రావిశాస్త్రిగారి నాలుగార్లు – రెండోభాగం

“జరీఅంచు తెల్లచీరె”లో చెప్పుకోదగ్గ కథ లేదు ఒకరకంగా చూస్తే. ఒక కన్నెపిల్లకి చీరెలమీద ఉండే సీదా సాదా సరదాని ఆవిష్కరించడం జరిగింది. జరీఅంచు అందాలు చిందే మెరుపు. విశాలాక్షికి ఆరేళ్లప్పుడు కలిగింది తెల్లచీరె కావాలన్న కోరిక.
మరో పదేళ్లకి, అంటే పదహారు, పదిహేడేళ్లపుడు, గట్టికోరికగా స్థిరపడింది ఆపిల్లమనసులో. సాధారణంగా ఆ వయసు ఆడపిల్లలకి రంగురంగుచీరెలు కట్టుకోవాలని ఉంటుంది. కానీ అసాధారణవిషయాలు వెలికి తీసుకురావడం రచయితల పని. శాస్త్రిగారికి తెల్లచీరెలంటే ఇష్టం అవడం మరోకారణం (ఆయనే చెప్పేరు ఈమాట రావిశాస్త్రీయంలో అనుకుంటా). అంచేత కథంతా తెల్లచీరెచుట్టూ అల్లుకుంది. విశాలాక్షి ఆరేళ్లప్పుడే అడుగుతుంది తల్లిని తనకలాటి చీరె కొనిపెట్టమని. తెల్లచీరెకీ పెళ్లికీ అనుబంధం. ఆమాటే తల్లిచేత అనిపిస్తారు రచయిత, “బావున్నాయే తల్లీ నీకోరికలు. కొంటాంలే నీపెళ్లినాడు” (పు. 187).

కథలో తెల్లచీరె  అందరానికోరికకి ప్రతీక. తెల్లచీరెలాగే  కనకారావు కూడా ఒకరకం మగవాళ్లకి  ప్రతీక. సంఘర్షణ విశాలాక్షికి గల తీరనికోరిక. అంతకంటె బలమైన  సంఘట్టన కనకారావు ఆఅమ్మాయిమీద  జరిపిన అత్యాచారం. నిజంగా ఏం జరిగింది అన్నది వివరింగా వర్ణించలేదు రచయిత. బహుశా విశాలాక్షికి తెల్లచీరెమీద ఉన్న మోజు మాత్రమే ప్రధానాంశం అని కావచ్చు. మస్తుగా డబ్బుగల కనకారావు అన్నయ్యకి స్నేహితుడే అయినా స్నేహమర్యాదలెరగనివాడు. తనమీద దౌర్జన్యం చేస్తాడు. అతరవాత విశాలాక్షికి తనని అవమానించినవారందరూ కనకారావులే. కార్నరుసీటులో “వెధవ” అన్నంత విసురుగానూ వాడేరు శాస్త్రిగారు కనకారావు అన్న నామధేయాన్ని ఇక్కడ! ఈకథలో మనం పరిష్కారం చూడం. విశాలాక్షికోరిక తీరిందో లేదో తెలీదు. అయితే, మధ్యతరగతి జీవనపోరాటానికి సంబంధించిన సమస్య అనీ, అంచేత ఇది కూడా శాస్త్రిగారి అన్నికథల్లాగే దారిద్ర్యానికి సంబంధించినకథ అని కొందరివాదన. విశాలాక్షికోరిక తీరడం సంఘంలో అసమానతలు పోయినప్పుడే అన్నవాదన నాకంతగా బలంగా కనిపించడంలేదు. ఈకథ నాకెందుకు నచ్చలేదంటే ఇతివృత్తం అతి సామాన్యం. పరిష్కారం లేదు. ముగింపులో ప్రత్రేకంగా తెలిసిందేమీ లేదు. కానీ చెప్పినతీరులో చమత్కారం ఉంది. కొన్నిచోట్ల కథ రాయడానికి పావుఠావు పట్టే విశేషాల్ని ఒక్కవాక్యం చెప్తుంది.

“జరీఅంచు తెల్లచీరె!

విశాలాక్షికి  ఏడుపు వస్తోంది.

… …

జరీఅంచు తెల్లచీరె

ఎప్పుడు కొనడం? ఎప్పుడు కట్టుకోడం? (పు. 186)

ఇలా సాగుతుంది  కథ. ఈ చిట్టిపొట్టివాక్యాలతో  ఒక జీవితకాలానికి సరిపడగల కోరికలని పొదుగుతారు రచయిత.

