ఊసుపోక – కలలు, నిజాలు

(ఎన్నెమ్మ కతలు 55)

“అరెరే. మంచికల, తెలివొచ్చీసింది,” అంటుంది పాప అర్థరాత్రివేళ లేచి కూచుని.

“నీకు తెలివి రావడమేమిటే. నోర్మూసుకుని పడుకోక,” అంటుంది అక్క తన కల కరిగిపోయిందన్న బాధతో. నేను సన్నగా నవ్వుకుంటాను – నాకలల్లోంచి. కలలు కలలే అని తెలిసినా ఎందుకో అభిమానపుత్రుణ్ణి ఆదరించినట్టు.

నిజానికి స్వప్నసుఖం పసిపిల్లల జన్మహక్కు. చిన్నతనంలో వెన్నెల వెండితీగెలతో మల్లిపందిరి అల్లినవేళ ఏ అమ్మమ్మో కథలు చెప్తుంటే, అవి వట్టి కలలే అన్న బాధ ఉండదు. చెదిరిపోతాయన్న చింత ఉండదు.

నాచిన్నతనం తలుచుకుని విచారిస్తాను నేను. “కలలే” అయినా అప్పటికలలు ఎంత బాగుండేవి అని. ఏ కల వస్తుందా అనుకుంటూ పడుకునేదాన్ని. ఏం కల వచ్చిందా అనుకుంటూ మేలుకునేదాన్ని. చిత్రం ఏమిటంటే ఇంతవరకూ మధురస్వప్నం.

అవన్నీ పిల్లలకథలని ఓరోజు గుర్తిస్తాం. ఏడు చేపలకథ బొత్తిగా పాతయిపోతుంది. పిల్లలు కనిపిస్తే, “చిన్నపిల్లలు వాళ్లకేం తెలసు” అని జాలిపడే దృష్టి అలవడుతుంది. భవిష్యత్తు బంగారం పంటగా కనిపిస్తుంది. నా అంతదాన్ని నేను తప్ప మరొకళ్లు లేరన్న తత్త్వం బాగా తలకెక్కుతుంది. అప్పుడు ఆలోచనపేరున వేళ కాని వేళ తలా తోకా లేని కలలొస్తాయి. ఆకలల తమాషా అనుభవైకవేద్యం.

చెంపకి చేరెడు కళ్లు నిండుగా కనిపిస్తుంటాయి. కాళ్ళూ, చేతులూ స్వాధీనంలో ఉంటాయి. ఎదుటిమనిషి మాటలు వినిపిస్తూ ఉంటాయి. గిల్లితే నొప్పి తెలుస్తుంది. సూర్యుడూ, ఆఫీసరూ, ఇంటాయనా ఉరిమి చూస్తూ ఉంటారు చెయ్యవలసినపని గుఱించి. అట్టి దివ్యముహూర్తంలో కల కనిపిస్తుంది.

మగాళ్లూ కలగంటారు. ఆఫీసరుచేత చీవాఠ్లు తినేవాళ్ళు ఆయన్ని చావగొట్టినట్టూ, యస్సెల్సీ పరీక్షో కేంద్రంగా పెట్టుకుని ప్రదక్షిణలు చేసేవాళ్లు స్కాలర్షిప్పుతో ఫారిన్ వెళ్లినట్టూ, డిస్ట్రిక్ట్ కలెక్టరయినట్టూ, … రకరకాలుగా. కాని వాళ్లకీ మనకీ భేదం ఏమిటంటే వాళ్ళకి ఆఫీసుటైంలో కల గనిడానికి పర్మిషన్ ఉండదు. దొంగసారా కాచినట్టు పని రహస్యంగా మొదలు పెట్టినా రచ్చకెక్కి ఆఫీసుకాగితాలమీదకెక్కి నానా ఆగం చేస్తుంది. పాపం మగజాతి అనాలనిపిస్తుంది. ఆడవాళ్ళవిషయం అందుకు పూర్తిగా భిన్నం. ఎసరుగిన్నె పొయ్యిమీదికెక్కించి ఆలోచనల్లో పడి అన్నం మాడ్చిన అన్నులమిన్నలు లేరని కాదు కానీ – బహు తక్కువ. మాబాబు కలెక్టరుగరీ చేయడా అని పాడుకుంటూ పని చేసుకుంటూ పోతుంది స్త్రీ యంత్రవతుగా. బ్రహ్మదేముడు గానీ ఆడదాన్ని తయారు చేసి వంటింట్లో కలలు కంటూ పడి ఉండు అని పారేశాడేమో మరి! క్షమించండి. ఇప్పుడు మనకి చాలా శాఖలలో ప్రవేశం వచ్చింది. అంగీకరిస్తున్నాను. కానీ తత్ఫలితంగా కలగనడంలో కూడా అన్ని శాఖలుద్భవించేయి.

