కె.కె. రంగనాథాచార్యులుగారి “తొలినాటి తెలుగు కథానికలు. మొదటినుంచీ 1930వరకు.”

నేను ఆగస్టులో కేతు విశ్వనాథరెడ్డిగారిని కలిసినప్పుడు, ఆయన కె. కె. రంగనాథాచార్యులు గారి “తొలినాటి తెలుగు కథానికలుః మొదటినుంచి 1930 వరకు తెలుగు కథానికల పరిశీలన” అన్న పుస్తకం నాకు ఇచ్చారు. నేను అక్కడ ఉండగానే చదివిన పుస్తకాల్లో ఇదొకటి.

కేవలం 120 పేజీల్లో తొలినాటితెలుగు కథానిక ఆవిర్భావం, తీరుతెన్నులు ఆయన మనకి అందించిన తీరు నన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

ఆ తరవాత రంగనాథాచార్యులుగారిని రవీంద్రభారతిలో చూసినప్పుడు, వారిపుస్తకం సంక్షిప్తరూపంలో ఇంగ్లీషులో పెట్టడానికి అనుమతి కోరేను. ఆయన సరేనన్నారు. ఇంగ్లీషులో రాయడం మొదలు పెట్టేక, ఇందులో విషయాలు తెలుగులో కూడా చెప్తే బాగుంటుందనిపించింది ముఖ్యంగా ఈమధ్య నాబ్లాగులోనూ, నాస్నేహితులతోనూ, ఇతరత్రా వస్తున్న చర్చలదృష్ట్యా. 

మొదట రంగనాథాచార్యులుగారి పుస్తకంలోని విషయాలను స్థాలీపులాకన్యాయంగా ప్రస్తావించి, తరవాత నాఅభిప్రాయాలు విడిగా రాస్తాను, అయోమయానికి తావు లేకుండా.

అసలు ఈపుస్తకానికి పెట్టినపేరులోనే రచయిత తీసుకున్న జాగ్రత్త కనిపిస్తోంది. “తొలినాటి తెలుగు కథానికలు” అన్నది శీర్షిక. దానికి ఉపశీర్షిక “మొదటినుంచి 1930 వరకు” అని. ఆ మొదటితేదీ ఏమిటో శీర్షికలో లేదు. ఎంచేతంటే అప్పారావుగారి “దిద్దుబాటు” తొలికథ అన్నవాదం విస్తృతంగా ప్రచారంలో ఉన్నా, దానికి ప్రతివాదనలు కూడా ఉన్నాయి. రంగనాథాచార్యులుగారు ఆ వాదప్రతివాదనలను ఈపుస్తకంలో ఒకచోట పెట్టడం హర్షనీయం.

తెలుగులో కథలకీ నాటకాలకీ ఆధారం గుణాఢ్యుడు పైశాచీభాషలో రాసిన బృహత్కథ. ఆ గ్రంథం క్రీ.శ. ఒకటి, రెండు శతాబ్దులలో జరిగివుండవచ్చునని పండితుల అభిప్రాయం. ప్రస్తుతం అలభ్యం. అలాగే, మనకి మౌఖికసాహిత్యం ఎప్పటినుండి వచ్చిందో, ఎవరు ఆ మౌఖిక కథాసాహిత్యానికి లిఖితరూపం ఇచ్చారో కూడా నిర్దుష్టంగా చెప్పలేం అంటారు రచయిత. 

కథాలక్షణాలమాటకొస్తే, సంస్కృతకథల్లో కొన్ని ఉపదేశాత్మకం- నీతిని బోధించేవి. వీటిలో శుకసప్తతి, పంచతంత్రం వంటివి ఇతరదేశభాషల్లోకి కూడా అనువాదం అయేయి. కొన్నివినోదాత్మకం. అంటే హాస్యం, అద్భుతంవంటి రసాలను పోషించేవి. వినోదాత్మక కథల్లో, మౌఖికసాహిత్యంద్వారా సంప్రాప్తమయినవి కొన్ని కేవలం తెలుగుకే పరిమితమయితే కొన్ని ఇతరద్రవిడభాషల్లో కూడా కనిపిస్తాయి.

