కల్పన కథానుభవంలో “నవ్వరాదు”

కథానుభవం-6 (జూన్ 16, 2010 ప్రచురితం)

దాదాపు మూడు నెలల విరామం తర్వాత కథానుభవం-శీర్షిక లో ఈ సారి రాస్తున్న కథ నిడదవోలు మాలతిది. మాలతి గురించి బ్లాగు లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఒక విషయం లో మాలతి గురించి పరిచయం చేయాలి. అది ఆమె రాసిన కథల గురించి.

సుమారుగా ఆరు దశాబ్దాల సాహిత్య కృషి ఆమె ది. బహుముఖాలుగా సాగే ఆమె విస్తృత సాహిత్య కృషికి దర్పణాలు ఇంగ్లీష్, తెలుగు తూలిక లు. కథ రాసినా, ఊసుపోక అంటూ నవ్విస్తూ చురకలు వేసినా, రచయతల గురించి వ్యాసాలు రాసినా, డయాస్పోరా జీవితాన్ని మొదటి సారి తెలుగు లో నవల గా చిత్రించినా ఆమె ది ఒక ప్రత్యేక దృష్టి. తెలుగుతనపు నుడికారపు భాష, ఒక అరుదైన శైలి ఆమె రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పాత తరం రచయతల గురించి తనదైన శైలి లో విస్తృత పరిశోధన చేసి, ఒక్కో వ్యాసం లో ఒక డాక్టరేట్ కి కావాల్సినంత సమాచారం అందిస్తూ ముందు తరాలకు నిజంగా ఉపయోగపడే ఒక రిసెర్చ్ స్కాలర్ గా ఆమె సాహిత్య కృషి కి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది మాత్రం నిష్టూరసత్యం. చాలా మంది విమర్శకులు కొందరి సాహిత్యాన్ని పరిచయం చేసేటప్పుడు ఈ రచనలు విశ్వసాహిత్యం లో వుండాల్సినవి అని అలవోక గా రాసేస్తుంటారు. అలాంటి అతిశయపు మెచ్చుకోళ్ళు కావి ఇప్పుడు నేను మాలతి గారి గురించి రాసిన మాటలు. నిజంగా ఆమె సాహిత్య కృషి ని నేను గుర్తించి , మిగతావారు గుర్తించాల్సిన అవసరంగా చెప్పటమే ఇది. ఈ నాలుగు మాటలు కూడా ఆమె కు తెలియటం కోసం కాదు. ఈ కథానుభవం రాస్తున్న సందర్భంగా మరో సారి ఆమె సాహిత్య కృషి ని గుర్తు చేసుకోవటమే.

దాదాపు వంద కథల దాకా రాసి వుంటారేమో ఆమె. అందులోంచి ఏదో ఒక కథను ఎంపిక చేసుకొని దాని గొప్పతనం గురించి మాత్రమే రాయటం ఒక విధమైన అన్యాయమే. అయితే అసలు రాయకుండా మిగిలిపోవడం కన్నా ఒక్క కథ గురించైనా మాట్లాడటం అవసరమనుకున్నాను. ఆ ఒక్క కథ ఎంపిక మాత్రం కష్టమైంది. దాదాపుగా ఆమె కథలన్నీ నాకు ఇష్టమే. అయితే ఏ కథ ఎక్కువ ఇష్టం అంటే నేను నిద్ర లో లేపి అడిగినా చెప్పే కథలు రెండు.ఒకటి ‘ నవ్వరాదు ‘, రెండు ‘ మంచు దెబ్బ ‘. ఈ రెండు కథలు మొదటిసారి నేను ఆరేళ్ళ క్రితం చదివాను. నవ్వరాదు చదివి నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అందరిని ఆ కథ అంతగా కదిలిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే బాగా కదిలిపోయాను. ఆమె కథల గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ముందు దాని గురించే మాట్లాడటం న్యాయం.అందుకే ఈ సారి కథానుభవం లో ఆ కథ గురించి ….

హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఈ లోకం అనే సర్కస్ లో కామెడీ క్వీన్ లా వుండే అమ్మాయి కమలిని జీవితం పాతికేళ్ళకే ముగిసిన కథ ఇది. నవ్వే ఆడపిల్లల జీవితం లోని వైరుధ్యం ఈ కథలో కనిపించినంతగా ఇంకెక్కడా కనిపించదేమో..ఆడపిల్లల్ని నవ్వొద్దు నవ్వొద్దు అంటారు తప్ప హాయిగా స్వేచ్ఛగా, పరవళ్లు తోక్కే నది లా నవ్వే అదృష్టం అందరికీ వుండదు. ఆ నవ్వు ఎల్లకాలం అందరి జీవితం లో చివరి వరకూ వుండదు.

కమలిని పువ్వు పూసినంత స్వేచ్ఛగా నవ్వగలిగిన అమ్మాయి. పెళ్ళి చేయాలి కాబట్టి చదువుకోనివ్వని తల్లితండ్రులు, పెళ్ళి కాకపోవడం తో అన్న వదినలకోసం ఇంటి చాకిరీకి పరిమితమై పోవడం, ఎప్పటికో పెళ్ళి అయినా కడుపు నిండా నాలుగు మెతుకులు కూడా పెట్టని అత్తింటివారు ..ఇలాంటి జీవితం చాలు ఓ ఆడపిల్ల హృదయపు లోతుల్లోంచి వచ్చే నవ్వు ని పెదాల మీదకు రానివ్వకుండా మర్చిపోవటానికి. మనం ఏడ్చినా, నవ్వినా ఒకటే అన్న నిర్ణయానికి రావటానికి. అత్తింటివారు కడుపు నిండా అన్నం పెట్టకపోతే స్నేహితురాలికి తన కష్టాలు చెప్పుకోకుండా మనుష్యుల్ని స్టడీ చేయడానికి నాకింత మంచి అవకాశం దొరుకుందనుకోలేదే అని తన హాస్యం చాటున తన కన్నీళ్ళను కప్పెట్టుకొని మనల్ని ఏడిపిస్తుంది.

ఇలాంటి విషమ పరిస్థితుల్లో చావు దగ్గరకొస్తున్నా , “ యముడు ఎన్టీ రామారావు లా వుంటాడా? ఎస్వీ రంగారావు లా వుంటాడా? ఎవరి వెనక పడితే వారి వెనక పోలేను కదా” అని స్నేహితురాలి తో కమలిని హాస్యమాడుతుంది. ఆమె చావు గురించి మాట్లాడుతుంటే బాధతో స్నేహితురాలు సరస్వతి, చిన్నప్పటి నుంచి కమలిని ని ఎరిగున్నది కూడా , నువ్వలా నవ్వకే నాకు భయమేస్తోంది అంటుంది. నువ్వు కూడా నవ్వొద్దనే అంటావా సరసూ అని విషాదం గా అడిగే కమలిని ప్రశ్న నవ్వుల్ని పోగొట్టుకున్న ఎందరో స్త్రీలు అడుగుతున్న ప్రశ్న గా అనిపిస్తుంది. నేనెప్పటికీ మర్చిపోలేని పాత్ర కమలిని.

ఈ కథ 1968 లో ప్రచురితమైంది. ఈ కథ లోని పరిస్థితులు యథాతథంగా ఇప్పుడు వుండకపోవచ్చు. నవ్వుతూ సరదాగా వున్న అందరి ఆడపిల్లల జీవితాలు అన్నీ ఇలా విషాదంగా అర్ధాంతరం గా ముగిసిపోవటం లేదు. సన్నివేశాలు మారినా ఇప్పటికీ కొందరి స్త్రీల జీవితాలు అసలేప్పుడూ తనివితీరా నవ్వకుండానే, నవ్వే అవకాశం కూడా లేకుండానే ముగిసిపోతుంటాయి.

మాలతి గారి కథల పుస్తకం “ నిజానికి –ఫెమినిజానికి మధ్య” లో మొదటి కథ ఇది.

———

కల్పన రెంటాల గారిసౌజన్యంతో  కథానుభవంలో నాకథ “నవ్వరాదు” చూడగలరు.

