట్టేవు. ఇంత చిన్నమాటలెలా వస్తున్నాయి నీకు?” అంది రాజేశ్వరి అసహ్యంగా చూస్తూ ఆనోటు అన్నయ్యమీద విసిరేసి.

అన్నయ్య చాలాసేపయిన తరవాత ఆనోటు తీసి మళ్లీ ఆ బల్లమీదే పెట్టేసి వెళ్లిపోయేడు. ఆ తరవాత వదిన అన్నయ్య తరఫున క్షమాపణలు చెప్పుకుని రాజేశ్వరికి ఇచ్చిందిట ఆడబ్బు.

అక్కడినించి అన్నయ్య మరీ తప్పించుకు తిరగడం మొదలు పెట్టేడు.

రాజేశ్వరి కూడా ఎప్పుడో తప్ప కనిపించడం లేదు. అందుచేత ఏ ప్రమాదాలూ లేకుండా రోజులు గడిచిపోతున్నాయి.

000

నేను స్కూల్ ఫైనలుకి వచ్చేను.

రాజేశ్వరి మాత్రం ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం తెచ్చి మాజీవితాలని చైతన్యవంతం చేస్తూనే ఉంది. వాటిలో అతి ముఖ్యమయినది ఓ రెండేళ్ల పసివాణ్ణి తీసుకురావడం.

“వీడెవడూ?” అంటే చెప్పలేదు. “ఇక్కడికెందుకు తెచ్చేవు?” అంటే వినలేదు. తను వచ్చి మాఇంట్లో ఉన్నంతసేపూ వాడిని సావిట్లో వదిలేసేది. వాడు ఇల్లంతా తిరిగి నానా కంగాళీ చేసేవాడు.

ఇది అన్నయ్యకు మరింత కోపకారణం అయింది. రాజేశ్వరికీ, అమ్మకీ వినిపించకుండా సణిగేవాడు. వదినని చెప్పమనేవాడు వాడిని తీసుకురావద్దని చెప్పమని. అన్నయ్యకు ఝడిసి, నేను కూడా వాడిని దగ్గరికి తీసేవాడిని కాను.

అన్నయ్య పడే అవస్థ చూసి రాజేశ్వరి నవ్వేది. “విసుక్కుంటే విసుక్కోనీ. ఇది ఎన్నాళ్లుంటుంది,” అనేది.

అలా ఎక్కువ రోజులు జరగనేలేదు. ఎవరూ లేని సమయంలో అన్నయ్య వాడి బుగ్గ గిల్లీ, చిటిక వేసీ పలకరించేవాడు. అన్నయ్య కుర్చీలో కూచుంటే, ఆ పసివాడు మెల్లిగా కుర్చీ వెనక చేరి సందుల్లోంచి అన్నయ్య చొక్కా లాగడం, అన్నయ్య మెల్లిగా ఒకటీ, రెండూ పిప్పరమెంటు బిళ్లలు వాడికి అందించడం క్రమంగా ఇంట్లో అందరికీ తెలిసిన రహస్యం అయిపోయింది. అఖరికి వాడికి పేరు కూడా అన్నయ్యే పెట్టి వదినచేత చెప్పించేడు, ‌శిఖి అని.

000

నేను విశాఖపట్నం వచ్చేశాను కాలేజీలో చేరడానికి. అదే మొదలు కావడంచేత వారానికీ రెండువారాలకీ ఇంటికి వెళ్లకపోతే తోచేది కాదు. ఇంట్లో రాజేశ్వరి కనిపించకపోతే తోచేది కాదు. వెళ్లినప్పుడల్లా జీడిపప్పు తీసుకు వెళ్లేవాణ్ణి రాజేశ్వరికోసం రహస్యంగా. ఇష్టం అయితే తీసుకునేది. నన్ను మెచ్చుకునేది. లేకపోతే విసిరికొట్టేది. నేను చూస్తూండగానే అది ఇంకెవరికైనా యిచ్చేసేది. అయినా మళ్లీ వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లలేకపోయేవాణ్ణి.