ఆధునిక తెలుగుకథ ఈ ప్రాచీనకథలకి పరిణామరూపమా? ఆంగ్లాభాషాసంపర్కంలో కొత్తగా ఉద్భవించిందా? అన్నది కూడా చర్చనీయాంశమే. రంగనాథాచార్యులుగారు ఆనాటి విమర్శకులు వెలిబుచ్చినఅభిప్రాయాలు ప్రాతిపదికగా ఆధునికకథకి స్వతంత్ర ప్రతిపత్తి ఉందనే అంటున్నారు.

హంసవింశతి, శుకసప్తతి వంటి కథలలోనూ ఆధునికకథల ఛాయలున్నా,

ఆధునికకథలో కథానిర్మాణం, రచయిత ప్రదర్శిస్తున్న తనదైన ప్రత్యేకశైలీ, వస్తువైవిధ్యం వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకు చూస్తే ప్రాచీనకథాసాహిత్యానికి పరిణామరూపం కాదనే రచయిత అభిప్రాయం.

పత్రికలు చిన్నకథలని ప్రోత్సహించేయి. తొలిదశలో ప్రముఖపత్రికలు త్రిలఙ్గ, ఆంధ్రభారతి, సాహితి (సాహితీసమితివారి ఆధ్వర్యంలో), భారతి, కృష్ణాపత్రిక, సుజాత, గృహలక్ష్మి, శారద లాటి ఎన్నోపత్రికలు చిన్నకథలని అచ్చు వేయడం ప్రారంభించేయి. ఆనాటిరచయితల్లో ఆచంట సాంఖ్యాయనశర్మ, గురజాడ అప్పారావు, మాడపాటి హనుమంతరావు, కనుపర్తి వరలక్ష్మమ్మ, చలం, మునిమాణిక్యం నరసింహారావు వంటి ప్రముఖులు ఉన్నారు. ఈపత్రికలు వ్యాసాలను, విమర్శలను కూడా ఇతోధికంగా ప్రోత్సహించేయి.

అనువాదాలు – కథాసరిత్సాగరంవంటి కథలు ప్రపంచభాషల్లోకి అనువాదం అయేయి. అలాగే అటునించి ఇటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ కథలు, బెంగాలీ, హిందీ, ఉర్దూ, మరాఠీ కథలు కూడా తెలుగులోకి అనువదించారు. ఈ “ఆదానప్రదానాలకి” రెండు శతాబ్దుల చరిత్ర ఉందంటారు రచయిత.

తొలిదశలో మూలరచయిత పేర్లు ఇవ్వలేదుట. ఈరోజుల్లోనే అనువాదం, అనుసరణ, ఎత్తిరాసినది, కథనుండి గ్రహింపబడినది – అన్నపదాలు వాడుకలోకి వచ్చేయి. 

పోతే, తెలుగులో తొలికథానిక ఏది అన్నది వివాదాంశం. అప్పారావుగారి “దిద్దుబాటు” తొలి ఆధునికకథగా కొందరు విమర్శకులు గుర్తించినా, ఆవాదనకి ప్రతివాదనలు కూడా చాలానే వచ్చేయి. ఎవరు ఏ కథని తొలికథగా, ఏ రచయితని తొలిరచయితగా గుర్తించారు అన్నది సవివరంగా చర్చించేరు రంగనాథాచార్యులుగారు ఈపుస్తకంలో. చివరకి, తమమాటగా, “వేరే ఆధారాలు, సామగ్రి లభించేంతవరకూ భండారు అచ్చమాంబ (1887-1905) కథలే తెలుగులో తొలికథలని చెప్పవలసి ఉంటుంది” అంటారాయన (24).

అంతేకాదు. 19వ శతాబ్దం ముగిసేముందే వచ్చిన అచ్చమాంబగారి రచనలు “స్త్రీవ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే రచనలు” అంటూ “స్త్రీలను వ్యక్తిత్వం, స్థైర్యం, భర్త బలహీనతలను సరిచేయగల నైతికత కలవారిగా అచ్చమాంబ చిత్రించింది. ఆమెతరువాత వచ్చిన కథల్లో ఈవిధమైన చిత్రణ సుమారుగా కనిపించదు” అని మెచ్చుకున్నారు (31).

