ఊసుపోక – నేనెవరో చెప్పుకో, చూద్దాం …

(ఎన్నెమ్మకతలు 53)

ఇంగ్లీషులో ఓ నానుడి ఉంది “నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వెలాటివాడివో చెప్తాను” అని. అలాగే ఏకరక ఈకధారులయిన పక్షులు ఒకచోట చేర్తాయి.  నాకు పక్షులు చెప్పలేదు కానీ చూశాను ఆ సుందరదృశ్యం. పదిమంది కూడిన చోట ఆడా, మగా చెరో పక్కకీ చేరిపోయినట్టు, నీరు పల్లానికి పారినట్టు. అది మన సంకల్పం లేకుండానే జరిగిపోతుంది. అది ప్రకృతిసహజం.

అసలు ఒకేరకం ఈకలు కట్టుకున్న పిట్టలు ఒక్కచోట చేరతాయేమో కానీ మనుషుల్లో మాత్రం స్నేహాలన్నీ అలాగే జరగవని నాకు ధృఢమయిన నమ్మకం (ధ, ఢ – రెంటికీ ఒత్తులవసరమా, కాదా? ప్చ్.) ఆ నమ్మకం కలగడానికి, ఇదుగో ఇలాటి కబుర్లు –

“నాస్నేహితుల్లో సగంమంది డాక్టర్లు. నేను డాక్టరుని కాను.”

“అలాగా. మీకు డాక్టరవాలనే కోరిక ఉండేదన్నమాట.”

“లేదండీ. కొందరు ముందు స్నేహితులయి, తరవాత డాక్టరులయేరు. మిగతా సగం స్నేహితులయేక డాక్టర్లని తెలిసింది నాకు. ఎలా చూసినా మీ వాదన అనంగీకారయోగ్యం.”

“మీకు తెలీదు. డాక్టరవాలనే కోరిక మీకు అంతరాంతరాల ఉండే ఉంటుంది.”

వాస్తవం – నాకు డాక్టర్లన్నా (నాస్నేహితులు కానివారు), క్లినిక్కులన్నా మహా ఎలెర్జీ.

“నిజం చెప్పడానికి మనసొప్పడం కానీ నామెదడుకి రవంత ఇంజినీరు లక్షణాలు ఉన్నాయండి.”

“చెప్పరేం మరి. మీకు ఇంజినీర్లతో స్నేహం ఇష్టం.”

వాస్తవం – నేను వీళ్లు ఇంజినార్లా కారా అని చూసుకుని స్నేహాలు చెయ్యను.

“నాస్నేహితుల్లో కొందరు పోర్ష్ లో తిరుగుతారు. కొందరికి కాడిలాక్సు ఉన్నాయి. మరి మీదృష్టిలో నాస్థాయి ఏమిటి?”

“మీకు అవి కావాలన్న కోరిక బలంగా ఉండి ఉండాలి.”

వాస్తవం – నాకున్న కారేదో నాకు మహా సంతృప్తిగా ఉంది.

నా యూనివర్సిటీరోజుల్లో, నా క్లాస్‌మేట్స్ ముగ్గురూ నాకంటే మూరెడెత్తు. నేను వాళ్లవెనక నడిచేదాన్ని సాధారణంగా, వారు నాకు పెట్టనికోట అయి భాసిల్లేవారు.

ఇంతకీ అసలు మాట, “మాక్లాసులో ఆడపిల్లలు ముగ్గురూ ఆరడుగుల పొడవు” అని నేనంటే, “అయితే, మీరు కూడా పొడుగేనన్నమాట” అనగలరా? హా. హా. అదేలెండి, పీసీద్వారా నాపరిచయం అయినవారిమాట. ఎదురుగా కనిపిస్తుంటే, అడగలేరు కదా నువ్వెంత పొడుగు అని.

ఇంతకీ స్నేహితులమాట ఇప్పుడెందుకొచ్చిందంటే –

నిన్నో మొన్నో ఏదో సైటు చూస్తున్నాను. టపామీదున్న కళ్లు ఆపక్కనున్న ప్రకటనమీదికి పోతున్నాయి నాసంకల్పంతో ప్రమేయం లేకుండా. నాకు ఆశ్చరం కొంతా. నా పక్కనున్న పెద్దమనిషి ఏం అనుకుంటాడో అన్న భయం కొంతా … నాక్కావలసిన వ్యాసం సైటులో ఉంది. నాకేమాత్రమూ అక్కరలేని మరేదో ఆ ప్రకటనలో ఉంది. ఉచితంగా వచ్చే ప్రోగ్రాములకోసం వెంపర్లాట మానేసినా, ప్రకటనలద్వారా మనగదుల్లోకి చొచ్చుకుని వచ్చేసే అవాంఛినీయ బొమ్మలమాటేమిటి?