ఆఖరికి యూనివర్సిటీవాళ్లు ఓ కాగితం నాచేతిలో పెట్టి, “నీబతుకు నువ్వు బతుకు,” అని తగిలేసిన తరవాత, పైవాళ్లేం చేస్తారో చూద్దాం అని పైదేశాలకి వెళ్లిపోవడం, మళ్లీ ఇప్పుడు ఆవురావురుమంటూ ఊరు చేరుకోవడం జరిగేయి. ఇక్కడ ఇంతలోనే ఊరు మారిపోతుందనీ, రాజేశ్వరి ఇలా కమ్మని జ్ఞాపకంగా మిగిలిపోతుందనీ నేను ఊహించలేదు. అది సంభవం అనుకోలేదు!

000

నేను సర్దుకుని “శిఖి ఏడీ?” అని అడగడానికి రెండు రోజులు పట్టింది.

“ఆ దౌర్భాగ్యుడిపేరు ఈ ఇంట్లో ఎత్తకు,” అన్నాడు అన్నయ్య.

నాన్నగారిని అడగలేకపోయేను.

వదిన ఎవరూ లేకుండా చూసి మెల్లిగా చెప్పింది, “వాడు కనిపిస్తే ఈ ఊరివాళ్లు పిచ్చికుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. అంచేత అజ్ఞాతవాసం గడుపుతున్నాడు,” అని.

ఆరోజు రాత్రి అందరూ పడుకున్న తరవాత అమ్మ లేచి చప్పుడు కాకుండా పెరట్లో ఎవరికో అన్నం పెట్టడం కనిపించింది. నేను లేచి వెళ్లి అమ్మవెనక నిల్చున్నాను. ఆ మసకచీకటిలో తుప్పజుత్తూ, పేలికలై వేలాడుతున్న లాల్చీ మాత్రమే చూడగలిగేను.

అమ్మ వెనుదిరిగి నన్ను చూసి గతుక్కుమంది. అంతలోనే నిట్టూర్చి లోపలికి నడిచింది.

నేను అమ్మను అనుసరించాను. నేను లోపలికి వచ్చినతరవాత అమ్మ తలుపు వేస్తూ అంది, “వాడే శిఖి” అని.

ఆ తరవాత అతిప్రయత్నంమీద అమ్మ దగ్గరినుంచి నేను రాబట్టగలిగిన భోగట్టా అతి స్వల్పం. శిఖి కనిపిస్తే ఊరివాళ్లు చంపేస్తారుట. రాజేశ్వరి ఆగడ్డమీద సంపాదించుకున్న ఆదారాభిమానాలు అటువంటివి. ఒక రాత్రివేళ శిఖి వచ్చి అమ్మను అన్నం పెట్టమని యాచించేడుట. ఆకలికి ఓర్వలేకో, అమ్మ పోల్చుకోలేదనో, పోల్చుకున్నా ఏమీ చెయ్యదనో. …

అమ్మ పోల్చుకుంది. పెరటివేపుకి పిలిచి అన్నం పెట్టి, పంపించేసిందిట. మరునాడూ అలాగే వచ్చేడుట. ఆరునెలలుగా అలాగే రోజు వస్తున్నాడుట.

“అసలు రాజేశ్వరి ఎలా చచ్చిపోయింది?”

అమ్మ నిట్టూర్చి, “నిజం ఒక్క శిఖికే తెలియాలి తెలిస్తే,” అంది.

అప్పటికి నేను వచ్చి పదిహేను రోజులు అయింది. రోజూ సాయంత్రం పొలాలగట్లమ్మట నడిచి చీకటి పడిన తరవాత ఇంటికి చేరుకునేవాణ్ణి.

నడుస్తున్నవాణ్ణి అడుగుల చప్పుడు విని వెనక్కి చూశాను. ఎవరూ కనిపించలేదు. ఈమధ్య రెండు మూడు రోజులుగా నన్నెవరో అనుసరిస్తున్నట్టు అనుమానంగా ఉంది. ఇవాళ ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. మళ్లీ అడుగుల చప్పుడు వినిపించింది. కనుచీకటి పడుతూంది.

“చినబాబూ!” గాలికి ఆకులు కదిలినట్టు వచ్చింది ఆ మాట.

