రావిశాస్త్ర్రిగారి నాలుగార్లు – మొదటి భాగం

రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు ఎన్ని పుస్తకాలు వెలువరించేరో అంతకంతా ఆయనమీదా ఆయనరచనలమీదా పుస్తకాలు ఉన్నాయి. అంచేత మళ్లీ నేను చెప్పేది ఏంవుంది అనిపించినా, ఒక సాధారణ పాఠకురాలిగా ఆయనకథలు తొలిసారిగా చదివినప్పుడు ఎలా స్పందించేనో, నాకు కలిగిన ఆలోచనలేమిటో చెప్తాను.
రావిశాస్త్రిగారిని ఒకే ఒకసారి విశాఖసాహితి సమావేశంలో 1963లో చూశాను. ఆరోజు ఆయన నేలమీద కూర్చుని, తలొంచుకుని తనలో తను మాటాడుకుంటున్నట్టు నెమ్మదిగా “నేనెందుకు రాస్తున్నాను” అన్నవిషయం ప్రస్తావించేరు. తరవాత అదేపేరుతో అనేకమంది రచయితల వ్యాసాలు సంకలనంలో వ్యసంగా చేర్చబడింది.

రావిశాస్త్రిగారి ఉపన్యాసంలో ముఖ్యమయిన అంశాలు మూడున్నాయి.

మొదటి అంశం – ప్రతిమనిషికీ తనకి తెలిసినదీ, అర్థమయినదీ పొరుగువాడికి చెప్పాలని ఉంటుంది. అవే కథలవుతాయి.

రెండోది – కవిత్వానికి (అలాగే కథలకీ) మనుషుల్ని ఎటో అటు మళ్లించే శక్తి ఉంది. మూడోది – ఏరచయితా కూడా మంచికి హాని కలిగించే, చెడుకి ఉపకారం కలిగించే రచనలు చెయ్యకూడదు అన్నది.

ఈమూడు అంశాలూ విశ్వనాథశాస్త్రిగారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అంటే కొన్ని రచనల్లో తాను గమనించినవి చెప్పడం మాత్రమే జరుగుతుంది. కొన్నికథల్లో పాఠకులని ఎటో అటు మళ్లించాలన్న తపన కనిపిస్తుంది. మూడో అంశం గూఢంగా ప్రతిధ్వనిస్తుంది కొన్నికథల్లో.

నామటుకు నేను, ఏకథ అయినా పాఠకుడిలో ఒక మంచికథ చదివేనన్న తృప్తీ, ఒక మంచి స్నేహితుడిసాన్నిహిత్యంలో కాలం గడిపినప్పుడు కలిగే తృప్తీ కలిగించడమే ఎక్కువగా చేస్తుందనుకుంటాను.

“నాలుగార్లు” సంకలనంలో కథలన్నీ 1950, 60 దశకాల్లో రాసినవి. ఇందులో కొన్ని కథలు నేను అప్పుడే కొత్తగా కథలు చదవడం మొదలు పెట్టినరోజుల్లో (అంటే 1950 దశకం తొలిరోజులు) వచ్చినవి. అందులో కొన్ని కథలు నాకు ఈనాటికీ స్పష్టంగా అద్దంలో నీడలా గుర్తుండిపోయిన కథలు – కోర్టుకి రాని సాక్షులు, కార్నరు సీటు, కిటికీ, మగవాడూ-ఆడమనిషీ, జరీఅంచు తెల్లచీరె లాటివి. అంచేత అవే ముందు చర్చిస్తాను.

“కోర్టుకి రాని సాక్షులు” కథలో చదువుకోని, డబ్బులేని ఆడమనిషిని –

“అగ్నిసాక్షిగా పెళ్లాడేను దాన్ని.

అది నాదగ్గరికి రావాలి.

నాతోనే ఉండాలి”

అంటాడు ఒక ఆసామీ.

అదీ అతని కేసు.