అసలు కథ అంటే ఏమిటి, కథాలక్షణాలు ఏమిటి, మౌఖికసాహిత్యంలో ప్రచారంలో ఉన్నకథలకీ, ఈనాడు మనం ముద్రణలో చూస్తున్న కథలకీ తేడా ఏమిటి, ఆదిలో కథలు ఎక్కడినుండి తీసుకున్నారు వంటివిషయాల చర్చ చాలా ఉంది ఈపుస్తకంలో.

ఇంగ్లీషు short storyకి సమానార్థకంగా తెలుగులో కథ, కథానిక, కథిక, కథానకం లాటి వేరు వేరు పేర్లతో ప్రయోగాలు చేసి, ఇప్పటికి కథ, కథానిక అన్న వాడడం స్థిరపడినట్టుంది. అలాగే డిటెక్టివ్ కథలని నిరూపకకథలనీ, డిటెక్టివ్‌ని నిరూపకుడు అని కొంతకాలం వాడేరుట కానీ అది ప్రాచుర్యం పొందినట్టు లేదు. ఇంగ్లీషుపేర్లే స్థిరపడిపోయేయి.

ఆనాటి కథాలక్షణాలను తెలుగు విమర్శకులు చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఇంగ్లీషుకథ నిర్వచనాలు ఆధారంగా చేసినవిగానే కనిపిస్తాయి.

డి.ఏ. నరసింహంగారు చిన్నకథ ఎలా ఉండాలన్నవిషయంలో ఆరు అంశాలను సూత్రప్రాయంగా చెప్పేరు.

– చిత్రవిచిత్ర వస్తువులను తీసుకోవచ్చు

– సైజు ఇంత ఉండాలన్న నియమం లేదు.

– సంభాషణలద్వారా పాత్రలను ఆవిష్కరించడం కష్టమే అయినా ఉత్తమం.

ఇలా చేయడంవల్ల పాఠకుడే స్వయంగా కథాభూమికను గ్రహించగలడు.

– కథ పాఠకుడికి పని పెడుతుంది. ఆలోచింపజేస్తుంది. నవల పఠనంతో పాఠకుడు తృప్తి పడతాడు.

– నవలలా కాక, చిన్నకథలు పాఠకునిభావాలను ముందుకు తీసుకుపోయి. కొత్తభావాలతో స్నేహం చేయడానికి తత్తరపడతాయి

– “నవలారచయితలా కాకుండా, కథారచయిత పాఠకులకిచ్చేది చాలా తక్కువ. తానిచ్చినదానికంటె పదిరెట్లెక్కువ పనిని పాఠకునికి కల్పించి పెడతాడు.”

(పైసూత్రాలలో చివరిది మాత్రమే మక్కికి మక్కి తిరగరాసేను. మిగతా వాక్యాలు మరింత వివరంగా మూలంలో ఉన్నాయి. పూర్తిపాఠానికి రంగనాథాచార్యులుగారి పుస్తకం చూడవలసిందిగా కోరుతున్నాను. – మాలతి)     

తరవాత కథాంశాలను ప్రస్తావిస్తూ, ఇరవయ్యవ శతాబ్దం తొలిదశలో వారిదృష్టికి వచ్చిన రచయితలు దాదాపు 200మందివరకూ ఉన్నారనీ, వారిలో 15మంది రచయిత్రులు అని రాసేరు. తమకి దాదాపు అయిదువందలదాకా కథలు కనిపించేయిట. వెతుకుతూంటే, ఇంకా ఎక్కువ కథలూ, రచయితలూ దొరికే అవకాశం ఉందంటారు.

తాము చూసిన కథలలో వస్తువైవిధ్యం, శైలిలో వైవిధ్యం కూడా విశేషంగానే ఉంది.

చిన్నకథలు లేక కథానికలని ప్రప్రథమంగా విశ్లేషించినవారు అక్కిరాజు ఉమాకాన్తమ్. 1913-14లో త్రిలిఙ్గ పత్రికలో అక్కిరాజు ఉమాకాన్తమ్ పత్రికలగురించి, చిన్నకథ

లక్షణాలగురించి హెన్రీ హడ్సన్ రచనలనేపథ్యంతో అనేక వ్యాసాలు రాసారు.

హడ్సన్ ఇంగ్లీషుసాహిత్యంలో చిన్నకథ రావడానికి చదువరులకి తీరిక లేకపోవడం అన్నాట్ట. “తెలుగుదేశమున ఈ నిముషమయిన తీరిక లేని స్థితి ఇంకను రాలేదు” అన్నారు ఉమాకాన్తమ్‌గారు 1918లో. చిన్నకథలో “కథ అంతా చదివినతరవాత ఒక విషయము ధ్వనించును. ధ్వని ప్రథానము” అని కూడా అంటారు ఉమాకాన్తమ్‌గారు.

