పరీక్ష

కాంతకి తెలుగు పాఠాలు చెప్పే ఉద్యోగం దొరికింది అమెరికాలో. వచ్చి ఒళ్లో వాలింది అక్షరాలా!

ఆవిడ అమెరికా వచ్చి ఆరేళ్లయింది జాగ్రఫీ ప్రొఫెసరు మూర్తికి ఇల్లాలిగా. తరవాత మూడేళ్ల బాలకృష్ణుడికి అమ్మస్థానం కూడా సంపాదించుకుంది. అమెరికాకొచ్చేక అదనంగా కలిగిన వసతి హోమ్మేకరు స్థానం. అంటే ఇళ్లు కట్టడం కాదు, కాపురం నిలబెట్టుకోడం. అంచేత ఆవిడ ఉద్యోగాల వేటకెళ్లలేదు.

అలాటి శుభసమయంలో ″తెలుగు చెప్తావా?″ అంటే కాంతకి హాచ్చర్యమ్ ముంచుకొచ్చేసింది. దానివెనకున్న కథా కమామీషు మొదలెట్టాలంటే కొండవీటి చాంతాడంత వుంది కాని సూక్ష్మంగా జరిగింది ఇదీ …

దాదాపు పాతికేళ్లకిందట అఖిలజగత్తుని ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలుతున్న అమెరికా ప్రభుత్వం మొత్తం మానవజాతిని గ్లోబలైజు చెయ్యడానికి సిద్ధమయిన శుభసందర్భంలో వాళ్లకి అర్థమయింది భాషబలం. ఇండియాలాటి దేశాలనించి జనాలు తండోపతండాలుగా అమెరికాకి తరలి వస్తుండడంచేత వాళ్లభాషని ఏదోవిధంగా గుర్తించాలని నిర్ణయించుకుని ప్రభువులు గ్రాంటులు గ్రాంటు చెయ్యడం మొదలెట్టారు. ఆ సమయంలో ఓ చిన్న యూనివర్సిటీవారు చరిత్ర ప్రొఫెసరు జాన్‌ ‌హేస్టింగ్స్‌గారిని తెలుగు చెప్పమన్నారు. ఎందుకంటే, ఆయన చిన్నప్పుడు తండ్రిగారు మతప్రవక్తగా తెలుగుదేశంలో ఉండడంచేత హేస్టింగ్ దొరగారికి తెలుగుదేశంలో ఉండేభాగ్యం కలిగింది. తెలుగు ఆటోమేటిగ్గా వచ్చేసింది. ఆయన మొదట్లో ఉత్సాహంగానే తెలుగు చెప్తూ వచ్చేరు కానీ కానీ ఈమధ్యే అది ఆయనకి కష్టమవడం మొదలెట్టింది. ఎందుకంటే, ఆయనకి ప్రొఫెసరుగా టెన్యూర్ తెచ్చుకునే సమయం ఆసన్నమయింది. దానికోసం ఆయన పడవలసిన పాట్లు చాలా ఉన్నాయి. ముందు అర్జంటుగా ఓ పుస్తకం ప్రచురించాలి. (చూసారా, పుస్తకాలు ఎలా ప్రచురింపబడతాయో). ఇంతకీ ఈ కారణాలన్నిటి మూలానా, తెలుగు చెప్పడానికి మరో మనిషిని వేసుకోమని ఛైరుని అడిగేరు.

ఆ ఛైరు ″కొత్తలెక్చరరు పదవి పుట్టించడానికి డబ్బుల్లేవు. కావలిస్తే, ఓ టియేని ఇస్తా. ఎవరైనా ఉంటే చూడండి,″ అని సలహా యిచ్చేరు.

మామూలుగా student assistant అంటే స్టూడెంటు అయివుండాలి. ఆమీదట, తెలుగుపాఠాలు చెప్పే ఇష్టం ఉండాలి. హేస్టింగ్స్‌గారు పదేళ్లుగా తెలుగు బోధిస్తున్నా, తమకి కావలసినస్థాయికి వచ్చి, ఆ ఆసక్తి కలిగిఉన్న అమెరికన్ తెలుగుస్టూడెంటు బాబులెవరూ తయారవలేదు వారి హయాంలో. అంచేత, రూలు కొంచెం సవరించుకుని, ″ఊళ్లో వున్న మరోమనిషిని చూసి పట్టుకురా,″ అన్నారు ఛైరుగారే మళ్లీ.

ఇదీ వెనకటి వృత్తాంతం..

ప్రస్తుతం జాన్ హేస్టింగ్స్‌దొర తనకి సహాయకుడిని వెతిక్కుంటున్నారు. సుదీర్ఘంగా ఆలోచించగా, జాగ్రఫీ ప్రొఫెసరు మూర్తి జ్ఞప్తికి వచ్చేడు. ఆ మూర్తి ఎక్కడ ఉంటాడా అని దిక్కులు చూస్తూంటే, గాజుగోడల్లోంచి, ఫేకల్టీలౌంజిలో కాఫీ చప్పరిస్తూ, కనిపించేడతను గ్రహాలన్ని అనుకూలస్థానాల్లో ఉండడంచేత కాబోలు.

హేస్టింగ్స్ వెంటనే లౌంజిలోకి చొరబడి, మూర్తిపక్క చేరి, హై అన్నాడు ఎంతో సంతోషంగా.

మూర్తి కూడా తిరుగుటపా హై చెప్పేడు.

రెండోప్రశ్న, ″మీభార్య ఎట్లు కలదు?″

″బాగుంది,″ అన్నాడు సాలోచనగా. తనకి ఈయనగారితో అట్టే బాంధవ్యం లేకపోవడంచేత ఆ ప్రశ్న అసందర్భంగా తోచి కొంచెం తికమక అయింది అతనికి.

″ఆమెకి మాస్టర్స్ డిగ్రీ ఉందని నువ్వు చెప్పినట్టు నాకు జ్ఞాపకం వస్తోంది. ఏమైనా ఉద్యోగము చేయుచున్నదా?″

మూర్తి ఈసారి నిజంగా గుమ్మయిపోయేడు. తానెప్పుడు తనభార్య ఉద్యోగాలు వెతుక్కుంటోందని ఎవరితోనూ అనలేదు. ″అవును. ఆమెకి ఎకనమిక్స్‌లో మాస్టర్సు డిగ్రీ ఉంది. లేదు. ఉద్యోగం చెయ్యడంలేదు″ అన్నాడు ఆయనప్రశ్నలకి అదే వరసలో జవాబులిస్తూ..

″నాకో ఆలోచన వచ్చింది. మేం తెలుగు చెప్పేవారికోసం చూస్తున్నాం. …″ అన్నాడు హేస్టింగ్స్ ఎటో చూస్తూ.

