ఊసుపోక – ఎలా చదవడమో ఈకథ?!

(ఎన్నెమ్మకతలు 56)

ఆమధ్య విశేష ప్రచారం పొందిన ఓ కథని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నా. అందరూ తెగ పొగిడేస్తున్నారు కానీ నాకేమో అయోమయంగా ఉన్నాయి కథా, పొగడ్తలూ కూడా. మీదినించి కిందకీ, కిందనించి మీదకీ, కుడినించి ఎడమకీ, ఎడమనించి కుడికీ – అన్ని కోణాల్లోంచీ తీక్షణంగా పరిశీలించి చూశాను. …

కొంచెంసేపు కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అని పాడుకున్నాను కూడా. ఎలా చూసినా ఏదో వెలితి. నాకు తెలీని రహస్యాలేవో ఈకథలో ఏమూలో దాక్కుని నాబుర్ర తినేస్తున్నాయి.

ఇంతలో తారకం వచ్చేడు చాలా రోజులతరవాత. చూస్తూనే ఉలిక్కిపడ్డాను. కళ్లు లోతుకి పోయేయి. జుత్తు కొబ్బరిపీచులా ఉంది. మాసిన చొక్కా, ఆరిపోయిన పెదాలూ .. … ఆర్నెల్లు లంఖణాలు చేసినట్టు.

“అదేమిటి అలా ఉన్నావు? జబ్బుపడ్డావేమిటి?“ అన్నాను ఆతురపడిపోతూ.

“లేదులెండి. జబ్బేంలేదు,” అన్నాడే కానీ నీరసంగా మాటలు వచ్చేయి మాటలు, బావిలోంచి వచ్చినట్టు.

ఓ మంచిమాట చెప్తే ఉత్సాహం పుంజుకుంటుందేమోనని, “ఈమధ్య నీ కథ ఒకటి పత్రికలో వచ్చిందని విన్నాను. సంతోషం” అన్నాను.

“అదేనండీ, నన్నీకాడికి తెచ్చింది,” అన్నాడు. బావురుమనడం తరువాయిగా.

“ఏం? ఎవరైనా బాగులేదన్నారేంటి?” అనడిగేను. అదే కదా ఏకథకైనా జరిగే సంభావన ఈరోజుల్లో.

“అంత సాధుశీలకంగా చెప్తే బాధ లేదండీ.”

సరే. మామూలుగానే నేను “అలాటివి పట్టించుకోకూడదనీ, లోకో భిన్న రుచిః” అనీ మరి కొన్ని ప్రోత్సాహకరమాటలు వల్లించడానికి సిద్ధమవుతున్నాను.

“అది కాదండీ” అంటూ మొదలెట్టి ఏం జరిగిందో చెప్పేడు. ఇది కలం పట్టినవారందరికీ అనుభవమే కనక మళ్లీ పెట్టను కుక్క మార్కు యల్పీ కానీ సూక్ష్మంగా తారకం చెప్పినకథ –

తన కథ ఏదో పత్రికకి పంపేడు. ఆ పత్రికా సంపాదకులు ఏవో సలహాలు చెప్పేరు – అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అంటూ. పెద్దలూ, అనుభవజ్ఞులూ చెప్పేరు. పైగా ఇంగ్లీషువాళ్లు ఇలాగే చేస్తారని కూడా చెప్పేరు కదా అని తారకం బుద్ధిగా కథంతా తిరగరాసేడు. దాంతో మరో కథ తయారయింది. ఆ పత్రికవాళ్ళు ప్రచురించేరు. దానిమీద మళ్ళీ పాఠకులు ఎక్కడెక్కడ ఎలా మార్చాలో బోధ చేసేరు. సరే, అదే కథ మళ్లీ తిరగరాస్తే ఎవరూ వేసుకోరు కదా. పాఠకుల వ్యాఖ్యలు గట్టిగా పదిసార్లు మననం చేసుకుని, మరో కథ రాసి మరో పత్రికకి పంపేడు. ఆ సంపాదకులున్నూ అలా కాదు ఇలా అంటూ మళ్లీ …

ఈసంధి సమయంలో ఉన్నాడు ప్రస్తుతం తారకం.

