రావిశాస్త్రిగారి నాలుగార్లు – మూడోభాగం

“అధికారి” కథ ఒకరికి గల అధికారంగురించి కాదు. “అధికారం” గురించే. చేతిలో అధికారం ఉన్నవాళ్లు తమకి కావలిసింది తేలిగ్గా సాధించుకోగలరు. వారు కప్పా విప్పా సమర్థులు. బొక్కలోకి తోసీగల్రు, మళ్లీ అంతతేలిగ్గానూ చెయ్యందించి పైకి లాగనూగల్రు. కళాసీ నాగరాజు అందాలచిలక నాగరత్నంమీద మోజు పెంచుకున్నాడు. నాగరత్నం పెంచుకోనిచ్చింది. కానీ అదికారం ఉన్నవాడుపోలీసుజవాను రవ్వలకొండ, తన చిన్ననాటి స్నేహితుడు. చిన్ననాడు రవ్వలకొండ పిట్టలజంట విడదీసి వాటి ఉసురు పోసుకున్నాడు. ఆనాడు నూకరాజు ఆ పిట్టల్ని రక్షించలేకపోయేడు వాడి దుర్మార్గంనుండీ. మళ్లీ ఇప్పుడు నాగరత్నాన్ని కూడా వాడి బారినుండి తప్పించలేకపోయేడు. అయితే తేడా ఏమిటంటే, అప్పుడు రవ్వలకొండ చేతిలోపిట్ట ఏమనుకుందో మనకి తెలీదు గానీ ఈనాడు నాగరత్నం విచారించినట్టు కనిపించదు. నూకరాజు నాగరత్నాన్ని “తన సొమ్ము”గా భావించడంతో వచ్చినట్టు కనిపిస్తుంది మడతపేచీ. కనీసం ఈకథ చదివేక నాకు కలిగిన అభిప్రాయం ఇదీ.

“కష్టార్జితం”, “లక్ష్మి” కథల్లో రావిశాస్త్రిమార్కు మెలిక ఉంది. కష్టార్జితం అనగానే నీతిమార్గాల్లో ఆర్జించిన ఆదాయం మనకి స్ఫురిస్తుంది. అలాగే లక్ష్మి అను పేరుగల అమ్మాయి గమనంలోకి వస్తుంది. కానీ రావిశాస్త్రిగారు ఆరెండు పేర్లకీ వేరే వివరణలు ఇస్తారు. మొదటి శీర్షిక వ్యంగ్యాత్మకం, రెండోశీర్షిక ధనలక్ష్మి (దేవత)స్వరూపాన్ని ఆవిష్కరించేది.

“కష్టార్జితం”లో ముసలాయన అష్టకష్టాలూ పడి చెమటోడ్చి సంపాదించేడు. మేడ కట్టేడు. బంగారం కూడబెట్టేడు. ఇంకా అనేకరకాల ఆస్తులు సంపాదించేడు. అలాగే మరొకతను ఇనపగజాలు వంచీ, ఇనప్పెట్టెల్లాటి గదుల్లో దూరీ, నగా నట్రా ఎత్తుకుపోయేడు. కథకుడిదృష్టిలో ఇద్దరి కష్టమూ ఒక్కలాటిదే. “దొంగతనం ఎందుకు చెయ్యరాదో ఆముసలాయనకి అవగాహన అవలేదు” అంటాడు కథకుడు. దొంగసొమ్ము దొంగలపాలే అని రచయిత అభిప్రాయం అనుకుంటాను. లేక, అవతలివాడు దొంగతనం చేసి తనసొమ్ము దోచుకుపోయినతరవాతనైనా ఆయనకి తను చేసినతప్పు తెలీలేదని కూడా కావచ్చు. ముగింపుమాట ఎలా ఉన్నా శైలిమాత్రం అన్నికథల్లాగే విశిష్టమయినది.