“ఎవరు?”

“నేను బాబూ.”

“శిఖీ!”

“అవును చినబాబూ,” ఎదటికి వచ్చేడు. చీకట్లో కూడా వాడి దైన్యస్థితి స్పష్టంగా కనిపిస్తూంది.

నాలో ఒక తరంగంగా లేచిన కోపం అణిగిపోయిన తరవాత అన్నాను, “ఏఁరా?” అని.

వాడు ఒక్క క్షణం మాటాడలేదు. “నువ్వు కూడా నమ్ముతున్నావా చినబాబూ?” దీనంగా అడిగేడు.

నేను జాగ్రత్తగా అన్నాను, “నాకేమయినా తెలిస్తే కదా నమ్మడానికి,” అని.

“నువ్వు ఢిల్లీ వెళుతున్నావుట. నన్ను కూడా తీసుకు పో, చినబాబూ. నన్ను వీళ్లు బతకనివ్వరు. నేనిక్కడ ఉండలేను,” శిఖి బావురుమన్నాడు.

అప్రయత్నంగా నాచేతులు వాడిని నా వక్షానికి చేర్చుకున్నాయి. వాడు నాకు దారి తప్పిన  అయిదేళ్ల తమ్ముడిలా గోచరించాడు ఆ క్షణంలో.

ఈ అర్భకుడిమీదికి ఉపయోగించడానికి నిర్ణయమయి ఉన్న బ్రహ్మాస్త్రాలు తలుచుకుంటే నామనసు ద్రవించింది. “ఊరుకోరా, ఆడదానిలా ఏడుస్తావా?నాతో వచ్చేద్దువు గానిలే. ఏడవకు. రేపు సాయంత్రం ఆరుగంటలకి స్టేషనుకి రా. టికెట్టు నేను కొంటాను. రెండు స్టేషనులు దాటినతరవాత నా పెట్టెలో ఎక్కుదువు గాని. ఆంతవరకూ వేరే పెట్టెలో ఎక్కు,” అనేసి, ఇంటికి వచ్చేశాను, వాడిచేతిలో అయిదు రూపాయలు పెట్టి.

నేను చేసిన పని అమ్మకు మాత్రం చెప్పేను. “వెధవ, ఊరికి వెళ్తున్నానన్న సందడి కాబోలు, అన్నానికి రాలేదు,” అంది అమ్మ, ప్రేమా, బాధా కలిసి ధ్వనిస్తున్న స్వరంతో, పొద్దున కాఫీ ఇస్తూ.

నాగది తుడిచి వస్తూ, నూకాలు “ఇదేటో బాబూ, మంచంకాడ పడున్నాది,” అంటూ ఓ కవరు నాకు అందించింది.

ఎక్కడో సంపాదించిన పాత కాగితాలమీద ఎవరో పారేసిన పెన్సిలుముక్కతో రాసినట్టుంది. అలవాటు లేనివాడు రాసినట్టు బోలెడు తుడుపులూ, కొట్టి వేతలూ ఉన్నా ఇంకా తప్పులు మిగిలిపోయే ఉన్నాయి.

కాయితం వీలయినంత సాపు చేసి వెనక్కి తప్పి చూశాను. శిఖి రాసేడు.