“కథల్రాయడం నాచేతకాదు అనిపిస్తోందండీ.”

ఏమనగలను నేను మాత్రం? “పోన్లెద్దూ. కథలు రాయకపోతే కొంపలంటుకుపోతాయేమిటి? అయినా ఈనాటికథలకి షెల్ఫుకాలం మాత్రం ఎంత కనక. వారం కాకపోతే నెల. ఆ తరవాత మళ్లీ కొత్తకధలూ వాటిమీద వ్యాఖ్యానాలూను. అంతకుమించి ఏ కథ మాత్రం ఎవరికి గుర్తుంటుంది కనక,” అన్నాను.

“అదేనండీ ఆ వ్యాఖ్యానాలే నాప్రాణంమీదికొస్తున్నాయి. అదేంటో నేనొకటి రాస్తే వాళ్ళొకటి రాస్తారు. పైగా మారుపేర్లొకటీ,” అన్నాడు చిరాకు పడుతూ. “అందరికీ తెలుసు తమరెవరో. ఇంకా ఎందుకండీ ఆ డొంకతిరుగుడు?”

“కొందరికి సరదా. కొందరికి తెరవెనక భాగోతాలు జీవనధర్మం,” అన్నాను.

“అంచేత నేను కూడా కథలు మానేసి, వ్యాఖ్యలూ, విమర్శలూ రాసుకుంటే, కథ ఎలా ఉండాలో నేను కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కదాని” అన్నాడు.

“మంచిదే. రాయి.”

“మరి వ్యాఖ్యలకీ, విమర్శలకీ నిబంధనలూ, నియమాలూ ఏమిటో చెప్పండి.”

“నియమాలేమిటి. కథ చదివినతరవాత, నీకేంవనిపిస్తే అది రాయడమే.”

తారకంమొహం వన్నె తరిగింది. “కథ రాస్తానన్నప్పుడు కూడా మీరిలాగే చెప్పేరు. నాకేం తోస్తే అదే రాయమన్నారు. మళ్లీ ఇప్పుడు వ్యాఖ్యకీ అంతే అంటున్నారు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమేమిటి?.”

గొప్ప చిక్కొచ్చిపడింది. కొంచెం ఆలోచించి, “నువ్వలా మొత్తం కథారచననీ విమర్శనాపద్ధతుల్నీ ఏకవాక్యానికి కుదించేయడం బావులేదబ్బాయీ,” అన్నాను.

“వ్యాఖ్య దేనిమీద రాయడం ముఖ్యమో చెప్పండి పోనీ. వస్తువుమీదా? శైలిమీదా? భాషమీదా?”

“అన్నిటిమీదాను. వస్తువయితే, వస్తువు చక్కగా మనసుకి హత్తుకునేలా చెప్పేరా లేదా. శైలిమీద అయితే సామెతలూ, జాతీయాలూ, ఉపమానాలూ, సంధులూ, సమాసాలూ, గట్రా సందర్భోచితంగా, అతి చెయ్యకుండా వాడేరా లేదా, భాష అయితే, స్పెల్లింగులూ, కామాలూ సరిగ్గా పెట్టేరా లేదా. …”

“జ్ఞాపకంకి బదులు జ్నాపకం లాటివా?”

“అది కూడాను. జ్నాపకం పుట్టుపూర్వోత్తరాలు తెలుసా నీకు?”