కొన్ని సైటులు ప్రకటనలు చేరుస్తారు ఏదో కారణంగా – సరదాకే కావచ్చు, నిజంగా వారికి ఆ వస్తువులో నమ్మకం ఉండి, నలుగురికీ చెప్పాలన్న తపనే కావచ్చు. కానీ, ఒకొకప్పుడు మాత్రం ఆసైటునిర్వాహకులు కూడా తలచుకోని ప్రకటనలు వచ్చేస్తాయి వాటిలోకి, అభ్యాగతులుగా.

నాకు అట్టే సాంకేతికజ్ఞానం లేదు కానీ నేననుకోడం వారు అనుమతించిన ప్రకటనలతోపాటు వచ్చే కుకీలు ఆసరా చేసుకుని కొందరు దుష్టబుద్ధులు తదితర ప్రకటనలు కూడా దూర్చేస్తారేమోనని. అలా జరిగినప్పుడు, కొన్ని మనం మరి వదిలించుకోలేం, మహా ప్రక్షాళనం చేసి తప్ప. కనీసం నాకు తెలిసింది అదొక్కటే.

అలా మనవిరోధులు – అంటే మనకి ఇష్టంలేనివారు, మనపద్ధతికి విరుద్ధమయిన పద్ధతులని వరించేవారూ మనమీద వాళ్ల అభిలాషలని రుద్దుతారు.

అలాటప్పుడు మనం ఆ సైటులో కనిపించిన ప్రకటనలబట్టి వీరి టేస్టు ఇదే కాబోలు అని అపార్థాలు పడిపోయే అవకాశం ఉంది కదా.

ఒకొకరకం బ్లాగులో ఒకొకరకం విషయాలుంటాయి. కమ్మని కవితలు కావాలంటే రాధిక బ్లాగో, ఉష బ్లాగో చూస్తారు కానీ నాబ్లాగు చూడరు కదా.  విషయంలాగే భాష కూడాను. సప్తజన్మలెత్తినా రానారే లా రాయగలనా? లేదా, చదువరి గారిలా ప్రస్తుత రాజకీయాలు రాయగలనా? లేదు, లేదు, కాదు, కాదు, లేదు, కాదు ….

అలాగే నా భాష కూడాను. నాబ్లాగు చూసేవారికి నాభాషగురించి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. “మాలతిగారి బ్లాగులో భాష ఇట్లుండును” అని వారనుకోవచ్చు. “ఇట్లే ఉండవలెను” అని కూడా అనుకోవచ్చు. అలా ఎంతో ఉన్నతమయిన సుహృత్ మనమ్ములతో, అభిప్రాయాలతో నాటపా చదవడానికొచ్చి, “కన్నెపిల్ల”లాటి పదం కనిపిస్తే కంగారు పడిపోతే, నేనేం కావాలి?

“కన్నెపిల్ల అంటే తప్పేమిటండీ?” అని మీలో కొందరికైనా సందేహం రావచ్చు.

నాకో వ్యాఖ్యానం వచ్చింది. “మీలాటివారు అలా రాయడం భావ్యం కాద”ని చెప్పి, మరిన్నీ “అభ్యుదయవాదులు ఇలాటి పదజాలం వాడడం ఎప్పుడు మానేస్తారో” అని కూడా బాధ వెలిబుచ్చారు.

చూశారా మరి. మొదటిసంగతి కన్నెపిల్ల అన్నది అసభ్యకరమయిన పదం అని నాకు తెలీదు. ఆయనకో ఆవిడకో నాభాషమీద ఏర్పడిన అభిప్రాయానికి ఇది విరుద్ధం కాగలదన్న జ్ఞానం అసలే లేకపోయింది.

పైగా, నేను అభ్యుదయవాదిని అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఈ“వాదా”లవిషయంలో నాకు ఓనమాలస్థాయి కూడా లేదు. ఇంక అభ్యుదయం కూడానా? హవ్వ! ఎవరేనా వింటే నవ్విపోరా? – అదేలెండి, నిజంగా నన్ను తెలిసినవారు.

అసందర్భంగానే అయినా మరోమాట కూడా చెప్పాలి. ముందు పేరాలో “ఆయన లేక ఆవిడ” అన్న నామాటకి కూడా టీక ఇచ్చుకుంటాను – ఆ రాసిన ఆయన లేక ఆవిడ తనపేరూ, ఐడీ, బ్లాగు చిరునామా – అన్నీ సత్యదూరాలే! ఒక్కముక్క కూడా నిజం లేదు. అంచేత, నేను ఆయన లేక ఆవిడ అంటున్నాను. ఆకారణంగానే ఆ అభిప్రాయం కూడా నిజమయిన నిజం కాకపోవచ్చు అని కూడా అనుకుంటున్నాను. అంటే ఒక వ్యాఖ్యని బట్టి వ్యాఖ్యాత లక్షణాలేమిటో, నమ్మకాలేమిటో  చెప్పలేం!

