హరివిల్లులు రెండు విరిసేముందు

ఏభావం, ఏభాష – కొన్ని తెలుగులో బాగుంటాయి. కొన్ని ఇంగ్లీషులో బాగుంటాయి. కొందరికి ఇంగ్లీషులో చెప్తే ఇష్టం. కొందరికి తెలుగులో చెప్తే ఇష్టం.

 

“చూడు, చూడు, నేనేం కనుగొన్నానో“

అంటూ తెచ్చి పరిచింది మాఅమ్మాయి నాముందు

నాచిన్ననాటి ఇత్తడి బొమ్మలు

బేస్మెంట్ చీకటి కొట్ట్లో అట్టపెట్టెల్లో

ఏమూలో మూలుగుతున్న అనర్ఘ రత్నాలు

“తీసుకు పో” అన్నా.

“నాపెట్టెలో చోటులో లేదు

పోస్టులో పంపించ”మంది

“సరేన”న్నాను.

దాని సరదా చూసి

ఇనుమడించిన ఉత్సాహంతో

పాలిష్ చేయ పూనుకుంటే జరిగింది ప్రమాదం.

నా జబ్బపుష్టికో ఉత్సాహానికో తట్టుకోలేక

టుప్పున విరిగేయి నెమలితల్లి కాళ్లు రెండూ

నిలవలేక నేల కూలింది పక్షిరాజం.

అయ్యో, అయ్యో అనుకుంటూ

ఊరంతా గాలించేను వెల్డరుకోసం

రోజంతా తిరిగేను ఆ నెమలిని

దానికాళ్లమీద నిలబెట్టడానికి.

విసిగి, వేసారి, చేరుకున్నానిల్లు.

ఉసూరుమంటూ కూలబడ్డాను సోఫాలో.

మొద్దుబారిన మనసుతో.

ముఫ్పైఏళ్లుగా దాచిన పక్షి

ఇప్పుడెందుకు కనిపించాలి మాపిల్లకి?

కనిపించె బో, పోస్టులో పంపమననేల?

పోస్టులో పంపమనె బో

పాలిష్ చేయ బుద్ధి పుట్టనేల నాకు?

పుట్టెబో. నేనెందుకు హేండిల్ చేయవలె

దాన్ని అంత కేర్లెస్‌గా?.

నవనాడులూ కుంగిపోతున్నాయి గుండెల్లోంచి పాదాల్లోకి.

నిస్పృహతో నిస్సత్తువగా వెనక్కివాలి

కళ్లు తిప్పేను patio door వైపు.

అహో. ఏం చెప్పను ఆ సుందరదృశ్యం

జన్మలో కానని అత్యంత అద్భుతం!

రెండు చేతులు చాచి పుడమితల్లిని కౌగలించుకుంటున్నట్టు

వినువీధిలో ఇంద్రధనుస్సు పరిపూర్ణ అర్థచంద్ర సదృశం

ఈచివరినుండి ఆచివరికి కర్ణమూలాలకి లాగి ఎక్కుపెట్టిన శివధనుస్సులా

ఎగిరిపడుతున్న కళ్లతో గాజు తలుపు పక్కకి లాగి మళ్లీ చూశాను.

తొలివింటికి సమాంతరంగా మలి హరివిల్లు

అభయముద్ర పట్టిన సుప్రసిద్ధనాట్యకత్తెలా

నిగడదన్ని అనంతాల్లోకి విజృంభించిన రెండో హరివిల్లు

వర్ణించడానికి మాటలు లేవు.

చిత్రించడానికి చేతకానిది నా అణాకాణీ కెమెరా.

ఆక్షణాన మాయింటి అద్దాలతలుపువెనక వెల్లివిరిసిన

అనన్యసామాన్య సంభ్రమాశ్యర్యాలు గుప్పించిన సురుచిర సౌందర్యరాశిని

మీఊహకి వదిలిపెడుతున్నాను.