“మామూలుగా జ కింద ఞ వత్తు ఇవ్వాలని నా చిన్నప్పుడు మాపంతుళ్ళు చెప్పేరు. మరి నీ చిన్నప్పుడు నువ్వేం చేసేవో నాకు తెలీదు. ఇంతకీ తరవాత వాడుకభాషలో రాయడం వచ్చింతరవాత గ్నాపకం, గ్యాపకం, గేపకం, … ఇలా కొన్నాళ్లు సాగింది. ఇంగ్లీషు వచ్చింతరవాత, ఇంగ్లీషులో జ్ఞ ని jna అని రాస్తున్నారు కదా. దాన్ని తెలుగీకరించి జ్నాపకం చేసేరు. అంచేత, ఇప్పుడు అదే ఋజువైన వ్యావహారికం. అంతే కాదు. కొన్ని సాఫ్టువేరులకి అన్ని అక్షరాలూ రావు. అంచేత కూడా భాష తనదారి తాను వెతుక్కుంటోంది ఈ కలిలో. నువ్వు ఒకకథలోనో టపాలోనో తప్పులు పడుతున్నపుడు ఇలాటి బాషాశాస్త్రజ్ఞానం, చరిత్ర చక్కగా తెలుసుకుని ఉండాలి.”

“అంత డొంకతిరుగుడు ఎందుకండీ. జ కింద ఞ వత్తు ఇస్తారు. కీబోర్డ్ లేఅవుట్‌లో ఇణి (ఞ) దొరక్కపోతే, న పెట్టేసుండొచ్చు కదా”.

“నేను ఎకడమీకంగా వివరిస్తున్నాను,” అన్నాను భ్రూకుటి ముడిచి, నాచిరాకునణుచుకుని.

తారకం వెలితి నవ్వుతో, “పోన్లెద్దురూ. ఎందుకొచ్చినగొడవ. నేను భాష జోలికి పోను. కథలో ఏం చూడాలో చెప్పండి.”

“ఆయమ్మకేటి తెలస్తది. నన్నడుగు. నే జెప్త.”

ఉలిక్కిపడి ఇద్దరం అటు తిరిగేం. సంద్రాలు!

“ఏంటి, వేళ కాని వేళ ఇలా దయచేసేవు. బాబుగారు ఊళ్లో లేరేంటి?” అన్నాను.

“లేరండీ” అంది సంద్రాలు, ఓ కుర్చీ లాక్కుని కూచుంటూ.

తారకం ఆశ్చర్యంగా సంద్రాలువేపు చూస్తూ, “అదేంటమ్మా, అలా అంటారు?” అన్నాడు ఆ పైన మరేం చెప్పలేక కాబోలు పూర్తి చెయ్యలేదు.

“అదిగాదు బాబూ, ఆయమ్మకి తెల్సినయి ఆయమ్మకి తెలిస్తయ్. అద్సరే. అదే యేదంవేంటని నానడగతన్న. అదీ నాపాయింటు. నాన్సెప్పీదీ ఇనుకో మరి. ఆలెవరో కత ఇట్లుండాల అట్లుండాల అని మనికి చెప్పీదేటని నా పెశ్న. ఈమజ్జిన మనోలందరూ “అమ్మ సెప్పినకతల”నీ రాసేస్తన్నరు గంద. ఆల్లందురిపేర్లూ నానోట పలకవు గానీ నివ్వూ సూసినవ్ గంద.”

“బ్లాగుల్లో చూసేను” తారకం తలూపేడు.

“మరి ఆకతలన్నీ ఉప్పుడూ సెప్పకుంతన్నరు గంద. సదివి సంతసిస్తన్నరు గంద. అంటే ఏటీ? ఆకతలు కూడా మంచియే అనే గంద. మన అవ్వలూ, ముత్తవ్వలూ, ఆల ముత్తవ్వలూ ఏ రూలుసులో చదూకుని సెప్పేరంతవ అయి? నాసిన్నతనంల మాపటేల పొద్దోయినంక, గెంజి తాగినంక, మావిసెట్టునీడ్న కూకుడ్ని మా ముత్తవ్వ కతలు సెప్తంటే కల్లూ సెవులూ ఒప్పగించీసి ఇనీవోల్లం. మాముత్తవ్వకి పల్లు నేవులే. సరింగ పదాలు ఉచ్చరించీనాకి మాతంటాలు పడీది. మాకు మాసెడ్డ నవ్వుగుండీది. అయినా వెంతో ఆసత్తిగా ఇనీవోలం,” అంది సంద్రాలు. ఆనాటి మధురక్షణాలు గుర్తుకొచ్చేయి కాబోలు కొంగుతో కళ్లొత్తుకుంది.