“తెల్లచీర జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా అమ్మ చెప్పే పెళ్లిమాట జ్ఞప్తికి వస్తుంది. పెళ్లిమాట తలపుకి వచ్చినప్పుడల్లా ఆ వెధవ కనకారావు తలపుకి రాకుండా ఉండడు.

వాడే కనకారావు. అన్నయ్య క్లాస్‌‌మేటు.

వెధవ.”

ఇది కథకి కీలకమైన  సంఘటన. కానీ, సుదీర్ఘంగా, వెగటు పుట్టేలా వివరాలు ఇవ్వకపోవడం విశ్వనాథశాస్త్రిగారికే చెల్లింది. అది పాఠకులమేథకి వదిలేశారు ఆయన. దేశకాలపరిస్థితులదృష్ట్యా పాఠకులు తేలిగ్గానే ఊహించుకోవచ్చు.

రావిశాస్త్రిగారి  శైలిలో నాకు అమితంగా నచ్చినవిషయం  ధ్వని (సజెషన్). కథ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అనిపిస్తూనే, మరోపక్క పాఠకులు ఆలోచించుకోవలిసింది బోలెడు ఉంటుంది.

కథ చదవడం అయిపోయినతరవాత  పాఠకులమెదడుకి పని పెట్టేవి ఇవే. ఈమధ్య నేను కె.కె. రంగనాథాచార్యులుగారి  పుస్తకం, “తొలితరం తెలుగు కథానిక” చదువుతుంటే నాకు డి. ఎ. నరసింహంగారి అభిప్రాయం ఒకటి కనిపించింది. ఆయన చిన్నకథకి ఉండవలసిన ఆరు సూత్రాలు వివరిస్తూ, “రచయిత పాఠకులకిచ్చేది చాలా తక్కువ. తానిచ్చినదానికంటె పదిరెట్లెక్కువ పనిని పాఠకునికి కల్పించి పెడతాడు”” అన్నారు. అది 1920వదశకంలో.  ఈమధ్యకాలంలో వెంకటసుబ్బయ్యగారు కూడా “నామేథని శంకించే కథలంటే” ఇష్టంలేదన్నారు. రావిశాస్త్రిగారు కూడా ఆకోవలోనివారే అనిపిస్తుంది వారి కథలు చదువుతుంటే.

నిజానికి, “జరీఅంచు తెల్లచీర” కథ వర్థమానరచయితలకి ఒక పాఠ్యాంశం అనుకోవచ్చు. కథాంశం అనిపించని ఒక అతిసామాన్యమయిన వస్తువుని తీసుకుని కథలెలా అల్లడమో నేర్చుకోవాలంటే ఈకథ నిశితంగా పరీక్షించి చూస్తే తెలుస్తుంది.

“మాయ” గొప్పకథగా చాలామంది విమర్శకులచేత మెప్పు పొందినకథ. ఇందులో నూకాలమ్మ ఉపన్యాసం ప్రపంచ సాహిత్యచరిత్రలో ఎన్నదగినది అని శ్రీశ్రీ అన్నట్టు ఎక్కడో చదివేను. “మగవాడూ, ఆడమనిషీ”కథలో మూర్తిలాగే, ఈకథలో మూర్తి కూడా చాలా అమాయకుడు. పేర్లు ఒకటే కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు.. రెండుకథల్లోనూ సామ్యాలు చాలా ఉన్నాయి. “మగవాడూ, ఆడమనిషీ” కథలో ప్రథానపాత్రకి తనగురించి తనకి ఒక అవగాహన ఏర్పడితే, “మాయ” కథలో మూర్తికి లోకరీతినిగురించిన జ్ఞానోదయం అవుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే లోకంలో న్యాయాన్యాయాలగురించిన విచక్షణాజ్ఞానం. మొదటికథలో “నాగురించి మీకు తెలీదు” అంటాడు మామయ్యతో. రెండోకథలో కథానాయకుడు “ఇదన్నమాట లోకంతీరు” అనుకుంటాడు తనలో తాను. “నోకం అంతా జూయిస్సినమడిసి” నూకాలమ్మ డబ్బుకోసం “నోకంవంతా పడుచుకుంటోంది” (పుట 28) అని చెప్పేవరకూ తోచలేదు కాలేజీ చదువులు చదువుకున్న మూర్తికి.

