అవ్యక్త మధురం

సాయంత్రం నాలుగయింది. పుస్తకం మూసి కిటికీవేపు చూసింది. బయట మంచు సన్నగా పడుతోంది. రాత్రి పడ్డ మంచు తియ్యడానికి ఇంకా సిటీ బండి రాలేదు. వాళ్ళకి ఈ చిన్నవీధులంటే నిరసన, సవతిపిల్లలనుకుంటారో ఏమో, ఖర్మ! రాత్రి బాగానే పడినట్టుంది. సిటీ బళ్ళన్నీ పెద్దవీధులమీద పడ్డాయి.

కిటికీకి దగ్గరగా వెళ్లి మరోసారి తొంగి చూసింది. రోజూ ఇదే సమయానికి ఆవిడ వీధిలో కనిపిస్తుంది పడమటిదిక్కుగా నడుస్తూ. ఎండలో వానలో చలిలో గాలిలో … ఏరోజూ ఆవిడ మానలేదు. ఏడాదిగా చూస్తోంది ఆవిడని. ఎవరై ఉంటుందా అన్న జిజ్ఞాసో, కుతూహలమో మొదలయింది నెలరోజులుగా.

తనున్నది చిన్నవీధి. ఈవీధిలోకి అట్టే కార్లు రావు తమఇల్లు దాటి ఉన్న ఎనిమిదిళ్ళవాళ్లు తప్పిస్తే. వీధిలో మనిషిజాడ కనిపించడమంటే గగనకుసుమమే. ఎవరైనా రాక్షసుడిటు వస్తే, “ఇది యేమి ఎచటను నరవాసన లేదు” అని విస్తుపోవాలి. అటు దక్షిణాన ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలున్నట్టుంది. ఐదారేళ్లవాళ్లు. సాధారణంగా తల్లో తండ్రో వాళ్ళని కార్లో పడేసుకుని తీసుకెళ్లడం, తీసుకురావడం … అంతే. అమావాస్యకో పౌర్ణానికో ఓమారు మంచి సెగలు గక్కే ఎండవేళ మరే దిక్కూ తోచక సైకిళ్లేసుకుని తిరుగుతూ కనిపిస్తారు. … అంతే… అంతకుమించి మనిషిజాడ కనిపించదు. ఈ వీధిలో ఉన్నా ఒకటే కీకారణ్యంలో ఉన్నా ఒకటే. ఏ పెద్దపులో ఎలుగుబంటో కనిపించినా కనిపించొచ్చు అనుకుని నవ్వుకున్న రోజులున్నాయి వచ్చిన కొత్తలో. ఇప్పుడు అలవాటయిపోయింది గానీ. పూర్వం మునులు అడవులకెళ్లేవారు నిరాఘాటంగా ధ్యానం చేసుకోడానికని. ఇక్కడ ఈ ఇల్లే చాలు. టీవీ పెడితే తప్ప శబ్దాల్లేవు. కొడుక్కి ఇల్లంటే కంచం, మంచం. అంతే. ఆపైన ఇల్లాలు అదనపు సౌకర్యం. కోడల్ని చూస్తే ఆ పిల్ల తనకి ఇది పూర్వజన్మసంచితార్థం అనుకుంటేందేమో అని అనుమానం కలక్కమాలదు. తనపనేదో తను చేసుకుపోతూ ఉంటుంది మరబొమ్మలా. తనకి రెండు తరాల తరవాత పుట్టిన పిల్ల! చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది. ఇంత ఉదాసీనత ఎలా వచ్చిందో! అసలు వీళ్లిద్దరికీ తనకీ సంబంధం ఉన్నట్టే అనిపించడం లేదు.

ఉలికిపడింది. తనిలా ఆలోచిస్తూ టైము చూసుకోలేదు. ఆవిడ వెళ్లిపోయిందేమో .. లేచి కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. ఆవిడ కిటికీ దాటి పదడుగులు వేసి, ఎదురుగా వస్తున్న కుక్కపిల్లని చూసి ఆగింది. తనకి చిరాకేసింది. ఏమిటో ఈకుక్కప్రేమలు. సాటిమనుషులకంటే వీళ్లకి కుక్కలే ఆప్తబంధువులు. “ఏం చెయ్యదు. చాలా ఫ్రెండ్లీ కుక్క.” అంటోంది కాబోలు ఆ కుక్కమనిషి దాన్ని ఎత్తి గుండెల్లోకి పొదువుకుంటూ.

“అది ఫ్రండ్లీ కుక్క కావచ్చు కానీ నేను కుక్క ఫ్రెండ్లీ కాదు” అంటున్నట్టుంది ఆవిడ ఫుట్‌పాత్‌మీదే కాస్త పక్కకి తప్పుకుని.