నేనూ, తారకం ఆమెవేపు చూస్తూ కూర్చున్నాం. నాకు ఏం మాటాడాలో తోచలేదు. మొపాసా ఎలా రాసేడో, చెహోవ్ ఏం చెప్పేడో సంద్రాలుకి అర్థం అయేలా చెప్పడానికి నాకెన్ని గుండెలు?

ఆఖరికి తారకం నోరు విప్పేడు, “మీరేం అంటారండీ?” అన్నాడు నావేపు తిరిగి.

“సర్లే. నివ్వే సెప్కో” అంది సంద్రాలు మొహం దమ్మిడీకాసంత చేసుకుని.

నేను పద్మాసనం వేసి, చిన్ముద్ర పట్టి, అరమోడ్పు కనులతో, దీర్ఘంగా ఊపిరి పీల్చి, అందుకున్నాను. “చూడు, తారకం, పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రమా అన్నావు ఇందాక. ఒక విధంగా చూస్తే అది నిజమే. ఎందుకంటే కథ రాస్తున్నప్పుడు కథ ఇలా ఉండాలి అని అనుకుంటావు నువ్వు. అలా ఉందో లేదో చూడడమే వ్యాఖ్య రాస్తున్నపుడు చేస్తావు. అంతే.”

“అంతే కాదేమో అనిపిస్తోందండీ,” అన్నాడు తారకం సాలోచనగా.

‌నేనూ కొంచెంసేపు ఆలోచనలో పడ్డాను. తరవాత, “సరే, ఇప్పుడో కథ చెప్తాను. నువ్వు వ్యాఖ్యానాలు చెయ్యి,” అని చెప్పి మొదలు పెట్టేను. “ఒకసారి నాకు కాబేజీ గారెలు తినాలనిపించింది అనుకో. అప్పుడు నేను పప్పు నానబోసి, బ్లెండరులో వేసి గ్రైండు చేస్తాను అనుకో. గారెలకి నీళ్ళు ఎక్కువ పోస్తే పనికిరాదుదా. నీళ్ళు చాలకపోతే గ్రైండరులో పప్పు నలగదు. రోట్లో రుబ్బినప్పుడు పప్పు చేత్తో తోసినట్టుగానే ఇక్కడ కూడా కిందకీ మీదకీ కలపాలి. అలాగే నేను కూడా కలపడానికి గ్రైండరులో చెయ్యి పెట్టేను.”

“అదేమిటండీ. రోట్లో చెయ్యి పెట్టినట్టు గ్రైండరులో పెట్టడమేమిటండీ. అంత తెలివితక్కువ వాళ్ళెక్కడున్నారీ కాలంలో.”

“అదే మరి. అందుకే కథ అయింది. ఇంతకీ అలా కలుపుతూ గ్రైండు చేస్తుంటే, ఠప్మని గ్రైండరులో బ్లేడు వేలికి తగిలింది. నేను ఎగిరి గెంతేస్తూ గ్రైండరులోంచి చెయ్యి బయటికి లాక్కున్నాను ఒక్క ఊపుతో. రక్తం గోడమీద, సింకులో చిమ్మి, చిన్నసైజు దొమ్మీ జరిగినట్టుంది అక్కడ.”

“అయ్యయ్యో, అదేం పనండీ? మీలాటివారు ఆమాత్రం తెలియకుండా ఉన్నారంటే నమ్మడం కష్టం.”

“నువ్వు నమ్మకపోతే, నేను చేసేదేం లేదు. జరిగిందది.”

“మరి డాక్టరుదగ్గరికి వెళ్లేరా?”

“ఈయమ్మ డాట్రోరికాడికెల్లకేం.” అంది సంద్రాలు వేదాంతిలా తలూపుతూ.

“లేదు. బాత్రూంలోకి పరుగెత్తి, బాండెయిడ్ తీసి వేసుకున్నాను.”

“చిన్న గీర కాబోలు.”