ఆతరవాత 1925లో ఆండ్ర శేషగిరిరావుగారు చిన్నకథలను విశ్లేషిస్తూ, “పుస్తకపఠనాభిలాషి విద్యాప్రియుడగు ఆంధ్రుడు వర్తమానమున పట్టణములందు నివసించి త్వరజీవనము చేయుచున్నాడు. అతనికి తీరిక తక్కువ” … అంచేత చిన్నకథలు పాఠకులఆదరణకి నోచుకున్నాయి అంటారు. సుమారుగా ఆరుసంవత్సరాల వ్యవధిలో అభిప్రాయాలు మారిపోయాయి అనడం కంటే, రెండురకాల అభిప్రాయాలు ఆరోజుల్లోనే మొదలయేయి అనుకోడం ఉత్తమం అనుకుంటున్నాను.

పాఠకులని ఆకట్టుకోడమే ప్రధానం కనుక వారిభాషలోనే అంటే వ్యావహారికభాషలోనే చెప్పాలన్న అభిప్రాయాన్ని కూడా విమర్శకులు ఆమోదించారు.

ఈమూడు దశాబ్దులలోనే వస్తువైవిధ్యం, శిల్పవైవిధ్యాన్ని సంతరించుకుంది తెలుగు కథ. స్త్రీసంబంధిత, మానవసంబంధిత కథలు చాలానే వచ్చినా, సాహిత్యవిషయిక వస్తువు లేదా ప్రసక్తానుసరంగా సాహిత్యవిషయాలపై చర్చలూ కూడా ఈకథల్లో దర్శనమిస్తాయి.

మరొక అంశం ఆత్మవంచన. మూఢవిశ్వాసాలకి సంబంధించిన చర్చ. ఆర్థికపరమైన సమస్యలు మధ్యతరగతికే పరిమితమవడం. దళితసమస్యలు, రాజకీయసమస్యలూ, గిరిజనసమస్యలూ చాలా తక్కువ. మానవజీవితానికి సంబంధించిన సున్నితమయిన కోణాలు, లోతులు, సంవేదనలు సుమారు మృగ్యమనే చెప్పాలి అంటారు రంగనాథాచార్యులు.

25మంది ప్రముఖరచయితలకథల్లో వస్తువూ, శైలీ, చర్చించారు. ఈ జాబితాలో నేను వినని పేర్లు నాలుగో అయిదో ఉన్నాయి. వాటిలో నాదృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది శ్రీవాసుదేవరావు పేరు. శ్రీవాసుదేవరావు (శ్రీ పేరులో భాగమేలాగుంది) కథల్లో రచయిత అభివ్యక్తం అయినట్టు కనిపిస్తుంది అంటారు రంగనాథాచార్యులు. కథలో కథానాయకుడికి ఆంగ్లభాషా, దుస్తులూ, విద్యాభిమానం కనిపిస్తాయిట. తాను హైదరాబాదీనని చెప్పుకోడం, తెలుగు చదవడం రాదని చెప్పుకోడం ఒక బడాయి అతనికి. “ఈవిషయంలో కథకుడిగా (శ్రీవాసుదేవరావు) కథానాయకుడు చెప్పేమాటలనుబట్టి ఆరోజులలో హైదరాబాదులో ఉండే చదువుకున్నవారు తమకు తాము ప్రత్యేకమయినవారుగా ఎలా భావించేవారో తెలుస్తుంది” అంటారు రంగనాథాచార్యులుగారు (81).  

1911నాటికే కథా సంకలనాలు కూడా రావడం మొదలయింది. ఒకే రచయితవి కొన్నయితే, వివిథరచయితలసంకలనాలు కొన్ని.

పుస్తకం చివరలో, జ్ఞాపికలూ, ఉపయుక్తగ్రంథాలూ, సూచికలూ, తాను పరిశీలించి గుర్తించి కథలూ పూర్తివివరాలతో ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంది.