కయ్యానికయినా, నెయ్యానికయినా సమవుజ్జీలయి ఉండాలంటారు. మరి అవతలివారు అమ్మాయో అబ్బాయో కూడా తెలీని అయోమయదశలో ఉన్ననేను వాదనలకి ఎలా దిగుతాను? అలాగని ఆయన లేక ఆవిడ చేసిన ఓ వ్యాఖ్యానానికి జవాబు చెప్పకుండా ఊరుకోనూ లేను. ఎందుకొచ్చినసంత అని ఆ వ్యాఖ్య తొలగించేశాను.

చూశారా … ఈ సంగతులన్నీ మీకు తెలీనప్పుడు మీరు నాగురించి ఏమనుకుని ఉంటారు? తెలిసినతరవాత ఏమనుకుంటున్నారు? సమాధానం తెలిసి చెప్పకపోతే … అనడానికి మీరు విక్రమార్కులు కారు కదా. కారనే అనుకుంటున్నాను.

ఒకటే కంక్లూజను -:p. నాస్నేహితులగురించి మీకు తెలిసినా నాగురించి మీకు తెలీకపోవచ్చు.

నాటపాలు చదివినతరవాత కూడా మీకు నా తెలుగుభాషావైభవం తెలీకపోవచ్చు.

(మే 1, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “ఊసుపోక – నేనెవరో చెప్పుకో, చూద్దాం …”

 1. @ చదువరి, **ఈ సామెతను ధ్వంసం చేసారు** – మ్. అంటే నేనిలా రాస్తానని మీరనుకోలేదనా? అంటే, నామాటే రైటు కదా :))
  Every rule has exceptions and loopholes. అది ఎత్తి చూపడమే నేను చేస్తున్నది ఈ ఊసుపోకల్లో.
  మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.
  మాలతి

  మెచ్చుకోండి

 2. “నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వెలాటివాడివో చెప్తాను” -ఈ సామెతను ధ్వంసం చేసారు. అంతేకాదు, “నీ బ్లాగేదో చెప్పు, నువ్వెలాంటివాడివో చెబుతాను” అనే భావి సామెతకు కూడా పుట్టగతులు లేకుండా చేసారు మీ చివరి వాక్యంతో! 🙂

  మెచ్చుకోండి

 3. @ లలిత, మీకు కొత్త అయిడియాలు రావడం ఆనందదాయకమే. నేను నిమిత్తమాత్రురాలినే కదా. 🙂 శుభమస్తు.
  నాచిన్నప్పుడు బాల పత్రికలో చెప్పుకో, చూద్దాం శీర్షిక ఉండేది.

  మెచ్చుకోండి

 4. బావుంది మాలతి గారూ!
  నాకూ ఇది ఒక ప్రశ్నే! మీరిప్పుడు సమాధానపరిచారు:-)
  స్నేహితులని బట్టి, చదివే పుస్తకాలని బట్టి, ఆఖరికి గూగులమ్మ వంటి వారైతే వెతకడానికి వాడే పదాలని బట్టి ఊహించేసుకుంటుంటారు(ము).

  మీతో కలిసి పని చేయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ అవిడియాలు చాలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేనెవరో చెప్పుకో అంటుంటే మా పిల్లలు బడిలో ఆడే ఒక ఆట గుర్తుకు వచ్చింది. వీలైతే ఒక శీర్షిక చెయ్యాలి తెలుగు4కిడ్స్ లో ఈ ఆలోచనతో. వివరాలు ఆలోచించి చెప్తాను.

  మెచ్చుకోండి

 5. @ Teresa, 🙂 ధన్యవాదాలండీ. మీరు చక్కగా అర్థం చేసుకున్నారు.
  @ రాధిక, *కొన్నింటికి మాత్రమే వర్తిస్తాయనుకుంటాను కదా.* సరే. అలాగే అనుకుందాం. ఇదేమైనా వేదమా ఏమిటి. ధన్యవాదాలు.
  @ నాగేస్రావ్, ధన్యవాదాలండీ, మరోసారి దృఢంగా అని రాయవలసివచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటాను. లేదా ఆమాట రాయడం మానేస్తాను. :p.

  మెచ్చుకోండి

 6. “ధ, ఢ – రెంటికీ ఒత్తులవసరమా, కాదా? ప్చ్”
  రెండోదానికి ఉంటే చాలు, ఛాలా ఘాఠ్ఠిగా అని చెప్పాలంటే రెంటికీ అవసరమే 🙂

  మెచ్చుకోండి

 7. మీ కంక్లూజన్ ఒప్పుకుంటానండి.దానికి ఇచ్చిన వివరణలు కూడా బావున్నాయి.అయినా మన పెద్దలు చెప్పిన ఇలాంటి మాటలు కొన్ని సార్లు,కొన్నింటికి మాత్రమే వర్తిస్తాయనుకుంటాను కదా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s