ఇది చాలు ఏపాఠకుడినైనా ఆకట్టుకోడానికి. ఎవరైనా కోర్టులో తీర్పులిచ్చి, మరొకమనిషిని ఇంటికీడ్చుకొచ్చి కాపురాలు నిలబెట్టుకోగలరా? “మీరిద్దరూ కాపురం చెయ్యాలి. అది చట్టం” అంటే ఆ రోజుల్లో కూడా నాకు అసందర్భంగానే తోచింది. నిజంగా, సూక్ష్మంగా ఆలోచిస్తే, మనదేశంలో, “అరేంజ్‌డు మేరేజీ”లలో అంతర్గతంగా ఉన్న తీర్పు కూడా అదే. కానీ, కథలలో అదేవాక్యం చెప్పినప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇలా రూల్సు మాటాడడంలో ఉన్న మూర్ఖత్వం.

జడ్జీగారికీ ఆశ్చర్యంగానే ఉంది కానీ కారణం మాత్రం పైన నేను చెప్పింది కాదు. “ఎందుకు పెళ్లాడేనా దీన్ని” అని ఆయన సదా వాపోతూనే ఉంటారు తనపెళ్లాంగురించి. పెళ్లాం అనే పీడ ఎంత వేగిరం వెళ్తే అంత మంచిదని ఆయన నిశ్చితాభిప్రాయం (పుట 233).

ప్రతివాది అర్థబలం లేని ఆడదే కానీ ఆత్మబలంలేని ఆడది కాదు. నిజానికి ఆవిడపాత్రచిత్రణలో రచయిత వ్యాఖ్యానాలు రెండు కనిపిస్తాయి – ఒకటి, మన వివాహవ్యవస్థమీదా, రెండోది మనిషికి గల గుండెబలం గురించీను.

మామూలుగా మధ్యతరగతి నీతిసూత్రాలకి అనుగుణంగా ఉంటాయి మనకథల్లో సాంఘికనీతులు కూడాను. ఈకథలో ప్రతివాది వాదన, “తనకి పెళ్లి కావలిసిన అవుసరం లేదు. తను ఫలానా షావుకారు పోషణలో ఉంది. తనకి పూటకి ఠికాణా ఉన్నట్టు కనిపించని ఈవాదిని పెళ్లాడవలసిన అవుసరంలేదు.” (పుట 236). – అదీ ఆవిడ కేసు.

ఆవిడ అంత బాహాటంగా తనహోదాని ప్రకటించడంలో కావలిసినంత వ్యంగ్యం ఉంది. ఆవిడకి మన వివాహవ్యవస్థమీద ఏమాత్రమూ గౌరవం ఉన్నట్టు కనిపించదు. అంతే కాదు. ఒక ఆడమనిషిని పోషించగల స్తోమతగల షావుకారుగారు ఆ ఆడమనిషిని ఒదిలియ్యడానికి ఇంత నాటకం ఎందుకు ఆడేరు అంటే, ఆషావుకారు పిరికితనమే అని కూడా అర్థమవుతుంది. మధ్యతరగతి, పైతరగతి జనాల్లో గల డొల్లగుండెలకి షావుకారు గొప్ప నమూనా. ప్రతివాది దుర్యోధునుడిసభలో ద్రౌపదిని గుర్తు తెచ్చే పాత్ర.. పొట్టిగానే ఉన్నా గట్టిగా అరవగల ఆడది.

నిటారుగా నిలబడి పొగరెక్కినమొహంతో పోలీసుజవాన్లనీ, ప్లీడరుబాబుల్నీ ఝమాయించి నిలదీస్తుంది, “ఇక్కడ మగాడన్నవాడెవడైనా ఉంటే (వాది) చమ్డాలెగరగొట్టండి. అప్పుడు నేను కూడా మీమగతనానికి సంతోషించి నవ్వుతాను” అంటూ మందలించి, ప్రోత్సహించి, ఛాలెంజి చేసింది.

వాది చెమ్డాలెగరగొట్టి, తమమగతనం నిరూపించుకుందికి కోర్టు యావన్మందిలో ఏ ఒక్కడూ సిద్ధపడలేదు (పు. 235).