“లక్ష్మి” కథలో ప్రధానపాత్ర లక్ష్మీనాథుడు. ధనదేవతని తన అధీనంలోకి తెచ్చుకుని జేబులో బొమ్మగా మార్చుకున్నవాడు సీనియర్ లక్ష్మీనాథరాయలుంగారు. మనవడు జూనియర్ లక్ష్మీనాథరావు కూడా అంతే. కలవారికి లక్ష్మి రక్తంలో ఉంటుంది. ధనార్జనశక్తి వారికి చరాస్థిలాగే వారసత్వంగా వస్తుంది. కథకుడు తాతగారిగురించి అట్టే చెప్పకపోవడానికి ఇదే కారణం కావచ్చు. ఆ విషయాలు జూనియర్ లక్ష్మిలో ఎలా నాటుకుని వృద్ధి పొందాయో చెప్పడంద్వారా పరోక్షంగా సీనియర్ గారితత్త్వం మనకి బోధపడుతుంది.

చిన్నప్పుడు సత్తిరాజు దగ్గర “జెల్లలు పుచ్చుకున్న” జూనియర్ లక్ష్మినాథుడు “ఒరే, ఇవాళ జెల్ల ఇచ్చేవు కావేం?” అని ప్రశ్నించినప్పుడు మనకి కొంత తికమక కనిపిస్తుంది. దానికి నేను ఇచ్చుకున్న సమాధానం – ఉన్నవాళ్లు లేనివాళ్లని ఎలా తికమక పెట్టి, లేని హక్కులు సృష్టించుకుని, తమవి కానివి కూడా ఎలా వసూలు చేసుకుంటారో మనకి తెలియజెప్పడమే అని.

సత్తిరాజు సత్తెకాలపువాడు. “జెల్ల ఇవ్వడం” అంటే తనే జెల్ల తినడం. మాయకథలో మాయలాటిదే ఇక్కడ తిరకాసు కూడా. అలా జెల్లలు వసూలు చేసుకోడంతో మొదలుపెట్టిన జూనియర్ లక్ష్మి, సత్తిరాజుతల్లి పొయ్యిలోకి పుల్లల్లేక కలెక్టరాఫీసువారు పారేసిన చిత్తుకాగితాలు ఏరి తెచ్చుకుంటే, అవి కూడా దోచుకున్న ఘటికుడు. “నల్దిక్కులా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించేరు,” “కారు కొన్నారు”, “మేడలు కట్టించేరు”, “షేరుమార్కెట్టెక్కేరు” – ఇలా కథకుడు ఆయనఘనత కీర్తించడంతోనే సరిపోతుంది కానీ సత్తిరాజు ఏమయ్యాడంటే జవాబు లేదంటారు. ఇక్కడ శ్రీశ్రీ మరోప్రపంచంలోలాగా సత్తిరాజులాటివారు నామరూపాలు లేకుండా పోతారు, ఊరూ, పేరూ లేని భ్రష్టుల్లో కలిసిపోతారు అంటాడు కథకుడు. అలాటివారికున్న ఆస్తల్లా జెల్లలు తినడానికి ఒళ్లూ, ఏరుకోడానికి ఊరివారు పారేసిన చెత్తకాగితాలూనూ. అవి కూడా దోచుకుంటారు కల్లబొల్లికబుర్లతో దొంగస్నేహాలతో లక్ష్మీనాథుడివంటి ప్రయోజకులు.

“ఆఖరిదశ”, “మూడు స్థలాల్లో” – ఈరెండు కథల్లోనూ వేరు వేరు సన్నివేశాలు తీసుకుని ఒకచోట పెట్టి, అందులోంచి పత్తికాయలోంచి దారం లాగినట్టు కథ లాగడం కనిపిస్తుంది.