నిజమే మరి. కుక్క వారికి  కుక్క ముద్దు కావచ్చు కానీ ఊళ్లో అందరికీ ముద్దు కావాలనేముంది? దేశంలో ఉండడానికిల్లూ తిండానికి తిండీ లేక అల్లాడుతున్నవాళ్ళు మూడు కోట్లున్నారు. కుక్కలకి రాజేంద్రభోగాలు. … అదేం నీతో … ప్చ్.

ఆవిడ కుక్కనీ కుక్కప్రేమికురాలినీ దాటి ముందుకి వెళ్లిపోయింది.

తను మళ్లీ వచ్చి సోఫాలో కూచుని చదువుతున్న పుస్తకం తీస్తూ గోడమీద వాచీ చూసింది. నాలుగు దాటి అయిదునిముషాలయింది. .

పుస్తకంమీద దృష్టి నిలవడంలేదు. మరో నలభైఅయిదు నిముషాలకి ఆవిడ అటునించి మళ్ళీ తిరిగొస్తుంది. ఏమిటో అనుకోకుండా ఆవిడకోసం ఇలా ఎదురు చూడ్డం అలవాటయిపోయింది. ఇంకా నలభై నిముషాలుంది కదా. ఈలోపున రాత్రి వంటకి కూరా నారా చూస్తే కొంత కాలక్షేపం అని లేచింది. తను మొదలు పెడితే, కోడలొచ్చి పూర్తి చేసుకుంటుంది. మొదట్లో ఆ అమ్మాయి తనని ఏం చెయ్యొద్దని చెప్పింది కానీ తనకే పొద్దు పోడంలేదని మొదలు పెట్టింది. కూరలు తరగడం, కుకర్లో పప్పు పడేయడం … అంతే తనవంతు. ఆపైన కోడలొచ్చి అందుకుంటుంది. ఒకోసారి తను తీసిన కూర అమ్మాయికి నచ్చదు. అది పక్కన పెట్టేసి మరోటి మొదలు పెడుతుంది. అంతేగానీ పెద్ద తగువుల్లేవు ఇంట్లో. కొంతలో కొంత మేలు.

మళ్లీ వచ్చి పుస్తకం తీసుకుంది. కిటికీమీద ఓ కన్నేసి ఉంచింది. అంతలోనే తనమీద తనకే విసుగు. ఆవిడెవరో తెలీదు. ఎక్కడినుండి వచ్చిందో, ఎక్కడికి వెళ్తోందో, చివరికి ఎక్కడ తేల్తుందో – ఏమీ తెలీదు. అయినా ఏదో దగ్గిరచుట్టం అయినట్టు ఆవిడకోసం ఈ ఎదురుచూపు. అర్థం లేదు. కారణాల్లేవు. …

గడియారం చూసింది. ఇంకా పదినిముషాలుంది.

ఇంతలో కోడలొచ్చింది. “ఏం, ఇవాళ కొంచెం పెందరాళే వచ్చీసేవు?” అంది. కోడలు అయిదు దాటి కానీ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడింకా పావుతక్కువ అయిదే.

“ఏం లేదు. పనయిపోయింది.”

అంతే తమ మధ్య సంభాషణ. మళ్లీ కిటికీవేపు చూస్తూ కూర్చుంది. నాలుగూయాభై. ఆవిడ ఏ క్షఁణమయినా కనిపించవచ్చు. … … కానీ కనిపించలేదు.

హఠాత్తుగా మరో ఆలోచన వచ్చింది. తనే బయల్దేరి వీధిలోకి వెళ్లొచ్చు కదా. ఇంతవరకూ తనకి ఎందుకు తోచలేదో … నెమ్మదిగా లేచి కోటూ, బూటూ వేసుకోసాగింది.

“ఎక్కడికి?” అంది కోడలు.

“ఊరికే. కాస్సేపు బయట తిరిగి వస్తాను.”

“ఇప్పుడా? చలిగా ఉంది. మంచు కూడా బాగానే పడుతోంది. జారి పడతారేమో.”

“ఫరవాలేదు. జాగ్రత్తగా చూసుకు నడుస్తాలే.”

“పోనీ. నేను కార్లో అలా మాల్‌కి తీసుకెళ్తాను. కొంచెంసేపాగితే. మాల్‌లో తిరగొచ్చు.”

“కార్లో తిరుగుతూనే ఉంటాం ఎప్పుడూను. కాస్త ఆరుబయట నడుద్దాం అని.”