నూకాలమ్మకి  డబ్బు లేకపోవచ్చు కానీ పిల్లలకి సంబంధించినంతవరకూ అందరు  తల్లులాటిదే ఆమెమనసు కూడా. డబ్బు లేకపోవడంచేత (పోలీసు)కుక్కలనుంచీ  తననీ, తన సారావ్యాపారాన్నీ కాపాడుకోడానికి ఆపిల్లని వీధిచివర కాపలా పెడుతుంది. “అమ్మా, కుక్కలే” అంటూ తల్లిన సకాలంలో హెచ్చరించడం ఆపిల్ల ఉద్యోగం (పుట 30). ఆ ఉపమానానికి కారణం కూతురి తెలివితేటలే కావచ్చు. అదే ఆ కూతురిచావుకి కూడా కారణం అవుతుంది. “కిందటోరం సరసరిగ్గ ఇయేలరోజున నాకూతుర్ని మట్టి జేయిస్సినాను” అంటూ బాధపడిపోయిన ఆ తల్లివేదన గుండెల్లో సూటిగా తాకుతుంది ఏపాఠకుడికైనా.

సాధారణంగా ఆడపిల్లలు పులివేషం వేయరు  కానీ నూకాలమ్మకూతురు పులివేషం వేస్తుంది. “ఆరేళ్లపిల్లా పులేశకం యేస్తే, ఆడపిల్లేటి? పులేశకం యెయ్యడం యేటి? అన్చెప్పి ఊరు ఊరంతా తిరగబడిపోనారు” (పుట 20-30). ఈకథ ప్రత్యేకించి నన్ను ఆకట్టుకోడానికి కారణం పాటకజనాల్లో ఇలాటి ప్రతిభని గుర్తించడం. వాళ్లూ మనుషులే, వాళ్లలో కూడా శక్తిసామర్థ్యాలు చూపగలరు, వాళ్ల కళ్లంట కూడా కారేది కూడా కారేది నీరే అని ఎత్తి చూపే కథలు నాకిష్టం.

పెద్ద ప్లీడరుగారు  లోకరీతిగురించి చాలా విపులంగానే చెప్పినా, మూర్తికి జ్ఞానోదయం  అయింది నూకాలమ్మ చెప్పినన్యాయం విన్నతరవాతనే.

అంతే కాదు. నూకాలమ్మ తనశిక్ష తప్పించుకోడానికి కట్నాలు చదివించుకుంది. ఎందుకంటే కోర్టువారినిజం వేరేనిజం. ఆవిడ మూర్తికి “ఆకోర్టు నిజం” వివరంగా బోధ చేసింతరవాత అతడు చిన్నబుచ్చుకోకుండా “నువ్వు కూడా బాగా అడిగినావు బాబూ. కొత్తోడివని బయపడ్డాను గానీ బాగాని అడిగినావు. …. గట్టిగా బాగానే అడిగినావు” అని మూర్తిని మెచ్చుకోడంలో గొప్ప చమత్కారం ఉంది. మనవిద్యావిధానంలో లోపాలు, మనకాలేజీ చదువులు ఎంత పనికిమాలినవో చెప్పడానికి ఆ ఒక్క వాక్యం చాలు. అవి పనికిరాని చదువులు అవడమే కాదు. ఆవిషయం ఏ చదువూ లేని నూకాలమ్మకి అవగతమవడం మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.

“పువ్వులు” కథలో పాత్రచిత్రణ గొప్పగా ఉంది. పిల్లలమనసులు పువ్వులంత సుకుమారమయినవి. వాటిని బంతిపువ్వులలా వదిలేసినా పెరుగుతాయి. గులాబీల్లా ఆలనాపాలనా చేసినా పెరుగుతాయి. అవుట్‌హౌస్‌లో ఉన్నవాళ్లు బంతిమొక్కలవంటి వాళ్లు. మెయిన్ హౌస్‌లోవాళ్లు గులాబీల్లా సుకుమారంగా ఉంటారు ముళ్లలాటి మనస్తత్త్వాలతో. ఈకథ కూడా చాలామంది విమర్శకులు మార్క్సిజంగాటకే కట్టేరు కానీ నాకు మాత్రం ఈకథలో నచ్చినభాగం పిల్లలమనస్తత్త్వం ఆవిష్కరించినతీరు.

“మాయ” కథలో సారావ్యాపారులనీతి సూత్రాలతోపాటు వాళ్ల మతవిశ్వాసాలు కూడా కనిపిస్తాయి. ఒకమనిషిలో ఉండగల పరస్పరవిరుద్ధభావాలకి ప్రతీక రామదాసు. నిజానికి ఇలాటివైరుధ్యం అందరిలోనూ కనిపిస్తుంది. దొంగలకీ, కేడీగాళ్లకీ, రాజకీయముఠాలకీ, గాంగ్ మెంబర్లకీ కూడా వాళ్ల నీతిసూత్రాలు వాళ్లకుంటాయి. వాళ్లపరిధిలో వాళ్లసమాజం వాళ్లకుంటుంది. రామదాసు తనలెక్కప్రకారం తాను నీతిమంతుడు. రావణబ్రహ్మ అంత శివభక్తుడు. నీలయ్య నీతిమాలినవాడు. అందుకే నీలయ్య శివరాత్రినాడు చచ్చిపోవడం రామదాసుకి గొప్ప చిక్కు ప్రశ్న అయిపోయింది.