″కాంత ఎప్పుడూ తెలుగు చెప్పలేదు పూర్వం. దేశంలో బాంక్‌లో పనిచేసింది.″

″ఆమె నేటివ్ స్పీకరు కదా. అక్షరాలు వచ్చుకదా. ఆమెకి చదవడం, రాయడం వచ్చు కదా.″

″అవును. వచ్చు. వచ్చు మరియు వచ్చు.″

″అడిగి చూడండి. ఆమెకి ఇష్టమయితే, నన్ను కలవమని చెప్పండి,”

″సరే, తనతో మాటాడి చెప్తాను.″

″అలాగే. అట్టే టైము లేదు మరి. ఏదో ఒకసంగతి నాకు త్వరగా చెప్పండి. ఛెయిర్ అవుట్‌సోర్స్ చెయ్యమంటున్నారు,″ అని గుమ్మంవేపు నాలుగడుగులేసి, ఆగి, విలాసంగా వెనక్కి తిరిగి, ″జీతం పెద్దది కాకపోవచ్చు కానీ ఆంధ్రాలో బాంకుసంపాదనతో పోలిస్తే చాలా ఎక్కువే కదా,″ అన్నాడు హేస్టింగ్స్.

మూర్తికి ప్రాణం చివుక్కుమంది. స్థానబలం అనుకున్నాడు కసిగా.

000

కాంత బట్టలు వాషర్‌లో పడేసి, హాల్లో కూర్చుంది పుస్తకం పట్టుకుని.

మూర్తి గరాజిలో కారు పెట్టి, లోపలికి వస్తూ, ″కిట్టు ఏడీ?″ అనడిగేడు యదాలాపంగా.

కాంత కాఫీ పెట్టడానికి లేచింది, ″పక్కవాళ్లపిల్లలతో పార్కుకి వెళ్లేడు″ అంటూ.

మూర్తి ఆవిడవెనకే వంటింట్లోకి నడిచేడు.

″ఏంటి కథ?″

″ఏం. వంటగదిలోకి రావడానికి నాకధికారం లేదా?″ అన్నాడు మూర్తి సీరియస్‌గా.

కాంత నవ్వేసి, కాఫీ కలపసాగింది.

ఇద్దరూ చెరోకప్పూ పుచ్చుకుని హాల్లోకి వచ్చేరు.

మూర్తి ఏదో చెప్పాలనుకుంటున్నాడన్నది కాంతకి స్పష్టమయింది. ″ఎంతసేపు సస్పెన్సు? చెప్పేదేదో చెప్పేస్తే, నీపాట్న నువ్వు టీవీలో వార్తలు చూసుకోవచ్చు. నాపాట్న నేను బట్టలుతుక్కోడమో, పుస్తకం చదవడమో చేసుకుంటాను,″ అంది కాంత.

మూర్తి ఉలిక్కిపడి, ఏంలేదని గట్టిగా నొక్కి వక్కాణించి ఆ తరవాత నెమ్మదిగా, ″జాన్ అని హిస్టరీ ప్రొఫెసరు నీకు గుర్తుందా? కిందటేడు ఆఫీసుపార్టీలో కలిశాం.″

″ఆఁ. పొడుగ్గా, సన్నగా రివటలా ఊగిపోతుంటాడు. ఆయనేనా?″

మూర్తి నవ్వేడు. ″ఇక్కడ పొడుగ్గా లేనిదెవర్లే కానీ ఆయనే.″

″ఏం? ఏమంటాడు?″

మూర్తి తటాపటాయిస్తూ, ″ఏంలేదు. మధ్యాన్నం లౌంజిలో కనిపించి ఏదో సలహా చెప్పేడు.″

″ఆఁ.″

“ఏంలేదు. నువ్వు తెలుగు చెప్తావా అని అడిగేడు. అదే … నీకు ఇష్టమయితేనే …”

“నేనేమీ ఉద్యోగాలకోసం చూడ్డంలేదు కదా. పైగా నాకు తెలుగులో డిగ్రీ లేదు కదా.” అంది కాంత ఆశ్చర్యపోతూ.

“నేనూ అదే చెప్పేను ఆయనకి. నీకిష్టమయితేనే …”

ఉరుములేని పిడుగు! ఈయనకి నేను ఉద్యోగం చెయ్యాలని ఉందా? తను చెప్పలేక జాన్‌ని అడ్డం పెట్టుకుని చెప్తున్నాడా? ఆమాట తనే చెప్పొచ్చు కదా. జాన్నో, మరో వెంకన్ననో వంక ఎందుకూ. .. ఆలోచనలతో ముందు చిరాకేసింది. తరవాత కోపం వచ్చింది. తరవాత అడగదలుచుకున్న మాట వచ్చింది, “నేను ఉద్యోగం చెయ్యాలనుందా నీకు?” అంది మూర్తిమొహంలోకి గుచ్చి చూస్తూ.

“నాకుంది అన్లేదు నేను. ఆయన చెప్పినమాట నీకు చేరేసేనంతే. నేను కేవలం వార్తాహరుడిని మాత్రమే. పైగా నీకు తెలుగులో డిగ్రీలేదని కూడా చెప్పేను,” అన్నాడు మూర్తి కూడా చిరుకోపంలాటి చిరాకు ప్రదర్శిస్తూ.

“నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు” అని కూడా చేర్చేడు ముందుజాగ్రత్త కొంత తీసుకుని.

కాంత నవ్వింది, “సరే, నేను నిన్ను అపార్థం చేసుకోను. నిజ అర్థమే చేసుకుంటాను. ఇంకేమిటి ఇతర వివరాలు?”

“శాంతించేవా?”

“..చేను.”

“దేవిగారిఅనుజ్ఞ అయితే చెప్తాను.”

“అయింది.”

“ఏంలేదు. మామూలు ఉద్యోగాల్లా పగలంతా 9 టు 4 ఆఫీసులో ఫైళ్లతో కుస్తీ పట్టఖ్ఖర్లేని పని. వారానికి మూడురోజులు క్లాసు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లి వచ్చేయడమే. పాఠాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆఫీసుటైం కిందే లెఖ్ఖ. పైగా నీకు ఈనాలుగ్గోడల చెరలోనించి బయట పడ్డట్టు కూడా ఉంటుంది కదా.” అన్నాడు హడావుడిగా ఎవరో తరుముకొస్తున్నాట్టు.

కాంత వింటూ అతన్ని చూస్తోంది.

మూర్తికి హుషారు పుంజుకుంది. తన పిచ్ పెంచి, “ఆలోచించుకో. నీయిష్టం. మరో నాలుగురాళ్లు చులాగ్గా కలిసొస్తాయంటే కాదనడం ఎందుకు?”

కాంత వింటూ ఉండుట కంటిన్యూ చేస్తూంది.

“పైగా నీబాంక్ సంపాదనకంటే నాలుగు రెట్లు.”