“చిన్న అనుకుంటే చిన్న, పెద్దనుకుంటే పెద్దా. ఒకటి, రెండు బాండేయిడ్లు వేసేను కానీ రక్తం కట్టలేదు. ఇహ డాక్టరుదగ్గరికి వెళ్లకతప్పదేమో అనుకుంటూనే మరికొంచెం సేపు చన్నీళ్లలో చెయ్యి నానబెట్టేను. రక్తం కట్టినట్టే అనిపించింది.”

“సరే, తరవాతేమయింది?”

“చెప్పనియ్యి మరి. బాండెయిడ్ చాలదని, gauze pads తీశాను. ఆరారా రెండేసి గాజులచొప్పున వేసుకుంటూ కూర్చున్నాను. మూడుగంటలసేపు అలా సేవ చేయగా, మధ్యాన్నానికి రక్తం ఆగినట్టే అనిపించింది. సరే, ఆపూటకి వంటకి మంగళం పాడేసి, తెగినవేలూ, టీవీలో ఎడతెగని సోపూ చూసుకుంటూ గడిపేను”

“పోన్లెండి సుఖాంతం చేసేరు,” అన్నాడు. అతనిగొంతులో చాలా నిరాశ కనిపించింది.

“నీకేం నచ్చినట్టులేదు. ఇది కథ కాదంటావు?”

“అది కాదండీ. సంఘర్షణా, పాత్రచిత్రణా, వాతావరణం – ఇలాటివన్నీ కావాలి కదండీ కథంటే.”

“నాన్సెపతా ఏటయిందో. ఈయమ్మ అలా రగతం గారతన్న ఏలు రొండో సేత్ల ఒట్టుకుని కిల్నికెల్తాది.. మరి కారు తోల్నేదు గంద రగతంవోడుతన్న సేతల. అందుసేత నడిసే ఎల్తాది. కిల్నికు అదే ఈదిలో ఉన్నాదిలే.”

“అక్కడ డాక్టరమ్మతో తగువేసుకున్నారేంటి?” అన్నాడు తారకం చిన్నగా నవ్వుతూ.

“నువ్వండవయ్యా. ఒప్పుడే అయ్‌పోనాదేటి. ఆయమ్మ రోడ్డుమీన గబగబ నడస్త జోరుగ వస్తన్న కారుకడ్డం పడ్తది. ఆ డైవరుబాబుకి మాసెడ్డ కోపం వచ్చీస్తాది ఏటీ రోడ్డుకడ్డంగ నడుస్తవ్ అనీ.”

నేను నవ్వుతూ చూస్తున్నాను సంద్రాలువేపు. నాకంటే ఈవిడే బాగా చెప్తోంది కథ అనుకుంటూ.

ఈయమ్మేవో నానరిజంటుగా ఆస్పత్తిరికెల్తన్న, గొప్ప పెమాదం వొచ్చిపడిపోనాదంటూ ఏలు  సూపుతాది. అంతట ఆ డైవరుబాబుకి మరింత రోసం వచ్చీసి కారాపి దాపుకొస్తడు ఏటి నీయవ్వారం, నాఅంతటోడికి అడ్డం రాటానికీ, ఏలు సూపనానికీ నీకెన్ని గుండిలు అంట. బాగా బారీమడిసిలే ఆయిన.”

“ఆమాత్రం దానికి అంతకోపం ఏమిటి? రోడ్డుమీద ఇలాటివి మామూలే.”

“అద్గదీ నాంసెప్తన్నది గూడ. అదేటో కొందురు ఊత్తుత్తినే ఎగిరెగిరి పడ్తరు.”

“మరయితే పెద్ద తగువయిపోయిందా?”

“నేదు. ఆ పెద్దమఢిసి తన్నటానికే వచ్చినాడు గానీ ఆయమ్మ మల్ల సెయ్యి చూపిస్తే ఆయిన అర్తం సేసేకుని, పెద్దమనుసు సేసేస్కుని రా, నాబండిల ఆస్పత్తిరికాడ దిగిడుస్తనని బండిలో ఎక్కించుకున్నడు.”

