భయం (కొత్తకథ)

“చిట్టీ, ఈ ఉత్తరం కాస్త పోస్టులో పడేసివస్తావూ, బంగారుతల్లివి కదూ?”

“అలేగేలే. తరవాతెళ్తా. పరీక్షకి చదువుకుంటున్నాను.”

“అప్పుడే మూడు దాటిపోయింది. ఆలస్యంవైతే పోస్టాఫీసు మూసేస్తారు. తిరిగొచ్చేక చదువుకోకూడదూ?”

“సరే, వెళ్తాలే అమ్మమ్మా. నువ్వెప్పుడూ ఇంతే.  చెప్పేవంటే, చేసేవరకూ ఊరుకోవు.”

“పోన్లే. ఇంకెవరేనా ఉన్నారేమో చూస్తాను. నీకసలే ఈఊరు కొత్త కూడాను.”

“లేదులే. వెళ్లొచ్చేస్తాను. కొత్తయితేనేం. నోర్లేదేమిటి కనుక్కోడానికి, రేప్పొద్దున్న ఆపరీక్షలెక్కడో చూసుకోడానికయినా వెళ్లాలి కదా.”

“అట్టే దూరంలేదులే. అలా పెద్దబజారు పక్కనించి వెళ్తే, మూడు వీధులు దాటేక, గాజులవారివీధిలో కుడివేపు తిరిగి, నాలుగిళ్లు దాటితే ఎడమవేపు సందుమొగలోనే కనిపిస్తుంది ఎర్రగేటు మిద్దె.”

“అలాగేలే. నేఁ కనుక్కుంటానన్నాను కద.”

“పోనీ, నేఁ కూడా రానా?”

“ఎందుకులే అమ్మమ్మా‍! నీకసలే బాగులేదు. ఎండ కూడా ఎక్కువగా ఉంది. నేఁ వెళ్లొస్తాలే.”

“సరే, జాగర్త. తిన్నగా వెళ్లొచ్చేసేయ్. అటూ ఇటూ తిరక్క. అసలే రోజులు బావులేవు.”

“అలాగేలే. మరీ బుజ్జిపాపాయినేమిటి అంత అంపకాలు పెట్టడానికి. రేప్పొద్దున్న కాలేజీలో చేరేక్కూడా ఇలాగే సతాయిస్తావు కాబోలు.”

“అవున్లే. పెద్దదానివయిపోయేవు. అక్షరమ్ముక్కొచ్చేసరికి రెక్కలొచ్చీసీయి. పద. వేగిరం వెళ్లిరా.”

000

అమ్మమ్మకి ఎందుకో అంత భయం. వచ్చి వారం అయిందో లేదో … తినేస్తోంది జాగర్త, జాగర్తంటూ. గంటకి పన్నెండుమార్లు. … ఏమయిపోతానేంటి. మళ్లీ తనేమో గుడికీ, పురాణాలకీ అంటూ వెళ్తే రాత్రి తొమ్మిద్దాకా రాదు. పైగా, ఇంట్లో ఒక్కదానివీ ఉన్నావు. జాగర్త, జాగర్తంటూ మళ్లీ నాకే సంగీతం. తనకేమో అసలే గుండెదడ. ఏ రోడ్డుమధ్యో పడిపోతుందోనని నాకు మాత్రం భయం కాదూ… …

ఏమిటో … ఇంట్లో ఉంటే భయం. వీధిలోకెళ్తే భయం. చీకటి పడితే భయం. … ఊరు కొత్తని భయం. మాటాడ్డానికి భయం. ఊరుకోడానికి భయం. …  వెనక … నీడలా … ఎవరో వస్తున్నట్టుంది. … నేనూ అమ్మమ్మలాగే అనుమానప్పోగుని అయిపోతానో ఏమిటో మరో నాల్రోజులిలాగే సాగితే … ఏ దారిన పోయేవాడో … రోడ్డుమీద జనాలుండరేమిటి? ఎవరేనా వింటే నవ్విపోతారు. పట్టపగలు … నడిరోడ్డుమీద భయమేమిటి …