“ఏంటీ?” కాంత ఉలిక్కిపడింది. కళ్లలో విస్ఫులింగాలు. తనబాంక్ ఉద్యోగాన్ని అంత తేలిగ్గా తీసిపారేయడం అన్యాయం, అక్రమం … “దానికీ దీనికీ పోలికేమిటి? నీకూ తెలుసు కదా ఆ జీతంతో అక్కడ పనిమనిషీ, వంటమనిషీ, చాకలీ .. ఇన్ని సేవలు సాధ్యం. అక్కడిసంపాదనకీ, బతుక్కీ ఇక్కడ వాటితో పోలికేమిటి?”

మూర్తి నాలుక తెగేలా కరుచుకున్నాడు. తెగి రక్తధారలు కురుస్తున్నట్టు ఊహించుకున్నాడు.   మొహం హృదయవిదారకంగా మార్చుకుని, “మళ్లీ … ఆ మాటలు నావి కావు. నేను వార్తాహరుడిని మాత్రమే,” అన్నాడు.

ఆపూటంతా అలా ఒకరిమీద ఒకరు కోపాలు పడుతూ లేస్తూ గడిపేలా ఉన్నారిద్దరూ.

“బాగుంది వరస. సరే. నీవార్తాహరుడి స్టేటస్‌తోనే ఇంకా ఏదైనా చెప్పవలసింది ఉందా?” అంది కాంత.

కాంతుడు తల అడ్డంగా ఆడించేడు నిస్సహాయంగా.

కాంత జనాభాలెక్కల్లో ఉద్యోగస్థురాలుగా నమోదు అయింది.

000

“ఏముంది ఇక్కడ తెలుగు చెప్పడం అంటే అక్షరాలూ, మాటలూ నేర్పడమే” అనుకున్న కాంతకి అచిరకాలంలోనే అదేమంత సులభసాధ్యం కాదని అర్థమయింది. తన పని అఆలు దిద్దించడం అనుకోడం న్యాయమయిన వివరణ కాదు. అంత కన్నా త్రీరింగ్ సర్కస్ అనడం నయం. లేదా జాన్సన్ మహాశయుడు చెప్పినట్టు ఊరకుక్కలు వెనకకాళ్లమీద నడవడంలాటిది అనొచ్చు. కారణం తనకి తెలిసిన స్కూళ్లకీ, పాఠాలకీ అమెరికాలో స్కూళ్లకీ, పాఠాలకీ, విద్యార్థుల ధోరణికీ మధ్య గల తేడా సహస్రాంతం. బంగాళాఖాతం అంత అఖాతం. తనరోజుల్లో మేష్టర్లు చెప్పేరు. విద్యార్థులు విన్నారు. పంతులు జ్ఞానం ఇచ్చేవాడు. పిల్లలు పుచ్చుకునేవారు. ఇచ్చేవాడంటే పుచ్చుకునేవాడికి భక్తి. ఇది మన సాంప్రదాయం.  అమెరికాలో విద్యావిధానం దానికి పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఇచ్చేవాడు విద్య ఇచ్చేవాడు కాదు. పంతులికి జీతం ఇచ్చేవాడు. మిగతా వాతావరణం అంతా ఆ వాదనమీద ఆధారపడి ఉంటుంది!

కాంతకి ఈపాఠం మొదటివారంలో నేర్పబడింది. క్లాసులో ముగ్గురే విద్యార్థులు. ఇద్దరు హెరిటేజిగాళ్లు. అంటే వాళ్ల తండ్రులూ, తాతలు తెలుగువాళ్లు. ఒకమ్మాయి మాత్రం అమెరికను. తెలుగువాళ్లలో అనిత అమెరికాలోనే పుట్టి, అమెరికాలోనే పెరుగుతున్న దేశీ. రెండేళ్లకోసారి విజిటుకొచ్చే అమ్మమ్మదగ్గర నాలుగు తెలుగు ముక్కలు పట్టుబడ్డాయి ఆ అమ్మాయికి. అంచేత, “నాకు తెలుగొచ్చు” అంటుంది గొప్ప ఆత్మవిశ్వాసంతో. రెండో విద్యార్థి ఫాన్.

000

ఆ అబ్బాయికి ఎనిమిదేళ్లపుడు, విజయవాడలో ఉండగా, మేరీ హాక్ అనే అమెరికన్, దయార్ద్ర హృదయురాలు, ఇండియా చూడ్డానికి వెళ్లడం తటస్థించింది. కుర్రవాడు చిన్నవాడే అయినా చురుకుచూపులవాడు, మెరిక బంగారంలాటివాడు. ఆవిడ దిగినహోటల్ దగ్గర తచ్చాడుతూ, ఆహోటల్లో దిగినవారికి చిన్నచిన్నపనులు చేసిపెడుతూ, రోజులు రాజాలాగ గడిపేసుకుంటూన్న వాణ్ణి చూస్తే మేరీకి ముచ్చటేసింది. ఆహా, ఎంత డ్రైవూ, ఎంత చొరవా, ఎంత తెలివీ అనుకుని, ఆ అభ్బాయికి అమ్మా, బాబూ లేరని తెలుసుకుని, “నాతో వచ్చేస్తావా, చదువు చెప్పిస్తాను” అంది. అప్పట్లో ఫాను పేరు ప్రేమకుమారు. ప్రేమకుమారుకి విజయవాడ వీధులయితేనేమి, అమెరికా రోడ్డులయితేనేమి అనిపించిందేమో “ఓహ్, యాస్“ అన్నాడు విసురుగా హుషారుగా తలెగరేసి.

ఆ తరవాత మేరీ రెండు దేశాల ప్రభుత్వాలకీ అర్జీలు పెట్టుకుని, ప్రార్థించి, అనేకవిధాల పోరు పెట్టి, హోరెత్తుతూ అరిచి, వాదించి, వాళ్లలో ఏమూలో దాగుకొన్న మానవత్వాన్ని మేలుకొలిపి గెలిచి, ఆ ఎనిమిదేళ్ల కుర్రవాడిని అమెరికాకి తీసుకొచ్చుకుంది. ప్రేమకుమార్ అమెరికా చేరేసరికి పదేళ్లవాడయేడు. మేరీ ప్రేమ్ అన్న పేరు అలాగే ఉంచింది it has a nice ring to it అనీ, తాను వాడిని ఇక్కడికి తీసుకువచ్చినా, వాడిసంస్కృతీ, సాంప్రదాయాలు  మర్చిపోరాదనీ… ప్రేమ్‌కి మాత్రం ఈలోకం, ఇక్కడి తీరూ ఆదిలో మహా గందరగోళం అయిపోయింది. అతనికి తెలిసిన ఒకే ఒకభాష మాటాడేవారు చుట్టుపట్ల లేరు కాగడా పెట్టి వెతికినా. స్కూల్లో స్నేహితులు లేరు. మిగతా పిల్లలకి వాడియాస, బాస, వేషం – అన్నీ హాస్యంగానే ఉన్నాయి. తైవాన్లో తయారయి వాల్మార్ట్‌లో అమ్ముతున్న చొక్కాలూ, జోళ్లూ అన్నీ హా, హా, హీ, హీ..