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “కల్పన కథానుభవంలో “నవ్వరాదు””

 1. శుభం. మొదలు పెట్టండి మరి. ఇలాగైనా నాకో అస్తిత్వం ఏర్పుడుతుంది రచయితగా! కల్పనకి కూడా మీ వ్యాఖ్య చెప్తాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా. ఉండకూడదు మీరు బహిరంగంగానే చెప్పేరు కనక :p

  మెచ్చుకోండి

 2. మాలతి గారు నేనింకా మీ కథలోకి దిగలేదు రెంటాల కల్పన గారి వలన ఇప్పుడే అర్జంటుగా మీ కథలన్నీ చదివేయాలని పిస్తోంది బంగారు బాతు గుడ్డు రోజుకొకటి అని ఉత్సాహాన్ని ఆపుకుని రోజుకోకటి చదవాలని నిర్ణయం తీసుకున్నాను….

  మెచ్చుకోండి

 3. @ మధురవాణి, పూర్తిగా చదవడం అయిందన్నమాట. నిన్ను ఈకథ అంతగా కదిలిందింటే అది కథకి సాఫల్యమే. సంతోషం. అవును, అలాటి పరిస్థితులు తల్చుకుంటే నాక్కూడా కోపం వస్తుంది. ఏం చెయ్యలేనన్న అసక్తతే నాచేత ఇలాటి కథలు రాయిస్తుంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. గత కొన్ని రోజులుగా ఈ కథ చదవాలని ఓపెన్ చేయడం.. కొంత చదివాక మళ్ళీ ఏదో పని అడ్డం పడి మధ్యలో ఆపడం.. ఇలా జరుగుతోంది. ఇవ్వాళ మళ్ళీ మొదటి నుంచి పూర్తిగా చదివాను. చాలా బాధేసింది కథ చివరికంటా వచ్చేసరికి. కమలిని లాంటి అమ్మాయి చుట్టూ నవ్వించే పరిస్థితులు లేనందుకు చాలా కోపం కూడా వచ్చింది. ఇప్పుడే చదివాను కదా.. ఆ ఫీలింగ్ లోనే ఉండటం వల్ల ఏం చెప్పాలో తెలీట్లేదు కానీ.. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనెప్పటికీ ఈ కథని మర్చిపోలేను.

  మెచ్చుకోండి

 5. @భావన, ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయండీ. అందుకే ఈకథ తనని ఆకట్టుకోగలిగిందంటోంది కల్పన. కానీ మీరన్నట్టు మనం దూరంగా ఉండడం ఒక కారణం కావచ్చు. కానీ దేశంలో ఉన్నవాళ్లు కూడా గమనించరు. ఇలాటివిషయాలు చాలామంది దృష్టిని దాటిపోతాయి అనేకానేక వ్యాపకాలూ ఇతర ఆసక్తులమూలంగాను.
  కథ మీకు నచ్చినందుకు సంతోషం.

  మెచ్చుకోండి

 6. బాగుంది మాలతి గారు కధ. ఇప్పుడు కూడా ఆ పరిస్తితులు లేవా? మనం అటు వంటి పరిస్తితులకు దూరం గా వుండటం వల న మన దృష్టి కి రావటం లేదేమో కాని లేవంటారా? బాగుంది కధ. మనసు చెమ్మగిల్లింది.

  మెచ్చుకోండి

 7. పరిమళా, అదే అనుకుంటున్నా చాలా రోజులుగా నాపాతస్నేహితుల దర్శనాలు లేవని. :p. మిమ్మల్ని నవ్వరాదు కథ అంతగా కదిలించినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. మాలతి మేడం! కుశలమేకదా! ఈ మధ్య కొద్ది రోజులు బ్లాగుకు దూరంగా ఉండి ఇటు తొంగి చూడలేదు .మీ కొత్త టెంప్లేట్ బావుంది .
  నవ్వరాదు కధ మాత్రం కన్నీళ్లు పెట్టించింది .

  మెచ్చుకోండి

 9. మాలతిగారు, కథ చివరికొచ్చేసరికి నా నవ్వు మాయమయింది, కానీ కమలినిని గుర్తుతెచ్చుకుని నవ్వేను. చాలా బాగుంది….అద్భుతం !

  మెచ్చుకోండి

 10. మాలతి గారూ !
  నవ్వులో విషాదం, విషాదంలో నవ్వు మీ వెరసి ‘ నవ్వరాదు ‘. గుండెను స్పర్శించింది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s