అడుగులచప్పుడు రాను రాను … దగ్గిరవుతున్నట్టుంది .. ప్చ్. .. నాఅనుమానం ఉట్టినే … … రోజులసలే బావులేవు. …  ఓమారు వెనక్కి తిరిగి చూస్తేనో … లేదా కాస్త ఆగి … ఏదో పనున్నట్టు …  కవరు కింద పడేసి తీసుకుంటున్నట్టు, … ఓరఒంపుగా తలొంచి చూస్తేనో …. కనీసం మనిషిని చూస్తే భయం ఉండదు. … అసలుసంగతి తెలీకనే ఈ భయాలు …

అమ్మో .. అరక్షణం … గుండాగిపోయింది …అలా ఉన్నాడేమిటి … అబ్భ ఒళ్లు జలదరించింది … అంత భీకరాకారం ఎక్కడా చూళ్లేదు. … కిరాతుడిలా… కోరమీసాలూ … చింతబొగ్గుల్లా కళ్లూ, వాడూను. మ్ … ఆ గిరజాలజుత్తూ వాడూను … అదేదో సినిమాలో రౌడీలా గళ్లచొక్కా ఒహటీ ……..

ఎలా వదిలించుకోడఁవో ఈ హిడింబాసురుణ్ణి… అర్జునా, ఫల్గుణా, పార్థ, కిరీటీ .. హీహీ … అది ఉరుములొస్తే కానీ  రాక్షసుల్నించి రక్షించడానికి కాదు కదా! … అమ్మమ్మ వస్తానంది …రమ్మన్నా బాగుండిపోను. పోనీ, తిరిగి వెళ్లిపోతే … ఎలా? శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం … వెనక్కి వెళ్లడానికయినా వాణ్ణి దాటుకునే కదా… ఉఫ్ … రోటిలో తలదూర్చి రోకటిపోటుకి వెరవనేల? ఇంతదూరం రానే వచ్చె … …

అయ్యో, వీడిగోలలో పడి దారి చూసుకోనేలేదు. మూడు వీధులు దాటేనా, రెండు వీధులు దాటేనా? … నను బ్రోవమని చెప్పవవే సీతమ్మతల్లీ! … ఆ వస్తున్నావిడెవరో సీతమ్మతల్లిలాగే ఉంది స్నిగ్ధమూర్తి, చల్లనిచూపూ, మందహాసం …

“ఏమండీ, పోస్టాఫీసు ఇటేనా?”

“లేదమ్మా. అటూ. రెండు వీధులు దాటి ఎడంవేపు తిరగు.”

“ఆఁ? అట్నుంచే వస్తున్నానే?”

“లేదు. ఆవీధి దాటొచ్చేశావు. వెనక్కి వెళ్లాలి. అట్టే దూరంలేదులే.”

“మీరటే వెళ్తున్నారా?”

“లేదమ్మా. నేను పోస్టాఫీసుకి కాదు కానీ ఆపక్కనుంచే వెళ్తున్నా. ఏం, కొత్తేమిటి ఊరికి?”

“అవునండీ. మెట్రిక్ పరీక్ష రాయడానికొచ్చేను. మాఅమ్మమ్మ ఇక్కడే ఉందిలెండి. అందుకని మాఅమ్మ ఈ సెంటరులో రాయమంది. అమ్మమ్మేమో ఉత్తరం అర్జెంటుగా పోస్టు చెయ్యాలంటేనూ … ”

“ఆఁహా. … అదుగో … ఆ పచ్చమేడ పక్కసందులోకి తిరిగితే, నాలుగిళ్లవతల కనిపిస్తుందిలే.”