మొన్నీమధ్య ఒకమ్మాయి వచ్చింది నాదగ్గిరికి. ఆ అమ్మాయికి కథలపిచ్చి. అంటే రాసే పిచ్చి. ఏ ఎనిమిదో ఏటో మొదలు పెట్టింది. తను వ్రాసినట్టు, అవి ప్రచురింపబడినట్టు, పాఠకులు అభినందనసతంబుల అంబులతో ఆవిడ ఇంటిగోడలు కూలిపోయినట్టు, సంపాదకుల ప్రార్థనలలో ఆవిడ ములిగీత కొడుతున్నట్టు …  … నేను చెప్పాను అది కల సుమా అని. కలగనడం సుళువే కానీ నిజం కనడం సుళువు కాదు. ఇదంతా మాయాజగత్తు అని ఎంతోమంది బొప్పి కట్టించుకున్న పెద్దమనుషులు అంటున్నారు.”

ఆఅమ్మాయికి నామాటలు రుచించలేదు. పైగా తను కూడా చాలా నీతిపాఠాలు చదివేనంది. ఆరంభించినకార్యం ఎక్కు పెట్టిన బాణం ఒకటేనంది. పైగా వాళ్లతాతగారు చెప్పారుట – ఎవరైనా ఒకపని చెయ్యదల్చుకుంటే దానిక విఘ్నం తలపెట్టే దుర్మార్గులు పలువురు ఉంటారట. “మీరు నన్ను ఇవాళ ఇలా తీసి పారేస్తున్నారు కానీ ఏదో ఒక రోజు మీర గర్వంగా చెప్పుకుంటారు – ఫలానా రచయిత్రిని నాకు తెలుసు అని”. అంది.

ఇన్నీ అయేక, కొంచెం సిగ్గుపడుతూ “మీతో చెప్పేను కానీ ఇంకెవరితోనూ చెప్పలేదీ సంగతి” .

నేను వెంటనే అన్నాను, “మంచిపని చేశావు. ఇహమీద కూడా ఎవరితోనూ అనకు.”

ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదు. కోపంగా వెళ్ళిపోయింది. వెర్రి ముదిరింది కాబోలు అని జాలి పడ్డాను. ఈరకం జబ్బు ఎంత త్వరగా ముదిరితే అంత త్వరగా కుదురుతుందని తృప్తి పడ్డాను. నాకు ప్రత్యేకించి ఈ అమ్మాయిమీద జాలి కలగడానికి ఒక కారణం ఉంది. సరిగ్గా ఆఅమ్మాయంతే ఉన్నప్పుడు ఒకసారి నేను ఇలాగే ఒకళ్ళదగ్గిరికి వెళ్ళాను. ఆఅమ్మాయిలాగే నాకూ ఎనిమిదో ఏట కథలు చదివే పిచ్చి, తరవాత రాసే పిచ్చి ఉండేది. ఏ పత్రికలోనైనా సరే “రచయితలకు” అన్న శీర్షిక కుమ్మరిపురుగులా నాతలలో తొలిచేసేది. పుస్తకం ముందుంచుకుని, అరమోడ్పు కన్నులతో, అరచేతిలో చుబుకంతో అలా చూస్తూ ఉంటే అది ప్ర్తోకించి నాకోసమే అనిపించింది. చూస్తూ ఉండగా ఉండగా కొంచెంసేపటికి మాప్ప చెప్పే తెలివి వొచ్చింది. ఇన్ని కథలు చదివేను కదా నేనొకటి రాయలేనా అనిపించింది. ఆరోజే నేనొక మహారచయిత్రిని – పత్రికా సంపాదకురాలిని – ప్రముఖ జాతీయ పత్రికాసంస్థాపకురాలిని కావాలని కల కాదు, దృఢనిశ్చయం చేసుకున్నాను.