“మీనాన్న కుట్టేడా ఆచొక్కా?”

“ఆజోళ్లు ఎక్కడ దొరికేయిరా బాబూ నీకు?”

ఫాన్‌కి వాళ్ల వేళాకోళాలు దుర్భరం అయిపోయింది. ఇంట్లోంచి పారిపోయేడు. అదృష్టవశాత్తు, వాడిని మేరీ తొందరగానే పట్టుకుంది. వాళ్లింటికి కొంచెం దూరంగా ఉన్న పార్కులో బెంచిమీద పడుకుని నిద్ర పోతుంటే చూసి, ఇంటికి తీసుకొచ్చింది. అప్పటినుండీ, వాడికి స్థానికసంస్కృతి కూడా నేర్పాలని తోచింది ఆవిడకి. వాణ్ణి కూర్చోబెట్టి ఓరోజు కొన్ని ధర్మసూత్రాలు వివరించింది. అందులో కొన్ని – నువ్వు ఎవరికంటే తక్కువవాడివి కావు. ఇక్కడ అందరూ సమానులే. నిన్ను తక్కువగా చూసే హక్కు ఎవరికీ లేదు. నీమీద ఎక్కితొక్కే అధికారం లేదు. నువ్వు అలా వాళ్లని చెయ్యనియ్యరాదు. నిన్ను నువ్వు సదా పరిరక్షించుకోవాలి. అది నీధర్మం. విజయం నీకు ఎవరో ఇవ్వరు. నువ్వే సంపాదించుకోవాలి. విజయం అంటే ఇతరులని నువ్వే అధిగమించి, నీసామర్థ్యం నువ్వే ఋజువు చేసుకోవడం. నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే, ఇతరులు నిన్ను గౌరవించరు. …

ఇవన్నీ బంగారం మచ్చు తునకలు సరే. బాగానే ఉన్నాయి చెప్తున్నప్పుడు వినడానికి. చిక్కెక్కడంటే ఇలాటివి చెప్పడం సుళువు. క్రియలో ఎలా రూపు కడతాయో చెప్పడం కష్టం అని చెప్పడానికి ఫాన్ అవలంబించిన పద్ధతులు చాలు. మేరీ బోధించిన ధర్మసూక్ష్మాలు ప్రాతిపదిక చేసుకుని, ఆ చిన్నిబుర్ర సొంత సూత్రాలు తయారు చేసుకుంది. అందుకు అతని కురచ కాయం, చిలిపికళ్లూ, వసివాడని మోమూ పనికొచ్చేయి మరీ గట్టి చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు కూడా. తరవాత అలవాటయింది. అందులో భాగంగా పేరు ఫాన్ అని మార్చుకున్నాడు.

మేరీ ట్యూషను పెట్టించీ. తనే దగ్గర కూర్చుని చదివించీ, వాడికి హైస్కూలు డిప్లమా సంపాదించుకునేలా చేసింది.

000

మూడో అమ్మాయి జూలీ అమెరికన్. తనకి చాలామంది తెలుగు స్నేహితులు ఉండడంచేత తెలుగు భాషా సంస్కృతులమీద అభిమానం కలిగిందని చెప్పింది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ కూడా తెలుగుబిడ్డే.

“అయితే నీకు తెలుగు కొంచెం వచ్చా?” అంది కాంత.

“ఓహ్, లేదు. లేదు. అసలు వాళ్లింట్లో ఎవరూ తెలుగు మాటాడరు. చాలా చక్కటి ఇంగ్లీషు మాటాడతారు. నాకు ఆశ్చర్యం వేసింది కూడాను,” అంది జూలీ చిర్నవ్వుతో.

ఉన్న ముగ్గురిలోనూ జూలీకి మాత్రమే ఇతరభాష నేర్చుకునేవిషయంలో స్పష్టమయిన అవగాహన ఉన్నట్టుంది. తనకి ఏమీ తెలీదనీ, క్రమపద్ధతిలో నేర్చుకోవాలనీ అర్థం చేసుకుంది. నేర్చుకుందాం అన్న శ్రద్ధ ఒక్క ఆ అమ్మాయిలోనే కనిపించింది కాంతకి. ఆ అమ్మాయి క్రమశిక్షణ కాంతకి చాలా తృప్తినిచ్చింది.

ముగ్గురికీ భాష నిర్మాణం గురించిన అవగాహన కావాలి. మాతృభాష తెలుగు అయినవారికి కాస్త త్వరలోనే పట్టుబడుతుంది వాళ్లకి నేర్చుకుందాం అన్న తపన ఉంటే.

000

కాంతం ఓనమాలు ఉచ్చారణతో ప్రారంభించింది. ముందు కొన్నిచిన్న చిన్న మాటలు చెప్పి, కొంతసేపు పలకడం నేర్పి తరవాత రాయడం ప్రాక్టీస్ చేయించింది. అదే వాళ్ల హోంవర్క్. మర్నాటికి వాళ్లకి ఆ పదిమాటలు రాయడం, చదవడం, పలకడం స్పష్టంగా రావాలి. భాష బలం ఉపయోగంలోనే కనక మాటలూ అర్థాలూ వాళ్ల నాలుకలమీద ఆడితేనే భాష వచ్చినట్టు. అంటే కంఠతా బట్టాలి. భాషకి అదే ముఖ్యం.

“ఈతలాగే భాష కూడాను. మిమ్మల్నో పెద్దచెరువులోకి తోసేస్తే, మీరు కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ తీరం చేరడానికి ప్రయత్నిస్తారు కానీ ఈత కొట్టుట ఎట్లు అన్న పుస్తకం చూసుకుంటూ కూర్చోరు కదా. అలాగే భాష కూడాను. మీరు ఎవరితోనైనా మాటాడాలంటే ప్రతిమాటకీ handbook చూసుకుంటుంటే సంభాషణ ఎలా సాగుతుంది? మాటలూ, అర్థాలూ, వాటిని వాడుకునే తీరూ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. మాటలు మీనాలుకచివరనుండాలి అక్షరాలా.”

అనిత ఒప్పుకోలేదు. “అదేం కాదు, కాంతా. కంఠతా పట్టడం పూర్వకాలపుపద్ధతి. అసలు అందుకే ఏషియన్ దేశాలు ఇంకా అలా వెనకబడి ఉన్నాయి. వాళ్లింకా పాతరాతియుగం పద్ధతులు పట్టుకు వేలాడబట్టే దేశం అలా ఏడుస్తోంది. చివికిపోయిన పాతపుస్తకాలే పట్టుక్కూర్చున్నారు అక్కడ. ఇక్కడ అమెరికాలో మనకి బలం ఏంటో తెలుసా? మేధ ఎక్కడుందో కనుక్కుని దాన్ని పనిలో పెట్టడం మన బలం. అదీ తెలివంటే. మేధని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం తెలివంటే.” అంది చూపుడువేలితో కణతలమీద దరువేస్తూ.