హమ్మయ్య! పుణ్యాత్మురాలు  … ఆవిడధర్మమాఅని, ఆ మేరుసమాన మహాకాయాన్ని అధిగమించేను మొత్తమ్మీద. ఓగండం గడిచినట్టే …  హుం? అదేమిటి? వాడు కూడా వెనక్కి తిరిగేడు దిక్సూచిలో ముల్లులా నేనెటు తిరిగితే అటు … మళ్లీ నావెంటే … ఇదెక్కడి ఖర్మరా బాబూ! వీణ్ణెలా వదిలించుకోడమో…. నేను గబగబ అడుగులేస్తే వాడూ గబగబా … నెమ్మదిగా తారట్లాడితే వాడూ నెమ్మది అయిపోయి … వదిలేట్టు లేడు. సందేహంలేదు. వీడు నన్ను వెన్నాడుతున్నాడు. ఊళ్లో పోలీసులంతా ఏమయిపోయేరు? సమయానికొక్కరూ కనిపించరు. పోనీ, ఆయనెవరో పెద్దమనిషిలా కనిపిస్తున్నాడు .. ఆయనతో చెప్తేనో? … ఏమో … ఏమని చెప్పడం? … ఈరోడ్డేమయినా నీ అబ్బసొమ్మా? అంటారు. వాడూ నీలాగే రోడ్డుమీద నడుస్తున్నాడంటే ఎవరు మాత్రం ఏంవనగల్రు? …

“ఏమండీ, పోస్టాఫీసు ఇటేనా?”

“కొంచెం ముందుకెళ్లండమ్మా.”

“ఇందాకా ఇంకోఆవిడ ఇటు వెళ్లమన్నారే.”

“లేదమ్మా. వెనక్కి వెళ్లాలి.”

ఇదెక్కడి గొడవ! ముందుకెళ్తే వెనక్కంటారు. వెనక్కెళ్తే ముందుకంటారు. వెనక్కీ ముందుకీ … ఇలా రోజంతా ఇక్కడే తిరుగుతాను కాబోలు సాతానిశవంలా .. పైగా నావెనక వీడొకడూ … ఆ ఎర్రగేటు మిద్దె మాత్రం కనిపించేదారి కనిపించడంలేదు. …. ఈ నక్షత్రకుడొకడూ నాపాలికి. ఎలా వదిలించుకోడమో … అమ్మమ్మ అంది కూడాను, గొలుసు ఇంట్లో వదిలేసి వెళ్లు అని. విన్నాను కాను. … గొలుసు పోతే పోయింది, ప్రాణాలు దక్కుతాయి … గొలుసు వాడిమొహాన కొట్టేస్తే …. అమ్. లాభం లేదు. అడిగేస్తే సరి, ఏదోఓటి … చావో రేవో తేలిపోతుంది. …

“ఏయ్. ఎందుకలా నావెంటబడి వస్తున్నావు?”

“నేదమ్మా. నివుగూడ పోస్తపీసుకెల్తన్నవని నీయెంట వస్తన్న.”

“ఏంటీ … పోస్టాఫీసా? అయితే వెళ్లు. నేనెటెళ్తే అటొస్తూ ఏంటీ ఆటలు…”

“అయ్యయ్యో .. సిట్టెమ్మా, నిను బయపెట్టీసీనాను గావాల. పాపిస్టోన్ని. నేదమ్మా. .. తప్పయిపోనాది. .. మరేటంటే …”

“ఏంటి?”

“నాకీవూరు కొత్తమ్మా. తెల్లార్తనే తొలిబండిలో వచ్చిన. మామనవడు డిల్లీల ఉన్నడు. మాఆడమడిసి ఆడికిస్టం అని పేలపిండొడియాలు సేసింది. ఇదే మొదులు ఆడు ఇల్లిడిసి పోనం. ఒగటే పోరెట్టిసినాది. ఆడికి అంపమని.”

“నీకు పోస్టాఫీసు ఎక్కడుందో తెలీదా?”

“నేదమ్మా. అసుల నాను బండెక్కడఁవే ఇదే ముదులు. మాపల్లె దాటి అడుగెట్టనేదింతనాక.”

“బాగుంది. తెలీకపోతే ఎవరినైనా అడగాలి గానీ ఇలా నావెంటో మరోడి వెంటో పడితే ఎలా?”

“నిజిఁవే తల్లీ, తప్పయిపోనాది. … నాకెంవో ఈయీదులూ, మడుసులూ అంతా గొత్త. బయంవేస్తది అడగనానికి.”