కథలు రాయడం మొదలు పెట్టాను. ఎందుకైనా మంచిదని స్కూలు మేగజైనుకిచ్చాను. కొద్దిపాటి మార్పులతో వేసుకున్నారు. మళ్ళీ రాసేను. … సరేలే, మళ్లీ వ్రాశావు, మళ్ళీ వేసుకున్నారు. మళ్ళీ వ్రాశావు, మళ్ళీ వేసుకున్నారు … అంతేనా? అని విసుక్కోకండి. ఒకటి, రెండు, school మేగజైనులో పడ్డాక, ఆ పత్రికప్రమాణం నారచనలకి చాలదనిపించింది. పత్రికలకి పంపడం మొదలు పెట్టాను త్రిప్పి పంపుటకు కావలసిన ష్టాంపులతో సహా. అది అనేకవిధాలుగా నష్టంగా కనిపించింది. ఇంట్లో అందరికీ నేను ఒక కాబోయే రచయిత్రినని తెలిసిపోయింది. దాంతో ఏదైనా డబ్బు అడిగితే – నీకథకి వస్తుందిలే. అనేవారు. కవులు బీదవాళ్ళు, వాళ్ళదగ్గిర డబ్బుండదుని చెప్పేవారు. ఈబాధ పడలేక ష్టాంపులు పెట్టడం మానేశాను. కథలు వ్రాయడం మానలేదు.

పిల్లలపత్రికలకి రాస్తే పేరా వూరా అనిపించింది. పత్రికల్లో కథలపేర్లూ, రచయితలపేర్లూ లిస్టు తయారు చేశాను. మచ్చుకి కొందరు అభిమానరచయిత్రులని కూడా గుర్తించుకున్నాను. హార్డీదగ్గిర్నుంచీ చలంవరకూ మొదట ఎలా నిరాకరింపబడినదీ – కథలు తిరిగివస్తే. ఎంతోమంది గొప్పవాళ్ళవి మొదట ఇలాగే నిరాకరింపబడినవి అని నెమరువేసుకునేదాన్ని. నారచనలలో ప్రత్యేకతల్ని గుర్తించని సంపాదకుల్ని తలుచుకు జాలిపడేదాన్ని.

ఆలోచనల్లో పడి కథ పంపినరోజున అన్నం సయించేది కాదు. తల దువ్వుకోడానికీ, పౌడరేసుకోడానికీ, గోళ్ళకి రంగు వేసుకోడానికీ టైము ఉండేది కాదు. చూపు కూడా మారినట్టు మాయింట్లో వాళ్ళు అనేవాళ్లు. “అలాగున్నావేం? ఒంట్లో బాగులేదా?” అనేది అమ్మ. నాకు నవ్వొచ్చేది. “ఏం లేదు” అనేసి నేను వెళ్ళిపోయేదాన్ని.

పత్రికలో నాకథ పడ్డప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తే మరీ నవ్వుగా. ఉండేది. “అలా వట్టినే నవ్వుతామేటి? మతి గానీ భ్రమించలేదు కదా” అని అమ్మ భయపడితే నాకు నవ్వు ఆగేది కాదు. కానీ, దానితోపాటు నాకు నిజంగా మతి భ్రమ కలిగిందేమోనని అనుకుంటారేమోనన్న భయంతో ఏకాంతంలో కూచుంటాను. వీళ్ళతో పోచికోలు కబుర్లకి దిగేకన్నా ఒక్కదాన్నీ కూచుంటే మరో రెండు కథలు ఆలోచించొచ్చు కదా అని.

ఆరోజుల్లోనే ఒకసారి ఒ పల్లెసీమనుంచి మామేనత్త ఒకావిడ వచ్చింది. ఆవిడకి వైద్యం వచ్చు. రాగానే బాగానే మాటాడింది. కానీ నాకు రెండోరోజు తెలిసింది ఆవిడ వచ్చినకారణం. నావెనక వెనకే తిరగడం మొదలుపెట్టింది. నేను అంతకంటే తెలివిగా తప్పించుకు తిరిగేదాన్ని. రెండు రోజులు చూసింది. మూడోరోజు ఎవరూ లేకుండా చూసి, “బెంగ పెట్టుకున్నావా?” అనడిగింది.