కాంతకి నోట మాట రాలేదు ఆ పిల్లమాటలతో. ముఖ్యంగా “మనబలం” అన్నమాటలో ఊపుకి. ఆవిడకి తనకీ ఆ అమ్మాయకీ  విలువల్లో తేడా ఆ క్షణంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. మనదేశంలో పంతుళ్లని పేరు పెట్టి పిలవరు. ఏం నేర్పాలో, ఎలా నేర్పాలో పిల్లలు పంతుళ్లకి చెప్పరు. ఆవిడకి తెలిసిన సంస్కృతిలో జ్ఞానం కలవారు పంతుళ్లు. పిల్లలధర్మం పంతుళ్లు చెప్పింది వినడం, అర్థం చేసుకోడం, ఇచ్చిన హెంవర్క్ చెయ్యడం … ప్రశ్నలు ఆ తరవాత నెమ్మదిమీద, బాగా ఆలోచించుకున్నమీదట వస్తాయి కానీ కానీ నేర్చుకోడం వాదనలతో మొదలు కాదు.

కొన్ని క్షణాలు పట్టింది జవాబు చెప్పడానికి. “నువ్వు చెప్పింది నిజమే మామూలుగా నేర్చుకునే విషయంలో. కానీ కొన్ని విద్యలు నేర్చుకున్నప్పుడు వాటిమీద గట్టిపట్టు సాధించాలి. వాటిని నిజంగా వాడుకోవాలంటే.  అలాటి నేర్పుల్లో భాష ఒకటి.”

అనితకి నమ్మకం కలగలేదు. “నాకదేం అక్కర్లేదు. నేను కుప్పల్తిప్పలుగా సంపాదిస్తాను. నాలుగుడబ్బులు పారేస్తే అనువాదాలు చేసేవాళ్లెవరో ఒకరు దొరక్కపోరు. ప్రస్తుతం ఇక్కడ నాక్కావలసిందల్లా ఓ C ఈ రెండోభాష requirement దాటడానికి.” అంది.

000

తనకి సి వస్తే చాలని అనిత ప్రకటించేక, క్లాసు నడపడం దినదినగండం అయిపోయింది.

“నీ హోంవర్క్ ఏదీ?

“సారీ. చెయ్యలేదు. వేరే పని తగిలింది.”

“ఏమయింది?”

“నా స్నేహితుడికుక్కకి ఒంట్లో బావులేదు. డాక్టరుదగ్గరికి తీసుకెళ్లేను.”

“నీస్నేహితుడే ఎందుకు తీసుకెళ్లలేదు?”

“అతనికి కెమిస్ట్రీ లాబ్ ఉండింది.”

మరో ప్రశ్న వెయ్యడానికి కాంతకి నోరు రాలేదు. మళ్లీ అడిగితే కుక్క నాహోంవర్క్ తినేసింది అంటుందేమోనని భయమేసింది.

000

“భూతకాలం క్రియాపదాలతో వాక్యాలు రాయమన్నాను. రాసేవా?”

“భవిష్యత్తులో రాస్తాను.”

మరోరోజు కొన్ని మాటలు చెప్పి, వాటితో చిన్నకథ రాసుకురమ్మంది.

మర్నాడు అనిత తీసుకొచ్చిన కథలో తను ఇచ్చినమాటలు లేవు. ఇంటర్నెట్‌లో కథ ఒకటి కాపీ చేసుకొచ్చింది! అది ప్లేజియారిజం అనీ, ఈమాట ఛైర్‌కి తెలిస్తే, ఆ పిల్ల గ్రేడు యఫ్ అవుతుందనీ నిజంగా ఆ అమ్మాయికి తెలీదా? ఇది తనకి పరీక్షా? – కాంత ఓపిగ్గా ఆమాట వివరించడానికి ప్రయత్నిస్తే, అనిత మూతి ముడుచుకుని, “నేనే రాసేను. మీరు నన్ను నమ్మకపోవడం మర్యాద కాదు” అంది.

కాంతకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇంతబతుకూ బతికి ఇంటెనక చచ్చినట్టు “మర్యాదలగురించి నీదగ్గరా నేర్చుకోవాలి?” అనుకుంది మనసులో.

000

“ఇది కాదు నేను రాయమని చెప్పింది. నిన్నటిపాఠంలో ఇచ్చిన కొత్తమాటలతో వాక్యాలు రాయమన్నాను.”

“నాకు ఆమాటలతో వాక్యాలు తోచలేదు. అంచేత కర్వ్ విసిరితే … ”

ఇలా నువ్వా-నేనా కుస్తీపట్లతో రోజులు జరుగుతుండగానే కథ మరోమలుపు తిరిగింది.

“వచ్చే సెమెస్టరు నేను ఒక్కదాన్నే ఉంటాను క్లాసులో. ఇదంతా నేర్చుకోడానికి కావలసినంత టైము,” అంది అనిత, వాలుకంట ఫాన్ వేపు చూపు విసిరి.

ఫాన్ ఇకిలించేడు. కేతిగాడూ, బంగారక్కా అనుకుంది కాంత.

మరోరోజు మళ్లీ “డబ్బిచ్చుకుంటున్నది నేనూ,” అంది అనిత క్లాసులో. చూడగా చూడగా ఆపిల్ల నిజ అమెరికనులని తలదన్నేలా ఉంది.

ఆ మూడు ముక్కల్లో అంతరార్థం తెలిస్తూనే ఉంది. వచ్చేయేడు అనిత ఈక్లాసు తీసుకోకపోతే, క్లాసుండదు. తనకి ఉద్యోగం ఉండదు. పళ్లు గిట్ట కరిచి, అప్పటికి ఓర్చుకుంది కానీ మనసులో మండిపడుతోంది. ఈపిల్ల ఆకతాయితనం సహించే ఓపిక తగ్గిపోతోంది. అక్కడికీ, ఓపినంత శాంతం మొహాన అద్దుకుని, స్వరం బాగా తగ్గించి అత్యంత మర్యాదతో చెప్పి చూసింది భాషతాలూకు ప్రాథమిక అవగాహన ఉండడం ఎంత అవసరమో. ఏభాషకైనా ముందు దాని నిర్మాణక్రమం తెలియాలి. అందులో షార్ట్ కట్స్ లేవు. తెలిస్తే తెలిసినట్టూ, లేకపోతే లేదు. అంతే.