ఆధునికతెలుగుకథ ప్రారంభదశలో ఎలా రూపురేఖలు సంతరించుకుందో తెలుసుకోవాలనుకునేవారికి ఇది చాలా సంతృప్తిని కలిగించే పుస్తకం. 

ఇది 2008లో డా. మాడభూషి రంగాచార్య స్మారకసంఘం, హైదరాబాదు, ప్రచురించారు.

ప్రతులకు, యం. లలితాదేవి, 7-79 చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాదు 500660. ధర. 75.00 రూపాయలు.

avkf.org ద్వారా కూడా ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. లింకు http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=260

————-

నా సమీక్షకి అనుబంధంగా రెండు అంశాలు ప్రస్తావిస్తాను. 

మొదటి అంశం కథాసాహిత్యచరిత్రలో అచ్చమాంబగారి స్థానం. రంగనాథాచార్యులుగారు రాసినట్టు, 19వ శతాబ్దం ముగియడానికి ముందే వచ్చిన అచ్చమాంబగారికథల్లో శిల్పం ఆధునికకథాలక్షణాలు కలిగినదిగానే ఉంది. పోతే, వస్తువు తీసుకుంటే, సంఘంలో స్త్రీలస్థానం, స్త్రీవిద్య విషయాల్లో అచ్చమాంబగారి అభిప్రాయాలు వీరేశలింగంగారు ప్రచారంచేసిన అభిప్రాయాలకి పూర్తిగా విరుద్ధం. ఆమె చిత్రించిన స్త్రీని వ్యక్తివికాసం, ఆత్మవికాసం, వ్యక్తిత్వంగల మనిషిగా గుర్తించేది. “భర్త బలహీనతలను సరిచేయగల నైతికత కలవారిగా” స్త్రీని చిత్రించారు అచ్చమాంబగారు అని రంగనాథాచార్యులుగారు అనడం గమనించండి. ఆ తరవాతికాలంలో వచ్చిన దిద్దుబాటుకథలో వస్తువు కూడా అదే కదా. అచ్చమాంబగారి రచనలు సంపూర్ణంగా ఆధునికపంథాలో సాగినరచనలని గుర్తించాలి.  

రెండో అంశం కథ తీరుతెన్నులవిషయంలో ఈనాడు ప్రాచుర్యంలోకి వస్తున్న అభిప్రాయాలు.

పైన డి. ఎ. నరసింహంగారూ, ఇతర విమర్శకులూ కథ ఎలా ఉండాలో రచయితలకోసమే చెప్పినా, నాఉద్దేశ్యంలో అది పాఠకులూ, పత్రికాసంపాదకులూ కూడా ఆలోచించవలసిన విషయమే. వారు ఆలోచించడంలేదని కాదు నేను అనడం. ఆ ఆలోచనావిధానంలో అభివ్యక్తమవుతున్న కోణాలు నాకు చిత్రంగా ఉన్నాయి. 

చిన్నకథకీ నవలకీ ప్రధానంగా విస్తృతిలో గొప్ప వ్యత్యాసం వుంది. నవలకి పెద్ద కాన్వాసు ఉంటుంది కనక అనేక విషయాలు వివరంగా వర్ణించడానికి అవకాశం ఉంటుంది. చిన్నకథ ధ్యేయం వేరు. నవల పెద్ద కాన్వాస్ అయితే చిన్నకథ అతుకులబొంత.  

రచయిత రెండో మూడో సంఘటనలో సన్నివేశాలో తీసుకుని ఒక కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. సాధారణంగా విషయం కథకి ఇచ్చిన శీర్షికలో తెలుస్తుంది. “మంచికథ”, “ఇది కథ కాదు”, “నిజంగా జరిగినకథ” లాటి పేర్లు కథావస్తువుని సూచించవు. కథకి పేరు పెట్టడం కూడా ఒక విద్యే అంటాన్నేను.

చిన్నచిన్న చదరపుముక్కలు తీసుకుని కుట్టినతరవాత బొంత మొత్తంగా చూస్తే ఒక దృశ్యం కనిపిస్తుంది. అతుకులు కూడా కనిపిస్తాయి. పాఠకులు అతుకులమీద కాక బొంతమీద నిలపాలి దృష్టి. అదే నరసింహంగారు పాఠకుడికి “పని” పెడతాయి అని చెప్పడంలో ఆంతర్యం. అంతేకానీ, అతుకులమీదే దృష్టి పెట్టడం గొంగళీలో వెంట్రుకలు ఏరడంలాటిదే! మీకు మీరు బ్రహ్మాండంగా ఉందనుకున్న కథ తీసుకుని చూడండి. ఏదో ఒక ప్రశ్న వెయ్యలేని కథ ఎక్కడేనా ఉందేమో చూడండి.  