“అట్టే దూరం వెళ్ళకండి. పడమటిదిక్కు వెళ్ళకండి. అక్కడ ఉండే జనాలు మనలాటివాళ్లు కాదు.”

తను తలూపి బయల్దేరింది. కోడలొచ్చి చేతికర్ర అందించింది. మాటాడకుండా అది పుచ్చుకుని వీధిలో అడుగు పెట్టింది. “మనలాటివాళ్లు” అంటే? మనంవంటే, మనలాటివాళ్లంటే ఎవరు? గట్టిగా ఆలోచిస్తే మనం మాత్రం తెల్లవాళ్లమా ఏమిటి? … … కాదు కానీ మనం తెల్లవాళ్లకి గల సమస్త సల్లక్షణాలూ ఉన్నవాళ్లం అని కాబోలు. అవును మరి. డబ్బూ, చదువూ, సంస్కారం అన్నీ హక్కుభుక్తములు చేసుకున్నవాళ్లం మనం. బహుశా పడమటిదిక్కున ఉన్నవాళ్లకి డబ్బూ, చదువూ ఉండి ఉండకపోవచ్చు. అవి లేకపోయేక, ఏ సంస్కారం ఉన్నా లేనట్టే లెఖ్ఖ. వాళ్లకున్నది కూడా సంస్కారమే అని అనడానికి “మనవాళ్లకి” మనస్కరించదు.

ఆలోచిస్తూ నడుస్తుంటే, ఇద్దరు అబ్బాయిలు ఎదురొస్తూ కనిపించేరు. పెద్దవాడికి 18, 19 ఏళ్ళుండొచ్చు. తండ్రో, అన్నో … అతనిచేయి పట్టుకుని, చిన్నవాడు నెమ్మదిగా నడుస్తున్నాడు బూట్లు మంచులో ఈడ్చుకుంటూ. మూడున్నరా నాలుగేళ్ళకి మించి ఉండవు. తనని చూస్తూనే దూరంనించే కళ్ళు చికిలించేడు.

తను చిన్నగా నవ్వుతూ తలూపింది పలకరింపుగా, జవాబుగా.

ఆ ఇద్దరూ మనవాళ్ళు కాదన్నది స్పష్టంగానే తెలుస్తోంది కంటికానని సిరాతో వాళ్లమొహాలమీద పెద్దక్షరాలతో రాసి ఉందా మాట.

ఇద్దరూ తనని దాటి వెనక్కి వెనక్కి సాగిపోయేరు. తను ముందుకి ఇంకొంచెం దూరం నడచి నాలుగువీధుల కూడలిలోకి వచ్చింది. ఎటు వెళ్ళాలో తోచలేదు. తను ఎవరికోసం ఎదురు చూస్తోందో ఆవిడ – అవిడ పేరు కూడా తెలీదు తనకి – ఎటు చూసినా కనిపించలేదు. వెనక్కి తిరిగింది.

తిరిగి వస్తుంటే మళ్ళీ ఆ ఇద్దరబ్బాయిలు ఎదురొచ్చేరు, వాళ్లు ఎంతదూరం వెళ్లేరో, ఎందుకెళ్లేరో … వెనక్కి తిరిగి వస్తున్నారు.

బాగా దగ్గరికొచ్చి, తనని దాటేవేళకి ఆ చిన్నవాడు పెద్దవాడికాళ్ళవెనక్కి నక్కి, సిగ్గుపడుతూ చెయ్యి చాపేడు, ఆచిన్ని మిటెను తన పేంటుకి తగిలీ తగలకుండా0.

పెద్దవాడు తననీ, పిల్లవాడినీ మార్చి మార్చి చూస్తూ నవ్వేడు.

తను ఈసారి పెద్దగానే నవ్వి, ఆపిల్లాడికి మరోసారి హాలో చెప్పి ముందుకి సాగింది.

ఆవిడ కనిపించకుండానే ఆరోజు ముగిసింది తనకి. అది అసంతృప్తిగానే ఉన్నా మనవాళ్ళు కాని ఇద్దరు పిల్లలు స్నిగ్ధమాధుర్యం చవి చూపినందుకు మనసులో ఉల్లాసంగా ఉంది.

ఇంటికొచ్చేక కోడలికి చెప్పింది ఆ పడమటిదిక్కున కనిపించిన పిల్లలగురించి.

“ఓ” అంది కోడలు. అంతే.

మర్నాడు కూడా ఆవిడ కనిపించలేదు. నిన్నటి పిల్లలు జ్ఞాపకం వొచ్చేరు. ఆవిడ కూడా ఒకవేళ ఆపిల్లల్ని చూడడానికే అటు వెళ్తోందేమో అనిపించింది. ఓ కాగితం, కలం తీసుకుని కూర్చుంది.