మీ పంచేంద్రియాలనీ, అనంతమేధోసంపత్తినీ సంధించి

వాటికి పని ఒప్పచెప్పినప్పుడు

గ్రహించగలరు అప్పటి నా అనుపమ హర్షోద్వేగాలు!

సుప్తచేతనని సైతం అలరించగల సప్తవర్ణాలు శోభాయమానం.

(జూన్ 19, 2010) .

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “హరివిల్లులు రెండు విరిసేముందు”

 1. మాలతి గారూ, చాలా రోజులకి మీ బ్లాగు దర్శనం చేస్కుంటున్నా! హరివిల్లు కవిత చాలా బాగుంది. నేను కూడా ఈమధ్య ఇలాగే ఫోటోలు తీశాను. http://madhurachitralu.blogspot.com/2010/05/blog-post_10.html వీలైతే ఓసారి చూడండి. కానీ, కవిత మాత్రం రాయలేకపోయాను మీలాగా😦
  మీ బొమ్మలు భలే బాగున్నాయి🙂

  ఇష్టం

 2. @ teresa, థాంక్సండీ మీ స్పందనకి. తెలుగు బాగుందని ఎక్కువమంది చెప్పడం నాకు సంతోషంగా ఉంది.
  @ వేదాంతం శ్రీపతిశర్మ, ధన్యవాదాలండీ మీ స్పందనకి.
  @ హను, ముందుగా కలెక్షను బాగుందన్నారు. తరవాతివాక్యం కవిత కూడా ఫరవాలేదనుకోవచ్చా. ఏమయినా ధన్యవాదాలు.🙂
  – మాలతి

  ఇష్టం

 3. ‘భాష ‘సంభాషణ బావుంది.మాటలకందని భావాలను మీ ఫొటోలలో పొందు పరచి చూడ మంటున్నారు!అవి ఇస్తున్న వ్యాఖ్యానం, ప్రక్కన ఉన్న కథనం అద్భుతం!

  Your style is brilliant!

  వేదాంతం శ్రీపతిశర్మ

  ఇష్టం

 4. రెండు వర్షన్లూ బావున్నాయండీ. నాకు మాత్రం తెలుగు కవితే ఎక్కువ నచ్చింది.

  ఇష్టం

 5. @ లలితా, మీలాగే నేను కూడా అనుకుంటాను. ఏభాషకదే. నిజమే. ఇది అనువాదం అనలేం. ఎటొచ్చీ, నా ఒరిజినల్ కనక నాయిష్టం వచ్చినట్టు మార్చకున్నాను. ఆర్ద్రత ఆంగ్లరచనలో లేకపోవడం బహుశా నాకు ఆంగ్లంమీద అంత పట్టు లేకపోవడమేమో.
  rainbows I out my window – నా టైపింగ్ పొరపాటు. rainbows in my window or rainbows I saw out my window అనో చేద్దాం అనుకుంటూ రెండు కలిపేసాను. చూపినందుకు థాంక్స్.
  మీస్పందనకి ధన్యవాదాలు

  ఇష్టం

 6. కొందరు ఎంత చక్కగా చెప్పగలరంటే ఏ భాషైనా స్పందిస్తుంది వారి భావుకతకు.

  నాకు ఆంగ్లంలో హరివిల్లు గురించి కొద్దిగా ఎక్కువ నచ్చిందనుకుంటా.
  “పాపం” అనింపించింది నెమలి బొమ్మ గురించి తెలుగులో చదువుతుంటే.
  ఆ ఆర్ద్రత ఆంగ్లంలో చదివినప్పుడు కొంచెం తక్కువగా కలిగింది.
  బహుశా ముందే విషయం తెలిసినందుకేమో మరి.
  దేనికదే ప్రత్యేకంగా రాశారు, అనువాదంలా కాకుండా, ఏ భాషలో రాసినప్పుడు ఆ భాషలోనే ఆలోచించినట్లు.
  ఇది అర్థం కాలేదు:
  “rainbows I out my window”

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s