“చినబాబూ,

ఇన్నాళ్లకి నువ్వు ఒక్కడివి నాతో చల్లగా మాటాడేవు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా! నేను ఇంక ఇలాగ దొంగ బతుకు బతకను. నన్నెవరూ ఏమీ చెయ్యలేరు. ఏమైనా చేస్తే నువ్వున్నావు కదా. అమ్మ కూడా ఉంది కదా (మా అమ్మ అన్నమాట). కానీ నేను నీతో రాను. చినబాబూ, ఇక్కడ నేను రోజూ అమ్మని (రాజేశ్వరిని) చూసుకుంటాను శ్మశానంలో. అక్కడ అలా కళ్లు మూసుకుని కూచుంటే అమ్మ నాకు కనిపిస్తుంది. ఓదారుస్తుంది. నేను అమ్మని వదిలి రాలేను. నిజంగా నేను అమ్మని చంపలేదు చినబాబూ. నేను చంపలేదు. అమ్మే చచ్చిపోయింది. నేను వట్టి వెధవని అని అందరూ అంటారు కదూ. నిజంగా వెధవనే. అందుకే అమ్మ చచ్చిపోతూంటే చూస్తూ ఊరుకున్నాను. కానీ నేను చంపలేదు. అసలు అమ్మని ఎవరు చంపగలరు? అమ్మది రాచపుట్టుక. ఆమాట అమ్మే అంది, “నాది రాచపుట్టుకరా. నేను చచ్చినా వెయ్యి, బతికినా వెయ్యి. అందుకే వెళుతున్నాను. ఈలోకం చూశాను. అవతల ఏముందో చూస్తాను’ అంది చచ్చిపోతూ. మీకెవ్వరికీ తెలీదు అమ్మది రాచపుట్టుక అనీ, కత్తిసాములో అమ్మకి సాటి రాగల మొనగాడు ఊర్లోనే లేడు అనీ. ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు కదూ. నాకు చెప్పడం బాగా రాదు. అందుకని కోపం తెచ్చుకోకు. మరి నేను నీలాగా చదువుకోలేదు కదా. ఆ యజ్ఞవరాహమూర్తి గారింట్లో చేరిన సైదులు లేడూ వాడు రోజూ అమ్మదగ్గరికి వచ్చేవాడు. ఆ యజ్ఞవరాహమూర్తి గారింట్లో చేరిన సైదులు లేడూ వాడూ రోజూ అమ్మదగ్గరికి వచ్చేవాడు. ఎప్పుడయినా ‘పది రూపాయలు ఇయ్యి. పట్నం వెళ్లి సినిమా చూసొస్తా’ అనేవాడు. అమ్మ ఇచ్చేది. వాతో కూడా చాలా స్నేహంగా ఉండేవాడు. ఒకమారు నన్ను కూడా సినిమాకి తీసుకువెళ్లాడు. ‘పేకాట వచ్చా?’ అని అడిగేడు. రాదన్నాను. ‘నేర్పనా?’ అన్నాడు. ఒకరోజు వెళ్లేను వాడితో. నాకేం బాగులేదు. అప్పటినించీ మళ్లీ వెళ్లలేదు. సైదులు మాత్రం అప్పుడప్పుడు మాఇంటికి వచ్చేవాడు. ఒకరోజు వాడే అమ్మని అడిగేడు, ‘అయితే ఎంత దాచేవత్తా?’ అని. అమ్మ నవ్వింది. ‘ఏం? కన్నం వేస్తావా?, కాదని దావా వేస్తావా?’ అని. వాడు ‘అబ్బే, అదేం లేదు. పెంపకానికి వచ్చేస్తాను,’ అన్నాడు. ‘అయితే నీకు దక్కేది అక్షయపాత్రే,’ అంది అమ్మ. ఆతరవాత కొన్నాళ్లు నన్ను వేధించుకు తిన్నాడు అమ్మ దగ్గర ఆస్తి ఎంత ఉందో చెప్పమని. నాకు తెలీదంటే నమ్మలేదు. నాకు తరవాత్తరవాత తెలిసింది ఈ విషయం ఊళ్లో కూడా చాలామందిని బాధించేదని. కానీ అమ్మ మాత్రం ఏమీ ఎరగనట్టు నటించేది. ఆఖరికి ఆ సైదులు మీరిపోయేడు. అమ్మ కూడా చిరాకు పడి, డబ్బు ఇవ్వను, పొమ్మనేది. అలా రెండు, మూడుమార్లు అయిందేమో, ‘ఎందుకివ్వవో చూస్తాను’ అన్నాడు సైదులు కఠినంగా.

ఆరాత్రి తలుపు చప్పుడయితే అమ్మే వెళ్లి తలుపు తీసింది. సైదులు కసాయికత్తి తీసుకుని వచ్చేడు. కొంచెం తాగి కూడా ఉన్నాడేమో కూడా. నాకు వణుకుతో కాళ్లూ చేతులూ ఆడలేదు.