ఈచివరివాక్యంలో గొప్ప సొగసుంది. “అలా” చెయ్యడానికి ఎవరూ ముందుకి రాలేదు అనడం వేరు. మొత్తంవాక్యం మరొకసారి తిరగరాసి, అందుకు ఏ ఒక్కడూ సిద్ధపడలేదు అని జోడించడంలో పదును వేరు. శాస్త్రిగారి కథల్లో ఇలాటి వాక్యవిన్యాసం చాలా చూస్తాం. ప్రతివాది కోర్టులో గెలవలేదు కానీ జీవితంలో నిలదొక్కుకుని, నిలబడినట్టే అనిపిస్తుంది నామటుకు నాకు. ఈకథ చదివింతరవాత ఆవిడలాటి ఆడది కోర్టువారి తీర్పు మన్నించి వాదితో కాపురం చెయ్యడానికి వెళ్తుందనిపించదు. నిజానికి వాది కూడా అందుకు సిద్ధంగా లేడనుకోండి. అది వేరే సంగతి. ఈకథలో ఆవిష్కరించిన అంశం – కోర్టులో అందరూ గెలవలేరు. కానీ తమని తాము కించపరుచుకోరు ఆత్మగౌరవం ఉన్నవాళ్లు అన్నది.

అందుకే ఈకథ నాకు చాలా ఇష్టం. ఇందులో న్యాయాన్యాయాల విచక్షణకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఎలా నిలబడతారు అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. ఆటల్లో winning is not everything అన్నట్టే జీవితంలో కూడా నిలదొక్కుకు పోరాడ్డంలోనే ఎక్కువ ఘనత కనిపిస్తుంది.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

17 thoughts on “రావిశాస్త్ర్రిగారి నాలుగార్లు – మొదటి భాగం”

 1. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చట్టం దుర్వినియోగం గురించి మద్యం చట్టం యొక్క ప్రభావాలు విశ్లేషించడానికి ఆయన ఆరు కథలు (ఆరుసారా కథలు తెలుగు) రాశారు. ఈ కథలు తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాత ఉంటాయ
  రవి శాస్త్రి గారి ” ఆరు సారా కథలు ” .పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలియచేయగలరు , కృతఙ్ఞతలు

  హనుమంతు (న్యాయవాది) : 8121112333
  విజయవాడ.

  మెచ్చుకోండి

 2. ఆరు సారాకథలు అని కాదు కానీ రావి శాస్త్రి సాహితం అని మూడో నాలుగో సంపుటాలు ప్రచురించేరు. అమెరికాలో బహుశా ఎవకెయఫ్.ఆర్గ్ లో దొరకవచ్చు. ఇండియాలో నవోదయవారు సోల్ పంపిణీదారులు.

  మెచ్చుకోండి

 3. నేను రవి శాస్త్రి గారి ” ఆరు సారా కథలు ” పుస్తకం కొరకు వెతుకుచున్నాను , దయచేసి ఎక్కడ దొరుకుతుందో తెలియచేయగలరు , కృతఙ్ఞతలు 🙂

  హనుమంతు (న్యాయవాది) : 8121112333
  ,విజయవాడ.

  మెచ్చుకోండి

 4. “నామటుకు నేను, ఏకథ అయినా పాఠకుడిలో ఒక మంచికథ చదివేనన్న తృప్తీ, ఒక మంచి స్నేహితుడిసాన్నిహిత్యంలో కాలం గడిపినప్పుడు కలిగే తృప్తీ కలిగించడమే ఎక్కువగా చేస్తుందనుకుంటాను.”
  కథల గురించి నాకు కావలిసిన వ్యక్తీకరణ ఇక్కడ స్పష్టంగా దొరికింది.