“కొంచెం సంఘర్షణ ఉందిలెండి. వాళ్ళిద్దరిమధ్య ఇంకా పెద్ద తగువయినట్టు చూపిస్తే బాగుంటుంది కథ రక్తి కట్టడానికి.”

“అవును. ఆస్పత్రిలో డాక్టరు టిటెనస్ షాట్లు తీసుకుని ఎంతకాలం అయింది, ఇంకా ఏవో టెస్టులు చేయించుకుని ఎన్నేళ్ళయింది అంటూ రికార్డు పెడితే, మరింత చికాకు, మరింత రక్తి  …” అంటూ నేను లేచి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరికీ కాఫీలు, గారెలూ తీసుకొచ్చేను.

తారకం కాఫీకప్పు అందుకుంటూ, నాచెయ్యి చూసి ఉలిక్కిపడ్డాడు. “అదేంటండీ. ఆవేలికి ఆ కట్టు?”

సంద్రాలు ఘొల్లున నవ్వింది.

తారకం చిన్నబుచ్చుకుని, “మీరు అనుకో అన్నారు కదా అంచేత ఇది కల్పితం అనుకున్నాను.”

“అదే మరి. నిజం అని తెలియగానే, నీకు ఇందాకా నమ్మలేను అన్నవన్నీ నమ్మడానికి ఆస్కారం దొరికింది కదా.”

“సరేలెండి. వస్తా మరి. ఇంతకీ మీరు వ్యాఖ్యలకీ, విమర్శలకీ నియమాలేమిటో చెప్పనేలేదు.”

“చెప్పకపోవడమేమిటి. కథ వింటున్నంతసేపూ నువ్వేదో అంటూనే ఉన్నావు కదా. అవన్నీ వ్యాఖ్యలే.”

“అయితే మీరింతకీ డాక్టరుదగ్గరికి వెళ్లేరా లేదా. ఎందుకులెండి, అడగనింక” అంటూ తారకం లేచేడు వెళ్ళడానికి.

“ఏటో. కతక్కాల్లేటి, ముంతకి సెవులేటి” అంటూ సంద్రాలు వెళ్ళడానికి లేచింది, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.

“ఇదుగో. ఈపుస్తకంలో కథలు నాకూ అర్థం కావడంలేదు. నువ్వు చదివినతరవాత రా. మాటాడుకుందాం,” అన్నాను నాచేతిలో పుస్తకం అతనికందిస్తూ.

అతను రెండు నిముషాలు పుస్తకంవేపు తేరి చూసి, నెమ్మదిగా తలెత్తి, “మీరు పుస్తకం తలకిందులుగా పట్టుకున్నారండి.” అన్నాడు.

అతనిచేతిలో కత్తి లేదు కానీ, ఉంటే, ఆకత్తివేటుకి నెత్తురుచుక్క రాలేది కాదు నామొహాన!

(జులై 16, 2010.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “ఊసుపోక – ఎలా చదవడమో ఈకథ?!”

 1. లేదండీ ! మీ సంద్రాలుని చూస్తే విశాఖపట్టణములో మా కొర్లమ్మ మాటలు గుర్తు వచ్చాయి. మీ కధకి నా వ్యాఖ్యకి సంబంధము లేదు. మీ కబుర్లు బాగున్నాయి. నా కబుర్లు జోడించా నంతే !

  మెచ్చుకోండి

 2. నరసింమ్మూర్తిబాబూ, మీరేటి సెప్తన్నరో నాకవగతం కానేదు సూరేకాంతమ్మని తప్పితే. సరేనండి సొట్టబింది మాతరం బింది కాకుండ పోతదేటి. సిల్లయితే బెంగ గాని సొట్టయితే నీరట్టకుండ పోదు గంద

  మెచ్చుకోండి

 3. కత సెప్పాలంటే మా కొర్లమ్మే సెప్పాలి. కతలొ ఓ సాయిత్రుండాలి, ఓ యెంటోడుండాలి. ఆడి బాబో ,దీని బాబో ఓ గుమ్మడాడుండాలి, ఆసికాడు రేలంగుండాలి. తగువెట్టుకోవానంటే సూరేకాంతవుండాలి. యేటేటీ ? నాబిందెకు ముందు నీ బిందేట్టేస్తున్నావ్ ? కత సెప్తూంటే , సూసుకోనేదంకొంటున్నావా యేటి ? బిందెకు సొట్టేట్టిగల్ను జాగ్రత్త !