“మహ బాగుంది. నీకా భయం?”

“నీకు నవ్వులాటగున్నది. పోన్లెమ్మా. నామనవరాలు గూడ ఇట్లనె నవుతాది.”

“లేదులే. నేను నవ్వలేదు.”

“బలెదానివి తల్లి. నవ్వతనే నవ్వలేదంటవు.”

“సరే, పద. ఇంతకీ నీకెందుకు భయం? చూస్తే నువ్వే పదిమందిని పట్టుకు తన్నేలా ఉన్నావు ఆకర్రా నువ్వూను.”

“సూట్టానికి బయ్యంఎట్టీసీలా ఉన్నన? శమించమ్మా. ఏటో, జొన్నంబలి తావి, కాయకస్టం సేస్కు బతికేవోలం. కాయం, దానికేటుంది. అదే బలిసిపోతది. నాన్నీలగ సక్కంగ మాటాన్నేను గంద. నాకేటి సదుగ, సంజా? నాను మాటాడితే నవు‌తరని బయ్యం. నివ్వయితే సదూకున్న తల్లివి తీరుగ సెప్తవ్.”

“అయితే మాత్రం నావెంట పడ్డం ఏమిటి? నేను పోస్టాఫీసుకే వెళ్తున్నానో పచ్చలంగడికే వెళ్తున్నానో నీకేం తెలుసు?”

“అల్లదుగొ, ఆయెనక నివ్వు అడగతంటె యిన్న. నివ్వుగూడ ఆడికె ఎల్తన్నవని, నీయెంటబడిన.”

000

“పద. నిన్నింటికాడ దిగిడిసీసి, నాదారిన నే బోత.”

“ఎందుకూ? నువ్వెళ్లు. బస్సు తప్పిపోతే మళ్లీ నీకే కష్టం. నేను వెళ్లగలనులే.”

“పర్నేదమ్మ. నానూ అటే బోవాల. గడపదనక వస్త. రోజులు మంచియి గావు తల్లీ.”

000

“ఇంత ఆలిస్యం అయిందేం? నేను ఊః ఇదయిపోతున్నాను ఎందుకు పంపించేనా అని.”

“ఏంలేదులే. కాస్త చుట్టు తిరుగయింది. నీఉత్తరం పోస్టులో పడేసే వస్తున్నాలే.”

“వాడెవడే, కీచకుడిలా… నీవెంట?”

“ష్. గట్టిగా అనకు. వింటే బాగుండదు. … కొంచెం మజ్జిగ ఇవ్వనా, తాతా?”

“ఇయ్ తల్లీ. శుద్దిదాహంచ్చుకు బండెక్కుతె ఊల్ల దిగేతలికి పొద్దు వాల్తది. … నాలుక పిడచగట్టుక పోతంది…. నీమనవరాలా? నచ్చిందేవినాగుండది. మలిపొద్దు దిస్టి తీసీ తల్లీ …  ఎల్లొస్త.”

“ఇంతకీ నీకెక్కడ దొరికేడే వీడు?”

“చెప్తే నవ్వుతావు. ఊరికి కొత్తట. కొత్తవాళ్లతో మాటాడ్డానికి భయంట! చూపులకే ఉత్సవవిగ్రహం! మంచివాడే పాపం.”

(6 మే 2010)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

16 thoughts on “భయం (కొత్తకథ)”

 1. లలిత, అలాగేనండి. ఉచిత ప్రమో ఎలా ఒద్దంటాను🙂 మీకు ఏమైనా సలహా, సహకారం కావాలంటే చెప్పండి.