చిన్నకథలో క్లుప్తత, వస్త్వైక్యత, సమయైక్యత వంటిగుణాలు అవసరం అన్నవాదనని నరసింహంగారి సూచన బలపరుస్తుంది. చిలవలుపలవలుగా సకల విషయాలూ అందివ్వడం జరగదు. పాఠకులు ఊహించుకోవలసినవి చాలా ఉంటాయి. అలా ఊహించుకోడంలో పాఠకుడు మరొక కొత్తకోణాన్ని చూస్తే, అది అభిలషణీయమే. ఆకారణంగానే కావచ్చు దీన్ని రంగనాథాఛార్యులు “పాఠకాశ్రిత విమర్శ” అన్నారు.

నేను కథలు రాయడం మొదలు పెట్టినరోజుల్లో, నిజానికీ ఇప్పటికీ ప్రింటు పత్రికల సంపాదకులు రచయితకి కథని ఎలా మెరుగుపరచాలి అన్నది చెప్పరు. వారి పాలసీపరిథిలో ఉంటే వేసుకుంటారు. లేదంటే, తిరగ్గొడతారు. కొందరు తిరగ్గొట్టినట్టు తెలియజేయరు కూడాను. వారికి వస్తున్న కథలసంఖ్య దృష్ట్యా.

నాకు తెలిసినంతవరకూ జాలపత్రికలు ప్రారంభించారు కథని మెరుగు పరచడానికి సూచనలు ఇవ్వడం. సూచనలు ఇవ్వవచ్చు కానీ సూచనలపేరుతో కథలని మూస చట్రాలలోకి దింపడం న్యాయం కాదు.  పైన చెప్పిన చిన్నకథ లక్షణాలు గుర్తించడం కూడా అవసరమే. ఒకపాత్రకి రెండుపేర్లు పెట్టడం, రెండుపాత్రలకి ఒకపేరు పెట్టడంవంటివి దోషాలే (ఇలాటివి నాకథల్లో వచ్చేయి. అవి సంపాదకులు ఎత్తి చూపినప్పుడు, నాతప్పు ఒప్పుకుని దిద్దుకున్నాను కూడా). కానీ ఎవరు ఎప్పుడు ఏమాట అన్నారు, ఎక్కడ నిల్చుని మాటాడేరు, నిల్చుని మాటాడేరా, కూర్చుని మాటాడేరా -వంటివి కథలో ప్రధానాంశం కాకపోవచ్చు. కావచ్చు కూడా అనుకోండి.

నిజంగా కథలో ప్రధానాంశానికి సంబంధం ఉందనుకుంటే రచయిత అంగీకరించవచ్చు. కానీ అవునా కాదా అన్నది రచయితనిర్ణయమే కావాలి.  ప్రతిరచయితకి తనదైన భాషా, అభివ్యక్తీకరణా, ప్రత్యేకశైలీ ఉంటాయి. సంపాదకులూ, పాఠకులూ వాటిని ప్రోత్సహించినప్పుడే నూతనపోకడలతో కూడిన కొత్తకథలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. వైవిధ్యం ఆహ్వానించకపోతే మూసకథలే వస్తాయి తప్ప నూతన ప్రయోగాలకి ఆస్కారం లేదు. 

కథలో ఏది ప్రధానాంశం అని కాక తమకి తోచినట్టు మార్చమవి కోరడం అభిలషనీయం కాదనే నా అభిప్రాయం. అర్థశతాబ్దం పైగా కథలు రాస్తున్న నాకే నిరుత్సాహంగా ఉంటే, కొత్తగా మొదలుపెట్టినవారికి ఎలా ఉంటుందో ఆలోచించండి.

మరొకవిషయం. ఇలా ఉంటేనే పాఠకులు చదువుతారని సంపాదకులూ, చదవడానికి ఇవే దొరుకుతున్నాయని పాఠకులూ అనుకునే స్థాయికి తెలుగుకథ వచ్చిందా? అదే నిజమయితే, మరి మూసకథలు వస్తున్నాయని విచారించడం ఎందుకు?