000

మూర్తితో చెప్పింది కాంత క్లాసులో అనితవాలకం. మూర్తి చప్పరించేసి, “పోనిద్దూ” అన్నాడు. అతను అంత తేలిగ్గా తనమాట తీసిపారేయడం బాగులేదు. ఆవిడకి తనేదైనా తలబెడితే, ఫలితాలు కనిపించాలి. ఫలితాలు అన్నమాట అనిత పదకోశంలో లేదు. మ్.. ఉంది కానీ అది కాంత వివరణలోకి పట్టేది కాదు. అనిత ఆలోచనల్లో ఉన్న ఫలితాలు వేరు. ఇదంతా కాంత అతనికి వివరించబోయింది..

మూర్తి అంతా విని, “చూడు. నువ్వు టీచరువి. నువ్వు తయారు చేసిన కోర్స్ కంటెంటు ఫాలో అయి తీరాలని గట్టిగా చెప్పు,” అన్నాడు.

“చెప్పేను అన్ని రకాలుగానూ. వినడంలేదు. పట్టపగ్గాల్లేకుండా పేట్రేగిపోతోంది.”

“చూడు, కాంతా. నువ్వొకటి అర్థం చేసుకోవాలి. ఇది అమెరికా. వీళ్లధోరణి వేరు. ఇక్కడ పెరిగిన మన పిల్లలధోరణి వేరు. ఇక్కడి పద్ధతులు వేరు. నువ్వేదో మనూళ్లో ఉన్నట్టు పాఠాలు చెప్తానంటే కుదర్దు. వాస్తవం ఆలోచించు. అనితకి కావలసిందల్లా satisfying the second language requirement. అంతకంటే ఎక్కువ మనం ఆశించలేం ఆపిల్లదగ్గర్నుంచీ. నాకు తెలుసు ఏ బయాలజీ క్లాసులోనో అయితే ఇలాటి ఆటలు కుదరవు. ఆ అమ్మాయి ఆడదు. ఈదేశంలో వాళ్లకి వాళ్ల ప్రయారిటీస్ తెలుసు. నువ్వు దీన్ని పట్టించుకో నక్కర్లేదు. నిజానికి తెలుగు నువ్వే కాదు మరోళ్లు చెప్పినా ఇంతే. ఆ అమ్మాయి తత్త్వం అదీ,“ అన్నాడు నచ్చచెబుతూ.

000

మిడ్ టెర్మ్ పరీక్షలు. రాబోయే శుక్రవారం పరీక్ష అనీ, గత నాలుగువారాల్లో చెప్పినపాఠాలు చదవమని చెప్పింది కాంత. ఇంకా పరీక్షలో ఎన్ని ప్రశ్నలు, ఎలాటి ప్రశ్నలు, ఎన్నిటికి జవాబు ఇవ్వాలి కనీసధర్మంగా – దాదాపు గంటసేపు వివరించింది. ఉదాహరణలు కూడా ఇచ్చింది.

ఎంత చెప్పినా, అనితకి ఏదో ఒక అడ్డుపుల్ల వెయ్యకపోతే తోచదు. “ఓపెన్ బుక్ చెయ్యండి,” అంది.

సరేనంది కాంత ఈపిల్లకి ఓపెనయినా, క్లోజుడు అయినా ఒకటే అనుకుని.

శుక్రవారం వచ్చింది. కాంత పరీక్షాపత్రం ఇచ్చింది. ముగ్గురూ పుస్తకాలు తెరిచారు. అనిత పుస్తకం పేజీలు తిరగేస్తోంది కానీ తాను చెప్పినపాఠందగ్గర కాదు. రెండు నిముషాలు చూసి విసుగేసి, దగ్గరికెళ్లి, చెప్పింది, “ఈపాఠం కాదు.” అని.

000

రాత్రి భోజనాలయేక, కాంత పరీక్ష కాయితాలు ముందేసుక్కూచుంది. అనిత “సి” తప్ప మరో గ్రేడు పుచ్చుకోను గాక పుచ్చుకోను  అంటూ పంతం పట్టుక్కూచున్నట్టుంది పేపరు చూస్తే. కావాలనే తప్ప అన్ని తప్పులు ఎవరూ చెయ్యలేరు. సగానికి సగం ఇంగ్లీషు పదాలే రాసింది. ఆఖరికి ప్రశ్నల్లో ఉన్న తెలుగుమాటలకి కూడా ఇంగ్లీషు మాటలే రాసింది. మిగతా రాసినమాటలు తప్పులతడకలు. కనీసం ప్రశ్నల్లో ఉన్న తెలుగుమాటలయినా కాపీ చెయ్యొచ్చు కదా. ఎలా చూసినా పొగరు అనే అనిపించింది కాంతకి ఆపిల్లతీరు.

ఫాన్ సంగతి వేరు. అతనికి ఈదేశం వచ్చిందగ్గర్నుంచీ యుద్ధమే. ఫాన్‌ పదకోశంలో నిత్యజీవితంలో వాడుకునే సాధారణపదాలున్నాయి. విజయవాడ వీధుల్లో బతుకు వెళ్లదీసుకునే ఏ పిల్లవాడికైనా తేలిగ్గా పట్టుబడే మాటకారితనం ఉంది. చదవనూ, రాయనూ వస్తుంది కాస్త పాటు పడితే. కానీ, అతను నేర్చిన పాఠాల్లో పాటు పడడం అన్నది లేదు. దానికి తోడు అనిత పదే పదే చెబుతోంది, “What is important is not working hard but working smart” అని. అంచేత అతను వర్కింగ్ స్మార్ట్‌ కి సిద్ధం అయేడు.

“మీరు చాలా అందంగా ఉన్నారు,” అన్నాడు కాంతతో ఒకరోజు.

మర్నాడు చాక్లెట్ తెచ్చి ఇచ్చేడు ఆవిడకి. ఇంకోరోజు ఒక రోజాపువ్వు. మరోరోజు “సినిమాకి వస్తారా?” అని అడిగేడు. ఇంకా తను చదువుతున్న అన్ని క్లాసులకీ ఆవిడే టీచరయితే ఎంతో బాగుండు అంటూ తన రహస్య కోరిక కూడా వెలిబుచ్చేడు.

అతనిధోరణి కాంతకి మొదట ఇబ్బందిగా ఉండి, రాను రాను భరించడం కష్టమయే స్థాయికి చేరుకుంది, అతను చదువుమీద ధ్యాస పెట్టాలనీ, అతను తనయందు చూపుతున్న ప్రత్యేకశ్రధ్ధ అనుచితమనీ చెప్పింది. ఆవిడ హెచ్చరిస్తున్నకొద్దీ అతను పెచ్చు రేగిపోయేడు.

అలాటిరోజుల్లోనే మరో ఉపద్రవం వచ్చిపడింది అకస్మాత్తుగా.