అమ్మ మాత్రం కించిత్తయినా చలించలేదు. ‘ఛీ, దుర్మార్గుడా! తులసివనంలో గంజాయిమొక్కలా ఇక్కడికి వచ్చావు. ఫో. తాగి తందనాలాడేవాళ్లకి ఇక్కడ చోటు లేదు’ అంది.

‘కబుర్లు కట్టి పెట్టి డబ్బు ఎక్కడుందో చెప్పు. రెండు వేలు కావాలి’ అన్నాడు సైదులు.

‘ఎవడబ్బ సొమ్ము దాచేవిక్కట. అవతలికి ఫో,’ అంది అమ్మ.

‘చెపుతా,’ అన్నాడు సైదులు కత్తి ఎత్తి. అమ్మ క్షణంలో మెరుపులా కత్తి ఝళిపించింది. సైదులు చెయ్యి తెగి తొక్కలా వ్రేలాడుతోంది. అమ్మ అంది, ‘ఈ రాజేశ్వరి  ఎవరనుకుంటున్నావో! రాచబిడ్డరా. రాణాప్రతాపుల వంశపు మొలక. ఆ చెయ్యి నరికినట్టే, ఆ తల ఎగరేయడానికి కూడా ఎంతోసేపు పట్టదు. కానీ వదిలి పెడుతున్నాను, ఫో ఇక్కడినించి’ అని అరిచింది. ఇంకేం జరుగుతుందోనని నేను భయంతో బిగుసుకుపోయేను.

సైదులు వెనక్కి తిరిగి వెళ్లిపోయేడు. అమ్మ వెంటనే తనని తాను పొడుచుకుంది అదే కత్తితో. చచ్చిపోతూ, ‘ఒరేయ్ శిఖీ, ఈలోకం చూశాను. ఇంక అవతల ఎలా ఉంటుందో చూసొస్తాను’ అంది. అమ్మ లేదింక.

నన్ను గాలిలోంచి తీసుకుని పెంచుకుంది. గాలిలోనే వదిలేసి వెళ్లిపోయింది. నాకు బుద్ధి తెలిసినప్పటినించీ అమ్మ ఒక్కతే. అందుకే అమ్మ నన్ను వదిలిపెట్టినా నేను అమ్మని వదిలి పెట్టను. నేను ఇక్కడే ఉంటాను. నామీద కోపం తెచ్చుకోవు కదూ.

శిఖి.”

“అయ్యో, నువ్వింకా ఏదో ఘనకార్యం సాధిస్తావనుకున్నాను కానీ …” కనపడని రాజేశ్వరినుద్దేశించి ఘోషించేను.

000

(ఆంధ్రసచిక్ర వారపత్రిక.  జులై 12, 1966)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “మామూలు మనిషి”

  1. @ Indu, అసంపూర్ణం అంటారా. నా చిన్నతనంలో మాఅమ్మ ఎవరో ఒకరిగురించి ఎంతో ఘనంగా చెప్తున్నప్పుడు, నిజంగా ఆమనిషి ఎలా ఉంటారో అనే ఆలోచన వచ్చేది కానీ నేను తెలుసుకోగలిగింది లేదు. ఈకథలో నేను ఆవిష్కరించడానికి ప్రయత్నించిన కోణం అంతే. రాజేశ్వరిది సంక్లిష్టమైన వ్యక్తిత్వం. ఇందులో “నేను” పాత్ర ఆమెనిగురించి ఊహించికున్న చిత్రమే మనకి తెలుస్తుంది కానీ నిజంగా ఆమె ఎవరో తెలీదు. మనం సాధారణంగా ఒకవ్యక్తినిగురించి విన్నప్పుడు కల్పించుకున్న రూపం, మీరన్నట్టు అసంపూర్ణం, మాత్రమే ఆవిష్కరించాలనుకున్నాను.

    మెచ్చుకోండి

  2. కొందరి ఉనికి, సమక్షం ఇలాగే ఉంటాయి.

    ఏదొ తెలియని ఉత్సుకత, ఆసక్తి, ఇది అని చెప్పలేని భావం, జాలి కలుగుతాయి.

    ఏదో చూసి వదిలేసేలాగా ఉండవు కొంతమంది వ్యక్తిత్వాలు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.