  మెచ్చుకోండి

 4. @ సునీత, మీరు అంటున్నకథ పేరు మాతోటలో. 5 దశాబ్దాలకి పూర్వం రాసింది అది. ఈకథకీ, ఆకథకీ మధ్య గతించిన కాలం, వస్తువులో వ్యత్యాసం అవన్నీ తలుచుకుంటుంటే, నాకు మీ అభిరుచిలో కూడా అంత వైశాల్యం కనిపిస్తోంది. :). ధన్యవాదాలు.
  @ మధురవాణీ, :)). Thanks..

  మెచ్చుకోండి

 5. మీరు ఇప్పటి వరకూ బ్లాగుల్లో రాసిన కధల్లో ఇంతకుముందు రాసిన సంపెంగ పువ్వుల గురుంచి రాసిన కధ( సారీ, పేరు గుర్తురాలేదు)ఈ కధ నాకెందుకో బాగా నచ్చాయి.

  మెచ్చుకోండి

 6. @ కొత్తపాళీ, సరిగ్గా పట్టుకునేశారు. :)). ధన్యవాదాలు
  @ dg, మీకు పరిచయమయిన వ్యాఖ్యలు ఆధారంగా మీరు వ్యాఖ్యానించేరు. నేను చూసినవ్యాఖ్యలు ఉమ్మడిగా ఆలోచించినప్పుడు నాకు కలిగిన ఊహలు నేను రాసేను. అందరూ అంతేనండీ. ఎవరిపరిధిలో వాళ్లు ఆలోచిస్తారు. ఈకతలో అంశం కూడా అదే.
  @ కల్పన, *చాలామందికి చురకలు …* నువ్వు కూడా అలా అంటే ఎలా? మనం రాసే కథలన్నీ మనకథలే కానట్టే కదా ఇదీను. రెండోది, నిజమే. దీన్ని ఊసుపోక అనడం కంటే కథ అనడమే మేలు. ఈమధ్య నేను రాసిన రెండుకథలు కథల్లా లేవు, ఊసుపోకల్లా ఉన్నాయి అని ఒక స్నేహితురాలు అంటేనూ, మళ్ళీ మళ్లీ చెప్పించుకోడం ఎందుకని (తారకంలాగే) దీన్ని ఊసుపోక అనేశాను. అయినా, ఊసుపోక కూడా కతలే కదా. రెండింటిలోనూ బోలెడు కల్పన (నువ్వు కాదు, సాహిత్యవిశేషం) ఉంది కదా! :))
  @ భావన, చాలా చాలా నవ్వేసినట్టున్నారు. నిజానికి, చాలా పెద్దదిగా ఉంది ఎవరూ చదవరేమోననుకుని భయపడ్డాను కూడాను :))

  మెచ్చుకోండి

 7. మాలతి గారు,

  చాలా మందికి చురకలు పడ్డట్లున్నాయి కదా. నవ్వలేక చస్తున్నాను.కాకపోతే ఒక చిన్న సందేహం. ఇది ఉసూపోక నా? లేక కథ నా? నేనేమో కథ అనుకున్నాను. బహుశా మూడు పాత్రలు వుండటం వల్ల, పైగా తారకం పాత్ర వల్ల కూడా అనుకుంటాను.

  కల్పన

  మెచ్చుకోండి

 8. కథ అర్ధం కావాలంటే కుంచం తిరగేసి కొలవాలన్న మాట – అదే, పుస్తకాన్ని తిరగేసి సరిగ్గా పట్టుకుని చదవాలన్నమాట.
  చదివినంత సేపూ ముసిముసిగా నవ్వుకుంటూనే ఉన్నా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s