“బెంగా?” అన్నాను ఆశ్చర్యంగా.

ఆవిడ నవ్వేసి, వంటింటినించి వస్తున్న అమ్మతో, “ఈవయసులో ఆడపిల్లలు అంతే. ఎవళ్లో ఒకడ్ని చూసి …” అంది.

“హారి బాబోయ్,” అన్నాను గుండె గొంతుకలోకి వస్తే. “అందుకే నీవైద్యం నాటువైద్యం అత్తయ్యా” అనబోయి చప్పున నాలుక్కొరుక్కున్నాను.

“అంతేనంటారా?” అంది అమ్మ అనుమానంగా చూస్తూ.

ఖరీదయిన టానిక్కులూ, ఘనమైన వైద్యుడూ ఉంటే తప్ప నారోగం కుదరదని మా అమ్మ అభిప్రాయమని నాకప్పుడు తెలిసింది.

“అంతేనమ్మా. చూడు. ఆమాట అనేసరికే ఎలా ఎగిరిపడిందో?” అంది మా నాటు డాక్టరమ్మ.

“చచ్చితిని” అని మనసులోనే అనుకుని, మాఅమ్మ వెళ్ళిపోయేదాకా అగి, మాఅత్తతో చెప్పాను నిజం సంగతి. నువ్వు ఇప్పుడు ఇచ్చిన సలహా విత్‌డ్రా చేసుకుంటే ఏదైనా ఒకకథలో నిన్ను హీరోయిన్‌ని చేస్తానని బతిమాలుకున్నాను. మాఅత్తయ్య చెప్పినట్టు నారోగం ఆమాటలతో కుదిరింది. మనసులో ఏమాలోచించినా, పైకి మటుకు కాస్త జాగ్రత్తగా మెలగడం అలవాటయింది.

కథలు ప్రచురించేమాట ఎలా ఉన్నా, నాకు ఏళ్ళు వస్తున్నకొద్దీ దృష్టి పెద్ద పత్రికలమీదకి పోయేది. ఆరోజుల్లోనే రేడియోమీదకి కూడా సారించాను దృష్టి. పొద్దున్న ప్రసారవిశేషాలు దగ్గిర వినడం మొదలుపెడితే, రాత్రి ఆఖరిప్రసారం సమాప్తమయిందాకా రేడియో ఆన్‌మీదే ఉండేది. ప్రసారసమయాల్లో బ్రహ్మాదులు పిలిచినా పలకను. రేడియోలో ఎవరికార్యక్రమం ప్రసారం చేస్తున్నా అది నాదే అయినట్టు ఊహించుకునేదాన్ని. నాటకం వస్తే నాటకం, పాట వస్తే పాట. ఎవరైనా పాడుతుంటే కనీసం నాకు భగవంతుడు కంఠం ఇచ్చినా బాగుండును కదా అనుకునేదాన్ని. పోనీ ఏ వీణో ప్రాక్టీసు చేస్తే వచ్చేవిద్యే కదా అనిపించేది. కానీ ఏం లాభం? ముఖ్యమైనది కథారచన కదా.

అప్పుడే నాన్నగారికి బెజవాడ ట్రాన్స్‌ఫరయిందేమో నాసంతోషానికి పట్టపగ్గాల్లేవు. రేడియోవాళ్ళు వాన్ పంపించి నన్ను ప్రత్యేకంగా పిలిపిస్తారనుకున్నాను. పేపరులో, Broadcasting programmeలో వాణిలో బాక్స్ కట్టి నాపేరు వేసి, ఫలానా వారికథ వినండి, మీ అభిప్రాయాలివ్వండి అని అడిగితే ఎంత బాగుంటుంది అనిపించింది. రోజూ రేడియో స్టేషన్ చూసుకుంటూ కాలేజీకి వెళ్లేదాన్ని. ఆ ప్రాంతంలో తిరిగే మనుషులందరూ గేటుదగ్గిర గూర్ఖాదగ్గిర్నుంచీ అందరూ అదృష్టవంతులు, నేనొక్కదాన్నే అదృష్టహీనురాలిని అనుకునేదాన్ని. చిన్నపిల్లలప్రోగ్రాములు వింటుంటే వాళ్ళవయసు ఊహించుకుని నావయసుతో పోల్చుకుని అనుకునేదాన్ని – నాకంటె వాళ్ళే నయం అని. కానియ్‌లే, కాలం కలిసిరాకపోతుందా, నేనూ రేడియో రచయిత్రిని కాకపోతానా అనుకుని నన్ను నేను ఊరడించుకునేదాన్ని.