ఆరోజు సాయంత్రం మూర్తి ఆలస్యంగా ఇంటికొచ్చేడు. మామూలుగానే ఇంట్లో అడుగెట్టినా, వదనకమలం మాత్రం ముడుచుకునుంది.

“ఏమయింది. అలా వున్నావేం?” అంది కాంత.

“ఏం లేదు. ఎలా వున్నాను?”

“ఏమయిందో చెప్పరాదా?”

“ఏంలేదన్నానా. ఏదో అంటూ ఉంటారు. నువ్వేం పట్టించుకోకు.”

“ఎవరు ఏమిటి అంటున్నారో తెలిస్తే కదా నేను ఏమిటి పట్టించుకోనక్కర్లేదో తెలిసేది. ఈ చిందులు మానేసి అసలు సంగతి చెప్పరాదూ?”

“చెప్తున్నా కదా పెద్దవిషయం కాదని. విద్యార్థులు వాళ్ల చిరాకులన్నీ టీచర్లమీద రుద్దడం మామూలే.”

“చ్ఛట్. అసలుసంగతేమిటంటే?”

“క్లాసులో ఇతరటీచర్లగురించి ఏమయినా అనడం బాగుండదు. హేస్టింగ్స్ టీచింగ్ గురించి నువ్వేదో అన్నావన్నాడు నొచ్చుకుంటూ.”

“ఏమిటీ?” కాంతం ఎగిరిపడింది కూర్చున్న చోటే. “ఎవరన్నారామాట? నేనెందుకంటాను సాటి టీచరుగురించి కానీ మరొకరిని కానీ…. ” ఆవిడకి ఆవేశంతో ఆపైన నోట మాట రాలేదు.

“హుమ్. ఎవరో చెప్పినట్టే ఉంది ఆయనకి నువ్వేదో అన్నావని. నేనక్కడికీ చెప్పేను నువ్వు అలా అనే మనిషివి కాదని.”

“ఏమన్నానని చెప్పేరు?”

“ఏదో … ఈ చెత్త వ్యాకరణం ఎవరు నేర్పేరు అనో … ఏదో అలాటిదే… జాన్ నాకు అట్టే వివరాలు ఇవ్వలేదు కానీ మరొక ప్రొఫెసరుగురించి క్లాసులో మాటాడకూడదు అన్నాడు.”

“అది శుద్ధ అబద్ధం.”

“సరేలే. క్లాసులో మరో ప్రొఫెసరుమాట తేకు.”

“అంటే … నువ్వు కూడా నేనాయన్ని ఏదో అన్నాననే అనుకుంటున్నావా? నేనసలు అతని పేరెత్తలేదని చెప్తున్నా కదా.”

కాంతకి అంతా గందరగోళంగా ఉంది. ఎవరు చెప్పి ఉంటారు? ఎందుకు చెప్పివుంటారు ఈ పుకార్లు? అనితేమో అని అనుమానం వచ్చింది కానీ ఎలా ఋజువు చెయ్యడం?

000

ఫాన్ కి తెలుగుక్లాసులో కూర్చుంటే, విజయవాడ వీధులు గుర్తొస్తాయి. తేడా ఏమిటంటే, ఆరోజుల్లో అతను తల్లులతో తోబుట్టువులతో వరసలు కలపకుండా నాలుగుమాటలు మాటాడలేదెప్పుడూ. ఇక్కడ ఈ పంతులమ్మ చెప్పేభాష సభ్యమానవులభాష. అది ఒక బాధ. అతనికి సంబంధించింనంతవరకూ అదో చెత్తవాదన. అసలు ఈరోజుల్లో ఎవరూ అలా మాటాడ్డం లేదు. తనకి తెలుగు వచ్చు. తనకి వచ్చిన తెలుగుతో ఏ తెలుగువాడితోనైనా హాయిగా మాటాడేయగలడు.

“అయితే మరి ఈక్లాసు ఎందుకు తీసుకుంటున్నావు?”

ఫాన్ బుజాలు ఎగరేశాడు. “ఏమో. ఫన్ అని. యూ నో ఫన్, ఫాన్ … గెటిట్? హా హా.”

అతను ఈక్లాసులో అడుగెట్టడానికి మొదటికారణం మేరీ. అతను తన మాతృభాష, సంస్కృతి మరిచిపోరాదన్న సదుద్దేశంతో మేరీ అతడిని ఈక్లాసులో బలవంతంగా చేర్పించింది. మొదటిరోజు కాంతని చూసినప్పుడు ఫాన్‌కి హాయిగా అనిపించినమాట నిజమే. కానీ, ఆవిజ చదువుకోమని పట్టు బడుతుంటేనే చిరాగ్గా ఉంటోంది.

కాంతకి అలాగే ఉంది. హోంవర్క్ మాటకొస్తే, రెండుమాటలతో ముగించేస్తున్నాడు.

“రాయలేదు.”

“ఏం?”

“తెలీలేదు.”

“ఏమిటి తెలీలేదు.”

“ఈమాటలకి అర్థాలు.”

“నీకిచ్చిన ఎక్సర్సైజుకి చివర్లో కొత్తమాటలు, అర్థాలతో ఉన్నాయి. చూశావా?“

“ఓ.. ప్చ్.”

ఫాన్ కాయితంవేపు కొంచెంసేపు చూసి, “ఈమాట లేదు.” అన్నాడు.

“అది కిందటివారం ఇచ్చింది. లేదా, నీడిక్ష్నరీలో చూడొచ్చు కదా.”

ఈమధ్య కొన్ని రోజూలుగా ఫాన్ రోజూ డిక్ష్నరీ క్లాసుకి తెస్తున్నాడు. క్లాసులో ఉన్నంతసేపూ అది ఎదురుగా బల్లమీద పెట్టుకుని, ఏదో నోట్సు గిలుకుతూనే ఉంటాడు.

డిక్ష్నరీ ఇంటిదగ్గర చూసుకోమనీ, క్లాసులో పాఠాలు వినమనీ ఓరోజు హెచ్చరించింది.

“జాన్ చెప్పేరు డిక్ష్నరీ చూడమని.”

కాంతకి మూర్తి చెప్పిన సుభాషితాలు గుర్తొచ్చేయి. శాంతంగా ఉండడానికి శతవిధాల ప్రయత్నిస్తూ, “నిజమే. డిక్ష్నరీ మంచి సాధనం భాష నేర్చుకోడానికి. కానీ ముందు క్రియాపదానికి రూట్ ఏదో తెలిస్తే కానీ డిక్ష్నరీలో చూడలేవు. రూట్ ఎలా తెలుస్తుందో క్లాసులో తెలుసుకోవాలి. అంచేత నువ్వు క్లాసులో చెప్పినవి క్లాసులో వింటే, డిక్ష్నరీ ఇంటిదగ్గర చూసుకోవచ్చు” అంది

అందులో ఒక్క ముక్కయినా విన్నాడో లేదు, “వాటెవర్” అన్నాడు ఆ పుస్తకం నేలమీద పడేసి.