  ఇష్టం

 2. మాలతి గారూ, మీ కథ ప్రేరణతో, మీ సహాయంతో పూర్తైన వీడియో తెలుగు4కిడ్స్(http://telugu4kids.com) లో ఉంచాను.
  వ్యాఖ్యలకు అనువుగా ఉంటుంది కదా అని బ్లాగులో కూడా ఉంచాను.
  (http://balasahityam.blogspot.com/2010/07/blog-post.html)

  మీ కథలలో ఇంకొన్ని ఈ విధంగా present చెయ్యడానికి బావుంటాయి అనిపిస్తోంది.
  ఈ సంకలనం పెరిగేలా ఉంది కనుక తెలుగు4కిడ్స్ లో thulika4kids, వంటి శీర్షిక తయారు చెయ్యడం గురించి ఆలోచిస్తున్నాను:)

  సామెత కథలలో ఇప్పటికి మూడు చేరాయి, అన్నీ మీ సహకారంతోనే.

  ఇష్టం

 3. మాలతి గారూ
  రొడ్డుమీద నడవటానికి కుడాభయపడే ఈరొజుల్లో అమ్మమ్మ భయం యెంత సహజమో అల్లాగే నడిచే పడుచు పిల్ల భయానికి ఒక మెలికవెస్తూ రాసిన ఈ చిన్న కథ నాకు చాల నచ్హిందండీ
  lakshmi raghava

  ఇష్టం

 4. @ భాస్కర్ కూరపాటి, మీరు అంతగా నాకథలు అభిమానిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏరచయితకైనా ఇంతకంటే ఏం కావాలి. మీరు ఎదురు చూస్తున్న ఔన్నత్యాలకి ఎదగడానికి ప్రయత్నిస్తాను.
  – మాలతి

  ఇష్టం

 5. maalathi gariki.
  hats off to u for having unfolded bhayam which is inherent in all human beings. inta chinna subjectni enta crystal clearga choopincharu. i am a great fan of ur stories. recently i came to know of ur blog through a literary friend. i felt ashamed as to y i came to know of it till now. nut it is better late than never.
  mee nijaniki feminijani madya katha chadivi nijanga kanta tadi pettanu. the hell with intellectual men. chaduvukunna vadikanna chakali vaadu nayamantaru andukenemo.
  mee kalam nunchi marinni animutyalu raavalani ashistu’
  mee sahithya abhimaani, bhasker.k

  ఇష్టం

 6. @ SRRao, చక్కగా వివరించేరండీ మీ స్పందన. చూశారా, మిగతా పాఠకులకి కూడా కొత్తకోణం చూపించారు. ధన్యవాదాలు.
  @ రాధిక, కూడా అంటే, యస్.ఆర్.రావుగారితో ఏకీభవిస్తున్నట్టు అనుకుంటున్నాను.🙂 ధన్యవాదాలు.
  @ స్ఫురిత, ఏదిరాసినా … అంటే అది చాలా పెద్ద అభినందన. అవునండీ. మనం అందరం భయంతో పుట్టేమేమో అనిపిస్తుంది. అది చాలనట్టు, పైవాళ్లు పెట్టే భయాలు – ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ మనభయాలమీదే కదా బతికేది. ధన్యవాదాలు.
  @ నాగేస్రావ్, ఇంత చిన్నకత మిమ్మల్నంతగా కదిలించీసినాదా. చాలా సంతోసం బాబూ.🙂

  ఇష్టం

 7. సేన బాగుంది తల్లీ కత. సదూతుంటె కల్లంట నీల్లొచ్చినయ్.

  ఇష్టం

 8. మీరు ఏమి రాసినా నాకు నచ్చుతుందండీ, మీ కథ చదివి ఎప్పట్లాగానే బాగా రాసారు అనుకున్నా, ఇవాళ ఎందుకో కూడలి లో SRRao గారి వ్యాఖ్య చూస్తే మీ కథ ఇంకా బాగుందనిపించింది. అంత పెద్ద విగ్రహం వున్నా అతనిలోను వుందిగా భయం.🙂

  ఇష్టం

 9. మాలతి గారూ !
  మనుష్యుల మనసు పొరల్లో సహజంగా వుండే భయాన్ని రెండు విభిన్న పాత్రల్లో చూపించారు. ఆకారానికి, స్వభావానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదనే విషయం కూడా చక్కగా ఎస్టాబ్లిష్ అయింది. బావుందండీ కథ. అభినందనలు.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s