నేనిలా కలలు కలలుగా ఆశలు మేస్తూనే ఉంటాను. ఇంటికి వచ్చేపోయే చుట్టాలతోనూ, పరిచయస్థులతోనూ అమ్మా, అక్కయ్యలూ, అన్నయ్యలూ, ఫలానా కథలు వ్రాస్తున్న అమ్మాయి మాఅమ్మాయే, మా చెల్లెలే అని చెబుతూనే ఉంటారు. ఫలానాకథ నాది కనక నాకు తెలిసినవాళ్ళు చదువుతారు. అలా కాకుండా ఫలానా అమ్మాయి ఎవరూ అంటూ ప్రజలు వెతుక్కుంటూ వస్తారని ఆశిస్తూ ఉంటాను. ఇదుగో నీకథలు అంతర్జాతీయఖ్యాతినార్జించుకునే రాజు రాబోవడంలేదని రిజిష్టర్ నోటీసు … రిజిష్టర్ చేసి తిరగ్గొట్టినకథ – అంటూ మాతమ్ముడొస్తాడు. కల మరోమాటు చెదిరిపోతుంది. – వెలిసిన కనకాంబరంలాంటి నవ్వు నవ్వుతాను. మనసు కలుక్కుమంటుంది. కాని ఏం లాభం?

రేపన్నది ఉన్నన్నాళ్ళూ రాత్రి రాకమానదు. పడుకున్నాక కలలు రాక తప్పదు. ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదూ! ఒక చిన్నపత్రికలో నయాపైస విలువగల ప్రూఫ్ రీడర్!

తాజాకలం. వారంరోజులుగా పనికిరాని కాయితాలూ, అవసరం తీరిపోయిన పుస్తకాలూ ఏరి పారేసే ఉద్యమం మొదలెట్టేను. అలా చూస్తుంటే, నేను 26 నవంబరు 1959 తేదీన రాసిన ఈ కత కళ్ళబడింది.

నేనిప్పుడు రాస్తున్న ఊసుపోక శైలిలోనే ఇది ఉంది కనక ఇదే నామొదటి ఊసుపోక అనుకోవచ్చు :). ఇది అముద్రితం ఇంతవరకూ.

చదువుతుంటే నాకు నవ్వొచ్చింది. మీరు కూడా నవ్వుకుంటారని ఇప్పుడిక్కడ ముద్రిస్తున్నాను. తుడుపులూ, కొట్టివేతలూ తీసేసి, మిగిలింది మాత్రం, వ్యాకరణదోషాలూ, అచ్చుతప్పులూ అన్నీ ఉన్నవున్నట్టు!

(జూలై 8, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – కలలు, నిజాలు”

  1. @ మధురవాణి, నాక్కూడా ఆశ్చర్యమే. ధనకనకవస్తువాహనాలు పోయేయి కానీ ఈ చిత్తు కాగితాలు ఉండిపోయేయి. నువ్వు నవ్వుకున్న సందర్భం ఏమై ఉంటుందా అని అలోచిస్తే నాక్కూడా నవ్వొస్తోంది. :p. ఇంకా ఒకటో రెండో అముద్రితాలు ఉన్నట్టున్నాయి. చూసి పెడతాను. ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. అంటే ఇప్పుడు మీర్రాసినదంతా అప్పుడు రాసిందేనా!? చాలా చాలా బాగుంది. అక్కడక్కడా నేను ఉలిక్కిపడ్డాను. 😉 నవ్వుకున్నాను, భలే బాగా రాశారు కదా అనుకున్నాను. 🙂 1959 లో రాసింది ఇప్పటిదాకా భద్రంగా ఉందా మీ దగ్గర.. Super! ఇంకా ఏవైనా అముద్రితాలుంటే అవన్నీ కూడా మాకు చూపించండి.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s