కొందరిజీవితాల్లో ఆత్మస్ఫర్శలు

సమాంతరంగా సాగుతాయి.

కలవవు విడిపోవు.

వారి బాంధవ్యం

సాగుతుంది సరస్వతీనదిలా

అవ్యక్త పట్టాలమీద

“ఔరా” ఎక్స్‌ప్రెస్ అయి.

అని రాసుకుంది. తన జీవితంలో అదే తన తొలి కవితా, కథా కూడాను!

(మరోమాట. ఈ చివరి మినీకవిత ఇంతకుముందు టపాలో పెట్టేను. నిజానికి ఈకథ ఆలోచిస్తుంటే తోచిన నాలుగు వాక్యాలూను అవి. అవి కవితలా అనిపించి ముందు ప్రచురించేను. దానిమీద రాధిక brilliant అని వ్యాఖ్యానించింది. ఆవ్యాఖ్య చూసి, మురిసిపోయి, ఈకథ పూర్తి చేసేను.

అంచేత, రాధికా, ఇది నీకు, – మాలతి.)

(13 జూలై 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “అవ్యక్త మధురం”

 1. అవ్యక్త మధురం అంతరంగ మధనం. ఆధునిక జీవితాల్లో అనుభవంలోకి వచ్చే జీవన ఛిద్రం . మనసు ద్రవిస్తోంది గాని, ఏమి చేయగలం, అవకాశం వస్తే ఒకసారి ఆత్మీయంగా పలకరించటం తప్ప?
  చక్కని చిత్రణ.

  శ్రీ రామ్

  మెచ్చుకోండి

 2. P. Lalitha, మీకు నా బ్లాగు నచ్చినందుకు సంతోషం. మీకు ఈమెయిలివ్వమంటారా కొత్త టపా పెట్టినప్పుడు. అలాగే, తప్పకుండాను. 🙂
  మధురవాణి, ఇలాటి ఆలోచనలు … బహుశా నావయసు వస్తే తెలుస్తుందేమో నీకు.. :p. నేను రోజూ వాక్కి వెళ్తా కదా. దారిలో కొందరు ఇళ్ళల్లో కొందరు నావరస గమనిస్తున్నట్టనిపించింది. అబ్బాయిలకథ నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు జరిగింది.
  స్ఫురిత, అమ్మో, నిజంగా జరిగిందా. నేనింకా ఊహించి రాసేననుకుని మురిసిపోతున్నా. .. సంతోషం మీ అమ్మగారికథతో నాఊహకి ప్రాణం పోసినందుకు.
  అందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. చాలా బాగుంది మాలతి గారు…నేను చెప్పాలనుకున్నదే మధురవాణి చెప్పేసారు…కవిత కూడా చాలా బాగుంది.మా అమ్మగారు ఇక్కడకి వచ్చినప్పుడు winter కావటం తో పాపం చాలా bore కొట్టేది. మీ పాత్ర లాగానే మాపక్క ఎదురు ఇళ్ళ వాళ్ళు ఎన్నింటికి వెళ్తారో వస్తారో జ్ఞాపకం పెట్టుకుని మరీ కిటికీ దగ్గరకి పరిగెత్తేవారు. మా అమ్మాయి ని ఎత్తుకుని అదిగో పొడుగు uncle వచ్చేసారు. కొత్త కారు అమ్మాయి వచ్చేసింది అని కాలక్షేపం చేస్తూ వుండేవారు..ఒక్కోసారి ఎవరైనా రాకపోతే ఎక్కడికైనా వెళ్ళరో ఏమైందో అని కొంచెం కంగారు కూడా పడే వారు. ఇప్పటికీ phone లో వాళ్ళు వున్నారా.. వీళ్ళు వున్నారా అని అడుగుతూ వుంటారు. ఏమిటో పాపం కాలక్షేపం లేక అనిపించేది అప్పట్లో…మీ టపా చదివాక అవ్యక్తానుబంధం అంటే అదేనేమో అనిపించింది.

  మీరు నా టపాలని regular గా చదివి వ్యాఖ్యానిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. ఇవాళే మీ blog లోకి వచ్చినప్పుడు చూసా నా blog ని మీ blogroll లో. I feel so proud and glad. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  మెచ్చుకోండి

 4. బాగుంది. ఎలా వస్తాయండీ మీకిలాంటి ఆలోచనలు. ఏవీ లేనట్టే ఉంటుంది.. చాలానే ఉందనిపిస్తుంది. 😀 Simple, yet intense feel ఏదో ఉంటుంది మీ రాతల్లో! 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s