“మూడు స్థలాల్లో” వేరు వేరు సన్నివేశాలు తీసుకున్నా అందులో ఒక అంతర్గతమైన సూత్రం ఉంది. ప్రధానపాత్ర జేబులు కొట్టే పాపడు. మొదటిసన్నివేశం వాడికి కోర్టులో శిక్ష పడడం. ఆ పాపడు కోర్టులోంచి పారిపోయి, మళ్లీ దొరికిపోయి, ఆ దొరికిపోవడంలో గుండుదెబ్బలు తినడంచేత ఆస్పత్రిలో పడడం, అక్కడ డాక్టరు అతన్ని బతికించడం రెండో సన్నివేశం. మూడో సన్నివేశంలో మళ్లీ ఆ డాక్టరే పాపడిని ఉరి తీసేక, వాడిచావు సంపూర్ణంగా అయిందో లేదో చూడ్డం – అదీ ఆడాక్టరు డ్యూటీ ఈ మూడో సన్నివేశంలో. ఈరెండు సన్నివేశాల్లోనూ మనన్యాయశాఖ, రక్షణశాఖ ఎంత అస్తవ్యస్తంగా, అసంబద్ధంగా తమ విధిని నిర్వర్తిస్తాయో తెలివిడి అవుతుంది మనకి.

ఈసంకలనంలో అట్టే పదునులేనికథ “ఆఖరిదశ.” కథనంలో శాస్త్రిగారి శైలి కనిపించదు. ఇతివృత్తంలో కొత్తదనం లేదు. ద్వాపరయుగంలో కృష్ణుడినుండీ ఆధునికయుగంలో ఆంగ్లేయులపాలన అంతరించిన్నాటివరకూ విస్తరిల్లిన ఈకథలో ఏదో ఒక ఘోరం జరిగినప్పుడల్లా మనం ప్రళయం వచ్చేసిందనుకుంటాం అన్న అభిప్రాయాన్ని ట ఎత్తిచూపడం మాత్రమే చూస్తాం. “కుక్క దాలిగుంటలో పడుకున్నంతసేపే”, “శ్మశానవైరాగ్యం” వంటి నానుడులని గుర్తు చేస్తుందీకథ మహా అయితే.

“వర్షం” కథలో “మాయ”లోలాగే కిందితరగతివారి లోకజ్ఞానం, తెగింపూ ఆవిష్కరించడం జరిగింది. శాస్త్రిగారికథల్లో నాకు అత్యంత ఆసక్తి కలిగించే విషయాల్లో ఇదొకటి. పైతరగతి జనాలచేత “చదువురానివాళ్లు”గా గుర్తింపబడినవారిలో ఉండే తెలివితేటలూ, ఆత్మవిశ్వాసంవంటి సుగుణాలు చదువుకున్నవాళ్లు నేర్చుకోవలసినవి చాలా వున్నాయని విశదం చెయ్యడం.

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “రావిశాస్త్రిగారి నాలుగార్లు – మూడోభాగం”

  1. మాలతి గారూ !
    నేనిచ్చిన లింకులు పని చెయ్యట్లేదన్నారు. నేను టెస్ట్ చేసి లింక్ లిచ్చాను. మీరు చెప్పాక మళ్ళీ చెక్ చేసాను. నాకు బాగానే ఓపెన్ అవుతున్నాయి. లోపం ఎక్కడో అర్థం కావడంలేదు. వీలైతే మరోసారి ప్రయత్నించండి. నాక్కూడా మీలాంటి అనుభవజ్ఞుల సలహాలు అవసరం కదా ! అందుకే అడుగుతున్నాను.

    ఇష్టం

  2. మాలతి గారూ !
    ఎప్పటిలాగే మీ సమీక్షలు విశ్లేషాత్మకంగా వున్నాయి. అయితే ఒక్క విషయం. రచయితగా తీసుకున్న విషయం ఏదైనా ఆ విషయానికి తగ్గట్టు కథనం నడపడం, అవసరమైతే తన శైలికి భిన్నంగా కూడా వెళ్ళడం రావిశాస్త్రి గారి ప్రత్యేకత అని నా అభిప్రాయం. శిల్పం ఏదైనా, శైలి ఏదైనా పీడిత ప్రజల జీవితాలే ఆయన కథావస్తువులు.

    ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s