రావిశాస్త్రిగారు  ప్రజల భక్తివిశ్వాసాలని తమకథల్లో వాడుకున్నతీరు  ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మతవిశ్వాసాలు మూర్ఖత్వమే కావచ్చు. అయితే ఆ విశ్వాసాల్ని నిరసించకుండా, ఆక్షేపించకుండా, ప్రతీకలుగా, ఆ నమ్మకాలలో మూలభావాలని మాత్రమే వాడుకోడంద్వారా తనసందేశం పాఠకులకి అందించవచ్చు అన్న విశ్వాసం ఆయనకథల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. ప్రజలవిశ్వాసాలని ఇంతటి స్ఫూర్తితో ఉపయోగించుకున్న రచయితలు అరుదు.

నీలయ్య తనరాజ్యంలో ప్రవేశించి ధర్మం తప్పేడు. అతన్ని శిక్షించడానికి రామదాసు  తనసభలో నిర్ణయం చేసేడు. కానీ ఈశిక్ష అమలు చేయడానికి శివరాత్రి  అడ్డొచ్చింది. అంచేత శిక్షని  మర్నాటికి వాయిదా వేసేడు.. రామదాసుతలపుకీ దైవంతలపుకీ మధ్య సయోధ్య లేకపోయింది. రామదాసు తననిర్ణయం అమలు చెయ్యడానికి వీల్లేకుండా, అతనిప్లాను భగ్నం చేస్తూ, రామదాసు శివరాత్రినాడే చచ్చిపోయేడు. ఇది – తానొకటి తలిచిన దైవమొకటి తలుచు అన్నది – కొన్నివేల సంవత్సరాలుగా జనుల్లో పాతుకుపోయిన విశ్వాసం. “మరయితే ఆడి పాపాలన్నీ ఏటయినట్టూ?” అంటూ గావుకేక వేసి ప్రశ్నించేడు రామదాసు (పుట 22-23). ఆప్రశ్నకి సమాధానం ఎవరిదగ్గరా లేదు.

నిజంగా దైవాన్ని నమ్మేవాళ్లకి కూడా ఇలాటి  సందేహం జీవితంలో ఏదో ఓ  సమయంలో కలగే అవకాశం లేకపోలేదు. వాళ్లు ఇలాటిసమయాల్లో ఎలా  సమర్థించుకుంటారో ఇక్కడా అంతే చేస్తారు. నమ్మకాలు లేనివాళ్లకి ఆ వాక్యంలో హేళన కనిపిస్తుంది. కథ కథకోసమే అనుకునేవారికి మంచిమలుపు, కొసమెరుపు కనిపిస్తుంది. ఇన్నిరకాల ఆలోచనలు ఒక్క వాక్యంలో ఆవిష్కరించగలగడం రచయితప్రతిభకి తార్కాణం. ఈ దైవలీల కథలో ప్రధానాంశం కాకపోయినా, కథ నడవడానికి కావలిసిన అంశం. “పుణ్యం” కథలో మాత్రం పాపపుణ్యాల చర్చే ప్రధానాంశం. కథకుడు నమ్మకాలు లేనివాడు, లేదా నమ్మేవాళ్లందరూ మూర్ఖులని నమ్మేవాడు. వాళ్లని ముఖాముఖీ ఢీకొని, నిలదీసి ప్రశ్నించి, చిత్తు చేసి ఆనందించడం అతనికి అలవాటు. ఇందులో చెప్పుకోదగ్గ కథ లేదు. కేవలం రచయిత న్యాయవాదప్రవృత్తే కనిపిస్తుంది. పుణ్యం, పాపం మనం అనుకోడంలోనే ఉంది కానీ వస్తుతః వాటికి అస్తిత్వం లేదని అతని వాదన. ఎందుకేనా మంచిది అనుకుంటూనో లేదా అమ్మకోసం అనో లేదా మరెవరినో బాధ పెట్టలేక అనో – ఇలా ఏదో ఒక కారణం చెప్పి “లేని దేవుడి”కి ఓ నమస్కారం పారేసేవాళ్లు మనకి నిత్యజీవితంలో ఎదురవుతారు. కథలో ఆ conflict కథకి బలాన్నిచ్చింది.

మూడో భాగం ఇక్కడ చూడండి.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s