(ఏప్రిల్ 17, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “కె.కె. రంగనాథాచార్యులుగారి “తొలినాటి తెలుగు కథానికలు. మొదటినుంచీ 1930వరకు.””

 1. మాలతి గారు,
  నేను చెప్పాలనుకున్న రెండో పాయింట్ ఇది
  “భర్త బలహీనతలను సరిచేయగల నైతికత కలవారిగా” స్త్రీని చిత్రించారు అచ్చమాంబగారు అని రంగనాథాచార్యులుగారు అనడం గమనించండి”
  కె.కె.ఆర్. పుస్తకం గురించి స్నేహితుల దగ్గర వినటమే కానీ అందులో డిస్కస్ చేసిన విషయాల గురించి తెలియదు. మీ వ్యాసం ఆ లోటు ని పూరించింది.

  మెచ్చుకోండి

 2. @ కల్పనా, అందరూ ఒప్పుకుంటారో లేదో చెప్పలేం కదా. ఆకథలో ఆధునికలక్షణాలు లేవు అన్నవాళ్లకి ఏం సమాదానం చెప్పగలం. రంగనాథాచార్యులుగారు ప్రాచుర్యంలో వున్న అభిప్రాయాలు వివరంగా ఇవ్వడం బాగుంది. అంతే.

  మెచ్చుకోండి

 3. మాలతి గారు,
  మీ బ్లాగ్ లో పాతవి, కొత్తవి కలిపి నేను చదవాల్సినవి చాలా వున్నాయి. ఎక్కడో ఓ చోట మొదలుపెట్టాలి కదా.అది తాజా పోస్ట్ తో ప్రారంభించాను.
  కె.కె. ఆర్ పుస్తకం గురించి చాలా విషయాలు తెలిసాయి. నేను ఆ పుస్తకం చూడలేదు. ఇందులో నాకు పనికివచ్చిన విషయాలు రెండూ. అచ్చమాంబ కథ ని ఇప్పటివరకూ మనకున్న సమాచారం ప్రకారం మొదటి తెలుగు కథానిక గా వొప్పుకుంటున్నారా , లేదా అన్నది. ఆ విషయం లో కె.కె. ఆర్. గారి అభిప్రాయం మీ వ్యాసం ద్వారా తెలిసింది.

  మెచ్చుకోండి

 4. @ ఉష, రాయాలన్న ఆకాంక్ష, కాస్త భాష ఉన్నాయి – అదేనండీ రాయడానికి ప్రధానం. కథ ఎలా రాయాలన్నవిషయంమీద పుస్తకాలేమైనా ఉన్నాయోమో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నాకు నచ్చినకథలు మళ్లీ మళ్లీ చదివి ఆనందించడం, ఆతరవాత ఆకథలో నాకు ఏం నచ్చేయో, ఎందుకు నచ్చేయో పరిశీలనగా చూడడం. అందుకే ఒకొకప్పుడు ప్రముఖులకథలలోని వాక్యాలలో, వాక్యాలలాటివో నాకథల్లో కూడా వచ్చేస్తాయి. 🙂

  మెచ్చుకోండి

 5. చాలా వివరాలు ఇచ్చారు. ధబన్యవాదాలు. “రచయితకి కథని ఎలా మెరుగుపరచాలి ” – ఈ విషయమై మీవద్ద మరే సమాచారం ఉన్నా వీలుని బట్టి అందిమ్చగలరా? ఈ పుస్తకం సంపాదించే ప్రయత్నం చేస్తాను. రాయాలన్న ఆకాంక్ష, కాస్త భాష ఉన్నాయి కానీ సాధన కి తగు సూచనలు కోసం ఇంకా అన్వేషణ.

  మెచ్చుకోండి

 6. @ మాధురీ కృష్ణ, నాక్కూడా తెలీదండీ. నిజానికి నేను రంగనాథాచార్యులుగారి అడ్రెస్ తీసుకోడం మరిచిపోయాను. ఎలా కనుక్కోడమా అని ఆలోచిస్తున్నాను. పుస్తకం 2008లో ప్రచురించేరు కనక యం. లలితాదేవిగారికి ఉత్తరం రాస్తే తెలుస్తాయనుకుంటాను వివరాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.