  మెచ్చుకోండి

 5. మాలతి గారు,
  రావిశాస్త్రి గారి కథ ల మీద మీ సమీక్ష చాలా బావుంది. మొదటి భాగం చదివాను. నేను రావిశాస్త్రి గారి వి అన్నీ కథలు చదవలేదు. మీరు కథల్ని విశ్లేషించే తీరు బావుంటుంది. కథ ని ఎలా చూడాలో అర్ధమవుతుంది కార్నర్ సీట్ గురించి, మొత్తం గా రావి శాస్త్రి గారి కథ ల గురించి మీ ఆలోచనలు బావున్నాయి.
  కల్పన

  మెచ్చుకోండి

 6. ఇది ఫాలో అవుతున్న బ్లాగరులకి, విన్నపము
  అందరికీ విన్నపం…
  అందరికీ, నా వర్డ్ ప్రెస్ ఎంచేతో 2, 3 భాగాలు తీసుకోడంలేదు. నిన్నటినుండీ కనీసం 10 సార్లు ప్రయత్నించేను. ప్రతిసారీ లోడ్ చేసినతరవాత, చూస్తే, 404 File not found అని వస్తోంది. ఎవరికైనా తెలిస్తే, ఇది ఎలా దిద్దుకోవాలో చెప్పగలరు. ముందే థాంక్స్…

  మెచ్చుకోండి

 7. @ బొందలపాటి, అవునండీ, మార్స్కిజంలో పడినతరవాత ఆయన రచనలు నాకు నచ్చలేదు. అందుకే ఈ పాతకథలతోనే సరిపెట్టేను నాసమీక్ష. ధన్యవాదాలు.
  @ సౌమ్య, అవును నాక్కూడా. థన్యవాదాలు. 🙂

  మెచ్చుకోండి

 8. అలానే ఆయన పాత్రల చేత ఉపన్యాస ధోరణి లో అతి గా మాట్లాడిస్తున్నారనిపిస్తుంది. ఉదా: రత్తాలూ రాంబాబు లో పోలీస్ హెడ్డు తప్పిపోయిన కుక్కపిల్ల కోసం వెతుకుతూ చాలా సేపు మాట్లాడుతాడు.

  మెచ్చుకోండి

 9. రా.వి. శాస్త్రి గారి కథలలో ఏదో ఒక మెటాఫిజికల్ ఫ్లో ఉంటుంది. కానీ ఆయన నవలలో (కథలలో కాదు)పాత్రల చేత మార్క్సిజం మాట్లాడించటం నాకు కొంచెం వాస్తవం గా అనిపించదు. (రత్తాలు రాంబాబు లో రిక్షా జోగులు చేత మార్క్సిజం మొత్తం రివ్యూ చేయించటం). పాత్రోచితం గా మార్క్సిజం గురించి మాట్లాడితే పరవాలేదు.

  మెచ్చుకోండి

 10. అపుడెపుడో రెండుమూడేళ్ళ క్రితం – నేను ఈ కథలు చదువుతున్నప్పుడు, మన మధ్య నడిచిన మెయిల్ చర్చలు గుర్తొస్తున్నాయ్! 🙂

  మెచ్చుకోండి

 11. @SRRao గారూ, మీరు చెప్పింది నిజమే. అవి జన జీవనంలోంచి వచ్చినవి. అందుకే అంతమందిని ఆకట్టుకున్నాయి. మీరు ఇచ్చినలింకులమీద క్లిక్కిస్తే నాకు ఎరర్ మెసేజి వస్తోంది. మరోసారి చూడగలరు.
  మీ వ్యాఖ్యకీ, తదితరసమాచారానికి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 12. మాలతి గారూ !
  రావిశాస్త్రి గారి కథలు నేల విడిచి సాము చెయ్యవు. అవి జన జీవనం లోంచి వచ్చినవి. ఆ చైతన్య స్రవంతి గురించి ఎంత చెప్పినా తక్కువే ! వాటిని కథాసాగరాన్ని మదించిన మీలాంటి వారు పరిచయం చెయ్యడం మా అదృష్టం. ఇందులో ‘ కార్నెర్ సీట్ ‘ కథతో బాటు ఆఖరి దశ, మెరుపు మెరిసింది, పరిశుభ్రం కథల్ని నా బ్లాగ్ లో కొంతకాలం క్రితం పరిచయం చేసాను. నేను కేవలం పరిచయం మాత్రమే చేసాను. కానీ మీ పరిచయ సమీక్ష అద్భుతం. మళ్ళీ ఓసారి రావిశాస్త్రి గారిని చదవాలనిపించేలా వుంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s