000

సెమెస్టరు అయిపోయింది. కాంత పరీక్షకాయితాలు ముందేసుకు కూర్చుంది. మూడు బొత్తుల్లోనూ ఒక బొత్తి ఆవిడకళ్లముందు ప్రత్యేకంగా తాండవమాడుతోంది. అది ఫాన్ జవాబుల బొత్తి. మొదట ఒక తప్పు దగ్గర చిన్న టిక్కు పెట్టింది. తరవాత రెండో తప్పు, … మూడో తప్పు … మళ్లీ వెనక్కి వెళ్లి కరెక్టు జవాబు రాసింది ఒకటి, రెండు చోట్ల. లైనుకి మూడు తప్పులు! నమ్మలేకుండా ఉంది. ఫాన్ కావాలనే గజిబిజి చేసినట్టుంది పేపరంతా. తను ఏం చేస్తుందో చూద్దామనా? అతని ఆధిక్యత నిరూపించుకోడానికా?

ఇంతకంటే పదిరెట్లు బాగా చెయ్యగలడు. ఈ పేపరు బయటి ప్రొఫెసరెవరైనా చూస్తే, సి కూడా ఇవ్వరు. కాంత ఆలోచనలో పడింది.

అతనికి తెలిసిన పదాలు, వాక్యనిర్మాణం తీసుకుంటే ఎబి ఇవ్వొచ్చు.

వ్యాకరణం చూస్తే సి కి తగును. .

క్లాసులో పొగరు చూస్తే డి ఇచ్చినా తప్పులేదు.

ఆవిడ కాయితాలు ఎదురుగా ఉన్న బల్లమీద పడేసి, కళ్లు మూసుకుంది ఈ గ్రేడింగ్‌లో factors ఆలోచిస్తూ – విద్యార్థుల attitude factor, వాళ్ల అవసరాల factor, యూనివర్సిటీలో మూర్తి position factor, సాటి ప్రొఫెసర్లలో అతని స్థానం factor, వాళ్ల సాంగత్యం నిలుపుకోవలసిన అవసరం factor, department prestige factor, bell curve factor,  తన ఉద్యోగం factor, ఆదాయం factor, అన్నిటికంటే ముఖ్యంగా వచ్చే semester enrollment factor …

కటకటా ఈ ఫ్యాక్టరులతో. తల సెక్టర్, సెక్టర్ ….ఎవరికి ఈ పరీక్ష?

“మామీ, మామీ … ..” హఠాత్తులగా తుళ్లిపడింది బాబు కేకలతో… “త్సీ .. బాబీ .. లైత్. .. బీ… తీ .. ….”

పెన్సిలుతో ఆ పేపర్లమీద వాడు గిలికిన బీ, సీ… మహోత్సాహంగా చూపిస్తున్నాడు గెంతులేస్తూ.

కాంత ఎగిరి పడి, ఒక్క ఉదుటున వాడిచేతిలోంచి పెన్సిలు లాక్కుంది, హో, హో, నో, నో, అంటూ.

ఆ తరవాత ఆ కాయితాలవేపు పరీక్షగా చూసింది. చిరునవ్వు పెదవులమీద లాస్యం చేసింది కొంటెగా.

“భలే పని చేసేవురా బంగారునాన్నా. విశ్వవిద్యాలయాలరహస్యం బోధించిన బాలకృష్ణుడివి!” అంటూ వాణ్ణి దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది ఆ తల్లి.

ఆ పూట తన రచనావిలాసంతో అమ్మని రక్షించాడని తెలీనేలేదు పాపం ఆ బాలకృష్ణుడికి!

(జూన్ 24, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “పరీక్ష”

 1. @ కొత్తపాళీ, – మాటల్లో చెప్పలేని ఒక అసంకల్పిత సందిగ్ధ ఇబ్బంది పరిస్థితిని పట్టుకోవడం – భలే వర్ణించేరండీ. నేనలా అనుకోలేదు కానీ మీరు చెప్తే అలాగే అనిపిస్తోంది. ఇందుకే వ్యాఖ్యలు కావాలంటాను. ధన్యవాదాలు.
  నా రెండుహరివిల్లులమీద కూడా మీ అభిప్రాయం వెలిబుచ్చగలరని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 2. As usual, brilliant.

  కొన్ని కొన్ని దృశ్యాల్లో ఉండే మాటల్లో చెప్పలేని ఒక అసంకల్పిత సందిగ్ధ ఇబ్బంది పరిస్థితిని పట్టుకోవడంలో చిత్రించడంలో మీకు మీరే సాటి. ఈ కథలో భార్యాభర్తల మధ్య సంభాషణగా జరిగే రెండు దృశ్యాల్లో ఈ పరిస్థితి నా కళ్ళముందు ఎవరో గొప్ప సినిమా దర్శకుడు తీసిన రీలులాగా నడిచింది చదూతుంటే.

  మెచ్చుకోండి

 3. @ రాధిక, బాగా చెప్పేవు. నేను కూడా పోస్ట్ చేస్తుంటే అనిపించింది చాలా పెద్దదయినట్టుంది, రెండుభాగాలుగా పెట్టి ఉంటే బాగుండునేమో అని. నవలకి సరిపోయే సరుకుంది. తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను. థాంక్స్.
  @భావన, – మీరేమిటో మీరెవరో మిమ్మలను మీరు పరిచయం చేసుకోవాలి కదా అంటే చాలా వరకు పిల్లల ముహాలలో కదిలే చిరు పరిహాసమైన దరహాసం – బాగా వర్ణించేరు పిల్లలస్పందన మన ఆవేదనలకి. థాంక్స్.

  మెచ్చుకోండి

 4. తెలుగు బాగా రావాలి రా అది మన మాతృ భాష అదే తెలియక పోతే మీ రూట్స్ మరేమి తెలుసుకోగలరు మీరేమిటో మీరెవరో మిమ్మలను మీరు పరిచయం చేసుకోవాలి కదా అంటే చాలా వరకు పిల్లల ముహాలలో కదిలే చిరు పరిహాసమైన దరహాసం (ఏం అనరులెండీ దేవుడీ దయ వల్ల) ఒక్క సారి గుర్తు వచ్చింది. చాలా బాగా చెప్పేరు కధ.

  మెచ్చుకోండి

 5. బావుందండి.దీన్ని కధలాకాకుండా ఏదన్నా చిన్న సైజు నవలలో ఒక అధ్యాయం లాగా పెడితే ఇంకా బావుంటుందేమో అన్న ఆలోచన వచ్చింది.మళ్ళా చాలా రోజులతరువాత కలం పట్టినట్టున్నారు కదా.ఇంక వదలక కొనసాగిస్తూ వుండండి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.